మూడో కన్ను

1
10

[dropcap]“కృ[/dropcap]త్తిక.. ది గ్రేట్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టు అనిపించుకోవాలనేది నా కల” ధీమాగా చెబుతున్న ఆమె వైపు పరిశీలనగా చూశాడు ఛానల్ హెడ్ మహంతి.

ఆమె సన్నగా రివటలా ఉంది. అందం కాదు కానీ ఆమెలో ఏదో ఆకర్షణ కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. గడగడా మాట్లాడుతోంది. చాలా మంది ఇంటర్వ్యూలలో, ఇలాగే మాట్లాడతారు. ఆత్మవిశ్వాసాన్ని ప్రదర్శిస్తారు. తీరా పని దగ్గర కొచ్చేసరికి జావగారిపోతారు. తనకు కావలసింది గట్టిగా మాట్లాడేవాళ్లు కాదు. ధైర్యం, తెగింపు ఉన్నవాళ్లు అనుకున్నాడు.

మహంతి పది, పన్నెండేళ్లుగా రకరకాల టీవీ ఛానళ్లలో పనిచేశాడు. ఆ అనుభవంతో ఓ కొత్త ఛానల్ ప్రారంభించాలని సంకల్పించాడు. మెరికల్లాంటి టీం కోసం ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నాడు.

పోస్టు గ్రాడ్యుయేషన్ చదువు, పబ్లిక్ స్పీకింగ్‌లో డిప్లమో…. అర్హతల పరంగా ఆయనకు సంతృప్తికరంగా అనిపించాయి.

“రిపోర్టరు ఉద్యోగానికి నియమిత పనివేళలుండవు. ఒక్కోసారి రేయింబవళ్లు పని చేయవలసి వస్తుంది. దీనిపైన మీకు అవగాహన ఉందనే అనుకుంటున్నాను” అన్నాడు.

ఆమె తలాడించింది.

“రాత్రి సమయాల్లో మీకు ప్రత్యేకంగా క్యాబ్ సౌకర్యం ఉంటుంది. పగలు మీ ఏర్పాట్లు మీరే చేసుకోవలసి ఉంటుంది. జీతం, అలవెన్సులు, ఇతర వివరాలు మీకు ఇచ్చే అపాయింట్మెంటు ఆర్డరులో ఉంటాయి. ఇంకా సందేహాలుంటే హెచ్.ఆర్.డిపార్టుమెంటు వాళ్లను అడిగి తెలుసుకోండి” అన్నాడు గంభీరంగా.

“సార్, నాకు పొలిటికల్, సోషల్ ఇష్యూస్ అంటే ఆసక్తి ఎక్కువ. మంచి ఇన్వెస్టిగేటివ్ స్టోరీలు చేయగలను” అంది.

ఉద్యోగం లభించిందన్న సంతోషంలో ఈ అమ్మాయి ఏదో మాట్లాడుతోంది అన్నట్టు ఆమె వైపు చూశాడు మహంతి.

“బ్యూటీ, ఫ్యాషన్సు, పేజ్-3 ఇష్యూస్ ఇలా… మహిళలకు సంబంధించిన అంశాలయితే ఎక్కువ మంది చూస్తారు. సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలంటే చాలా మందికి ఆసక్తి. గాసిప్సు అంటే ఇష్టపడతారు. మనం ఏం చూపిస్తే జనం ఎగబడతారు అన్నదే మనకు ముఖ్యం. రాజకీయ నాయకుల్ని బ్లాక్‌మెయిల్ చేయటానికి మీడియా ఇలాంటివి ఎంచుకుంటుందనే ప్రచారం ఉంది. అందుకే ఇన్వెస్టిగేటివ్ స్టోరీలను జనం నమ్మరు” అని చెప్పి ఆమెకు మాట్లాడే అవకాశం ఇవ్వకుండా గదిలో నుంచి బయటకెళ్లిపోయాడు.

“హోటళ్లు, పబ్‌లు, పిక్‌నిక్ స్పాట్లు, షూటింగ్ స్పాట్లు తిరగటానికా ఈ వృత్తిని ఎంచుకుంది” అనుకుని నిట్టూర్చింది కృత్తిక.

ఆ మర్నాడే ఉద్యోగంలో చేరిపోయింది. రోజులు గడుస్తున్నాయి… యాంత్రికంగా, ఉత్సాహానికి దూరంగా.

ఓ రోజున ఎడిటర్ నుంచి పిలుపొచ్చింది. తనకు మంచి ఎస్సైన్‌మెంటు దొరుకుతుందేమోనని ఆత్రంగా ఆయన గదిలోకి అడుగుపెట్టిన ఆమెకు,

“టీవీ ఛానళ్లు నడిచేది ప్రకటనలమీదే అని తెలిసిన విషయమేగా. మనకు ప్రకటనలు బాగా తగ్గిపోయాయి. ఛానల్ నడపటం కష్టంగా ఉంది. నెలాఖరుకి మూసి వేస్తున్నాం. నీలాంటి జూనియర్లకు బయట మంచి అవకాశాలే ఉంటాయి” అని ఆయన బాంబు పేల్చాడు.

“ఫలానా పత్రికవాళ్లు కొత్తగా టీవీ ఛానల్ ప్రారంభించాలనుకుంటున్నారు. ఓ సారి వెళ్లి వాళ్లను కలిసి మాట్లాడుకో” అన్న ఉచిత సలహా కూడా పారేశాడు.

‘తనకు ఆరునెలల్లో ఇక్కడ ప్రత్యేకంగా లభించిన గుర్తింపు ఏదీ లేదు. రోజువారీ కార్యక్రమాలు తప్పించి, పెద్దగా అవకాశాలు ఇవ్వలేదు. ఓ రకంగా ఇందులో నుంచి బయటపడటం తనకు మేలే’ అనుకుంది కృత్తిక. అక్కడ నుంచి నేరుగా ఆ ఆఫీసుకు వెళ్లింది. తన మాటతీరుతో కొత్త యజమానిని ఆకట్టుకుంది.

“24 గంటల న్యూస్ ఛానళ్లు మార్కెట్లో చాలా ఉన్నాయి. మనం కూడా అవే విషయాలతో ఊదరగొడతే ప్రజలకు పిచ్చెక్కుతుంది. కొద్దిగా భిన్నంగా వెళదాం. నిత్యం ప్రజలు ఎదుర్కొనే సమస్యలపైన కథనాలు ఇవ్వాలని అనుకుంటున్నాం.” అన్నాడు ఆయన.

“ప్రతి రోజూ కథనం ఇవ్వాలన్న నియమం లేదు. ఏదో ఒకటి అని కాకుండా, పూర్తిగా సంతృప్తి కలిగాక, సమగ్రత ఉండేలా చూడటం ముఖ్యం” అని సూచించాడు.

‘ముందు ఆయన కంటే ఈయన మెరుగ్గా ఉన్నాడే. అయినా ముందుగానే అన్నీ ఊహించుకోవటం ఎందుకు. నాల్రోజులయితే ఈ వ్యవహారంలో మంచి చెడూ అర్థమవుతాయిగా’ అనుకుంది కృత్తిక.

కొద్దివారాల తర్వాత ఛానల్ ప్రారంభమయ్యింది. పని తనలో ఆసక్తిని పెంచుతోంది. చిన్న చిన్న పౌర సమస్యలపైన ఆరేడు నిముషాల కథనాలు చేస్తోంది. సహచరుల నుంచి ప్రోత్సాహం వస్తోంది. బయట జనం కూడా కార్యాలయానికి ఫోన్ చేసి అభినందనలు చెబుతున్నారు. దీనితో ఆమె రెట్టించిన ఉత్సాహంతో పనిచేయటం ప్రారంభించింది.

“నీ కథనాలు బావుంటున్నాయమ్మా… స్పెషల్ స్టోరీలపైన దృష్టి పెట్టు. ప్రకటనలు పోనూ పదిహేను, ఇరవై నిముషాల పాటు కార్యక్రమం ప్రసారానికి కేటాయిస్తాం” అన్నాడు ఇన్‌పుట్ ఎడిటర్.

ఆమె విజృంభించింది.

నగరంలో పాలు, నూనె, ఇతర నిత్యావసర వస్తువులు కల్తీ చేసే ముఠా, అమ్మాయిలను వ్యభిచార గృహాలకు తరలించే గ్యాంగులు, దొంగ సర్టిఫికెట్ల వ్యవహారం ఇలా వరసపెట్టి కథనాలు చేసింది. ప్రేక్షకులు ఆమెను గుర్తించటం మొదలుపెట్టారు. బయట ఆమె ఎక్కడయినా కనిపిస్తే సెల్ఫీల కోసం, ఫొటోల కోసం ఎగబట్టేవాళ్లు.

ఆమె అక్కడితో సంతృప్తి చెందలేదు. ఓ సంచలనాత్మక కథనానికి శ్రీకారం చుట్టింది. తన మనసులో మాటను నేరుగా బాస్‌కు విన్నవించింది.

“సెభాష్.. మంచి ఆలోచన” అన్నాడు ఆయన ప్రశంసాపూర్వకంగా. “వీలయినంత సమయం తీసుకోండి. పక్క రాష్ట్రంలో.. భాషరాని చోట ఒంటరిగా ఉండటం, తిండి ఇలాంటి వాటి గురించి ఆలోచించారా? ఇబ్బంది లేదంటారా?”

అలాంటిదేమీ లేదని చెప్పటానికి తల అడ్డంగా ఊపింది.

“మీకేమయినా అడ్వాన్సు కావాలంటే తీసుకోండి. అక్కౌంట్సు వాళ్లకు చెప్పి ఉంచుతాను”.

“స్పై కెమెరాలవీ అవసరమవుతాయి. అదీ గాక..” ఇంకేదో చెప్పబోయింది. ఆయన ఫైల్లో నుంచి తలెత్తకుండా తన పని చేసుకోవటం చూసి మారుమాట్లాడకుండా బయటకొచ్చేసింది.

***

“యు హేవ్ డన్ ఎ గుడ్ జాబ్. ఐయామ్ ప్రౌడ్ ఆఫ్ యు” అన్నాడు ఆయన మెచ్చుకోలుగా. కృత్తిక అందించిన హార్టు డిస్కులను, వందలాది పేజీలున్న నోట్సును తన చేతితో అందుకుని తన ఎడమవైపున ఖాళీగా ఉన్న టేబుల్ పైన ఉంచాడు.

ఆయన ఎదురుగా ఖాళీగా ఉన్న సీట్లో కూర్చుంది. వృత్తిపరమైన సంతృప్తితో గంభీరంగా ఆయన చెప్పేది వింటోంది.

ఆయన ప్రశంసలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఇన్నాళ్లు పడిన శ్రమకు తగిన గుర్తింపు లభించిందని సంబరంగా ఉంది ఆమెకు.

ఆ తర్వాత చెప్పటం మొదలుపెట్టింది. ఒక సర్దార్జీలా తను వేషం మార్చుకుని ప్యాంటు, షర్టు ధరించటం, చోటామోటా రాజకీయ నాయకులు, పవర్ బ్రోకర్ల నుంచి ప్రారంభించి, సెక్రటేరియట్ వరకూ వెళ్లటానికి అడగడుగునా తను అనుసరించిన వ్యూహాలు, తన ఎదురైన సవాళ్లు పూసగుచ్చినట్టు చెప్పుకొచ్చింది. రాజకీయ నాయకులు, పోలీసు ఉన్నతాధికారులు, యాంటీ టెర్రరిస్టు స్వ్కాడ్ బృందం, మంత్రులు, ప్రతిపక్ష నేతలు, చివరకు హోం మంత్రి మాట్లాడిన అంశాలన్నింటిలో రహస్య కెమెరాల్లో ఎలా బంధించిందో వివరించింది.

“మూడేళ్లనాడు చోటు చేసుకుని, ఇంత మందిని పొట్టన పెట్టుకున్న ఈ మారణహోమం వెనక స్వయంగా హోమ్ మినిస్టరే ఉన్నారని తెలిస్తే.. ఓ మై గాడ్.. మన స్టోరీ సెన్సేషన్ అవుతుంది. గవర్నమెంటు చిక్కుల్లో పడొచ్చు కూడా. ఇదంతా చూడటానికి ఓ క్రైం థిల్లర్‌లా ఉంది” అన్నాడు ఏసీ గదిలో ముఖాన పట్టిన చెమటను తుడుచుకుంటూ.

“అవును సార్. మన ఛానల్‌ను నెంబర్ ఒన్‌గా నిలపటానికి ఇబ్బందుల్ని నేను ఖాతరు చేయలేదు” అంది.

“వెరీ గుడ్. మీ శాలరీని హైక్ చేస్తున్నాను. దాంతో పాటు మీకు ప్రమోషన్ కూడా…”

ఆయన మాటలు వింటుంటే, కృత్తికకు గాల్లో తేలుతున్నట్లుగా అనిపించింది.

“థ్యాంక్యూ” అంది వినయం ఉట్టిపడేలా.

“చాలా శ్రమపడ్డారు. నాలుగు వారాల పెయిడ్ లీవు తీసుకుని రిలాక్సవ్వండి. ఈ శని, ఆదివారాల్లో ప్రైం టైమ్‌లో స్టోరీ టెలికాస్టు చేద్దాం” అన్నాడు.

మరోసారి ఆయనకు ధన్యవాదాలు చెప్పి ఇంటికి తిరిగొచ్చింది. తల్లితో సరదాగా గడుపుతోంది. రోజూ టీవీ ముందు పడిగాపులు పడుతోంది. కానీ తన స్టోరీ రావటం లేదు. ఇన్‌పుట్, అవుట్‌పుట్ ఎడిటర్లతో మాట్లాడాలని ప్రయత్నించింది. ఎవరూ తన కాల్ కు ఆన్సర్ చేయటం లేదు.

ఓర్పు నశించిన తర్వాత ఓ రోజు నేరుగా యజమానికి ఫోన్ చేసింది. యథాలాపంగా ఫోన్ ఎత్తాడేమో.. ముందుగా స్క్రీన్ పైన తన పేరు చూసి ఉంటే స్పందించేవాడు కాదేమో అని ఆయనతో మాట్లాడిన తర్వాత ఆమెకు అనిపించింది.

నేరుగా విషయంలోకి వెళ్లింది.

“నా స్టోరీ…”

“తర్వాత చూద్దాం”.

“కాదు సార్”

“ఇప్పుడు కాదని చెబుతున్నా కదా?”

“చాలా కష్టపడ్డాను సార్. ప్రాణాలకు తెగించి మరీ..”

“ఈ వృత్తిలో ఉన్నవాళ్లంతా కష్టపడేవాళ్లు. ఏదో మీరొక్కరే ప్రత్యేకమైనట్టుగా మాట్లాడటం ఏమీ బావోలేదు”.

“అది కాదు సార్. నిద్రాహారాలు మానేసి, ప్రాణాలను పణంగా పెట్టి…”

“… … ..”

“కథనంలో అవసరమయితే మార్పులు చేస్తాను. అదనపు వివరాలు కావాలంటే మీకు అందిస్తాను. ప్లీజ్ సార్. నా కష్టం వృథా అవుతుంది” బతిమాలటం మొదలుపెట్టింది.

“నీ కథలన్నీ వినే టైం నాకు లేదు. ఇంకెప్పుడూ నాకు ఫోన్ చేసి నా సమయం వృథా చేయక” అన్నాడు విసుగ్గా.

అప్పటి వరకూ ఆయన యజమాని అన్న భావనతో మాట్లాడిన కృత్తిక ఒక్కసారే రెచ్చిపోయింది.

“ఏమిటి మీరు మాట్లాడుతున్నది. ప్రభుత్వ ఉనికినే సవాలు చేసే ఇలాంటి కథనం గురించి మాట్లాడటం మీకు టైం వేస్టా? అసలు మీరు ఛానల్ నడుపుతున్నారా లేకపోతే పొలిటికల్ బ్రోకర్‌లా…”

ఆమె మాటలు అతని అహాన్ని దెబ్బతీశాయి.

“షటప్. హోల్డు యువర్ టంగ్… ఒళ్లు బలిసి నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నావే…” ఓ బూతు పదం ఉపయోగించాడు. అక్కడితో ఆగలా.

“మేం పక్కన పెట్టింది నీ కథనాన్ని కాదు.. నిన్నే” అని అసలు విషయం బయటపెట్టాడు.

కృత్తిక తన చెవులను తానే నమ్మలేకపోతోంది. పదిరోజుల క్రితం తనను ఆకాశానికెత్తేసి, ప్రమోషన్ అని, శాలరీ హైక్ అని ఊరించిన వ్యక్తి, హఠాత్తుగా ఇలా అడ్డం తిరుగుతాడన్న విషయం ఆమె వూహకు అందటంలేదు. ఇది కలా? నిజమా? అని తెలియని పరిస్థితుల్లోకి వెళ్లింది. ఆమెకు ఎంత ఆవేశం వచ్చిందంటే, ఎదురుగా ఆ వ్యక్తి నిలుచుని ఉంటే గనక, కాలర్ పట్టుకుని ఆ చెంపా, ఈ చెంపా వాయించేదాన్ని అనుకుంది.

అయినా వృత్తిధర్మం గుర్తొచ్చి కొద్ది పాటి సంయమనాన్ని పాటించి, “ఏమిటి మీరంటున్నది?” అనడిగింది.

“యస్.. ఐ మీన్ వాట్ ఐ సే. ఈ స్టోరీ పేరుతో గవర్నమెంటును పడగొట్టాలనుకునే స్వార్థపర శక్తులతో నువ్వు చేతులు కలిపావు”

“వ్వాట్…?” గట్టిగా అరిచింది ఆమె.

“ప్రతిపక్షనేత విక్రం రాజ్‌పుట్ ఇదంతా రెడీ చేసి నీకిచ్చాడు. వాళ్ల దగ్గర భారీగా డబ్బు గుంజావనేది మాకొచ్చిన కంప్లెయింట్. ఎంక్వయిరీ చేస్తున్నాం. అదీ కాక నీ సొంత ప్రయోజనాల కోసం ఆఫీసును వాడుకున్నందుకు నీపైన పోలీసులకు ఫిర్యాదు చేయాలనుకుంటున్నాం. క్రిమినల్ ప్రొసీడింగ్సు కూడా ప్రారంభమవుతాయి”.

అతని మాటలు పూర్తికాలేదు. తన చేతిలో ఉన్న మొబైల్ తీసి గోడకేసి విసిర కొట్టింది. భళ్లున శబ్దమైంది.

నెల రోజుల తర్వాత, ఛానల్ యజమాని తన కొత్త రియల్ ఎస్టేట్ వెంచర్‌ను హోం మినిస్టర్ చేతుల మీదుగా ప్రారంభించటం చూశాక యజమాని అలా ఎందుకు ప్రవర్తించాడో ఆమెకు అర్థమైంది.

ఆమెకు అసహ్యం పుట్టింది.

‘ఇలాంటి వ్యక్తి నడిపే ఛానల్ పైకి తేవటం కోసమా తను ప్రాణాలకు తెగించి కథనం చేసింది’ అనుకుంది.

***

“ఎన్ని రోజులు నిన్ను నాలుగ్గోడల మధ్య బంధించుకుంటావు. అలా బయటకు వెళ్లు. స్నేహితుల్ని కలువు. ఏదైనా పత్రిక లేదా టీవీ ఛానల్లో ఉద్యోగం వెతుక్కో. లేదంటావా, ఏదైనా వ్యాపకం పెట్టుకో. అంతేగానీ..”

తల్లి తనను బతిమాలుతూ చెబుతున్నమాటలు కృత్తిక చెవిన పడుతూనే ఉన్నాయి. అయినా మూసి ఉన్న గది తలుపు తెరవలేదు.

“అసలు నువ్వేనా అన్న సందేహం నాకు కలుగుతోంది. ప్రపంచాన్ని ఎదిరించే వ్యక్తిగా నిన్ను నేను పెంచితే, ఇవాళ నువ్వు నడుచుకుంటున్న తీరు చూస్తే నాకు సిగ్గేస్తోంది. నా పెంపకం మీద నాకే ..”

ఆమె మాట పూర్తి చేయలేదు. ఠక్కున తలుపు తీసి బయటకు వచ్చి తల్లిని ఆలింగనం చేసుకుంది కృత్తిక.

“నిన్ను నువ్వు తక్కువ చేసుకోకు అమ్మా, నాకు ఉగ్గుపాలతో ధైర్యాన్ని నేర్పావు. కానీ నేను ఏడాదిపాటు పడిన శ్రమ బూడిద పాలయ్యిందని బాధ. దానికి తోడు నా మీద ట్రోల్సుతో దాడి చేస్తున్నారు.. నడిరోడ్డు మీద గుడ్డలిప్పి రేప్ చేస్తామని… అంగాన్ని.. .. ఛీ .. నా నోటితో చెప్పలేకపోతున్నాను.. ఇంత అసభ్యంగా మాట్లాడుతుంటే.. మొదట్లో మాటకు మాట సమాధానం చెప్పేదాన్ని. దాంతో నన్ను బజారు ముం… అని తెగ తిట్టిపోస్తున్నారు. తలెత్తుకోలేకపోతున్నాను. మనుషులంటే జుగుప్స కలుగుతోంది” అంది ఆవేదనగా.

కన్నబిడ్డను ఆ స్థితిలో చూసి తట్టుకోలేని తల్లి, కూతురు చెప్పేది వినసాగింది మౌనంగా.

“జీతపు రాళ్ల కోసం ఈ ఉద్యోగం ఎంచుకోలేదమ్మా? మత కలహాల వెనుక ముసుగు వేసుకున్న పెద్ద మనుషులు బండారాన్ని బయటపెట్టాలని పూనుకున్నాను. అందుకే నన్ను ఎవరూ గుర్తుపట్టలేని విధంగా రూపం మార్చుకున్నాను. కొన్ని నెలలపాటు ఒంటరిగా స్టింగ్ ఆపరేషన్ చేపట్టాను. నా వాచీలో, భుజం దగ్గరా, బెల్లు బకిల్ దగ్గరా, ఇలా వేర్వేరు చోట్ల అమర్చి ఉన్న నిఘా కెమెరాలలో అవతల వ్యక్తి మాట్లాడుతున్నప్పుడు రికార్డు అవుతోందో లేదో చూడాలి. అవతల వ్యక్తి అనుమానించకుండా జాగ్రత్త పడాలి. నేను ఏ మాత్రం అలసత్వాన్ని, అలక్ష్యాన్ని ప్రదర్శించినా అంతే సంగతులు. నేనే కాదు, నా శవం కూడా బాహ్యప్రపంచానికి కనిపించదు. నిఘా కెమెరాలతో పనిచేయటం ఎంత కష్టమో, బయటకు వాళ్లకు తెలియదు. ఆ పని చేసిన వాళ్లకు మాత్రమే అందులో కష్టం అర్థమవుతుంది”

ఒక్క నిముషం ఆగి మళ్లీ కొనసాగించింది కృత్తిక.

“నా ఒళ్లంతా నిఘా కెమెరాల వల్ల శరీరం వేడెక్కిపోయేది. చేతిలో కెమెరా పుచ్చుకుని స్టిల్ ఫొటోలు తీయటం కాదు కదా.. దీనికి చాలా నైపుణ్యం, సాహసం కావాలి. తెల్లవార్లూ ఆలోచనలతో నిద్రపట్టేది కాదు. రాత్రంతా ఒంటరితనం.. ఏదో తెలియని భయం.. మళ్లీ పగలు మామూలే. రకరకాలుగా సమాచారం వస్తుంటే, దాన్ని తవ్వుకుంటూ ముందుకు పోయేదాన్ని. పిచ్చి తెగింపుతో. ఓ పబ్ కొస్తే అన్ని వివరంగా మాట్లాడదామని ఓ పోలీసు ఆఫీసరు పిలిస్తే, ఆడపిల్లనని, అలా వెళ్లటం ప్రమాదాన్ని చేతులారా కొని తెచ్చుకోవటమేనన్న స్పృహ లేకుండా వెళ్లాను. కొద్దిలో ముప్పు తప్పింది గానీ, లేకపోతే లైంగిక దాడికి గురయ్యేదాన్నే. ఓ రౌడీ షీటరు ఒకడు నిర్జనంగా ఉన్న అల్యూమినియం ఫ్యాక్టరీ దగ్గరకు తీసికెళ్లినప్పుడు.. సమయస్ఫూర్తిని ప్రదర్శించి ఉండకపోతే చిక్కులపాలయ్యేదాన్ని.

ఇవే కాదు. ఊరు కాని ఊర్లో నేను ఎదుర్కొన్న ఇబ్బందులు లెక్కలేనన్ని. వాటన్నింటిని పంటి బిగువన భరించాను. ఓ గొప్ప బాధ్యత తలెత్తుకున్నాననుకున్నాను గానీ బలిపశువును అవుతానని ఊహించలేదు. నా కష్టాన్ని ఆ టీవీ యజమాని తన స్వలాభం కోసం వాడుకున్నాడమ్మా… లక్షలాది రూపాయల పెట్టుబడిగా మలుచుకున్నాడు. ఆ తర్వాత జరిగినదంతా నీకు తెలిసిందే. దాడులు.. ట్రోల్సు.. భరించటం కష్టంగా ఉందమ్మా..” కృత్తికలో దుఃఖం ఎగదన్నింది. తల్లిగా అది చూసి ఆమె విలవిలలాడిపోతోంది.

“నీ మీద పడే రాళ్ల నుంచి తప్పించుకోవటంకాదు. వాటిని మెట్లుగా చేసుకుని పైకి ఎదగటం నువ్వు నేర్చుకోవాలి. నీకున్న సామర్థ్యం వాళ్లకు లేదు. అందుకే వాళ్లు నీ మీద అవాకులు చెవాకులు పేలుతున్నారు” అని అనునయంగా కూతురి భుజం మీద చెయ్యివేసి “చిన్న ఓటమితో లక్ష్యం నుంచి పక్కకు తొలగటం అవివేకం అనిపించుకుంటుంది. ఎవడో ఏదో పిచ్చి కూతలు కూశాడని, నిన్ను నువ్వు తగ్గించుకుంటే, ఈ ప్రపంచానికి నువ్వేమిటన్నది చూపించుకోలేకపోతే.. నీ పుట్టుకకు అసలు అర్థమే ఉండదు” అంది. అది తిరుగులేని బాణం. చిన్నప్పటి నుంచి కూతురికి అనేక మార్లు ఆ మాట చెప్పింది. ఓ రకంగా చెప్పాలంటే కృత్తికను ముందుకు నడుపుతున్న ఇంధనం ఆ మాటలే.

తల్లికి నెలలు నిండకుండానే కృత్తిక ఈ భూమ్మీద పడింది. బరువు బాగా తక్కువ కావటంతో ప్రత్యేకమైన వార్డులో ఉండి వైద్యం చేశారు. బతకటం కష్టమని తేల్చేశారు. “ఇంకా డబ్బు ఖర్చుపెట్టటం దండగ. వైద్యం అనవసరం. చివరి బస్సు ఇంకో అరగంటలో ఉంది. పిల్లను తీసికెళ్లండి” అని సలహా చెప్పాడు డ్యూటీ డాక్టర్. ఏం చేయాలో తెలియని నిస్సహాయస్థితిలో దేవునిపై భారం వేసి పాపను ఇంటికి తెచ్చేశారు. పల్లెలో ఎవరో పెద్దావిడ పూనుకుని పసరు వైద్యం చేసింది. కృత్తిక ప్రాణాలు నిలబెట్టింది. అయినా చాలా పీలగా, బలహీనంగా ఉండేది. స్కూలులో అందరూ ఏడిపించేవారు. బాగా డల్‌గా ఉంటుందని టీచర్లు ఫిర్యాదు చేసేవాళ్లు. చదువులోనూ పెద్దగా చురుగ్గా ఉండేది కాదు.

ఊహ తెలిసిన తర్వాత, “నీ పుట్టుకలోనే పోరాటం ఉందమ్మా.” అని తల్లి చిన్నప్పటి విషయాన్ని తరచూ గుర్తుచేసేది. అంతే, కృత్తికలో ఎక్కడ లేని ఆవేశం తన్నుకొచ్చేది. ప్రతి నిముషం తను బలహీనురాలిని కాదని నిరూపించుకోవాలని ప్రయత్నించేది. మిగతా ఆడపిల్లల మాదిరిగా, మేకప్, మంచి దుస్తులతో ఇతరులను ఆకర్షించాలని అనుకునేది కాదు. ఇతరులు చేయలేని పని తలపెట్టి విజయవంతం కావాలని ఆశపడేది. ఇవన్నీ తల్లిగా ఆమెకు తెలుసు.

“ఇంతకు ముందు జరిగిపోయిన వాటి గురించి ఆలోచించటం కాదు. ఇప్పుడేం చేయాలో ఆలోచించు. నీ వెనక నేను ఉన్నాను” అంటూ కూతురికి ధైర్యన్ని నూరిపోసింది. ఆ నిముషంలో తల్లి చెప్పిన మాటలు కృత్తికను కదిలించాయి. ఆమెలో కర్తవ్యం బోధపడింది. లక్ష్యం దిశగా అడుగులు పడ్డాయి.

***

‘మూడో కన్ను’.

ఢిల్లీలో ఐదు నక్షత్రాల హోటల్లో పుస్తక ఆవిష్కరణ సభ.

ప్రసిద్ధ పరిశోధనాత్మక జర్నలిస్టు కృత్తిక స్వయంగా పరిశోధించి బయటపెట్టిన మతకలహాల గుట్టు అన్న ఫ్లెక్లీ సభ ఆవరణలో వేలాడుతోంది. ఓ వైపు పుస్తకం ముఖచిత్రం, రెండో వైపు రచయిత్రి ముఖంతో. కృత్తిక, ఆమె తల్లి సమావేశ మందిరం బయట నిలబడి అతిథులను ఆహ్వానిస్తున్నారు. అన్నిపార్టీలకు చెందిన అధికార, ప్రతిపక్ష నేతలు, అతిరథ, మహారథులయిన జర్నలిస్టులు, యాక్టివిస్టులు, రచయితలు ఈ కార్యక్రమానికి విచ్చేశారు. జర్నలిస్టుగా తనకు తొలి ఉద్యోగ అవకాశమిచ్చిన యజమానిని ఆమెను ప్రత్యేకంగా ఆహ్వానించింది.

రెండు వారాల ముందే అమెజాన్‌లో ఆంగ్లంతో పాటు, తెలుగులోనూ విడుదలయిన ఈ పుస్తకం సంచలనం సృష్టించింది. ప్రవాహవేగంతో, ఉత్కంఠ రేపేలా, సస్పెన్సును, నాటకీయతను కలగలిపి పాఠకుల మీదకు వదిలింది ఆమె. థ్రిల్లర్లు అంటే ఇష్టపడే ఈ తరం కుర్రాళ్లు దాని కోసం బాగా ఎగబడ్డారు. యువ దర్శకుడొకరు పాన్ ఇండియా సినిమాగా రూపొందించటానికి ముందుకొచ్చాడు. ప్రాంతీయ భాషలో అనువాదానికి అనుమతి ఇవ్వమని ఓ ప్రచురణ సంస్థ కోరితే, తదుపరి పుస్తకానికి బ్లాంక్ చెక్ ఇచ్చాడు మరో పబ్లిషర్. విదేశీ పత్రికా సంపాదకుడొకరు తన పత్రికలో పని చేయవలసిందిగా ఆమెను ఆహ్వానించాడు. ఇవన్నీ ఆమెకు ఊహించని అవకాశాలే. సభకు వచ్చిన వాళ్లంతా ఆమెపై ఆసక్తి ప్రదర్శిస్తున్నారు. ఆమెతో కలిసి సెల్ఫీలు దిగుతున్నారు.

ఆమెను రకరకాల ప్రశ్నలు వేస్తున్నారు.

ఆ తర్వాత వేదికపై నుంచి అందరికీ ఒకేసారి సమాధానం చెప్పింది. ప్రసంగం ముగిస్తూ ఆమె చెప్పిన మాటలకు ప్రేక్షకులు మంత్రముగ్థులయ్యారు.

“ఆడపిల్ల అనుకుని నాకు నేను పరిధులు నిర్ణయించుకోలేదు. నన్ను నేను నియంత్రించుకోలేదు. తెగువ చూపుతూ ముందుకెళ్లాను. కానీ నా జర్నలిస్టు జీవితంలో ఎదురైన అనుభవాలు నన్ను కుంగతీశాయి. ఇక జీవితం ముగిసిపోయినట్టేనని దుఃఖభారంతో ముడుచుకుపోయాను. నాలుగు గోడల మధ్యనా నన్ను నేను బంధించుకున్నాను. ఓ రకంగా జీవచ్ఛవంగా బతకుతున్న నాకు.. మా అమ్మ మళ్లీ పునర్జన్మ ఇచ్చింది. వ్యక్తిగా, రచయిత్రిగా కూడా. నా పుస్తకం ప్రచురించటానికి ఏ సంస్థా ముందుకు రాని సమయంలో, తన పెళ్లినాటి నగలను చేతిలో పెట్టి ముందుకు వెళ్లమని ప్రోత్సహించింది. ఆమెకు సదా రుణపడి ఉంటాను. అలాగే ఇంతకు ముందు నేను పని చేసిన ఛానళ్ల యజమానులు, సంపాదకులకు కూడా. వాళ్లు అలాగే ఉండకుండా మరో రకంగా ఉండుంటే, నాలో ప్రతిభ దాగి ఉందన్న విషయాన్ని గ్రహించగలిగే దాన్ని కాదు. ఇంత గొప్ప రచన చేయగలిగి ఉండే దాన్ని కాదు. అందుకే నేనేమంటానంటే మనకు తప్పనిసరిగా శత్రువులు ఉండాలి. లేకపోతే అలాంటి వాళ్లను మనం తయారుచేసుకుని తీరాలి.”

సభలో ఒకటే నవ్వులు. ఒక్కసారిగా కరతాళ ధ్వనులు. ఎవరో కుర్రాడు గట్టిగా ఈల కూడా వేశాడు.

“నా తోటి అక్కలకు, చెల్లెళ్లకు మనవి చేస్తున్నాను. మీ జీవితాన్ని సంపూర్ణంగా జీవించండి. మీరు రాయగలరా? బొమ్మలు వేయగలరా? నటించగలరా? మోడలింగ్ చేయగలరా? పర్వతారోహణ చేయగలరా? మీ మనసుకు నచ్చింది చేయండి. సమాజానికి భయపడకండి. భయానికి తలవంచకండి. మీరేమిటో నిరూపించుకోండి. ఎప్పుడూ మందలో ఒకరిగా ఉండకండి. మీ ప్రత్యేకతను చాటేలా, మీదైన వెలుగులు విరజిమ్మేలా… తగ్గేదే లే అనండి.”

కృత్తిక చెప్పుకుపోతోంది.

మునుపటి ఉత్సాహంతో తారాజువ్వలా ఎగిసిపడుతోంది.

ఆమెను అలా చూస్తుంటే తల్లికి మురిపెంగా అనిపించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here