మృత్యుంజయుడు

2
7

[dropcap]మృ[/dropcap]త్యుంజయుడు పెద్ద చెప్పుకోదగ్గ మనిషి ఏమీ కాడు.. సగటు మనిషి. ఆస్తిపరుడే కాదు జాగ్రత్త పరుడు కూడా. అతనికి తల్లి, భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో టీచరుగా నాలుగు రాళ్లు కాదు నలభై రాళ్లే వెనకేసుకుంటున్నాడు.

మృత్యుంజయుడు ఇటీవల కాలంలో అదో లాగా ఉంటున్నాడని అతని బంధువులు సన్నిహితులు చెప్పుకుంటున్నారు. కారణం అతనికి పెద్ద దెబ్బలే తగిలాయి అన్నారు.

అసలు మృత్యుంజయుడుకి మొదటి కష్టం అతని చెల్లెలి భర్త, బావ అయిన నందీశ్వర రావు వల్ల కలిగిందన్నారు. నందీశ్వర రావు అంటే మృత్యుంజయుడుకి గొప్ప భక్తి ప్రపత్తులు ఉన్నాయి. కారణం నందీశ్వర రావు తన తెలివితేటలతో సాధారణ మధ్యతరగతి స్థాయి నుంచి ధనికుడుగా ఎదిగి పోవడమే. అంతేగాకుండా మృత్యుంజయుడుకి ఆర్థిక లాభం కలిగే చిన్నాచితకా సలహాలు ఇచ్చేవాడు. తనకంటే ఎంతో తెలివైన నందీశ్వర రావు అంటే సహజంగా గౌరవం పెరిగింది మృత్యుంజయుడుకి.

ఒకనాటి ఆదివారం ఉదయం పదింటికి ఫలహారం తిని బావ గారి ఇంటికి వెళ్ళాడు మృత్యుంజయుడు. బావ మరుదులిద్దరూ కబుర్లలో పడ్డారు. మృత్యుంజయుడు చెబుతున్న మాటలను నవ్వుతూ వింటున్నాడు నందీశ్వర రావు. టాపిక్ అయిపోయినా కూడా రెప్పవాల్చకుండా సాగదీసిన పెదాలతో అలాగే స్టిల్ ఫోటోగ్రఫీ లాగా ఉండిపోయిన నందీశ్వర రావుని చూస్తే మృత్యుంజయుడుకి భయం వేసింది.

“అమ్మాయ్… ! చెల్లాయ్…!” అంటూ అరిచాడు.

“ఏమిటన్నయ్యా” అంటూ వచ్చింది నందీశ్వర రావు భార్య. బావ అలావున్నడేంటి? అనుమానంగా భయంగా అడిగాడు మృత్యుంజయుడు.

“ఏమండీ….! ఏమైంది?” అని భర్త భుజం మీద చెయ్యి వేసేసరికి నందీశ్వర రావు తల వాల్చేసాడు. భార్య ఘోల్లుమంది. మృత్యుంజయుడు స్థాణువై పోయాడు.మనుషులు ఇలా కూడా చచ్చిపోతారా? అనుకున్నాడు. ఇది మృత్యుంజయకి తగిలిన మొదటి దెబ్బ….. మృత్యుంజయుడు కోలుకోవడానికి చాలా సమయం పట్టింది. తర్వాత కొద్ది కాలానికి మృత్యుంజయుడుకి హైదరాబాదులో పని ఉండి గుంటూరులో బస్సు ఎక్కాడు. పక్క సీట్లో కూర్చున్న పాసింజరు తనను తాను సుబ్బారావుగా పరిచయం చేసుకున్నాడు. దేశరాజకీయాలు, రైతు సోదరుల సాధక బాధలు, తరిగిపోతున్న విలువలు, అమెరికాలో స్థిరపడ్డ పిల్లల గురించి భార్య గుండెజబ్బు, కార్పొరేట్ ఆసుపత్రుల బిల్లులు మొదలగు అంశాల మీద అనర్గళంగా ఉపన్యాసం ఇచ్చాడు రాత్రి పొద్దుపోయే వరకూ. ఉదయాన్నే మెలకువ వచ్చి బస్సు హైదరాబాదు చేరుకుందని ఆదరాబాదరాగా లేవబోయి తన మీద ఒరిగి పోతున్న సుబ్బారావుని చూసి మృత్యుంజయుడు కెవ్వుమన్నాడు. ఏ అర్ధరాత్రో ప్రాణం వదిలేసిన ఆ అభాగ్యుడి శవానికి తెల్లవారే వరకూ మృత్యుంజయుడు భుజం ఆసరా అయ్యింది. ఆ తర్వాత బస్సులో ఏం జరుగుతుందో కూడా అర్థం కానంతగా మృత్యుంజయుడుకి మెదడు మొద్దు బారి పోయింది. ఇది జరిగిన చాలా రోజుల వరకూ కూడా సుబ్బారావు మాటలు ముఖకవళికలు గుర్తుకొస్తుండేవి. గుర్తొచ్చినప్పుడల్లా అర్థరాత్రి అయినా సరే లేచి స్నానం చేసి వచ్చేవాడు మృత్యుంజయుడు. ఇది అతనికి తగిలిన రెండవ దెబ్బ.

జ్యేష్ఠ, ఆషాడాలు వెళ్లి శ్రావణ మాసం వచ్చింది. ఇంటి గుమ్మాలకు పసుపు రాసి పచ్చతోరణం కట్టింది మృత్యుంజయుడి భార్య కామేశ్వరి. పిల్లలు పూల దండలు అల్లు కుంటున్నారు. “నాన్నా…. జయుడూ!” ఎల్లుండి వరలక్ష్మి పూజ ఉంది వస్తువులు కావాలి” అంటూ సంచి చేతికిచ్చింది తల్లి పార్వతమ్మ.

పూజకు కావలసిన సామాగ్రి తీసుకొని తల్లి ఇచ్చిన లిస్ట్ సరిచూసుకొని ఇంటికి చేరే సరికి తల్లిని చాప మీద పడుకోబెట్టారు. ఇల్లంతా జనం. “ఏమండీ అత్తయ్య మనల్ని అన్యాయం చేసి వెళ్ళిపోయిందండి!. మీరు వెళ్ళగానే గుండె నొప్పి అని పడిపోయిందండీ!. డాక్టరు వచ్చే టైము కూడా ఇవ్వ లేదండీ!” అంటూ భార్య భోరుమంది. భార్య మాటలు అర్థం కానట్టుగా వెర్రి చూపులు చూశాడు మృత్యుంజయుడు.

‘బామ్మా!’ అంటూ ఏడుస్తున్నారు పిల్లలు. మృత్యుంజయుడి కోసం స్కూటర్ మీద వీధులన్నీ తిరిగి వచ్చిన అప్పారావు మాస్టారు ‘వెరీ సారీ మాస్టారు’ అంటూ పక్కనే చతికిలపడ్డాడు. మృత్యుంజయుడు ఏడవలేదు తల్లి ముఖాన్ని తదేకంగా చూస్తూవున్నాడు.

ఇది జరిగి నెలలైనా తల్లి ‘జయుడూ!’ అంటూ తనను పిలుస్తునట్టే ఉండేది. ఇది మృత్యుంజయనకు తగిలిన పెద్ద దెబ్బ. ఆ తరువాత నుండి మృత్యుంజడి మనఃపరిస్థితి మారిపోయింది. అతని చూపుల్లోనూ,మాటల్లోనూ, చేష్టల్లోనూ మార్పు వచ్చింది. ఊరికే ఒక్కడూ గడిపేవాడు. దేనిపట్ల ఆసక్తిని చూపించేవాడు కాదు. మనుషులు చచ్చిపోతారు. ఇక ఎందుకీ దేహపోషణ? అంటూ నిట్టూర్చేవాడు. మృత్యుంజయకి ఎవరిని చూసినా కదులుతున్న శవాల్లాగా కనిపించేవారు. ఎదురింటాయన పలకరించడానికి వస్తే…… “ఏముందండీ బాధ పడటానికి ఆ మాటకొస్తే మీరు ఉంటారనే అనుకుంటున్నారా? ఇప్పుడు మీ వయస్సు సుమారు అరవై పైనే. మహా అయితే ఓ పదేళ్ళు. ఈ శరీరం చూశారూ? సరిగ్గా చూడండి ఈ కండరాలూ, నరాలూ, మాంసం, రక్తం, బొమికల బొమ్మ కాదంటారా? కిడ్నీ ఫెయిల్యూర్ కావచ్చును, కార్డియాక్ అరెస్ట్ కావచ్చును, లంగ్ క్యాన్సరో లేదా బ్రెయిన్ ట్యూమరో కూడా రావచ్చును…. ఏమంటారు! పెద్ద మనమేదో శాశ్వతంగా బతికేసే వాళ్ళలాగా నేను ఏడవడాలు మీరు ఓదార్చడాలు ఆహా…..హా…హా” అంటూ గట్టిగా నవ్వాడు. దాంతో ఎదురింటాయన ఇక నటించ లేక లేచి వెళ్లిపోయాడు.

***

మృత్యుంజయుడుతో వాచ్ మెన్ అంజయ్య ఇలా అన్నాడు.

“అమ్మగారెళ్ళిపోయింది గుండె రాయి చేసుకోవాలయ్యా! మీరు అలా దిగులు పడకూడదు” అన్నాడు.

“వెర్రి అంజయ్యా! గుండె వేరే రాయి చేసుకోనక్కర్లేదు. నా గుండె,  నీ గుండె అన్నీ రాళ్ళేరా. పిచ్చివాడా! అయితే ఈ రాళ్ళు కూడా బూడిదై పోతాయిరోయ్… దేవుడు ఒక పిచ్చ యంత్రం తయారు చేసి దానికో బుర్రపెట్టాడు. అంతే… యంత్రాలు పాడైపోతాయి రోయ్…యంత్రం అంటే జ్ఞాపకం వచ్చిందినువ్వు నా మోపెడ్ ఇవ్వమని అడిగావు కదరా? ఆ బండి నడిచే దాకా ఈ బండి నడుస్తుందని అనుకుంటున్నావురా? లేకపోతే నువ్వు ఉంటావని అనుకుంటున్నావా? ఆహా……హా… హా..” అంటూ నవ్వి బండి తాళాలు తెచ్చి అంజయ్య చేతిలో పెట్టాడు మృత్యుంజయుడు.

నోరెళ్ళబెట్టి చూస్తున్న అంజయ్యతో “భయపడకు నిజమేరా ఈ మోపెడ్ నీదే” అన్నాడు. ఇంతలో ఎదురుగా ఉండే అపార్ట్మెంట్ లోంచి గట్టిగా ఏడుపులు వినిపించడంతో అంజయ్య కంగారుగా అటు పరిగెత్తాడు.

తీర్థ యాత్రలకు వెళ్లిన ఎదురింటాయన పడవ తిరగబడడంతో నదిలో పడిపోయాడని వార్త తెచ్చాడు అంజయ్య.

“అవును రా… మనిషి చావడానికే గా పుట్టేది.” అంటూ నవ్వుకుంటూ వెళ్లిపోతున్న మృత్యుంజయుని చూసి అయ్యగారిని ఓ పాలి డాక్టర్ కు చూపిస్తే మంచిదనుకున్నాడు అంజయ్య.

“ఓ భార్యా దేహం… ఇలా వస్తావా?” స్కూలు నుంచి పిల్ల దేహాలు వచ్చాయనో, కాలింగ్ బెల్ మోగితే గ్యాస్ బండ దేహం వచ్చిందనో, లేదా కేబుల్ దేహం వచ్చిందనో చెబుతుండేవాడు.

మృత్యుంజయుడు మనుషుల్ని పేర్లతో గుర్తించడం మానేశాడు. టీవీలో ఎవరైనా సెలబ్రిటీస్ మాట్లాడుతున్నా “పెద్ద తనేదో శాశ్వతంగా బ్రతికి బట్టకట్టే వాడిలాగా తన కన్నీతెలిసి పోయినట్టు, ఎలా కబుర్లు చెబుతున్నాడో చూడు ఓ భార్యా దేహం! వింటున్నావా? చూడు ఈ సౌండ్ గోల… ఏమవుతుంది కాలిస్తే బూడిద అవుతుంది” అంటూ నవ్వేవాడు. దాంతో మృత్యుంజయుడు భార్య చాలా భయపడి, తన అన్నగారైన అనంతాన్ని అర్జెంటుగా రమ్మని పిలిచింది.

అసలు బావమరిది అనంతాన్ని చూస్తే మృత్యుంజయుడు ముఖం చాటేసేవాడు. కారణం అనంతం ఆర్థిక స్థాయి చిన్నది. మృత్యుంజయుడుకి తన ఊళ్లో ఓ రెండొందల గజాల స్థలం తాతల నాటిది ఉంది. దాన్ని ఏ పది లక్షలకో అమ్మేసుకుని లాభపడి పోవాలని మృత్యుంజయుడు ఆశపడేవాడు. అనంతం చాలాసార్లు బావ గారితో “బావా! నీకున్న ఆస్తులతో పోలిస్తే ఆ స్థలం నీకు ఒక లెక్క కాదు. ఊరికే వద్దు కష్టపడి కూడపెట్టుకున్న డబ్బు రెండు లక్షలు ఇస్తాను. నీ పేరు చెప్పుకుని రెండు గదులు వేసుకుని పిల్లలతో బతికేస్తాను” అంటూ కాళ్లు గడ్డం పుచ్చుకుని బ్రతిమాలే వాడు. ఈ కారణం చేత మృత్యుంజయుడు అనంతాన్ని తప్పించుకుని తిరిగేవాడు.

ఈసారి అనంతాన్ని చూస్తూనే పెద్దగా నవ్వి! “బావ దేహం వచ్చింద”న్నాడు.

చెల్లెలు గోడు విన్న అనంతం “బావా! అలా మనం గుడి దాకా వెళ్దాం” అంటూ పిలిచాడు.

“ఎందుకూ? నాకు హితబోధ చేయటానికా? సరే వింటాను అయితే నాకు ఒకటి చెప్పు. నువ్వు చచ్చిపోకుండా ఉంటావా? నీకు ఆల్రెడీ బిపి, షుగర్, అన్నీ ఉన్నాయి కదూ.. సరే వెరీ గుడ్ నువ్వు ఎన్నాళ్లు బ్రతికి ఉంటావ్? ఇది చెప్తే వస్తాను” అన్నాడు మృత్యుంజయుడు.

“అది ఎలా తెలుస్తుంది బావా”? ఆన్నాడు అనంతం వెర్రి ముఖం వేసి. “మరి ఏమీ తెలియని దానికి పేద్ద తెలిసినట్టు పోజుకొడతారెందుకు ఈ మనుషులు? నాకు చెప్పడం దేనికి చెప్పు? ”

“సరే… ఈ కబుర్లు ఎందుకు గానీ దస్తావేజులు తెచ్చుకో. నాకు రెండు లక్షలు కూడా ఇవ్వదు. ఇల్లు కట్టుకో. నీ పెళ్ళాం, పిల్ల దేహాలతో ఉన్నన్నాళ్ళూ ఉండు. ఆ తరువాత ముందు నువ్వో, నేనో” అంటు గట్టిగా నవ్వాడు.

అవునంటూ భక్తిగా తలూపాడు అనంతం. “చూడు ఆ పెరట్లో ఆవు, గేదె దేహాలు ఉన్నాయి. అవి అంబా అని అని శబ్దాలు చేస్తాయి. మన దేహాలూ శబ్దాలు చేస్తాయి. మనకు మనం చస్తామని తెలిసినా జ్ఞానం రాదు. వాటికి తెలీదు. అవి హాయిగా చస్తాయి. ఒకడిది లాక్కోవు, పోయిందని ఏడవవు. ఏమంటావు.. ” అన్నాడు మృత్యుంజయుడు.

“నువ్వు చెప్పింది పరమ సత్యం. నువ్వు శ్రీకృష్ణుడివి నేను కుచేలుడిని బావా!” అని కాగితాల మీద సంతకం పెట్టించుకున్నాడు అనంతం ఆనందంగా.

***

ఆ రోజు మృత్యుంజయుడు తల్లి పుణ్యతిథి. కార్యక్రమం ముగిశాక “ఇదిగో భార్యా దేహం బ్రాహ్మణ దేహానికి దక్షిణ తాంబూలాలు పట్టుకురా!” అంటూ భార్య కామేశ్వరిని పిలిచాడు మృత్యుంజయుడు.

మౌనంగా ఇదంతా గమనిస్తున్న పరమేశ్వర శాస్త్రి ఇంక ఊరుకోలేక పోయాడు.

“ఏమిటయ్యా మృత్యుంజయుడూ! ఈ ధోరణి? దేహాలు ఏవిటయ్యా? దేహో దేవాలయో ప్రోక్తో జీవో దేవ సనాతనః. దేహమే దేవాలయం కదా నాయనా’. ఈ దేహం సామాన్యమైనదా ఎంత అద్భుత నిర్మాణం? ఋషులకు, యోగులకు ముక్తి సాధనం. భగవత్ దత్తమైన ఈ దేహాన్ని పవిత్రంగా ఉంచాలి. ఆరోగ్యంతో కాపాడుకోవాలి. పలు ధర్మకార్యాలు చేయాలి ఈ దేహంతోనే నాయనా. జీవితం చిన్నది కనుకనే మనం ఆనందిస్తూ నలుగురికు ఆనందాన్ని పంచుతూ బతకాలి మృత్యుంజయుడూ!.”

“అమ్మయ్ కామేశ్వరీ! ఇటు రా తల్లి! ఓం శతమానం భవతి శతాయుః పురుషః శతేంద్రియ ఆయుష్ యేవేంద్రియే ప్రతి తిష్టతి”. అంటూ దంపతుల నెత్తిన అక్షతలు జల్లి దీవించి వెళ్లారు శాస్త్రి గారు. మృత్యుంజయుడు మౌనంగా ఉండిపోయాడు. ఆలోచనలో పడ్డాడు. ఆ తరువాత అతని నోటి వెంట దేహం అన్నమాట రాలేదు

***

ఆ రోజు మృత్యుంజయుడి పుట్టినరోజు. పిల్లలకు స్వీట్లు పెన్నులు పుస్తకాలు పంచాడు. పిల్లల కేరింతలను, సంతోషాన్ని అలా చూస్తూ ఉండిపోయాడు. ఆరోజు మనసుపెట్టి శ్రద్ధగా పాఠం చెప్పాడు. ప్రతిరోజు ఓ కొత్త అనుభూతిని పొందుతున్నాడు. హెడ్ మాస్టారు పిలిచి అభినందించాడు. పేద పిల్లల తల్లిదండ్రులకు తోచిన ఆర్థిక సాయం చేస్తున్నాడు. భర్తలో వచ్చిన మార్పుకు కామేశ్వరి సంతోషించింది.

***

ఆ రాత్రి మృత్యుంజయుడుకి గుండె నొప్పి వచ్చింది. నాలుగు రోజులు ఆస్పత్రిలో ఉండి ఇంటికి వచ్చాడు మృత్యుంజయుడు. అతన్ని చూడడానికి వచ్చిన బడి పిల్లలు, తోటి ఉపాధ్యాయులు, ఇరుగు పొరుగు వారితో ఇల్లు నిండిపోయింది. పిల్లలు ఒకరి తరువాత ఒకరుగా వచ్చి మృత్యుంజయుడుకి కుంకుమ, విభూది పెట్టారు. తమ మాస్టారు తొందరగా కోలుకోవాలని దేవుణ్ణి ప్రార్థించారు. పిల్లల నిష్కల్మషమైన ప్రేమకు మృత్యుంజయుడి కళ్ళలో నీళ్లు తిరిగాయి. వచ్చిన వాళ్ళందరూ శుభాకాంక్షలు ఆశీస్సులు ఇచ్చి వెళ్లారు. మృత్యుంజయుడు కళ్ళు మూసుకున్నాడు “మనిషి గుండె నిండుగా ప్రేమ ఉన్నప్పుడే మనిషి అవుతాడు లేకపోతే ఉత్త దేహమేనే అమ్మ!”. అని కనపడని తల్లితో చెప్పుకున్నాడు.

“జయుడూ! నువ్వు మృత్యుంజయుడువి రా!” అని తల్లి చెప్పినట్టు అనిపించింది మృత్యుంజయుడుకి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here