మోక్షగుండం విశ్వేశ్వరాయ స్వీయ చరిత్ర అనువాదం – అధ్యాయం-8

0
9

అధ్యాయం 8 – రాజకీయ, పరిపాలనా రంగాలలో తొలి సంస్కరణలు:

[dropcap]1[/dropcap]881లో మైసూర్ రాష్ట్రాన్ని వంశపారంపర్య రాచరిక పాలనకు H E H మహారాజా చామరాజ వడియార్ బహదూర్ గారికి బ్రిటిష్ ప్రభుత్వం అప్పగించింది. ఆ అధికార బదలాయింపు ఇన్‌స్ట్రుమెంట్ ఆఫ్ ట్రాన్స్‌ఫర్ (Instrument of Transfer) అనే చట్టం ద్వారా అమలు చేసినారు. భారత ప్రభుత్వం ఇతర ముఖ్యమైన భారతీయ రాష్ట్రాల మధ్య జరిగినట్లుగా, సర్వోన్నత అధికారం (Paramount Power) కలిగిన బ్రిటిష్ ప్రభుత్వంతో సంబంధాలు, రాష్ట్రానికి సంబంధించిన అంశాలు ఏవైనా సరైన ఒప్పందం ద్వారా నియంత్రించబడాలని హిస్ హైనెస్ మహారాజా కృష్ణరాజ వడియార్ బహదూర్ గారు భావించారు. అయితే ఈ అంశం చాలా కాలంగా పరిష్కారం కాకుండా అస్థిరంగానే ఉండిపోయింది. భారత ప్రభుత్వంతో మైసూర్ రాజ్యం భవిష్యత్ సంబంధాలను నియంత్రించడానికి ఒక ఒప్పందం కుదరాలని మహారాజు గారు ఆత్రుతగా ఉన్నారు.

1913లో ఎడ్విన్ మోంటాగు భారత అంతర్గత వ్యవహారాల అండర్-సెక్రటరీగా ఉన్నప్పుడు అతను మైసూర్ రాష్ట్రాన్ని సందర్శించి ఈ అంశాన్ని అధ్యయనం చేసి వెళ్ళాడు. తగిన నియమ నిబంధనలను కలిగి ఉన్న ఒప్పందం ఖచ్చితంగా అవసరమనే అవగాహన అతనికి కలిగింది. వైస్రాయ్ లార్డ్ హార్డింగ్ గారు ఎలిఫెంట్ ఖెద్దాస్ సందర్శనలో ఉన్నప్పుడు కారపూర్ వద్ద ఒప్పందం చివరి ముసాయిదా తయారు చేయడం జరిగింది. ఆ సమయంలో హిస్ హైనెస్ మహారాజు కూడా అక్కడ ఉన్నారు. లార్డ్ హార్డింగ్, H E మహారాజా, మైసూర్‌లో బ్రిటిష్ రెసిడెంట్ సర్ హ్యూ డాలీ, మైసూర్ దీవాన్‌గా నేను ఈ చర్చల్లో పాల్గొన్నాము. చర్చల తర్వాత, ఒప్పందం చివరి ముసాయిదాను ఇరు వర్గాలు అంగీకరించాయి. ఒప్పందాన్ని ఆమోదిస్తూ సంతకాలు జరిగాయి. ఆ ఒప్పందమే భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చే దాకా అమలులో ఉన్నది.

అధికార బదిలీకి సంబంధించిన చట్టంలో నిర్వచించిన షరతులు అన్నీ కూడా ఏకపక్షంగా పొందుపరచినవే. ఈ షరతులకు లోబడే మహారాజుకు అధికారం అప్పగించడం జరిగింది. ఏదేమైనప్పటికీ, ప్రస్తుత ఒప్పందంలో హిస్ హైనెస్ మహారాజు, బ్రిటిష్ సర్వోన్నత అధికారానికి మధ్య పరస్పరం అంగీకరించిన షరతులు ఉన్నాయి. బ్రిటీష్ ప్రభుత్వం సాధారణ ఆధిపత్యం, సర్వోన్నత అధికారానికి లోబడి మాత్రమే రాష్ట్రంలో అంతర్గత పరిపాలనలో పూర్తి అధికారాలను హిజ్ హైనెస్‌కు ఈ ఒప్పందం కట్టబెట్టింది. ఒప్పందం అంతిమ ఫలితంగా హిస్ హైనెస్ మహారాజా వారికి అధిక అధికారాలు, గతంలో కంటే ఉన్నతమైన హోదా సంక్రమించింది. ఆ తర్వాత పరస్పరం అంగీకరించిన ఒప్పందం ఆధారంగానే అతను రాష్ట్రాన్ని పరిపాలించాడు. అది అతనికి ఎక్కువ స్వయంప్రతిపత్తిని, అంతర్గత పరిపాలన అధికారాలను హామీ ఇచ్చింది.

ఒడంబడిక ద్వారా అమలులోకి వచ్చిన మార్పుల లోపలికి వెళ్లవలసిన అవసరం లేదు. అవి ఇప్పుడు కేవలం చారిత్రిక ప్రాధాన్యత కలిగిన పత్రాలుగా మాత్రమే మిగిలి ఉన్నాయి. భారత ప్రభుత్వం 1950లో స్వతంత్ర, సర్వసత్తాక గణతంత్ర రాజ్యంగా అవతరించడంతో భారత రాష్ట్రాలతో కేంద్రానికి ఉండిన సంబంధాలలో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. అన్నిరాజకీయ ప్రయోజనాల కోణంలో నుంచి చూసినప్పుడు రాష్ట్రాలు ఇప్పుడు కేంద్రంతో సన్నిహితంగా రాజ్యాంగబద్ధంగా అనుసంధానం అయి ఉన్నాయి. అవి స్వతంత్ర భారత సమాఖ్యలో యూనిట్లు అయినప్పటికీ, వాస్తవానికి అవి బ్రిటిష్ పరిపాలన కాలంలో అనుభవించిన దాని కంటే తక్కువ అధికారాలను, తక్కువ హోదాను కలిగి ఉన్నాయి. భారత ప్రజాస్వామ్య పరిణామ క్రమంలో ఇది ఒక కొత్త దశ మాత్రమేనని నేను భావిస్తున్నాను.

1913 నవంబర్ 6న మైసూర్‌లో వైస్రాయ్ లార్డ్ హార్డింగ్ చేసిన ప్రసంగంలో ఒప్పందంపై ఆయన చేసిన ప్రస్తావనలను ఇక్కడ ఉటంకిస్తున్నాను.

“నేను ఇప్పుడు ఒక ప్రకటన చేయడం బాధ్యతగా భావిస్తున్నాను. ఇది నాకు చాలా సంతోషాన్ని కలుగజేయడమే కాదు దీనిని స్వీకరించడానికి H H మహారాజు గారికి కూడా సంతోషాన్నికలుగజేస్తుందని నేను నమ్ముతున్నాను. సుమారు నాలుగు నెలల క్రితం H H మహారాజు గారు నాకు ఒక లేఖ రాశారు. పాలనా అధికార బదిలీకి సంబందించిన ఇన్‌స్ట్రుమెంట్ ఆఫ్ ట్రాన్స్‌ఫర్, 1881 ద్వారా మైసూర్ ప్రభుత్వంపై అధికారాన్ని హైనెస్ మీ తండ్రి గారికి బదలాయించడం జరిగింది. లేఖలో మీరు ఆ చట్టంలోని కొన్ని అంశాల పట్ల అభ్యంతరాలను వ్యక్తం చేసినారు. బ్రిటీష్ ప్రభుత్వానికి, మైసూర్ రాష్ట్రానికి మధ్య ఉండవలసిన సంబంధాలను మరింత నిర్ధిష్టంగా నిర్వచించే విధంగా ఆ పత్రాన్ని రూపంలోనూ, సారంలోనూ సవరించాలని మీరు కోరినారు. ఈ అంశాన్ని చాలా జాగ్రత్తగా పరిశీలించిన తర్వాత భారత ఆంతరంగిక వ్యవహారాల సెక్రటరీ సమ్మతితో, బదిలీకి సంబంధించిన పాత పత్రాన్ని మార్చి కొత్త ఒప్పంద పత్రాన్ని ప్రవేశపెట్టాలని నేను నిర్ణయించాను. భారతదేశంలోని సంస్థాన రాచరిక పరిపాలకులలో H H మైసూర్ రాజా వారికి ఉన్నవాస్తవ హోదాకు అనుకూలంగా ఈ పత్రం మన రెండు ప్రభుత్వాల మధ్య సంబంధాలను నిర్దేశిస్తాయి. మైసూర్ ప్రభుత్వం నా ప్రతిపాదనను ఆమోదించింది. ఈ అంశంపై H H మహారాజా వారి అభిప్రాయాలు కూడా చాలా శక్తివంతంగా, సముచితంగా ఉన్నట్టు గమనించాను. అవి ఇప్పటి మీ కీర్తిప్రతిష్ఠలను, ఔన్నత్యాన్ని మరింత పెంపొందించడానికి దోహదం చేస్తాయి. ఈ కొత్త ఒప్పందం అనంతరం మైసూర్ రాజ్యంతో పూర్తి స్థాయిలో నాకు ఆత్మీయ అనుబంధం కొనసాగాలని కోరుకుంటున్నాను. ఈ శుభ సందర్భంలో H H మహారాజా వారికి తెలియజేయునది ఏమనగా.. మీ గౌరవానికి, ఈ గొప్ప రాజ్యానికి ప్రభుత్వాధినేతలుగా బాధ్యత వహించే వారి గౌరవానికి రుజువుగా నా మాటలు నిలుస్తాయని భావిస్తున్నాను. దీన్ని నేను ప్రత్యేకంగా సంతోషకరమైన పరిస్థితిగా చూస్తున్నాను.”

H H మహారాజు గారు ఈ మార్పుకు చాలా సంతోషించారు. 1913 నవంబర్ 22 న నాకు రాసిన వ్యక్తిగత లేఖలో ఈ కొత్త ఒప్పందం ఈ రకంగా పరిణామం చెందడంపై నేను తీసుకున్న చిన్నపాటి చొరవకు ఉదాత్తమైన మాటలను ఉల్లేఖించినారు.

వైస్రాయ్ గారి పర్యటన ముగిసిన తర్వాత నేను ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటున్నాను. ఇన్‌స్ట్రుమెంట్ ఆఫ్ ట్రాన్స్‌ఫర్‌కు సంబంధించి మీరు చేసిన కృషికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. వైస్రాయ్‌కి నేను చేసిన ప్రాతినిధ్య విజయం చిన్నదేమీ కాదనే వాస్తవాన్ని నేను పూర్తిగా గ్రహించాను. ఎందుకంటే మీరు అతని ముందు ఉంచిన మన వాదనలు ఎంతో సమర్థనీయంగా, ఎదుటివారిని మెప్పించే విధంగా ఉన్నాయి. ఈ విధంగా మీరు నాకు, నా రాష్ట్రానికి అందించిన గొప్ప సేవకు నేను మీకు తగినంతగా కృతజ్ఞతలు చెప్పలేను. ఈ విజయాన్ని నేను ఎల్లప్పుడూ లోతైన కృతజ్ఞతా భావాలతో గుర్తుంచుకుంటాను.

మీరు ఇక్కడ ఉన్న నాలుగు సంవత్సరాల ఈ కొద్ది వ్యవధిలోనే మైసూర్‌కు ఈ శాశ్వత గౌరవాన్ని మాత్రమే కాకుండా, అనేక ఇతర రంగాలలో రాష్ట్రానికి చాలా సాధించి పెట్టారు. ఇది నాకు వ్యక్తిగతంగా గొప్ప ఆనందాన్నికలిగించే విషయం. నా రాష్ట్రం కోసం మీరు ఇంతవరకు చేసినది, చేస్తున్నదంతా నాకు బాగా తెలుసు అని నమ్మమని మాత్రమే నేను మిమ్మల్ని అడగగలను. మీరు కోరకపోయినా నా సానుభూతి, సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని నేను మీకు హామీ ఇవ్వగలను.

ప్రతినిధుల సభలో సంస్కరణలు:

1881లో మైసూర్ రాష్ట్రంలో హిస్ హైనెస్ శ్రీ చామరాజ వడియార్ బహదూర్ హయాంలోనే ‘ప్రతినిధుల సభ’ ఉనికిలోకి వచ్చింది. అప్పుడు దూరదృష్టి, దేశభక్తి గల రాజనీతిజ్ఞుడు శ్రీ సి. రంగాచార్లు గారు దివాన్‌గా పని చేస్తున్నారు. ప్రతినిధుల సభకు పెద్దగా అధికారాలు ఏవీ లేవు. ప్రభుత్వానికి ప్రజల తరపున మహాజర్లు సమర్పించడానికి పరిమితమైన ఒక సంస్థగా ఉండేది. నేను దీవాన్‌గా పదవీ బాధ్యతలు స్వీకరించే వరకు, ప్రతినిధుల సభకు అధికారాల విషయంలో చెప్పుకోదగినంత ముందడుగు వేయలేదు.

ఆధునిక ప్రజాస్వామ్య ధోరణులకు అనుగుణంగా ప్రతినిధుల సభకు కొన్ని అవసరమైన అధికారాలు ఇవ్వాలని భావించారు. అక్టోబరు 11, 1913 న ప్రతినిధుల సభలో నేను ప్రసంగం చేసిన మొదటి సమావేశాల లోనే H E మహారాజు గారి ఆమోదంతో ఈ అంశాన్ని పరిశీలించడానికి నాకు పంపించడం జరిగింది. నాకు పంపించిన సభ సంస్కరణల అంశంపై నా ప్రసంగంలో ఇట్లా ప్రస్తావించినాను.

అసెంబ్లీ కూర్పు, దానికి సభ్యులను ఎన్నుకునే పద్ధతులు, దాని విధులు, సభ కార్యకలాపాల నిర్వాహణ వ్యవస్థ తదితర అంశాలకు సంబంధించిన ప్రశ్నలను ఈ సెషన్‌లో పరిశీలించడం ప్రయోజనకరంగా ఉండవచ్చునని భావిస్తున్నాము. సభ్యులు ఈ ప్రశ్నలను చర్చించి, వారి అభిప్రాయాలను తెలియజేసినట్లయితే, వాటిని H H మహారాజు గారి సానుకూల పరిశీలన కోసం సమర్పించడం జరుగుతుంది.

తదనంతర నిర్ణయాలలో రాష్ట్ర బడ్జెట్ పై చర్చించే హక్కు ప్రతినిధుల సభకు ఇవ్వబడింది. సభలో చర్చ కోసం మైసూర్ రాష్ట్ర భాష అయిన కన్నడలో సంక్షిప్త రూపంలో తయారు చేసిన బడ్జెట్‌ను ముద్రించి సభ్యులకు పంపిణీ చేసాము.

ఆ కాలంలో సభ సమావేశాలు సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో దసరా సమయంలో ఏడాదికి ఒక్కసారి మాత్రమే జరిగేవి. అందుచేత బడ్జెట్ మంజూరై, అమలులోకి వచ్చిన తరువాత చర్చించడం జరిగింది. బడ్జెట్‌ను ఆమోదించడానికి ముందే సభ్యులకు చర్చకు అవకాశం కల్పించడానికి సభా సమావేశాలు ఏడాదికి రెండు సార్లు జరపాలని నిర్ణయం జరిగింది. అట్లా అదనపు లేదా రెండవ సెషన్ మంజూరు అయ్యింది. అలాంటి మొదటి సెషన్ 1917 ఏప్రిల్ 23న జరిగింది. శాసన మండలికి ఇద్దరు సభ్యులకు బదులు నలుగురిని ఎన్నుకునే హక్కు, సభలో ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు కూడా ప్రతినిధుల సభకు ప్రభుత్వం కల్పించింది. నా పదవీ కాలం ముగిసే సమయానికి సభకు పోటీ చేసే అభ్యర్థుల అర్హతలను తగ్గించడం ద్వారా ఎక్కువ సంఖ్యలో వ్యక్తులు ప్రతినిధుల సభకు పోటీ చేయడానికి అవకాశాలు మరింత పెరిగాయి.

శాసన మండలిలో సంస్కరణలు:

ఇంతకు ముందు చెప్పినట్లుగా, శ్రీ. వి పి మాధవరావు గారు దివాన్‌గా ఉన్నప్పుడు 1907లో శాసన మండలి ప్రారంభమైంది. ఆనాడు ఇందులో 15 నుండి 18 మంది అధికారిక, అనధికారిక నామినేటెడ్ సభ్యులను కలిగి ఉండేది. వీరిలో ఇద్దరు మాత్రమే ప్రతినిధుల సభ ద్వారా ఎన్నికయ్యేవారు. రాష్ట్రానికి అవసరమైన శాసనపరమైన కార్యాచరణను రూపొందించడం, చర్చించడం, ఆమోదించడం శాసన మండలి ప్రధాన విధులు. శాసన మండలి కూర్పులో కూడా అనేక సంస్కరణలు చోటు చేసుకున్నాయి. మండలి అధికారాలు విస్తృతం అయినాయి. శాసన మండలిలో సభ్యుల సంఖ్య 18 నుంచి 24 కు పెరిగింది. వీరిలో నలుగురు జిల్లాలు కలిసి ఉన్న ప్రాదేశిక నియోజకవర్గాల నుంచి ఎన్నిక అవుతారు. నలుగురిని ప్రతినిధుల సభ సిఫార్సుపై నామినేట్ చేయాలి. పది మంది ప్రభుత్వాధికారులను, మరో ఆరుగురు అనధికారులను ప్రభుత్వం నామినేట్ చేస్తుంది. ప్రతినిధుల సభ ద్వారా ఎన్నికయ్యే సభ్యుల సంఖ్యను రెండు నుండి ఎనిమిదికు పెంచారు.

శాసన మండలి అధికారాలు పెరిగాయి. వారికి బడ్జెట్ చర్చకు, ప్రారంభ దశల్లో కొన్నిపరిమితుల మేరకు ప్రభుత్వాన్ని ప్రశ్నించే ప్రత్యేకాధికారం, సభ్యులకు అనుమతించే ప్రశ్నల సంఖ్య పెరిగాయి. అనుబంధ ప్రశ్నలను వేసే హక్కు ఇవ్వబడింది.

ప్రస్తుత పరిస్థితుల కోణం నుండి చూస్తే ఈ సంస్కరణలు చిన్నవిగా, అప్రధానంగా అనిపించవచ్చు. కానీ ఆనాటికి అది మునుపటి పరిస్థితులతో పోలిస్తే ఒక ఖచ్చితమైన పురోగతిగానే గుర్తించాలి. సభ్యులు పొందిన ఆ అధికారాలు, హక్కులు వారున్న కాలానికి చాలా విలువైనవిగానే బావించాలి.

పరిపాలనా వ్యవస్థలో అభివృద్ధి:

న్యాయ వ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థల మధ్య విధుల విభజన ప్రధానంగా తీసుకొచ్చిన అభివృద్ధికరమైన మార్పు. బ్రిటీష్ ప్రభుత్వంలో చాలా కాలంగా ఈ అంశంపై వివాదం కొనసాగుతూ ఉండింది. అయితే ఈ రెండు వ్యవస్థలు విడి విడిగా పని చేయడాన్ని ప్రజల స్వేచ్ఛకు అవసరమైన ఒక చర్యగా పరిగణించాలి. ఈ విడి వ్యవస్థలను మొదటి దశలో రెండు జిల్లాల్లో అమల్లోకి తీసుకురావడానికి అవసరమైన ఏర్పాట్లు నా పదవీ కాలంలోనే జరిగాయి. అయితే ఈ విడి వ్యవస్థలు నేను పదవీ విరమణ చేసిన కొన్ని వారాల తర్వాత 1919 జనవరి 1 న రాష్ట్రమంతటా పూర్తి స్థాయిలో పని చేయడం ప్రారంభమైంది.

ఈ విడి విడి వ్యవస్థలో ఉన్న ముఖ్యమైన మార్పు ఏమిటంటే.. గతంలో రెవెన్యూ అధికారులకు ఉన్న న్యాయపరమైన అధికారాలను (Judicial Powers) తొలగించి వాటిని ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన న్యాయవ్యవస్థ కింద పని చేసే న్యాయాధికారులకు బదిలీ చేయడం జరిగింది. ఇక నుండి రెవెన్యూ అధికారులు సాధారణ పరిపాలనా, భూయాజమాన్య వ్యవహారాలు మాత్రమే చూస్తారు. రెవెన్యూ సబ్-డివిజనల్ అధికారులు, అమిల్దార్లు నేర సంబందిత కేసులను పర్యవేక్షించడానికి ఇక నుంచి వీలు లేదు. ఆ కేసులను ప్రత్యేకమైన న్యాయ వ్యవస్థ చూసుకుంటుంది. అయితే శాంతిభద్రతలకు సంబంధించిన అధికారాలను వినియోగించడానికి వీరు ఎక్స్ అఫీషియో మేజిస్ట్రేట్లుగా ఉంటారు. డిప్యూటీ కమిషనర్లు జిల్లా మేజిస్ట్రేట్లుగా కొనసాగుతారు.

స్థానిక సంస్థల స్వపరిపాలనా వ్యవస్థల ఏర్పాటు అంశాన్ని అధ్యయనం చేసేందుకు ప్రభుత్వం రెండు కమిటీలను ఏర్పాటు చేసింది. ఈ కమిటీలు స్థానిక సంస్థల అధికారాలు, వాటి నిర్వహణకు అవసరమయ్యే నిధుల సమీకరణ మొదలైన అంశాలను అధ్యయనం చేస్తాయి. ప్రభుత్వం స్థానిక సంస్థల పునర్వ్యవస్థీకరణ పథకం కోసం అవసరమైన చట్టాన్ని ఆమోదించింది. పునర్వ్యవస్థీకరణ పథకం లక్ష్యాలు.. “మునిసిపల్ బోర్డులు, స్థానిక సంస్థల్లోకి సభ్యులను ఎన్నుకోవడం, వాటి అధికారాలను, విధులను నిర్ధారించడం, వాటి ఆర్థిక వనరులను పెంచడం, తమకు తాము స్థానిక పరిపాలనా వ్యవహారాల నిర్వహణ కోసం అంకితభావం కలిగిన, బాధ్యతాయుతమైన, సమర్థులైన నాయకులుగా తీర్చిదిద్దడం.”

రాష్ట్రంలోని మునిసిపాలిటీలను జనాభా ప్రాతిపదికన నగరం, పట్టణం, మైనర్ అనే మూడు కేటగిరీలుగా విభజించడం జరిగింది. నగరంలో మూడింట రెండు వంతుల కంటే తక్కువ కాకుండా, పట్టణంలో సగం, మైనర్ మునిసిపాలిటీలలో మూడింట ఒక వంతు మంది ఎన్నుకోబడిన సభ్యుల మద్దతుతో అధ్యక్షుడి ఎన్నిక జరుగుతుంది. ఎంపిక చేసిన మున్సిపాలిటీలలో అధ్యక్షులను, పెద్ద సంఖ్యలో ఉపాధ్యక్షులను కూడా ఎన్నుకుంటారు. బెంగళూరు నగరానికి మాత్రం ప్రజలు తన అధ్యక్షుడిని ప్రత్యక్షంగా ఎన్నుకునే సౌకర్యం ఇవ్వడం జరిగింది.

జిల్లా బోర్డులకు ఎన్నికైన అధ్యక్షులు కనీసం మొత్తం సభ్యులలో మూడింట రెండొంతుల మంది మద్దతు పొందాలి. తాలూకా బోర్డులు, యూనియన్లలో అధ్యక్షుడికి సగం కంటే తక్కువ కాకుండా సభ్యుల మద్దతు ఉండాలి. ఈ బోర్డులలో ప్రతి ఒక్కదానికి స్వతంత్ర నిధులు, బడ్జెట్‌తో నిజమైన కార్పొరేట్ దర్జాను ఆపాదించారు. కార్యాలయాల నిర్వాహణ, సిబ్బంది నియామకాలకు సంబంధించి గ్రామీణ బోర్డుల అధికారాలు, బడ్జెట్ కూడా పెంచారు. వారి పరిధిలో ఉన్న ప్రాంతాల్లో ప్రాథమిక విద్య, వైద్య సహాయాలు, పశు వైద్య శాలల నిర్వహణ పై నియంత్రణ దఖలు చేసినారు.

జిల్లా బోర్డుల ఎక్స్-అఫిషియో అధ్యక్షులుగా పదవులు నిర్వహిస్తున్న డిప్యూటీ కమీషనర్లను తప్పించి అవకాశం ఉన్న చోట అనధికారులను అధ్యక్షులుగా నియమించారు.

కొత్త పథకంలో గ్రామాన్ని ముఖ్యమైన యూనిట్‌గా మార్చారు. ఆ విధంగా స్థానిక సంస్థలను ఎగువ నుండి దిగువకు నిర్మించినారని మా మీద మోపిన నిందను తొలగించే ప్రయత్నం జరిగింది. జిల్లా బోర్డులను క్రమంగా అభివృద్ధి చేయాలని కూడా ప్రతిపాదించినాము. తద్వారా వారు జిల్లా సాధారణ పరిపాలనలో పాల్గొనవచ్చు. కాలక్రమేణా అవి ఇంగ్లాండ్, ఇతర దేశాలలోని జిల్లా కౌన్సిళ్ళకు సమానమైన హోదాను పొందవచ్చు.

మైసూరు ఆర్థిక సదస్సు (Mysore Economic Conference):

ఆర్థిక సదస్సుకు అనుబంధంగా వ్యవసాయం, పరిశ్రమలు & వాణిజ్యం, విద్య .. ఈ మూడు కమిటీలు పని చేస్తున్నాయి. చీఫ్ ఇంజనీర్‌గా నా పదవీ కాలంలోనే ఇవి పని చేయడం ప్రారంభించాయి. వాటిని మరింత పరిపుష్టం చేసినాము. కాన్ఫరెన్స్ కమిటీల పనిని ఆయా ప్రభుత్వ శాఖల విభాగాలతో అనుసంధించడానికి, సమన్వయం చేయడానికి ఒక అధికారిని పూర్తిస్థాయి కార్యదర్శిగా నియమించాము.

రాష్ట్ర ఆర్థిక వనరులపై ప్రత్యేకంగా నియమించిన ఒక అధికారి సర్వే నిర్వహించారు. ఆ సర్వే ఆధారంగా రాష్ట్ర ఆర్థిక స్థితిగతులపై ఒక సమగ్రమైన, ఉపయోగకరమైన నివేదికను ప్రచురించినాము.

ఆర్థిక సదస్సుకు సంబంధించిన పనులు రోజు రోజుకు విస్తరించడంతో సమాచారాన్ని వ్యాప్తి చేయడం, స్థానిక సంస్థలను ప్రోత్సహించడం, ప్రజలకు సహాయం చేయడం, ఆచరణాత్మక పథకాలను నిర్వహించడం, కేంద్ర, జిల్లా కమిటీల కార్యకలాపాలను సమన్వయం చేయడం.. తదితర కార్యకలాపాల్లో డిప్యూటీ కమిషనర్లు, జిల్లా కమిటీలకు సహాయం చేయడానికి ప్రతి జిల్లాకు ఒక సూపరింటెండెంట్‌ను నియమించారు. రాష్ట్రంలోని ఎనిమిది జిల్లాలకు సంబంధించిన ఆర్థిక స్థితిగతులు, అవసరాలు తదితర వివరాలతో ప్రతి జిల్లాకు ఒక ఆర్థిక నివేదిక హ్యాండ్ బుక్స్‌ను ప్రచురించాము.

ప్రతి ఏటా ఆర్థిక సదస్సు వార్షిక సమావేశాలు దీవాన్ అధ్యక్షతన క్రమం తప్పకుండా జరిగేవి. ఈ సమావేశాలలో సదస్సు పనికి సంబంధించిన అన్ని కార్యకలాపాలను సమీక్షించేవారం. మరుసటి సంవత్సరం కోసం ప్రణాళికలు రూపొందించేవారం. ఆర్థిక సదస్సు కమిటీలు తమ పరిధిలోకి వచ్చే అంశాలను పెద్ద సంఖ్యలో పరిశీలించి రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి పథకాలను రూపొందించాయి.

కమిటీలు పరిగణించిన వాటిల్లో అత్యంత ముఖ్యమైన అభివృద్ధి కార్యక్రమాల్లో.. బ్యాంక్ ఆఫ్ మైసూర్, మైసూర్ విశ్వవిద్యాలయం ఏర్పాటు కోసం ప్రతిపాదనలు, ప్రాథమిక విద్య విస్తరణ, రాష్ట్రంలో నిర్బంధ విద్య అమలు, ఇంకా కన్నడ సాహిత్య అకాడమీ సహా అనేక వ్యక్తిగత సాంస్కృతిక, పారిశ్రామిక పథకాలు. ప్రజల్లో వైజ్ఞానిక, శాస్త్రీయ దృక్పథం పెంపొందాలన్నఆశయంతో విజ్ఞానశాస్త్ర సంబందిత రచనలు, ఆధునిక ఆచరణాత్మక విలువలు కలిగిన ఇతర అంశాలపై రచనలను ప్రోత్సహించడానికి, కన్నడ భాషలో అత్యుత్తమ సాహిత్య సృష్టి జరగాలన్నదే కన్నడ సాహిత్య అకాడమీ స్థాపన ఉద్దేశం.

అక్టోబరు 1918లో ప్రతినిధుల సభలో నేను చేసిన ప్రసంగంలో పేర్కొన్నట్లు, హిస్ హైనెస్ మహారాజా వారు ఆర్థిక సదస్సును శాశ్వత ప్రాతిపదికన పని చేసే ఒక సంస్థగా నిర్వహించాలని అత్యంత ఆసక్తితో నిర్ణయించారు.

ప్రభుత్వ శాఖల పనితీరుపై సమర్థతా ఆడిట్ (Efficiency Audit):

ప్రభుత్వ శాఖలు, శాఖల్లో పని చేస్తున్న సిబ్బందిలో క్రమశిక్షణ, సమర్థత పరిరక్షణకు అవసరమైన నిరంతర చర్యలను తీసుకునే ఉద్దేశ్యంతో ‘సమర్థత ఆడిట్’ వ్యవస్థను ప్రవేశపెట్టాము. అక్టోబరు 1913లో ప్రతినిధుల సభలో నేను చేసిన ప్రసంగంలో ఆడిట్ వ్యవస్థ ఏర్పాటుకు కారణాలను ఇట్లా పేర్కొన్నాను.

యూరోప్ దేశాలలో అమల్లో ఉన్నటువంటి ప్రభుత్వ వ్యవస్థల మాదిరిగానే ప్రభుత్వ వ్యవస్థలు ఉన్న మనలాంటి దేశంలో సిబ్బంది అటువంటి పనితీరుకు ఇంకా అలవాటు పడలేదు. క్రమశిక్షణతో కూడిన అటువంటి పని పద్దతులు, బిజినెస్ రూల్స్ వారికి అవగతం కాలేదు. అందుకే వారిలో క్రమశిక్షణ, పనిలో సమర్థతను పెంపొందించడానికి ఎఫిషియెన్సీ ఆడిట్ను ప్రవేశపెట్టనున్నాము. రాష్ట్రానికి ఫైనాన్షియల్ ఆడిట్ఎంత అవసరమో ఇది కూడా అంతే అవసరం.’’

‘సమర్థత ఆడిట్ (Efficiency Audit)’ విభాగాన్ని సచివాలయానికి అనుసంధానం చేశాము. ప్రభుత్వ కార్యాలయాలు, విభాగాలలో పనిని క్రమబద్ధీకరించడంలో, శాఖల వారీగా వివిధ కార్యాలయాలకు నియమాలు, స్థిర ఆదేశాలను (Standing Orders) సంకలనం చేయడంలో, ఆఫీస్ మాన్యువల్లను శీఘ్రంగా తయారు చేసి వాటిని జారీ చేసేందుకు ఒక సమగ్ర పథకాన్ని రూపొందించడంలో ఆడిట్ విభాగం ఉపయోగకరమైన సేవలను అందించింది. అంతే కాకుండా కాలానుగుణంగా అవసరమైనప్పుడు వాటిని సవరించడం, తాజాగా ఉంచడం కోసం కూడా మాన్యువల్లో నిబంధనలు పొందుపరచినారు. ప్రభుత్వ శాఖల తనిఖీలను ప్రామాణీకరించడంలో, కార్యాలయాలలో సరైన పద్ధతిలో రికార్డులను నిర్వహించడానికి నియమాలు సిద్ధం చేయడంలో ఇది కొంత పురోగతి సాధించింది. ఏదైనా తీవ్రమైన అక్రమాలు ప్రభుత్వ దృష్టికి వచ్చినపూడూ వాటిని దర్యాప్తు చేయడానికి ఆడిట్ విభాగంలో పని చేస్తున్న అధికారులకు అదనపు బాధ్యతలను అప్పజెప్పినాము. ఎఫిషియెన్సీ ఆడిట్ విభాగం వారు త్రైమాసిక ‘బ్లూ బుక్ జర్నల్’ .. ప్రభుత్వ అధికారిక పత్రికను ప్రచురించడం ప్రారంభించింది. ఇందులో ముఖ్యమైన ప్రభుత్వ ఉత్తర్వులు, రోజువారీ విధుల నిర్వహణలో అధికారులకు ఉపయోగపడే శాఖల సాంకేతికతలపై సమాచారాన్నిఅందించడం ఈ బ్లూ బుక్ జర్నల్ ప్రచురణ ఉద్దేశం.

ఈ పని జరుగుతున్న కాలంలో H H మహారాజు ప్రభుత్వ పనితీరుపై ఆచంచలమైన విశ్వాసాన్ని ప్రకటించేవారు. అతను తన ప్రభుత్వ వ్యవహారాలలో ఏదైనా మంచి పనిని గమనించినప్పుడల్లా గొప్ప ప్రశంశలు కురిపించేవారు. 1914, జూలై 24న నాకు రాసిన వ్యక్తిగత లేఖలో అతను ఇలా రాశారు:

నేను మీతో ఒక వాస్తవం చెప్పడానికి సంకోచించడం లేదు. ఇదివరకెప్పుడూ లేని శాంతిని, ఆనందాన్ని నేను 1902 తర్వాత అనుభవించాను. గత 21 నెలలుగా, పాలనా వ్యవహారాల విషయంలో మీ సమర్థ నిర్వహణకు ధన్యవాదాలు. ఇది ఇంకా చాలా కాలం కొనసాగుతుందని నేను విశ్వసిస్తున్నాను.

***

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here