మోక్షగుండం విశ్వేశ్వరాయ స్వీయ చరిత్ర అనువాదం – అధ్యాయం-9

1
9

అధ్యాయం 9 – మైసూర్ రాష్టంలో విద్యాభివృద్ధి – మైసూర్ విశ్వవిద్యాలయం:

[dropcap]ప్ర[/dropcap]తినిధుల సభలో నేను చేసిన ప్రసంగాలలో వివరించిన ప్రభుత్వ దృక్కోణాన్ని స్థూలంగా చెప్పాలంటే.. దేశం ప్రధాన అవసరాలు మూడు ప్రధాన అంశాల క్రింద వర్గీకరించవచ్చు:

  1. ఉత్పత్తిని పెంచడం మరియు నాణ్యమైన సంపాదన, ప్రజల జీవన ప్రమాణాలను పెంచడం
  2. రాష్ట్ర జనాభాలో అన్ని తరగతులకు విద్యను అందించడం, వారి చైతన్య స్థాయిని విస్తరించడం
  3. ప్రజలకు వివిధ రంగాలలో శిక్షణ ఇవ్వడం, వారిలో స్వయంకృషి, పరస్పర సహకారం, చొరవ, వాణిజ్య నైపుణ్యాలను ప్రోత్సహించడం

1918 ఏప్రిల్ 22న ప్రజా ప్రతినిధుల సభలో నేను చెప్పినట్లు పైన పేర్కొన్న మూడు ప్రధాన అంశాలను అత్యంత శ్రద్ధతో ప్రభుత్వం గతి తప్పకుండా అమలు చేయడానికి ప్రయత్నించింది. మొత్తం మీద సంతోషకరమైన ఫలితాలను సాధించినాము.

నేను చాలా కాలంగా రెండు ముఖ్యమైన రంగాల అభివృద్ధికి కోసం తపిస్తూ ఉన్నాను. మొదటిది పరిశ్రమల స్థాపన, రెండవది విద్యా రంగ అభివృద్ధి. ఈ రెండింటిలో విద్యా రంగ అభివృద్ధికి అధిక ప్రాధాన్యత లభించింది. ప్రపంచ యుద్ధం కారణంగా పరిశ్రమల స్థాపనకు కేంద్ర ప్రభుత్వం నుండి లేదా మైసూర్‌లో వ్యాపారవేత్తల నుండి మద్దతు అవసరం అయినంత మేరకు అందలేదు. విదేశాల్లోని పెట్టుబడిదారుల నుండి కూడా సహకారం అందలేదు. వీరి మద్దతు, సహకారం లేకుండా పరిశ్రమల స్థాపన సాధ్యం కాదు.

నేను గతంలో చేసిన విదేశీ పర్యటనల సందర్భంగా పాశ్చాత్య దేశాలు విద్యకు ఇచ్చిన ప్రాముఖ్యత నన్ను ఆకట్టుకున్నది. మైసూర్‌లో అసంతృప్తికరమైన ఆర్థిక పరిస్థితికి కారణం ప్రధానంగా మనం విద్యా రంగ అభివృద్ధిని నిర్లక్ష్యం చేయడం వల్లనే అని నిర్ధారణకు వచ్చాను. పంతొమ్మిదవ శతాబ్దపు చివరి సంవత్సరాల్లో జపాన్‌లో నేను పర్యటించినప్పుడు అక్కడ ఉన్న విద్యా రంగ స్థితిగతులు నాపై లోతైన ముద్రను వేశాయి. అన్ని రంగాల పురోగతికి విద్యే ఆధారం అనే రహస్యాన్ని జపాన్ దేశ నాయకులు అవగతం చేసుకున్నారని నాకు అనిపించింది. జపనీస్ విద్యా శాఖ దృష్టిలో ఉంచుకున్న స్థిరమైన లక్ష్యం ఏమిటంటే.. యూరోపియన్ ఆలోచన విధానంతో, జపాన్ స్థానిక హృదయంతో పని విధానాలపై పజలకు శిక్షణ నెరపడం. జపాన్‌లో ఈ దిశగా మొట్టమొదట అమలు పరచిన చర్యలలో ఒకటి.. విద్యా నియమావళికి సంబంధించిన పత్రాన్నిజారీ చేయడం. దీని ఉద్దేశాలను జపాన్ దేశ చక్రవర్తి హిస్ మెజెస్టి మికాడో (His Majesty The Mikado) తన అధికారిక ఆదేశాల ద్వారా దేశ ప్రజలకు ఈ విధంగా చేరవేశారు.

జపాన్ చక్రవర్తి (1876 – 1912)

“రోజువారీ జీవితానికి అవసరమైన నైపుణ్యాల నుండి జ్ఞాన సంపన్నులైన అధికారులు, రైతులు, వ్యాపారులు, చేతివృత్తులవారు, వైద్యులు మొదలైన వారిని వారి సంబంధిత వృత్తులకు సిద్ధం చేయడానికి నిరంతరం చదువు నేర్చుకోవడం ద్వారానే పొందవచ్చు. ఇక మీదట మన దేశంలో చదువు లేని ఒక్క అజ్ఞాన గ్రామం, కుటుంబం లేదా చదువు రాని సభ్యునితో ఉన్న కుటుంబం ఉండకుండా విద్యా రంగాన్ని ప్రత్యేక శ్రద్ధతో అభివృద్ధి చేస్తాము”

1877లో ‘టోక్యో ఇంపీరియల్ విశ్వవిద్యాలయం’ స్థాపించారు. ఇంగ్లీష్ సహా అనేక విదేశీ భాషల్లో పరిజ్ఞానం సంపాదించడానికి పాఠశాలలు ప్రారంభించారు. విదేశీ వాణిజ్యం, ఇతర ఆచరణాత్మక పథకాలు నిర్వహించడానికి ఈ విదేశీ భాషలు తోడ్పాటు అందిస్తాయని వారు భావించారు.

1877 లో స్థాపించిన టోక్యో విశ్వవిద్యాలయం

విద్యా నియమావళిను తరచుగా అవసరానికి తగిన విధంగా సవరించారు. అలాంటి ఒక సవరణ జరిపినప్పుడు వారి దృష్టిలో ఉండిన సూత్రాలు ఏమిటంటే.. “విద్యార్థుల్లో నైతిక విలువలను పెంచడం, పని పట్ల విధేయతను, దేశభక్తిని పెంపొందించడం, వృత్తులలో ఆచరణాత్మక నైపుణ్యం కోసం అవసరమైన జ్ఞాన సముపార్జన”

పిల్లల్లో క్రమశిక్షణ, ఇతర ఆరోగ్యకరమైన లక్షణాలను అభివృద్ధి చేసే ఉద్దేశంతో వివిధ పాఠశాలల్లో సైనిక డ్రిల్‌ను ప్రోత్సహించారు. పిల్లలు బడిలో ఉల్లాసంగా చదువుకోవడానికి అవసరమైన సౌకర్యాలను, వాతావరణాన్ని కల్పించారు. ఉపాధ్యాయులు వారి పట్ల ప్రేమతో వ్యవహరిస్తారు. విధేయత, దేశభక్తి, మంచి ప్రవర్తన, నైతికత విలువలు, మానవ సంబంధాలు, శుభ్రత తదితర అంశాలు విద్యా బోధనలో భాగం చేశారు.

నా దృష్టిని ఆకర్షించిన అంశాలలో ఒకటి.. జపాన్ దేశం మహిళల విద్యలో సాధించిన ప్రగతి. జపాన్‌లో 1900 సంవత్సరం నాటికే పాఠశాలల్లో చదువుకుంటున్న బాలికల సంఖ్య సుమారు 1.5 మిలియన్లు ఉన్నట్టు నేను గమనించాను. భారతదేశంలో వారి సంఖ్య 4,00,000 మాత్రమే. మన దేశంలో ఉన్న అత్యధిక జనాభాకు ఇది ఏమాత్రం సరి పోయే సంఖ్య కాదు.

ఆ సమయంలో.. అంటే 1898లో నా మొదటి జపాన్ పర్యటనలో, టోక్యో, క్యోటో విశ్వవిద్యాలయంలోని ప్రొఫెసర్లు నాకు రూడీగా చెప్పిన విషయం ఏమిటంటే.. విద్యార్థులు తమ పుస్తకాలను కొనుగోలు చేయవలసిన అవసరం లేదు. ఎక్కువ మంది విద్యార్థులకు పుస్తకాల కొనుగోలు ఖర్చును భరించే ఆర్థిక స్తోమత లేదు. ప్రొఫెసర్లు విద్యార్థులకు నోట్స్ ఇస్తారు, తరువాత లైబ్రరీలోని పుస్తకాల నుండి కూడా విద్యార్థులు సమాచారాన్ని సమీకరించుకుంటారు. విశ్వవిద్యాలయాలలో ఇచ్చే శిక్షణ చాలా ఆచరణాత్మకమైనది. నైపుణ్యాలను పెంపొందించే విధంగా పాఠ్య ప్రణాళికలు రూపొందించారు. అందుకే విశ్వవిద్యాలయంలో చదువులు పూర్తి చేసుకున్న విద్యార్థులకు ఉద్యోగ ఉపాధి అవకాశాల్లో చాలా డిమాండ్ ఉందని నేను గమనించాను. వారు విశ్వవిద్యాలయ కోర్సుల్లో ఉత్తీర్ణత సాధించిన వెంటనే వారి కోసం ప్రైవేట్ లేదా ప్రభుత్వ నియామకాలు వేచి ఉంటాయి.

జపాన్ లోని విశ్వ విద్యాలయాల ప్రొఫెసర్లు అతి సాధారణ జీవితాలను గడుపుతారు. దేశ ఉన్నతి కోసం దేశభక్తితో శ్రమిస్తారు. వారు కలిగి ఉన్న ఉన్నతమైన అర్హతలు వారికి ప్రభుత్వం నుండి పొందుతున్నదాని కంటే ప్రైవేట్ ఉద్యోగంలో చాలా ఎక్కువ సంపాదించే అవకాశాలు ఉన్నప్పటికీ ప్రభుత్వ ఉద్యోగాలనే ఎంచుకున్నారు. ఇది వారి ఉన్నతమైన ఆలోచన, సాదాసీదా జీవనానికి నిదర్శనం. ఇంటి వెలుపల వారి పని, ధరించే దుస్తులు ఆధునిక యూరోపియన్ పద్దతుల్లో ఉంటాయి. గృహ, వ్యక్తిగత జీవితంలో అన్నిటిలోనూ వారు జపనీయులు గానే జీవిస్తారు. వారు అనుసరించే అలవాట్లు చాలా సందర్భాలలో సాంప్రదాయికంగానే ఉంటాయి.

1913 జూలై 11 న మైసూర్ ఆర్థిక సదస్సుకు ముందు నా ప్రసంగంలో ఆ కాలంలో మైసూర్‌లో విద్యా రంగ పరిస్థితులకు సంబంధించి నేను ఈ క్రింది పరిశీలనలు చేసాను

మొదట విద్యా రంగాన్ని తీసుకుంటే.. మైసూర్లోని 57 లక్షల మందిలో కేవలం మూడున్నర లక్షల మంది మాత్రమే చదవగలరు, రాయగలరు. అంటే ప్రతి 100 మందికి కేవలం ఆరుగురు వ్యక్తులు మాత్రమే అక్షరాస్యులు. అభివృద్ధి చెందిన దేశాలలో సంబంధిత నిష్పత్తి చూస్తే.. ప్రతి 100 మందిలో 85 – 95 మంది అక్షరాస్యులు.”

“అమెరికా సంయుక్త రాష్ట్రాలలో విద్యపై జనాభాలో తలకు సుమారు రూ. 14 ఖర్చు చేస్తారు. అదే మైసూర్ రాష్ట్రంలో చేసే ఖర్చు తలకు ఆరు అణాల కంటే తక్కువ.”

“ఇకపోతే.. అత్యంత ప్రగతిశీల దేశాలలో మొత్తం జనాభాలో దాదాపు ప్రతీ ఐదుగురిలో ఒకరు పాఠశాలలో చదువుకుంటున్నారు. మైసూర్ రాష్ట్రంలో ప్రతీ యాభై మందిలో ఒకరు మాత్రమే చదువుకుంటున్నారు.”

“మన రాష్ట్రంలో దాదాపు ఆరు మిలియన్ల జనాభా ఉన్నప్పటికీ ఒక్క విశ్వవిద్యాలయం కూడా లేదు. మైసూర్ కంటే దాదాపు 25 శాతం మాత్రమే ఎక్కువ జనాభా ఉన్న కెనడాలో 20 విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. 45 మిలియన్ల జనాభా ఉన్న యునైటెడ్ కింగ్‌డమ్‌లో 20 విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. 65 మిలియన్ల జనాభా ఉన్న జర్మనీలో 21 విశ్వవిద్యాలయాలు ఉన్నాయి.”

గతంలో, ప్రతి దేశంలో జనాభాలో 5 నుండి 10 శాతం మాత్రమే సాధారణ విద్యను పొందేవారు. అప్పుడు వ్యవసాయం, పరిశ్రమలు లేదా ఇతర శారీరక శ్రమల్లో నిమగ్నమై ఉన్న వ్యక్తులకు ఎలాంటి విద్యాపరమైన శిక్షణ ఇవ్వాల్సిన అవసరం లేదని భావించారు. కానీ శారీరక శ్రమల మీద ఆధారపడిన అన్నిరకాల వృత్తులు, పరిశ్రమల్లో పని చేసే కార్మికులకు విద్య చాలా ప్రయోజనకరంగా ఉంటుందని నాగరిక దేశాలకు ఇప్పుడు బాగా అవగతం అయ్యింది. ఉన్నత ప్రమాణాలు కలిగిన విద్యను, విజ్ఞాన శాస్త్రాలను ఎంత ఎక్కువగా వీటికి వర్తింపజేస్తే అంత ఎక్కువగా సంపదను ఉత్పత్తి చేయడానికి వీలు అవుతుందన్న వాస్తవాన్ని వారు గ్రహించారు.

ప్రాథమిక విద్య:

ప్రాథమిక విద్యాభివృద్ధిలో భాగంగా ప్రభుత్వ, పాఠశాలల సంఖ్యను పెంచడానికి జోరుగా ప్రయత్నాలు కొనసాగినాయి. కొత్త ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలను ప్రారంభించాము. పాఠశాల భవనాల నిర్మాణాలను ప్రోత్సహించడానికి గ్రాంట్లు, సబ్సిడీల వ్యవస్థను ప్రవేశపెట్టాము. దీంతో గ్రామీణ ప్రజల్లో కొంత ఉత్సాహం నెలకొంది. ఒకసారి నేను బెల్దార అనే గ్రామం పక్క నుండి ప్రధాన రహదారిపై వెళుతుండగా, ఆ గ్రామ ప్రజలు తమ పాఠశాల భవనానికి అయ్యే ఖర్చు కోసం వారు సమీకరించిన సొమ్ముతో నిండిన రూపాయల సంచిని నా కారులో విసిరి.. “భవన నిర్మాణానికి మా వాటా సిద్ధంగా ఉన్నప్పటికీ ప్రభుత్వ శాఖ వారు పాఠశాల భవనాన్ని మంజూరు చేయడం ఆలస్యం చేస్తున్నారు” అని వారు నాతో ఫిర్యాదు చేశారు.

వెనుకబడిన తరగతులు, అణగారిన వర్గాల (ఇప్పుడు హరిజనులుగా పిలుస్తున్నారు) వారి విద్యకు ప్రత్యేక నిధులు మంజూరు చేశాము. రాబోయే ఐదు సంవత్సరాలలో పాఠశాలకు వెళ్లేవారి జనాభాను రెట్టింపు చేయాలనే లక్ష్యంతో మా ప్రయత్నాలు మొదలైనాయి.

రాష్ట్రంలో ప్రాథమిక విద్యను నిర్బంధం చేస్తూ ఒక చట్టం ఆమోదించాము. ఇది మొదటగా ఎంచుకున్న ప్రాంతాలలో ప్రవేశపెట్టి, సమయం గడిచేకొద్దీ ఇతర ప్రాంతాలకు విస్తరిస్తూ పోయాము. జూన్ 1918 లో ఇది 68 కేంద్రాలలో క్రియాశీలంగా ఉంది. నిర్బంధ ప్రాథమిక విద్య అమలును మరో 170 కేంద్రాలకు విస్తరించడానికి ముందస్తు చర్యలు పూర్తయ్యాయి.

పైన వివరించిన చర్యలు, ఇతర చర్యల ఫలితంగా రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల సంఖ్య పరిగింది. 1911-12లో ఆ సంఖ్య 4,568 ఉంటే 1917-18 నాటికి అది 11,294 కు పెరిగింది. పాఠశాలలకు వెళ్లే పిల్లల సంఖ్య కూడా అదే కాలంలో 1910-11 లో 1,38,153 నుండి 1917-18లో 3,66,856 వరకు పెరిగింది. పెరుగుదల దాదాపు 2.6 రెట్లు.

రాష్ట్రంలో బాలికల విద్యపై కూడా ప్రత్యేక శ్రద్ధ కనబరిచాము. బాలికలు బడికి పోవడాన్ని ప్రోత్సహించాము. 1912-13 లో పాఠశాలకు వెళ్లే వయస్సులో ఉన్న బాలికల జనాభా 6.4 శాతం నుండి 1917-18 లో 14.2 శాతానికి పెరిగింది.

బాలికల కోసం అదనంగా ప్రాథమిక, మాధ్యమిక పాఠశాలలు కూడా ప్రారంభించాము. 1917లో మైసూర్ లోని మహారాణి కళాశాలలో బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ కోర్సులను ప్రారంభించి ఫస్ట్ గ్రేడ్ కాలేజీగా స్థాయిని పెంచాము. 1914లో మైసూర్‌లో మహిళా విద్యార్థుల కోసం మొట్టమొదటి హాస్టల్‌ను ప్రారంభించాము.

ఇంజనీరింగ్ & సాంకేతిక విద్య:

1913లో బెంగళూరులో ఒక వ్యవసాయ పాఠశాలను ప్రారంభించాము. పాఠశాలలో కోర్సులు ఆచరణాత్మకంగా ఉండేలా సాధ్యం అయినన్ని జాగ్రత్తలు తీసుకున్నాము. చిన్న రైతులకు ప్రయోజనం కోసం కన్నడ భాషలో స్వల్పకాల కోర్సుల సదుపాయం కూడా ఈ కాలేజీలో కల్పించాము.

బెంగళూరులో ఒక మెకానికల్ ఇంజనీరింగ్ స్కూల్, ఒక కామర్స్ స్కూల్ స్థాపించాము. ఈ ఇంజనీరింగ్ స్కూల్, మైసూర్‌లో ఉన్న పారిశ్రామిక శిక్షణా పాఠశాలను కలిపి ‘చామరాజేంద్ర టెక్నికల్ ఇన్‌స్టిట్యూట్‌’ పేరిట ఒక ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేశాము. మైసూర్ నగరంలో ఒక విశాలమైన భవనాన్ని ఈ సంస్థ కోసం ప్రత్యేకంగా నిర్మించాము. ఈ కొత్త ఇన్‌స్టిట్యూట్‌లో వాణిజ్యపరమైన కోర్సులు కూడా ప్రవేశ పెట్టాము.

1913 లో నిర్మించిన చామ రాజేంద్ర సాంకేతిక కళాశాల, మైసూర్

బెంగుళూరులోని కామర్స్ స్కూల్‌లో ఇంగ్లీష్, కన్నడ భాషల్లో కమర్షియల్ సబ్జెక్టులలో ఒక సంవత్సరం కాలపరిమితి కలిగిన ప్రాథమిక కోర్సును, రెండేళ్ల కాలపరిమితితో ఇంగ్లీష్‌లో మాధ్యమిక కోర్సును ప్రవేశపెట్టాము. చిన్నవ్యాపారులు, దుకాణదారుల కోసం కన్నడలో ప్రాథమిక ఖాతా నిర్వహణ, బ్యాంకింగ్, వాణిజ్య భౌగోళిక శాస్త్రం.. విషయాల్లో ప్రత్యేక కోర్సులు కూడా ప్రవేశపెట్టాము.

అన్ని జిల్లా కేంద్రాల్లో పారిశ్రామిక శిక్షణా పాఠశాలలు ప్రారంభించాము. కొన్ని ఉన్నత పాఠశాలల్లో వాణిజ్య తరగతులు కూడా ప్రారంభించాము.

సాంకేతిక విద్యలో మరొక అభివృద్ధికర విశేషం ఏమిటంటే.. బెంగళూరులో పూర్తి స్థాయి ఆధునిక ఇంజినీరింగ్ కళాశాల స్థాపన. మద్రాస్, పూనా నగరాల్లో ఉన్న ఇంజనీరింగ్ కళాశాలల్లో మైసూర్ రాష్ట్రం నుంచి సంవత్సరానికి ఐదుగురు కంటే ఎక్కువ మంది విద్యార్థులను చేర్చుకునేవారు కాదు. అంతకంటే ఎక్కువ మంది విద్యార్థులను చేర్చుకోవడానికి మద్రాసు, భారత ప్రభుత్వం రెండింటిలోని బాధ్యులైన అధికారులు వ్యతిరేకించినందున, రాష్ట్ర అవసరాలకు ఈ సంఖ్య అసలే సరిపోదని భావించి మేము రాష్ట్రంలో ఒక ఇంజనీరింగ్ కళాశాల స్థాపనకు నిర్ణయించాము.

1917 లో బెంగళూరులో స్థాపించిన ఇంజనీరింగ్ కాలేజీ

పెద్ద సంఖ్యలో విదేశీ స్కాలర్ షిప్‌లు మంజూరయ్యాయి. విద్యార్థులు విదేశాలకు వెళ్ళి ఉన్నత విద్యలో మరింత ప్రావీణ్యం సంపాదించడానికి ఈ ఉపకార వేతనాలు దోహదం చేసినాయి.

మైసూర్ విశ్వవిద్యాలయం స్థాపన:

నేను దివాన్‌గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి విశ్వవిద్యాలయం స్థాపన అంశం ప్రభుత్వం దృష్టిలో ఉంటూనే ఉన్నది.

విశ్వవిద్యాలయం స్థాపన విషయమై అధ్యయనం కోసం ప్రభుత్వం ఇద్దరు విద్యాశాఖాధికారులను ప్రత్యేకంగా నియమించింది. వారిలో ప్రస్తుత ప్రొ – ఛాన్సలర్ డాక్టర్ సి.ఆర్.రెడ్డి (కట్టమంచి రామలింగా రెడ్డి) ఒకరు, శ్రీ థామస్ డెన్హామ్ మరొకరు. వారు ఒకరి తర్వాత మరొకరు ఇంగ్లండ్, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా దేశాలను సందర్శించి అక్కడ విశ్వవిద్యాలయాల స్థితిగతులు, నిర్వహణ, కోర్సులు, పాఠ్య ప్రణాళికలు తదితర అంశాలను అధ్యయనం చేసి ఉపయోగకరమైన నివేదికలను రూపొందించి ప్రభుత్వానికి సమర్పించారు. ఆ నివేదికలను అభిప్రాయాలు, సూచనల కోసం ప్రజల ముందు ఉంచాము.

మైసూర్ విశ్వవిద్యాలయం ప్రొ ఛాన్సలర్ సి ఆర్ రెడ్డి (కట్టమంచి రామలింగా రెడ్డి)
విద్యావేత్త థామస్ డెన్హామ్

ప్రభుత్వ సభ్యులు, రాష్ట్రంలోని ప్రముఖ విద్యాధికారులు, జూలై 1914లో విశ్వవిద్యాలయ స్థాపనకు సంబంధించిన వివిధ అంశాలపై విచారణను ప్రారంభించారు. వరుస సమావేశాలు దాదాపు ఆరు నెలల పాటు కొనసాగాయి. కమిటీ ముసాయిదా ప్రతిపాదనలు తయారు చేసింది. వాటిని జూలై 1915లో సంక్షిప్త మెమోరాండం రూపంలో భారత ప్రభుత్వం ముందు ఉంచాము. భారత ప్రభుత్వ రాజకీయ, విద్యాధికారులు ఈ ప్రతిపాదనల పట్ల ఆసక్తి కనబరిచారు. వాటిని మైసూర్‌లో అప్పటి బ్రిటిష్ రెసిడెంట్ సర్ హ్యూ డాలీతో చర్చించారు. ఆ తర్వాత నాతో కూడా చర్చించారు. ఈ సమావేశాలు ముగిసిన కొద్ది రోజులకే, మా ప్రతిపాదనను సమీక్షిస్తూ, అనేక మార్పులను సూచిస్తూ భారత ప్రభుత్వంలో విద్యా కమిషనర్ గౌరవనీయులు శ్రీ హెన్రీ షార్ప్ గారు మైసూర్ ప్రభుత్వానికి ఒక ముఖ్యమైన నోట్‌ను పంపిచారు.

సర్ హెన్రీ షార్ప్, విద్యా కమిషనర్

విద్యా కమిషనర్ పంపిన సూచనలను ప్రభుత్వం పూర్తిగా సద్వినియోగం చేసుకొని ఆయన సూచనల మేరకు ప్రతిపాదనలను సవరించింది. సవరించిన ప్రతిపాదనలను ఫిబ్రవరి 1916లో భారత ప్రభుత్వ పరిశీలనకు సమర్పించాము.

ఆ తర్వాత అదే నెలలో, బ్రిటిష్ రెసిడెంట్ సర్ హ్యూ డాలీ, నేను భారత ప్రభుత్వ విద్యాధికారులను కలుసుకుని, వారితో చర్చించే అవకాశం కలిగింది. వారు మా ప్రతిపాదనల పట్ల స్నేహపూర్వకంగా స్పందించారు. మా ప్రతిపాదనలను వారు సానుకూలంగా పరిశీలించారు.

విద్యా సంవత్సరం సాధారణంగా జూలై 1 వ తేదీన ప్రారంభమౌతున్నందున, హిజ్ హైనెస్ మహారాజా వారి ప్రభుత్వం కొత్త విశ్వవిద్యాలయం పనులు వెంటనే ప్రారంభించాలని ఆరాటపడింది. అలా చేయకుంటే మరో ఏడాది పూర్తిగా నష్టపోయేది. అందువల్ల, జూలై 1 నుండి విశ్వవిద్యాలయాన్ని ప్రారంభించడానికి మాకు అనుమతి ఇవ్వాలని మార్చి1916 లో భారత ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసాము. మద్రాసు విశ్వవిద్యాలయంతో ఈ విషయంలో మా భవిష్యత్తు సంబంధాల సర్దుబాటుకు సంబంధించి కొన్ని షరతులకు లోబడి మైసూర్‌లో విశ్వవిద్యాలయం ప్రారంభించడానికి భారత ప్రభుత్వం అనుమతి పత్రాన్ని జారీ చేసింది. అప్పటి వరకు మైసూర్ లోని విద్యాసంస్థలు మద్రాసు విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉంటూ గ్రాడ్యుయేషన్ కోసం విద్యార్థులకు శిక్షణ ఇచ్చాయి.

తదనంతరం మద్రాసు విశ్వవిద్యాలయం ఛాన్సలర్ లార్డ్ యాంప్థిల్ (Lord Ampthil) సౌజన్యంతో, జూన్ 1916లో మద్రాసు విశ్వవిద్యాలయం సిండికేట్ సభ్యులు, గౌరవనీయులైన మైసూర్ రెసిడెంట్, నేను అభిప్రాయాలను పంచుకోవడం కోసం ఊటాకామండ్ (ఊటి) లో ఒక సమావేశం జరిగింది.

లార్డ్ యాంప్థిల్, మద్రాసు విశ్వ విద్యాలయం ఛాన్సలర్

మద్రాసు విశ్వవిద్యాలయం సిండికేట్ ప్రతినిధులు మైసూర్‌లో ప్రత్యేక విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయడాన్ని వ్యతిరేకించారు. ఎదిగిన కుమార్తె సొంత ఇల్లు ఏర్పాటు చేసుకోవాలనుకునే ప్రయత్నాలను తల్లి స్వాగతించాలని మేము వేడుకున్నప్పుడు.. పారిపోయిన కుమార్తెను ప్రోత్సహించడానికి మా పక్షాన ఏ బాధ్యత ఉండదని పెడసరంగా జవాబు ఇచ్చారు. చివరికి మా మధ్య విభేదాలు సున్నితంగా సర్దుబాటు అయినాయి. మేము మొదట నిర్ణయించినట్టుగా మైసూర్ రాష్ట్రంలో కొత్త విశ్వవిద్యాలయం 1916 జూలై 1 నుండి పని చేయడం ప్రారంభించింది.

1916 లో స్థాపించిన మైసూర్ విశ్వవిద్యాలయం

రాష్ట్ర రాజధాని మైసూర్ నగరంలోనే విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించాము. దీని కోసం మైసూర్ నగరంలో ఒక అనుకూలమైన స్థలాన్ని ఎంపిక చేశాము. అదే సమయంలో లెజిస్లేటివ్ కౌన్సిల్ ఆమోదం కోసం ‘యూనివర్సిటీ బిల్లును’ ప్రవేశపట్టినప్పుడు నేను నా ప్రసంగంలో ఇలా వ్యాఖ్యానించాను:

నాకు గతంలో ఇంగ్లండ్, యూరప్ ఖండంలో, అలాగే అమెరికా, కెనడాలో అనేక విశ్వవిద్యాలయాలను సందర్శించే అవకాశం కలిగింది. నా పరిశీలన ప్రకారం వాటిలో ఎక్కువ భాగం జనావాస ప్రాంతాల్లోనే ఉన్నాయి. విద్యార్థులను సమాజం నుంచి వేరు చేసి వారిని ఒంటరి జీవితాన్ని గడపడాన్ని అనుమతించడంపై నమ్మకం లేదు. వారు సమాజం నుంచి దూరంగా ఉండి విశ్వవిద్యాలయం నుంచి ఈ కఠినమైన వాస్తవ ప్రపంచంలోకి తిరిగి వచ్చినప్పుడు వారు అనేక ప్రతికూలతలను ఎదుర్కొంటారు. విశ్వవిద్యాలయం లక్ష్యం.. విద్యార్థులు తరువాత నిత్య జీవితంలో ఎదుర్కొనే పరిస్థితులకు పూర్తిగా భిన్నంగా లేని పరిస్థితుల లోనే వారి వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దడం.

దేశం స్థితిగతులని, నాగరికతను, దాని భౌతిక ప్రయోజనాలను బట్టి విశ్వవిద్యాలయం కొన్ని సాధారణ లక్ష్యాలు, మరికొన్నినిర్దిష్ట లక్ష్యాలను కలిగి ఉంటుందని నేను అన్నాను. విస్తృత కోణంలో సాధారణ లక్ష్యం ఏమిటంటే.. యువతలో విజ్ఞాన సముపార్జనను ప్రోత్సహించడం, రాష్ట్రంలో ఉన్నత విద్యా వ్యాప్తిని ప్రోత్సహించడం, రాష్ట్రంలో ఒక గొప్ప సాంస్కృతిక కేంద్రాన్ని సృష్టించడం, దేశంలోని మారుమూల ప్రాంతాల్లో నెలకొని ఉన్న అజ్ఞానపు చీకటిని తొలగించే జ్యోతిని వెలిగించడం. మైసూర్ విశ్వవిద్యాలయం నిర్దిష్ట లక్ష్యాలు.. మన పౌరుల మేధో సామర్థ్యాన్ని, కార్యనిర్వాహక శక్తిని అభివృద్ధి చేయడం, ఈ దేశ ఉజ్జ్వల భవిష్యత్ కోసం నిపుణులైన తయారీదారులు, వ్యాపారవేత్తలు, ఆర్థికవేత్తలు, న్యాయవాదులు, శానిటరీ నిపుణులు, ఇంజనీర్లు, రాజనీతిజ్ఞులు మొదలైన వారిని తయారు చేయడానికి అవసరమైన శిక్షణను ఇవ్వడం.

విశ్వవిద్యాలయం, పైన పేర్కొన్న విధంగా, 1916 జూలై 1 నుండి పని చేయడం ప్రారంభించింది. పట్టాలను ప్రదానం చేయడానికి మొదటి స్నాతకోత్సవం 1918 అక్టోబర్ 19న మైసూర్‌లో జరిగింది. విశ్వవిద్యాలయం ఛాన్సలర్‌గా H H మహారాజా వారు అధ్యక్షత వహించినారు. కలకత్తాకు చెందిన ప్రముఖ విద్యావేత్త, పండితుడు సర్ అశుతోష్ ముఖర్జీ స్నాతకోత్సవ ప్రసంగాన్ని చేశారు.

సర్ అశుతోష్ ముఖర్జీ

ఈ సందర్భంగా తన ప్రసంగంలో, H H మహారాజు గారు విశ్వవిద్యాలయం స్థాపనకు ముందు ఉన్న పరిస్థితులను, విశ్వవిద్యాలయం స్థాపన కోసం తన ప్రభుత్వం తరపున జరిగిన కృషిని ఈ క్రింది విధంగా ప్రస్తావించారు:

ఇది ప్రధానంగా అతని దేశభక్తి, అతని ఉత్సాహం, అతని రాజీ లేని వాదనా పటిమ వల్లనే సాధ్యం అయ్యింది. రాష్ట్రంలో విశ్వవిద్యాలయం స్థాపన ఒకప్పుడు మన కల. నా జీవిత కాలంలో ఈ కల సాకారం అవుతుందా అనుకున్నాను. ఇప్పుడు విశ్వవిద్యాలయం మన కళ్ల ముందు సాక్షాత్కారం అయ్యింది. నా కల, మనందరి కల నిజమయ్యింది. అతని పేరు చిరస్థాయిగా నిలబడిపోతుంది. ఈ గొప్ప కృషిలో ఇతరులెవరికన్నా మన విశ్వవిద్యాలయం అతనికి రుణపడి ఉంటుంది.

ఆ రోజుల్లో భారతదేశంలోని ఏ రాష్ట్రానికీ విశ్వవిద్యాలయం లేదు. ఆ దిశలో మాదే మొదటి ప్రయత్నం. ఆ కాలంలో దేశంలో నెలకొని ఉన్న పరిస్థితుల్లో మా ప్రయత్నం సాకారం కాగలదని ఎవరూ నమ్మలేదు. సంతోషకరంగా, H H మహారాజా వారి తిరుగులేని మద్దతు, వైస్ రాయ్ లార్డ్ హార్డింగ్ ఆధ్వర్యంలోని విజ్ఞత కలిగిన భారత ప్రభుత్వ విద్యా విధానం వలన మైసూర్‌లో విశ్వవిద్యాలయం స్థాపన అన్న మా ఆలోచన వాస్తవ రూపం దాల్చింది.

***

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here