మౌనమె నీ భాష ఓ మూగ మనసా!-4

0
13

[శ్రీమతి జి. ఎస్. లక్ష్మి రచించిన ‘మౌనమె నీ భాష ఓ మూగ మనసా!’ అనే మినీ నవలను ధారావాహికగా అందిస్తున్నాము.]

[గతం గుర్తు చేసుకుంటూ ఉంటుంది మీనాక్షి. ఢిల్లీలో సెమినార్‍కి వెళ్తుంది. ఆమె వచ్చేసరికి రాజమండ్రి వెళ్ళటానికి ఏర్పాట్లు చేసి ఉంచుతానని చెప్తాడు తండ్రి రాఘవ. ఐదు రోజుల ట్రిప్‍కని, మీనాక్షి ఢిల్లీ వెళ్ళిన సమయంలోనే రాఘవ చార్‍ధామ్ యాత్రలకని ఓ యాత్రా బస్‍లో బయల్దేరుతాడు. సదస్సులో తన పేపర్ ప్రెసెంట్ చేస్తుంది మీనాక్షి. కొందరు ప్రొఫెసర్లు లేవనెత్తిన సందేహాలను తీర్చి వారి ప్రశంసలను పొందుతుంది. బసకి రాగానే రిసెప్షన్‍లో ఉన్న అమ్మాయి ఓ షాకింగ్ న్యూస్ చెబుతుంది – పూనే నుంచి ఫోన్ వచ్చిందనీ, రాఘవ వెడుతున్న యాత్రా బాస్ లోయలో పడి అందరూ చనిపోయారని! క్రుంగిపోతుంది మీనాక్షి. ఎలాగొలా పూనేకి చేరుకుంటుంది. తండ్రిని కోల్పోయి ఒంటరిదైపోతుంది. ఆ సమయంలోనే మీనాక్షి పెదనాన్న రామనాథం అక్కున చేర్చుకుంటారు. ఇంతలో అన్నం వడ్డించేయమంటూ ప్రభాకరం పిలవడంతో వర్తమానంలోకి వస్తుంది. తనకి జరిగిన సన్మానానికి సంతృప్తి చెందిన ప్రభాకరం అందుకు కారణం – మీనాక్షి తన ఇల్లాలిగా రావడం, తనకి చేదోడువాదోడుగా ఉండడమేనని అంటాడు. బదులుగా అచ్చమైన ఇల్లాలిగా జవాబు చెబుతుంది మీనాక్షి. సంతోషంగా నిద్రపోతాడు ప్రభాకరం. అతన్ని అలా చూస్తూ మళ్ళీ గతంలోకి వెళ్తుంది మీనాక్షి. తండ్రి పోయాక ఏర్పడిన ఒంటరితనాన్ని తట్టుకోలేకపోతుంది. తన కూతురి పెళ్ళికి ఎప్పుడు బయల్దేరుతున్నారో కనుక్కుందామని రామనాథం ఫోన్ చేస్తే, జరిగిన విషయమంతా చెబుతుంది. ఆయన వచ్చి మీనాక్షిని తీసుకువెళ్తానంటే, వద్దని తానే వచ్చేస్తానని అంటుంది. కానీ టికెట్ కొనడానికి సంశయిస్తుంది. తనని వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటారో అనుకుంటుంది. ఆయన మళ్ళీ మళ్ళీ ఫోన్ చేస్తుండడంతో, టికెట్ బుక్ చేసుకుని రాజమండ్రి చేరుతుంది. స్టేషన్‍కి వచ్చిన రామనాథాన్ని సులువుగా గుర్తుపట్టి పలకరిస్తుంది. ఆయన, పెద్దమ్మ, అక్కలు – మీనాక్షిని ఆప్యాయంగా చూసుకుంటూ బెరుకు పోగొడతారు. రామనాథం పెద్ద కూతురు కరుణ పెళ్ళికి రామనాథం గారి మిత్రుడు శివరామయ్య గారు కుటుంబ సమేతంగా వస్తారు. వాళ్ళకి మీనాక్షి బాగా నచ్చుతుంది. రామనాథంతో సంబంధం ప్రస్తావన తెస్తారు. రామనాథం మీనాక్షి అభిప్రాయాన్ని కనుక్కోడానికి ఆమెతో మాట్లాడుతారు. ఇక చదవండి.]

అధ్యాయం 7

[dropcap]మీ[/dropcap]నాక్షి సైకాలజీలో రీసెర్చ్ చేస్తూ, రేపో మాపో డాక్టరేట్ అందుకోబోతున్న పిల్ల. ప్రభాకర్ ప్రయివేటుగా ఎమ్.ఎ. చేసి, ఏదో చిన్న కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. మీనాక్షి పెరిగిన పరిస్థితులకీ, రాజమండ్రిలో ప్రభాకరం కుటుంబం నడుపుకునే పరిస్థితులకీ చాలా తేడా ఉంది. అక్కడ పెరిగిన చదువుకున్న పిల్ల ఇక్కడి ఆచార, సాంప్రదాయాల్లో ఇమడగలదా!..

రామనాథంగారు ఎప్పటినుంచో తనకి తెలిసిన శివరామయ్యగారి కుటుంబం గురించి వివరాలన్నీ మీనాక్షికి చెప్పారు.

ప్రభాకరం తండ్రి శివరామయ్య రాజమండ్రీలో పనిచేస్తున్న ఒక చిన్న ప్రభుత్వోద్యోగి. ప్రభాకరం తర్వాత అతనికి ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. భార్య సహకారంతో, ముగ్గురు పిల్లలతో ఇంటిని పొదుపుగా నడుపుకుంటూ మధ్యతరగతి మనస్తత్వం ప్రకారం ఇంట్లో మాట బైట పడకుండా గుట్టుగా సంసారం చేసుకునే మనిషి.

ఊళ్ళో కాలేజీలోనే డిగ్రీ వరకూ చదువుకున్న ప్రభాకరం తండ్రి కోరిక మన్నించి అప్పట్నించే ఉద్యోగాల వేటలో పడ్డాడు. కానీ నిరుద్యోగ సమస్యకున్న తీవ్రత వల్ల మూడేళ్ళు గడిచినా అతనికి ఎక్కడా ఉద్యోగం దొరకలేదు. అలాగని ప్రభాకరం ఊరికే కూర్చోలేదు. ఒకవైపు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూనే మరోవైపు ఉద్యోగం కోసం కొన్ని డిప్లొమా కోర్సులు చేసాడు. వాటితోపాటు అతనికి ఉన్న అభిరుచివల్ల ఎమ్.ఎ. సైకాలజీ ప్రైవేటుగా చదివాడు. సైకాలజీ సబ్జెక్ట్ చదువుతున్న కొద్దీ దాని మీద అతని అభిరుచి మరింత ఎక్కువైంది. మనుషుల ప్రవర్తనను నిశితంగా పరిశీలించడం, వారు అలా ఎందుకు ప్రవర్తిస్తారో తెలుసుకుందుకు పుస్తకాలు చదువుతుండడం అతనికి ఇష్టమైన పనిగా మారింది. కానీ బి.ఏ. తో పాటు ఎం.ఏ. కూడా అతను తెలుగు మీడియమ్‌లో చదవడం వల్ల అతను ఆ సబ్జెక్ట్ మీదున్న కేవలం తెలుగు అనువాదాలే చదవగలిగేవాడు. ఇంగ్లీషులో ఉన్న ఒరిజినల్ పుస్తకాలు చదవడానికి అతనికి కొన్ని టెక్నికల్ టెర్మ్స్ అర్థమయ్యేవి కావు. అయినా సరే.. ఆ తెలుగు పుస్తకాలనే చదివేసుకుని సైకాలజీని కాచి వడకట్టేసినట్టు అనుకునేవాడు.

ప్రభాకరం చెల్లెళ్ళిద్దరికీ శివరామయ్య సర్వీసులో ఉండగానే సాటివాళ్ళతో పెళ్ళిళ్ళు చేసేసాడు. ఆయన రిటైరయ్యేనాటికి ఒక్క పెన్షన్ తప్పితే వేరే ఆదాయమేమీ లేదు. కూతుళ్ళ పెళ్ళిళ్ళయితే అయ్యాయి కానీ వయసు దాటిపోతున్నా కొడుక్కి ఇంకా ఎక్కడా ఉద్యోగం రాకపోవడం ఆయనకి బాధ కలిగించింది.

ఎప్పటినుంచో రాజమండ్రిలోనే ఉంటుండడం వలన ఊళ్ళో కొంతమంది పెద్ద మనుషుల పరిచయం ఉండడం వలన ఆ పరిచయం సాయంగా రాజమండ్రిలోనే ఉన్న ఒక ప్రైవేటు కంపెనీలో చిన్న ఉద్యోగం తెప్పించగలిగారాయన ప్రభాకరానికి.

రామనాథంగారు ప్రభాకరం తండ్రి శివరామయ్యగారికి చిరకాల మిత్రుడు. ఇద్దరూ ఒకే ఆఫీసులో కలిసి పనిచేయటం వల్లా, ఇద్దరివీ మధ్యతరగతి కుటుంబాలే అవడం వల్లా, రెండు కుటుంబాలూ పరువూ ప్రతిష్ఠా అంటూ నలుగురి మధ్యనా బతుకుతున్నప్పుడు మర్యాదస్థులని పేరు తెచ్చుకుందుకు తాపత్రయపడడం వల్లా రామనాథం, శివరామయ్యా మాత్రమే స్నేహితులవడం కాకుండా ఆ రెండు కుటుంబాలు కూడా సన్నిహితమయ్యాయి. అలా తండ్రి స్నేహితులయిన రామనాథంగారి పెద్దమ్మాయి కరుణ పెళ్ళిలో మీనాక్షిని మొదటిసారిగా చూసిన ప్రభాకరం ఈ పెళ్ళి మాట ఎత్తాడు.

వారి వివరాలన్నీ చెప్పడంతో పాటూ ప్రస్తుతం ఎదురుగా ఉన్న సమస్యని కూడా మీనాక్షితోనే చర్చించారు రామనాథంగారు.

పెదనాన్న ఈ పెళ్ళి విషయం చెప్పాక మీనాక్షి అందరి ఆడపిల్లల్లాగే తన ఒంటరితనం గురించి బాగా ఆలోచించింది. బ్రతికున్నన్నాళ్ళు ఆసరాగా ఒక్క బంధువంటూ లేక తల్లీతండ్రి పడ్డ బాధ చూసింది. తల్లి పోయాక తండ్రి మరీ ఒంటరివాడైపోయాడు. తనకేదైనా అయితే మీనాక్షి బతుకేమౌతుందోనని బెంగ పెట్టేసుకునేవాడు.

“ఎప్పటికైనా కుటుంబానికున్న ప్రాముఖ్యం మరి దేనికీ లేదమ్మా.. ఇంట్లో తల్లీ, తోడూ అంటూ ఉంటే మన మనసుకి ఎంతో ధైర్యంగా ఉంటుంది. మనం ఒక్కళ్ళం కాదూ.. మనకీ మనవాళ్ళు అన్నవాళ్ళు ఉన్నారూ.. మంచైనా చెడైనా నాకు తోడంటూ ఒకరున్నారు అనే మానసిక ధైర్యం మనిషికి ఎంతో బలాన్నిస్తుంది. అందుకే నిన్ను నలుగురున్న కుటుంబంలో ఇస్తాను.” అనేవాడు తండ్రి.

ఇప్పుడు ప్రభాకరం కుటుంబం గురించి పెదనాన్నకి బాగా తెలుసు. ఆ కుటుంబంలో మనిషయితే చాలు అనుకుంటూ ఆ మాటే చెప్పింది మీనాక్షి రామనాథంగారితో.

మీనాక్షి మాటలకి ఆయన కదిలిపోయారు.

“చూడమ్మా.. మీ నాన్న లేడని నువ్వు ఒంటరిదాని వయిపోయావనుకోకు. నిన్ను నా మూడో కూతురిగా చూసుకుంటాను. నాకేదో బరువైపోతావనుకుని ఇలాంటి నిర్ణయానికి రావద్దు. అతను నీకన్న తక్కువ చదువుకున్నాడమ్మా..!” అన్నాడు.

“నాకన్నా తక్కువ చదువుకున్నా నాకేమీ పరవాలేదు పెదనాన్నా.. నీకు అన్నివిధాలా నచ్చితే చదువు తక్కువని నేనేం బాధపడను.” అంది.

అంత చదువుకున్నా మీనాక్షి అమాయకత్వానికి నవ్వుకున్నాడాయన. నిజమే చదువులయితే వచ్చాయి కానీ అనుభవం ఎక్కడుందీ అనుకుంటూ, “నీకు అతని చదువు తక్కువైనా పరవాలేదమ్మా.. కానీ అతనికి నీ చదువు ఎక్కువైపోతుందే.. అదే ఇబ్బంది మరి..” అన్నారు. అర్ధం కాలేదు మీనాక్షికి.

“నువ్వు కూడా డిగ్రీ వరకూ మాత్రమే చదువుకున్నావంటేనే మన సంబంధం చేసుకుందుకు వాళ్ళు ముందుకు రావొచ్చు. ఎందుకంటే ఇంకా ఇప్పటికీ మనవాళ్ళలో భార్య తనకన్నా ఎక్కువ చదువుకుందంటే పరవాలేదనుకుంటూ సద్దుకుపోయే మగవారు ఎక్కడైనా ఒకరో ఇద్దరో ఉన్నారేమో తెలీదు కానీ నాకయితే కనపడలేదు. అందుకని, మనం ఆ సంబంధం అవుననిపించుకోవాలంటే నువ్వు నీ చదువు డిగ్రీతో ఆగిపోయిందనే చెప్పాలి. నీ ఎమ్.ఎ. డిగ్రీ, ప్రస్తుతం నువ్వు చేస్తున్న రీసెర్చ్ గురించి వాళ్లకి అస్సలు తెలీకూడదు. ఇంకా ఇక్కడ ఎవరికీ నువ్వు వాటి మాట చెప్పలేదు కనక వాళ్లకి తెలిసే అవకాశం లేదు.”

అని అసలు మాట నెమ్మదిగా చెప్పారాయన. మ్రాన్పడిపోయింది మీనాక్షి. మగవారిలో పురుషాహంకారం ఉంటుందని తెలుసు కానీ, భార్యకి తనకన్న ఎక్కువ చదువుకుంటే సహించలేరని అనుకోలేదు.

“కాలం మారింది కదా పెదనాన్నా, ఇప్పుడు కూడా అలాగే ఉన్నారా!” అనడిగింది.

“కాలం ఒక్కదాన్నీ బట్టి మనుషుల్లో మార్పు రాదమ్మా. అతను పెరిగిన పరిస్థితులూ, తిరిగిన ఊళ్ళూలాంటి చాలావాటిని బట్టి మార్పుంటుంది. నాకు తెలిసినంతవరకూ ఈ అబ్బాయి రాజమండ్రి దాటి వెళ్ళలేదు. అందుకని పాత భావాలు అంత తొందరగా పోవు. కానీ కుర్రాడు మటుకు చాలా మంచివాడు, బుధ్ధిమంతుడు. కుటుంబం కూడా చాలా మంచిది. కోడల్ని కూతురిలా చూసుకునే మనుషులు. కట్న కానుకల ఆశ అస్సలు లేదు. ఒక ఆడపిల్లకి ఇది చాలా మంచి సంబంధం. కానీ వాళ్ళకి అమ్మాయి డిగ్రీ వరకు చదివితే చాలట. ఉద్యోగాలేమీ చెయ్యక్కర్లేదట. మరి నువ్వు ఆల్రెడీ రీసెర్చ్ చేస్తున్నావాయె..” అని ఊరుకున్నారు.

అంటే ఇప్పుడు తనేం చెయ్యాలి.. ఆలోచించింది మీనాక్షి. తను చదువులో చాల చురుగ్గా ఉంటుంది. అందుకే తొందరలో పి.హెచ్.డి డిగ్రీ తీసుకుందుకు సిధ్ధమవుతోంది. ఇలాంటి సమయంలో ఈ సంబంధం వచ్చింది. ఏం చెయ్యడం!

మీనాక్షి చాలా ఆలోచించింది. ఉద్యోగం చెయ్యకూడదని వాళ్ళు ముందే కండీషన్ పెట్టినప్పుడు తను రీసెర్చ్ చేస్తున్నట్టు చెప్పినా కూడా లాభమేముందీ.. కేవలం పెళ్ళికోసమే అయితే ఈ డిగ్రీ ఒక్కటే చాలు. ఇంక తన రీసెర్చ్ అంతా సంసారం, పిల్లల తోనే అనుకుంటూ రామనాథంగారికి తన అంగీకారాన్ని తెలిపింది.

అధ్యాయం 8

మీనాక్షి అంగీకారం తెలిపాక తన తమ్ముడు రాఘవ గురించి శివరామయ్యగారికి పూర్తి వివరాలు తెలియాలని రాఘవ ఇంట్లోంచి ఎందుకు పారిపోయాడో ఒక కథలా చెప్పారు రామనాథంగారు.

అలా చెపుతున్నప్పుడు రామనాథంగారికి ఒక్కసారి తమ్ముడు ఇల్లు విడిచి వెళ్ళిన వైనం కళ్ళముందు గిర్రున తిరిగింది. అప్పుడు తను డిగ్రీ చదువుతున్నాడు. తమ్ముడు స్కూల్ ఫైనల్లో ఉన్నాడు. తను ఆ రోజు కాలేజీ నుంచి వచ్చేసరికి తండ్రి నరసింహావతారంతో వీధి అరుగు మీద పచార్లు చేస్తున్నాడు. తల్లి గుడ్ల నీరు కుక్కుకుంటూ గుమ్మం లోపలికి నిలబడి ఉంది. అసలే తండ్రంటే మామూలుగానే భయపడే తను పక్క గుమ్మంనించి లోపలికి వెళ్ళి తల్లిని విషయమేవిటని అడిగాడు.

“తమ్ముడు రాఘవ ప్రయివేటుకి వెళ్ళకుండా సినిమా కెళ్ళేడుట. నాన్న ఆ వీధినించి వస్తుంటే సినిమాహాలోంచి వస్తూ కనిపించేట్ట. అసలే పబ్లిక్ పరీక్షలు కదా! ప్రయివేటుకి వెళ్ళకుండా సినిమా కెళ్ళేడని మండిపడుతున్నారు. వాడొచ్చేక ఏం చేస్తారో ఏంటో..” గుడ్లనీళ్ళు కుక్కుకుంటూ తల్లి చెప్పింది.

అంతలోనే గుమ్మంలోకి అడుగుపెట్టాడు తమ్ముడు రాఘవ. అంతే ఒక్కసారిగా వాడి మీద పడి, చేతులు వెనక్కి విరిచి పట్టుకుని, కర్రతో దెబ్బలు కొట్టడం మొదలెట్టారు నాన్న. బాగా చదువుకుంటేనే కానీ పిల్లల భవిష్యత్తు బాగుండదనే ఉద్దేశ్యం ఉన్న నాన్నగారు తననీ తమ్ముడునీ చాలా క్రమశిక్షణతో పెంచారు. ఒక్క మార్కు తక్కువొచ్చినా ఊరుకునేవారు కాదు. అలాంటిది పరీక్షల ముందు ప్రయివేటు కెళ్ళకుండా సినిమా కెడితే ఊరుకుంటారా!

అలా కుడీ ఎడమా చూడకుండా వాడిని కొట్టి కొట్టి ఇంక చేతులు నెప్పెట్టాయేమో

“ఒరే పెద్దాడా… ఓ తాడు తీసుకురారా.. తిండీ, నీళ్ళూ లేకుండా ఓ నాల్రోజులు వీడినీ స్తంభానికి కట్టేస్తే కానీ బుధ్ధి రాదు.” అంటూ తనని కేకేసారు.

ఆ మాటలంటూ చెయ్యేమైన కాస్త వదులు చేసారో యేమో ఒక్కసారి ఆ చేతుల్లోంచి జారిపోయి, ఒక్క పరుగున వీధిలో పడ్డాడు రాఘవ.

అంతే.. ఆ పోవడం పోవడం మళ్ళీ వాడు ఇంటి మొహం చూళ్ళేదు. అమ్మైతే ఆ సంఘటనని తట్టుకోలేకపోయింది. రాఘవ మీద బెంగతో తీసుకుని తీసుకుని ఏడాది తిరగకుండానే చనిపోయింది. మరింక నాన్నయితే పైకి గంభీరంగా ఉన్నా లోలోపల వాడి గురించే మథన పడుతుండేవారు. తను రాఘవ మీద అలా చెయ్యి చేసుకోవడం పొరపాటేమో ననే భావంతో నలిగిపోయేవారు.

ఆ తర్వాత రాఘవ ఎక్కడున్నాడోనని ఎన్ని విధాలుగానో నాన్నా, తనూ ప్రయత్నించారు. కానీ ఏ విధమైన ఆచూకీ దొరకలేదు. పదిహేనేళ్ళ పిల్లాడు. ఇంకా హైస్కూల్ కూడా దాటనివాడు. ఎక్కడున్నాడో.. ఎలా ఉన్నాడో నని రఘూ గురించి తల్చుకున్నప్పుడల్లా తనకు గుండెల్లోనుంచి బాధ తన్నుకుంటూ వచ్చేస్తుంది.

ఏళ్ళు గడిచిపోయాయి. చదువు పూర్తయి, తను గవర్నమెంటు జాబ్‌లో చేరగానే తండ్రిని కూడా తనతో పాటే తీసుకు వచ్చేసాడు. అప్పట్నించీ ఆ ఊరికీ తమకీ బంధం తెగిపోయింది. అప్పట్నించీ రాఘవ ఆచూకీ గురించి ప్రయత్నాలు చేస్తుంటే ఈ మధ్యనే పూనాలో ఉన్నట్టు తెలిసింది. పెళ్ళికి కూతురితో సహా వస్తానన్నవాడు కూతురిని మాత్రం పంపించాడని చాలా బాధపడుతూ చెప్పారు రామనాథంగారు.

అది విన్న శివరామయ్యగారు కదిలిపోయారు. తల్లీతండ్రీ లేకపోయినా తమకేమీ అభ్యంతరం లేదని, మీనాక్షికి ఆ లోటు కనపడనివ్వకుండా కూతురిలా చూసుకుంటామనీ హామీ ఇచ్చారు శివరామయ్యగారు.

అలాగ మీనాక్షికీ, ప్రభాకరానికీ రాజమండ్రిలో పెళ్ళి జరిగింది. ఇప్పుడు తను సైకాలజీలో రీసెర్చ్ ఏమీ చెయ్యటం లేదు.. కేవలం డిగ్రీ మాత్రమే చదివింది, ప్రస్తుతం తను రాఘవ కూతురు కాదు, ప్రభాకరం భార్య అని తన మనసుని సంసిధ్ధపరుచుకుంటూ కాపురానికి వచ్చింది మీనాక్షి. ఇద్దరు పిల్లల నందించి, తనను అంతగా అర్థం చేసుకునే భార్య దొరకడం తన అదృష్టమనుకుంటాడు ప్రభాకరం.

పుట్టినప్పటినుంచీ తండ్రి ఉద్యోగరీత్యా ఆంధ్రదేశానికి ఎప్పుడూ రాకపోవడం వల్ల ఒకసారి కాపురానికి వచ్చాక ఇక్కడి అలవాట్లకీ, సాంప్రదాయాలకీ అలవాటు పడడానికి కాస్త కష్టమే అయింది మీనాక్షికి.

మీనాక్షి అత్తగారు పార్వతమ్మ. ఆవిడకి పూజలూ, పునస్కారాలూ ఎక్కువే. రెండు మూడు రోజులకోసారైనా ఏదో నోమనో, పర్వదినమనో పదిమంది ముత్తైదువలను పిలిచి పసుపు కుంకుమ పంచిపెట్టనిదే తోచని మహా తల్లి. మడీ, తడీ, అంటూ, మైలా అన్నీ నిక్కచ్చిగా పాటించే మనిషి. అలాగని మీనాక్షిని ఏ పనీ చేయమనేది కాదు. ఆవిడది అసలైన తల్లి మనసు. ఎక్కడో వేరే ప్రాంతంలో పెరిగిన పిల్ల, ఈ పధ్ధతులేవీ తెలీవనుకుంటూ ప్రతి చిన్నదీ ఎలా చెయ్యాలో ఎందుకు చెయ్యాలో విడమరిచి చెప్పేది.

“కొత్త కోడలిని ఎందుకు ఇబ్బంది పెడతా” వంటూ శివరామయ్యగారేమైనా అభ్యంతరం చెపితే,

“ఇంటికి ఒక్కగానొక్క కోడలు. నా తర్వాత ఈ సంప్రదాయాలన్నీ పాటించవలసిన నా వారసురాలు. నేనేమీ తనని కష్టపెట్టడం లేదు. నెమ్మదిగానే ఒక్కొక్కటీ నేర్పిస్తున్నాను.” అనేది.

ఆవిడన్న మాట నిజమే. కానీ అసలు పూజ అంటేనే ఏమిటో తెలీకుండా లేచిన దగ్గర్నించీ పుస్తకాలలో మాత్రమే మునిగి తేలే మీనాక్షికి ఏదో వేరే లోకంలోకి వచ్చినట్టుండేది.

ఉదయం స్నానం చేసి ఒకసారి మడి కట్టుకున్నాక వంటిల్లూ, పూజగదిలో ఉన్నవి తప్పితే మరింక దేనినీ ముట్టుకోకూడదు. మిగతా గదుల్లో వస్తువులేమైనా కావల్సివస్తే కొడుకుని పిలిచి అతని చేత తెప్పించుకునే వారావిడ. కొత్తలో ఒకసారి స్నానం చేసి మడి కట్టుకున్నాక, పూజ పూర్తవకుండా ముందుగదిలో గ్లాసు తెచ్చిందని మీనాక్షి చేత మళ్ళీ స్నానం చేయించిందావిడ.

ఇలాంటి తనకి అసలేమీ తెలీని కొత్తలోకంలోకి వచ్చిన మీనాక్షికి ఆ ఇంట్లో ఇమడడానికి చాలా రకాలుగా మనసుని కూడదీసుకోవలసొచ్చింది.

పెళ్ళైన కొత్తలో ఒకరోజు మధ్యాహ్నం ఇంట్లో పనంతా అయ్యాక తమ గదిలో కూర్చుని ఆ రోజు పేపర్ చదువుతోంది మీనాక్షి. హాల్లోంచి గట్టిగా మాటలు వినిపిస్తుంటే ఏమిటో ననుకుంటూ చేతిలో పేపరు పట్టుకునే బైటకి వచ్చింది. వెంటనే అత్తగారు, “అదిగో, మీనాక్షి పట్టికెళ్ళింది. దానికే అంత గొడవ చెయ్యాలా!” అంటూ

“ఆ పేపరేదో మీ మావయ్యగారి కిచ్చెయ్యమ్మా.. ఇందాకట్నించి అది కనపడక గొడవ చేస్తున్నారూ.” అంది పార్వతమ్మ.

“నువ్వు పేపర్ చదువుతావా వదినా!” అంది ఆశ్చర్యంగా పురిటికి పుట్టింటి కొచ్చిన ఆడపడుచు.

ఎవరికేం చెప్పాలో తెలీక “పొద్దున్నే అందరూ చదివేసుంటారు కదా అనుకుని తీసికెళ్ళేను..” అంటూ పేపరు మావగారి కందించింది.

అది తీసుకుని ఆయన గళ్ళనుడికట్టు చేసుకోడం మొదలు పెట్టేసేరు. అంటే ఆ ఇంట్లో ఆడవాళ్ళు కనీసం పేపర్ కూడా చదవరన్న సంగతి అప్పుడు అర్థమైంది మీనాక్షికి. కానీ ఆడవారికి తెలుసుకోదగ్గ సంగతులేమైనా ఉంటే మగవాళ్ళు చదివి చెప్తారు.

ఇంట్లో ఎవరూ చెడ్డవాళ్ళు కాదు. ఒకరంటే ఒకరికి అభిమానాలూ, ప్రేమలూ ఉన్నాయి. కోడలు కదా అని వేరే ఇంటి పిల్లగా వాళ్ళెప్పుడూ మీనాక్షిని చూడలేదు. వాళ్ళింట్లో అమ్మాయిలాగే చూసేవారు. ఆడవాళ్ళు ఇంటిపని చూసుకోడం, పూజలూ, వ్రతాలూ, నోములూ చేసుకుంటుండడం, టివీ చూడడం మటుకు చేసేవారు. సాంప్రదాయమైన ఆ ఇంట్లో అందరూ ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ హాయిగా ఉంటున్నారు.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here