కావేవీ అనర్హం అని నిరూపించే పుస్తకం ‘మృగయాపురి’

1
15

[డా. కందేపి రాణీప్రసాద్ రచించిన ‘మృగయాపురి’ అనే పుస్తకాన్ని పరిచయం చేస్తున్నారు కొల్లూరి సోమ శంకర్.]

[dropcap]డా.[/dropcap] కందేపి రాణీప్రసాద్ జంతుప్రేమికురాలు. జంతుశాస్త్రంలో ఎమ్.ఎస్.సి. చదివి, సైన్స్‌లో పిహెచ్.డి చేశారు. వివిధ రకాల జంతువులపై అనేక వ్యాసాలు రాశారు. పుస్తకాలు వెలువరించారు. పిల్లలను ఆకట్టుకునే జంతువుల బొమ్మలను విభిన్నంగా రూపొందించాలనే సంకల్పంతో వ్యర్థాలతో, గింజలతో, ఆకుకూరలతో, కూరగాయలతో, పప్పులతో, డ్రై ఫ్రూట్స్‌తో – వివిధ జంతువులను తయారు చేశారు. తాను స్వయంగా చేయటమే కాకుండా, వాటిని ఎలా చేయాలో స్పష్టంగా వివరిస్తూ, ఆయా జంతువుల ప్రత్యేకతలనో, వాటి వల్ల కలిగే మేలునో, లేక ఎదురయ్యే ఇబ్బంలనో ప్రస్తావిస్తూ, పిల్లలకు ఆ బొమ్మలు తయారూ చేయాలనే కుతూహలంతో పాటుగా, ఆ యా జంతువులకు సంబంధించిన విజ్ఞానాన్ని అందించే వ్యాసాలు – 2020 మార్చ్ నుండి 2023 ఏప్రిల్ వరకూ – దాదాపు మూడేళ్ళకు పైగా ఒక దినపత్రికలో కాలమ్‍లో అందించారు. ఆ వ్యాసాలని పుస్తక రూపంలోకి తెస్తూ, పుస్తకానికి ‘మృగయాపురి’ అని పేరు పెట్టారు.

ఈ వ్యాస సంపుటికి ఆ పేరే ఎందుకు పెట్టారో రచయిత్రి మాటల్లోనే తెలుసుకుందాం: “జంతువులన్నీ కొలువుదీరిన ఈ పుస్తకానికి ‘మృగయాపురి’ అని పేరు పెట్టాను. జంతువులు నివసించే స్థలం, ఊరు అని అర్థం సరిపోతున్నప్పటికీ, ఇలా పేరు పెట్టటానికి మరొక కారణం కూడా ఉన్నది. మా తాతగారి ఊరు, మా నాన్నగారు పుట్టిన ఊరు, ప్రఖ్యాత సారస్వత నికేతనం అనే లైబ్రరీ ఉన్న స్వాతంత్య్ర సమరాల నేల, పూర్వ ప్రకాశం జిల్లాలోని వేటపాలెం. వేటపాలెం పూర్వనామం మృగయాపురి. మా నాయన, మా నాయనమ్మనూ, మా తాతనూ తలుచుకోవడానికి ఈ పేరు ఉపకరించింది. వందేళ్ళ క్రితమే మా తాత గారు కట్టిన డాబా ఇల్లు మృగయాపురి ఊరి నడిబొడ్డున నిన్నటి దాకా రాజసంగా నిలబడి ఉన్నది. నేడు వృద్ధాప్యం కారణంగా నేలకొరిగింది. వేటపాలెం నుంచి స్వాతంత్య్ర సమరం సాగించిన నాన్న ధీరత్వాన్ని గుర్తుచేసుకుంటూ ‘మృగయాపురి’ని ఈ పుస్తకానికి పేరుగా పెట్టాను.”

ఈ పుస్తకంలో 30 రకాల జంతువుల బొమ్మలను రకరకాల పదార్థాలతో ఎలా చేయవచ్చో ఫోటోలతో సహా వివరించారు.

~

ఒక్కో వ్యాసానికి పెట్టి పేర్లు కూడా ఆసక్తికరంగా ఉన్నాయి. శీర్షిక చదవగానే పిల్లలు, పెద్దలు సైతం వ్యాసం చదవడానికి ఉత్సుకత చూపేలా ఉన్నాయి,

‘ఇల్లలుకుతూ పేరు మరచిన ఈగ’ వ్యాసంలో పిస్తా పొట్టుతోను, మిరియాల తోనూ, చింతగింజలతోనూ, పెడిగ్రీ గ్రాన్యూల్స్ తోనూ, చెగోడీలతోనూ ఈగలను రూపొందించి చూపారు. ఈగ శరీరాకృతిని వివరించి, ఈగలు వ్యాధులను ఎలా వ్యాప్తి చేస్తాయో తెలిపారు. ఈగలపై ఉన్న సామెతని చెప్పారు, సాహిత్యంలో ఈగల మీద ఈసప్ కథలున్నాయనీ, విలియం బ్లేక్ ‘ద ఫ్లై’ అనే కవిత రాశాడని తెలిపారు. రాజమౌళి ‘ఈగ’ సినిమాని ప్రస్తావించారు. ఈగల దృష్టి మానవుల దృష్టి కన్నా ఏడు రెట్లు ఎక్కువగా ఉంటుందని తెలిపారు.

‘పిచ్చుకల దినోత్సవ అంబాసిడర్లు’ అనే వ్యాసంలో మార్చి 20 పిచ్చుకల దినోత్సవం సందర్భంగా తానీ వ్యాసం రాశానని తెలిపారు. తన చిన్నతనంలో ఇంటాబయట వేలాదిగా కనబడిన పిచ్చుకలు ప్రస్తుతం ఎక్కువగా కనిపించడం లేదని, అభివృద్ది పేరుతో చెట్లు కొట్టేయడం వల్ల, వాతావరణం మార్పుల వల్ల, సెల్‍ఫోన్ టవర్ల వల్ల – పిచుకలు బాగా తగ్గిపోయాయని వివరించారు. ఈ వ్యాసంలో వేపాకులతో, లవంగాలతో, చేమంతులతో, పారిజాత పుష్పాల విత్తనాలతో, కుక్కబిస్కెట్లతో పిచ్చుక రూపాన్ని తయారు చేశారు.

‘కాకీ కాకీ కడవల కాకీ’ వ్యాసంలో – మనం చిన్నప్పుడు విన్న కాకి కథ – కుండలో నీళ్ళు అడుక్కి ఉంటే, రాళ్ళు తెచ్చి వేసి, నీళ్ళని పైకి తెచ్చుకుని దాహం తీర్చుకున్న కథకి తగ్గట్టుగా ప్లాస్టిక్ మూతలతో కాకి, కుండ బొమ్మ రూపొందించారు. చింతగింజలతో, ఎక్స్‌పైరీ అయిపోయిన మందులతో, గోధుమ పిండితో, చిక్కుడు గింజలతో కాకి రూపాన్ని తయారు చేశారు. సాహిత్యంలో కాకి మీద వచ్చిన కథలను ప్రస్తావించారు. కాకి మీద సామెతలను,

కాకుల ఐకమత్యాన్ని గుర్తుచేశారు. తెలుగువారి సామాజిక జీవనంలో కాకులకు ఎంతో ముఖ్యమైన పాత్ర ఉందని అంటారు రచయిత్రి.

‘బలవర్దక పాలనిచ్చే గోమాతలు’ వ్యాసంలో ఆసుపత్రి వ్యర్థాలతో, రోడ్డు పక్కనున్న చెట్ల విత్తనాలతో, చిక్కుడు విత్తనాలు – శంకుకాయలతో, క్రోటన్ ఆకులతో, పారిజాత పుష్పాలతో ఆవుల ఆకారాలను రూపొందించారు. మన దేశంలో ఆవుల ప్రాధాన్యతని తెలిపారు. ఆవుల్లోని చాలా జాతులు అంతరించిపోయాయనీ, ప్రస్తుతం 29 రకాల జాతులు మాత్రమే ఉన్నాయని వివరించారు. సందర్భోచితంగా ‘ఆవు-పులి’ కథను ప్రస్తావించారు.

‘రంజు భలే రామచిలక’ వ్యాసంలో ఆసుపత్రి ప్లాస్టిక్ వ్యర్థాలతోనూ, రంగుల వడియాలతోనూ, వేరుశనగ గింజలతోనూ, వస్త్రపు ముక్కలతోనూ, సొరకాయ-కాప్సికమ్‍ల తోనూ, అట్టముక్క – తళుకులతోనూ చిలకలను తయారుచేసి చూపారు. ప్రపంచవ్యాప్తంగా 350 జాతుల చిలకలు ఉన్నాయనీ, ఇవి కూడా క్రమంతా నశించిపోతున్నాయని తెలిపారు. చిన్నప్పటి ‘చిట్టి చిలకమ్మా అమ్మ కొట్టిందా’ పాటని గుర్తు చేశారు. చిలకపై ఆధారపడిగా జ్యోతిష్కుల గురించి ప్రస్తావించారు.

‘బంగారు పుట్టలో వేలెడితే కుట్టనా’ అనే వ్యాసంలో చింతగింజలతో, వెంటిలేటర్ వేస్టుతో, కారప్పూసతో, ఆకులతో, ఇంజక్షన్ సీసాల మూతలతో చీమలను రూపొందించారు. చీమలలోని రకాలను, చీమలు ఆహారం సేకరించే పద్ధతిని వివరించారు. చీమలపై ఉన్న కథలను ప్రస్తావించారు. మన చిన్నప్పుడు పెద్దవాళ్ళు చెప్పిన రాజు గారి ఏడుగురు కొడుకులు కథని గుర్తు చేశారు. ‘బలవంతమైన సర్పము చలి చీమల చేత చిక్కి’ అనే పద్యాన్ని ప్రస్తావిస్తూ వేమనదని పొరపాటున అన్నారు. కానీ అది సుమతి శతకం లోనిది. అలాగే ఈ వ్యాసంలో చీమలపై ఉన్న సామెతలను కూడా ప్రస్తావించారు.

‘చల్ చల్ గుర్రం! చలాకి గుర్రం’ అనే వ్యాసంలో ఇంజక్షన్ సీసాల మూతలతో, అవిశ గింజలతో,  కొబ్బరి పీచుతో, పల్లీ గింజలతో గుర్రం ఆకారాన్ని సృష్టించారు. చిన్నప్పటి గాడిద-గుర్రం కథని ప్రస్తావించారు. గుర్రాల వాడకాన్ని, చరిత్రను, రకరకాల జాతులను తెలియజేశారు. అలెగ్జాండర్ తన నల్ల గుర్రం ‘బ్లూసెఫాలస్’ చనిపోయాకా, దాని పేరిట ఓ నగరం నిర్మించాడని తెలిపారు.

‘బుజ్జి మేక! బుజ్జి మేక! ఏడకెళ్తివి?’ వ్యాసంలో పాలపీకలతో, కిస్‍మిస్‍లతో, గింజలతో, ఆకులతో, వేరుశనగ తొక్కలతో మేకలను రూపొందించారు. మేకలు నియోలిథిక్ కాలం నుంచి పెంపుడు జంతువులుగా ఉన్నాయని తెలిపారు. మేకలలోని రకాలను తెలిపారు. మేక పాలు, మాంసం అనేకమందికి ఆహారంగా ఉపయోగపడుతున్నాయని, మేక పేగుల నుండి శస్త్రచికిత్సకు పనికొచ్చే దారాలను తయారు చేస్తారని వివరించారు.

‘రోగాలను వ్యాప్తి చేసే దోమలు’ వ్యాసంలో పల్లీకాయల తొక్కుతో, ఇంజక్షన్ మూతలతో, పిస్తా పొట్టుతో, ఉల్లిపాయ రింగులతో దోమ ఆకారాన్ని రూపొందించారు. దోమల లోని రకాలను, దోమ శరీర భాగాలను వివరించారు.

‘పంటల పనిబట్టే మిడతలు’ వ్యాసంలో శంకుకాయలతో, కందిపప్పుతో, వెంటిలేటర్ వేస్టుతో, పారిజాత పుష్పం విత్తనాలతో చింతగింజలతో మిడత రూపాన్ని తయారు చేసి చూపించారు. మిడతలు తొలి ట్రయాసిక్ యుగం నాటి కీటకాలని చెప్తారు. సందర్భోచితంగా జాతకరత్న మిడతంభొట్లు కథని ప్రస్తావిస్తారు.

‘కాటర్‌పిల్లర్‍ను క్యాచ్ చేద్దామా?’ వ్యాసంలో రెడ్ బెర్రీలతో, సీసా మూతలతో, కీరా దోసకాయతో, క్రీమ్ బిస్కట్లతో, గాజులతో గొంగళిపురుగును రూపొందించి చూపారు.

‘టెడ్డీ బేర్ టెడ్డీ బేర్.. నాతో ఆడుకుంటావా?’ అనే వ్యాసంలో రోడ్డు పక్కనుండే చెట్ల ఆకులతో ఎలుగుబంటిని; శనగపప్పుతోనూ, ప్లాస్టిక్ గుండీలతోనూ, గులాబీ రేకలతోనూ, పల్లీలతో టెడ్డీ బేర్‍‍ను తయారు చేసి చూపారు. ఎలుగుబంట్లలోని రకాలను, ప్రమాదంలో ఉన్న కొన్ని జాతులను తెలిపారు.

‘ఉపాయంతో అపాయాన్ని దాటే కుందేళ్ళు’ వ్యాసంలో – చిక్కుడు గింజలతో, అలచందల విత్తనాలతో, బంగాళాదుంపతో, పిస్తా పొట్టుతో, పారిజాతం ఆకులతో కుందేలు రూపాన్ని తయారు చేసి చూపారు. కుందేలు-సింహం, కుందేలు-తాబేలు కథలని ప్రస్తావించారు. మగ కుందేళ్ళని ‘బక్స్’ అనీ, ఆడ కుందేళ్ళని ‘డోస్’ అని అంటారని తెలిపారు. కుందేళ్ళ గుంపుని ‘కాలనీ’ లేదా ‘వెస్ట్’ అని అంటారని వివరించారు.

‘ఏనుగమ్మ ఏనుగు! ఏ ఊరొచ్చింది ఏనుగు!’ వ్యాసంలో – వడియాలతో, వెంటిలేటర్ వేస్టుతో, ఇంజక్షన్ మూతలతో, తిప్పతీగ ఆకులతో, గన్నేరు పూలతో ఏనుగుని తయారు చేశారు. ఆగస్టు 12వ తేదీ ఏనుగుల దినోత్సవం అని తెలిపారు. ఏనుగు ఆకారం పెద్దదే కానీ మనసు సున్నితమని వ్యాఖ్యానించారు.

‘రివ్వున ఎగిరే తూనీగలు’ వ్యాసంలో శంకు కాయలతోనూ, పొన్నగంటి కూరతోనూ, బ్రౌన్ రైస్ తోనూ తూనీగలను తయారు చేశారు. లార్డ్ టెన్నిసన్ తూనీగలపై కవిత రాశారనీ, హెచ్.ఇ. బేట్స్ తన కథల్లో తూనీగలను ప్రస్తావించారని తెలిపారు. తాను కూడా తూనీగల పాటలు రాశానన్నారు రచయిత్రి.

‘మూషిక విహారం’ వ్యాసంలో వడియాలతో, చింతకాయలతో, సీసా మూతలతో, గెనుసుగడ్డతో ఎలుకలని రూపొందించి చూపారు. ‘గొర్రెపిల్లా! గొర్రెపిల్లా! ఊలునిస్తావా?’ అనే వ్యాసంలో ఇంజక్షన్ మూతలు – పత్తితోనూ, కాలీఫ్లవర్ తోనూ, వెంటిలేటర్ వేస్టుతోనూ, రంగుల పూలతోనూ, ఉప్పుడు బియ్యంతోనూ గొర్రెల రూపాన్ని తయారు చేశారు. సందర్భానుసారంగా ‘పొట్టేలు పున్నమ్మ’ సినిమాని ప్రస్తావించారు.

‘పొడుగు మెడ జిరాఫీ’ వ్యాసంలో వడియాలతో, చింతగింజలతో, వెంటిలేటర్ వేస్టుతో, ఇంజక్షన్ మూతలతో, పిస్తా పొట్టుతో, మందుబిళ్ళలతో జిరాఫీలను చేసి చూపారు. జిరాఫీలను ఆఫ్రికా ఖండానికి ప్రతీకలుగా భావిస్తారని అంటారు. ‘పీతలు క్రస్టేషియన్ జీవులు’ అనే వ్యాసంలో గన్నేరు పూలతో, చింతగింజలతో, పెడిగ్రీతో, చిక్కుడుగింజలతో, వెంటిలేటర్ వేస్టుతో పీతలను రూపొందించారు. పీతల నడక విచిత్రంగా ఉంటుందని తెలిపారు.

‘రెండు కొమ్ముల నత్త నడకలు’ వ్యాసంలో కిస్‍మిస్‍లతో, చింతగింజలతో, పిస్తా పొట్టుతో, వెంటిలేటర్ వేస్టుతో, పట్టుకుచ్చుల పువ్వులతో నత్త లను తయారు చేశారు. నత్తలు వ్యవసాయ మిత్రులని తెలిపారు. ‘కప్పలు పది వేలు చేరు’ వ్యాసంలో ఇంజక్షన్ మూతలతో, పిస్తా పొట్టుతో, వడియాలతో, పెడిగ్రీతో, చింతగింజలతో కప్పలను తయారు చేశారు. కప్పలలోని రకాలను తెలిపి, ‘ఎలైటిస్’ అనే మంత్రసాని కప్ప గురించి తెలిపారు.

‘సౌకుమార్య నడకలో కూర్మాలు’ అనే వ్యాసంలో మేడిపళ్ళతో, ఆకులు-కొబ్బరి పిందెలతో, వడియాలు-చేగోడీలతో, దానిమ్మకాయతో, గాజులతో – తాబేళ్ళను రూపొందించారు. సందర్భానుసారంగా తాబేలు-కుందేలు కథని ప్రస్తావించారు. ‘మిడిగుడ్ల గుడ్లగూబ’ వ్యాసంలో చింతగింజలతో, క్రోటన్ ఆకులతో, పిస్తా పొట్టుతో, ఇంజక్షన్ మూతలతో, పెడిగ్రీతో గుడ్లగూబ ఆకారాన్ని రూపొందించారు. ప్రస్తుతం రెండు కుటుంబాలలో, రెండు వందల జాతుల గుడ్లగూబలున్నాయని తెలిపారు రచయిత్రి.

‘బంగారు బాతుగుడ్డు’ వ్యాసంలో ఇంజక్షన్ మూతలతో, ఆలుగడ్డతో, రబ్బరు బ్యాండ్లతో, పల్లీకాయలతో, చెట్ల ఆకులతో, బొట్టుబిళ్లలతో బాతు బొమ్మలను తయారు చేశారు. బాల్యంలో మనం విన్న, అత్యాశ కూడదని చెప్పే బంగారు బాతుగుడ్డు కథని సందర్భానుసారం పేర్కొన్నారు. ‘సప్తవర్ణాల సీతాకోక చిలుక’ వ్యాసంలో ఇంజక్షన్ మూతలతో, పాలపీకలతో, వడియాలతో, చింతగింజలతో, పిస్తా పొట్టుతో, ప్లాస్టిక్ కవర్లతో సీతాకోకచిలుకలను తయారు చేశారు. సింగపూర్‍లో ఉన్న బటర్‍ఫై మ్యూజియం బాగుంటుందనీ, అంటార్కిటాలో సీతాకోకచిలుకలు లేవని తెలిపారు.

‘కొక్కొరొకో కోడి’ అనే వ్యాసంలో గుల్‍మొహర్ పూలతో, వడియాలతో, క్రోటన్ ఆకులతో, ఆసుపత్రి వ్యర్థాలతో, పిస్తా పొట్టుతో కోడి బొమ్మలను తయారు చేశారు. ‘పురి విప్పి ఆడే నెమలి’ వ్యాసంలో ఇంజక్షన్ సీసాలపై ఉండే రేకు బిళ్ళలతో, తోటకూర ఆకులతో, ఆకులు-పూలతో, బ్యాడ్జిలతో నెమలి బొమ్మలను రూపొందించారు. నెమలీకకూ, బాల్యానికి ఉన్న అవినాభావ సంబంధాన్ని గుర్తు చేశారు. నెమలి ఫించం కృష్ణుడికి అలంకారమన్నారు.

‘చేపా! చేపా! ఎందుకు ఎండలేదు?’ అనే వ్యాసంలో ఇంజక్షన్ మూతలతో, వడియాలతో, పెన్సిల్ పొట్టుతో, ఆకులతో, మాస్కులతో చేపలని తయారు చేశారు. ‘ఉడతా ఉడతా ఊచ్! ఎక్కడికెళతావు ఊచ్!’ అనే వ్యాసంలో పిస్తా పొట్టుతో, శంకు చెట్ల ఆకులతో, చింతగింజలు-అవిశగింజలతో, కిస్‍మిస్‍లతో ఉడుతలను రూపొందించారు. పురాణాల్లోనూ, సాహిత్యంలో ఉడుత ప్రసక్తి ఉన్నదని చెబుతూ, రామయాణంలో వారధి నిర్మాణం సందర్భంగా ఉడుత చేసిన సేవని గుర్తు చేస్తారు.

‘చెంగు చెంగున దూకే లేళ్ళు’ వ్యాసంలో పిస్తా పొట్టుతో, వెంటిలేటర్ వేస్టుతో, పారిజాత విత్తనాలతో, చింతగింజలతో, ఇంజక్షన్ మూతలతో లేళ్ళ బొమ్మలను రూపొందించారు. పలుకథల్లో లేళ్ళ ప్రస్తావన ఉన్నదని తెలిపారు. రామాయణంలో బంగారు లేడి పాత్ర మరువలేనిదని అంటారు.

~

మిరియాలు, లవంగాలు, పిస్తా, వంటి ఆహార పదార్థాలతో వివిధ జంతువుల ఆకారాలను తయారు చేస్తున్న సందర్భంగా ఆయా ఆహర పదార్థాల శాస్త్రీయ నామాలని, వాటి ప్రయోజనాలని క్లుప్తంగా వివరించారు. ఆయా జంతువుల, కీటకాల శాస్త్రీయ నామాలను తెలిపారు. ఇలా ఏ పదార్థాన్నీ నిరపయోగంగా పరిగణించకుండా, ప్రతీ దాన్ని సృజనాత్మకంగా ఉపయోగించుకోవచ్చని తెలిపారు. ఈ పుస్తకం లోని ఫోటోలని చూస్తుంటే ఒక్కో జంతువు ఆకారాన్ని తయారు చేయడానికి ఎంత ఓపిక అవసరమో అనిపిస్తుంది. పిల్లల్లో సహనం, ఏకాగ్రత పెరగడానికి ఇటువంటి సృజనాత్మక పనులు ఉపకరిస్తాయి. పిల్లలకి వీటిపై ఆసక్తి కలిగించగలిగితే, మొబైల్ ఫోన్ అతి వినియోగాన్ని అరికట్టవచ్చు. వినోదంతో పాటు విజ్ఞానమూ పొందవచ్చు.

‘అందరి ఒంటరితనాన్ని పోగొట్టేందుకు, ఖాళీ సమయాన్ని సద్వినియోగించుకునేందుకూ ఉపయోగపడిన ఈ వ్యాసాలు మరింత మందికి చేరువ కావాలని ఆశిస్తూ పుస్తకంగా తీసుకు వస్తున్నాన’ని తెలిపారు రచయిత్రి.

ఇటువంటి ప్రయోజనకరమైన పుస్తకం అందించినందుకు డా. కందేపి రాణీప్రసాద్ అభినందనీయులు.

***

మృగయాపురి (జంతు బొమ్మల తయారీ వ్యాసాలు)
రచన: డా. కందేపీ రాణీప్రసాద్‌
ప్రచురణ: స్వాప్నిక్ ప్రచురణలు, సిరిసిల్ల
పేజీలు: 183
వెల: ₹ 150/-
ప్రతులకు:
డా. కందేపీ రాణీప్రసాద్‌,
మేనేజింగ్‌ డైరెక్టర్‌, సృజన చిల్డ్రన్స్‌ హాస్పటల్‌,
పాత బస్ స్టాండ్ దగ్గర, సిరిసిల్ల – 505301.
తెలంగాణ.
ఫోన్‌: 9866160378

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here