మూడోరకం

0
9

[dropcap]ఇ[/dropcap]ది పది సంవత్సరముల క్రిందటి సంఘటన. అప్పుడు కరోనా భయం లేదు. జనం ట్రైన్లలో బస్సులలో క్రిక్కిరిసి ఒకరిపై ఒకరు పడిపోయి ప్రయాణించే మధ్యతరగతి జీవి అనుభవం. శివునికి మూడో నేత్రం ఉన్నట్లుగనే అతని సృష్టిలో ఆడ, మగ కాని మూడో రకం మనుషులు కూడా ఉన్నారు. వారి బ్రతుకుతెరువులో ఒక మార్గం రైలు ప్రయాణికులపై ఆధారపడి బ్రతికే విధం నేను చూసాను.

ఆ విషయమై నా ప్రయాణంలో అనుభవం నీతో పంచుకోవాలనుకుంటున్నానని చెప్పి ఈ విధంగా సంభాషణ కొనసాగించాను నా మిత్రుడు వెంకట రావుతో.

“ఆ రోజు ఊరెళ్ళానా చాలా ఇబ్బంది పడ్డాననుకో. ధన్‌బాద్ అలప్పి ఎక్స్‌ప్రెస్ సింగపూర్ స్టేషన్‌లో ఆగింది. ఇంజన్ తరువాత ఉన్న బోగీలోకి ఎక్కాలని ప్రయత్నం చేసాను. తలుపు తియ్యరే లోన ఉన్నవాళ్ళు. గట్టిగా కేకలు పెడితే తీసారు. లోన ప్రవేశించడం కష్టమైంది. తెల్లవారుజాము ఐదు గంటల సమయం కావడంతో జనం దారిలోకూడా దగ్గర దగ్గరగా కూర్చుని కునికిపాట్లు పడుతున్నారు. అడుగుతీసి అడుగు పెట్టడానికి వీలుకావడంలేదు. బండి కదిలింది. కొంత సేపటి తరువాత రాయగడ స్టేషన్ లో ఆగింది.

లోన ఉన్నవాళ్ళు దిగితే కదా చోటు అవడానికి ఇంకా పైనుంచి లోనికి రావడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈలోగా ఎవరో హిందీ భాషలో మాట్లాడుతూ టికెట్ చూపించమని, టికెట్ చూపిస్తే ఆడవాళ్ళ పెట్టిలోకి ఎక్కారు మగవాళ్ళు ఇరవై రూపాయిలు చొప్పున్న ఇవ్వండి ఒక్కొక్కరు అని దబాయించి కొంతమంది మగవాళ్ళ దగ్గర తీసుకున్నారు. ఒక సీట్లో కూర్చున్న ముగ్గురు మగవాళ్ళను లేవగొట్టి ఆడవాళ్ళను కూర్చోబెట్టారు. ఆ పైన ఉన్న బల్లపై కూర్చున్న ఒకతన్నికాలర్ పట్టుకుని లాగుతూ బీస్ రూప్యా దేవ్ అని తిట్టాడు. “బీస్ రూప్యా దేనేసే లేడీస్ బన్జాయేగా క్యా” అని అతడు గట్టిగా అనేసరికి అతన్ని వదిలేసి వెళ్ళిపోయాడు.

బండి బరువుతో కదిలింది. కొన్ని గంటలు ప్రయాణం సాగిన తరువాత పార్వతిపురం, బొబ్బిలి స్టేషన్ లలో ఆగి మరల స్పీడ్ అందుకుని విజయనగరం చేరింది. ఇక్కడ ఇంకో ఇద్దరు ముగ్గురు బోగీలో జొరబడి టికెట్లు అడిగి తీసుకున్నారు మగవాళ్ళ దగ్గరనుంచి. “ఇది లేడీస్ కంపార్ట్‌మెంట్ ఇందులోకి ఎందుకు ఎక్కారు?” అని టికెట్లు తిరిగి ఇవ్వలేదు. నా టికెట్ కూడా తీసుకున్నారు. నేను అన్నాను “నా టికెట్ ఇవ్వండి ప్రక్కబోగీలోకి వెళ్ళిపోతాను” అని. ఏమనుకున్నాడో ఏమో నా టికెట్ నాకు ఇచ్చేసాడు. నేను దిగి ప్రక్కబోగీలోకి అతికష్టంమీద వెళ్ళి డోర్ దగ్గర నిల్చున్నాను. అక్కడి నుంచి చూస్తున్నాను. ముందు బోగీలో టిక్కెట్లు కలెక్ట్ చేసినవాళ్ళు ప్లాట్‌ఫారంపై నడుస్తూ ముందుకు వెళ్ళారు. వారి వెనుక కొందరు మా టిక్కెట్లు మాకిచ్చేయండని వాళ్ళ వెంట పడ్డారు. వారి సంభాషణ హిందీ భాషలో సాగింది. వాళ్ళ విషయం ఏమైందో తెలియదు.

విజయనగరం స్టేషన్ విడిచి ట్రైన్ పరుగుతీసింది. బస్తాలో మొక్కజొన్న పొత్తులు నింపినట్లు ఒకరిమీద ఒకరు పడి నిల్చొని ఉన్న అంత రద్దీలో సమోసాలు అమ్ముకున్న అతను దూరి దూసుకెళ్తూ తోసుకెళ్తూ అమ్ముకుంటున్నాడు. ఒక బిచ్చగత్తె అతి దీనంగా అర్థిస్తూ జనం లోంచి నలిగిపోతూ ముందుకు సాగిపోయింది. చప్పట్లు కొడుతూ కొంతమంది మూడోరకం మనుషులు “దస్ రూప్యా నికాల్ నికాల్” అని అరుస్తూ ఇవ్వని యువకులను కసురుతున్నంత పని చేస్తున్నారు.

ఎవరో వాళ్ళతో గొడవ పడుతున్నారు. మారో మారో అన్నారు. నేను తలుపు దగ్గర ఉన్నాను. నా నోరు ఉండబట్టక “మారో మారో  ఇతనా బీడ్మే ఏ లోగ్ కా ఏ దందా క్యా హై?” అన్నాను. నన్ను గుర్తించలేరులే వాళ్ళు అనుకున్నాను. కానీ అంతలోనే నేను ఉన్న చోటికి వచ్చేసారు రామబాణంలా.

నా వైపు చూస్తూ గట్టిగా ఇలా అన్నారు. “మేము నీలా లేము. మేము కొజ్జాలం. మా కడుపు నిండేదెలా? మాకు అమ్మా నాన్నా లేరు. ఏదీ ఒక ఐదు రూపాయలు ఇవ్వు చూస్తాం?” అని వారిలో ఒక శాల్తీ అడిగే సరికి  బ్రతుకు జీవుడా అనుకుని ఐదు రూపాయలు తీసి ఇచ్చాను.

“మాతో పెట్టుకోకు నీ మర్యాద తీసేస్తాం, జాగ్రత్త” అని చెప్పి నన్ను వదిలి వెళ్ళారు. బుద్ది గడ్డి తిని ఆ మాట అన్నాను అనుకుని నన్ను నేను తిట్టుకున్నాను. వాళ్ళు వెళ్ళిపోయిన తరువాత నా ప్రక్కనే ఉన్న ఒక బీహారి కుర్రాడు “మేరా సెల్ మార్దియా” అని భోర్ మన్నాడు. ఈలోగా నేను దిగవలసిన సింహాచలం స్టేషన్ వచ్చింది. నలిగిపోయిన నేను బండి దిగి బ్రతుకు జీవుడా అనుకున్నాను.”

ఇదంతా విన్న తరువాత అప్పుడు వెంకట రావు నోరు విప్పి ఇలా అన్నాడు. “నీవు చెప్పిన మూడో రకం వారి కన్నా నిజమైన కొజ్జాలు ఎవరో గుర్తించావా?” అని అడిగాడు నన్ను. ఎవరు అన్నాను అర్ధం కాక. తప్పనిసరి పరిస్థితిలో లేడీస్ కంపార్ట్‌మెంట్ లోకి ఎక్కిన వాళ్ళ దగ్గర బీస్ బీస్ రూప్యాలు తీసుకున్నవాళ్ళు, కొందరి దగ్గర టిక్కెట్లు తీసుకుని డబ్బుల కోసం వాళ్ళకు ఇబ్బంది కలిగించిన వాళ్ళు నిజమైన కొజ్జాలు. జీతాలు తీసుకున్నా లంచాలకు చేతులు సాచే వాళ్ళు నీవు చెప్పిన మూడో రకానికి చెందినవాళ్ళు. వాళ్ళు శారీరకంగా మూడోరకం వాళ్ళు అయితే వీళ్ళు మానసికంగా మూడోరకం వాళ్ళు” అన్నాడు.

అతని భావోద్రేకానికి నాకు ఆశ్చర్యం కలిగింది. ‘అవును నిజమే’ అనగలిగాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here