ముద్రారాక్షసమ్ – ద్వితీయాఙ్కః – 1

0
7

[box type=’note’ fontsize=’16’] ‘ముద్రారాక్షసం‘ ఏడంకాల రాజకీయ నాటకం. విశాఖదత్తుడు యీ నాటకాన్ని చతుర రాజకీయ వ్యూహాల అల్లికతో, అద్భుతంగా రూపొందించాడు. సంస్కృత సాహిత్యం మొత్తంలో అరుదైన ఈ నాటకాన్ని ఇంద్రగంటి శ్రీకాంతశర్మ గారు అనువదించి, వ్యాఖ్యతో అందిస్తున్నారు. [/box]

(తతః ప్రవిశ త్యాహితుండికః)

ఆహితుండికః

శ్లోకం:

జాణన్తి తన్తజుత్తిం జహట్ఠియం మణ్డలం అహిలిహన్తి

జే మన్తరక్ఖణపరా తే సప్పణ రాహివే ఉపఅరన్తి –1

(జానన్తి తన్త్రయుక్తిం యథాస్థితం మణ్డల మభిలిఖన్తి

యే మన్త్ర రక్షణపరా స్తే సర్పనరాధిపా వుపచరన్తి॥)

అర్థం:

(తతః= ఆ తరువాత, ఆహితుండికః=పాముల్ని ఆడించేవాడు, ప్రవిశతి=వచ్చాడు)

యే+మంత్రరక్షణపరాః=పాముల మంత్రాలను కాపాడుకోవడం ఎరిగిన (మంత్రం=రాజకీయ పరిజ్ఞానం), తంత్రయుక్తి=విషానికి విరుగుడు మందు తెలిసిన (తంత్రం=రాజకీయం నడపడంలో యుక్తులు) (అంటే – పాములు+రాజ్యపాలన గురించి), జానన్తి=(ఎవరు) ఎరుగుదురో (యే+జానన్తి), యథాస్థితిం=యథార్థ పరిస్థితి నుంచి (యథాస్థితి=అప్పటికి ఉన్న చోటు+ఉన్న రాజకీయ పరిస్థితి) చేయిదాటిపోనీయకుండా, మన్డలమ్=గుండ్రని గీటును (మన్డలమ్=రాజ్యభాగం), అభిలిఖన్తి=(ఎవరు) రాస్తారో, తే=వారు, సర్ప+నరాధిపౌ=పామునీ, పాలకుడినీ, ఉపచరన్తి=సేవిస్తూంటారు.

వ్యాఖ్య:

పాములాడించే మనిషి ఒక సూత్రాన్ని చెపుతున్నాడు. రాజసేవ పాముతో చెలగాటం వంటిదని సూచన. అందుకు రెండర్థాలు సాధించే పదాలతో మాట్లాడుతున్నాడు. పామును గీటు దాటకుండా కట్టుకట్టి (మంత్రప్రయోగంతో) నిలపాలంటే ఆ పాము మంత్రాల రహస్యం కాపాడుకోవాలి. రాజును (పాలకుడిని) సేవించాలంటే రాజరికపు రహస్యపుటెత్తుల్ని కాపాడుకోవాలి. పాము విషానికి విరుగుడు తెలిసి ఉండాలి. పాలకుడి విషయంలో ఎత్తు పై ఎత్తులు తెలిసి ఉండాలి. పాము విషయంలో గుండ్రని గీటును, పాలకుడి విషయంలో ఉన్న స్థితి చెడిపోకుండా రాజ్యభాగాన్ని కట్టుదిట్టం చేసుకోవడం చేతకావాలి. ఈ కిటుకులు ఎరిగినవారు మాత్రమే పామునైనా, పాలకుడినైనా తమకు ప్రమాదం రాకుండా సేవించగలరని తీర్మానం.

అలంకారం:

ఈ శ్లోకంలో ‘మంత్రరక్షణ పరత్వం’, ‘తన్త్రయుక్తి’, ‘యథాస్థితి’, ‘మన్డలం’ అనే పదాల ద్వారా రెండర్థాలు సాధించడం వల్ల శ్లేషాలంకారం.

(నానార్థ సంశ్రయః శ్లేషో వర్ణ్యా వర్ణ్యోభయాస్పదః – అని కువలయానందం).

వృత్తం:

ఆర్యావృత్తం.

ఆహి:

(ఆకాశే) అజ్జ, కిం తుమం భణాసి, “కోతుమం”త్తి? ‘అజ్జ, అహం ఖు అహితుండిఓ జిణ్డవిసో నామ‘, కిం భణాసి అహం వి అహిణా ఖేలిదుం ఇచ్ఛామిత్తి? అహ కదరం ఉణ అజ్జో విత్తిం ఉపజీవది? కిం భణాసి రాఅఉల సేవకో హ్మిత్తి ణం ఖేలది ఎవ్వ అజ్జో అహిణా కహం విఅ? అమంతో సహి కుసలో వాలగ్గాహీ మత్తమతంగ ఆరోహి లద్ధాహిఆరో జిదకాసి రాఆసేవఓ త్తి ఏ దే తిణ్ణి వి అవస్సం విణాస మణుహోంతి కహం దిట్ఠమెత్తో అదిక్కంతో ఏసో (పున రాకాశే) అజ్జ, కిం తుమం భణసి, కిం ఏ దేషు పేడాలసముగ్గఏసు త్తి? అజ్జ జీవిఆఏ, సంపాదఆ సప్పా కిం భణాసి పేక్ఖిదు మిచ్ఛామిత్తి? పసీదదు అజ్జో అట్ఠాణం ఖు ఏదమ్, తా జఇ కోదూహలం, ఏహి ఏదస్సిం ఆవాసే దంసేమి, కిం భణాసి ఏదం ఖు భట్ఠిడో అమచ్చ రక్ఖసస్స గేహం ణత్తి అహ్మరిసాణం ఇహ పవేసోత్తి?’ తేణ హి గచ్ఛదు అజ్జో మమ ఉణ జీవిఆఏ పసాదేణ అత్థి ఏత్థ పవేసో కధం ఏసో వి అతిక్కఁతో

(ఆర్య, కిం త్వం భణసి క స్త్వంఇతి? ఆర్య అహం ఖలు ఆహితుణ్డికో జీర్ణవిషో నామ కిం భణసి అహ మపి అహినా ఖేలితు మిచ్ఛామీతి?’ అథ కతరాం పున రార్యో వృత్తి ముపజీవతి? కిం భణసి రాజకుల సేవకో ఽస్మీతి నను ఖేలతి ఏవ ఆర్యో ఽహినా కథ మివ? అమన్త్రౌషధికుశలో వ్యాళ గ్రాహీ మత్తమతఙ్గజారోహీ లబ్ధాధికారో జితకాశీ రాజసేవక ఇ త్యే తే త్రయోఽపి అవశ్యం వినాశ మనుభవన్తి కథం! దృష్ట మాత్రోఽతిక్రాన్త ఏషః ఆర్య కిం త్వం భణసి కి మేతేషు పేటక సముద్గతేషుఇతి? ఆర్య, జీవికాయాః సమ్పాదకాః సర్పాః కిం భణసి ప్రేక్షితు మిచ్ఛా మిఇతి? ప్రసీదతు, ఆర్యః అస్థానం ఖలు ఏతత్ త ద్యది కౌతుహలం, ఏహి ఏతస్మిన్నావాసే దర్శయామి కిం భణసి, ఇదం ఖలు భర్తు రమాత్య రాక్షసస్య గృహమ్ నా స్త్యస్మాదృశానా మిహ ప్రవేశఃఇతి? తేన హి గచ్ఛ త్వార్యః, మమ పునః, జీవికాయాః ప్రసాదేన ఆ స్తీహ ప్రవేశః కథం! ఏషోఽపి అతిక్రాన్త

(స్వగతమ్ సంస్కృత మాశ్రిత్య)

అహో! ఆశ్చర్యమ్! చాణక్య మతి పరిగృహీతం చన్ద్రగుప్త మవలోక్య విఫల మివ రాక్షసప్రయత్న మవగచ్ఛామి రాక్షసమతి పరిగృహీతం మలయకేతు మవలోక్య చలితమి వాధిరాజ్యాచ్చన్ద్రగుప్త మవగచ్ఛామి కుతః...

అర్థం:

ఆకాశే=ఆకాశం వైపు చూస్తూ… (ఇది ఆకాశ భాషితం. అంటే తన్ను ఎవరో అడిగే ప్రశ్న కూడా తానే వేసుకుని సమాధానం చెబుతూ సాగించే సంభాషణ. విష్కంభం వంటి అవాంతర లఘుదృశ్యం అవసరం లేకుండా అవసరమైన సమాచారం చెపుతూ వెంట వెంటనే ప్రధాన దృశ్యంలోకి పాత్రను ప్రవేశ పెట్టడం ఉద్దేశం).

ఆర్య=అయ్యా, కిం+త్వం+భణసి=నువ్వేమంటున్నావు? ‘కః+త్వం+ఇతి’=”నువ్వెవరు?- అనా?”, అహం+ఖలు=నేనైతే, జీర్ణవిషః+నామ+ఆహితుణ్డికః=ఆహితుండికుణ్ణి (పాములాడించేవాణ్ణి), నా పేరు జీర్ణవిషుడు. – కిం+భణసి=ఏమంటున్నావు?, ‘అహం+అపి+అహినా+ఖేలితుం+ఇచ్ఛామి+ఇతి?’=”నేను కూడా పాములతో ఆడుకోవాలనుకుంటున్నాను” అనా?, అథ=అలా అయ్యే మాటుంటే, ఆర్యః+కతరాం+వృత్తిం+ఉపజీవతి?= తమరు ఏం ఉద్యోగం చేస్తున్నారు? –

కిం+భణసి=ఏమంటున్నావు?, ‘రాజకుల+సేవకః+అస్మి+ఇతి’?= రాజోద్యోగినంటావా? – ఆర్యః+నను+ఖేలతి+ఏవ+అహినా=(ఇంకేం) తమరు పాముతో ఆడుకుంటున్నారన్నమాటే!-  కథం+ఇవ?=(పాములతో ఆడుకోవడమా) ఎలాగ?, అమన్త్ర+ఔషధి+కుశలః+వ్యాళగ్రాహీ=పాముకాటుకు విరుగుడు మంత్రం ఎరుగని పాములుపట్టేవాడూ; మత్త+మతఙ్గజ+ఆరోహీ=మదపుటేనుగును ఎక్కేవాడూ, జితకాశీ=యుద్ధంలో జయించిన, రాజసేవకః+లబ్ధాధికారః=యుద్ధంలో జయం పొందిన రాజుగారి (నుంచి) పదవిని పొందిన రాజోద్యోగీ, ఇతి+తే+త్రయః= అనే ఆ ముగ్గురూ, అవశ్యం=తప్పక, వినాశం+అనుభవన్తి=నాశం పొందుతూంటారు – కథం+దృష్టమాత్రః+ఏషః+అతిక్రాన్తః=అరరే! చూస్తుండగానే ఇతగాడు (ఇన్ని ప్రశ్నలడిగిన పెద్దమనిషి) దాటిపోయాడు. (వేరొక వ్యక్తిని చూస్తూ) ఆర్యః+త్వం+కిం+భణసి=అయ్యా, నువ్వేమిటి అంటున్నావు?, ‘కిం+ఏతేషు+పేటక+సముద్గతేషు’ ఇతి?=ఈ పెట్టెలో, ఈ బుట్టలో ఏమున్నాయానా? – ఆర్యః+జీవికాయాః+సమ్పాదకాః+సర్పాః=అయ్యా, నాకు జీతం సంపాదించి పెట్టే పాములు (ఉన్నాయి) (బతుకు తెరువు చూపే పాములున్నాయి), కిం+భణసి=ఏమంటున్నావు?, ‘ప్రేక్షితుం+ఇచ్ఛామి’ ఇతి?=చూడాలని ఉందనా? – ప్రసీదతు+ఆర్యః=తమరు మన్నించాలి. ఏతత్+అస్థానం+ఖలు=ఇక్కడ చూపించడానికి తగిన చోటు కాదు కదా. తత్+యది+కౌతుహలం=అందువల్ల నీకు చూడాలని కోరిక ఉంటే, ఏతస్మిన్+ఆవాసే=ఇదిగో ఈ ఇంట్లో, దర్శయామి=చూపిస్తాను, ఏహి=(ఇటు)రా – కిం+భణసి=ఏమంటున్నావు, ఇదం+ఖలు+అమాత్యరాక్షసస్య+గృహమ్= (ఇదా) ఇది రాక్షసమంత్రిగారి ఇల్లాయె!!. అస్మాదృశానాం=మావంటి వారికి, ఇహ+ప్రవేశః+న+అస్త+ఇతి=ఇక్కడ ప్రవేశం లేదంటావా? – తేన+హి+ఆర్యః+గచ్ఛతు= అయితే తమరు (ఇక్కడ నుంచి) దయ చేయవచ్చు. మమపునః=నాకైతే, జీవికాయాః+ప్రసాదేన=బతుకుతెరువు అనుగ్రహించడం బట్టి, ఇహ+ప్రవేశః+అస్తి=ఈ యింట్లోకి ప్రవేశం ఉంది. కథమ్+ఏషః+అపి+అతిక్రాన్త=అరే, ఇతగాడూ దాటిపోయాడు.

వ్యాఖ్య:

ఇక్కడ నడిచిన సంభాషణ ద్వారా, నాటకం రెండో అంకం ప్రారంభమవుతున్న స్థల నిర్దేశం కవి చేస్తున్నాడు. వీధిలో ఎదురైన ఇద్దరు వ్యక్తుల పలకరింత నెపంగా – ఆహితుండికుడు రాక్షసమంత్రి (ప్రవాసంలో) ఉంటున్న ఇంటి ఎదుట ఉన్నాడని నిర్ధారణ – అతడు ఆ మంత్రి వల్ల బతుకుతెరువు సంపాదించుకున్నవాడని కూడా నిర్ధారణ – ఇకపై అసలు కథ మొదలవుతుంది.

అర్థం:

(స్వగతమ్=తనలో, సంస్కృతం+ఆశ్రిత్య=సంస్కృత భాషలో మాట్లాడడానికి మారి)

అహో+ఆశ్చర్యం=ఆహా! వింతగా ఉంది, చాణక్య+మతి+గృహీతం=చాణక్యుడి బుద్ధికౌశలంతో స్వాధీనపరుచుకోబడిన, చన్ద్రగుప్తం=చంద్రగుప్తుణ్ణి, అవలోక్య=చూసి, రాక్షస+ప్రయత్నం=రాక్షసమంత్రి ప్రయత్నం, విఫలం+ఇవ=బెడిసికొట్టినట్టుగా, అవగచ్ఛామి=ఊహించగలుగుతున్నాను, రాక్షసమతిగృహీతం=రాక్షసమంత్రి బుద్ధికౌశలంతో వశమైన, మలయకేతుం+అవలోక్య=మలయకేతువుని చూసి, అధిరాజ్యాత్=వశమైన రాజ్యం నుంచి, చన్ద్రగుప్తం=చంద్రగుప్తుని, చలితం+ఇవ=చెదిరిపోయినవాడిగా, అవగచ్ఛామి=ఊహిస్తున్నాను. కుత=ఎందుకంటే:

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here