మోసకారి మోహనవంశి

    9
    6

    [box type=’note’ fontsize=’16’] లత వ్రాసిన ‘మోహనవంశి’ నవల చదవగానే ఒక పాఠకురాలిగా తనకు చాలా మోసపోయిన భావన కలిగిందని చెబుతూ ఎందుకో వివరిస్తున్నారు శ్రీవల్లీ రాధిక “మోసకారి మోహనవంశి” వ్యాసంలో. [/box]

    [dropcap]ల[/dropcap]త వ్రాసిన మోహనవంశి నవల చదవగానే ఒక పాఠకురాలిగా నాకు చాలా మోసపోయిన భావన కలిగింది.

    రాధాతత్త్వం పట్ల అసలేమాత్రమూ అవగాహన లేని రచయిత్రి తానీ నవలను రాధగా వ్రాశానని చెప్పుకోవడం ఒక వింత అయితే కృష్ణతత్త్వాన్ని ఆసాంతము ఆక్షేపించిన ఈ నవలని కృష్ణభక్తి కావ్యంగా ప్రచారం చేయడం మరొక వింత. అశ్లీలతతో అడ్డగోలు సంభాషణలతో అసంబద్ధ కల్పనలతో నిండిన ఈ నవలని అద్భుతమని పొగుడుతూ వుండడం, వాక్యనిర్మాణమే సరిగా లేని ఈ పుస్తకాన్ని వచనరచనా సౌందర్యానికి ఉదాహరణగా కొందరు చూపుతూ ఉండడం వింతలలోకెల్లా వింత.

    నవలలోని వైరుధ్యాలనన్నిటినీ ఏకరువు పెట్టాలంటే నవలకు రెండింతల పుస్తకం వ్రాయవలసి వస్తుంది. అంత శ్రమా సమయం దీనిపై వెచ్చించడం అనవసరం కనుక వాటిలో కొన్ని విషయాలను మాత్రమే ఈ వ్యాసంలో ప్రస్తావిస్తున్నాను.

    నవలకు నాయకుడు కృష్ణుడు కనుక మొదట అతని గురించి మాట్లాడుకుందాం.

    కృష్ణుడి పాత్ర చిత్రణ:

    “దీనికి నాయకుడు భగవానుడు వంశీ మోహనుడు. ఇదివరకు కృష్ణ భగవానుని గురించి చాలామంది వ్రాశారు. వారందరూ భగవంతుడే మానవుడుగా అవతారం ఎత్తాడని వ్రాశారు. నేను అలా వ్రాయలేదు. మానవుడే భగవంతుడయితే ఎలా ఉంటుందో వ్రాశాను.” అని చెప్తారు రచయిత్రి ఈ నవల చివర్లో ఇచ్చిన వివరణలో.

    అవును. ఈ నవలలోని కృష్ణుడు మనకు భాగవతంలో కనబడే కృష్ణుడు కాదు. రచయిత్రి భావాలలో నుంచి ఉట్టిపడిన కృష్ణుడు. మానవుడిగా పుట్టి అందరిచే భగవంతుడిగా భావించబడినవాడు. మానవుడిగా పుట్టినవాడు భగవంతుడిగా ఎలా భావించబడ్డాడు? ఏ లక్షణాలవలన? కృష్ణుడి పాత్రని రచయిత్రి ఎలా తీర్చిదిద్దారు? చూద్దాము.

    నవలలో మొదట్నుంచీ చివరివరకూ రచయిత్రి కృష్ణుడిని అందగాడు, తెలివైనవాడు అని పొగుడుతూ ఉంటారు. కొన్ని పాత్రల చేత పొగిడిస్తారు. ఏదో ఒక ప్రత్యేకమైన సందర్భాన్ని బట్టి కూడా కాదు. ఊరికే కృష్ణుడు వెన్నెల్లో కూర్చున్నాడు, ఆలోచిస్తున్నాడు అని చెప్పవలసి వచ్చినపుడు కూడా పొగడ్తలతో విశేషణాలతో ముంచెత్తుతారు.

    “మహా సౌందర్యవంతుడు అఖండమైన మేధస్సు గలవాడూ అయిన ఆ యువకుడి ఆలోచనలు అక్కడ లేవు” – ఇలాగన్నమాట. అయితే కృష్ణుడి గురించి మాట్లాడినపుడల్లా సౌందర్యం మేధస్సు అనే రెండు విశేషణాలను రచయిత్రి చేరుస్తూ ఉంటారు కానీ ఏ కారణం వలన అతడిని మేధావి అనుకోవాలో మనకి ఒక్కచోట కూడా అర్థం కాదు.

    కృష్ణుడిని “భగవంతుడు” అనుకోవడానికి కారణాలు ఇవేనని కూడా అందరూ చెప్తుంటారు (అందరూ అంటే నవలలో అతగాడిని భగవంతుడిగా భావించేవారందరూ). చివరికి వ్యాసుడు కూడా “నీవు సౌందర్యవంతుడివి, సత్యస్వరూపుడివి, మేధావంతుడివి, అందుకే నీవు భగవంతుడివి.” అని చెప్తాడు. ప్రత్యేకించి ఆత్మసౌందర్యం వంటి మాటలు వాడలేదు కనుక ఇక్కడ సౌందర్యవంతుడివి అంటే భౌతికమైన సౌందర్యం అనే అనుకోవాలి.

    ఎంత హాస్యాస్పదమైన నిర్వచనమిది! సౌందర్యం అనేది పూర్తిగా వ్యక్తిగతం. ఒకడికి అందమైనది మరొకడికి కాదు. సరే పోనీ అందరూ ఒప్పుకోగల మహాద్భుత సౌందర్యం ప్రపంచంలో ఉంటుందనే అనుకున్నా దానిని భగవంతుడిగా అంగీకరించవచ్చునన్న ప్రతిపాదన తర్కానికి లొంగదు. భౌతికసౌందర్యం అనే లక్షణాన్ని బట్టి ఒకరి గొప్పదనాన్ని నిర్ణయించవచ్చునని భౌతికవాదులైనా ఒప్పుకోలేరు కదా!

    ఇక సత్యం. సత్యం అనే మాటకి వేదాంతులు స్పష్టమైన నిర్వచనమే ఇచ్చి ఉండవచ్చు. కానీ ఈ నవలలో వ్యాసుడికీ కృష్ణుడికీ ఆ నిర్వచనాలతో పని లేదు. వీళ్ళ గోల వీళ్ళదే. కాబట్టి వ్యాసుడు తనని సత్యస్వరూపుడివి అనగానే “సత్యం అంటే వాచా అసత్యం ఆడకుండా ఉండటమేనా తమరి ఉద్దేశ్యం?” అని అడుగుతాడు కృష్ణుడు.

    ప్రశ్నలోనే తనకి కావలసిన సమాధానం ధ్వనించేటట్లుగా అడిగినట్లు అనిపిస్తున్నది కదా! నిజమే, వ్యాసుడు ఆ సంకేతం వెంటనే పట్టుకుంటాడు. పట్టుకుని “పూర్తిగా కాదు, ఆంతర్యంలో నీకు ఏది నిజం అనిపిస్తుందో దాన్ని ఆచరించాలి. అది సత్యం.” అని నిర్వచించేస్తాడు.

    సరిపోయింది. మనకేది నిజం అనిపిస్తే అదే నిజం. అలా తనకేది నిజం అనిపిస్తే దాన్ని ఆచరించేవాడు భగవంతుడు. బావుంది. అయితే కృష్ణుడు అక్కడితో ఆగడు. వెంటనే “పునర్జన్మ విషయం ఏమిటి? అంటాడు. ఎందుకంటే పునర్జన్మల గురించీ ఆత్మల గురించీ నవల మొదటి నుంచీ కూడా రకరకాల తికమకలలో ఉంటాడతను. రాధ దగ్గర కూర్చుని ఏవో నోటికొచ్చిన మాటలు మాట్లాడుతూ ఉంటాడు కానీ నిజంగా ఆ మాటల అర్థం ఏమిటో అతనికే తెలియదనీ “అందరూ చెప్తున్నది నేను ఒప్పుకోను, నేనొక కొత్త సిద్దాంతం చెప్తాను” అనాలన్న ఆరాటమే తప్ప ఆ కొత్త సిద్దాంతం ఏమిటన్న అవగాహన అతనికే లేదనీ ఆ వాక్యాలు స్పష్టంగానే అర్థం చేస్తూ ఉంటాయి.

    సరే, ఇప్పుడు తనలాగే మాట్లాడేవాడు మరొకడు దొరికాడు కదా అని వెంటనే “పునర్జన్మ విషయం ఏమిటి?” అని అడుగుతాడు కృష్ణుడు. దానికి వ్యాసుడు తడుముకోకుండా “అది ఒక మత్తుపదార్థం” అంటాడు.

    వెంటనే బాణంలా మరొక ప్రశ్న వేస్తాడు కృష్ణుడు “కర్మ సంగతి?” అని.

    “ప్రతిఫలం ఆశించకుండా నీకు ఏది విధి అనిపిస్తుందో దాన్ని అనుసరించటమే కర్మ. లేని పాపపుణ్యాలు దానికి ఏనాడూ అంటావు.” అని బహు సులభంగా చెప్పేస్తాడు వ్యాసుడు.

    ఈ సమాధానం వినగానే కృష్ణుడు ఏమంటాడో తెలుసా! “మహర్షీ ! ఇదంతా నాకు అయోమయంగా వుంది.” అంటాడు!!

    అదేమిటి? అయోమయమేముంది ఇందులో? అంటారా! అదే మరి, అదే ఈ నవలలోని విశిష్టత. కృష్ణుడు ఆమాట అనగానే, “అయ్యో పిచ్చి నాయనా! నీకు కావలసిందే చెప్పాడయ్యా వ్యాసుడు. నీకు ఏమి చేయాలనిపిస్తే అది చేయి, పాపపుణ్యాలనేవేవీ నీకు అంటవని చెప్పాడు” అని పాఠకులు మొత్తుకోవలసిందే కానీ “మేధావి” కృష్ణుడికి మాత్రం ఆయన చెప్పినది అర్థం కాదు.

    ఇలా ‘నాకు అయోమయంగా వుంది’ అన్న కృష్ణుడితో “నాయనా, నీవు మహాపురుషుడివి. నీవే ఈ చిక్కు విడదీయాలి.” అంటాడు వ్యాసుడు. రచయిత్రేమో “అతని సునిశితమైన మేధస్సులో ఆలోచనలు గుత్తులు కడుతున్నాయి” అంటూ మళ్ళీ పొగడ్తలు మొదలుపెడుతుంది, నాకు అయోమయంగా ఉందంటూ అతగాడు తన సునిశితమైన మేధను తానే క్షణం క్రితం బయటపెట్టుకున్నాడన్న విషయం మర్చిపోయి.

    భగవంతుడికి నిర్వచనంగా మూడు అర్థం లేని లక్షణాలు చెప్పడమే ఒక లోపం అనుకుంటే ఆ మూడు లక్షణాలనైనా నాయకుడిలో సమర్ధవంతంగా చూపించలేకపోవడం మరింత లోపంగా కనిపిస్తుంది ఈ నవలలో. కృష్ణుడు నాకు అయోమయంగా వుంది అని ఇక్కడ వాచ్యంగా చెప్పాడు కానీ నవల ఆద్యంతమూ అతడు మాట్లాడే ప్రతీ మాటా అతడి అయోమయాన్ని మనకి అర్థం చేస్తూనే ఉంటుంది. ఇక సత్యం – సత్యం అతగాడిలో ఏమాత్రం వుందో కూడా నవలలో బయటపడుతూనే ఉంటుంది. ఇదే వ్యాసంలో మరొక చోట ప్రస్తావించిన సంభాషణ చదివితే ఆ విషయం అర్థమవుతుంది.

    సరే, ఇంతకీ ఈ సౌందర్యం, సత్యం, మేధస్సు అనేవి మూడూ భగవంతుడి లక్షణాలని చెప్పారు కదా! దాని మీద ‘మేధావి’ కృష్ణుడు కాస్త ఆలోచన చేస్తాడు. “అంతేనా, ఈ మూడు ఎవరికి ఉంటే వారు భగవంతుడు అయిపోతారా! మరయితే ఈ లక్షణాలు సత్యవతీదేవికి, సవ్యసాచికి, పాండవ పత్నికీ కూడా ఉన్నాయి కదా! వారికంటే నాకు అధికంగా ఉన్నదేమిటి?” అని ప్రశ్నించుకుని అది “ప్రేమ” అని కనిపెడతాడు. తమాషా ఏమిటంటే కృష్ణుడు అనుకునే “ప్రేమ” కూడా ఆ ముగ్గురిలో ఉంది మరి! అది కృష్ణుడికి అప్పుడు ఎందుకు తోచలేదో తెలియదు.

    ఎందుకంటే అంతకు ముందరి సన్నివేశంలో స్వయంగా కృష్ణుడే అనుకుంటాడు ఆమాట. అయిదుగురు భర్తలతో ద్రౌపది ఎలా ఉంటోందని అర్జునుడిని అడుగుతాడు కృష్ణుడు. “చాలా సహజంగా ఉంటుంది. మేము అయిదుగురమూ ఒకే వ్యక్తిగా భావిస్తోంది” అంటాడు అర్జునుడు. అపుడు కృష్ణుడు “తను ప్రతి స్త్రీని రాధగా చూసినట్లు పాంచాలి కూడా చూస్తోందన్న మాట” అనుకుంటాడు. ఆమాట మరి ఇపుడెందుకు గుర్తు రాలేదో తెలియదు.

    ప్రతి స్త్రీలో రాధని చూడటమంటే ఏమిటి? ప్రతి స్త్రీలో రాధని చూడగలిగితే మరి ఇక రాధ ప్రత్యేకత ఏమిటి? ఇలాంటి ప్రశ్నలు వేసుకోవడం అనవసరం. చెప్పాను కదా అలా వేసుకోవడం మొదలుపెడితే నవలలో ఏ ఒక్క వాక్యానికీ అర్థం లేదు. రచయిత్రి సూటిగా వ్రాసిన భావాలూ మాటలూ అవి ఎంత అసంబద్ధమైనవైనా సరే వాటిని అలాగే స్వీకరించి కనీసం వాటినైనా రచయిత్రి వైరుధ్యాలు లేకుండా చూపారా అన్న విషయాలని మాత్రమే మాట్లాడుకున్నా అవి నవలని మించి పోతాయి.

    సరే, ఇంతకీ ఇతరులకంటే అధికంగా తనకి ఉన్న “మహాలక్షణం” ప్రేమ అని కృష్ణుడు కనిపెట్టాడు కదా! కృష్ణుడి దృష్టిలో ప్రేమకి ఉన్న అర్థం ‘ఏకకాలంలో ఎంతమందినైనా ఇష్టపడగలగడం, స్త్రీలందరిలోనూ రాధని చూడగలగడం’. అది నవలలో ఆసాంతమూ అర్థమవుతూనే ఉంటుంది. అయితే మరొక సందర్భంలో కృష్ణుడు చేసిన ఒక ఆలోచన చదివినపుడు నిజంగా నివ్వెరపోతాము. అటువంటి వాడి మనసు లోతుల్లో ప్రేమకి ఉండగల నిర్వచనమేమిటని ఆలోచిస్తే భయమూ వేస్తుంది. ఆ పాత్రపై అసహ్యమూ వేస్తుంది. ఆ సందర్భం చెప్తాను. శ్యమంతక మణి కోసం అడవిలోకి వెళ్ళినపుడు అతని గురించి రచయిత్రి ఇలా వ్రాస్తారు.

    “బలప్రయోగం చేత ప్రాణికోటిని వశపరచుకోవడం సులభ సాధ్యమా! లేక ఆకర్షణ చేత వశపరచుకోవడం సుఖసాధ్యమా! ఈ ప్రశ్నకి సమాధానం అతనికి త్వరలోనే దొరికింది. కత్తిని ఒరలో పెట్టి వంశీని చేతిలో పుచ్చుకుని అడవిలోకి అడుగు పెట్టాడు అతను” అని.

    ధ్యేయం “వశపరచుకోవడం” అయినపుడు అతడు కత్తిని వాడాడా మురళిని వాడాడా అన్న భేదం వలన వచ్చే ఔన్నత్యం ఏమీ లేదు. నిజానికి మొదటిది వాడటంలో కనీసం నిజాయితీ ఉంది. రెండవది మోసం.

    అవతలి వారి మనసును ద్వేషంతో కాక స్నేహంతో గెలుచుకోవాలి అనే మాటని సాధారణంగా వాడుతూ ఉంటాము. నిజమే. అయితే అక్కడ మనసును గెలుచుకోవడం అన్న మాటలో ‘వారికి సంతోషం కలిగించడం’ అనే అర్థం వుంది కనుక అది తప్పుగా అనిపించదు. అంతేకాదు, ఆ వాక్యం మనసులో ద్వేషాన్ని కాక స్నేహాన్ని పెంచుకోవడం యొక్క ప్రాముఖ్యాన్ని గురించి మాట్లాడుతోంది. కనుక అది మంచి వాక్యమే. కానీ ఇక్కడ వాడిన “వశపరచుకోవడం” అన్న మాట వేరు. ఇది నాయకుడి మనసులోని భావమే దోషపూరితమని చెప్తోంది. ఇది కేవలం పదాన్ని వాడటంలో రచయిత్రి చూపిన అజాగ్రత్త కాదనీ నాయకుడి భావంలోనే ఉన్న దోషమనీ అనుకోవడానికి దోహదపడే మరొక అంశం ఏమిటంటే – తన వంశీ గానానికి అడవిలో జంతువులన్నీ పరవశిస్తే ఆ పారవశ్యం చూసి కృష్ణుడు “తనలో తను నవ్వుకుంటాడు”. గమనించారా! ‘కృష్ణుడు చిరునవ్వు నవ్వాడు’ కాదు, ‘కృష్ణుడు తనలో తను నవ్వుకున్నాడు.’ అంటే కృష్ణుడి మనసులో ఉన్నది స్నేహం కాదు పరిహాసమనమాట! ఈ మాట కూడా రచయిత్రి పొరపాటునే వ్రాశారు, కృష్ణుడి భావం నిజానికి అదికాదు అంటే – మరి నవల మొత్తమూ ఇలా పొసగని మాటలే వ్రాస్తే దానినే సొగసని పొగడడం కుదరదు కదా!

    నిజానికి ఈ ‘తనలో తను నవ్వుకున్నాడు కృష్ణుడు’ అన్న మాటని నవలలో లెక్కలేనన్ని సార్లు వాడతారు రచయిత్రి. ఎవరేం మాట్లాడినా అతడు ముందు నవ్వుతాడు. ఆగండి, దీనిని వాల్మీకి రాముడి విషయంలో చెప్పిన స్మితభాషి లక్షణం అని భ్రమపడకండి. ఎందుకంటే ఈ నవలలో కృష్ణుడు అవతలివారు ఏదైనా అభిప్రాయం చెప్తే ముందు నవ్వి, ఆ తర్వాత ఒక పరిహాసపు మాట అంటాడు. తనంతట తాను ఏదైనా విషయాన్ని గమనించినపుడూ గ్రహించినపుడూ తనలో తను నవ్వుకుంటాడు. ప్రపంచం మీదా దాని అజ్ఞానం మీదా పరిహాసమనమాట! (బహుశా అదే మేధావి లక్షణమని రచయిత్రి ఉద్దేశ్యం కావచ్చు)

    ఇంకొక విషయం చెప్పాలిక్కడ. అడవిలో వేణువు వూది జంతువులని వశపరచుకుంటాడని చెప్తారు కదా రచయిత్రి. అయితే అది కాసేపే. కాసేపు అలా పారవశ్యంలో వుండిపోయిన అడవిజంతువులు మళ్ళీ తమ అసలు బుద్ధి చూపిస్తాయి. అప్పుడు కత్తి తీసి పులిని రెండుగా చీల్చేస్తాడు కృష్ణుడు. అంటే ఇతగాడిలో జగన్మోహనత్వమే కాదు వీరత్వమూ వుంది అని చెప్పాలని రచయిత్రి ప్రయత్నం కావచ్చు. కానీ ఆ రెండిటినీ ప్రదర్శించడానికి ముందుగా మన మేధావి కృష్ణుడు ఈ రెండిటిలో ఏది సుఖం? అని ఆలోచించి సిద్దాంతం చేసే ప్రయత్నం చేయడంవలన మొదటికే మోసం వచ్చింది.

    అన్నట్లు మోసం అంటే గుర్తొచ్చింది. వశపరచుకోవడమే ధ్యేయమయినపుడు కత్తిని వాడడంలో కనీసం నిజాయితీ ఉంది మురళిని వాడడం మోసం అన్నాను కదా ఇంతకు మునుపు. సరిగ్గా ఇవే మాటలు కృష్ణుడు ద్రౌపదితో అంటాడు ఈ నవలలో మరో సందర్భంలో. “మనిషికీ అడవి జంతువు తోడేలుకీ ఒక భేదం ఉన్నది సోదరీ! ఆ మృగం చంపుతా జాగ్రత్త అని ముందే హెచ్చరిస్తుంది. అప్పుడు మనం తిరిగి పోట్లాడి ప్రాణం రక్షించుకోవచ్చును. లేదా పారిపోవచ్చును. కానీ మానవుడు అలా కాదు. అతను నవ్వుతూ నవ్వుతూనే ఎదుటివాడి ప్రాణాలు తోడివేస్తాడు.”

    ఇప్పుడు అడవిలో ఈ కృష్ణుడు చేసింది సరిగ్గా ఇదే పని కదా!

    కృష్ణుడి పాత్రచిత్రణ ఎలా ఉందో, అసలు నవలలో సంభాషణలు సన్నివేశాలు ఎలా కల్పించబడ్డాయో అర్థం కావడానికి ఇంకొక్క సంఘటన చెప్తాను. కృష్ణుడు విదర్భ దేశం నుంచి రుక్మిణిని ఎత్తుకు వచ్చే ఘట్టం. అదంతా సినిమా ఫక్కీలో వుంటుంది. అది అయిపోయాక, వాళ్ళు ద్వారక చేరగానే ఎర్రనీళ్ళు తీసి రుక్మిణిని లోపలికి తీసుకు వెళ్తుంది దేవకి. అపుడు రుక్మిణి జాలిగా కృష్ణుడి వంక చూస్తుంది. కృష్ణుడు “వెళ్ళు రాకుమారీ.. వివాహం అయ్యేవరకూ అమ్మ నాతో ఒంటరిగా వదలదు నిన్ను.” అని నవ్వుతాడు.

    అంటే, అలా తీసుకువచ్చిన రుక్మిణిని సంప్రదాయం ప్రకారం తర్వాత కృష్ణుడు వివాహం చేసుకున్నాడనే కదా! భాగవతంలోనూ అదే చదివాము. కనుక సరే బానేవుంది అనుకుంటాము. రుక్మిణి జాలిగా చూడడం, కృష్ణుడు నవ్వుతూ ఆ మాటలు అనడం – వాటిలో ఔచిత్యం ఉందా లేదా లాంటి విషయాలు ఈ నవలలో పట్టించుకోకూడదు అని అప్పటికే అర్థమయి ఉంటుంది కనుక పట్టించుకోము.

    వివాహఘట్టాన్ని ప్రత్యేకంగా వర్ణించలేదు కనుక అదేదో మనము భాగవతం నుంచి తెచ్చిపెట్టుకున్న ఊహ అనుకోనక్కరలేదు. ఈ సన్నివేశం తర్వాత కృష్ణుడు రాధ దగ్గరకు వెళ్ళి “కుండిన రాకుమారి. నా ధర్మపత్ని” అని రుక్మిణి గురించి చెప్తాడు కూడా.

    సరే, ఇక్కడ ఈ ఘట్టం పూర్తయ్యాక మరొక యిరవై పేజీల తర్వాత కృష్ణుడు సత్యవతీ దేవిని చూడటానికి వెళ్తాడు. అప్పుడు ఆవిడ “పెళ్ళి చేసుకున్నావా బాబూ!” అని సూటిగా ఒక ప్రశ్న అడుగుతుంది. ఆ ప్రశ్నకి కృష్ణుడు నవ్వుకుని “పెళ్ళంటే ఏమిటి?” అని ఎదురు ప్రశ్న వేస్తాడు. ఆవిడ “అందరు పెట్టుకునే ముడినే పెళ్ళి అంటున్నాను నాయనా!” అనగానే “ఆ రకం వివాహం నేను చేసుకోలేదులే అవ్వగారు! చేసుకోను కూడా. మనసయిన కన్నెను మొన్ననే ఎత్తుకు వచ్చాను.” అంటాడు.

    ఇది అబద్ధం కదా! ఎందుకు ఆడినట్లు ఈ అబద్ధం కృష్ణుడు ! బడాయి కోసం అనుకోవాలా!

    సరే పోనీ పెళ్ళి చేసుకున్నవాడు చేసుకున్నానని చెప్పకుండా ఇంకేదో విప్లవాత్మకమైన పని చేసినట్లు ముసలావిడ దగ్గర బడాయి పోయాడులే అనుకుంటే ఆ తర్వాతి సంభాషణ ఇలా ఉంటుంది.

    “నీ హృదయాన్ని చూరగొన్న స్త్రీ పేరేమిటి?”

    “రాధ”

    ఆ సమాధానం విని ఆవిడ ఆశ్చర్యపోతుందట. ఎందుకంటే అంతకు ముందే పాండవ పత్ని ద్వారా అతని భార్య పేరు రుక్మిణి అని ఆవిడ విని ఉన్నదట. మరి అతని భార్య పేరు రుక్మిణి అని తెలిసినపుడూ ఆ పేరు అంత స్పష్టంగా గుర్తున్నపుడూ అసలు నీ భార్య పేరేమిటి అని ఆవిడ ఎందుకడిగిందో, అంతకన్నా ముందు పెళ్ళి చేసుకున్నావా బాబూ అన్న ప్రశ్న ఎందుకు వేసిందో అర్థం కాదు.

    ఇక్కడితో అయిపోలేదు. ఇపుడు కొసమెరుపు చూడండి. సత్యవతి ప్రశ్నకు జవాబుగా ‘రాధ’ అన్నాడు కదా కృష్ణుడు. అది విని మళ్ళీ ఆవిడ “నీ భార్య పేరు రుక్మిణి అని విన్నాను!” అంటుంది. దానికి “మీరు భార్య పేరు అడగలేదు అవ్వగారు! నా హృదయాన్ని చూరగొన్న స్త్రీ పేరు అడిగారు” అంటాడు కృష్ణుడు.

    చూశారా! రుక్మిణి ‘భార్య’ అట. హృదయాన్ని చూరగొన్న స్త్రీ కాదట. మరి ఇంతకుముందే కదా ఆమె గురించి ‘పెళ్ళి చేసుకోలేదు, మనసయిన కన్నెను ఎత్తుకు వచ్చాను’ అని చెప్పాడు!

    ఇలా ఉంటాయి సంభాషణలు. ఇదంతా (సత్యవతీదేవి ప్రశ్నలు కృష్ణుడి జవాబులు) ఒకే పేజీలో వరుసగా వున్న సంభాషణ సుమా! ఇంత అడ్డగోలుగా అసలెవరైనా వ్రాస్తారనీ దానిని అచ్చు వేస్తారనీ ఈ పుస్తకం చదవక పోతే నమ్మగలిగి ఉండేదాన్ని కాదు నేను.

    రాధ పాత్ర చిత్రణ:

    “ఈ నవల నేను రాధగా వ్రాశాను” అన్నారు రచయిత్రి. “ఇది వ్రాసిన లత – జయదేవుడికీ మీరాకీ వారసురాలు. యుగయుగాల క్రిందట యమునా తీరంలో వంశీమోహనుడి కోసం తమాల వృక్ష ఛాయల్లో ఎదురు చూసిన రాధాదేవి ఆంతర్యం ఇరవయ్యో శతాబ్దిలో ఎన్నుకున్న మరో శరీరం ఈ లత” అని చెప్పుకున్నారు.

    ఇది అబద్ధం. ఆమాట రచయిత్రే అదే చివరిమాటలో అంతకన్నా ముందే చెప్పారు. కృష్ణుడిని భగవంతుడి అవతారంగా భావించి ఈ నవల వ్రాయలేదని తానే చెప్పారు. మరలాటపుడు రాధ ఎలా అవుతారు? జయదేవుడికీ మీరాకీ వారసులు ఎలా అవుతారు? వాళ్ళు కృష్ణుడి మాహాత్మ్యాన్ని ఒప్పుకున్నారు. ‘దానిదేముంది? కృష్ణుడి మాహాత్మ్యాన్ని ఒప్పుకోకపోయినా వారివంటి భక్తురాలు కావచ్చు కదా!’ అనడానికి వీలు లేదు. ఎందుకంటే వ్రజగోపికల భక్తిలో మాహాత్మ్య జ్ఞానం అనేది ఒక కీలకమైన అంశం. దాన్ని తీసి వేస్తే మొత్తం వారి భక్తి స్వరూపమే మారిపోతుంది.

    (నారదుడు భక్తిసూత్రాలలో వ్రజగోపికల భక్తిని ఉదాహరిస్తూ “తత్రాపి న మాహాత్మ్యజ్ఞాన విస్మృత్యపవాదః” అని స్పష్టంగా చెప్తాడు కదా!)

    ఆ విషయం గ్రహించలేదు కనుకనే రచయిత్రి కాళియ మర్దనం, గోవర్ధనమెత్తడం వంటి కృష్ణుడి బాల్య లీలలన్నిటినీ తీసేసి నవల ఎత్తుకోవడమే స్త్రీలకి కృష్ణుడిపై ఉన్న ఆకర్షణని వివరించడంతో ఎత్తుకున్నారు. ఆపైన శరీర వర్ణనలు, నాట్యాలు, సంఘ సంస్కరణలు వగైరా చేర్చారు. అర్థం పర్థం లేని మాటలు మాట్లాడించి కృష్ణుడి పాత్రపై చిరాకు కలిగేలా చేశారు. రాధ పాత్రనీ అంతకంటే అభాసుపాలు చేశారు. కృష్ణుడిని సుందరుడు, మేధావంతుడు అంటూ మిగిలిన పాత్రలు పొగిడినట్లుగానే కృష్ణుడు కూడా రాధ గురించి కొన్ని నిర్వచనాలు చెప్తుంటాడు. రాధ ఎవరు? అని అడిగితే వివిధ సందర్భాలలో అతను ఇచ్చే సమాధానాలు ఇలా వుంటాయి.

    “ప్రపంచంలోని స్త్రీత్వం. మానవుడి ఆంతర్యంలోని మాధుర్యం.”

    “వేయి స్వర్గాల సుఖం! కోటి సౌఖ్యాలమూర్తి”

    ఇలాటి మాటలతో కృష్ణుడు రాధని పొగుడుతుంటాడు కానీ నేరుగా ఆమెని చిత్రించిన సన్నివేశాలలో కానీ ఆమెతో చెప్పించిన సంభాషణలలో కానీ రాధ అసలేమాత్రమూ మనసును ఆకట్టుకోదు.

    కృష్ణుడు యమునా తీరంలో వెన్నెల్లో కూర్చుని ఉంటాడు. అక్కడికి రాధ వస్తుంది. ఏమిటి ఆలోచిస్తున్నావు? అంటుంది. కృష్ణుడు “ఏం లేదు రాధా! ఏ బ్రహ్మ వరం చేతనో ఇంద్రపూజ చేతనో కాకుండా మానవుడు తనకు తానై జీవితాన్ని అభివృద్ధి చేసుకుంటూ ముందుకు సాగిపోలేడా అని ఆలోచిస్తున్నాను.” అంటాడు. అపుడు రాధ పకపకా నవ్వి “ఈ సుందర యమునా తీరంలో రాధా సహితుడైన వంశీ మోహనుడు చేయవలసిన తత్వ విచారమేనా వంశీ?” అంటుంది.

    ఇలా ఉంటుంది ఈ నవలలో రాధ. ఇది నవల మొదట్లో రాధ మాట్లాడే మాట. ఇక దాదాపుగా నవల చివర్లో ఆమె మాట్లాడే మాట కూడా ఒకటి చెప్పుకుందాం.

    గ్రాంథికమైన జ్ఞానమూ, బ్రహ్మవిద్యా, నిర్గుణ జ్ఞాన యోగమూ వీటి సంగతి ఏమిటి? అని అడుగుతాడు కృష్ణుడు రాధని. దానికి ఆవిడ “వంశీమోహనుని ప్రేమ రసామృతం కన్న, అతని ప్రేమ మాధురి కన్న నిరాకారమూ నీరసమూ అయిన బ్రహ్మవాదం బలమైనది కాదు. అదీగాక ఈ సన్యాసి విభూతిని రాగరాగిణులైన వ్రేపల్లె వాసులు ఒప్పుకోరు. సౌఖ్యమూ సత్యమూ సౌందర్యమూ నిండిన ఆరాధన కన్న రసహీనమైన బ్రహ్మవాదం స్వార్థపరులు కల్పించిన వికృతపుటూహ ఏ విధంగానూ గొప్పది కాదు వంశీ” అంటుంది.

    ఇలా మాట్లాడే రాధని వ్రజగోపిక అంటే ఒప్పుకోవడమెలా కుదురుతుంది? పైగా రచయిత్రి చెప్పినట్లు ఈ నవలలోని కృష్ణుడు మానవుడే అయితే అపుడసలు ఈ కృష్ణుని మీద ప్రేమకీ బ్రహ్మవిద్యకీ మధ్య పోలిక తేవడమెందుకు! కృష్ణుడు భగవంతుడు అయితే అతడ్ని చేరడానికి భక్తిమార్గం గొప్పదా జ్ఞానమార్గం గొప్పదా అని చర్చించాలి కానీ మానవుడైన కృష్ణుడి ప్రేమ పొందడానికి ఈ చర్చలు ఎందుకు?

    రాధే కాదు తపతి అని మరో పిల్ల ఉంటుంది. ఆమె రాధ అంత జ్ఞాని కాదు అమాయకురాలు (ఈ నవల ప్రకారం). ఆ పిల్ల దగ్గర కూర్చుని “అయితే పూజలూ హోమాలూ అక్కర్లేదంటావా” అని అడుగుతాడు కృష్ణుడు. దానికి ఆ పిల్ల “అనవసరం దొరా, మనసు కన్న దేవాలయము లేదు, మమత కన్న పూజలూ లేవు” అని సమాధానం చెప్తుంది. ఆపాత్ర అంతంత పెద్ద మాటలు మాట్లాడటంలో ఔచిత్యం ఉందా లేదా అన్న విషయం పక్కన పెడితే ఇక్కడ కూడా మానవుడైన కృష్ణుడిపై ప్రేమకీ దేవుడికి చేసే పూజలకీ పోలిక తేవడం అసలు అనవసరం కదా!

    అలా కాదు, ఈ కృష్ణుడు మానవుడే. కానీ ఈ మానవుడైన కృష్ణుడిని ప్రేమించడం కంటే దేవుడికి చేసే పూజలూ హోమాలు కూడా ముఖ్యం కాదు వాళ్లకి – అని చెప్తున్నారు రచయిత్రి అంటారా! అపుడు “మనసు కన్న దేవాలయం లేదు, మమత కన్న పూజలూ లేవు” అన్న మాట రాకూడదు. అలా చెప్పడంలో ‘భగవంతుడికి దేవాలయానికి వెళ్ళి పూజలు చేయనక్కరలేదు, ఆయనపై మన మనసులో మమత వుంటే చాలు’ అనే అర్థం వస్తుంది కానీ ‘ఆ భగవంతుడికి దేవాలయంలో చేసే పూజల కన్నా ఈ (మానవుడైన) కృష్ణుడిపై నా మనసులో మమత ముఖ్యం’ అనే అర్థం రాదు.

    వ్రాస్తున్న దాని పట్ల రచయిత్రికి స్పష్టత లేకపోవడం వల్లనే ఇలాంటి అసంబద్ధమైన మాటలతో నవల నిండిపోయింది.

    మరికొన్ని అంశాలు:

    ముఖ్యమైన పాత్రలు రెండిటి గురించీ చెప్పుకున్నాము. అయితే మిగిలిన పాత్రల చిత్రణలో కూడా చాలా అనౌచిత్యాలు ఉన్నాయి. ముఖ్యంగా వ్యాసుడి పాత్రచిత్రణ అసలే మాత్రమూ ఒప్పుకోలేనట్లుగా ఉంది. వ్యాసుడు, భీష్ముడు, కర్ణుడు, సత్యవతీ, ద్రౌపదీ – వీళ్ళందరి గురించి వ్రాసిన మాటలకీ వాళ్ళతో చెప్పించిన విషయాలకీ అటు ప్రమాణమూ లేదు, ఇటు ఔచిత్యమూ లేదు.

    రచయిత్రి చేసిన కల్పనలలో అడుగడుగుకీ వైరుధ్యాలున్నాయి. కృష్ణుడు వ్రేపల్లెలో నిర్వహించిన గణతంత్ర సభలు, కంసుడి రాజ్య నిర్వహణ వివరాలు – ఇలాంటి వాటిని రచయిత్రి ఎక్కడి నుంచి తీసుకున్నారో వాటికి ఆధారాలేమిటో చెప్పలేదు. వాటిలోనూ అనౌచిత్యాలున్నాయి కానీ అవన్నీ ఈ వ్యాసంలో ప్రస్తావించడం లేదు. అలాగే రాజరిక వ్యవస్థ మొదలైన వాటి గురించి చేసిన వ్యాఖ్యల వంటివి వాటినవే ఖండించుకుంటాయి కనుక ప్రస్తావించుకోనవసరం లేదు.

    శైలి, వాక్యనిర్మాణమూ అసలు బాలేవు. వ్యాసంలో అక్కడక్కడా పేర్కొన్న వాక్యాలు చూస్తే ఆ విషయం కొంత అర్థమవుతుంది. కొంత అని ఎందుకంటున్నానంటే అంతకంటే భయంకరమైనవి నవలలో చాలా ఉన్నాయి కనుక. వాక్యాలే కాదు కొన్ని పదాలు కూడా చాలా చిరాకు పెట్టాయి. ఉదా: దేముడు.

    ఇక అక్కడక్కడా చేసిన తత్త్వ బోధల గురించి ఒక రెండు మాటలు చెప్తాను. వాటిలో కొన్ని భలే నవ్వు తెప్పిస్తాయి. సత్యవతీ దేవి కృష్ణుడికి చేసే తత్త్వబోధ చూడండి. “ఊపిరి పీల్చడం, జీవితాన్ని ఆస్వాదించడం, స్త్రీ పురుషులు అన్యోన్యాకర్షితులవడం, తిండి తినడం ఇవన్నీ విధులు అంటే మనం ఎలా కావాలంటే అలా మలుపుకోగలం. వీటికి అతీతమైనది మరోటి వున్నది. జన్మ, చావు. ఈ రెండింటి సూత్రాలను చేతుల్లో పెట్టుకున్న మహాశక్తి. ఆ శక్తిని తెలుసుకోవాలంటే ఇలాంటి నికృష్టపు పనులు చేయనవసరం లేదు.” (నికృష్టపు పనులంటే దేవ పితృకార్యాలు, యజ్ఞాలు).

    భావం జ్ఞానం సంగతి ఎలా ఉన్నా కనీసం వాక్య నిర్మాణం కూడా సరిగా లేని ఈ తత్త్వ బోధల గురించి ఏం మాట్లాడుకుంటాం? దేవకికి కృష్ణుడు చేసే తత్త్వోపదేశం ఒకటి ఉంది. అదయితే ప్రలాపనకి పరాకాష్ట. దేనినైనా చదివి తట్టుకోగల వారయితే ఫరవాలేదు కానీ కొంచెం బలహీనులయితే అది చదవడం ప్రమాదమే.

    ముగింపు:

    “నాకు మొదటినుంచీ కృష్ణుడి కథ చిత్రంగా ప్రతిధ్వనిస్తుంది. సాంఘికంగా ఏ నిబంధననీ, ఏ ధర్మాన్నీ అతడు పాటించలేదు. అయినా తత్వవేత్త అయినాడు. భగవంతుడయినాడు” అంటారు రచయిత్రి ఈ నవల వ్రాయడానికి నేపధ్యాన్ని చెప్తూ.

    ఈ అవగాహనే తప్పు. కృష్ణుడు సాంఘిక నిబంధనలనీ ధర్మాలనీ ఎంత నిష్ఠగా పాటించాడో భాగవతమూ భారతమూ కూడా స్పష్టంగానే చెప్తాయి. ఆ విషయాన్ని పరిగణించకుండా తనకున్న తప్పుడు అవగాహనతోను దానిని సమర్థించే కల్పనలతోను కృష్ణుడిని చిత్రించారు రచయిత్రి.

    రచయిత్రి బహుశా భారత భాగవతాలను ఒక్కసారైనా చదవలేదు. ఆనోటా ఈ నోటా విని ఉన్నారంతే. ఈ మాట ఎందుకనవలసి వస్తున్నదంటే, నవల మొదట్లో రచయిత్రి యదేచ్చగా చేసిన కల్పనలే కాకుండా నిష్ప్రయోజనంగా చేసిన వక్రీకరణలు కూడా ఉన్నాయి. అవి కావాలని కాక తెలియకనే చేశారని అనిపిస్తుంది. ఉదాహరణకి కంసుడి గురించి తెలిసినపుడు కృష్ణుడు “సొంత చెల్లెలి పిల్లల మైన మామీద కంసుడి కోపానికి కారణం?” అని అడుగుతాడు నందుడిని. దేవకి కంసుడి సొంత చెల్లెలు కాదు కదా! ఆవిషయం తెలిస్తే బహుశా రచయిత్రి పనిగట్టుకుని “సొంత” అనేమాట వ్రాసి ఉండేవారు కాదు.

    అలాగే శీతాకాలంలో వ్రేపల్లెలో యువతులు వ్రతం చేస్తారని చెప్పే సందర్భంలో తపతీ, చంద్రికా, నీరజా అని ప్రత్యేకంగా ముగ్గురి గురించి చెప్తారు. వాళ్ళు ముగ్గురూ వ్రతం చేసినట్లూ వాళ్ళ వస్త్రాలే కృష్ణుడు అపహరించినట్లూ వ్రాస్తారు రచయిత్రి. ఈ నవల ప్రకారం వాళ్ళు ముగ్గురూ వివాహితలు. భాగవతంలో కాత్యాయనీ వ్రతం చేసినవారు కన్నెపిల్లలని బహుశా రచయిత్రి గమనించలేదు. ఇలాంటివి చాలా ఉన్నాయి, ఒకటి రెండు ఉదాహరణలు చెప్పానంతే.

    భాగవతమే కాదు, భగవద్గీత కూడా చదవినట్లు లేదు రచయిత్రి. కాని భగవద్గీత నుంచి తరచుగా వినబడుతుండే కొన్ని మాటలని తీసుకుని ఆ పారిభాషిక పదాల అర్థాన్నైనా తెలుసుకోకుండా తాను తిరిగి నవలలో వ్రాయడానికి ప్రయత్నించారు. ఈ క్రింది ఉదాహరణ చూడండి.

    నవల మొదట్లో కృష్ణుడు రాధతో చేసే చర్చలలో అతడు మాట్లాడే మాటలు ఇలా ఉంటాయి.

     “..జన్మ పూర్తయ్యే దాకా ఒకే ఆత్మ ఉండటం, అది మరణానంతరం మరో శరీరాన్ని ఎన్నుకోవటం విషయం గురించి నాకు నమ్మకం ఏర్పడలేదు”

    “… శరీరాలతో పాటు ఆత్మకూడా పరివర్తనం పొందుతుంది. ఈ పరివర్తన బట్టే నేను ఆత్మకి సంబంధించిన శాశ్వతత్వాన్ని ఎంత మాత్రమూ అంగీకరించను.”

    “.. నేనే వస్తువునూ శాశ్వతం అని అంగీకరించను. ఏది ఉన్నదో అది ఉద్భవిస్తున్నది. ఏది ఉద్భవిస్తుందో అది ప్రవృద్ధి అవుతుంది. ఏది ప్రవృద్ధి పొందినదో అది నశిస్తుంది.”

    నవల చివరి అధ్యాయంలో కృష్ణుడు అర్జునుడితో చెప్పే మాటలు ఇలా వుంటాయి.

     “మరణిస్తారని నీవు బాధపడుతున్న ఈ సైనికులంతా మరో జీవితం ప్రారంభిస్తారు. మరణం ప్రాణానికి అంతం కాదు. ప్రాణి మరో నూతన శరీరాన్ని నిర్మించుకోవడానికి చేసే ప్రయత్నమే మరణం.”

     “పదార్థం నిత్యమైనది. మరణించిన శరీరం బాహ్య చక్షువులకి నశించినట్లు వుంటుంది. కాని అది మరో రూపాంతరం చెందుతుంది. ప్రాణం మరో కొత్త శరీరాన్ని ధరిస్తుంది.”

    “దేహం జీర్ణవస్త్రం లాంటిది. పాతది చిరిగితే నూతన వస్త్రాన్ని ధరిస్తాము. … అది అఖండమైన మహాస్రవంతి.”

    ఈ రెండిటినీ చూడగానే అవి ఒకదానికొకటి విరుద్ధంగా ఉన్నాయని అర్థమవుతుంది. అయితే పైపైన చదివినవారికి నవల మొదట్లో చెప్పిన మాటలు శాస్త్రవిరుద్ధంగా వున్నాయని నవల చివర్లో చెప్పిన మాటలు భగవద్గీతకి కొంచెం దగ్గరగా ఉన్నాయని అనిపిస్తుంది. కొంచెం జాగ్రత్తగా చదివేవారికి మాత్రమే చివర్లో చెప్పిన వాక్యాలు కూడా భగవద్గీతను చదివి అర్థం చేసుకుని చెప్పిన మాటలు కావనీ వినికిడి జ్ఞానానికి కొంత అజ్ఞానాన్ని జోడించడం వలన ఏర్పడిన మాటలనీ అర్థమవుతుంది.

    చిత్రమేమిటంటే రచయిత్రి తాను నవల మొదట్లో వ్రాసిన మాటల్లోని దోషమూ గ్రహించలేదు. చివర్లో వ్రాసిన మాటల్లోని దోషమూ గ్రహించలేదు. ఆ రెండిటి మధ్యా వున్న వైరుధ్యాన్నీ గమనించుకోలేదు..

    భాగవతం నుంచి తీసుకున్న ఒకటి రెండు మాటలు కూడా బాగా ప్రసిద్ధమైనవీ తరచుగా వినబడుతూ ఉండేవి మాత్రమే. అయితే అక్కడ పారిభాషిక పదాలు లేవు కనుకా భావం సరళంగా ఉంది కనుకా సులభంగా నవలలో జోడించడానికి వీలయ్యింది. ఉదాహరణకి కృష్ణుడు మథురకు వెళ్ళి సుదాముడిని చూసినపుడు అతగాడు “ప్రభూ! అనుక్షణం నా పూలమాలలతో నిన్ను అలంకరించడం, అలా నిన్ను ఆరాధించే మరికొందరితో స్నేహం, అపారమైన దయ – ఇవి కావాలి.” అని అడుగుతాడు. రచయిత్రి ఇక్కడ “నీపాదకమల సేవయు” పద్యభావాన్ని తీసుకున్నారని అర్థమవుతోంది కదా!

    చివరిగా చెప్పుకోవలసినది ఏమిటంటే, భాగవతంలో నుంచి ఇలాంటి ఒకటి రెండు మాటలూ సంఘటనలూ తీసుకున్నప్పటికీ, భాగవతంలో కనిపించే పేర్లు తెచ్చి ఈ నవలలోని పాత్రలకి పెట్టినప్పటికీ, రాధాదేవి కలియుగంలో మళ్ళీ ఎంచుకున్న శరీరమే ఈ లత అని రచయిత్రి చెప్పుకున్నప్పటికీ, రాధాకృష్ణుల చిత్రాన్ని అట్టమీద ముద్రించి ‘రాధా మాధవుల ప్రేమని మనముందుంచిన లత’ అంటూ ప్రచురణకర్తలు ప్రచారం చేసినప్పటికీ – ఇందులోని నాయకుడు భారత భాగవతాలలో చెప్పబడిన కృష్ణుడు కాదు. ఈ నవలలోని నాయిక వ్రజగోపిక కాదు. ఇందులో రచయిత్రి వ్యక్తపరచినది గోపికాభక్తి కానేకాదు.

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here