మోక్షగుండం విశ్వేశ్వరాయ స్వీయ చరిత్ర అనువాదం – పరిచయం

0
17

ఇంజనీర్ దార్శనికుడు మోక్షగుండం విశ్వేశ్వరాయ స్వీయ చరిత్ర Memoirs of My Working Life అనువాదం:

15 సెప్టెంబర్ మోక్షగుండం విశ్వేశ్వరాయ జన్మదినం. ఈ తేదీని దేశవ్యాప్తంగా ‘ఇంజనీర్స్ డే’గా జరుపుకుంటారు. భారత రత్న పురస్కారం పొందిన మొట్ట మొదటి ఇంజనీర్ ఆయన. భారత రత్న పురస్కారం పొందిన రెండవ ఇంజనీర్ ఎ.పి.జె. అబ్దుల్ కలాం. మోక్షగుండం గారు సివిల్ ఇంజనీర్ అయితే అబ్దుల్ కలాం గారు ఏరోనాటికల్ ఇంజనీర్. విశ్వేశ్వరాయ గారికి భారత రత్న పురస్కారం 1955లో ప్రదానం చేసింది భారత ప్రభుత్వం. 42 సంవత్సరాల తర్వాత 1997లో ఇంజనీర్ అబ్దుల్ కలాం గారు భారత రత్న పురస్కారం పొందినారు. విశ్వేశ్వరాయ నీతి నిజాయితీల గురించి గురించి ఒక కథ ఈ రోజున ప్రస్తావించుకోవలసిన అవసరం ఉన్నది.

యువ ఇంజనీర్ మోక్షగుండం విశ్వేశ్వరాయ

నీతి, నిజాయితీకి నిలువెత్తు ప్రతిరూపం:

చీఫ్ ఇంజనీర్‌గా పదవీ విరమణ తర్వాత ఆయనను మైసూర్ సంస్థానానికి దీవాన్‌గా రమ్మని మైసూర్ రాజు ఆహ్వానం పంపాడు. దీవాన్ అంటే ప్రధానమంత్రి స్థాయి. ఆ పదవిని స్వీకరించే ముందు ఆయన తన బంధువులు, స్నేహితులు, సన్నిహితులు అందరినీ పిలచి “మైసూర్ రాజా వారు దీవాన్ పదవిని స్వీకరించమని ఆహ్వానం పంపారు. స్వీకరించాలా వద్దా అన్న విషయంలో సలహా కోసం మీ అందరినీ పిలిచాను” అన్నాడు. అందరూ ముక్త కంఠంతో స్వీకరించాలి అని చెప్పారు. “దీవాన్‌గా నేను ఎటువంటి పక్షపాతం లేకుండా ప్రజలకు సేవలు అందించాలి. అటువంటి దీవాన్ పదవిని స్వీకరించాలంటే మీరు నాకు ఒక హామీ ఇవ్వాలి.. ఈ పని చేసి పెట్టమని, ఆ పని చేసి పెట్టమని, ఉద్యోగాలు ఇప్పించమని, కాంట్రాక్టులు ఇప్పించమని నా వద్ద పైరవీలు చేయమని హామీ ఇస్తే తప్ప నేను ఆ పదవిని స్వీకరించలేను.” అన్నాడు. వారి వద్ద పైరవీలు చెయ్యమని హామీ తీసుకొని మైసూర్ దీవాన్ పదవిని అంగీకరించాడు మోక్షగుండం. ఇది ఆయన నిజాయితీకి అద్దం పట్టే సంఘటన. ఆయన తన వ్యక్తిగత పనుల కోసం ప్రభుత్వం కల్పించిన ఏ సౌకర్యాలను వాడే వాడు కాదట. ఒకసారి క్యాంప్‌లో ఉన్నప్పుడు ప్రభుత్వ పని ముగిసిన తర్వాత తన రాత పని కోసం వినియోగించే కొవ్వొత్తిని కూడా ఆయన స్వంత డబ్బుతో తెప్పించుకున్నాడట.

దీవాన్ గా విశ్వేశ్వరాయ:

ఇక.. దీవాన్‌గా మైసూర్ సంస్థాన అభివృద్ధికి విశ్వేశ్వరాయ అమలు చేసిన ప్రణాళికలు ఎన్నో. ఆయన దీవాన్‌గా ఉన్న కాలంలో మైసూర్ సంస్థానం అభివృద్ధి పథంలో దూసుకు పోయింది. అందుకే ఆయనను ఆధునిక మైసూర్ రూపశిల్పిగా భావిస్తారు. అందుకు మైసూర్ రాజూ కృష్ణరాజ వొడయార్ వారు ఆయనకు అన్నీ విధాలా సహకరించాడు. విశ్వేశ్వరాయ స్వయానా దార్శనికుడు, ఆర్థికవేత్త కావడంతో వ్యవసాయాభివృద్ధికి, పారిశ్రామికాభివృద్ధికి, విద్యాభివృద్ధికి మైసూర్ సంస్థానంలో అనేక పథకాలు రూపొందించి అమలు చేసినాడు. మైసూర్ సంస్థానంలో వ్యవసాయాభివృద్దికి కావేరీ నదిపై ఆయన నిర్మించిన కృష్ణరాజ సాగర్ ప్రాజెక్టును ప్రతిపాదించి స్వీయ పర్యవేక్షణలో పూర్తి చేయించినాడు. ఈ ప్రాజెక్టు నిర్మాణం దేశంలో అనేక భారీ ప్రాజెక్టుల రూపకల్పనకు దోహదం చేసింది. ఈ డ్యాం కింద ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన బృందావన్ గార్డెన్స్ కూడా ఏర్పాటు అయ్యింది. మైసూర్ సంస్థానంలో ఈ ప్రదేశం ఒక టూరిస్ట్ డెస్టినేషన్‌గా మారింది. సినిమా షూటింగ్‌లు విస్తృతంగా జరిగాయి. ఇప్పటికీ జరుగుతున్నాయి. పారిశ్రామికాభివృద్ధిలో భాగంగా ఆయన మైసూర్ సోప్ ఫ్యాక్టరీ స్థాపించి మైసూర్ సాండల్ సబ్బుల ఉత్పత్తి ప్రారంభించారు. కర్ణాటక అడవులలో చందనపు వృక్షాలు విపరీతంగా పెరుగుతాయి. ఆ వృక్ష సంపద ఆధారంగా సబ్బులతో పాటు అనేక చందనపు ఉత్పత్తులను కూడా ప్రోత్సహించాడు. ఇన్నేళ్ల తర్వాత కూడా మైసూర్ సాండల్ సబ్బులు విదేశీ సబ్బుల పోటీని తట్టుకొని అత్యధిక ప్రజాదరణ పొందిన సబ్బులుగా నిలచి ఉన్నాయి. మైసూర్ ఐరన్ అండ్ స్టీల్ వర్క్స్ పేరిట ఆయన స్థాపించిన స్టీల్ ఫ్యాక్టరీ తర్వాతి కాలంలో స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా వారిచే విశ్వేశ్వరాయ ఐరన్ అండ్ స్టీల్ లిమిటెడ్‌గా మారి వేలాది మందికి ఉపాధి అవకాశాలను కల్పించింది. మైసూర్ చక్కెర ఫ్యాక్టరీ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్, మైసూర్ ఛాంబర్ ఆఫ్ కామర్స్‌లు కూడా మోక్షగుండం వారు స్థాపించినవే. మైసూర్ సంస్థానంలో విద్యాభివృద్ధికి ఆయన చేసిన దోహదం వెలకట్టలేనిది. మైసూర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం, బెంగళూర్‌లో ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల, పాలిటెక్నిక్ కాలేజీ తదితర విద్యా సంస్థలను ప్రారంభించాడు.

మోక్షగుండం రచనలు:

విశ్వేశ్వరాయ దార్శనికతకు ఆయన రచించిన గ్రంథాలే నిదర్శనంగా నిలుస్తాయి.

ఆయన రచించిన గ్రంథాల వివరాలు:

  1. Reconstructing India (1920)
  2. Rural Industrialization in India (1931)
  3. Unemployment in India – Its causes and Cures (19342)
  4. Planned Economy of India (1934)
  5. Nation Building: A Five Year Plan for the Provinces (1937)
  6. District Development Scheme (1939)
  7. Prosperity through Industries (1942)
  8. Village Industrialization (1942)
  9. Memoirs of my working life (1954)

ఈ రచనలతో స్వాతంత్య్రానికి పూర్వమే ఆయన దేశవ్యాప్తంగా దార్శనికుడిగా గుర్తింపు పొందిన కారణంగా 1938లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ జవహర్ లాల్ నెహ్రూ అధ్యక్షతన ఏర్పాటు చేసిన ‘నేషనల్ ప్లానింగ్ కమిటీ’లో సభ్యుడిగా ఎంపిక అయినాడు. నిజానికి ఆ కమిటీకి విశ్వేశ్వరాయనే అధ్యక్షుడిగా ఎంపిక చేయాలని మొదట అనుకొన్నారట. కానీ ఒక రాజకీయ పరపతి, మేధోపరమైన గుర్తింపు ఉన్న వ్యక్తిని అధ్యక్షుడుగా చేస్తే వారు తయారు చేసిన నివేదికకు ఒక విలువ, గౌరవం పెరుగుతుందని భావించి నెహ్రూనే అధ్యక్షుడిగా నిర్ణయించారు. నెహ్రూకి మోక్షగుండం అంటే అపారమైన గౌరవం. ఆయన ప్రధాన మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత 1954లో భారత రత్న పురస్కారాలు ఇవ్వడం ప్రారంభమయ్యింది. రెండో సంవత్సరమే అంటే 1955 లోనే నెహ్రూ విశ్వేశ్వరాయను భారత రత్న పురస్కారానికి ఎంపిక చేసినాడు. మోక్షగుండం రాసిన లేఖలకు ప్రధానమంత్రికి నెహ్రూ వ్యక్తిగతంగా స్పందించేవారు. నెహ్రూ విధానాలను ఎంత నిష్కర్షగా విమర్శించినా విశ్వేశ్వరాయపై నెహ్రూకి ఉన్న గౌరవం ఏ మాత్రం తగ్గలేదు. ఆయన సలహాలు సూచనలు చాలా మట్టుకు అమలు పరచేవాడు. వీలు కాకపోతే అదే విషయాన్ని ఉత్తరాల్లో వినయంగా వివరిస్తూ రాసేవాడు.

ఎం.వి., కుటుంబ సభ్యులతో ప్రధాన మంత్రి జవహర్ లాల్ నెహ్రూ

సివిల్ ఇంజనీర్‌గా దేశ వ్యాప్తంగా హైదరాబాద్ సహా అనేక రాష్ట్రాలకు ఆయన చేసిన సేవలు ఇప్పటికే విస్తృతంగా చర్చకు వచ్చాయి. ఈ సంగతులననే ఆయన జీవిత చరిత్రల్లో రచయితలు వర్ణించి ఉన్నారు. భారత రత్న పురస్కారానికి ముందు అనేక పురస్కారాలు, అవార్డులు, అనేక విశ్వ విద్యాలయాల గౌరవ డాక్టరేట్ పట్టాలు ఆయనను వరించాయి. విశ్వేశ్వరాయ నూరవ జన్మ దినం సందర్భంగా భారత ప్రభుత్వం ఆయన బొమ్మతో ఒక పోస్టల్ స్టాంపును కూడా విడుదల చేసింది. నాగపూర్‌లో ఏర్పాటు చేసిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (NIT) కి ఆయనే పేరే పెట్టారు. ఇవన్నీ ఆయన ప్రతిభకు మాత్రమే కాదు ఆయన నిజాయితికి, ఆయన జీవితంలో ఆచరించిన విలువలకు కూడా దక్కిన పురస్కారాలు. ఆయన దేశంలో ఉండే ఇంజనీర్లు అందరికీ ప్రాతఃస్మరణీయుడు. ఆయన ఎప్పుడూ ఇంజనీర్లకు ఎన్ని తరాలు గడచినా సదా స్ఫూర్తిప్రదాతగానే ఉంటాడు.

మోక్షగుండం విశ్వేశ్వరాయ జీవిత చరిత్రలు ఇంగ్లీష్, హిందీ సహా అన్ని భారతీయ భాషల్లో వెలువడినాయి. తెలుగులో కూడా ఆయన జీవిత చరిత్రలు అచ్చు అయినాయి. వాటిల్లో డా. జానుమద్ది హనుమచ్ఛాస్త్రి, డా. కొండవీటి మురళి, టి వి సుబ్బయ్య, వి సీతారామయ్య రాసిన పుస్తకాలు తెలుగు పాఠకులకు అందుబాటులో ఉన్నాయి. అయితే ఆయన ఇంగ్లీష్‌లో రాసిన ఆయన 1954లో ప్రచురించిన స్వీయ చరిత్ర Memoirs of my working life మాత్రం తెలుగులో అనువాదం కాలేదు. సుదీర్ఘమైన ఉద్యోగ జీవితంలో తన అనుభవాలను, తాను చేపట్టిన ప్రాజెక్టులు, తాను సాధించిన విజయాలను, భారత దేశ అభివృద్దికి ప్రణాళికలను, ఆలోచనలను ఈ పుస్తకంలో ఆయన సవివరంగా నమోదు చేసినాడు. నవ భారత నిర్మాతల్లో ఒకరైన ఇంజనీర్ దార్శనికుడు మోక్షగుండం విశ్వేశ్వరాయ స్వీయ చరిత్రను అనువదించాలని ఒక ఇంజనీర్‌గా సంకల్పించాను. ఈ అనువాదాన్ని ధారావాహికంగా ప్రచురించడానికి ‘సంచిక’ అంతర్జాల పత్రిక సంపాదకులు కస్తూరి మురళీకృష్ణ గారు అంగీకారం తెలిపినారు. వారికి కృతజ్ఞతలు.

స్వీయ చరిత్ర పుస్తకానికి రాసిన చిన్న ముందుమాటతో (Preface) ఈ అనువాదాన్ని వారం వారం అందించడానికి ప్రయత్నిస్తాను. అనువాదం గురించి ఒక మాట. ఇది మక్కికి మక్కీ అనువాదం కాదు. కొన్ని సందర్భాలలో విశ్వేశ్వరాయ గారి ఇంజనీరింగ్ పరిభాషను సరళీకరించడానికి కొంత స్వేచ్ఛ తీసుకున్నాను. ఆయన రాసిన పెద్ద పెద్ద వాక్యాలను చిన్న వాక్యాల్లోకి కుదించి సరళీకృతం చేశాను. మొత్తం మీద ఎం.వి. గారి భావధారకు ఏ నష్టం జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నాను.

ఇంతకు ముందు నా అమెరికా పర్యటన అనుభవాలను ‘అమెరికా ముచ్చట్లు’ శీర్షికన 25 వారాల పాటు ధారావాహికంగా సంచిక పాఠకులకు అందించారు సంచిక సంపాదకులు. పాఠకులు వాటిని విశేషంగా ఆదరించారు. అన్ని అనుకూలిస్తే ఈ అనువాదాన్ని ఆయన జన్మదినం 15 సెప్టెంబర్ నాటికి పుస్తకంగా ప్రచురించాలని నా సంకల్పం. మోక్షగుండం స్వీయ చరిత్రను కూడా పాఠకులు ఆదరిస్తారని ఆశిస్తున్నాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here