తెరవని ‘మూడోకన్ను’తో లోకం తీరు గమనిస్తున్న త్రినేత్ర సంచారి ‘చలపాక’

1
7

[dropcap]క[/dropcap]వి చలపాక ప్రకాష్‌ గారు లబ్దప్రతిష్ఠులు. ఆంధ్రప్రదేశ్‌ రచయితల సంఘం ప్రధాన కార్యదర్శి, రమ్యభారతి త్రైమాసిక పత్రికకు సర్వం సహాచక్రవర్తి, కార్టూనిస్టు, కవి, రచయిత, వ్యాసకర్త, సంస్థ నిర్వాహకుడు. ఇంతకుముందే చాలా పుస్తకాలు వీరిచే రాసి ప్రచురణయోగ్యతను పొందియున్నవి. ఇప్పుడు ‘మూడోకన్ను’. చాలామంది శివునికి కదా ‘మూడుకళ్ళు’ అని అనుకుంటారు. కాని ఎవరికివారు తమకు గల మూడోకన్నును తెలుసుకోరు. దీన్ని జ్ఞాననేత్రం అంటారు. కళ్ళు మూసి చూస్తేనే లోపలికి చూడగలం. లోచూపు ఏర్పడితే దూరదృష్టి కూడా కలుగుతుంది. అప్పుడు భవిష్యదర్శనం చేయగలరు. కవి దాన్ని సాధించానికి ప్రయత్నించినా తప్పకుండా సాధిస్తాడు. ఋషి లాంటి చలపాక ప్రకాష్‌ ‘మూడోకన్ను’ను సాధించాడు. అందుకే ఈ పుస్తకం బయటకు వచ్చింది.

ఇందులో పలు కవితలు చాలా పత్రికలలో ప్రచురింపబడినవే. ఇందులో మొత్తం 98 కవితలున్నాయి. ప్రతి కవిత ఒక ఆణిముత్యమే. ప్రతిదాన్ని విశ్లేషిస్తే బాగుంటుంది కాని కొన్ని చూద్దాం. ‘మూడోకన్ను’ అనే కవితలో ప్రతి కవి కళ్ళు మూసుకుకూర్చుంటే కుదరదన్న విషయాన్ని తెలియచేశారు. ”మాటలురాని మూగవాణ్ణికాను, మత్తుగా నిద్రిస్తున్న తాగుబోతుని కాను, తెరవని మూడోకన్నుతో లోకం తీరు గమనిస్తున్న త్రినేత్ర సంచారిన”ని చెప్పుకొన్నాడు కవి. ఈ సమాజంలో జరుగుతున్న దుశ్చర్యలను చూస్తూ వుంటే ‘మూడవకన్ను’ తెరవకుండా ఆపడం ఎవరితరమని ప్రశ్నించాడు కవి. అంటే ప్రతివాడు అగ్నినేత్రమైన మూడోకన్ను తెరవాల్సిందేనని ఆశించాడు కవి.

”పోతూపోతూ” అనే కవితలో ‘అందరూ పోయేవాళ్ళేకాని ఎవరు ఏమి పట్టుకెళతారు అన్నదాన్ని చాలా చక్కగా సహజంగా చెప్పారు. తండ్రి తల్లి పసుపు కుంకాలు తీసుకెళ్ళాడు. తల్లి ప్రేమానుబంధాలు వదిలి వెళ్ళింది. కూతురు పుట్టింటి పేరు, కొడుకు విదేశాలకి వెళుతూ దేశాన్నే వృద్ధాశ్రమంగా చేసిపోయాడు. నేడు ఎందరో విదేశాలు వెళుతున్నారు. అక్కడ నుంచి రారు. ఇక్కడ తల్లిదండ్రులు అనాథలై బాధతో కృంగికృశించిపోతున్నారన్న నగ్నసత్యాన్ని చాలా అందంగా తెలియచేశారు. ‘మాటల ఊపిరి’ ఈ కవితలో మౌనంగా ఉండటం వల్ల కలిగే నష్టాలు తెలుపుతూ సమాజం ”నీ మౌనం చేతగానితనంగా, తేలిగ్గా జమకట్ట వచ్చు, అందుకే, మౌనాన్ని భగ్నం చెయ్యి, ఏదొక మంచి మాటను సృష్టించి విలువైన ఊపిరి పొయ్యి” అంటూ ఉద్భోదించారు. ‘అమ్మలో నేను’ అనే కవితలో తల్లికి బిడ్డకి తేడా లేదన్న సత్యాన్ని అక్షరీకరించారు. ”నా దృష్టిలో అమ్మపై కవిత్వం రాయడమంటే, నన్ను నేను పొగుడుకోవటమే, అవును అమ్మను విమర్శిస్తే నన్ను నేను విమర్శించుకోవటమే. తనకు నేర్పిన అమ్మ గొప్పతనం ఇంతకంటే గొప్పగా చెప్పిన కవి ఎవరూ లేరని నా భావము. అమ్మలోని మంచి చెడులే బిడ్డలోను ఉంటాయి గదా. ”నిత్యబానిస” అనే కవితలో ఇంట పుట్టిన పెద్దకొడుకు ఎలా ఉండాలో నిర్దుష్టంగా వివరించారు. పూర్వం అలానే వుండేవారు. నాన్న తర్వాత పెద్దన్న. నేడు విచ్ఛిన్న భావాలు పెరిగినాయి. ఉమ్మడి కుటుంబాలు తరిగినాయి. వ్యష్టికుటుంబాలు, నియంత్రణ వచ్చింది. గాని ఇదివరలో ప్రతి ఇంటిలో 5, 6 గురు పిల్లలు ఉండేవారు. ఆడపిల్లయితే తల్లికి, మగపిల్లవాడైతే తండ్రికి చేయూతగా ఉండేవాళ్ళు, ఉండమనేవాళ్ళు. అన్న అంటే వీరిచ్చిన నిర్వచనం చాలా బాగుంది. అమ్మ ఇసుక, నాన్న సిమెంటు అయితే మధ్యలో నిల్చున్న ఇటుకను నేను, ఏమి మిగుల్చుకోలేని సున్నాని నేను. ఒక ఇల్లు కట్టాలంటే , ఇటుక ఎంత ముఖ్యమో ఒక ఇంటికి పేరు ప్రఖ్యాతలు తేవాలన్నా ఇంటి పెద్దకొడుకు ముఖ్యం. తమ్ముళ్ళు తప్పుచేసినా ఏమి అనరుగాని పెద్దవాడివి బుద్ధిలేదా అంటారు. వయసు వల్ల కాదు ఈ పెద్దరికం, ముందు పుట్టటం వలన వచ్చింది.

‘ఏకాకిని చేస్తున్న కాలం’ అనే కవితలో నేడు సమాజంలో జరుగుతున్న విషయాన్ని చక్కగా అక్షరీకరించారు. ‘ఈ నగరానికి ఏమయ్యింది’ అనే కవితలో అభివృద్ధిలో భాగంగా గుళ్ళు, ఇళ్ళు కూల్చి రోడ్లు విస్తీర్ణం చేస్తుంటే ఇక్కడ పుట్టిన వారికి చాలా బాధ కలగకమానదు. కవి తన బాధని ఈ కవితలో తెలియచేశారు. రూపు రేఖలు మారిపోతున్న విజయవాడ(బెజవాడ)ను గూర్చి చెపుతూ ”బెజ్జాలవాడగా పిలవబడిన నగరం, బెజ్జాల వాడగా తూట్లు పొడిచేసి నుజ్జువాడగా, ఆనవాళ్ళు చెరిపేసి మరుగుజ్జువాడగా అమరావతి అనకొండ నోటికి ఆహారమై జీర్ణించుకుపోతోంది’ అని బాధ పడ్డారు కవి. ‘ఆమె నవ్వింది’ కవితలో ఆమె ఎప్పుడు ఆనందంగా నవ్వాలని కవి గారి కోరిక. కాని కుదరలేదు. ఆమె అలా ఆనందంగా వుండాలంటే అందరు కలిసి చేయాలి. ఆమె నవ్వులో ఒక విషాదం కనబడుతోంది. బిడ్డలందరు ఒక కప్పుకింద ‘కలో గంజో’ త్రాగుతూ వుంటే తల్లి సంతోషం. కాని బిడ్డలకి డాలర్ల పిచ్చిపట్టి తల్లిని వదిలేస్తే ఏమీ చేయలేక ఒక పిచ్చి నవ్వు నవ్వింది. ఎన్నో ఆనందపు వేళల్లో నవ్విన ఆమె ఇప్పుడు ప్రగతిపథంలో పయనిస్తు వుంటే చూస్తూ పంతోషిస్తునే ఉన్నది. కాని ఆమె ఇప్పుడు నవ్విన నవ్వుకు కారణం కవి ఆశ్యర్యంగా చూశాడు- ‘సూట్కేసులతో షోకుగా విదేశాలకు వెళ్ళిన బిడ్డలందరూ కట్టుబట్టలతో, ట్రంకుపెట్టెలతో తిరిగి వచ్చేస్తున్నారన్న శుభవార్త తెలిసి ఆమె నవ్వింది… పగలబడి నవ్వింది… విరగబడి నవ్వింది… ఇలాగైనా మనవాళ్ళు మనకు దక్కారని… మన తెలుగు రాష్ట్రాల నవనిర్మాణంలో మన ముద్రతో మనవాళ్ళు కలిసుంటారని’ ఆమె నవ్వింది.. మనస్ఫూర్తిగా నవ్వింది.. ఆమె తెలుగుతల్లి.. ఆమె వ్యధే ఈ కవిత.

‘పోలవరం’ అనే కవితలో కవి తన అభిప్రాయాలను చక్కగా చెప్పారు. ఎందరో అనుమానంతో ఉన్న సమయంలో కొందరు వెళ్ళి చూచి దాని గొప్పతనాన్ని వారి వారి తీరులో చెప్పారు. ఏ ప్రక్రియలో చెప్పినా భావం ఒక్కటే ”పోలవరం ఆంధ్రజాతికి నిస్సదేహంగా ఓ వరమే, కలియుగంలో కళ్లముందు కనిపించే ఓ భగీరధుని ప్రయత్నపు సాక్షాత్కారమే”. ధృడమైన నమ్మకాన్ని తెలియచేశారు కవి. ‘వీళ్ళు-నేను’ అనే కవితలో ప్రతిచోట రెండు రకాల ప్రవృత్తి కలిగినవాళ్ళు ఉంటారు. వారు ఒకరితో ఒకరు కలవరు. ఒకరకంగా వాళ్ళు పండగ దండగ అనుకుంటారు. ఎందుకంటే వాళ్ళు రోజూ కొత్త కొత్త బట్టలు, రకరకాల పిండివంటలు తింటూ ఉంటారు. కాబట్టి అన్నిరోజులూ ఒకటే వారికి. కాని పేదవాడు పండగ రోజునే పప్పు, పాయసం వండుకోవడానికి ప్రయత్నించడం జరుగుతుంది. ఈ కవితలో వాళ్ళనే మాటలకి కవి చెప్పిన మాటలు అమృత గుళికలనవచ్చు. ‘నివాళిగీతం’ కవితలో నివాళికి సరియైన అర్థం చెప్పారు. చాంతాడంత కవితలు గాదు వారి ఆశయాలను అనుసరించి నెరవేర్చటమే అసలైన నివాళియని చక్కగా తెలియ చేశారు. ‘పెళ్ళంటే’ అనే కవితలో చక్కగా నిర్వచనం అందించారు. పెళ్ళంటే రెండుదేహాల సహజీవనం కాదు, రెండు ప్రాణాల సగభాగం కూడా. కుటుంబ పటిష్టతకు పునాది, సరైన సమాజానికి రథసారథి… తరతరాలకు జీవర పోస్తున్న నిజమైన పెన్నిధి.. ఇంత చక్కగా నిర్వచించిన ఒక ప్రకాష్‌ గారికే చెల్లు. ‘నేను సైతం’ అనే కవితలో చాలామంది చాలా రకాల సేవలు సమాజానికి చేస్తూ వున్నారు, చేస్తూ ఉంటారు. కాని కవి ”అక్షర సూర్యుడిలో మమేకమైపోయి ప్రపంచానికి వెలుతురు కిరణాలని అందిస్తాననటం’ అద్భుతంగా ఉంది. కవి ‘అక్షరాలను సూర్యుడి’గా అభివర్ణించడం అద్భుతమైన ఊహ! ఇలా ఎన్ని రాసినా ఇంకా రాయాల్సినవి చాలా వున్నాయి. అన్ని గురించి రాయటం కంటే పుస్తకాన్ని కొని ‘మూడోకన్ను’లోని గొప్పతనాన్ని తెలుసుకుంటే బాగుంటుంది. వీరి కలం నుండి (జ్ఞాన దృష్టితో) ఇంకా అనేక రచనలు రావాలని కోరుతూ..

***

మూడోకన్ను (కవిత్వం)
రచన: చలపాక ప్రకాష్
పుటలు: 200, వెల: ₹100,
ప్రతులకు: భాషా సాంస్కృతిక శాఖ,
ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం,
జి.వి.ఆర్‌.ప్రభుత్వసంగీత నృత్య కళాశాల బిల్డింగ్‌,
దుర్గాపురం, విజయవాడ-520 003

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here