మృత్యుభయం

0
5

[dropcap]రా[/dropcap]త్రి వేళ,

పన్నెండు దాటాక –

గాఢ నిద్రలో ఉన్న నారాయణ ఉలిక్కిపడి లేచాడా పిలుపుకు.

మరోసారి దీనంగా వినిపడిందా స్వరం.

“నాన్నా…” అని.

ఆ గొంతు అతడి చిన్న కూతురు ఆరేళ్ళ రజితది.

చప్పున నులక మంచం మీద నుండి లేచి కూర్చున్నాడు నారాయణ. కుడి వైపు కింద చాప మీద పడుకొని ఉన్న భార్య పిల్లల వైపు కళ్లు చిట్లించి చూశాడు. భార్య సావిత్రి, పెద్దమ్మాయి తొమ్మిదేళ్ళ సరిత అదమరిచి నిద్ర పోతున్నారు.

“నాన్నా… ఇటు…” వినపడిన వైపు తల తిప్పాడు.

తెరిచి ఉన్న గుడిసె తలుపు దగ్గర నిలబడి భయం భయంగా చూస్తున్న కూతురు వింత రూపం మసక మసగ్గా కన్పించిందా చీకట్లో.

ఈ అర్ధరాత్రి సమయంలో ఆ పిల్ల నిద్ర పాడు చేసినందుకు చిరాకేసింది నారాయణకు, కూతురు మీద పీకల్దాకా కోపమొచ్చింది.

తడబడుతూ మంచం దిగిన నారాయణ “ఏం పుట్టిదే పోరి నీకు, మీ అమ్మను లేపక నన్ను పిలుస్తున్నావ్…” తిట్టాడు కోపంతో ఊగిపోతూ.

బదులుగా “నాన్నా… ఆ… ఆ…” అంటూ ఆ చిన్నారి అరిచిన అరుపు… సుమారు ఇరవై వేల హెర్ట్జ్ పౌనఃపున్యం గల శబ్ద తరంగాలుగా మారి…. కర్ణభేరి చిట్లి పోయేంత భయానకంగా వినపడింది.

ఆ భీకర కేకకి ఝడుసుకున్న నారాయణ… చెవులకి చిల్లలు పడ్డాయేమోననే పిరికితో…. సంకల్పితంగా అర చెతుల్తో రెండు చెవులు మూసేసుకున్నాడు గట్టిగా.

అనూహ్యంగా రెండు చేతులకు తడి తగిలింది. నారాయణ అదిరిపడ్డాడు.

వెంటనే చెవుల మీంచి అర చేతుల్ని తీసేసి చూసుకున్నాడు అనుమానంగా. ఆ చీకట్లో సరిగ్గా కనబడలేదు. కళ్లు చిట్లించి మరీ చూశాడు తడి ఏంటని. హఠాత్తుగా ఎవరో టార్చ్ వేసినట్లు…. ఓ కాంతి పుంజం అతడి చేతులపై పడి క్షణంలో మాయమైంది.

ఆ స్ల్పిట్ సెకండ్‌లో అరచచేతులకు అంటిన రక్తపు మరకలు చూసి ఒళ్ళు జలదరించింది నారాయణకు. గాయం తాలుకు తీవ్రత తెలియడం లేదు. కానీ రెండు చెవుల నుండి బొట్లు బొట్లుగా రక్తం స్రవిస్తోంది. రాత్రి తాగిన మందు తాలూకు మత్తు ఒక్కసారిగా దిగిపోయింది.

గజ గజా వణకిపోతూ అరచేతులకి అంటిన రక్తాన్ని గబాలుగ లుంగీకి రుద్దుకున్నాడు. లుంగీని పెకెత్తి చెవుల నుండి కారుతున్న రక్తపు చుక్కల్ని తుడవబోయాడు. కానీ విచిత్రంగా అప్పటికే రక్తం కారడం ఆగిపోయింది. చెవుల్ని సూదుల్తో గుచ్చుతున్న బాధా తగ్గిపోయింది. ఈ విచిత్ర మార్పులకి నారాయణ తెగ భయపడిపోయాడు.

“నన్నెవరో లోపలికి రాకుండా ఆపుతున్నారు నాన్నా…! భయమేస్తోంది నాన్నా…!”

మళ్లా విన్పించిన కూతురి దీనాలాపనకి అటుగా కదిలాడు నారాయణ.

కుడి కాలు పైకి లేపి వేగంగా అడుగు ముందుకేసాడు. కింద పడిన ఆ పాదం ఉన్నటుండి నేలకు ఎవరో రంధ్రం చేసినట్టు…. మోకాళ్ళ దాకా నేలలోకి కూరుకు పోయింది. ముందుకి పడబోయి తమాయించుకున్నాడు.

ఒకర్ని భయపెట్టడమే తప్ప భయం ఎరగని నారాయణకి ఒక దాని వెనుక ఒకటి జరుగుతున్న విపరీత సంఘటనలకి తొలిసారిగా ఒళ్ళు గగుర్పొడిచింది. భయ విహ్వలత్వంతో ఒళ్ళంతా తడిసి ముద్దయింది.

“చీకట్లో ఏవీ కనబడడం లేదు… కట్టేసినట్లువుతోంది… ఉన్న చోట నుండి కదల్లేకపోతున్నా… భయంగా ఉంది త్వరగా రా నాన్నా…!”

ఏడుస్తోంది పాప.

దిగబడిన కాలుని బలవంతంగా పైకి లేపుతుంటే ప్రయాస లేకుండానే ఎవరో సాయపడట్టు తేలిగ్గానే వచ్చేసింది. రంధ్రం పడిన నేల ఎప్పట్లా పుడుకుపోయింది, అసలేం జరగనట్టే!

ఊపిరి పీల్చుకొని వడివడిగా కూతురి వైపు నడిచాడు.

 అమ్మాయి చెంత చేరి “దున్నపోతా… ఇంత రాత్రి వేళ… ఇక్కడేం చేస్తున్నావ్?” కంఠనాళాలు తెగిపోయేలా భీకరంగా అరిచాడు.

రజిత చిటికెన వేలెత్తి ఒకటికని మౌనంగా చెప్తోన్నా పట్టించుకోకుండా కుడి చేత్తో ఆ అమ్మాయి చెంప ఛెళ్ మన్పించాడు.

కానీ…. ఆ దెబ్బ తగిలింది పాపకి కాదు…!

నారాయణ అరచేతి వెడల్పన్న ఇనుప సుత్తితో… అతడి చెంప నెవరో ఎదురు కొట్టినట్టై…. “అమ్‌మ్మా!” అంటూ భయంకరంగా అరిచాడు…

“నన్నే తిరిగి కొట్టే ధైర్యం వచ్చిదే నీకు…?” అంటూ మరో సారి చేయెత్తాడు విచక్షణ మరచి. ఈసారి మళ్ళీ తగిలిన అదే సమ్మెట దెబ్బకి ప్రాణం విలవిలలాడింది. మనిషి గిలగిలా కొట్టుకున్నాడు.

సహనం కోల్పోయిన నారాయణ అంత బాధలోను ఆవేశంతో కాలెత్తి…. చిన్నపిల్ల అని కూడా చూడకుండా…. బలంగా కూతుర్ని ఒక్క తన్ను తన్నబోయాడు.

అతడిని భయభ్రాంతులకు లోను చేస్తూ…. ఆ అమ్మాయి కన్పడలేదక్కడ…

భయ విహ్వలుడైన నారాయణ “ఒసే సావిత్రి… దొంగ ముం… ఎక్కడ చచ్చావే… చిన్న పోరి పరేషాన్ చేస్తోంది. నిద్ర లేచి చావవే…” అదే పనిగా అరవసాగాడు.

అప్పటి వరకు అన్ని శబ్దాలకు అతీతంగా నిద్రపోతున్న సావిత్రికి ఈ అరుపులు మెలకువ తెప్పించాయి. ఉలిక్కిపడుతూ లేచి ముందు లైటు వేసింది. తల్లి పక్కన గువ్వపిట్టల్లా ఒదిగి పడుకున్న పిల్లలిద్దరూ నిద్ర లేచారు.

మూసి ఉన్న తలుపు దగ్గర నిలబడి వీరావేశంతో మింగేసేలా చూస్తోన్న నారాయణ వాలకానికి సావిత్రి కాదు… కూతుళ్ళిద్దరూ భయంతో గడగడా వణికిపోయారు.

చిన్న కూతురు రజిత తల్లి దగ్గరే ఉంది. వేసిన తలుపు వేసినట్టే ఉంది. నారాయణ నమ్మలేకపోయాడు. షాకై… తల విదిల్చాడు… దిమ్మ తిరిగి పోతోందతనికి…

‘రాత్రి బాగా తాగొచ్చి పడకునే ముందే నానా యాగీ చేశాడు. ఇది రోజూ జరిగే తంతే. కానీ ఈ రోజు ఇంత రాత్రి వేళ లేపాడు. ఇంకెంత రభస చేస్తాడోనని….’ ఇందాకటి భర్త భయాందోళనలు ఎరుగని సావిత్రి భయంతో బిగుసుకు పోయింది.

భార్య చెంత నిలబడి బిక్కు బిక్కు మంటూ భయం భయంగా చూస్తోన్న చిన్న కూతురు రజితను లైటు వెలుతుర్లో స్పష్టంగా మరోమారు చూసిన నారాయణ ఎంతలా వణికి పోయాడంటే…. అతని ముఖంలో కనబడిన పైశాచిక భయానికి…. మొదటిసారి సావిత్రి మ్రాన్పడిపోయింది.

***

జగిత్యాలకు దగ్గర్లో ఉన్న సారంగపూర్ చిన్న పల్లెటూరు. అక్కడే పుట్టి పెరిగిన నారాయణకి చిన్నప్పటి నుండి పనీ పాటా లేకుండా ఆవారాగా తిరగడం అలవాటయ్యింది.

వ్యవసాయపు కూలీలైన తల్లిదండ్రులు కూడా లేక లేక కలిగిన బిడ్డవడంతో నారాయణ నెంతో గారాబంగా పెంచారు. చిన్న తనంలోనే చెడు తిరుగుళ్ళకు అలవాటు పడ్డాడు. చదువు అబ్బలేదు కానీ అంటని వ్యసనం లేదు.

తండ్రి పోయాక కూడా తల్లి కాయకష్టంతోనే జల్సాలు చేసాడు తప్ప పని ధ్యాసలో పడలేక పోయాడు. లక్షమ్మ తను బ్రతికి ఉండగానే కొడుకునో ఇంటి వాడిని చేసింది సావిత్రితో పెళ్ళి చేసింది.

సావిత్రి తండ్రి రాజారాంకి ముగ్గురు పిల్లలు. బిడ్డల్ని మంచి వరుళ్ళకిచ్చి పెళ్ళి చేసే స్తోమత లేదు. రాజారాంకి నారాయణ పనీ పాటా లేని వ్యక్తి అని తెలిసి నా దమ్మిడీకి కొరగాడని అందరూ చెవులు కొరుకున్నా విధిలేక సావిత్రి నిచ్చాడాయన.

పెద్దమ్మాయి సరిత పుట్టిన మూడో సంవత్సరానికి, సావిత్రి బలవంతం మీద ఉన్న ఊరు వదిలేసి భార్య బిడ్డల్తో జగిత్యాలకు మకాం మార్చాడు నారాయణ.

రాజారాం తన సొంత పూచీ కత్తు మీద అల్లుడికి రోజూవారీ అద్దెకి ఆటో యిప్పించాడు.

ఒకటి రెండు కిరాయి డబ్బలు చెతిలో పడగానే… నాటుసారా అమ్మే గుడిసెల దగ్గిర చేరడం… ఫుల్లుగా మందు కొట్టడం… నారాయణ దినచర్య అయింది.

తాగి ఉన్న ఆటో డ్రైవర్ దగ్గరకు ఎవరొస్తారు. ఏ రోజు కారోజు అలా గడిచిపోయేది. మరుసటి రోజు అదే పరిస్థితి. యజమాని దగ్గర కిరాయి అప్పు పెరుగుతుంటే తరచు రాజారాం సర్దుతుండేవాడు.

ఇల్లు గడవడం కోసం సావిత్రి పొద్దంతా బీడీలు చుట్టేది. ఉదయం సాయంత్రం చుట్టు పక్కల ఇళ్ళలో పాచి పని చేసేది!

ఇక్కడి కొచ్చాకే చిన్నమ్మాయి రజిత జన్మానికొచ్చింది. ఇద్దరు కూతుళ్ళ అవడంతో మొహం చాటేసాడు తప్ప నారాయణ సంపాదన, వైఖరిలో మార్పులేదు.

సావిత్రి సంసారాన్ని నెట్టుకొస్తోంది.

***

రాత్రి జరిగిన విపరీత సంఘటనల్ని నారాయణ తన భార్యకు పూసగుచ్చినట్లు చెప్పాడు. తాగిన మైకంలో కలగని వాగుతున్నాడేమోనని భర్త మాటల్ని పెద్దగా పట్టించుకోలేదు సావిత్రి. కానీ నారాయణ బలవంతం మీద ఊరవతల ఉండే ఓ సాయిబు దగ్గరకు వెళ్ళి భర్తకు తాయెత్తు కట్టించింది.

ఆ రోజు కూడా నిషా ఎక్కే దాకా బాగా తాగి పొద్దపోయినాక రాత్రి వేళ ఇంటికొచ్చాడు నారాయణ. ఎప్పుడూ ప్రేమగా పిల్లల్ని దగ్గరకు తీసింది లేదు. ఎప్పట్లాగే వాళ్ళని కసురుకున్నాడు. అడిగితే సారాకి డబ్బులివ్వలేదని కోపంగా లేచి లేచి సావిత్రిని కొట్టబోయాడు.

భర్త ఎంత అల్లరి చేసినా ఎప్పుడూ ఎదురు తిరిగి ఎరుగదు సావిత్రి. సహనం అలవాటయ్యిందామెకు. సంసారమన్నాక కలతలుంటాయని తెలుసామెకు. తనకీ రకంగా కష్టమొచ్చి పడిందని మిన్న కుండిపోతుందంతే.

గద్దను చూసి ఝడుసుకొని బెదిరిపోయి ప్రాణభయంతో చూసే పక్షి కూనల్లా తండ్రి ఉగ్రరూపానికి ఓ మూలన నక్కి పోయారు చిన్నారులు.

కాళ్ళా వేళ్ళా పడి ఎలాగోల బ్రతిమిలాడి భర్తను సముదాయించింది సావిత్రి. సతాయించి సతాయించి శాంతించిన నారాయణ ఇంత ముద్ద తిని మంచం మీద వాలిపోయాడు.

పిల్లల్తో పాటు తనూ భోంచేసి, గిన్నెలు తోమాక నడుం వాల్చింది సావిత్రి.

***

“నాన్నా మేడం పరీక్ష ఫీజు కోసం డబ్బులు తెమ్మంది” తండ్రి చెంత నిలబడిన సరిత నేల చూపులు చూస్తూ భయం భయంగా అడిగింది.

“తాగేందుకే పైసల్లేవంటే నీ ఫీజు గోలకటా?” చిర్రు బుర్రు లాడాడు నారాయణ.

“రేపు కట్టకపోతే ఇంటికి పుంపుతుందట” సన్నగా పలికిందా అమ్మయి గొంతు

“ఛ… ఛ…! వెధవ సంత!”

“….”

“ఎంత తెమ్మంది?”

“నాకు వంద, చెల్లికి, వంద నాన్నా!”

“ఫో… పోయి మీ అమ్మనడగు…” కసురుకున్నాడు,

“అమ్మ దగ్గర రెందొందలు లేవట నాన్నా. నిన్నే అడగమంది” అంటూనే బెరుగ్గా చూసింది పాప.

’బీడీల పైసలు, అంట్లు తోమిన పైసలన్నీ ఏం చేస్తుందట. దొంగ ముం…” ఆ మాట పూర్తిగా అతడి పెదవి దాటనే లేదు…

“అమ్మను తిట్టద్దూ… ఊ… ఊ…” స్వర తీవ్రత పెరిగిన సరిత కళ్లు క్షణంలో అగ్ని గోళాలయ్యాయి.

ఆ చూపులు ధాటికి చప్పున నిద్రాభంగమైంది నారాయణకు. రాత్రి అతను ఇంటికొచ్చాక జరిగిన సంఘటనది.

తిరిగి కలగా…

ఊహూ…! స్వప్నం కాదది…

పడుకునే ముందు భార్యను లైటు వేసే ఉంచమన్నాడు నారాయణ.

వాస్తవమై… అదిగో శివమెత్తిన బాల కాళిలా నిలబడి… కంటి చూపుతో, అగ్ని జ్వాలలు కురిపిస్తూ… తండ్రికి అతి దగ్గరగా నిలబడి… అతడి మొహంలో మొహం పెట్టి మరీ క్రోధంగా చూస్తోంది సరిత.

ఆ చూపులకి భయకంపితుడైన నారాయణ దిగ్గున లేచి కూర్చున్నాడు.

ఆశ్చర్యం…

ఆ అమ్మాయి కళ్ళు రక్తంతో తడిసినట్లు ఎర్రగా ఉన్నాయి.

పెకిలించినట్లు ఆ రెండు కనుగుడ్లు బాగా ముందుకు సాగి సాగి సరిగ్గా అతడి కళ్ళ దగ్గర నిల్చుపోయాయి.

కెవ్వుమనబోయి కుడిచేత్తో విసురుగా ఆ కనుగుడ్డని విదిల్చాడు. పక్షి గుడ్లు పగిలినట్లు ఆ కనుగుడ్డు భళ్లున పగిలి అతడి చేతిని రక్తసిక్తం చేశాయి.

సొనతో కూడిన రక్తం అంటిన చేతిని చూసి మతి భ్రమించినటయ్యింది నారాయణకి. మెదడు వేడెక్కి… గుండె అవిరవుతుంటే… గొంతు తడారిపోయింది. మాట సైతం పెగల్లేదు.

అంతలోనే ఏవీ ఎరగనట్లు మొహం వేలాడేసుకొని వినయంగా నిలబడిన కూతురు కన్పించింది. చేతుల కంటిందని భ్రమించిన రక్తం కూడా మటుమాయమైంది.

అంతా అయోమయంగా ఉంది నారాయణకి.

ఇందంతా కలకాదు వాస్తవమని గ్రహింపు కొచ్చిన మరుక్షణం తిరిగి నారాయణలో మెల్లగా ధైర్యం వేళ్ళూనుకుంది. ఏం చూసుకుని తననిలా మిడిగుడ్లేసుకొని చూస్తోందని సరిత మీద పట్టరాని ఆగ్రహం పెల్లుబికింది.

పశుత్వం ప్రకోపిస్తుంటే చంపేయాలన్నంత ఆవేశం ముంచుకొచ్చింది. జరగబోయే పరిణామం ఊహించక ఆ అమ్మయిని బలంగా వెనక్కి నెట్టేసాడు…. నెట్టేస్తున్నానని భ్రమపడ్డాడంతే. అతననుకున్నట్లు ఆ పాప వెనక్కి పడిపోలేదు.

ఎవరో రంధ్రం చేసినట్లు ఆ అమ్మాయి కడుపుని చీల్చుకొని అతడి అరచేయి అవతలి వైపుకి పొడుచుకొని వెళ్లింది.

ఆ దృశ్యానికి బీభత్స సముడైన నారాయణ భూనభోంతరాలు దద్దరిల్లేలా ‘కెవ్‌వ్’మని కేకేసాడు భీకరంగా.

“చంపేస్తావా నాన్నా….! నన్ను కూడా చంపేస్తావా…?” తల పక్కకు వాల్చేసి నాలుక బయటకు పెట్టి అడుగుతోందా అమ్మాయి.

చేష్టలుడిగిన నారాయణ కూతురు దేహంలో ఇరుక్కుపోయిన తన చేతిని హఠాత్తుగా వెనక్కి లాగేసుకున్నాడు.

మోచేతి వరకు దూరిన అతడి చేయి ఓ వైపు నిప్పు కణికల్లో ఉంచినట్లు భగ భగ మండుతుంటే…. మరో వైపు ధారగా రక్తం కారుతోంది.

అచ్చూసిన నరాయణ నిలువెల్లా కంపించిపోయాడు. చేయి వణుకుతోంది. మనిషికి ఏడుపొక్కటీ తక్కువైంది. భయం గుండె లోతుల్లోంచి తన్నుకొస్తుంటే నిగ్రహం కోసం క్షణ కాలం కళ్ళు మూసి తెరిచాడు.

విచిత్రం!

అతడి చేయినుండి ఓడుతున్న చిక్కటి రక్తం క్షణంలో అదృశ్యమయ్యింది. అతడి కూతురు సరిత కూడ అక్కడ లేదు. అసలక్కడ ఎవరూ లేరు. ఏ రూపమూ లేదు.

గుండె దడ దడ లాడుతుంటే నిట్టూర్చిన నారాయణ అలాగే మచం మీద వెనక్కి వాలిపోయాడు.

ఎప్పుడూ ఆదమరచి నిద్రపోయే నారాయణకి వెంటాడుతున్న పిచ్చి పిచ్చి ఆలోచనలతో… తొలిసారిగా ఆ రాత్రంతా నిద్ర పట్టలేదు.

***

రాత్రి తాలూకు భయానక అనుభవాన్ని భయం భయంగా భార్యకు చెప్పాడు నారాయణ. భర్త మానసిక భయాందోళనలకు పిల్లల్ని కారకుల్ని చేస్తోంటే విపరీతంగా బాధపడింది సావిత్రి.

ఆడపిల్లలు పుట్టారన్న బాధ మనసులో ఉంది నారాయణకు. ఆ బాధనలా వెళ్ళగక్కుతున్నడేమోనని సందేహపడింది సావిత్రి.

వరుసగా రెండ్రోజుల నుండి భర్త వెల్లడిస్తోన్న విషయాల్ని పొల్లుపోకుండా… తను అంట్లు తోమో ఓ యజమాని… డాక్టర్ సురేంద్ర, సైకియాట్రస్ట్ ముందు వెల్లడించింది.

“ఒకరి మీద ద్వేషం రగిలినప్పుడు వారి చుట్టూ ఆలోచనలు పరిభ్రమించడం సహజం. ఆ ఆలోచనల తీవ్రత పతాక స్థాయికి చేరి… రాత్రి పూట కలలుగా రూపు దాల్చుతాయి. ఒకరకంగా ఇన్‌సెక్యూరిటీ భావన కలిగినప్పుడు… వికృత భావాలై… అయా వ్యక్తులు మానసిక ఒత్తిడికి లోనవుతుంటే… భయభ్రాంతులకు గురి చేస్తాయి” అని చెప్పేసి స్వయంగా కొన్ని మాత్రలిచ్చాడా డాక్టర్.

***

రెండవ అమ్మాయి రజిత పుట్టాక ఇద్దరు పిల్లలు చాలని ట్యూబెక్టమీ ఆపరేషన్ చేయించుకుంటానంది సావిత్రి. ఒప్పుకోలేదు నారాయణ. ఇంట్లో మగ నలుసు ఉండాలని పట్టు పట్టాడు. మరొక కాన్పు కావల్సిందేనన్నాడు.

ఆడయినా మగయినా ఎవరైతేనేంది ఇద్దరు చాలంది సావిత్రి. ఆ ఇద్దరి నైనా ఏ లోటు లేకుండా పెంచే బాధ్యత స్వీకరిస్తే సరిపోతుందంది. అస్సలు విన్లేదు నారాయణ.

గొడవ గొడవ చేసి సావిత్రని చితక బాదాడు. ఇష్టం లేకపోయినా తలొగ్గక తప్పలేదు సావిత్రికి. అలా మూడవ సంతానంగా కవిత జన్మించింది.

జీర్ణించుకోలేక పోయాడు నారాయణ. మళ్లీ ఆడపిల్ల కలిగే సరికి ఆతడిలో మృగం మేల్కొంది. మనిషి కుత కుతలాడి పోసాగాడు.

బొద్దుగా ముద్దులొలికే పాపని చూసి తల్లిగా మురిసిపోయిన సావిత్రి ఆ చిన్నారిని గుండెలకి హత్తుకుంది. ముద్దలతో ముంచెత్తింది. అక్కలిద్దరూ కూడా తమ చిట్టి చెల్లెల్ని అపురూపంగా ప్రేమగా చూసుకోసాగారు. ప్రతి క్షణం ఆడిస్తూ పాపతోనే గడిపేవారు.

ఆ పాప కేరింతలు కొడుతుంటే నారాయణ గుండెలో నిప్పు కణకలు రగలసాగాయి.

ఒక రోజు రాత్రి సావిత్రితో తీవ్రస్థాయిలో గొడవ పడ్డాడు. తొలిసారిగా భర్తకు ఎదురుతిరిగింది సావిత్రి. అహం దెబ్బతిన్న నారాయణ అది తట్టుకోలేకపోయాడు.

అందరూ నిద్రలో జోగడుతుంటే…. తాగిన మైకంలో… విచక్షణ కోల్పోయి… కిరాతకంగా ఆ పాప గొంతు నులిమి చంపేసాడు.

ఈ విషాద సంఘటనకి ఒక్క సావిత్రి కాదు, పిల్లలు కూడా కలత చెందారు. పాపం చెల్లెలు కోసం ఏడ్చి ఏడ్చి తల్లితోపాటు కన్నీరు కార్చిన ఆ పసివాళ్లు ఓ రెండ్రొజుల పాటు పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టలేదు. కవిత ముద్దు ముద్దు మాటలు గుర్తుకు రాసాగాయి. ఆ పాప ఇల్లంతా తిరుగుతున్నట్లే అన్పించింది వాళ్ళకి.

ఆరని కడుపుకోతని గుండెల్లో దాచుకొని మౌనంగా తల్లడిల్లింది తప్ప… ఉన్న ఆ ఇద్దరు పిల్లల భవిష్యత్ కోసం…. భర్త దూరాగతాన్ని బయటపెట్టలేకపోయింది సావిత్రి.

***

ఇది జరిగిన కొన్నేళ్ళకే వారసుడు కావాలంటూ మళ్ళీ భార్య వెంట పడ్డాడు నారాయణ. సావిత్రి తిరస్కరించింది. భార్య పట్ల మరింత మూర్ఖంగా ప్రవర్తించసాగాడు నారాయణ.

శోక సముద్రాన్ని పంటి బిగువున భరిస్తోందా ఇల్లాలు.

‘మరో సారి బిడ్డకి తల్లివ్వాలని ప్రయత్నిస్తే తల్లి ప్రాణానికే ప్రమాదం’ అన్న డాక్టర్ హెచ్చరికల్ని భర్తకి వెల్లడించింది సావిత్రి. డాక్టర్ సూచనల్ని ఖాతరు చేయలేదు నారాయణ.

భర్త అనుమతి లేకుండా ఆపరేషన్ చేయించుకుంటే…. ఇంకెలాంటి కిరాతకానికి ఒడికడతాడోనని వెరిచిన సావిత్రి…. ఎప్పటికైనా భర్తని ఒప్పించాలని…. ప్రస్తుతం అతడిని దగ్గరకు రానివ్వడం లేదు…!

***

ఆ రోజు ఆదివారం…

రాత్రి పూట జరుగుతున్న భయానక సంఘటనలకి ఝడుసుకున్న నారాయణ ఒంటరిగా పడుకోవడానికి భయపడుతుండడంతో… పక్కన పడుకుంటానంటే అడ్డు చెప్పలేదామె.

పిల్లల్తో పాటు తనూ నిద్రలోకి జారుకుందెప్పుడో. నారాయణకెమో నిద్ర రావడం లేదు. అసహనంగా ఆ పక్కకి ఈ పక్కకి దొర్లుతున్నాడు.

అతని పరంగా సమయం భారంగా భయం భయంగా గడుస్తోంది.

భర్త ఆలోచనలకు అనుగుణంగా, మెల్లగా ఇటువైపు తిరిగిన సావిత్రి సుతారంగా భర్తని తన కౌగిట బంధించింది.

మనసు మార్చుకొని భార్య అలా ప్రవర్తిస్తుందేమోనని ఊహించిన నారాయణ మహాదానందపడిపోయాడు.

తమలపాకుల్లాంటి మృదువైన ఆమె అరచేతుల స్పర్శ… నెమ్మదిగా… నెమ్మదిగా… నెమ్మదిగా…. ఉక్కు సంకెళ్ళలా మారి… ఉడుం పట్టులా అతడి దేహాన్ని బిగుసుకొసాగింది.

అది సరసంలో భాగమని మొదట భావించిన నారాయణ…. ప్రమాదాన్ని పసిగట్టేలోగా… ఆమె కౌగిలి… నరక ప్రాయమై నారాయణ ఊపిరాడకుండా చెసేస్తోంది. ఆ హఠాత్ పరిణామానికి మనిషి ఒక్కసారిగా బెదిరిపోయాడు.

అరుద్దామంటే గొంతు పెగల్లేదు. ఆ ఇనుప కౌగిలి విడుపించుకుందామంటే చేతులాడ్డం లేదు. మనిషి కాసేపు కిందా మీదా అయ్యాడు.

ఒకే ఒక్క ఘడియ… శ్వాస ఆగి మృత్యుముఖంలోకి వెళ్లినవాడిల్లా… ఊహించని విధంగా ఆ ఉక్కు కౌగిలి విడవడంతో… ఆబగా ఊపిరి పీల్చుకున్నాడు. పొయిన ప్రాణం లేచి వచ్చినట్లయ్యింది. ఆ సంతోషం ఎంతో సేపు నిలవలేదు.

అతడు ఊపిరి పీలుస్తున్న గాలి సెకన్‌లో తారుమారయ్యింది. శవాలు కాలుస్తున్న వాసన రాసాగింది. ఆ కంపు వాసన భరించలేక తిరిగి ఊపిరి బరువెక్కుతుంటే లబోదిబో మంటూ ఛాతీని రెండు చెతుల్తో… తనని తానే పిడిగుద్దులు గుద్దుకోసాగాడు.

అలా చేతుల్తో గుద్దుకుంటున్న ప్రతిసారీ… అంతడి దేహం… సుత్తితో కొడుతున్న ఇనుపరేకులా… సొట్టలు సొట్టలు పడుతుంటే… చూసుకున్న నారాయణకి కడుపులో ఎవరో చేయి పెట్టి దేవినట్లయ్యింది. భళ్ళున వాంతి చేసుకోబోయి పిడి గుద్దులు గుద్దుకోవడం ఆపేసాడు. చిత్రంగా శవాలు కాలుతునట్లు వస్తున్న ఆ వాసన మటు మాయమయింది. అతడి దేహం సొట్టలు సరి చేయబడటం మునుపటిలా మారిపోయింది.

మనిషి మామూలవుతూ దిగ్గున లేచి కూర్చున్నాడు. అతడి పక్కన ఎవరు లేరు. ఖాళీ, భార్య వంక చూశాడు.

నవనాడుల్ని ఎవరో కత్తిమొనకి ముడేసినట్టు దిగ్భ్రమకి లోనయ్యాడు. సావిత్రి ఎడం పక్కన లేదు. అతడికి కుడి వైపున పిల్లలవైపు మొహం చేసుకి పడుకొని ఉంది. బాహ్య ప్రపంచంతో సంబంధం లేనట్టు గాఢ నిద్రలో మునిగి ఉంది.

శిరోభారమన్పించి గట్టిగా తల విదిల్చాడు.

అనూహ్యంగా –

కళ్ళకి కళ్ళు… ముక్కుకి ముక్కు… చెవులకి చెవులు… నోరుకి నోరు… అలా ఏ పార్ట్‌కి ఆ పార్ట్ ఊడిపోయి… దారాలతో కట్టినట్టు వేలాడసాగాయి.

అచ్చూసి…

వ..వ..ణి..ణి…కి…కి…పోయాడు….!

అదిగో అప్పుడు…

ప్రాణ భయంతో బిగ్గరగా అరవ సాగాడు పిచ్చి పిచ్చిగా…

వేలాడుతున్న ఆ అవయవాలన్నీ తిరిగి యథాస్థితికి వచ్చేసాయి. ముఖానికి చేరిపోయాయి. షేకవుతునే చప్పున అక్కడి నుండి లేవబోయాడు.

పారిపోయే అవకాశం లేనట్టు ఏదో బలమైన అదృశ్యశక్తి గట్టిగా పట్టుకొని అతడిని ఆపినట్లుయ్యింది. గొడకు అంటించిన స్టికర్‌లా ఉన్నచోట నుండి కదల్లేకపోయాడు.

గాలి పొరల్ని చీల్చుకుంటూ “నాన్నా…. నన్ను వదలి ఎక్కడికని వెళ్తావ్…?” అనే మాటలు ముద్దు ముద్దుగా వినపడ్డాయి. ఆ గొంతు సుపరిచితమైనదే. దిక్కులు చూసాడు భయం భయంగా.

ఎ…ఎ..వరూ లేరక్కడ!

“ఇక్కడ నాన్నా…”

ఆ గొంతు విన్పించిన వైపు చూశాడు తటాలున, అప్పటి దాకా ఎడమ వైపున ఖాళీగా ఉన్న చోట… అతడికి అంతి సమీపంగా చాపపైన…

మరణించిన… ఊహం హత్యకు గురైన చిన్నారి పాప… క…వి…త… చెంప కింద చేయాన్చుకుని దిగులుగా కూర్చొని ఉంది…!!

ఇ… ఇదెలా సాధ్యం??

మూడేళ్ళ కవిత రూపాన్ని చూసి అంతెత్తుకి ఎగిరి పడ్డాడు.

“నాన్నా… నన్ను… చంపవూ…?” ఆ పసి గొంతు దీనంగా అర్ధిస్తోంది.

బెదరిపోయాడా మాటల్ని విని.

“నాన్నా…. చంపవూ…” అంటూనే ఆ పాప అయిదడుగులకి ఎగిరి పోతూ…

“చంపు… చంపేయ్… చంపేయ్‌రా…” దిగంతాలు దద్దరిల్లేలా అరిచింది.

మృత్యభయంతో అక్కడి నుండి పారిపోయాడు నారాయణ. కుదర్లేదు.

కవిత తన చేతుల్ని చూచి… ఇంకా ఇంకా చాచి…. అలా సాగిన చేతుల్తో నారాయణ కంఠనాళాన్ని దొరకబుచ్చుకుంది. బిగుసుకున్నాయి చేతులు. అతి బలంగా.

నారాయణకి శ్వాస ఆడడం లేదు. పెనుగులాడ్డం ప్రారంభించాడు. ఆమె మృత్యుహస్తాల నుండి తప్పించుకోవడం దుస్సాధ్యమన్పించింది.

అలాగే ఆ అమ్మాయి కసి కసిగా అతడి కంఠనాళాన్ని శక్తినంతా కూడదీసుకొని బలంగా నొక్కుతూనే ఉంది.

రక్తం ఉబికి ఉబికి వస్తోంది. కళ్ళు తేలేసాడు. నాలుక బయటకు పొడుచుకొని వచ్చంది. చివరిక్షణం అతడికి అరిచే అవకాశమే లేకుండా పోయింది.

చేసిన పాపానికి ఫలితమనుభవిస్తున్నట్లుగా-

గిలగిలా కొట్టుకుంటూ… రక్తం… కక్కుకుని… చివరి శ్వాస వదిలేసాడు.

ఆ రోజు ఆదివారం…

సరిగ్గా సంవత్సరం క్రితం ఇదే సమయం… కవిత.. ఆ కిరాతకుడి… చేతులో మృత్యుముఖం పాలైన రోజు.

(సమాప్తం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here