మూగ ప్రేమ

1
10

[శ్రీ సిహెచ్. సి. ఎస్. శర్మ రచించిన ‘మూగ ప్రేమ’ అనే కథని పాఠకులకి అందిస్తున్నాము.]

[dropcap]మ[/dropcap]రువలేనిది..

మరపు రానిది..

మాతో మాట్లాడేది..

మైనా!.. ఒక నల్లరంగు పక్షి..

మా అమ్మగారి పెదతండ్రి.. రైల్వే ఉద్యోగి.. అప్పటికి వారు సర్వీస్‌లో తణుకులో వున్నారు..

నా వయస్సు పది సంవత్సరాలు..

కళ్లు మూసుకుంటే.. ఇప్పటికీ ఆ పంజరం.. అందులోని మైనా.. కళ్లల్లో గోచరిస్తోంది. మా అమ్మా నాన్నలు, తాతయ్య గారి కొడుకు మామయ్యగారి వివాహం.. తణుకులో జరిగింది. నేను మా అమ్మా నాన్న.. మా మామయ్య వివాహానికి వెళ్లాము. వివాహానంతరం మా కుటుంబం పెదతాతయ్యగారి ఇంటికి వెళ్లాము.

ఆ ఇంట్లో ముందు వరండా.. అందులో ఒక వైపు గోడకు దగ్గరగా ఒక పంజరం. అందులో పావురం సైజు నల్లని పక్షి.. చూచి ఆశ్చర్యపోయాను. నేనే కాదు మా అమ్మా నాన్నలు కూడా!..

“రండి.. రండి..” అంది ఆ పక్షి మమ్ములను చూస్తూ.

పంజరానికి దగ్గరగా మా అమ్మ చెల్లెలు తాతయ్యగారి కూతురు మా పిన్ని శాంతి మెల్లగా “రండి.. రండి..” అంది.

రెండవసారి మైనా పలికింది అదే పలుకులు..

“శాంతీ!..”

“ఏం అక్కా!..”

“ఈ పక్షి పేరేంటే!..” అడిగింది అమ్మ ఆశ్చర్యంతో.

నేను పరీక్షగా వారి ముఖాలను చూస్తున్నాను.

శాంతి పిన్ని ఏం చెబుతుందోనని.. అందరం ఆసక్తిగా ఆమె ముఖంలోకి చూస్తున్నాము.

“లక్ష్మీ!.. అల్లుడుగారూ!.. రండి ఇంట్లోకి… దాన్ని ఎంతసేపు చూస్తారు.. ఇంట్లో వుండే ముగ్గురు పిల్లలు చాలరని అయ్యగారు వెయ్యి రూపాయలిచ్చి.. కలకత్తానుంచి కొనుక్కొని వచ్చారు..” అంది అమ్మమ్మ నీరసంగా.

“పెద్దమ్మా!.. దాని వెల వెయ్యిరూపాయలా!..”

“ఒసే లక్ష్మీ.. ఆ మాట మీ పెదనాన్న నాకు చెప్పింది. అది మనందరిని చూస్తూ.. ఏం మాట్లాడితే అదే మాట్లాడుతుంది. దానిమీద మోజులో మీ పెదనాన్న ఇంకా ఎక్కువే ఇచ్చి తెచ్చారనుకొంటా!.. మనిషి నిజం చెప్పరుగా!..” మైనాను చూస్తూ విసుగ్గా చెప్పింది శాంతమ్మ అమ్మమ్మ.

“పిన్నీ ఎంతో బాగుందిగా!..”

“ఆ.. ఆ.. చాలా బాగుంది. ఇది వచ్చి రెండు సంత్సరాలయింది. వచ్చిన వారం పదిరోజులు మన వాకిట్లో ఆడా మగా జనం తిరుణాళ్లకి వచ్చినట్టు మన ఇంటికి వచ్చి దీన్ని చూచారు.”

“అత్తయ్యగారూ.. దానికి ఆహారం!..” అడిగారు నాన్నగారు.

“పక్కా శాకాహారి అల్లుడుగారూ!.. రెండు మూడు రోజులకోసారి మూడు నాలుగురకాల పండ్లను ఆ పండ్లను పంజరంలో వుంచుతా.. అరకేజీ చొప్పున తెప్పిస్తా.. దినానికి క్రమంగా నాలుగు వేళల్లో.. నేనే కాదు.. శాంత.. దుర్గ.. పాండురంగడు.. ఇంట్లో వుంటే మీ మామగారు.. చాలా శ్రద్ధగా చూచుకొంటారు.”

అమ్మ పంజరాన్ని సమీపించింది.

“ఆ.. నీ పేరేమిటి?..”

మైనా స్పష్టంగా చెప్పింది.

“టిఫిన్ తిన్నావా!..” నేను అడిగాను.

“టిఫిన్ తిన్నావా!..” మైనా ఎదురు ప్రశ్న వేసింది.

స్కూలునుండి మా చిన్నపిన్ని దుర్గ.. మామయ్య పాండురంగ వచ్చారు. మమ్మల్ని చూచి ఆప్యాయంగా పలకరించారు.

మేమంతా ఇంటికి వచ్చామని ఆ రోజు లీవు చెప్పి తాతయ్యగారు ఇంటికి వచ్చారు.

అందరం ఆనందంగా కబుర్లు చెప్పుకొంటూ భోంచేశాము. తాతయ్య మైనాకు జామ యాపిల్ ముక్కలను లంచ్ పెట్టారు. ఆనందంగా.. రెండు రోజులు అక్కడ మైనాతో రెండు గంటలుగా గడిచిపోయాయి.

***

మూడవ రోజు..

ఉదయాన్నే తాతయ్యగారు నేను నిద్రలేవకముందే నాలుగు గంటలకు లేచి కాలకృత్యాదులు.. స్నానం.. పూజ ముగించి ఏడు గంటలకల్లా స్టేషన్‌కు డ్యూటీకి వెళ్లారట. నేను లేచాక అడిగితే.. అమ్మ చెప్పింది.

“మా పెదనాన్న చాలా డిసిప్లెయిన్డ్ మనిషి.. తాను తప్పుగా మాట్లాడరు. నడుచుకోరు.. ఎంతో ఆత్మాభిమానం గల మనిషి..” సగర్వంగా తన పెద్దతండ్రిని గురించి అమ్మ చెప్పింది.

శాంతిపిన్ని కాలేజీకి.. దుర్గపిన్ని.. పాండురంగ మామయ్యలు స్కూలుకు వెళ్లిపోయారు.

తాతయ్యగారు రిక్షాలో పదిన్నరకు వచ్చి దిగారు. వారు భోజనానికి రావాల్సిన సమయం ఒంటిగంట.

“ఏంటండీ.. ఇప్పుడు వచ్చారు?..” ఆశ్చర్యంతో అడిగింది అమ్మమ్మ.. వారి ముఖంలోకి పరీక్షగా చూస్తూ.

తాతయ్య ముఖంలో చెమటలు.. ఏదో బాధ.. వరండాలోని కుర్చీలో కూర్చున్నారు.

“మామయ్యా!.. ఒంట్లో ఏమైనా నలతగా వుందా!..” నాన్నగారు తాతయ్యగారి చేతిని తాకి చూచారు.

“అయ్యా!..” మెల్లగా పలికారు తాతయ్యగారు.

“చెప్పండి మామయ్యా!..” ఆత్రంగా అడిగారు నాన్నగారు.

“గుండె కొంచెం.. నొప్పిగా వుంది..”

నాన్న వేగంగా వీధిలోకి వెళ్లి రిక్షాను పిలుచుకొని వచ్చారు.

అమ్మా అమ్మమ్మా ముఖాల్లో.. ఎంతో ఆందోళన.

అమ్మ.. తాతయ్య గుండెను మెల్లగా జవురుతూ.. “పెదనాన్నా! హాస్పటల్‌కు వెళతాంగా.. తగ్గిపోతుంది..” అంది.

“ఆ.. మామయ్యా.. లేవండి” తన చేతుల్లోకి తాతయ్య చేతులను తీసుకొని.. ఒకచేతిని వారి నడుము చుట్టూ వేసి.. మెల్లగా నడిపించి రిక్షాలో కూర్చోపెట్టారు. తనూ వారి ప్రక్కనే కూర్చున్నారు. “లక్ష్మీ!.. అత్తయ్యగారు నీవు మరో రిక్షాలో రండి..” అన్నారు.

“అలాగేనండీ!..” అమ్మ జవాబు.

అమ్మమ్మ కళ్లల్లో బాధతో కన్నీరు..

తాతయ్య నాన్న కూర్చున్న రిక్షా బయలుదేరింది.

అమ్మ వాకిట్లో నిలబడింది.. మరో రిక్షాను పిలిచింది.

అమ్మమ్మ.. అమ్మ నేను ఆ రిక్షాలో హాస్పిటల్‌కు బయలుదేరాము.

పనిమనిషి సీత “అమ్మగారూ!.. దిగులుపడకండి.. అయ్యగారికేంకాదు..” అంటూ అమ్మకు అమ్మమ్మకు ధైర్యం చెప్పింది.

ఇరవై నిముషాల్లో రిక్షా హాస్పిటల్‌కి చేరింది. అమ్మ రిక్షావాలాకు డబ్బులిచ్చింది. అమ్మ అమ్మమ్మా ఆత్రంగా హాస్పిటల్ వరండాలో ప్రవేశించారు.

నాన్న మాకు ఎదురైనాడు.

“అయ్యా!.. వారు!…” ఆత్రంగా అడిగింది అమ్మమ్మ.

“ఏమండీ.. పెదనాన్నకెలా వుంది.. డాక్టర్ ఏం చెప్పారు!..” అడిగింది అమ్మ.

“లక్ష్మీ!.. భయపడే అవసరం లేదు.. మైల్డ్ అటాక్.. డాక్టరుగారు ట్రీట్‌మెంటు ప్రారంభించారు.”

“అయ్యా!.. నేను వారిని చూడాలి!..” ఆత్రంగా, గద్గద స్వరంతో అడిగింది అమ్మమ్మ. “అత్తయ్యగారూ!.. వారికి ట్రీట్‌మెంట్ జరుగుతూవుంది. ముగియగానే డాక్టర్ నర్సులు మనలను పిలుస్తారు. మీరు భయపడకండి. ప్రశాంతంగా ఆ బెంచీపై కూర్చోండి అత్తయ్యగారూ!..” అనునయంగా చెప్పారు నాన్న.

కన్నీటితో అమ్మ, అమ్మమ్మ ఆ బెంచీపై కూర్చున్నారు.

నేను అయోమయంగా నాన్నగారి వంక… అమ్మ అమ్మమ్మ ముఖాలను చూచాను.

నా కళ్లల్లోనూ కన్నీరు. కారణం తాతయ్యకు ఏమవుతుందో అనే భయం..

నాన్న అటూ ఇటూ ఏదో ఆలోచనతో నడుస్తున్నారు. వారి ముఖంలోనూ.. విచారం.

మధ్యాహ్నం భోజనానికి వచ్చిన శాంతి దుర్గ పిన్నీలు.. పాండురంగా మామయ్య హాస్పిటల్‌కు వచ్చారు. వారి ముఖాల్లో ఆవేదన.. భయం.. నాన్న వారికి నచ్చచెప్పారు. కానీ వారి కళ్లల్లోను కన్నీరు ఆగలేదు.

అరగంట తర్వాత.. నర్స్ వచ్చి లోనికి రమ్మని పిలిచింది. నాన్న అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పలేదు..

అందరం ఆత్రంగా ఓ గదిలో ప్రవేశించాము.

నాన్నను చూచిన డాక్టర్..

“సార్!.. నా ప్రయత్నం నేను చేశాను.. కానీ ఫలించలేదు. సారీ సార్.” విచారంగా చెప్పాడు డాక్టర్.

అమ్మ, అమ్మమ్మ ఇద్దరు పనివారు మామా ఆ మంచం చుట్టూ చేరి భోరున ఏడవసాగారు. అయోమయావస్థలో ఏడుస్తూ నేను నాన్నగారి ముఖంలోకి చూచాను.

వారి కళ్లల్లోనూ కన్నీరు.

“సార్.. అంబులెన్సులో ఇంటికి పంపుతాను. మీరు వీరందిరినీ కంట్రోల్ చేసి బయటికి తీసుకొనిరండి..” విచారంగా చెప్పాడు డాక్టర్,

అది చిన్న హాస్పిటల్. ఆ డాక్టరుగారికి తాతయ్య బాగా పరిచయం. నాన్నగారు తనను తాను సంబాళించుకొని.. అతికష్టం మీద అమ్మమ్మను అమ్మను మిగతా వారిని ఆ గదినుంచి బయటికి తీసుకొని వచ్చారు.

మామయ్యతో చెప్పి రెండు రిక్షాలను పిలిపించాడు.

అమ్మ.. అమ్మమ్మా ఒక రిక్షా.. మరో రిక్షాలో ఇద్దరు పిన్నీలు నేను.. ఏడుస్తూ ఇంటికి బయలుదేరాము.

***

అరగంట తర్వాత.. అంబులెన్సు ఇంటిముందు ఆగింది. స్ట్రెచర్ పైన తాతయ్య శవాన్ని దించి వరండాలో చాపవేసి పడుకోబెట్టారు. అంబులెన్సు వెళ్లిపోయింది.

ఇరుగుపొరుగువారు వచ్చారు. అందరూ ఎంతగానో బాధపడ్డారు.

“ఇదికాదా ‘క్షణం చిత్తం.. క్షణం మాయం’ అనేది.. ఆరుగంటలపుడు ఠీవిగా స్టేషన్‌కు వెళ్లిన కలకత్తా సుబ్బయ్యగారు.. ఇక మనకు లేరు..” వయస్సు మీరిన పక్కింటి తాతయ్య ఏడుస్తూ అన్నాడు.

పంజరంలోని మైనా ‘కేర్.. కేర్..’ అని అరుస్తూ వుంది.

తాతయ్యనే చూస్తూ వుంది. తీగలను కొరుకుతూ బయటికి రావాలని ఎంతగానో ప్రయత్నిస్తూ వుంది. దాని ఆవేదన నాన్న గ్రహించారు. పంజర ద్వారాన్ని తెరచి దాన్ని చేతికి తీసుకొన్నారు.

అది ఎగిరి ‘కేర్.. కేర్..’ అంటూ తాతయ్య గుండెలపై వాలింది. కేర్.. కేర్.. అని అరవసాగింది. అందరికీ ఆశ్చర్యం.. దాని కళ్లల్లో కన్నీరు.

ఆగి ఆగి అరుస్తూ వుంది. తాతయ్య ముఖాన్నే చూస్తూవుంది.

అందరూ శోకసముద్రంలో మునిగిపోయారు.

ప్రియమైన హితులు.. ఇరుగు పొరుగువారు.. అమ్మమ్మ పిల్లలను ఓదార్చారు.

నాన్న ఫోన్లు చేసి బంధువులందరికీ తెలియజేశారు.

కొందరు సాయంత్రానికి వచ్చారు. ఆ రాత్రి మా అందరిపాలిటా కాళరాత్రి..

మరుదినం మధ్యాహ్న సమయానికి బంధువులు అందరూ వచ్చారు.

తాతయ్య అంతిమయాత్ర బయలుదేరింది.. నలుగురు మిత్రులయినవారు వాహకులు కాగా!

శవాన్ని శ్మశానంలో దించారు. అంతవరకూ మైనా తాతయ్యతోనే ప్రయాణం చేసింది. అరుస్తూ ఎంతగానో బాధ పడింది. దాన్ని గురించి వూరి వారందరికి, మా బంధువులకు తెలుసును కాబట్టి ఎవరూ దాన్ని వారించలేదు.

చితి పేర్చడం జరిగింది. మైనా పక్కనేవున్న చెట్టుపైకి ఎగిరింది.

పాండురంగ మామయ్య తాతగారికి తలకొరివి పెట్టాడు. చితిమంటలు తీవ్రరూపం దాల్చాయి. ఉన్నట్టుండి వేపచెట్టుపైని మైనా ‘కేర్.. కేర్’ అంటూ మంటల్లో పడిపోయింది. తన యజమానితో సహగమనం చేసుకొంది.

తన మూగ ప్రేమను ఆ విధంగా మైనా అందిరికీ తెలిసేలా చేసింది. ఆ దృశ్యాన్ని చూచి అందరూ ఆశ్చర్యపోయారు.. మైనాకు తాతయ్యకు విచిత్రమైన రుణానుబంధం అనుకొన్నారు.

(సమాప్తం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here