మోక్షగుండం విశ్వేశ్వరాయ స్వీయ చరిత్ర అనువాదం – అధ్యాయం-5

1
12

అధ్యాయం 5 – హైదరాబాద్ రాష్ట్రంలో స్పెషల్ కన్సల్టింగ్ ఇంజనీర్‌గా అనుభవాలు:

[dropcap]మూ[/dropcap]సీ నది హైదరాబాద్ (దక్కన్) నగరం గుండా ప్రవహిస్తుంది. అది నగరాన్ని రెండు భాగాలుగా విభజిస్తుంది. 1908 సెప్టెంబర్ 28న కురిసిన అసాధారణంగా వర్షపాతంతో వచ్చిన తుఫాను వరద నగరం మధ్యలో నించి వెళ్ళింది. మూసి పరీవాహక ప్రాంతంలోని ప్రధానమైన శంషాబాద్ రెయిన్ గేజ్ స్టేషన్‌లో నమోదైన వర్షపాతం 24 గంటల్లో 12.8 అంగుళాలు, 48 గంటల్లో 18.90 అంగుళాలు. ఈ అసాధారణ వర్షపాతం హైదరాబాద్ నగరంలో గడచిన 75 ఏండ్లలో ఎన్నడూ లేనంత అత్యంత విధ్వంసకర వరదలకు దారితీసింది. మూసీ నది ఉత్తర ఒడ్డు దక్షిణ ఒడ్డు కంటే తక్కువ ఎత్తులో ఉంది. నగరానికి ఎగువన నదీ పరీవాహక ప్రాంతం అనేకమైన చిన్నచిన్న చెరువులతో నిండి ఉంది. 860 చదరపు మైళ్ల పరీవాహక ప్రాంతంలో 788 చెరువులు ఉన్నాయి. అంటే సగటున ప్రతి చదరపు మైలు పరివాహక ప్రాంతానికి ఒక చెరువు అన్నమాట. ఈ వరదకు కారణమైన మూసీ నది లోయలో రెండు వర్షపాత పరీవాహక ప్రాంతాలు ఉన్నాయి. ఒకటి 285 చదరపు మైళ్ల పరీవాహక ప్రాంతం కలిగి ఉన్న మూసీ నది, రెండవది 525 చదరపు మైళ్లతో మూసీ ఉప నది ఈసీ. ఈ రెండు పరీవాహక ప్రాంతాల నుంచి వచ్చిన వరద 1,10,000 క్యూసెక్కులతో ప్రారంభమై గరిష్టంగా 4,25,000 క్యూసెక్కులకి పెరిగిందని నమోదు అయిన వరద మట్టాల ఆధారంగా అంచనా కట్టినారు. ఈ రెండు నదుల పరీవాహక ప్రాంతాలలో ఉన్న ప్రతీ చెరువు ఈ వరదకు దోహదం చేసింది. తెగిపోయిన మొత్తం 221 చెరువులలో 182 ఈసీ పరీవాహక ప్రాంతంలో, 39 మూసీ పరీవాహక ప్రాంతంలో ఉన్నాయని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.

1908 సెప్టెంబర్ నెలలో సంభవించిన వరద భీభత్స దృశ్యం

ఈ పరిస్థితిలోనే జరిగిన నష్టాన్ని పరిశీలించడానికి, ఇటువంటి విపత్తులు భవిష్యత్‌లో పునరావృతం కాకుండా నిరోధించడానికి, వరద నియంత్రణకు చర్యలను సూచించడానికి ఒక ఇంజనీర్ సేవలు అవసరమని హైదరాబాద్ ప్రభుత్వం కోరుకున్నది.

నేను బొంబాయి ప్రభుత్వ సర్వీస్ నుంచి పదవీ విరమణకు ముందు సన్నాహకంగా సెలవులో ఉండి ఇటలీలో పర్యటిస్తున్నప్పుడు లండన్ లోని భారత ప్రభుత్వ అండర్-సెక్రటరీ కార్యాలయం నుండి మిలన్‌లో ఉన్నప్పుడు నాకు ఒక లేఖ వచ్చింది. అది 29 అక్టోబర్ 1908న బొంబాయి గవర్నర్ నుండి అతనికి అందిన ఈ క్రింది టెలిగ్రాం ఆధారంగా రాసిన లేఖ. అందులో వారు నా నుంచి సమాధానం కూడా ఆశించారు.

హైదరాబాద్ పునర్నిర్మాణంలో సహాయం చేయడానికి, మురుగు నీటి పారుదల పథకాన్ని సిద్ధం చేయడానికి సెలవుపై ఉన్న సూపరింటెండింగ్ ఇంజనీర్ విశ్వేశ్వరాయ సేవలను పొందడానికి నిజాం ప్రభుత్వం ఆత్రుతగా ఉంది. మేము అతనిని డిప్యుటేషన్‌పై హైదరాబాద్‌కు పంపడానికి సిద్ధంగా ఉన్నాము. ఆ పనుల కోసం అతను వెంటనే భారతదేశానికి తిరిగి రాగలడో లేదో మీరు అతన్ని సంప్రదించి నిర్ధారించగలరా?

చిరునామా: c/o మెసర్స్ థామస్ కుక్ అండ్ సన్, లండన్. తక్షణమే స్పందించవలిసిన అంశం.”

అదే సమయంలో హైదరాబాద్ ప్రభుత్వ ఆర్థిక కార్యదర్శి శ్రీ కాసన్ వాకర్ గారు కూడా సెలవుపై ఇంగ్లండ్‌కు వెళ్లే సన్నాహాల్లో ఉన్నారు. హైదరాబాద్‌లో సాధారణ పరిస్థితులను పునరుద్ధరించడానికి, భవిష్యత్తులో వరదల వల్ల సంభవించే నష్టాల నుండి నగరాన్ని రక్షించడానికి భారతదేశంలోగాని లేదా ఇంగ్లాండ్‌లో గాని సమర్థుడైన ఒక ఇంజనీర్ సేవలు పొందడానికి ప్రయత్నాలు చేయమని శ్రీ వాకర్ గారిని కూడా హైదరాబాద్ ప్రభుత్వం కోరింది. తదనుగుణంగా అతను లండన్ నుండి నాతో సంపర్కంలోకి వచ్చి హైదరాబాద్‌లో ఈ ప్రత్యేక ప్రాజెక్టును చేపట్టమని కోరినారు.

ఈ అంశం చర్చకు వచ్చినప్పుడు నేను మిలన్ (ఇటలీ) లో ఉన్నాను. హైదరాబాద్‌లో పరిమిత కాలానికి పనిని చేపట్టడానికి అంగీకరిస్తూ అండర్ సెక్రటరీ లేఖకు నేను సమాధానం ఇచ్చాను. అయితే ఐదు నెలల వరకు విధుల్లో చేరడం సాధ్యం కాదని కూడా తెలియపరచాను. ఆ తర్వాత ఇటలీలో నా పర్యటనలను కొనసాగించాను. మిలన్ నుండి నేను ఫ్లోరెన్స్‌కి వెళ్లాను. పక్షం రోజులు గడచిన తర్వాత కూడా నాకు ఎలాంటి సమాచారం రాకపోవడంతో నేను ఫ్లోరెన్స్ నుండి భారత అండర్ సెక్రెటరీకి మరొక లేఖ రాశాను. ఆ లేఖలో నా ఇటలీ పర్యటన కార్యక్రమానికి అంతరాయం కలిగిన కారణంగా హైదరాబాద్ ప్రాజెక్టును గురించి నా మునుపటి షరతులతో కూడిన అంగీకారాన్ని దయచేసి రద్దు చేసినట్లుగా పరిగణించమని పేర్కొన్నాను. తదుపరి జరిగిన ఉత్తరప్రత్యుత్తరాలలో, నేను వారి ఆఫర్‌ను అంగీకరించాలని హైదరాబాద్ ప్రభుత్వం కోరింది. తాము ఈ విషయంలో ప్రత్యేక ఆసక్తిని కలిగి ఉన్నామని, నాకు సౌకర్యవంతంగా, మరింత ఆకర్షణీయంగా ఉండేలా కాంట్రాక్ట్ నిబంధనలలో కొన్ని అవసరమైన సవరణలు చేశామని తెలియజేసినారు. అంతిమంగా సవరించిన కాంట్రాక్ట్ షరతుల ప్రకారం నేను అమెరికాలో ముందే నిర్ధారించుకున్న పర్యటనను పూర్తి చేసిన తర్వాత 15 ఏప్రిల్ 1909న హైదరాబాద్‌లో విధుల్లో చేరడానికి అంగీకారం కుదిరింది.

ఈ కాంట్రాక్టుకు సంబందించి ఒక విచిత్రమైన సంఘటనను నమోదు చేయడంలో సంకోచించనవసరం లేదని నేను భావిస్తున్నాను. శ్రీ ఇబ్రహీం అహ్మదీ కాలేజీ రోజుల నుండి నాకు సన్నిహిత మిత్రుడు. బొంబాయి నగర ప్రెసిడెన్సీ జిల్లా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పదవికి ఎదిగినవాడు. అతను తెలివైనవాడే కాకుండా మంచి ఆర్కిటెక్ట్ కూడా. నేను యూరప్‌లో పర్యటిస్తున్నప్పుడు ‘బాంబే గెజిట్’ పత్రికలో ప్రచురితమైన ఒక వార్త కట్టింగ్‌ను నాకు పంపారు. అందులో నా హైదరాబాద్ కాంట్రాక్ట్ నిర్ధారణ అయిన వార్తను ప్రచురించారు. బాంబే గజిట్‌లో రాసిన వాక్యాలను యథాతథంగా కింద ఉటంకిస్తున్నాను.

రెవెన్యూ కమీషనర్ స్థాయి జీతం పొందడానికి ఈ భారతీయ ఇంజనీర్‌కి ఉన్న అర్హత ఏమిటి? అతను ఇంత జీతాన్ని కోరడానికి ఉన్న నైపుణ్యం ఏమిటి?”

శ్రీ అహ్మదీ హైదరాబాద్‌కు చెందిన దివంగత సర్ అక్బర్ హైదరీకి దగ్గరి బంధువు. అతను వార్తాపత్రిక కటింగ్‌ను నాకు పంపుతూ ఇట్లా వ్యాఖ్యానించాడు:

హైదరాబాద్ ప్రభుత్వంతో మీ కాంట్రాక్ట్ నిర్ధారణ అయినందుకు సంతోషిస్తున్నాను. అయితే మీకు పదవి వచ్చినందుకు కాదు. ఒక భారతీయ నిపుణుడు ఈ పనికి సరిపోతాడని వారు భావించినందుకు సంతోషిస్తున్నాను.”

హైదరాబాద్ ప్రభుత్వం నాకు అప్పగించిన ప్రత్యేకమైన పనులు ఇవి:

  1. హైదరాబాద్ నగర పునర్నిర్మాణానికి సలహా ఇవ్వడం, సహాయం చేయడం
  2. భవిష్యత్తులో వరదల నుండి నగర రక్షణ కోసం ప్రతిపాదనలను రూపొందించడం
  3. హైదరాబాద్ నగరం, చాదర్‌ఘాట్ ప్రాంతంలో మురుగు నీటి పారుదల కోసం సమగ్ర పథకాన్ని సిద్ధం చేయడం.

1909 ఏప్రిల్ 15న నేను హైదరాబాద్‌కు చేరుకోగానే నాతో కలిసి పని చేసే సిబ్బంది కోసం వాకబు చేసాను. వీరు మొదట రెండు ప్రధాన పథకాల కోసం సమగ్ర సర్వేలు చేపట్టాల్సి ఉంటుంది. అవి

  1. వరద రక్షణ, నియంత్రణ పనుల కోసం ఒక ప్రాజెక్ట్
  2. నగరం కోసం ఆధునిక మురుగు నీటి పారుదల పథకం.

ఈ రెండు ప్రాజెక్టులకు సంబంధించిన ప్రణాళికలు, అంచనాల తయారీకి తొలుత సర్వే పనులు జరగవలసిన అవసరం ఉన్నది. నగరంలో టౌన్ ప్లానింగ్, కాంక్రీట్ రోడ్లు వంటి అదనపు పనులు, అటువంటివే మరి కొన్ని ఇతర పనులను తరువాత సూచించినారు. అయితే హైదరాబాద్ ప్రభుత్వం అత్యవసరమైన పనులుగా భావించిన పై రెండు పథకాలపై మాత్రమే ఈ సందర్భంగా దృష్టి పెట్టదలుచుకున్నాను.

ఇంతకు ముందు చెప్పినట్లు, 1908లో హైదరాబాద్‌లో సంభవించిన వరద మొత్తం 4,25,000 క్యూసెక్కులుగా అంచనా వేసినారు. ఇది 862 చదరపు మైళ్ల పరీవాహక ప్రాంతం నుండి గంటకు ఒక అంగుళంలో ముప్పావు వంతు వర్షపాతాన్ని మోసుకు వచ్చే అసాధారణ వరద ప్రవాహాన్ని సూచిస్తుంది. వర్షపాతం అసాధారణమైన తీవ్రత కలిగినదని చెప్పడానికి ఎటువంటి సందేహం లేదు. కానీ ఎగువన అనేక చెరువులు ఏక కాలంలో తెగి ఉండకపోతే, వాటి నుండి అసాధారణ స్థాయిలో వెల్లువెత్తిన నీటి పరిమాణం నదిలోకి చేరకపోయి ఉంటే వరద ఈ స్థాయిలో పెరిగేది కాదు. వరద మట్టం అత్యున్నత స్థాయికి పెరిగి అంత పెద్ద నష్టాన్ని కలిగించేది కాదు.

ఇంతకు ముందు ప్రస్తావించినట్టు 1908 సెప్టెంబరు 28వ తేదీన సోమవారం సంభవించిన వరద మధ్యాహ్నానికి ఒక గంట ముందు గరిష్ట ఎత్తుకు చేరుకుంది. అర్ధరాత్రి తర్వాత అది కుంభవృష్టిగా మారింది. ఎడతెరపి లేని కుంభవృష్టి వల్ల చిన్నచిన్న చెరువులు నిండి, వరద అలుగు సామర్థ్యానికి మించి రావడంతో చెరువు మట్టి కట్టలపై ఒత్తిడి పెరిగి అంతిమంగా అవి తెగిపోవడానికి దారితీసింది. ఒకదాని వెంబడి మరొకటి తెగిపోయి ఆ నీరంతా నగరంపై విరుచుకు పడింది. నగరంలో వరద అసాధారణమైన ఎత్తుకు పెరిగింది. జనాభా ఉన్న ప్రాంతాలలోని అనేక భవనాలు కూలిపోయినాయి. కోల్సవాడి ప్రాంతంలో సుమారు రెండు వేల మంది ప్రజలు మునిగిపోయారని లేదా కొట్టుకుపోయారని సమాచారం.

నాకు అప్పగించిన పనులు చేపట్టడానికి కొంతమంది ఇంజనీర్లు, పెద్ద సంఖ్యలో సర్వేయర్లు, సహాయక సిబ్బంది అవసరం. ఆ సమయంలో మద్రాసు ప్రజా పనుల శాఖలో పని చేస్తున్న సుప్రసిద్ధ, సమర్థుడైన అధికారి శ్రీ టి.డి. మెకంజీ హైదరాబాద్ రాష్ట్ర ప్రజా పనుల శాఖకు ప్రిన్సిపల్ ఇంజనీర్-ఇన్-చార్జిగా ఉన్నారు. మొదట్లో ఈ అధికారి మా పని తీరు పట్ల విమర్శనాత్మకంగా ఉండేవారు. ఆ తర్వాత మా పనితనం, నైపుణ్యం చూసి మనసు మార్చుకొని సానుకూల వైఖరి ప్రదర్శించారు. ఆప్యాయంగా నాతో స్నేహం చేసి తన శక్తి మేరకు నాకు అన్నిరకాల సహాయ సహకారాలు అందించారు.

మీర్ ఉస్మాన్ అలీ ఖాన్

పనులకు అవసరమైన సిబ్బందిని పాక్షికంగా హైదరాబాద్ రాష్ట్ర ప్రజా పనుల శాఖ నుంచి పొందాను. పాక్షికంగా బొంబాయి ప్రభుత్వం నుండి నాకు తెలిసిన వారిని రప్పించాను. ఆ సిబ్బంది అంతా పని ప్రారంభించిన కొద్ది కాలంలోనే సర్వే నివేదికలు నా ముందు పెట్టారు.

సర్వే ద్వారా సేకరించిన సమాచారం సిద్ధమైన తర్వాత ఇంజనీరింగ్ అంశాలను సమగ్రంగా అధ్యయనం చేయడం జరిగింది. నది ప్రవాహ సామర్థ్యం కంటే ఎక్కువ మొత్తంలో వచ్చే వరదలు నగరాన్ని ముంచెత్తకుండా నిరోధించడానికి లేదా నియంత్రించడానికి నగరానికి ఎగువన ఆ వరదను ఇముడ్చుకోగలిగే జలాశయాలను నిర్మించడం అవసరం అని మా అధ్యయనాలు తేల్చినాయి. అప్పుడు మాత్రమే వరదల బారి నుండి నగరానికి విముక్తి కలుగుతుంది. నగరానికి ఎగువన తగినంత నిల్వ సామర్థ్యం కలిగిన జలాశయాల నిర్మాణం అవసరమని మేము నిర్ధారణకు వచ్చాము. రెండు రిజర్వాయర్ డ్యాంలు.. ఒకటి మూసీ నదికి అడ్డంగా, మరొకటి దాని ఉపనది ఈసీ మీద ప్రతిపాదించినాము. నగరానికి ఎగువన 8.5 మైళ్ళ దూరంలో మూసీ, 6.5 మైళ్ల దూరంలో ఈసీ జలాశయాలను అత్యంత అనుకూలమైన ప్రదేశాలలో ప్రతిపాదించినాము. మూసీ నదిపై 8,439 మిలియన్ ఘనపు అడుగుల నీటి నిల్వ, ఈసీ నదిపై 11,950 మిలియన్ ఘనపు అడుగుల నీటి నిల్వ సాధ్యపడుతుంది. రెండు జలాశయాల్లో మొత్తం నిల్వ సామర్థ్యం 20,389 మిలియన్ ఘనపు అడుగులుగా వాస్తవికంగా అంచనా వేయడం జరిగినది.

హైదరాబాద్ నగరానికి ఎగువన నిర్మించిన జంట జలాశయాల రేఖా చిత్రం

నగరంలో కొన్నికీలక ప్రదేశాలలో నది ఒడ్డు ఎత్తు పెంచడానికి ప్రతిపాదనలు చేశాము. నగరం లోపల నదీ తీరం వెంబడి కొన్ని భాగాలలో ప్రజలు విహరించడానికి కాలి బాటలు, నది తీరం వెంబడి ఒడ్డున సుందరీకరణ కోసం తోటలు కూడా ప్రతిపాదించడం జరిగింది. వరద రక్షణ, సుందరీకరణ పనులకు సంబంధించిన ప్రాజెక్ట్ నివేదిక సిద్ధమైన తర్వాత మా ప్రతిపాదనల పరిశీలన కోసం హైదరాబాద్ ప్రభుత్వ అధికారులతో పలు దఫాలుగా సమావేశాలు జరిగాయి. ప్రధాన మంత్రి లేదా కార్యనిర్వాహక మండలి అధ్యక్షుడు, మహారాజా సర్ కిషన్ ప్రసాద్ బహదూర్, యామిన్ ఉస్-సల్తనత్ (నిజాం కుడి భుజం), ఆర్థిక మంత్రి శ్రీ కాసన్ వాకర్ ఇద్దరూ హాజరయ్యారు. కానీ నేను హైదరాబాదు నుండి బయలుదేరే సమయానికి కూడా పనుల తక్షణ ప్రారంభానికి అనుకూలంగా ప్రభుత్వ నిర్ణయాలు వెలువడలేదు.

సర్ మహారాజ కిషన్ పెర్సాద్

ఒకప్పుడు హైదరాబాద్ (దక్కన్) లో ఉన్నత పదవిలో పని చేసిన మద్రాసు సర్వీస్‌కి చెందిన సుప్రసిద్ధ ఇంజనీర్ శ్రీ పి రాస్కో అలెన్‌ను హైదరాబాద్ ప్రభుత్వం మా ప్రతిపాదనలపై సంప్రదించినట్లు తెలిసింది. ఆ అధికారి హైదరాబాద్ రాష్ట్ర ప్రజా పనుల శాఖ సెక్రటరీ శ్రీ. ఎఫ్. మూరజ్ గారికి 25 నవంబర్ 1909న రాసిన లేఖలో ఈ క్రింది విధంగా తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు.

రెండు అంశాలలో.. మొదటిది హైదరాబాద్ నగరానికి సంభవించిన ఈ భయంకరమైన దురదృష్ట పరిస్థితులను సాధారణ పరిస్థితికి మార్చడానికి చర్యలు తీసుకునే విషయంలో; రెండవది ఈ విషయంపై నివారణా మార్గాలను నివేదించడానికి ఒక ప్రతిభావంతుడైన ఇంజనీర్‌ను ఎంపిక చేసినందుకు హైదరాబాద్ రాష్ట్రాన్ని నేను అభినందిస్తున్నాను. ఎలాంటి పునరాలోచన, సంకోచం లేకుండా వారు సిఫార్సు చేసిన ప్రతిపాదనలను అమలు చేయాలని నేను గట్టిగా కోరుతున్నాను.

ఇక డిజైన్ల విషయానికొస్తే.. అవి ఒక ప్రతిభావంతుడైన, విశిష్టమైన గుర్తింపు పొందిన ఇంజనీర్ రూపొందించినవి కాబట్టి వాటిపై ఏ వ్యాఖ్యానాలు అవసరం లేదని నా అభిప్రాయం.

నేను హైదరాబాద్ నుంచి వెళ్లిపోయిన దాదాపు మూడున్నరేళ్ల తర్వాత మార్చి 1913లో మూసీ డ్యాం జలాశయాన్ని నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ సందర్భంగా H. E. H నిజాం ప్రాజెక్టు శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆనాటి సభలో రాష్ట్రంలోని ప్రజా పనుల శాఖకు అధిపతిగా ఉన్న శ్రీ టి డి మెకంజీ నిజాం సమక్షంలో ప్రసంగిస్తూ ఇతర విషయాలతో పాటు అతను ఇలా చెప్పాడు:

H E H నిజాం గారి సలహాదారులు మూసీ వరద రక్షణ ప్రతిపాదనలను రూపకల్పన చేయడానికి ఎంపిక చేసిన నిపుణుడి విషయంలో అదృష్టవంతులు అని నా అభిప్రాయం. ఎందుకంటే ఆ అవకాశం భారతదేశంలోనే అత్యంత సమర్థులైన ఇంజనీర్లలో ఒకరైన శ్రీ విశ్వేశ్వరాయ గారికి దక్కింది. వారు తాను పనిచేస్తున్న ఏ రంగంలోనైనా తనదైన ముద్ర వేసే ప్రతిభ కలిగిన వారు. ప్రస్తుతం వారు మైసూర్ సంస్థాన దివాన్‌గా అద్భుతమైన సేవలందిస్తున్నారు. సర్వే పనులు, డిజైన్ల రూపకల్పన, ప్రాజెక్టు నివేదిక తయారీలో అతనికి హైదరాబాద్ రాష్ట్రం తరపున ప్రతిభావంతుడైన సూపరింటెండింగ్ ఇంజనీర్ శ్రీ అహ్మద్ అలీ గారి నుండి అత్యున్నత సాంకేతిక సహాయం లభించింది. ప్రాజెక్టు నివేదిక అందుకు ప్రబల సాక్ష్యంగా నిలచి ఉన్నది.” (టైమ్స్ ఆఫ్ ఇండియా, 24 మార్చ్ 1913)

అనంతరం ఈసీ జలాశయం నిర్మాణాన్నిచేపట్టారు. ఆ పని కోసం నేను రిటైర్డ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీ సి.టి. దలై సేవలను పొందగలిగాను. ఆయన మైసూర్ ప్రజా పనుల శాఖలో పని చేసిన సమర్థుడైన భారతీయ ఇంజనీర్. మైసూర్ సంస్థానంలో ఆనకట్టల నిర్మాణ పనులను చాలా సమర్థవంతంగా పూర్తి చేశారు.

 

హిమాయత్ సాగర్ డ్యాం మీద ఏర్పాటు చేసిన బోర్డు

1908 సంవత్సరంలో మూసీ డ్యాం డిజైన్లను రూపొందించిన అధికారి శ్రీ అహ్మద్ అలీ. ప్రాజెక్టు శంఖుస్థాపన రోజున శ్రీ టి.డి. మెకంజీ తన ప్రసంగంలో ప్రస్తావించిన ఇంజనీర్ ఇతనే. నాకు ప్రాజెక్టు పనుల్లో సాంకేతిక సహాయం అందించిన ఇతను సమర్థుడైన ఇంజనీర్ అని చెప్పడానికి సందేహం అవసరం లేదు. ఈ అధికారి సామర్థ్యం, చొరవ కలిగి ఉన్నాడు. తరువాత కాలంలో అతను హైదరాబాద్ రాష్ట్ర చీఫ్ ఇంజనీర్ స్థానానికి ఎదిగాడు. నిజాం నవాబు నుంచి నవాబ్ అలీ నవాజ్ జంగ్ అనే బిరుదును కూడా సంపాదించాడు.

నవాబ్ అలీ నవాజ్ జంగ్

1929లో సింధ్ రాష్ట్రంలో సుక్కూర్ సమీపంలో బ్యారేజ్, కాలువల నిర్మాణ పనులకు సంబంధించిన ఇంజనీరింగ్, ఆర్థిక అంశాలను పరిశోధించి నివేదిక సమర్పించే కమిటీలో కూడా ఈ అధికారినే బొంబాయి ప్రభుత్వం నా సహోద్యోగిగా నియమించింది. ఈ బ్యారేజీని లాయిడ్ బ్యారేజి అని కూడా పిలుస్తారు.

ఈసీ డ్యాంను పాక్షికంగా శ్రీ సి.టి. దలై నిర్మించారు. తరువాత శ్రీ (తర్వాత సర్) క్లెమెంట్ టి. ముల్లింగ్స్ అనే ఇంజనీర్ ఆధ్వర్యంలో జరిగాయి.

క్లిమెంట్ టి ముల్లింగ్స్

తదనంతరం ఆయన మద్రాసు ప్రభుత్వ ఆధ్వర్యంలో కావేరీ నదిపై మెట్టూరు డ్యాం నిర్మాణాన్ని పూర్తి చేయడం ద్వారా ప్రత్యేక గుర్తింపు పొందారు.

హైదరాబాద్ మురుగు నీటి పారుదల పథకం:

నాకు అప్పగించబడిన రెండవ ముఖ్యమైన పథకం హైదరాబాద్ నగరానికి ఆధునిక మురుగునీటి వ్యవస్థను సిద్ధం చేయడం.

మూసీ నది, ఇంతకు ముందు పేర్కొన్న విధంగా, హైదరాబాద్ నగరం మధ్య నుంచి ప్రవహిస్తుంది. నదికి రెండు వైపుల నుంచి మురుగు నీటి కాలువలు నదిలోనే కలుస్తాయి. ఈ కారణంగా మూసీ నది మొత్తంగా ఒక మురుగు నీటి కాలువగా రూపు దాల్చింది. ముఖ్యంగా ఎండా కాలంలో ఇది స్పష్టంగా అనుభవంలోకి వస్తుంది.

జన సమ్మర్ధంతో రద్దీగా ఉండే వీధుల్లో ఇంటి యజమానులు తమ ఇంటి ముందు గుంతలు తవ్వేవారు. వారి ఇండ్ల నుండి వెలువడే ద్రవ వ్యర్థాలను ఈ గుంతలలోకి మళ్లించేవారు. ఈ గుంతల నుండి మురుగు నీరు కొన్నిసార్లు పొంగి పొర్లి వీదుల్లో ప్రవహించేవి. దిగువ ప్రాంతాల్లో నిల్వ ఉండేవి. ఈ గుంతలు, మురుగు నీటి కాలువలు దోమల ఉత్పత్తి కేంద్రాలుగా మారినాయి. ఆ రోజుల్లో నగర ప్రజల అలవాట్లతో తగినంతగా పరిచయం లేని ఒక అపరిచితుడు గనుక మొదటిసారి నగరాన్ని సందర్శించినట్లైతే ‘దోమల ఉత్పత్తి’ కూడా నగర పరిశ్రమలలో ఒకటి అని అనుమానించే అవకాశం ఉందని సరదాగా వ్యాఖ్యానించేవారు.

మొదట చేపట్టిన అత్యంత ముఖ్యమైన పని నది రెండు ఒడ్డుల నుండి నగర మురుగునీటిని పైపు నాలాల ద్వారా మురుగునీటి కోసం ప్రత్యేకంగా కేటాయించిన గడ్డి భూముల్లోకి మళ్లించడం. నది ఎడమ ఒడ్డున నగరానికి తూర్పున మురుగు నీటి భూమి కోసం ఒక స్థలాన్ని ఎంపిక చేశారు. నదికి దక్షిణ ఒడ్డు నుంచి వచ్చే మురుగునీటిని చాదర్‌ఘాట్ బ్రిడ్జి కింద నదికి అడ్డంగా పైపుల ద్వారా తీసుకెళ్లి ఎడమ ఒడ్డు నుంచి వచ్చే మురుగుతో పాటు మట్టి కాలువ ద్వారా నిర్ధారించిన గడ్డి భూములకు చేరవేయడానికి ప్రతిపాదించాము.

హైదరాబాద్ ప్రభుత్వంతో నాకు కుదిరిన ఒప్పందం ఏమిటంటే..

1) వరద రక్షణ/నియంత్రణ పథకం 2) నగరానికి ఆధునిక మురుగునీటి పారుదల పథకం.. ఈ రెండు పథకాలను తయారు చేసి ప్రభుత్వానికి నేను అందించాలి. రెండు పథకాల తయారీ పనులు పూర్తయ్యాయి. నేను హైదరాబాద్‌ను వదిలి పెట్టి పోయే ముందు రెండింటికి సంబంధించిన నివేదికలను అచ్చు వేసి, ప్లాన్లు, వ్యయ అంచనాలను ప్రభుత్వానికి సమర్పించాను. హైదరాబాద్ వరద రక్షణపై నివేదిక 1909 అక్టోబరు 1న, హైదరాబాద్ ఎగువన ఉన్న రెండు నదులపై జలాశయాల నిర్మాణం కోసం నివేదికను 1909 అక్టోబరు 20న సమర్పించడం జరిగింది.

నగర మురుగునీటి పథకానికి సంబందించి ప్రాథమిక ప్రణాళికలు, అంచనాలు, తదితర ముఖ్యమైన అంశాలతో ఒక సంక్షిప్త నివేదికను నవంబర్ 6, 1909న ప్రభుత్వానికి సమర్పించడం జరిగింది. సమస్యాత్మకంగా ఉన్న అన్ని మురికివాడలను ఈ పథకం పరిధిలోకి తీసుకువచ్చాము. అయితే మొత్తం నగరానికి ఒకేసారి పైపుల ద్వారా మళ్లించే మురుగునీటి పథకానికి నిధులు సమకూర్చే ఉద్దేశం ప్రభుత్వానికి లేకపోవడంతో హైదరాబాద్ జిల్లా అంతటా ఉన్న చాలా మురుగు కాలువల పనులు, వాటికి సంబందించిన వివరణాత్మక సర్వేల తర్వాత రూపకల్పన చేసి నిర్మించడానికి వదిలివేసాము.

బ్రిటిష్ రెసిడెంట్ అభ్యర్థన మేరకు, సికింద్రాబాద్ డ్రైనేజీపై ఒక నోట్‌ను 4 జూలై 1909న సికింద్రాబాద్ కంటోన్మెంట్ అథారిటీకి అందించాము. అక్టోబరు 18, 1909 న రాసిన లేఖలో బ్రిటిష్ రెసిడెంట్ నాకు ఇలా వ్రాశాడు :

మా కంటోన్మెంట్ డ్రైనేజీ పథకంపై మీరు సమర్పించిన విలువైన నివేదికకు కూడా నేను ధన్యవాదాలు చెప్పాలి. ఈ నివేదికను కంటోన్మెంట్ అథారిటీ వారు ఆమోదించారు. కంటోన్మెంట్ అథారిటీ అధికారులు, మేము ఇప్పుడు ఈ వివేదికలోని ప్రతిపాదనలను అమలు చేసే విషయంపై దృష్టి సారించాము.”

నాకు అప్పగించిన పనులను పూర్తి చేసిన నేను 1909 నవంబర్‌లో హైదరాబాద్ విడిచిపెట్టి వెళ్లిపోయాను. ఆ తర్వాత 13 సంవత్సరాలు ఆ నగరం ఇంజనీరింగ్ పనులతో నాకు ఎలాంటి సంబంధం లేకుండింది. హైదరాబాద్ మురుగు నీటి పారుదల పథకం నిర్మాణ పనులు సంతృప్తికరంగా సాగకపోవడం వలన హైదరాబాద్ ప్రభుత్వం 1922లో, పనులను పరిశీలించి సలహా ఇవ్వడానికి మళ్లీ ఆహ్వానించింది. రాష్ట్ర ప్రభుత్వం కోరిక తీర్చడానికి నేను అర డజను సార్లు మధ్య మధ్యన హైదరాబాద్ పర్యటనలు చేసాను. హైదరాబాద్ మురుగునీటి పథకంలో ప్రతిపాదించి, రూపకల్పన చేసిన ప్రధాన పనులు.. మరుగునీటిని మళ్లించడం కోసం ప్రత్యేక గడ్డి భూములను ఏర్పాటు చేయడం, నదికి రెండు వైపుల నుండి నగర డ్రైనేజీని ఈ భూములకు తీసుకువెళ్లడానికి సరైన మురుగు కాలువలను ఏర్పాటు చేయడం. ఈ మురుగు నీటి గడ్డి భూములు నగరానికి దిగువన, దూరంగా నదికి ఉత్తర ఒడ్డున ఉంది. హైదరాబాద్ జిల్లాలో, నగర్ వీధుల్లో కాలువలు నిర్మించడం, ఈ కాలువలకు ఇంటి కనెక్షన్లను అనుసంధానించడంపై ప్రత్యేక దృష్టి సారించారు.

నేను హైదరాబాద్ నగరాన్ని సందర్శించిన సమయంలో నగర ఇంజినీరింగ్ పనులపై పని చేసిన స్పెషల్ ఇంజనీర్ శ్రీ ఎం.ఎ. జమాన్ (తరువాత నవాబ్ అహ్సాన్ యార్ జంగ్) రాష్ట్ర ప్రజా పనుల శాఖలో సూపరింటెండింగ్ ఇంజనీర్‌గా అధికారిక హోదాలో ఉన్నారు. ఆయన ఈ అంశాలలో నాతో సంప్రదింపులు జరిపేవాడు.

హైదరాబాద్ రాష్ట్రంతో నా అనుబంధం రెండోసారి కొనసాగుతున్న సమయంలో శ్రీ సి. టి. దలై సారథ్యంలో ఈసీ జలాశయం డ్యాం ఇంకా నిర్మాణంలో ఉందని నేను గమనించాను. వరద నుంచి రక్షణ, వరద నియంత్రణ కోసం నిర్మించిన మూసీ జలాశయం నగరానికి తాగు నీటి సరఫరా కోసం వినియోగిస్తున్నారని కూడా గమనించాను.

నా భాగస్వామ్యంతో రాష్ట్రంలో పూర్తి అయిన ఇంజనీరింగ్ పనులు, మరమ్మతుల మొత్తం వ్యయాల విలువ 1931 నాటికి వరకు దాదాపు రెండున్నర కోట్ల రూపాయలకు చేరింది. నగర ఇంజనీరింగ్ పనులతో నా సంబంధం ముగిసే నాటికి అధికారుల అభ్యర్థన మేరకు నగరంలో లోటుపాట్లు, పరిష్కార చర్యలు, చేయవలసిన మరమ్మతులు మొదలైన అంశాలను క్రోడీకరించి ఒక సమగ్ర నివేదికను 1930లో సమర్పించాను.

నగరాన్ని మెరుగుపరచడానికి ఇంకా చాలా చేయాల్సి ఉందని నేను చెప్పాను. నేను సూచించిన పనులు, మరమ్మతులు గనుక పూర్తి చేసినట్టయితే, నగరంలో శుభ్రమైన ఇళ్ళు, ఆధునిక ఫ్లష్ డౌన్ మరుగుదొడ్లు, దుమ్ముధూళి లేకుండా రోడ్ల నిర్వహణ, చదును చేసిన ఫుట్‌పాత్‌లు, విస్తారమైన ఖాళీ స్థలాలు, ఉద్యానవనాలు గనుక ఏర్పాటు అయినట్టయితే భారతదేశంలోని ఇతర నగరాల ముందు హైదరాబాద్ నగరం తల ఎత్తుకొని నిలబడగలదని సూచించాను. దీని కోసం సమర్థులైన వ్యక్తులను బాధ్యులుగా ఉంచి, సహేతుకంగా ప్రతిపాదించిన అన్ని పనులను పూర్తి చేయడానికి నిధులు సమకూరిస్తేనే పురోగతి సాధ్యపడుతుందని నివేదికలో సూచించాను.

నేను ఈ అధ్యాయాన్ని ముగించే ముందు శ్రీ (తర్వాత సర్) అక్బర్ హైదరీ గారికి మన:పూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.

సర్ అక్బర్ హైదరీ

అతను హైదరాబాద్ నగరంలో మెరుగైన పౌర సదుపాయాల కల్పన కోసం పరితపించారు. నేను హైదరాబాద్‌లో పని చేసినంత కాలం అతని నుండి నేను పొందిన సహాయ సహకారాల విషయంలో ఋణపడి ఉంటాను.

***

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here