ఉత్కంఠభరితం ‘మృత్యువిహారి’

1
8

[dropcap]వ[/dropcap]ర్ధమాన రచయిత సుధీర్ కస్పా రచించిన థ్రిల్లర్ ‘మృత్యువిహారి’. మొదటి నుంచి చివరిదాకా ఆపకుండా చదివిస్తుందీ పుస్తకం. వివిధ అధ్యాయాలకి తగిన పేర్లు పెట్టి, ఒక్కో అధ్యాయంలోకి పాఠకులను తీసుకెళ్ళిన విధానం చెయ్యి తిరిగిన రచయితలకి తీసిపోని విధంగా ఉంది.

నా ఊపిరి మరణ మృదంగం‘ అనే అధ్యాయంలో కథానాయకుడు ఆర్యన్ సుబ్రమణ్యంను పాఠకులకు పరిచయం చేస్తారు. సుబ్బు అనే ఆ యువకుడు ట్రావెలర్. అతను మిత్రులతో చేసిన వివిధ ప్రయాణాలూ, అక్కడి అనుభవాలు, అనుభూతులను రచయిత ఎంతో చక్కగా వివరించారు. అవి చదువుతుంటే పాఠకులకు ఆయా ప్రాంతాలను సందర్శించాలన్న కోరిక కలుగుతుంది. రైలు ప్రయాణంతో ఆరంభమయిన కథలో ప్రయాణీకులు ఒక ముసలాయన, ఒక భార్యా భర్త చిన్న పాప, ఇద్దరు యువతులు, ఒక డాక్టరు, సుబ్బు. వీరి మధ్యన జరిగిన సంఘటనలే ఈ నవలలో కథాంశాలు. మొదట సుబ్బు వేషధారణ చూసి అందరిలో కొంత వ్యతిరేక భావన కలిగినా, ఇద్దరు యువతులలో నయన మాత్రం అతనితో మాటలు కలుపుతుంది. కొంత సేపటికి వారికి ట్రైయిన్‌లో ఇచ్చిన భోజనం బాగుండక అందరూ నిరాశ పడతారు. అప్పుడు సుబ్బు తన స్నేహితుడి ద్వారా తదుపరి స్టేషన్‌లో మంచి భోజనం తెప్పించి అందరికి పెట్టించి అందరి మన్ననలు పొందుతాడు.

మిణుగురులు‘ అధ్యాయం కథాగమనాన్ని వేగవంతం చేస్తుంది. ఒక స్టేషన్‌లో రైలు ఆగినప్పుడు సుబ్బు కెమెరా ఉన్న బ్యాగ్ దొంగతనం జరుగుతుంది. ఆ విషయం అధికారులకి కంప్లయిన్ చేయ్యడానికి శివాని అనే యువతి ముందుకు వస్తుంది, అది తన తాతగారి ఊరు కావటం విశేషం. అక్కడ వాళ్ల పెద్దదాన్నగారికి మంచి పలుకుబడి వుండడంతో సహాయం చేస్తారని అంటుంది. ఇక అక్కడ జరిగిన విషయాలు మనం చదివి తెలుసుకోవాలి.

నువ్వు నడిచే బాట వైతరణి‘ అనే అధ్యాయంలో తన బ్యాగ్ దొరుకుతుందని శివాని వాళ్ళ ఊరిలో ఆగుతాడు సుబ్బు. ఆ ఊరి గురించి, అక్కడ జరుగుతున్న విషయాల గురించి విని సుబ్బు చాలా ఉత్సాహంగా వాటిని గురించి తెలుసుకోవాలనుకుంటాడు. అంతే కాదు రైల్లో తమతో పాటు ప్రయాణం చేసిన చిన్న పాపని ఎవరో చంపేసారని తెలిసి చాలా బాధపడతాడు. అది తన వల్లనే జరిగిందని భావిస్తాడు. గతంలో తనకు ఒడిస్సాలో ఒక మాంత్రికుడు చెప్పినట్టుగా జరుగుతోందని భయపడుతాడు. అక్కడ ‘తెల్లోడి గుమ్మటం’ గురించి విని దానిని గురించి తెలుసుకుంటాడు.

ప్రేమ Vs ప్రకృతి‘ అనే అధ్యాయంలో సుబ్బు ఆ ‘తెల్లోడి గుమ్మటం’ గురించి వెతికేందుకు వెళ్లే విధానం; అక్కడ ఎదుర్కొన్న అనుభవాలు ఆసక్తిగా ఉంటాయి. అక్కడ బంతి పూల తోట అనుకుని గంజాయి పూలు రెండు తెచ్చుకోవటం, ఆ  తరువాత పోలీసులు అరెస్టు చెయటం, అక్కడ నుండి విడుదలవటం అంతా ఒక సినిమా సన్నివేశంలా సాగుతుంది.

తెల్లోడి గుమ్మటం‘ అధ్యాయం ఎంతో ఉత్కంఠగా సాగుతుంది. సుబ్బు పోలీసు స్టేషన్ నుంచి వచ్చిన తరువాత జరిగిన సంఘటనలు, శివాని పెద్దనాన్నతో జరిగిన మాటల ఘర్షణలో అతనకి హార్ట్ ఎటాక్ రావడం; అది సుబ్బును వెదుకుతూ తెల్లోడి గుమ్మటం దగ్గరకు వెళ్లడం వల్ల జరిగిందని చెప్పడం కథలో ఉద్విగ్నతలను రేకెత్తిస్తుంది. అక్కడకు వెళ్లినవాళ్లు చనిపోతారని నమ్మకం ప్రచారంలో ఉంటుంది. తరువాత శివాని పెద్దనాన్నను వైద్యం కోసం బెంగుళురు తీసుకురావటం, అక్కడ జరిగే సంఘటలను చాలా ఆసక్తికరంగా సాగుతాయి.

టూల్ కిట్‘ అనే అధ్యాయం ఉత్సుకతని కలిగిస్తుంది. సుబ్బు తన దగ్గర ఎప్పుడు ఒక టూల్ కిట్ ఉంచుకుంటాడు. తను ట్రావెలర్ కదా, ఎప్పుడైనా అవసరం పడచ్చు అని. సుబ్బు ప్రేమించిన లహరి ఆత్మహత్య చేసుకుందని విని చాలా బాధపడతాడు. అంతా ఒడిస్సాలోని ఆ మాంత్రికుడు చెప్పినట్టే జరుగుతోంది అని భయపడతాడు. తన చుట్టూ ఏదో జరుగుతోంది అని దాని గురించి తెలిసుకోవాలని చేసే ప్రయత్నంలో ట్రైన్‌లో పరిచయమయిన తాతగారు వివరాలు చెప్పగలరని గ్రహిస్తాడు. ఆయన పేరు దాస్ చెప్పినట్టు గుర్తు చేసుకుని, ఎడ్రస్ సంపాదించి అక్కడకు వెడతాడు సుబ్బు. ఆ తరువాత అక్కడ జరిగే సంఘటనలు పాఠకులు చదువుకోవాల్సిందే.

ఫోబియా‘ అనే అధ్యాయంలో సుబ్బు శివాని తాతగారిని బెంగుళూరు హాస్పటల్‍కి తీసుకువచేచినప్పుడు – అక్కడ ట్రైన్‌లో కలిసిన డాక్టర్ తారసపడతాడు. ఆయన ఇంట్లోనే బస చేస్తాడు సుబ్బు.  సుబ్బు తన  ప్రేమ కథ డాక్టర్‌కు చెబుతాడు. అయితే నిద్రలో సుబ్బు తనని చంపే ప్రయత్నం చేసాడని డాక్టర్ సుబ్బుని కట్టేస్తాడు. ఆ తరువాత ఒక సైకియాట్రిస్ట్‌ను పిలిపించి సుబ్బుకు ‘బైపోలార్ డిజార్డర్’ వుందని చెప్పిస్తాడు.

అసలు రహస్యం‘ అధ్యాయంలో సుబ్బులో అనేక సందేహాలు తలెత్తుతాయి. తన మీద కుట్ర జరుగుతోందని భావిస్తాడు. తనకు ఎలాంటి జబ్బు లేదని ఆ డాక్టర్ ఇంటి నుంచి పారిపోయి అసలు ఏం జరుగుతోందో తెలుసుకోడానికి ప్రయత్నిస్తాడు సుబ్బు.  అందులో భాగంగా శివానిని కలిసి కొన్ని వివరాలు తెలుసుకుంటాడు. అవన్నీ ఇక్కడ రాసేస్తే పాఠకులకు ఉత్సుకత పోతుంది.

అన్వేషణ‘ అనే అధ్యాయంలో సుబ్బు చుట్టూ ఏం జరుగుతోందో తెలుసుకోడానికి డాక్టర్ వర్మ ఒరిస్సా వెళ్లి ఆ మాత్రికుడిని కలిసి వస్తానని చెపుతాడు. ఎందుకంటే ఈ కథ అక్కడే మొదలైందని అతని వాదన. ఆ తరువాత జరిగిన సంఘటనలు ఆసక్తిగా చదివిస్తాయి.

ది సీక్రెట్ ట్రావెలర్‘ అధ్యాయం పుస్తకం ముగింపుకి నాంది. కథని ఒక కొలిక్కి తెచ్చే అధ్యాయం. ఈ పుస్తకంలోని గొప్ప ట్విస్ట్ – ఈ అధ్యాయంలో వస్తుంది. మొదటి అధ్యాయంలో రైల్లో తారసపడిన నయన అనే యువతి సాధారణ అమ్మాయి అని అనుకుంటాము. కాని ఆమె I.P.S. కావడం; ఈ జరుగుతున్న సంఘటనల గురించి ఆమె కూడా ఎప్పటి కప్పుడు తెలుసుకుంటూ వుండటం; తగిన ఆధారాల కోసం ఎదురుచూస్తుండటం జరుగుతుంది. సుబ్బు దాస్ ఎడ్రస్ తెలుసుకుని అక్కడకు వెళ్లటంతో – మిస్టరీ వీడుతున్నట్లు అనిపిస్తుంది.

మృత్యువిహారి‘ ఆఖరి అధ్యాయం. ఇందులో అన్ని దారుణాలకి కారణం ఎవరో, ఎందుకీ అఘాయిత్యాలు చేశారో వెల్లడవుతుంది. లహరిది ఆత్మహత్య కాదని తేలుతుంది. డాక్టర్ అశోక్ విహారి అలియాస్ ప్రశాంత్ వర్మ, ముఖర్జీలే అసలు దోషులనీ, అన్ని దుర్ఘటనలకు కారణం వాళ్ళే అని పాఠకులకు చాలా ఆసక్తికరంగా వెల్లడి చేస్తారు రచయిత.

ఈ రచన ఆద్యంతం పాఠకులను కట్టిపడేస్తుంది. కథనం మలుపులు తిరుగుతూ, చదువరులకు చాలా థ్రిల్ కలిగిస్తుంది.

***

మృత్యువిహారి
రచన: సుధీర్ కస్పా
పేజీలు: 160
వెల: ₹ 200/-
ప్రచురణ: అచ్చంగా తెలుగు
ప్రతులకు:
నవోదయ బుక్ హౌస్, కాచీగుడా హైదరాబాద్ 9000413413,
అచ్చంగా తెలుగు ప్రచురణలు – 8558899478
ఆన్‌లైన్‍లో ఆర్డర్ చేసేందుకు
https://books.acchamgatelugu.com/product/mrutyu-vihari-%E0%B0%AE%E0%B1%83%E0%B0%A4%E0%B1%8D%E0%B0%AF%E0%B1%81-%E0%B0%B5%E0%B0%BF%E0%B0%B9%E0%B0%BE%E0%B0%B0%E0%B0%BF/

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here