మాంటిస్సోరి విద్యావిధాన రూపశిల్పికి అభివందనం

0
9

[box type=’note’ fontsize=’16’] 31-8-2020 నాటికి మరియా మాంటిస్సోరికి 150 సంవత్సరములు నిండిన సందర్భంగా ఈ వ్యాసం అందిస్తున్నారు పుట్టి నాగలక్ష్మి. [/box]

[dropcap]ఆ[/dropcap]మె రూపొందించిన విద్యావిధానం దివ్యాంగులకు వరమయింది. స్లో లెర్నర్స్ (తక్కువ ఐ.క్యూ. కలవారికి) దారి చూపించింది. ప్రజ్ఞావంతులు అభ్యసన నైపుణ్యాన్ని పెంచుకునేందుకు దోహదం చేసింది. ప్రపంచంలో అనేక దేశాలు ఈనాటికీ (కరోనా కాలంలో కాదు) అనుసరిస్తున్న మాంటిస్సోరి విద్యావిధానాన్ని రూపొందించిన మరియా మాంటిస్సోరికి 31-8-2020 నాటికి 150 సంవత్సరములు నిండిన సందర్భముగా నివాళిగా ఈ వ్యాసం.

1870వ సంవత్సరం ఆగస్టు 31వ తేదీన ఇటలీలోని చియార్‌వెల్లిలో మాంటిస్సోరి జన్మించారు. తల్లిదండ్రులు రినైల్డ్‌స్టోప్పాని, అలెస్సాన్ డ్రో మాంటిస్సోరిలు విద్యాధికులు. వీరు కుమార్తెను ఫ్లోరెన్స్ లోను, రోమ్‍లోను చదివించారు. నాటి విద్యావిధానం ప్రకారం పాఠశల, కళాశాల స్థాయిలలో వివిధ అంశాలను అభ్యసించారు. గణితంలో ప్రావీణ్యతని సంపాదించి ఇంజనీరింగ్ చదవాలనుకున్నారు. కానీ తరువాత వైద్యవిద్యను అభ్యసించడానికి నిర్ణయించుకున్నారు. రోమ్ విశ్వవిద్యాలయంలో వైద్యవిద్యను పూర్తి చేశారు. పీడియాట్రిక్స్ (శిశువైద్యం), సైకియాట్రీ (మానసిక విశ్లేషణ)లో నైపుణ్యాన్ని సంపాదించారు.

దివ్యాంగులు, వారి తల్లిదండ్రుల సమస్యలని అర్థం చేసుకున్నారు. వారి గురించి అంతకు ముందు వెలువడిన గ్రంథాలను చదివి, పరిశీలించి పరిశోధించారు. తత్ఫలితంగా పరిశోధనా గ్రంథం తయారయింది. దీనిని ‘పోలిక్లినికో’ పత్రికలో ప్రచురించారు.

దివ్యాంగుల కోసం ప్రత్యేక అభ్యసనా సంస్థలను ఏర్పాటు చేసి, ఉపాధ్యాయులకు ప్రత్యేక శిక్షణా సంస్థలను ఏర్పాటు చేయాలని ఆమె లక్ష్యం. 1900 సంవత్సరంలో మెడికో-పెడగోగికల్ ఇన్‌స్టిట్యూట్‌ను ఏర్పాటు చేసి 64మంది ఉపాధ్యాయులకు శిక్షణను ఇచ్చే ఏర్పాటు చేయడం ఆ రోజుల్లో చాలా గొప్ప. ఇటలీ నియంత ముస్సోలినీ ఈ పద్ధతికి మద్దతును ఇచ్చారు.

వివిధ విషయాలను బోధించడానికి బోధనోపకరణములను తయారు చేయడం, వాటిని ఉపయోగించి బోధించే పద్ధతులను సమ్మిళిత పరిచిన వ్యాసాలు ‘పెడగోగికల్ ఆంత్రోపాలజీ’ పుస్తకంగా వెలువరించారు. అంతర్జాతీయంగా విస్తృత ప్రచారం చేయడంతో అనేక దేశాలు ఆమెను ఆహ్వానించాయి. ఈ ఆహ్వానాన్ని స్వీకరించి ఆస్ట్రియా, హాలెండ్, స్పెయిన్, ఇంగ్లాండ్, అమెరికా తదితర దేశాలను దర్శించారు. శిక్షణా తరగతులను నిర్వహించి, కార్యశాలలను ఏర్పాటు చేశారామె.

1929వ సంవత్సరంలో డెన్మార్క్‌లో నిర్వహించిన ‘మొదటి అంతర్జాతీయ మాంటిస్సోరి కాంగ్రెస్’ నిర్వహణతో ఈ పద్ధతులకు మరింత ప్రాచుర్యం లభించింది.

ఈమెకు దివ్యజ్ఞాన సమాజంతో సత్సంబంధాలుండేవి. వారి ఆహ్వానం మీద 1939లో భారతదేశానికి వచ్చారు. మద్రాసులో అడయార్‌లో రుక్మిణీదేవి అరండేల్ నెలకొల్పిన కళాక్షేత్రాన్ని సందర్శించారు. 1946 వరకు భారతదేశంలోని అనేక ప్రదేశాలను సందర్శించారు. ‘మాంటిస్సోరి’ తరహా శిక్షణా కేంద్రాలను స్థాపించారు. ఉత్తర, దక్షిణ భారతదేశ ప్రాంతాలు మాంటిస్సోరి విద్యకు ప్రాముఖ్యతనిచ్చాయి. ‘విశ్వ విద్య’గా ప్రాచుర్యం పొందింది. భారత్‌లో ఈమె శిక్షణా కార్యక్రమ వివరాలు, పరిశీలనాంశాలు ‘The Absorbent Mind’ గ్రంథంగా ఆవిర్భవించాయి.

బాపూజీని, గురుదేవులని ఆమె అభిమానించారు. వీరిదరి విద్యావిధానాలకు, మాంటిస్సోరి పద్ధతులకు చాలా పోలికలు కన్పించడం విశేషం.

ఈమె స్వయంగా పిల్లల వైద్యురాలు, మానసిన విశ్లేషకురాలు. అందువల్లనే పిల్లల పట్ల ప్రేమ, ఆప్యాయత, అభిమానాలు కనబరచగలిగారు.

దివ్యాంగుల కోసం ఈమె రూపొందించిన ‘విద్యార్థి కేంద్రీకృత విద్యావిధానం’ ఈనాటికీ శిరోధార్యం. ఆమెకు ప్రపంచ దేశాలు ఎంతో ఋణపడి ఉన్నాయి.

చివరి రోజుల్లో హాలెండ్‌లో విశ్రాంతి విడిదిని ఏర్పాటు చేసుకున్నారు. 1952 మే 6వ తేదీన నూర్ట్‌విజ్క్‌లో మరణించారు. ఆమెకు 150 సంవత్సరములు నిండిన ఈ సందర్భంలో నివాళిని అర్పించడం మనందరి కర్తవ్యం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here