మౌన రాగం

2
12

[మణి గారి ‘మౌన రాగం’ అనే రచనని పాఠకులకి అందిస్తున్నాము.]

[dropcap]ని[/dropcap]శీధి రాత్రి.
అంతటా నిశ్శబ్దం.
ప్రవహిస్తున్న గోదావరి కాలువ.
లంగరు వేసిన గూడు పడవ.
ఆ పడవలో, గుడ్డి దీపంతో కాపలావాడిలా నిలబడ్డ లాంతరు.
వుండి వుండి కళ్ళు పెద్దవి చేసి అటూ ఇటూ చూస్తోంది.
అప్పుడు, అన్ని వేపులకి ప్రసరిస్తున్న ఆ దీప కిరణాలు నీటి మీద మెరుస్తూ పలకరించబొతుంటే, శబ్దం చేయనీకుండా లోపలకి లాక్కుంటోంది ఆ నీటి ప్రవాహం.
ఒడ్డు మీద వున్న చెట్టు గూడులో తల్లి రెక్కల కింద ఒదిగి వున్న పక్షి పిల్ల, వచ్చీ రాని రెక్కలు ఆడిస్తూ బయటకి రాబోతూంటే రెక్కలు చాచి దగ్గరకి లాక్కుని నిద్ర లోకి జారింది తల్లి పక్షి.
చంద్రుడిని అల్లరి పెడ్తున్న నక్షత్రాల నుంచి దూరంగా, చంద్రుడు నీటిలో దాగే ప్రయత్నం చేస్తుంటే, రాత్రి దేవి శబ్దం చేయొద్దని మందలిస్తోంది.
తడిసిన చంద్రునితో పాటు నక్షత్రాలు, వెలుగులని నీటి మీద ఆరవేసాయి సడి చేయకుండా.
గాలి కూడా జడి చేయకుండా మౌనం గా వుంది.
చుట్టూ వున్న చెట్లు రుషులులా, తపస్సులో మునిగి వున్నాయి.
అక్కడక్కడ పడివున్న పెద్ద పెద్ద బండ రాళ్ళు వెన్నెలలో, సమాధిలో వున్న మహత్ములలా, కాంతివంతంగా మెరుస్తున్నాయి.
పగటి హడావిడికి అలిసిపోయిన చరాచర ప్రపంచం అంతా రాత్రి ఒడి చేరి, ఆ నిశ్శబ్దంలో సేద తీర్చుకుంటోంది.
పిల్లలని దగ్గరకి చేర్చుకున్న తల్లిలా రాత్రి దేవి ఏ శబ్దాన్నీ దగ్గరకు రాకుండా నిశ్శబ్దానికి పహారా కాస్తోంది.
రాత్రి చీకటిలో విచ్చుకునే జాజి, పారిజాతం లాంటి పూలు సౌరభాలతో సందడి చెయ్యబోతుంటే,
“ఉష్!” అంటూ వారిస్తూన్నాయి ఆకులు, కొమ్మలు.
సంరంభాలన్నీ తమలోనే దాచుకొని చప్పుడు చేయకుండా
సౌరభాలు వెదజల్లసాగాయి పూలు.
ఆ నిశ్శబ్దపు నిశీధిలో,
ఊపిరి తీసుకుంటే కూడా ఆ నిశ్శబ్దం ఎక్కడ భగ్నమవుతుందో అని ఊపిరి బిగపెడ్తూ,
కాస్త కూడా శబ్దం చేయని, ఆ రాత్రి అందాలని చూస్తూ, ఒడ్డున నేను.
ఆ అందాలకి పరవసించిన గుండె, గొంతును శబ్దం చేయని మాటలతో నింపసాగింది.
కానీ ఆ మాటలు,
మూగవయినా
గులక రాళ్ళళ్ళా, అర్థ రహిత శబ్దాలు చేస్తున్నాయి.
వాడిన పూలలా వ్యర్థమై రాలిపోతున్నాయి.
అందుకే నిశ్శబ్ద వీణపై మౌన రాగంలో ఆలాపన మొదలు పెట్టాను.
వేదిక లేదు.
గాయకుడు లేడు.
శ్రోతలూ లేరు.
అంతం లేకుండా ఆలాపన మాత్రం అలానే సాగుతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here