మృత్యుభయం తీర్చు రాత్రి సూక్తం

0
12

[శ్రీమతి సంధ్యా యల్లాప్రగడ రచించిన ‘మృత్యుభయం తీర్చు రాత్రి సూక్తం’ అనే ఆధ్యాత్మిక వ్యాసాన్ని అందిస్తున్నాము.]

శ్రీమాత్రే నమః

[dropcap]అ[/dropcap]మ్మవారిని కొలిచే భక్తులకు సప్తశతీ పారాయణము గురించి అవగాహన ఉండే ఉంటుంది. చండీ సప్తశతీ, దేవీ సప్తశతీ, దుర్గా సప్తశతీ యని దీనికి పేర్లు ఉన్నాయి. చండీ హోమములో కూడా ఈ శ్లోకాలనే వాడుతారు. ఇవి 700 శ్లోకాలతో పదమూడు అధ్యాయాలతో ఉన్నది. ఇది మార్కండేయ పురాయణములో అంతర్భాగముగా ఉంది. ఈ 700 శ్లోకాలకు అత్యంత మహిమ కలిగి ఉన్నాయి. ఇవి మనకు ఇహంతో పాటూ పరం కూడా తీర్చగలవని ప్రసిద్ధి.

ఈ శ్లోకాలు పురాణములో ఉన్నా వీటికి వేద ప్రమాణమున్నదని, అందుకే అంత మహిమ కలదని పెద్దలు చెబుతారు. అందులో ముఖ్యంగా వచ్చే నాలుగు అమ్మవారి స్తుతులు ఎంతో పేరు పొందాయి.

అందులో మొదటి అధ్యాయములో వచ్చే రాత్రి సూక్తం ఎంతో ప్రాముఖ్యమైనది. సూక్తం అని వచ్చిందంటే అది వేదాలలో కూడా ఉన్నదని, వాటికి వేద ప్రమాణము ఉందని అర్థం. అటువంటి సూక్తాలలో రాత్రి సూక్తం అత్యంత అద్భుతమైనది. రాత్రి సూక్తం సాధన చేసిన వారికి మృత్యుభయం ఉండదు. మృత్యుభయం తీరిన వారు మరింతగా సాధన చెయ్యగలరు. పైగా ఈ సూక్తమును సాధన చేసే వారికి అకాల మృత్యువు తీరి, సహజంగా వచ్చే మృత్యువు గురించిన జ్ఞానము కలుగుతుంది. వారికి మృత్యు సమయంలో అమ్మవారి అభయము ఉంటుంది. సప్తశతీ లోని సూక్తం వంటిదే వేదములలో ఉన్నదని అనుకుంటే ఆ రాత్రి సూక్తం మనకు ఋగ్వేదములో 10 వమండలము, 127 మంత్రంగా కనపడుతుంది.  అది-

1.రాత్రీ వ్యఖ్యదాయతీ పురుత్రా దేవ్యఁక్షభిః

విశ్వా అధి శ్రియోఽధిత॥

2. ఓర్వప్రా అమర్త్యా నివతో దేవ్యుఁద్వతః

జ్యోతిషా బాధతే తమః

3.నిరు స్వసారమస్కృతోషసం దేవ్యాయతీ

ఆపేదు హాసతే తమః

4.సా నో అద్య యస్యా వయం ని తే యామన్న విక్ష్మహి

వృక్షేన వసతిం వయః

5.ని గ్రామాసో అవిక్షత ని పద్యన్తో ని పక్షిణః

నిశ్యైనాసశ్చిదర్థినః

6.యావయా వృక్యంవృకం యవయస్తేనమూర్మ్యే

అథానః సుతరా భవ

7.ఉపమా పేపిశత్తమః కృష్ణం వ్యక్తమస్థత

ఉష ఋణేవ యాతయ

8.ఉపతే గా ఇవాకరం వృణీష్య దపహితర్దివః

రాత్రి స్తోమం న జిగ్యుషే॥

ఈ సంస్కృత సూక్తానికి ఇలా అర్థం చెప్పుకోవచ్చు:

రాత్రి దేవిగా కొలవబడే అమ్మవారు సర్వత్రా వ్యాపించి ఉంది. ఆకాశమంతా వ్యాపించి ఉన్న నక్షత్రాలనే కన్నులుగా చేసుకొని చూస్తున్నది. రాత్రి దేవి కాల స్వరూపిణి అయిన కాళీ మాత. ఆమె అనంతం. లెక్కకు అందని రాత్రి ఆకాశపు అందాలను ధరించి ఒప్పుచున్నది. ఆమె సర్వత్రా వ్యాపించి ఉన్నది.  అందానికి, సంపదకీ అతీతమైన రాత్రి సర్వత్రా వ్యాపించి అనంతమైన విశ్వానికి మరో రూపమై యున్నది.

ఆమె సర్వత్రా వ్యాపించినదై, స్థల కాల మానాలకు అతీతముగా ఉంది. అన్ని లోకాలు ఆమే, అంతటా ఆమె నిండి ఉంది. అజ్ఞానమన్న చీకటిని ఆమె తొలగించి వెలుగలను ప్రసాదిస్తుంది. ఆకాశమే తనై నిండియున్నది కాళి. సర్వ విశ్వమూ ఆకాశములోనే ఉంది. విశ్వం అమ్మలో బాసిల్లుతున్నది. విశ్వం ఏ ఆలంభనతో నిలచి ఉన్నదో, ఆ ఆలంభననే అమ్మవారు.

ఉషస్సుకు దారి కలిపించే రాత్రి దేవి తమస్సును తొలగించి, తాపాని తీర్చి జ్ఞానాన్ని ఇచ్చే దేవి ఈమె.

ఆమె సర్వత్రా కాలము స్వరూపములో నిలచి ఉంది. ఆమె స్వరూపముగా అనంత విశ్వం వ్యాపించి ఉంది. ఆమె ఆలంభనగా ఈ గ్రహాలు పరిభ్రమిస్తున్నవి. మనము చూస్తున్న ఈ సృష్టి సమస్తము ఆమె స్వరూపముగానే ఉంది. ఆమెనే రాత్రి దేవి.

ఆమె తన తరువాత వచ్చే తన సహోదరి అయిన ఉషస్సుకు దారి కలిపిస్తుంది. తమము చేత కప్పబడిన అంటే అజ్ఞానము చేత కప్పబడిన మనను చూసిన ఉషస్సు నవ్వుకు సమాధానముగా రాత్రి దేవి మనకు జ్ఞానాన్ని అందిస్తుంది. రాత్రి కప్పబడిన జగత్తులో ఏ వస్తువు ఏ విషయము గ్రహించలేము. అలాగే అజ్ఞానములో కప్పబడిన మానవులు సత్యాన్ని గ్రహించలేరు. రాత్రి అనంతమైనది, అద్యంతమూ లేనిది. అజ్ఞానముతో కప్పబడిన స్థితిలో మనకు భయం కలిగటము సహజం. ఈ దేవి ఆ భయాన్ని తీర్చి అభయం ఇస్తున్నది.

రోజులో కష్టించిన జీవుని అలసట తీర్చే రాత్రి దేవిని చూసి అజ్ఞానముతో భయపడుతాడు జీవుడు. ఈ అనంతమైన, ఏ రూపము లేని, ఎల్లలకు అతీతమైన రాత్రి భయపెట్టటం సహజం. ఎప్పడైతే తన చైతన్యం యొక్క మూలమైన ప్రపంచ చైతన్యమును గురించి చింతన మొదలవుతుందో అప్పుడు జీవుడు కొంత కుదుటపడతాడు. తల్లి గర్భములోని శిశువుకు కలిగిన ఊరటలా జీవుడు దేవి ఒడిలో ఉన్నడన్న భావన కలుగుతుంది.

రాత్రి సర్వత్రా సర్వదా నిండి ఉంటుంది. రాత్రి ఒడిలో జీవుడు స్వస్తత పొందుతాడు. తన మూలమైన రూపము మీద ద్యాస కలుగుతుంది రాత్రి యందే. సర్వమూ వ్యాపించినది బ్రహ్మమన్న ఎరుక కలుగుతుంది. ఆ బ్రహ్మము నందు భాగమే మనము కూడా అన్న జ్ఞానము ఉదయిస్తుంది రాత్రి యందే. ప్రతి జీవి వారి ఉపాధి మరచి తన స్వస్వరూపములో మలిగే సమయము రాత్రే. అందుకే రాత్రి దేవిని ప్రార్థించి, రాత్రి చేసే ధ్యానము ఆత్మధ్యానము వైపు అడుగలు వేస్తుంది. ఈ దేవి జీవుని ఆత్మజ్ఞానం వైపుకు నడిపిస్తుంది. పూర్వం నుంచి మోసుకువస్తున్న కర్మలను కడిగేసుకోవటానికి సహయం చేస్తుంది.

అందుకే ఓ దేవి! రాత్రి దేవి! మమ్ములను మా ఆత్మ జానం వైపుకు అడుగులు వేయించు. మా జన్మజన్మలను కర్మలనుంచి మాకు ముక్తిని ప్రసాదించు. మహాకాళికి భక్తులవటం ద్వారా జన్మ కర్మలను విముక్తి పొందవచ్చు.

జీవులు వేదాలను అనుసరిస్తారు కేవలం ఈ రాత్రిదేవిని అర్పించటానికి. మేము నిన్ను పూజించటానికి వేదాలను అనుసరిస్తాము. మేము నీకు ప్రీతి కలిగేలా గానం చేసి పుష్పాలను అర్పిస్తాము. ఓ దేవి! నిశాదేవి! నిన్న పూజించటానికే మేము వివిధ పుష్పాలను సేకరించాము.

ఈ సూక్తం పారాయణం ద్వారా వేదాలను, తదనుగుణంగా జ్ఞాన్నాని పొందటమని భావముగా చెప్పబడింది.

ఈ సూక్తము శ్రీ దుర్గాసప్తశతీ అంతర్భాగముగా మొదటి అధ్యాయములో చెప్పబడింది.

అక్కడ భావము ఇదే అయినా మరింత విస్తారంగా చెప్పబడటము మనము గమనించవచ్చు.

సృష్టి మొదలవలేని కాలమది. విష్ణువు యోగనిద్రలో ఉన్నాడు. విష్ణువు నాభి కమలములో బ్రహ్మగారు ఉద్భవించారు. ఆయన సత్వరూపములో ఓలలాడుతున్నడు. వేదాలను ధరించి ప్రశాంతచిత్తుడై ఉన్నాడు బ్రహ్మ.

విష్ణువు కర్ణమలం నుంచి మధుకైటభులు వెలికొచ్చారు. (రజో తమో గుణాలకు ప్రతీకలు.) వీరికి అటు ఇటు అంతా నీరే కనిపించింది. వాళ్ళు చూస్తే విష్ణువు నిద్రపోతున్నాడు. పైన బ్రహ్మ కనిపించాడు. ఇద్దరూ కలిసి బ్రహ్మను ఏడిపించటము మొదలెట్టారు.

బ్రహ్మ విష్ణువును నిద్రలేపే యత్నం చేశాడు. ఫలించలేదు. ఆయన కొంత తడవు ఆలోచించాడు.

ఆయనకు కలిగిన జ్ఞానముతో అమ్మవారిని ధ్యానించాడు.

అదే రాత్రి సూక్తం-

“త్వం స్వాహా త్వం స్వధా త్వంహి వషట్కారః స్వరాత్మికా|

సుధా త్వమక్షరే నిత్యే త్రిధా మాత్రాత్మికా స్థితా 1

అర్ధమాత్రా స్థితా నిత్యా యానుచ్చార్యావిశేషతః

త్వమేవ సా త్వం సావిత్రీ త్వం దేవ జననీ పరా 2

త్వయైతద్ధార్యతే విశ్వం త్వయైతత్ సృజ్యతే జగత్|

త్వయైతత్ పాల్యతే దేవి త్వమత్స్యంతే చ సర్వదా 3

విసృష్టౌ సృష్టిరూపాత్వం స్థితి రూపా చ పాలనే|

తథా సంహృతిరూపాంతే జగతో‌உస్య జగన్మయే 4

మహావిద్యా మహామాయా మహామేధా మహాస్మృతిః|

మహామోహా చ భవతీ మహాదేవీ మహాసురీ 5

ప్రకృతిస్త్వం చ సర్వస్య గుణత్రయ విభావినీ|

కాళరాత్రిర్మహారాత్రిర్మోహరాత్రిశ్చ దారుణా 6

త్వం శ్రీస్త్వమీశ్వరీ త్వం హ్రీస్త్వం బుద్ధిర్భోధలక్షణా|

లజ్జాపుష్టిస్తథా తుష్టిస్త్వం శాంతిః క్షాంతి రేవ చ 7

ఖడ్గినీ శూలినీ ఘోరా గదినీ చక్రిణీ తథా|

శంఖిణీ చాపినీ బాణాభుశుండీపరిఘాయుధా 8

సౌమ్యా సౌమ్యతరాశేషసౌమ్యేభ్యస్త్వతిసుందరీ

పరాపరాణాం పరమా త్వమేవ పరమేశ్వరీ 9

యచ్చ కించిత్క్వచిద్వస్తు సదసద్వాఖిలాత్మికే|

తస్య సర్వస్య యా శక్తిః సా త్వం కిం స్తూయసేమయా 10

యయా త్వయా జగత్ స్రష్టా జగత్పాతాత్తి యో జగత్|

సో‌உపి నిద్రావశం నీతః కస్త్వాం స్తోతుమిహేశ్వరః 11

విష్ణుః శరీరగ్రహణమ్ అహమీశాన ఏవ చ

కారితాస్తే యతో‌உతస్త్వాం కః స్తోతుం శక్తిమాన్ భవేత్ 12

సా త్వమిత్థం ప్రభావైః స్వైరుదారైర్దేవి సంస్తుతా|

మోహయైతౌ దురాధర్షావసురౌ మధుకైటభౌ 13

ప్రబోధం చ జగత్స్వామీ నీయతామచ్యుతా లఘు

బోధశ్చ క్రియతామస్య హంతుమేతౌ మహాసురౌ 14

బ్రహ్మ ఈ విధంగా ప్రార్థిస్తున్నాడు- అమ్మా జగన్మాతా దేవ యజ్ఞాలలో పిలవబడే స్వవాహాదేవివి నీవు. పితృ యజ్ఞానాలలో పిలవబడే స్వధాకారము నీవు. ఉదాత్తాది స్వరూపిణి నీవు. యజ్ఞము, యజ్ఞఫలము, స్వర్గం, నీవే. నీవు వషట్‌కారము కూడా నీవు. అ-ఉ-మ్- అను మూడు మాత్రలలో ఉన్న ఓంకారమూ నీవే.

ఓంకారము పలికేటప్పుడు సూక్ష్మ శబ్ధరూపములో ఉన్న అర్ధమాత్ర తురీయమూ నీవే. నీవు సంధ్యవు, సావిత్రివి. దేవజనని నీవు. పరాదేవతవూ నీవు. ఈ విశ్వం నీ చేత పరిపాలింప పడుతున్నది. ఈ జగమంతయు నీ చేతనే పరిపాలించపడుతున్నవి. అమ్మా ఈ జగము నీచేత పరిపాలించపడుతున్నది, నీ చేత సృష్టించపడుతున్మది. సృష్టించుదానిని నీవే. నాశనము చేయుదానవు నీవే.

సృష్టి మొదలైనప్పుడు సృష్టిరూపము నీవు. పరిపాలించునప్పుడు స్థితిరూపము నీవు. జగత్ స్వరూపిణి, జగత్ వ్యాపినీ అంతకాలమున సర్వము లయము చేసుకునేది నీవు. మహా విద్యవు, మహామయావు, మహామేధవు, మహాస్మృతివి నీవే. మోహరూపము నీవు. మహాదేవివి నీవు. అన్ని శుభములు అన్ని అశుభములు నీవే. అన్నింటికీ మూలమైన దానవు నీవు. సత్వరజతమో గుణాలకు మూలము నీవే. కల్పాంతములో వచ్చే ప్రళయునందు చివరి కాళరాత్రి నీవే. భయంకరమగు మోహరాత్రివీ నీవే. లక్ష్మి నీవు, నిగ్రహ అనుగ్రహ స్వరూపమూ నీవు. బుద్ధి నీవు, బోధన నీవు, లజ్జ, తుష్టి, శాంతి, క్షాంతి నీవు. అన్ని రూపములు నీవు.

ఖడ్గం శూలము గద, చక్రం ధరించిన నీవుఘోరరూపమున ఉన్నదానివి. శంకము, విల్లు, బాణము, భుశుండి ఆయుధములు ధరించిన భీకర స్వరూపమూ నీవే. సౌమ్యము నీవు. అతి సుందరివీ నీవు. పరము(గొప్ప) అపరము(ఇంత కన్నా గొప్ప) నీవు. అంటే పరాపరములు నీవు. సర్వోత్తమము నీవు. పరమేశ్వరివీ నీవు. శ్రీహరిని సృష్టించినదీ నీవు, రుద్రుని సృష్టించినదీ నీవు. విష్ణువు నిద్ర కూడా నీవు. నిన్ను స్తుతించగలవారు గలరా? త్రిమూర్తులైన మమ్ములను సృష్టించి, స్థితి చేయించునది నీవే. ఈ జగములను పరిపాలించు నీవే విష్ణువును నిద్ర నుంచి లేపుము” అని బ్రహ్మ చేసిన ప్రార్థనే రాత్రి స్తుకంగా ప్రసిద్ధి చెందింది.

దుర్గాసప్తశతి పూర్తిగా పారాయణము చెయ్యలేని వారు కేవలము ఈ సూక్తాలను పారాయణము చేసే సంప్రదాయం కూడా ఉన్నది. ఋగ్వేదపు రాత్రి సూక్తమైనా, లేక ఈ సప్తశతీ అంతర్గత రాత్రసూక్తమైనా ఇదే ఫలితాన్ని ఇస్తాయి. పరమేశ్వరి భగవతిని ఈ సూక్తాలతో ధ్యానించే సదా అమ్మ చరణాలను నమ్మిన వారికి ఇహమందు సుఖము, పరమందు ముక్తి వస్తుందని పెద్దలమాట. ఈ సూక్తాన్ని ధ్యానించి మానవులు ధన్యులు కావచ్చును.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here