ముద్రారాక్షసమ్ – చతుర్థాఙ్కః – 3

0
5

[box type=’note’ fontsize=’16’] ‘ముద్రారాక్షసం‘ ఏడంకాల రాజకీయ నాటకం. విశాఖదత్తుడు యీ నాటకాన్ని చతుర రాజకీయ వ్యూహాల అల్లికతో, అద్భుతంగా రూపొందించాడు. సంస్కృత సాహిత్యం మొత్తంలో అరుదైన ఈ నాటకాన్ని ఇంద్రగంటి శ్రీకాంతశర్మ గారు అనువదించి, వ్యాఖ్యతో అందిస్తున్నారు. [/box]

మలయ:

సఖే చాణక్యస్య వనగమనే పునః ప్రతిజ్ఞారోహణే వా కస్య స్వార్థసిద్ధిః?

అర్థం:

సఖే=మిత్రమా!, చాణక్యస్య+వనగమనే=చాణక్యుడు అడవికి పోవడంలో (వల్ల), పునః+ప్రతిజ్ఞా+ఆరోహణే+వా=మళ్ళీ ప్రతిజ్ఞ పట్టడం వల్ల గాని, స్వార్థసిద్ధిః+కః+అస్య=సొంత ప్రయోజనం అతడికేమి ఉంటుంది?

భాగు:

వాత్యన్త దుర్బోధో ఽయ మర్థః యావద్యావ చ్చాణక్యహతక శ్చన్ద్రగుప్తా ద్దూరీభవతి, తావత్తావ దస్య స్వార్థసిద్ధిః।

అర్థం:

అయం+అర్థః=ఈ విశేషం (విషయం), వ+అత్యన్త+దుర్బోధః=అంతగా అర్థం కాకపోయేది కాదు (ఇందులో అర్థం కాకపోవడానికి ఏమీ లేదు), చాణక్య+హతకః=చాణక్యగాడు, చన్ద్రగుప్తాత్=చంద్రగుప్తుడి నుంచి, యావత్+యావత్+దూరీ+భవతి=ఎంతెంతగా దూరం జరుగుతాడో, తావత్+తావత్=అంతంత పాటిగా, అస్య=ఈ (రాక్షసమంత్రికి), స్వార్థసిద్ధిః=సొంతానికి లాభం చేకూరుతుంది.

శకట:

అల మన్యధా వికల్ప్య ఉపపద్యత ఏవై తత్ పశ్య త్వమాత్యః

అర్థం:

అన్యధా+వికల్ప్య+అలం=వేరుగా భావించే అవసరం లేదు. ఏతత్+ఉపపద్యతే+ ఏవ=ఇది జరనవచ్చుననేదే, అమాత్యః+పశ్యతు=మంత్రువర్యులు చూడవచ్చు గాక.

శ్లోకం:

రాజ్ఞాం చూడామ ణీన్దుద్యుతి ఖచితశిఖే

మూర్ధ్నీ విన్యస్తపాదః

స్వైరే వోత్పద్యమానం కిమితి విషహతే

మౌర్య ఆజ్ఞావిఘాతమ్?

కౌటిల్యః కోపనో ఽపి స్వయ మభిచరణ

జ్ఞాత దుఃఖ ప్రతిజ్ఞో

దైవా తీర్ణ ప్రతిజ్ఞః పునరపి న కరో

త్యాయతిగ్లానిభీతః॥ (12)

అర్థం:

రాజ్ఞాం=పాలకుల యొక్క, చూడామణి+ఇన్దుద్యుతి+ఖచిత+శిఖే+మూర్ధ్ని=శిఖలో పెట్టుకున్న మణుల వెన్నెలలు అద్దబడిన శిఖ గల తలపై, విన్యస్త+పాదః=(తన) పాదాన్ని నిలిపిన, మౌర్యః=మౌర్య చంద్రగుప్తుడు, స్వైః+ఏవ=తనవారి చేతనే, ఉత్పద్యమాన+ఆజ్ఞా+విఘాతమ్=తనకు (తనదైన) ఆదేశాలకు భంగపాటు కలిగించడం, కిమ్+ఇతి+విషహతే=ఎందుకు భరిస్తాడు?, కౌటిల్యః=కౌటిల్యుడు (కూడా), కోపనః+అపి=(సులభంగా) కోపం తెచ్చుకొనే స్వభావం కలవాడైనా, స్వయం+అభిచరణ+దుఃఖ ప్రతిజ్ఞః=తన అనుచరులు, స్వయంగా తాను ఆచరించిన అభిచారణాది, కష్టసాధ్యమైన ప్రతిజ్ఞ కలవాడైనందున, దైవాత్=విధివశాత్తు, తీర్ణ+ప్రతిజ్ఞః =దాటిన ప్రతిజ్ఞ (నెరవేర్పబడిన ప్రతిజ్ఞ) కలవాడైనందున, అయతి+గ్లాని+భీతః=రాబోయే అలసట పాటు భయం కలవాడై (మళ్ళీ ప్రతిజ్ఞ చేస్తే కలిగే దుఃఖం శ్రమ ఎరిగినవాడై), పునః+అపి=మళ్ళీ, న+కరోతి= (ప్రతిజ్ఞ అనే పొరపాటు) మళ్ళీ చేయడు.

వ్యాఖ్య:

(కౌటిల్యుడు ఆభిచారిక క్రియలతో కష్టపడి సాధించిన ప్రతిజ్ఞా పరిపూర్తికి మరొకసారి సిద్ధపడడు. అందులో ఉండి ఎదురవబోయే దుఃఖం భరించడానికి సిద్ధపడడు – అని సారాంశం).

వృత్తం:

స్రగ్ధర – మ – ర – భ – న – య – య – య – గణాలు.

రాక్షసః: 

శకటదాస, ఏవ మేతత్, గచ్ఛ, విశ్రామయ కరభకమ్।

అర్థం:

శకటదాసా, ఏవం+ఏతత్=ఇది అంతేలే, గచ్ఛ=వెళ్ళు, కరభకమ్+విశ్రామయ=కరభకుడిని విశ్రమింపజెయ్యి.

శకట:

తథా (ఇతి పురుషేణ సహ నిష్క్రాన్తః.)

అర్థం:

తథా=అలాగే, (ఇతి=అని, పురుషేణ సహ=కరభకుడనే వ్యక్తితో కలిసి, నిష్క్రాన్తః=వెళ్ళిపోయాడు).

వ్యాఖ్య:

ఇంతవరకు – రంగస్థలం మీద ఒక ప్రక్కన రాక్షసమంత్రి, కరభక, శకటదాసులతో నడిపిన సంభాషణను – మరొకప్రక్కన మలయకేతుడు, భాగురాయణుడు చాటుగా ఆ సంభాషణను వింటూ చేసుకునే వ్యాఖ్యలను, కవి ప్రక్కప్రక్కనే ప్రదర్శించడం గమనించాలి. రాక్షసమంత్రి ప్రసంగంలో ప్రస్తావించిన విశేషాలు మలయకేతుడికి మరోలా తోచేలాగా భాగురాయణుడు చేసే వ్యాఖ్యలు నాటకీయంగా గమనించదగినవి.

రాక్షసః: 

అహ మపి కుమారం ద్రష్టు మిచ్ఛామి

అర్థం:

అహం+అపి=నేనున్నూ, కుమారం=పర్వతక రాజకుమారుడు మలయకేతుడిని, ద్రష్టుం+ఇచ్ఛామి=చూడాలనుకుంటున్నాను.

మలయ:

(ఉపసృత్య) అహ మే వార్యం ద్రష్టు మాగతః

అర్థం:

(ఉపసృత్య=సమీపించి), ఆర్యం=పూజ్యులు (మిమ్మల్ని),  అహం+ఏవ=నేనే, ద్రష్టుం+ఆగతః= చూడాలని వచ్చాను.

రాక్షసః: 

(నాట్యే నావలోకస్య) అయే కుమారః! (ఆసనా దుత్థాయ) ఇద మాసనమ్। ఉప వేష్టు మర్హతి కుమారః

అర్థం:

(నాట్యేన+అవలోకస్య=నాటకీయంగా చూసి) అయే+కుమారః=అహో! కుమారా!, (ఆసనాత్+ఉత్థాయ=కూర్చున్న పీఠం నుంచి లేచి), ఇదం+ఆసనమ్=ఇదిగో పీఠం. కుమారః+ఉపవేష్టుం+అర్హతి=రాకుమారుడు కూర్చోవడానికి తగినది.

మలయ:

అయ ముపవిశామి. ఉపవిశ త్వార్యః (యథార్హ ముపవిష్టః.) ఆర్య, అపి సహ్యా శిరోవేదనా?

అర్థం:

అయం+ఉపవిశామి=ఇదిగో కూర్చుంటున్నాను. ఆర్యః+ఉపవిశతు=మీరు కూర్చోండి.  [యథా+అర్హం+ఉపవిష్టః=తగు విధంగా కూర్చున్నాడు (హోదాకు తగ్గట్టుగా).] ఆర్య=పూజ్యా, అపి+సహ్యా+శిరోవేదనా=మీ తలనొప్పి తగ్గిందా? (మీరు సహించగలిగారా?)

రాక్షసః: 

కుమార, కుమారస్యాధి రాజశబ్దే నాతిరస్కృతే కుమారశబ్దే, కుతో మే శిరోవేదనాయాః సహ్యతా?

అర్థం:

కుమార=నాయనా, కుమారస్య=రాకుమారునికి, అధిరాజ+శబ్దేన=రాజాధిరాజ అనే పదంతో, కుమారశబ్దే+అతిరస్కృతే=’కుమార’ అనే పదం తొలగించ లేకుంటే – మే+శిరోవేదనాయాః=నా తలనొప్పికి (యొక్క), కుతః+సహ్యతా=ఉపశమనం ఎక్కడిది?

వ్యాఖ్య:

మలయకేతుడు ఇప్పటికింకా ‘రాకుమార’ పద సంబోధనతోనే ఉన్నాడు. అట్టి మలయకేతుడి పేరు ముందు ‘రాజాధిరాజ’ పదం చేర్చేవరకు – నాకీ శిరోవేదన ఉపశమించదు – అని రాక్షసమంత్రి భావం.

మలయ:

ఉరీకృత మేత దార్యేణ న దుష్ప్రాపం భవిష్యతి. తత్కియన్తం కాల మస్మాభి రేవం సంభృతబలై రపి శత్రువ్యసన ముదీక్షమాణై రుదాసితవ్యమ్?

అర్థం:

ఆర్యేణ+ఏతత్+ఉరీకృతమ్=పూజ్యులు ఈ విషయాన్ని (అధిరాజ పదవీ సంపాదనాన్ని) (బాధ్యతగా) స్వీకరించనే స్వీకరించారు. దుష్ప్రాపం+న+భవిష్యతి=దానిని పొందకపోవడం అనేది ఉండదు (అది పొందబడకపోదు). తత్=అది, సంభృతబలైః+అపి=సైన్యబలాన్ని సమకూర్చుని ఉన్నప్పటికీ, అస్మాభిః=మాచేత (మాకు), ఏవం+కియన్తం+కాలం=ఇలాగ ఎంతకాలం, శత్రు+వ్యసనం+ఉదీక్షమాణైః=శత్రువులకు విపత్తు సంభవించాలని ఆశిస్తూ, ఎదురుచూస్తూ, ఉదాసితవ్యమ్=పట్టించుకోకుండా ఉండాలంటారు?

రాక్షసః: 

కుతో ఽద్యాపి కాలహరణ స్యావకాశః? ప్రతిష్ఠస్వ విజయాయ।

అర్థం:

అద్య+అపి+కాలహరణస్య+అవకాశః+కుతః=ఇంక ఇప్పటికీ కాలం వ్యర్థం చేయడం ఎందుకు? విజయాయ+ప్రతిష్ఠస్వ=విజయం కోసం బయలుదేరు.

మలయ:

ఆర్య, శత్రువ్యసన ముపలబ్ధమ్?

అర్థం:

ఆర్య=అయ్యా, శత్రు+వ్యసనం=శత్రువు బలహీనత, ఉపలబ్ధమ్=దొరికిందా?

రాక్షసః: 

ఉపలబ్ధమ్.

అర్థం:

ఉపలబ్ధమ్ =దొరికింది.

మలయ:

కీదృశమ్ తత్?

అర్థం:

తత్=అది, కీదృశమ్=ఎటువంటిది?

రాక్షసః: 

సచివవ్యసనమ్; కి మన్యత్? అపకృష్టశ్చాణక్యా చ్చన్ద్రగుప్తః.

అర్థం:

కిమ్+అన్యత్=మరేం ఉంటుంది?, సచివ+వ్యసనమ్=మంత్రికి సంబంధించిన బలహీనత,  చాణక్యాత్+చన్ద్రగుప్తః+అపకృష్టః=చంద్రగుప్తుడు చాణక్యుని నుంచి దూరం చేయబడ్డాడు (వారిద్దరి మధ్య ఎడం కల్పించాం).

మలయ:

ఆర్య, సచివ వ్యసన మేవ?

అర్థం:

ఆర్య=అయ్యా, సచివ+వ్యసనం+ఏవ=మంత్రితో విభేదం (బలహీనత) ఒక్కటేనా?

రాక్షసః: 

అన్యేషాం భూపతీనాం కదాచి దమాత్యవ్యసన మవ్యసనం స్యాత్। న పున శ్చన్ద్రగుప్తస్య।

అర్థం:

అన్యేషాం+భూపతీనాం=ఇతర రాజుల విషయంలో ఐతే, కదాచిత్=ఎప్పుడైనా, అమాత్య+వ్యసనం=మంత్రి లేకపోయిన బలహీనత, అవ్యసనం+స్యాత్=బలహీనత కాకపోవచ్చు, న+పునః+చన్ద్రగుప్తస్య=చంద్రగుప్తుడి విషయంలో ఐతే అలాగ కాదు.

వ్యాఖ్య:

ఇతర రాజులెవరికైనా, మంత్రితో చెడితే ఇబ్బంది లేకపోవచ్చు గాని, చంద్రగుప్తుడి విషయంలో అలాగ కాదు. అతడికి చాణక్యుడు లేకపోతే పొద్దు గడవదు. అతడు యీ మంత్రిపై అంతగా ఆధారపడ్డాడు. ఆ ఆధారం ఇప్పుడు భగ్నమైందని రాక్షసమంత్రి అభిప్రాయం.

మలయ:

ఆర్య, నైతదేవమ్। చన్ద్రగుప్త ప్రకృతినాం చాణక్యదోషా ఏ వాపరాగ హేతవ, స్తస్మింశ్చ నిరాకృతే ప్రథమ మపి చన్ద్రగుప్తానురక్తాః సంప్రతి సుతరా మేవ తత్రానురాగం దర్శయిష్యన్తి

అర్థం:

ఆర్య=అయ్యా, న+ఏతత్+ఏవమ్=అది అలాగ అనడం కుదరదు. చన్ద్రగుప్త+ప్రకృతినాం=చంద్రగుప్తుడి రాజ్య ప్రజలకు, చాణక్య+దోషాః+ఏవ=చాణక్యుడు చేసిన తప్పులే, అపరాగ+హేతవః=వ్యతిరేకతకు కారణాలు. తస్మిన్+చ+నిరాకృతే=అతడిని తిరస్కరించడం వల్ల, ప్రథమం+అపి=తొలి నుంచి కూడా, చన్ద్రగుప్త+అనురక్తాః=చంద్రగుప్తుని పట్ల అభిమానం గల ప్రజలు, సంప్రతి=ఇప్పుడు, సుతరాం+ఏవ=ఎక్కువగానే, తత్ర+అనురాగం+దర్శయిష్యన్తి=ఆ విషయమై తమ ఇష్టాన్ని ప్రదర్శించగలరు.

రాక్షసః: 

మా మైవమ్, తాః ఖలు ద్విప్రకారాః ప్రకృతయః। చన్ద్రగుప్త సహోత్థాయిన్యో. నన్దానురక్తాశ్చ। తత్ర చన్ద్రగుప్త సహోత్థాయినీనాం చాణక్య దోషా ఏవ విరాగ హేతవో, న నన్దకులానుగతానామ్, తాస్తు ఖలు నన్దకుల మనేన పితృభూతం ఘాతిత మి త్యపరాగామర్షాభ్యాం విప్రకృతాః సత్యః, స్వాశ్రయ మలభమానా శ్చన్ద్రగుప్త మే వానువర్తన్తే. త్వాదృశం పునః ప్రతిపక్షోద్ధరణే సమ్భావ్యశక్తి మభియోక్తార మాసాద్య క్షిప్ర మేనం పరిత్యజ్య త్వా మే వాశ్రయిష్యన్తి, ఇత్యత్ర నిదర్శనం వయ మేవ॥

అర్థం:

మా+మా+ఏవమ్=అలాగ కాదు కాదు, తాః+ప్రకృతయః=ఆ ప్రజలు, ద్వి+ప్రకారాః+ఖలు=రెండు విధాలుగా ఉన్నారు కదా! (వారు), చన్ద్రగుప్త+సహ+ఉత్థాయిన్యః=చంద్రగుప్తుడితో కలిసి వచ్చేవారు (ఒకరైతే),  నన్ద+అనురక్తః+చ=నందవంశాన్ని అభిమానించేవారు (మరికొందరు) కూడా ఉంటారు. తత్ర=అక్కడ, చన్ద్రగుప్త+సహ+ఉత్థాయినీనాం=చంద్రగుప్తుడి పక్షాన నిలబడేవారిలో, చాణక్య+దోషాః+ఏవ=చాణక్యుడు చేసిన తప్పులే, విరాగ+హేతవో=వ్యతిరేక కారణాలు, నన్దకుల+అనుగతానామ్+తా+తు+ఖలు=నందవంశాభిమానులలో అయితే, అనేన=ఇతడిచే (చంద్రగుప్తునిచే), పితృభూతం=తండ్రితో సమానమైన (తండ్రి మాత్రమే అయిన) నందరాజు, ఘాతితః+ఇతి=చంపబడ్డాడని, అపరాగా+అమర్షాభ్యాం=వ్యతిరేకత, ద్వేషభావనల వల్ల, విప్రకృతాః+సత్యః=బెడిసిపోయిన వారవుతూ, స్వ+ఆశ్రయం+అలభమానాః=తమకు ఆసరా దొరకనందువల్లనే, చన్ద్రగుప్తం+ఏవ+అనువర్తన్తే=చంద్రగుప్తుడినే ఆశ్రయించుకుని ఉంటున్నారు. త్వాదృశం+పునః=నీ బోటివారిని (అంటే), ప్రతిపక్ష+ఉద్ధరణే=వ్యతిరేకులను సమకూర్చడంలో, సమ్భావ్యశక్తిం+అభియోక్తారం=పరిగణింపదగిన బలంతో దండెత్తగల వాడిని, ఆసాద్య=పొంది, క్షిప్రం=తక్షణమే, ఏనం+పరిత్యజ్య=వాడిని విడిచిపెట్టి, త్వాం+ఏవ+ఆశ్రయిష్యన్తి=నిన్నే ఆశ్రయించగలరు. ఇతి+అత్ర+వయం+ఏవ+నిదర్శనం=ఇందుకు మేమే (నేనే) తగిన నిదర్శనం (సాక్ష్యం). (నేనే నిన్ను నమ్ముకుని వచ్చాను కదా!).

మలయ:

ఆర్య, కి మేత దేక మేవ సచివవ్యసన మభియోగకారణం చన్ద్రగుప్త, స్యాహోస్వి దన్యమ ప్యస్తి?

అర్థం:

ఆర్య=అయ్యా, చన్ద్రగుప్తస్య=చంద్రగుప్తుడికి, ఏతత్+ఏకం+ఏవ=ఇది ఒక్కటే, సచివ+వ్యసనం=మంత్రి పట్ల ద్వేషానికి, అభియోగ+కారణం=నేరం మోపడానికి కారణమా, కిమ్=ఏమి? ఆహోస్విత్=లేదంటే, అన్యం+అపి=మరేదైనా, అస్తి=ఉన్నదంటారా?

రాక్షసః: 

కి మన్యై ర్హేతుభి రపి? ఏ తద్ధి ప్రధానతమమ్.

అర్థం:

అన్యైః+తేతుభిః+అపి+కిమ్=ఇతర కారణాల్తో ఇంకా పనేమి ఉంటుంది? ఏతత్+హి=ఇదే, ప్రధానతమమ్=అత్యంత ముఖ్యమైనది.

మలయ:

ఆర్య, కథ మివ ప్రధానతమమ్? కిమదానీం చన్ద్రగుప్తః స్వకార్యధురా మన్యత్ర మన్త్రిణి, ఆత్మని వా సమాసజ్య స్వయం ప్రతివిధాతు మసమర్థః?

అర్థం:

ఆర్య=అయ్యా, కథం+ఇవ+ప్రధానతమమ్=అత్యంత ముఖ్యమైనదెలాగైనది? ఇదానీం=ఇప్పుడు, చన్ద్రగుప్తః=చంద్రగుప్తుడు, స్వ+కార్య+ధురాం=తన పని భారాన్ని, అన్యత్ర+మన్త్రిణి=మరొక మంత్రి యందు, వా=కాని, ఆత్మని+వా=తనయందు గాని, సమాసజ్య=నిలిపి, స్వయం+ప్రతివిధాతుం=సొంతంగా నెరవేర్చడానికి, అసమర్థః+కిమ్=శక్తి చాలనివాడా ఏమి?

రాక్షసః: 

బాఢ మసమర్థః. కుతః, స్వాయత్తసిద్ధిషు ఉభయాయత్తసిద్ధిషు వా భూమిపాలేషు త త్సంభవతి, చన్ద్రగుప్తస్తు దురాత్మా నిత్యం సచివాయత్తసిద్ధా వేవ స్థిత, శ్చక్షుర్వికల ఇవా ప్రత్యక్ష లోక వ్యవహారః కథ మివ స్వయం ప్రతివిధాతుం సమర్థః స్యాత్?

అర్థం:

బాఢం+అసమర్థః=తప్పక అసమర్థుడే. కుతః=ఎందుకంటావా, స్వ+ఆయత్త+సిద్ధిషు=రాజ్యపాలనా సామర్థ్యం సొంతంగా గలవారియందు గాని, ఉభయ+ఆయత్త+సిద్ధిషు+వా=పాలకుడికీ మంత్రికీ కూడా రాజ్యపాలన సామర్థ్యం సమంగా ఉన్నవారి యందు గాని, భూమి+పాలేషు=రాజుల యందు, తత్+సంభవతి= (రాజ్యపాలన సొంతంగా నిర్వహించే సామర్థ్యం) నెరవేరుతుంది. దురాత్మా+చన్ద్రగుప్తః+తు=దుర్మార్గుడైన చంద్రగుప్తుడైతే, నిత్యం+సచివ+ఆయత్త+సిద్ధౌ+ఏవ=మంత్రి చేతిలో సామర్థ్యం నిలిపినవాడై, స్థిత=ఉన్నాడు, చక్షుః+వికలః+ఇవ=కళ్ళు లేని వాడి మాదిరి, అప్రత్యక్ష+లోక+వ్యవహారః=లోక వ్యవహారాలను స్వయంగా చూడలేని వాడు మాదిరి, స్వయం+ప్రతివిధాతుం=స్వయంగా నెరవేర్చడానికి, కథం+ఇవ+సమర్థః+స్యాత్=ఏ విధంగా సమర్థుడు కాగలడు?

శ్లోకం:

అత్యుచ్ఛ్రితే మన్త్రిణి పార్థివే చ

విష్టభ్య పాదా వుపతిష్ఠ తే శ్రీః;

సా స్త్రీస్వభావా దసహా భరస్య

తయో ర్ద్వయో రేక తరం జహాతి- (13)

అర్థం:

శ్రీః=లక్ష్మిదేవి, అతి+ఉచ్ఛ్రిత్=మిక్కిలిగా ఉన్నతిలో ఉన్న, మన్త్రిణి+పార్థివే+చ=రాజు మంత్రి – ఇరువురిలో కూడా, పాదౌ+విష్టభ్య=తన పాదాలను గట్టిగా మోపి, ఉపతిష్ఠతే=నిలిచి ఉంటుంది; సా+శ్రీః=ఆ లక్ష్మీదేవి, స్త్రీ+స్వభావాత్=చంచలత్వం కారణంగా, భరస్య+అసహా=బరువు మోయలేనిదై, తయోః+ద్వయోః=వారిద్దరిలో, ఏకతరం=ఒకే ఒకడిని (ఏ ఒక్కరినో), జహాతి=విడిచిపెట్టేస్తుంది.

(అందువల్ల ఉభయాయత్త స్థితి గల రాజ్యానికి నిలకడ ఎక్కువ అని రాక్షసమంత్రి అభిప్రాయం).

వృత్తం:

ఉపజాతి. – ఒక పాదం ఇంద్రవజ్ర గాను,  మరొక పాదం ఉపేంద్రవజ్ర గాను కలిసి ఉంటే ఉపజాతి అవుతుంది.

(ఇంద్రవజ్ర – త త – జ – గ గ; ఉపేంద్రవజ్ర – జ – త – జ – గ గ).

అలంకారం:

సమాసోక్తి. (సమాసోక్తిః పరిస్ఫూర్తిః ప్రస్తుతేఽప్రస్తుతస్య చేత్ – అని కువలయానందం).

(‘విశేషణానాం తౌల్యేన యత్ర ప్రస్తుతవర్తినామ్, అప్రస్తుతస్య గమ్యత్వం సా సమాసోక్తి రితీషతే’ – ప్రతాపరుద్రీయం).

ఇక్కడ ప్రస్తుత చాణక్య – చంద్రగుప్త సచివాయత్త స్థితి ప్రమాదానికి, హేతువులు అప్రస్తుతాంశాలతో సూచించడం కారణం.

శ్లోకం:

నృపో ఽపకృష్టః సచివాత్తదర్పణః

స్తనంధయో ఽత్యన్తశిశుః స్తనా దివ

అదృష్ట లోక వ్యవహార మన్దధీ

ర్ముహూర్త మప్యుత్సహతేన వర్తితుమ్ – (14)

అర్థం:

నృపః=రాజు, తత్+అర్పణః=తన సహితంగా రాజ్యాన్ని మంత్రిపరం చేసినవాడై, సచివాత్=మంత్రి నుంచి, స్తనం+ధయః=పాలు త్రాగే (తల్లి చనుబాలు విడవని), అత్యన్త+శిశుః=పసిగ్రుడ్డు, స్తనాత్+ఇవ=చంటి నుంచి, అపకృష్టః=తొలగింపబడినవాడై, అదృష్ట+లోక+వ్యవహార+మన్దధీః=లోక వ్యవహారాల సరళి ఎరుకబడని, మందబుద్ధితో; ముహూర్తం+అపి=క్షణం కూడా, వర్తితుమ్=నడుచుకోడానికి, న+ఉత్సహతే=ఉత్సుకత చూపడు.

వ్యాఖ్య:

సచివాయత్త బుద్ధి గల రాజు, చంటిబిడ్డలాగున స్వతంత్ర్య ప్రవృత్తి కోల్పోయి, స్వతంత్ర్యంగా వ్యవహరించడాని కిచ్చగించడని భావం. ప్రస్తుతం చంద్రగుప్తుని స్థితి అట్టిదని రాక్షసమంత్రి తీర్మానం.

వృత్తం:

వంశస్థ వృత్తం – జ – త – జ – ర – గణాలు.

అలంకారం:

‘అత్యన్త శిశుః స్తనాత్ ఇవ’ అని సచివాయత్త పాలకుడికి పోలిక చెప్పడం వల్ల ఉపమాలంకారం (ఉపమాయత్ర సాదృశ్య లక్ష్మీరుల్లసతి ద్వయోః అని కువలయానందం).

మలయ:

(ఆత్మగతమ్) దిష్ట్యా న సచివాయత్త తన్త్రో ఽస్మి. (ప్రకాశమ్) య ద్య ప్యేవం తథాపి బహు ష్వభియోగ కారణేషు సత్సు, వ్యసన మభియుఞ్జానస్య శత్రు మభియోక్తు రైకాన్తికీ మేవ కార్యసిద్ధి ర్భవతి.

అర్థం:

(ఆత్మగతమ్=తనలో) దిష్ట్యా=అదృష్టవశాత్తు, సచివ+ఆయత్త+తన్త్రః+న+అస్మి=మంత్రి పరం చేసిన రాజ్యతంత్రం కలవాడిని కాను. (ప్రకాశమ్=పైకి), ఏవం+యది+అపి=ఈ విధంగా కూడా, తథా+అపి=ఆ విధంగా కూడా, బహుషు+అభియోగ+కారణేషు=అనేకంగా ఉన్న నేరారోపణ కారణాలతో, సత్సు=ఉండగా, వ్యసనం=లోపాన్ని, అభియుఞ్జానస్య=కనుగొనే ప్రయత్నం చేసే, శత్రుం+అభియోక్తు=వైరిని ఎదిరించే వ్యక్తిని, కార్యసిద్ధి=పని నెరవేరడం, ఐకాన్తికీం+ఏవ+భవతి=నిశ్చయంగా నెరవేరుతుంది (ఖచ్చితంగా సిద్ధిస్తుంది).

రాక్షసః:

ఐకాన్తికీ మేవ కార్యసిద్ధి మవగన్తు మర్హతి కుమారః. కుతః…

అర్థం:

ఐకాన్తికీం+కార్యసిద్ధి+ఏవ=నిశ్చితంగా పని జరిపించుకోడం అనేదాన్నే, కుమారః=రాకుమారుడు (తమరు), అవగన్తుం+అర్హతి=అవబోధ చేసుకోదగిన వ్యక్తి. కుతః=ఎందుకంటే…

శ్లోకం:

త్వ య్యుత్కృష్టబలేఽభియోక్తరి నృపే,

నన్దానురక్తే పురే,

చాణక్యే చలితాధికార విముఖే

మౌర్యే నవే రాజని, స్వాధీనే మయి… (ఇత్యర్థోక్తే లజ్జాం నాటయన్)

మార్గమాత్ర కథన

వ్యాపార యోగోద్యమే

త్వద్వాఞ్ఛాన్తరితాని సమ్పృతివిభో తిష్ఠన్తి సాధ్యాని నః  – (15)

అర్థం:

ఉత్కృష్టబలే+త్వయి+అభియోక్తరి+నృపే=గొప్ప బలవంతమైన రాజువైన నువ్వు, దండెత్తే వ్యక్తివి కాగా – పురే =పాటలీపుత్రం, నన్ద+అనురక్తే=నందుని పట్ల ప్రేమ కలది కాగా – చలిత+అధికార+విముఖే+చాణక్యే=చాణక్యుడు తొలగిపోయి తన అధికారం పట్ల పెడముఖం గలవాడు కాగా – మౌర్యే+నవే+రాజని=మౌర్య చంద్రగుప్తుడు, ఇంకా గట్టిగా పాదుకొనని రాజు కాగా – (త్వయి)+స్వాధీనే+మయి=నీకు నేను వశుడనై ఉండగా – (ఇతి=అని, అర్థోక్తే=సగం మాటలో, లజ్జాం+నాటయన్=సిగ్గు ప్రదర్శిస్తూ), మార్గమాత్ర+కథన+వ్యాపార+యోగ+ఉద్యమే=కేవలం దారి చూపించడం అనే పనిలో పూని ఉండగా, – విభో= ఓ ప్రభువా! సంప్రతి=ఇప్పుడు, నః+సాధ్యాని=మన ప్రయత్నాలన్నీ, త్వత్+వాఞ్ఛా+అన్తరితాని=నీ కోరిక చాటున చేరినవిగా, తిష్ఠన్తి=ఉన్నాయి.

వృత్తం:

శార్దూల విక్రీడితం. మ-స-జ-స-త-త-గ గణాలు.

అలంకారం:

‘నీ కోరిక చాటుగా మన ప్రయత్నాలన్నీ చేరి ఉన్నాయి’ అంటూ అందుకు కారణాల్ని వరుసగా గుదిగ్రుచ్చడం వల్ల కారణమాలాలంకారం. ఆ కారణాలివి:

  1. మలయకేతువు మౌర్యుడిపై దండెత్తగల గొప్ప రాజు.
  2. పాటలీపుత్ర ప్రజలు నందరాజు అభిమానులు.
  3. చాణక్యుడు మంత్రిపదవి పట్ల విముఖంగా ఉన్నాడు.
  4. రాక్షసుడంతటి వాడు మలయకేతువుకు మార్గనిర్దేశం చేస్తున్నాడు, (ఇక లోటేముంది?).

(గుమ్భః కారణ మాలాస్యాత్ యథా ప్రాక్‌ప్రాన్త కారణైః – అని కువలయానందం).

మలయ:

య ద్యేవ మభియోగకాల మార్యః పశ్యతి, తతః కిం ఆస్యతే?

అర్థం:

ఆర్య=అయ్యవారు, ఏవం+అభియోగకాలం=ఈ తీరైన దండయాత్రకు తగిన సమయాన్ని, యది+పశ్యతి=గమనించడం జరిగితే, తతః+కిమ్+ఆస్యతే=మరి ఎందువల్ల (కిమ్మనకుండా) కూర్చున్నారు?

శ్లోకం:

ఉత్తుఞ్గా స్తుఙ్గకూలం స్రుతమదసలిలాః

ప్రస్యన్దిసలిలం

శ్యామాః శ్యామోపకణ్ఠద్రుమ మతిముఖరాః

కల్లోలముఖరమ్

స్రోతః ఖాతా వసీదత్తట మురు రశనై

రుత్సాదిత తటాః

శోణం సిన్దూరశోణా మమ గజపతయః

పాస్యన్తు శతశః – (16)

అర్థం:

మమ+గజపతయః=నా శ్రేష్ఠమైన గజరాజులు, ఉత్తుఞ్గాః=చాలా ఎత్తైనవి, స్రుత+మద+సలిలాః= కారుతుండే మద ధారలు కలవి; శ్యామాః=నల్లనివి; అతిముఖరాః=గొప్ప ఘీంకారాలు చేయగలవి; ఉరు+రశనై=బలమైన, ఘనమైన దంతాలు కలవి; ఉత్సాదిత+తటాః=(వాటితో) గట్లను కుళ్ళ పొడవగలిగినవి, సిన్దూర+శోణాం=సిందూరపు పూతతో జేగురు రంగు గలవి; – (అట్టి గొప్ప ఏనుగులు), తుఙ్గ+కూలం=ఎత్తైన ఒడ్లతో, ప్రస్యన్ది+సలిలం=బాగా ప్రవహించే నీటితో, ఉపకంఠ+శ్యామద్రుమం=దగ్గరలో ముదురాకు పచ్చ చెట్లతో వుండి, కల్లోల+ముఖరమ్=అలల చప్పుడుతో, స్రోతః+ఖాత+అవసీదత్+తటం=ప్రవాహాలతో కోసివేయడం వల్ల క్రుంగిపోయే ఒడ్లతో గల, శోణం=శోణ అనే పేరు గల నది (జలాన్ని), శతశః=నూరు విధాల, పాస్యన్తు=త్రాగాలి గాక!

వ్యాఖ్య:

‘మమ గజపతయః శోణ శతశః పాస్యన్తు’ అనేదిక్కడ ప్రధాన వాక్యం. ఆ ‘గజరాజులు’ ఎంతటివో, శోణానది ఎంతటిదో వర్ణించడం ఈ శ్లోకంలో విశేషం. దీని ద్వారా మలయకేతువుకి తన గజసైన్యం బలంపై ఎంతటి ధీమా ఉన్నదో కవి సూచిస్తున్నాడు.

వృత్తం:

సువదనా వృత్తం. మ – ర – భ – న – య – భ – ల గ – గణాలు.

అలంకారం:

వ్యతిరేకాలంకారం. (భేద ప్రధాన సాధర్మ్య ముపమానోపమేయయోః, ఆధిక్యాల్పత్వకథనాద్ వ్యతిరేక స ఉచ్యతే – అని ప్రతాపరుద్రీయం).

ఉపమానం కంటే ఉపమేయానికి ఆధిక్యం గాని, న్యూనత్వం గాని ఆపాదించడం చేత భేద ప్రధానమైన సమాన ధర్మం కనిపించడం కారణం.

ఇక్కడ శోణ నదం సామాన్యమైనది కాదు; ఎత్తైన గట్లతో, గొప్ప ఉరవడితో, చాలా దృఢమైనది. ఆ నీటి వేగం గట్లని కూల్చివేసేటంత గొప్పది అయినా – మలయకేతువు ఏనుగులు ఆ నదీ జలాన్ని చిమ్మిపారేస్తూ దాటిపోగలవి. ఇక్కడ నదికి న్యూనత, గజరాజులకు ఆధిక్యత గమనించదగినది –

శోణ నదం గంగానదికి ఉపనదం.

పాటలీపుత్రానికి కాస్తంత పడమరగా గంగ కలుస్తుంది. అది వింధ్య పర్వతంలో పుట్టి ఉత్తరంగా ప్రవహిస్తుంది.

అపి చ,

అపి+చ=అంతేకాదు;

శ్లోకం:

గమ్భీర గర్జితరవాః స్వమదామ్బు మిశ్ర

మాసారవర్ష మివ శీకర ముద్గిరన్త్యః

విన్ధ్యం వికీర్ణ సలిలా, ఇవ మేఘమాలా

రున్ధస్తు వారణఘటా నగరం మదీయాః – (17)

అర్థం:

గమ్భీర+గర్జిత+రవాః=మంద్రధ్వనితో గర్జించే స్వభావం కలవీ (బృంహితాలు కలవీ); స్వ+మద+అమ్బుమిశ్రం+శీకరం=తమ మదజలంతో కలిసిన (తొండాల కొనల) జడిని పోలిన, ఆసారవర్షం+ఇవ=వానజడి మాదిరి, ఉద్గిరన్త్యః=(నీటిని) చిమ్ముతున్నవీ; (అయిన) మదీయాః+వారణఘటాః=నాకు చెందిన ఏనుగుల గుంపులు – విన్ధ్యం=వింధ్య పర్వతాన్ని, వికీర్ణ సలిలా+మేఘమాలాః+ఇవ=నీరు వెదజల్లి తడిపే మేఘాల గుంపుల మాదిరి, నగరం=పాటలీపుత్రాన్ని, రున్ధన్తు=నిలువరించుగాక!

వృత్తం:

వసంత తిలకం – త- భ – జ – జ – గ గ – గణాలు.

అలంకారం:

‘మదీయాః వారణఘటాః, వింధ్యం వికీర్ణ సలిలా ఇవ, నగరం రున్ధన్తు’ అనేది వాక్యం. ఉపమాలంకారం (ఉపమాయత్ర సాదృశ్య లక్ష్మీరుల్లసతి ద్వయోః అని కువలయానందం).

(ఇతి భాగురాయణేన సహ నిష్క్రాన్తో మలయకేతుః) 

[ఇతి=అని, (పాటలీపుత్రంపై దండయాత్రకి ఆజ్ఞాపించి), భాగురాయణేన+సహ=భాగురాయణుడితో కలిసి, మలయకేతుః+నిష్క్రాన్తో=మలయకేతుడు వెళ్ళిపోయాడు]

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here