కవి సామ్రాట్ శ్రీ విశ్వనాథ సత్యనారాయణ గారి రచనలను పఠించిన పఠకులు వారి రచనా నైపుణ్యానికి, కల్పనా చాతుర్యానికి జోహార్లు అర్పించకుండా ఉండలేరు అనడంలో అతిశయోక్తి లేదు. పలుమంది ఆయన గ్రంధాలను, నవలలను, పద్యాలను విశ్లేషించి, విశదీకరించి అటువంటి మహనీయుని తో ఆత్మానుబంధాన్ని పొంది, తమ జన్మ సఫలమైనట్లు భావించడం అతి స్వాభావికం. ఆయన లౌకిక విజ్ఞానం, విషయ వ్యక్తీకరణ చదువరులను ప్రభావితం చెయ్యక మానదు. సంగీత శాస్త్రాన్ని విశదీకరిస్తూ ఆయన రచించిన సామాజిక నవల “మ్రోయు తుమ్మెద ” రసానుభూతి ప్రదాత, స్ఫూర్తి దాయకం అని నా నమ్మకం. ఆనవల లోని ప్రధమాంకము నందలి యంశములను గ్రహించి చేసిన సాహసమే ఈ ప్రయోగాత్మక కవిత.
మ్రోయు తుమ్మెద
ఓంకార నినాదం
సర్వ జగత్ వ్యాపితం
శ్రీవాణీ నినాద శబ్ద కటాక్షం
శ్రీగౌరీ అతిశయ శక్తి స్వరూపం
అణువణువూ స్పందన నొందిన ప్రపంచం
తెల్లని తుమ్మెద రెక్కలు విచ్చి పయనం….
కొండ పొదలలో దండిగా పూచిన
మల్లెల విరిసుమాల సౌరభం
త్రోసిరాజని పడమటి ప్రాంతాలకు పయనం
పరిమళాలు పలు ప్రాంతాలలో
పంచాలను తాపత్రయం
కోరిక తీరా నేలకు సమాంతరంగా పురోగమనం
సహచారిగా తననుండి వెల్వడు ఝంకారం…
తుమ్మెదకు తన నాదమయ గమ్యం అగమ్య గోచరం
మల్లెల మరుభూముల వదిలి
విరజాజుల పరిమళాలతో వింత స్నేహం
మొగ్గ తొడిగిన కోర్కెలు
అతిశీతల పథంలో ఘనీభవించి ముత్యాలై జారిన వైనం
అలల మిలమిలల వలె రెక్కల రెపరెపలు
వెలువరించిన వింత కాంతుల సోయగం
నీటి పారుదల వలె వెన్నంటిన
వెలుగు నీడల ఛాయలు గండు తుమ్మెదకే అనూహ్యం
రెక్కల నీడల సెలయేరు గలగలలు
కోమల ఝంకార నాదం తుమ్మెదకు అభేద్యం
వెను తిరిగిన కనగలదు
తన ఝంకారమే తన వెంట పారు రసమయ ప్రవాహం
నలుదిశలా నింగిలో ప్రతిధ్వనించు శ్రీకర ఓంకారం ….
తుమ్మెదకు తన కంఠోత్పాదిత నాదమయ భావమే అభావం
స్వరాల వరుసల జ్ఞానం అతి శూన్యం
సంగీతపు లోతులు తెలియని తనం అతి స్వాభావికం
‘ఓం’ కారం లో లోపించిన ‘అ’ కారం, ‘ఉ ‘ కారం
ఆది మధ్యాంతముల సంతరించె ‘మ్ ‘ కార నాదం
స్పృహ లోపించిన నిద్రావస్థను సూచించు ‘మ్’ కారం ఈ ఝంకారం
జాగృత్ స్వప్నావస్థలు లేని నిద్రావస్థ అదెలా సాధ్యం?
సాకారం కాదు ఓంకారం! కానేరదు ప్రణవం !!
జాగృత్ స్వప్నావస్థల పరిజ్ఞానం లేని
సుషుప్తి పొందదు పరిత్రాణం
మరి ఈ తుమ్మెదకు కలదు అతిశయించిన జ్ఞానం
అంతటి పరిజ్ఞానం జగతిలో అత్యాశ్చర్యం!
నిద్రావస్థ నుండే పొందగోరెను పరిత్రాణం
ఓంకారమై ప్రతిధ్వనించె నభమున పరిపక్వ జ్ఞానం
వెల్లువలై వెంట ప్రవహించె ఝార్ఝరీ నాదం
భాసించిన ప్రతిభయే వెల్లువలైన రసప్రవాహం…
తృతీయమయ్యె తుమ్మెద, ఛాయ, ఝంకారం
సాగె సామ వేదం…
అస్ఖలిత బ్రహ్మచారి ద్వయమయ్యె
విరి మల్లెల పరిమళం, భానుని నవ కిరణం
భాసిల్లె పంచోజ్వల సంహితములై
సామ గాన పరాయణమై సర్వం
ధవళ కాంతుల తుమ్మెద పొందెను
జాజుల సుమ సౌరభాలతో అనుబంధం
మనసై పొంగెను పశ్చిమ ప్రాంతాల
జాజి పరిమళాల ప్రవాహం
పంచ సంహితములు పరిపక్వత నొందె
సప్త స్వరాల సామ గానమై సంపూర్ణం
మాయ మయ్యె తుమ్మెద ఛాయ, రూపం!
వెలసె “మ్రోయు తుమ్మెద” నదీ ప్రవాహం !!!
****************. – శ్రీకాంత గుమ్ములూరి.