మౌనమె నీ భాష ఓ మూగ మనసా!-5

0
12

[శ్రీమతి జి. ఎస్. లక్ష్మి రచించిన ‘మౌనమె నీ భాష ఓ మూగ మనసా!’ అనే మినీ నవలను ధారావాహికగా అందిస్తున్నాము.]

[మీనాక్షి వచ్చిన సంబంధం గురించి ఆలోచిస్తారు రామనాథం. మీనాక్షి సైకాలజీలో రీసెర్చ్ చేసి రేపో మాపో డాక్టరేట్ అందుకోబోయే అమ్మాయనీ, ప్రభాకర్ ప్రైవేటుగా ఎం.ఎ. చేసి ఏదో చిన్న కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడనీ, ఇద్దరికీ పొసగుతుందో లేదో అని ఆయన సందేహిస్తారు. ప్రభాకరం కుటుంబం గురించి అన్ని వివరాలు మీనాక్షికి చెప్తారు. దాంతో పాటు తాను సమస్యగా భావిస్తున్న విషయాన్ని కూడా చెప్తారు. తండ్రి చెప్పిన మాటలను గుర్తు చేసుకుని, ఓ మంచి కుటుంబంలోకి వెళ్తే చాలు అనుకున్న మీనాక్షి ఆ మాటనే రామనాథం గారికి చెప్తుంది. అతను నీకన్న తక్కువ చదువుకున్నాడమ్మా అని ఆయనంటే, మీకు అన్ని విధాల నచ్చితే, నేనేం బాధపడనంటుంది మీనాక్షి. అతనికి చదువు తక్కువైతే నీకు పరవాలేదేమో గాని, నీకు చదువు ఎక్కువయిందని అతనికి ఇబ్బంది అవుతుందంటారు. మ్రాన్పడిపోతుంది మీనాక్షి. భార్య తనకన్నా ఎక్కువగా చదువుకుంటే సహించేలేని మగవాళ్ళు ఈ కాలంలో కూడా ఉన్నారా అని పెదనాన్నని అడుగుతుంది. అతను పెరిగిన పరిస్థితులు అలాంటివని చెప్పి, నిర్ణయం మీనాక్షికి వదిలేస్తారాయన. చివరికి ప్రభాకర్‍ని పెళ్ళి చేసుకోడానికి సిద్ధపడుతుంది. సంబంధం ఖాయమైన తరువాత రామనాథం గారు మీనాక్షిని, ప్రభాకరం కుటుంబ సభ్యులను కూర్చోబెట్టి తన తమ్ముడు రాఘవ ఇంట్లోంచి ఎందుకు పారిపోయాడో, తరువాత తల్లిదండ్రులను పోగొట్టుకుని మీనాక్షి ఎలా ఒంటరిదయ్యిందో చెప్తారు. మీనాక్షిని బాగా చూసుకుంటామని వారు హామీ ఇస్తారు. పెళ్ళి జరిగిపోతుంది. మీనాక్షి అత్తగారింటికి వచ్చేస్తుంది. అక్కడి పద్ధతులు అలవాటు చేసుకోడానికి మీనాక్షికి కాస్త సమయం పడుతుంది. ఆడవాళ్ళు ఇంటిపని చూసుకోడం, పూజలూ, వ్రతాలూ, నోములూ చేసుకుంటుండడం, టివీ చూడడం మటుకు చేస్తారని గ్రహిస్తుంది. ఇక చదవండి.]

అధ్యాయం 9

[dropcap]కా[/dropcap]నీ మీనాక్షికి మటుకు ఇంట్లో ఎంత పని చేసినా మనసులో ఏదో అసంతృప్తిగా ఉండేది. పొద్దున్నా, సాయంత్రం పనిలో పడిపోయినా ముఖ్యంగా మధ్యాహ్నం కాస్త తీరుబడి దొరికినప్పుడు మనసు పూనా వెళ్ళిపోయేది. తన చదువూ, సంపాదించుకున్న డిగ్రీలూ, తెచ్చుకున్న సర్టిఫికెట్లూ ఎందుకూ పనికిరాకుండా పోయేయే అని మనసులో ముల్లు గుచ్చుకున్నట్టయేది. తను చదివిన పుస్తకాలన్నీ సినిమాల్లో చూపించినట్టు గుండ్రంగా తన చుట్టూ తిరుగుతుండేవి. ఎవరో తన కాళ్ళూ చేతులూ బదులు తన మెదడును కట్టేసినట్టు అనిపించేది.

తనను తాను సమాధానపర్చుకుంటూ, అసలు తనకి ఏబీసీడీలే రావనే అభిప్రాయాన్ని మాటిమాటికీ తనకు తనే చెప్పుకుంటూ, ఇంట్లోనే లేని పనులు కూడా కల్పించుకుని తనని తాను తీరిక లేకుండా చేసుకుంటూ పూర్తిగా సంసారానికి అంకితమైపోయింది మీనాక్షి.

పదేళ్ళు గడిచాయి. అబ్బాయి చందూ, అమ్మాయీ వీణ, ఇద్దరు పిల్లలు పుట్టేరు మీనాక్షికి.

సరిగ్గా అప్పుడే ఊళ్ళో ఇంటర్నెట్ వాడడం ఎక్కువయింది. అప్పటిదాకా ఇంటర్నెట్ కేఫ్‌కి వెళ్ళి పని చేసుకునే ప్రభాకర్ తన అవసరం కోసం ఇంట్లో పెర్సనల్ కంప్యూటర్ కొని పెట్టుకుని, దానికి ఇంటర్నెట్ కనెక్షన్ ఇప్పించుకున్నాడు. అది మీనాక్షి పాలిట వరమయ్యింది. అతనికి తెలీకుండా పగలు అతను ఉద్యోగాని కెళ్ళేక, ఇంట్లో పనవగానే కంప్యూటర్ ముందు కూర్చుంటోంది మీనాక్షి. తన లాగిన్ ఐ.డి.ని పాస్ వర్డ్‌తో లాక్ చేసుకుంది. ఎప్పుడో పూనాలో నేర్చుకున్న బేసిక్స్ గుర్తు చేసుకుని, ఒక్కొక్కటీ కొత్తవి నేర్చుకుంటోంది. మెదడుకి పని పెడుతూ రోజూ ఏదో ఒకటి కొత్త విషయం తెలుసుకుంటున్న మీనాక్షికి రోజులు తొందరగా, హాయిగా గడిచిపోతున్నాయి.

అలా గడిచిపోతున్నప్పుడే మళ్ళీ ఒకసారి తను చదువుకున్న సైకాలజీ సబ్జెక్ట్ మీద ఆర్టికిల్స్ ఇంటర్నెట్‌లో చదవడం మొదలెట్టింది. అవన్నీ చదువుతుంటే తను కూడా ఏమైనా రాయచ్చుకదా అనిపించి, ఒక వెబ్ సైట్ తయారు చేసుకుంది. అందులో సబ్జెక్ట్‌కి సంబంధించిన చిన్న చిన్న ఆర్టికిల్స్ రాస్తుంటే అవి చదివి కొంతమంది అనుకూలంగా స్పందించారు. ఆ స్పందన చూడగానే మీనాక్షికి ఎడారిలో నడిచీ నడిచీ ఎండిపోయిన గొంతుకు చల్లటి నీళ్ళు తగిలినట్టనిపించింది. ఆమెలో మళ్ళీ జీవం కలిగింది. చైతన్యం పురులు విప్పింది. మనసు ఆనందంతో గంతులు వేసింది. అంబరాన్ని చుంబించేంత ఉత్సాహం ఉప్పొంగింది.

అప్పుడు మీనాక్షికి తను పూనాలో రీసెర్చ్ చేస్తున్నప్పుడు తన చేత తన గైడ్ చేయించిన పని గుర్తొచ్చింది. సైకాలజీ సబ్జెక్ట్ మీద పాఠాలు రాస్తున్న అతనిని ప్రాంతీయ భాషల్లో కూడా రాయమన్నారు పబ్లిషర్స్. మిగిలిన భాషలకి వేరే వాళ్లని తీసుకుని, తెలుగులో రాసే పనిని మీనాక్షి తెలుగమ్మాయి కనక మీనాక్షి మీద పెట్టాడా ప్రొఫెసర్. అప్పుడు ఇంగ్లీష్‌లో ఉన్న ఆర్టికల్‌ని తెలుగులోకి ఎలా రాయాలో ఆయన దగ్గర నేర్చుకుంది మీనాక్షి. అది గుర్తు రాగానే ఇంగ్లీష్ అర్థం కాని వాళ్లకి తెలుగులో చదువుకునే అవకాశ ముంటుంది కదా అని తను రాసే ఆర్టికల్స్ రెండు భాషల్లోనూ రాసి, తన వెబ్ సైట్‌లో పెట్టడం మొదలెట్టింది.

ఆ వెబ్ సైట్‌లో మీనాక్షి ఇప్పుడు కొత్తగా మారిన సామాజిక పరిస్థితులతో సమానంగా సర్దుకోలేకపోతున్న విషయాల గురించి వివరించేది. ఇదివరకులా పొద్దున్న వెళ్ళి సాయంత్రం వచ్చే గవర్నమెంటు ఉద్యోగాలు కాదు. ఇవాళ కాకపోతే పని రేపు చేసుకోవచ్చు అనుకునే పరిస్థితులు కాదు. ఈ ప్రపంచమే ఒక పోటీ ప్రపంచంలా అయిపోయింది. కెజీ క్లాస్ లో సీట్ దగ్గర్నుంచీ ప్రొఫెషనల్ కోర్స్ లో చేరేవరకూ ఒకరకం పోటీ. చేరాక అందులో మిగిలినవారికన్నా ఎక్కువ మార్కులు తెచ్చుకుందుకు ఇంకో పోటీ. అదయ్యాక ఉద్యోగం కోసం మరో పోటీ. అందులో పక్కవాడికన్న నైపుణ్యం చూపించడానికి మరింత పోటీ. వీటన్నింటితో సతమతమయిపోతూ తామెవరో, తమకి కావల్సిందేమిటో కూడా తెలుసుకోలేక అయోమయంలో పడిపోయి, కావల్సినదేదో దొరకలేదని బాధపడుతూ డిప్రెషన్ లోకి వెళ్ళిపోయేవాళ్ళు ఎంతమందో.

మీనాక్షి ఇవన్నీ జాగ్రత్తగా పరిశీలించింది. టెక్నాలజీ పెరిగినంత వేగంగా మనుషుల మనస్తత్వాలలో మార్పు రాలేదు. పాత విలువలని వదులుకోలేక, వాటిని కొత్త విషయాలతో సమన్వయపరచుకోలేక జనాలు గందరగోళంలో పడిపోతున్నారనిపించింది మీనాక్షికి. అందుకే చదువుకునే పిల్లలకి, ఉద్యోగం చేసేవాళ్ళకీ ఎవరికి కావల్సినట్టు వాళ్లకి వాళ్ల మనసులు శాంత పడేటట్టు చిన్న చిన్న చిట్కాల్లాంటివి తన వెబ్ సైట్‌లో రాయడం మొదలు పెట్టింది. అంతేకాక ఈ రోజుల్లో పెరిగిపోతున్న విడాకుల కేసులని చూసి దానికి సంబంధించి భార్యాభర్తలకి ఉపయోగపడేటట్టు రైటప్స్ రాసింది. ఇవన్నీ చదివినవాళ్ళు మీనాక్షిని కొన్ని విషయాల మీద ప్రశ్నలు అడగడం మొదలుపెట్టారు. మీనాక్షి ఇచ్చిన సమాధానాలకి స్పందన ఇంకా బాగా వచ్చింది. అది చూసి మీనాక్షికి ఎంత సంతృప్తిగా అనిపించిందంటే తన మాట మీద ఒక విద్యార్థి బాగా చదువుకున్నాడు, తన మాట మీద విడిపోవాలనుకున్న భార్యాభర్తలు కలిసారు లాంటి విషయాలు తెలీగానే మీనాక్షి మనసు విహంగమైపోయేది. అందుకే తన వెబ్ సైట్ అందరికీ అందుబాటులో ఉండాలని, సైకాలజీ ఆర్టికిల్స్ వచ్చేచోట “ఆస్క్ మీన్స్.. మీన్స్‌ని అడగండి” అంటూ యాడ్ ఇచ్చింది. దానికి వచ్చిన స్పందన అనూహ్యం. అక్కడ మీనాక్షి మెదడుకి కావల్సినంత మేత దొరుకుతోంది. మళ్ళీ ఆ కంప్యూటర్ ముందునుంచి లేచి తన స్వంత జీవితంలో కొచ్చేటప్పటికి ఆమె మనసు మూగపోయేది. ప్రభాకర్‌కి సంబంధించినంత వరకూ ఆమె అతనికి ఒక అనుయాయే.

అధ్యాయం 10

రోజులు సాఫీగా గడిచిపోతున్నాయి. తర్వాత రెండేళ్ళలో మీనాక్షి అత్తా మామా కాలం చేసారు. అప్పటినుంచీ మీనాక్షే ఆ యింటికి పెద్దకోడలుగా నిలబడి ఆడపడుచులకి పెద్ద దిక్కయింది. అత్తమామలున్నప్పుడు జరిగినట్టే ఆడపడుచుల కుటుంబాలని ప్రతి సంక్రాంతికీ పిలిచి చీరె సారె పెట్టి పంపించేది. వాళ్ళు కూడా మీనాక్షంటే చాలా అభిమానంగా ఉండేవారు.

పిల్లలిద్దరూ కాస్త పెద్ద క్లాసుల కొచ్చేటప్పటికి ప్రభాకర్ సాయంత్రం పెట్టుకున్న “మానస..” అనే మానసిక చికిత్సాలయం కొంచెం పేరు తెచ్చుకుంది. పిల్లల చదువు బాధ్యత కూడా పూర్తిగా మీనాక్షి మీదే పడింది. ఇది చూసి ప్రభాకర్ ఒకరోజు “మీనూ, నువ్వు డిగ్రీ వరకు చదవడం వల్ల పిల్లల చదువుల సంగతి నువ్వు చూసుకుంటున్నావు. లేకపోతే నాకిష్టమైన ఈ క్లినిక్ పెట్టుకునే అవకాశం నాకు లేకపోను.” అన్నాడు.

ఆ మాటకి మీనాక్షికి కాస్త ఆశలాంటిది కలిగింది. అందుకే, “పిల్లలు స్కూల్‌కి వెడుతున్నారు కనుక నేనూ మిమ్మల్ని ఒకటి అడగాలనుకుంటున్నానండీ” అంది నెమ్మదిగా.

“ఏంటదీ!” అన్నాడు.

“అదే, నాకు కాస్త టైమ్ దొరుకుతోంది కదా! అందుకని ప్రైవేట్‌గా ఎమ్.ఎ. చెయ్యనా అని..” పకపకా నవ్వేసేడు ప్రభాకర్.

“నీ మొహం. నువ్వు చదువు మానేసి ఎన్నేళ్ళైందీ! అన్నీ అప్పుడే మర్చిపోయుంటావ్. అయినా పెళ్ళై పిల్లలు పుట్టేక ఇంక చదువులూ, ఉద్యోగాలూ ఎందుకు చెప్పు! ఒక్క ఉద్యోగవే కాకుండా ఈ క్లినిక్ కూడా పెట్టడం వల్ల నేను బాగానే సంపాదిస్తున్నాను కదా! హాయిగా తిని కూర్చో” అంటూ దానిని చాలా తేలిగ్గా తీసిపడేసేడు. ఆ మాటలకి మీనాక్షి నీరుకారిపోయింది.

ఈ విధంగా నయినా తను ప్రభాకరం ఎదురుగా మళ్ళీ పుస్తకాలు పట్టుకుని కూర్చోవచ్చని ఆశ పడింది. కానీ ఏం చేస్తుందీ.. అతని జవాబు విన్న తర్వాత తను కంప్యూటర్‌లో పెట్టుకున్న వెబ్ సైట్ అతనికి తెలీకుండా ఉంచడమే మంచిదనుకుంది మీనాక్షి.

చదువూ, ఉద్యోగమూ అంటే ప్రభాకరం ఒప్పుకోడని అతను అడ్డు చెప్పని ఏవో కాలక్షేపాలు పెట్టుకుంటోంది మీనాక్షి. అలాంటప్పుడే ఒక రోజు మీనాక్షి భోజనం చేస్తున్న ప్రభాకర్‌తో, “ఇవాళ గుడి కెళ్ళినప్పుడు ఓ విషయం తెల్సిందండీ..” అంటూ మొదలెట్టింది. అదేవిటోనని కుతూహలంగా చూసాడు ప్రభాకరం.

“ప్రతి శుక్రవారం గుడి కెడుతుంటాను కదా.. అక్కడ కొంతమంది పరిచయమయ్యారు. అందులో పక్కవీధిలో ఉంటున్న సావిత్రిగారు ఇవాళ ఎందుకో కొంచెం బాధపడుతున్నట్టనిపిస్తే నేనే కల్పించుకుని విషయమేంటని అడిగేను.”

“ఏంటిట!”

“వాళ్ళబ్బాయి సుధీర్‌కి కాంపస్ ఇంటర్వ్యూ లోనే బెంగుళూర్‌లో సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగం వచ్చిందిట. చేరి రెండేళ్ళైందోలేదో ఇంక నేనా జాబ్ చెయ్యనంటూ ఇంటికొచ్చేసేట్ట. పాపం, ఆవిడ చాలా బెంగ పెట్టుకుందండీ. ఆ అబ్బాయికి మీరేమైనా థెరపీ ఇవ్వగలరా?” అంది.

దానికి ప్రభాకరం “బాగా పేరున్న పెద్ద సాఫ్ట్‌వేర్ కంపెనీలు తమ ఎంప్లాయీస్ మీద పని ఒత్తిడి పెరిగి, వాళ్ళు మానసికంగా అలసిపోకుండా ఉండడానికి ఎంప్లాయీస్‌కి కొన్ని ఏర్పాట్లు చేస్తాయి. కొన్ని కంపెనీలయితే ఎంప్లాయీస్‌కి టూర్ చెయ్యడానికి ఏర్పాట్లు చేస్తే మరికొన్ని యోగా క్లాసులు పెడతాయి. ఇంకొన్ని ఫామిలీ ఫంక్షన్స్ పెడతాయి. ఇలాంటివి ఉన్నా కూడా కొంతమందికి వ్యక్తిగతంగా థెరపీ చేయాల్సి ఉంటుంది. ఆ సుధీర్‌ది అటువంటి కేసే అయుండవచ్చు. ఓసారి క్లినిక్‌కి రమ్మను.” అన్నాడు.

“నేనూ అదే చెప్పేనండీ. కానీ ఆ సుధీర్ ఒక్కడూ అలా గదిలో కూర్చుంటున్నాట్ట కానీ అసలు బైటకే రావట్లేదుట. అసలు ఇంట్లోవాళ్ళతోనే చాలా తక్కువ మాట్లాడతాట్ట. ఏదైనా బాధుంటే తనలో తను కుమిలిపోతాట్ట కానీ ఒక్క విషయం బైట పెట్టడుట. అలాంటబ్బాయి ఇంక క్లినిక్‌కి వస్తాడంటారా!” అంది.

అలాంటబ్బాయి చేత నోరు విప్పించాలంటే ముందు అతనికి తన మీద వాళ్ళ ఫామిలీ మెంబర్స్ కన్న ఎక్కువగా నమ్మకం కుదరాలి అనుకున్న ప్రభాకరం అందుకోసం తనేం చెయ్యాలా అని ఆలోచించేడు.

ఈ సమస్యని ఆ రాత్రి మీన్స్ ముందు పెట్టాడు. దానికి మీన్స్ చక్కటి పరిష్కారం సూచించాడు. ఆ పరిష్కారం అమలుపరచడానికి మీనాక్షిని సాయం చెయ్యమన్నాడు ప్రభాకరం. ఆనందంగా అంగీకరించింది మీనాక్షి.

ఒకరోజు ఆ కుటుంబాన్ని వీళ్ళింటికి భోజనానికి పిలిచారు. సుధీర్ తల్లీ, తండ్రీ, చెల్లెలూ నలుగురూ వచ్చారు. ప్రభాకరం కుటుంబంతో బాగా కలిసిపోయారు. పరిచయాలు దగ్గరయాయనిపించాక ఒక ఆదివారం రెండు కుటుంబాలూ గోదావరి ఒడ్డుకి పిక్నిక్ వేసుకున్నాయి.

అక్కడ గోదావరొడ్డున మీన్స్ చెప్పిన “ఇమోషనల్ బాల్” ప్రణాళికని అమలుపరిచాడు ప్రభాకర్. అదేమిటంటే ఒక బాల్ మీద పెన్‌తో సంతోషం, కోపం, భయం, విచారం, సంభ్రమం, కసి, ప్రతీకారం లాంటి రకరకాల ఇమోషన్స్ రాయాలి. మ్యూజిక్ వినపడుతున్నంతసేపూ అక్కడున్న అందరూ గుండ్రంగా నిలబడి ఆ బాల్‌ని ఒకరికి ఒకరు విసురుకోవాలి. ఆ బాల్ అలా గుండ్రంగా అందరివైపూ తిరుగుతూ మ్యూజిక్ ఆగగానే ఒకరి దగ్గర ఆగిపోతుంది. అప్పుడతని వైపు ఏ ఇమోషన్ రాసుందో దాని గురించి చెప్పమనాలి. అలా ఒక ఇమోషన్ లోని భావాన్ని ప్రకటించడం వల్ల ఆ మనిషిలో భావప్రకటన బైట పడుతుంది. కోపాన్నైనా, సంతోషాన్నైనా తను ఎలా భావిస్తున్నాడో దానిని చెపుతుంటే ఆ మనిషిలోని భావోద్వేగాలు బయటపడతాయి. కొంతమందికి సంతోషం వస్తే వారి మొహం మందారంలా విచ్చుకుంటుంది.

చిన్నతనంపోని కొందరు పెద్దమనుషులు గట్టిగా చప్పట్లు కొట్టేస్తారు. ఇంకొందరు సన్నజాజులు విరిసినట్టు సన్నగా నవ్వుతారు.

కోపమైనా అంతే కొందరు గట్టిగా అరిచేస్తారు. ఇంకొందరు ఎదుటివాళ్లని తిడతారు. అలా తిట్టే అవకాశంలేనివాళ్ళు తమలో తామే కుమిలిపోతారు. ఇలా ఎవరి మానసిక ప్రవృత్తిని బట్టి వారు ఇమోషన్స్‌ని ప్రకటిస్తారు. అలా వాళ్ళు ఇమోషన్స్‌ని ప్రకటించిన విధానాన్ని బట్టి సైకాలజిస్ట్ వారిని అర్థం చేసుకుని దానికి తగ్గ చికిత్స చేస్తాడు, అసలు ఏ చికిత్స కైనా ముందు ఆ రోగమేదో తెలియాలి కదా! అందుకే ప్రభాకరం ఆ రోజు చేసిన ఈ ప్రయోగంలో సుధీర్ ఇమోషన్స్‌ని కొంచెం అర్థం చేసుకోగలిగాడు.

మొదటినుంచీ సుధీర్ ఎవరూ చెప్పక్కర్లేకుండానే చురుగ్గా చదువుకునేవాడు. ఎవరైనా పని చెప్పడం అతనికి ఇష్టం ఉండదు. అలా చేస్తే తనకి ఇంకోళ్ళు చెప్పేదేమిటీ అన్న భావన వచ్చేసి చిరాకు పడిపోతాడు. చదువుకున్నన్నాళ్ళూ అలా ఉంటే పరవాలేకపోయింది. కానీ ఒకసారి ఉద్యోగంలో చేరేక, అందులోనూ టార్గెట్స్ సమయానికి పూర్తిచెయ్యాల్సిన ఉద్యోగంలో చేరాక, తన వెనకాల ఎవరో తరుముతూ తనని పరిగెట్టిస్తున్నట్టు అనుకోడం మొదలుపెట్టాడు. దానితో చిరాకు, అసహనం, ఎదుటివారిని ఏమీ అనలేని అశక్తత లాంటి వాటితో పనిలో సామర్థ్యం తగ్గిపోయింది. దాని వల్ల పైనుంచి ఒత్తిడి మరింత పెరిగింది. ఆ ఒత్తిడికి తట్టుకోలేక ఆ ఉద్యోగమే వదిలి వచ్చేసేడు.

పరిస్థితి ఇదీ అని తెలియగానే ప్రభాకరం అతనికి స్ట్రెస్ మేనేజ్‌మెంటూ, టైమ్ మేనేజ్‌మెంటూ, రిలాక్సేషనూ లాంటి బిహేవియరల్ తెరపీలన్నీ నెమ్మదిగా చెప్పడం మొదలుపెట్టాడు. ప్రభాకరం మీద ఎప్పుడైతే తన శ్రేయోభిలాషి అని నమ్మకం వచ్చిందో అప్పట్నించీ సుధీర్ అతను చెప్పినట్టే చెయ్యడం మొదలుపెట్టి, ఆరునెలలయ్యేసరికి ఇంకో సాఫ్ట్‌వేర్ కంపెనీలో చేరాడు. ఎప్పుడైతే సుధీర్‌ని మళ్ళీ మామూలు మనిషిగా చేసాడో అప్పట్నించీ ప్రభాకరం పేరు అన్ని చోట్లకీ వెళ్ళిపోయింది. ఎక్కడెక్కడివాళ్ళో అతన్ని వెతుక్కుంటూ వచ్చేవారు. ఈ ప్రక్రియ మొత్తంలో మీనాక్షి ప్రభాకరానికి అన్నివిధాలుగానూ సాయపడింది.

అందుకే ఇదంతా మీన్స్ చెప్పిన సలహాలవల్లే అని ప్రభాకరం అన్నదానికి “అంటే ఇందులో నేనేం చెయ్యలేదా!” అంటూ అడిగింది ప్రభాకరాన్ని.

“ఎందుకు చెయ్యలేదూ! చేసేవు. కానీ స్వంతంగా మీకు అంత తెలివెక్కడుంటుంది. నేనేం చెప్తే అది చేసేవు, కానీ ఏం చెయ్యాలో చెప్పింది మీన్సే కదా! అందుకని ఈ గొప్పతనం అతనిదే.” అన్నాడు.

ఇంతా అయ్యాక ఆడవారికి భర్త చెప్పింది చెయ్యడం తప్ప స్వంత ఆలోచన ఉండదన్న భర్త మాటలు విన్నాక అతన్ని ఎలా అర్థం చేసుకోవాలో తెలీలేదు మీనాక్షికి.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here