మూడు పదులు ముప్ఫై కావ్యాలు – పుస్తక పరిచయం

0
8

[dropcap]ఉ[/dropcap]మ్మడిశెట్టి సాహితీ అవార్డు స్థాపించి 30 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా వెలువరించిన పుస్తకం ఇది. డాక్టర్‌ రాధేయ 1988 నుంచి 2018 వరకూ 30 ఏళ్ల పాటు ఈ అవార్డు ప్రదానం చేశారు.

ఈ పుస్తకంలో 30 వ్యాసాలున్నాయి. మొదటి అవార్డు పొందిన సౌభాగ్య గారి ‘కృత్యాద్యవస్థ’ నుంచి 30వ అవార్డు అందుకున్న ‘అమోహం’ వరకూ.. వాటిలోని కవిత్వాన్ని ఈ పుస్తకంలో విశ్లేషించారు రాధేయ.

***

“ముప్ఫై ఏళ్ళ కింద ప్రారంభమయిన ఉమ్మడిశెట్టి అవార్డు కొనసాగడం – అదొక అమూల్యమైన అవార్డుగా రూపొందడం. ఫ్రీవర్స్ ఫ్రంట్ తర్వాత గణించదగిన గుర్తుపెట్టుకోదగిన బహుమతిలా పురస్కారంలా కవులు స్వీకరించడం మామూలు విషయంగాదు.

ఈ 30 కవుల పుస్తకాల మీద రాసిన వ్యాసాలు చదవండి – ఆయా కవుల్ని వాళ్ళ నేపథ్యంతో సామాజిక సందర్బంలో సామాజిక జీవన తాత్వికతతో పట్టుకున్నారు. రాధేయ వ్రాసిన వ్యాసం చదివి, తర్వాత మళ్ళీ ఈ పుస్తకం చదివితే ఆయన చేసిన వ్యాఖ్య – పరిశీలన అర్థమవుతుంది. అదొక సృజన కార్యక్రమం” అన్నారు కె. శివారెడ్డి “రాధేయకి జై…” అనే ముందుమాటలో.

***

“ఒక వ్యక్తి చెయ్యవలసిన పనిని ఒక సంస్థ చేస్తే దానిని గురించి మనం మాట్లాడుకోవలసిన అవసరం లేదు. కాని ఒక సంస్థ చెయ్యవలసిన పనిని ఒక వ్యక్తి చేస్తే మనం దాని గురించి తప్పకుండా మాట్లాడుకోవాలి. అందుకే రాధేయ గురించి మాట్లాడుకోవాలి.

తాను 1988 నుంచి నేటి దాకా పురస్కారాలిచ్చిన కావ్యాల మీద రాసిన ముప్ఫై విమర్శ వ్యాసాల సంపుటిని ప్రచురించారు. ఇలాంటి పని సాహిత్య పురస్కారాలిచ్చే సంస్థలు గానీ, వ్యక్తులుగానీ తెలుగులో ఇంతవరకూ చేయలేదు. నాకు తెలిసినంతవరకు ఇతర భాషలలో కూడా జరగలేదు” అన్నారు ఆచార్య రాచపాళెం చంద్రశేఖరరెడ్డి “కవిత్వ జైత్రయాత్ర” అనే ముందుమాటలో.

***

“ముప్పయి కవుల కావ్యాల మీద రాధేయ వ్యాసాలు స్ఫూర్తిదాయకాలే. వ్యాసాలు అధ్యయనం చేస్తే ముప్పయ్యేళ్ళ కవిత్వ పరిణామం తెలుస్తుంది. తెలుగు సమాజంలో సంభవించిన సంచలనాలు బోధపడతాయి. భిన్న కవుల విభిన్న ఆలోచనా ధారలు అనుభవంలోకొస్తాయి. గత దశాబ్దాలలో మనిషి ఎదుర్కున్న ఆటుపోట్లు, జీవన సంఘర్షణలు అనుభవ వైవిధ్యాలు వ్యక్తీకరించబడిన తీరు రూపుకడతాయి. ప్రాంతీయ అస్తిత్వం గోచరిస్తుంది. తెలంగాణ కావొచ్చు, రాయలసీమ కావొచ్చు, ఉత్తరాంధ్ర కావొచ్చు. అక్కడి ప్రజల ఇక్కట్లు, పరిస్థితులు, బతుకుగతులు హృదయం తట్టి చూపుతాయి. స్త్రీల వేదనలు, దళితుల ఘోష అణగారిన సమూహాల ఆత్మనివేదన అర్థం చేయిస్తాయి” అన్నారు డా. నందిని సిధారెడ్డి “మూడు దశాబ్దాల ముచ్చట” అనే ముందుమాటలో.

***

“ఈ ‘మూడు పదులు ముప్ఫై కావ్యాలు -2018’ ఒక విలక్షణమైన సాహితీ సంప్రదాయానికి బాటలు వేసింది. రాధేయ స్వయంగా అవార్డు ప్రదాతయైనా, అవార్డు పొందిన కవితాసంపుటులపై చేసిన సమీక్షలు ఈ గ్రంథలో చోటు చేసుకున్నాయి.

నా వరకు 30 మంది కవుల కవిత్వాలను అవలోకిస్తే వారంతా మానవుణ్ణి కవితావస్తువుగా స్వీకరించి మానవత్వాన్ని ఆవిష్కరించినట్లనిపించింది” అన్నారు ఆచార్య మసన చెన్నప్ప “కవిత్వానికి ముప్పై ఏండ్ల పండుగ” అనే ముందుమాటలో.

***

“ఒక సాహిత్య సృజనగాని, సాహిత్యసంస్థగాని మూడు దశాబ్దాలు కొనసాగించడం సామాన్య విషయం కాదు. ఆ రెండింటినీ పక్కపక్కనే అంతకాలం కొనసాగించడం మరీ అసామాన్య విషయం. ఈ అసామాన్యాన్ని సుసామాన్యం చేసినవాడు రాధేయ.

సమకాలీన కవుల పట్ల రాధేయకి చాలా సానుకూల దృక్పథం ఉంది. ఆయా కవుల రచనల్ని ఆయన విశ్లేషిస్తున్న తీరే అందుకు నిదర్శనం” అన్నారు డా. పాపినేని శివశంకర్ “మూడు దశాబ్దాల ముచ్చటైన కృషి!” అనే ముందుమాటలో.

***

మూడు పదులు ముప్ఫై కావ్యాలు
రచన: రాధేయ
ప్రచురణ: ఉమ్మడిశెట్టి సాహితీ ప్రచురణలు
పేజీలు: 214.
వెల: ₹150/-
ప్రతులకు: అన్ని ప్రముఖ పుస్తక కేంద్రాలు,
డా. రాధేయ, 13-1-606-1, షిర్డినగర్, రెవెన్యూ కాలనీ, అనంతపురం 515001. ఫోన్: 9985171411

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here