మదర్

0
9

[box type=’note’ fontsize=’16’] డా. కమల్ చోపడా రచించిన హిందీ కథని తెలుగులో అందిస్తున్నారు డా. టి.సి. వసంత. [/box]

[dropcap]”నీ[/dropcap]లో రక్తం చాలా తక్కువగా ఉందమ్మా! హార్మోనులలో కూడా తేడా వచ్చింది. ఇక ఇప్పుడు కొంతకాలం తల్లివి కాలేవు” అంటూ మందులకు సంబంధించిన కొన్ని స్ట్రిప్స్‌ని, కొన్ని నోట్లని డాక్టరు ఆమె చేతిలో పెట్టాడు.

ఇంటికి తిరిగి వెళ్ళిపోతున్నాను కదా అని ఆమె ఎంతో సంతోషపడ్డది. విపరీతంగా వాచిన ఆమె కాళ్ళలో చురుకుతనం వచ్చింది. అడుగులు వేగంగా పడుతున్నాయి. ఇక ఇప్పటినుండి తన భర్తతో, పిల్లలతో కలిసి ఉండవచ్చు. ప్రాణాలకన్నా మిన్న అయిన పిల్లలను తను ముద్దాడుతుంది. దాదాపు ఆరు సంవత్సరాల నుండి ఈ ఆసుపత్రిలో ఉంటుంది. ఇక్కడ హాస్టల్ ఉంది. తనని ఇంటికి పోనీయకుండా కట్టడిచేశారు. ఇక్కడైతే రెగ్యులర్ చెకప్ చేస్తారు. మందులు ఇస్తారు. అంటురోగాలు రాకుండా రక్షణ ఉంటుంది.

పని దొరకకపోవడం వల్ల భర్త నానాతిప్పలు పడేవాడు. ఇంటిల్లిపాదికి పస్తులుండాల్సి వచ్చేది. చిన్నపిల్లలు ఆకలితో అలమటించేవాళ్ళు.

“నీ భార్యను సరోగేట్ మదర్‍గా తయారు చెయ్యి. గర్భం అద్దెకు ఇవ్వాలి అంతేగా! ఇంటి పరిస్థితి మెరుగుపడుతుంది. ఇంటిల్లిపాదికి నాలుగు ముద్దలు దొరుకుతాయి. తొమ్మిది, పదినెలలో రెండు మూడు లక్షలు సంపాదించవచ్చు. ఇందులో తప్పేముంది? వాళ్ళ పిల్లలని వాళ్ళకు ఎటూ అప్పగిస్తావు” అంటూ ఆమె భర్తకు ఎవడో సలహా ఇచ్చాడు.

భార్య ససేమిరా ఒప్పుకోలేదు. భర్త అన్నివిధాలా ప్రాధేయపడ్డాడు- “నేనా ఏ పని చేయలేకపోతున్నాను. నీవే ఇప్పుడు ఇంటికి దిక్కు. నువ్వే అందరి బాగోగులు చూడాలి. రెక్కాడితే డొక్కాడదు. ఎంత గాలించినా పని దొరకడం లేదు. పిల్లల దయనీయ పరిస్థితి చూడు. శరీరంపైన ఒక్క పేలిక అయిన లేదు. కడుపులో ఒక్క మెతుకు లేదు. గుడిసెలో గింజ లేదు. ఆకలి… ఆకలి… తొమ్మిది నెలలేగా.. నీవలన పిల్లల కేరింతలు ఇల్లంతా ప్రతిధ్వనిస్తాయి. మరుభూమిగా మారిన మన గుడిసెలో మళ్ళీ వసంతాగమనం అవుతుంది. నీకు ప్రకృతి ఇచ్చిన గొప్ప వరం ఇది. గొప్ప శక్తి. ఇదంతా సేవ, పుణ్యం, త్యాగమే కదా!”

తన ప్రాణాల కన్నా మిన్న అయిన పిల్లల కోసం, తన గర్భాన్ని అద్దెకు ఇవ్వడానికి ఆ తల్లి ఒప్పుకుంది. భర్త అద్దెకు తీసుకుని భార్యని ఆసుపత్రిలో వదిలేసి వెళ్ళిపోయాడు. మొట్టమొదటిసారి నిస్సంతానమైన ఆ దంపతుల ఒళ్ళో తన పేగును తెంచుకుని పుట్టిన పిల్లవాడిని పెట్టింది. ఆమె మనస్సు బాధతో గిలగిలా కొట్టుకుంది. దంపతుల కళ్ళలో కృతజ్ఞతాభావం, ఆనందాశ్రువులు.

డాక్టరు, ఆమె భర్త మధ్య ఇచ్చిపుచ్చుకోవడాలు బాగా పెరిగాయి. మొదటి ప్రసవం అయ్యాక రెండు మూడునెలలకు మళ్ళీ ఆమె గర్భంలో పిండాన్ని పెట్టారు. మళ్ళీ మూడోసారి గర్భాన్ని అద్దెకు ఇచ్చింది. మధ్య మధ్యలో డాక్టరు నుండి అద్దె తీసుకోడానికి భర్త వచ్చేవాడు. భార్యని కూడా కలిసేవాడు.

“ఇప్పుడు నీ ప్రాణాలకన్నా మిన్న అయిన పిల్లలకు తిండికీ, బట్టకీ, ఏ లోటూ లేదు. ఇంటిల్లిపాదికి నాలుగు ముద్దలు దొరుకుతున్నాయి. ఇంటి పరిస్థితి చాలా మెరుగుపడింది” అని భర్త అనేవాడు.

భర్త మాటలు విన్నాక భార్య ఆనందానికి హద్దులు ఉండేవి కావు. తన బాధలన్నింటినీ మరిచిపోయేది. ఈ త్యాగం అంతా భర్త పిల్లల కోసమేగా.

కాని ఈసారి డాక్టరు తనని తల్లి కావడానికి అన్‍ఫిట్ అని చెప్పి ఇంటికి వెళ్ళిపొమ్మన్నాడు.

ఇంటికి వెళ్తూ ఆమె ఆలోచిస్తోంది. తన గర్భాన్ని భర్త అద్దెకు ఇచ్చాడు. ప్రతీ ప్రసవం తనకు చావు బతుకులే. తనకు పుట్టిన పిల్లలు మరెవరినో అమ్మా అని పిలుస్తారు. ఇంట్లో తన ఇద్దరు పిల్లలు ఉన్నారు. వాళ్ళు తనని అమ్మా అని పిలుస్తారు. వీళ్ళ కోసమే కదా పడరాని పాట్లు పడ్డది. బస్సులో తన గుడిసెకి వెళ్ళింది. భర్త గుడిసె అమ్మేశాడని, ఎక్కడికో వెళ్ళిపోయాడని అక్కడి వాళ్ళు చెప్పారు. ఆమె కాళ్ళు బాగా వాచిపోయాయి. ఆ కాళ్ళకింద భూమి కదిలినట్లయింది. గాలి పీల్చడం కష్టతరం అయిపోయింది. దారితప్పి అటూ ఇటూ తిరుగుతూ భర్త పాత స్నేహితులను జాడ అడిగి చివరికి ఎట్టాగొట్టా భర్త కొత్తింటికి వెళ్ళింది. భర్త రెండో పెళ్ళి చేసుకున్నాడని తెలిసింది. వాళ్ళిద్దరూ పిల్లలతో కలిసి ఉంటున్నారని తెలుసుకుంది. భార్యను చూడగానే భర్త ముఖం మొటమొటలాడిపోయింది.

“నీవు అపవిత్రం అయిపోయావు. శీలం చెడిన ఆడదానివి. చరిత్ర హీనురాలివి. నాతో ఎట్లా ఉంటావు?” అని నిర్దాక్షిణ్యంగా అడిగాడు.

తన పిల్లలకు కౌగిలించుకోవాలని అనుకున్నది. ప్రాణాలకన్న మిన్న అయిన పిల్లలు. ముందడుగు వేసింది. కాలం క్రూరమైన పంజా విసిరింది. పిల్లలు తన దగ్గరికి వస్తారు అని ఆశపడ్డది. ఆశ అడియాస అయింది.

“నీవు ఎవరివి? మాకు తెలియదు. మా అమ్మ లోపల ఉంది” అని పిల్లలన్నారు.

ఆ తల్లి మనస్సు బాధతో గిలగిలా తన్నుకుంది.

(మూల కథ దిల్లీ నుంచి వెలువడే ప్రముఖ హిందీ మాసపత్రిక ‘హంస్’ నవంబరు 2020 సంచికలో ప్రచురితరం).

హిందీ మూలం: డా. కమల్ చోపడా

తెలుగు అనువాదం: డా. టి. సి. వసంత

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here