ముద్రారాక్షసమ్ – ద్వితీయాఙ్కః – 4

0
5

[box type=’note’ fontsize=’16’] ‘ముద్రారాక్షసం‘ ఏడంకాల రాజకీయ నాటకం. విశాఖదత్తుడు యీ నాటకాన్ని చతుర రాజకీయ వ్యూహాల అల్లికతో, అద్భుతంగా రూపొందించాడు. సంస్కృత సాహిత్యం మొత్తంలో అరుదైన ఈ నాటకాన్ని ఇంద్రగంటి శ్రీకాంతశర్మ గారు అనువదించి, వ్యాఖ్యతో అందిస్తున్నారు. [/box]

కఞ్చుకీ:

(పరిక్రమ్య ఉపసృత్య చ) ఇద మమాత్య రాక్షసస్య గృహమ్. – ప్రవిశామి. (ప్రవి శ్యావలోక్య చ) స్వస్తి భవతే.

అర్థం:

(పరిక్రమ్య=ముందుకు నడిచి, ఉపసృత్య+చ=సమీపానికి కూడా వచ్చి) ఇదం+అమాత్య రాక్షసస్య+గృహమ్=ఇది రాక్షసమంత్రి ఇల్లు. – ప్రవిశామి=లోపలకు వెడతాను. (ప్రవిశ్య+అవలోక్య+చ=ప్రవేశించి చూసి)

స్వస్తి+భవతే=మీకు శుభమగుగాక!

రాక్షస: 

ఆర్య, అభివాదయే. ప్రియంవదక, ఆసన మానీయతామ్.

అర్థం:

ఆర్య+అభివాదయే=అయ్యా, నమస్కారం (చేస్తున్నాను). ప్రియంవదక+ఆసనం+అనీయతామ్=కూర్చోవడానికి పీఠం తీసుకురా (రాబడు గాక).

పురుషః:    

ఏదం ఆసణం, ఉపవిశదు అజ్జో (ఇద మాసనం, ఉపవిశతు ఆర్యః).

అర్థం:

ఇదం=ఇదిగో, ఆసనం=పీఠం, ఆర్యః+ఉపవిశతు=అయ్యగారు కూర్చోవచ్చును.

కఞ్చుకీ:

(ఉపవిశ్య) కుమారో మలయకేతు రమాత్యం విజ్ఞాపయతి. చిరాత్ ప్రభృతి ఆర్యః పరిత్యక్తో చితసంస్కార ఇతి పీడ్యతే మే హృదయమ్. యద్యపి సహసా స్వామిగుణాః నశక్యన్తే విస్మర్తుం, తథాపి మద్విజ్ఞాపనాం మానయితు మర్హ త్యార్యః‘ (ఇత్యాభరణాని ప్రదర్శ్య) ఇమా న్యాభరణాని కుమారేణ స్వశరీరా దవతార్య ప్రేషితాని, ధారయితు మర్హ త్యమాత్యః.

అర్థం:

(ఉపవిశ్య=కూర్చుని) కుమారః+మలయకేతుః=(పర్వతక పుత్రుడు) మలయకేతుడు, అమాత్యం+విజ్ఞాపయతి=మంత్రిగారికి (ఇలా) మనవి చేస్తున్నాడు. (యత్=ఏమిటంటే) – ‘చిరాత్+ప్రభృతి=చాలా కాలంగా, ఆర్యః=అయ్యవారు, పరిత్యక్త+ఉచిత+సంస్కారః+ఇతి=మంత్రి హోదాకు తగిన అలంకారాలను విడిచిపెట్టారే! అని, మే+హృదయం+పీడ్యతే=నా (యొక్క) మనస్సుకు బాధగా ఉంది. యది+అపి=ఏ విధంగా అయినా, సహసా=తొందరగా, స్వామిగుణాః+విస్మర్తుం+న+శక్యతే=అయ్యవారి సుగుణాలు (నందరాజు గుణాలు) మరచిపోవడం సాధ్యం కాకపోయినా, తథా+అపి=అయినా కాని, ఆర్యః+మత్+విజ్ఞాపనాం+మానయితుం=మంత్రిగారు, నా విన్నపాన్ని మన్నించ, అర్హతి=తగుదురు, (ఇతి=అని, ఆభరణాని=నగలను, ప్రదర్శ్య=చూపించి…), ఇమాని+ఆభరణాని=ఈ నగలు, కుమారేణ+స్వశరీరాత్+అవతార్య=మలయకేతువు తన శరీరం నుంచి తీసి (తీయబడి), ప్రేషితాని=పంపించాడు, అమాత్యః+ధారయితుం+అర్హతి=అమాత్యుల వారు (మీరు) ధరించవచ్చును. (ధరిస్తే తప్పు లేదు అని సూచన).

రాక్షస:

ఆర్య, జాజలే, విజ్ఞప్యతా మస్మద్వచనాత్ కుమారః – విస్మృతా ఏవ భవద్గుణపక్షపాతేన స్వామిగుణాః. కిం తు.  

అర్థం:

ఆర్య+జాజలే=జాజలి అయ్యవారూ, కుమారః+అస్మద్వచనాత్+విజ్ఞప్యతాం= ఆ రాజకుమారుడికి మా మాటగా చెప్పండి. –  భవత్+గుణ+పక్షపాతేన= నీ సుగుణాల పట్ల ప్రత్యేక ఆదరణ కారణంగా, స్వామిగుణాః=మా ప్రభువు గుణాలు, విస్మృతాః=మమ్మల్ని మరచిపోజేశాయి.

శ్లోకం:

న తావ న్నిర్వీర్యైః

పరపరిభవాక్రాన్తి కృపణైః

వహామ్యఙ్గై రేభిః

ప్రతను మపి సంస్కారరచనామ్

న యావ న్నిః శేష

క్షపిత రిపుచక్రస్య నిహితం

సుగాఙ్గే హేమాఙ్కం

నృవర, తవ సింహాసనమిదమ్॥  10

అర్థం:

నృవర= (కుమార) రాజా! యావత్=ఎంతవరకు, సు+గాఙ్గే=సుగాఙ్గమనే రాజప్రాసాదంలో, నిశ్శేష+క్షపిత+రిపుచక్రస్య=మూలమట్టుగా శత్రుసమూహాన్ని అంతం చెయ్యకుండా, తవ+ఇదం+హేమాఙ్కం+సింహాసనం=ఈ నీ బంగారు సింహాసనం, నిహితం=ఉంచబడలేదో, తావత్=అంతవరకు, ఏభిః+నిర్వీర్యైః+పర+పరాభవ+ఆక్రాంతి+కృపణైః=శక్తి కోల్పోయిన శత్రువుల అవమాన భారం మీద పడి దయనీయ స్థితికి చేరిన యీ, అంగైః=అవయవాలతో (కు), ప్రతనుం+అపి=ఇసుమంత కూడా, సంస్కార+రచనాం=అలంకరించుకొనే పనిని, న+వహామి=భరించజాలను.

వ్యాఖ్య:

చంద్రగుప్తుణ్ణి పదభ్రష్టుణ్ణి చేసి, పాటలీపుత్రంలోని సుగాంగ ప్రాసాదంలో శత్రునిర్ములనం చేసి నీకు దక్కవలసిన బంగారు సింహాసనాన్ని పదిలం చేయకుండా – శత్రువుల అవమానానికి గురైన యీ శరీరావయవాలను ఇసుమంత కూడా అలంకరించుకోడం భరించలేను – అంటున్నాడు రాక్షసమంత్రి. “తిరస్కరిస్తున్నాననుకోకు. నాకు అలంకరణ కంటె, నీ సింహాసనం పదిలపరచడం ముఖ్యం” – అని రాక్షసమంత్రి ప్రతిజ్ఞ.

వృత్తం:

శిఖరిణి – య – మ – న – స – భ – లగ – గణాలు.

కఞ్చుకీ:

అమాత్యే నేతరి, సులభ మేతత్ కుమారస్య। త త్ప్రతిమాన్యతాం కుమారస్య ప్రథమః ప్రణయః॥ 

అర్థం:

అమాత్యే+నేతరి (సతి)=అమాత్యులవారే నాయకత్వం వహిస్తుండగా, కుమారస్య=కుమార చంద్రకేతుడికి, ఏతత్=ఇది (శత్రునాశం), సులభమ్=తేలికైన పని – తత్= అందువల్ల, కుమారస్య+ప్రథమ+ప్రణయః=రాజకుమారుడి తొలి ప్రేమపుర్వక చర్య, ప్రతిమాన్యతాం=(తప్పక) మన్నించదగినది.

రాక్షస:     

ఆర్య, కుమార ఇ వానతిక్రమణీయవచనో భవా నపి। త దనుష్ఠీయతాం కుమార స్యాజ్జా॥

అర్థం:

ఆర్య =అయ్యా, కుమారః+ఇవ=కుమారరాజులాగే, భవత్+వచననః+అపి+అనతిక్రమణీయః=దాటరానిది, తత్=అందువల్ల, కుమారస్య+ఆజ్ఞా=మలయకేతుని అదేశం, అనుష్ఠీయతాం=జరిపించండి.

కఞ్చుకీ:      

(నాట్యేన భూషణాని పరిధాప్య) స్వస్తి భవతే సాధయా మ్యహమ్.

అర్థం:

(నాట్యేన+భూషణాని+పరిధాప్య=నగలను అలంకరింపజేయడం నాటకీయంగా ప్రదర్శించి)  భవతే+స్వస్తి=మీకు మంగళమగుగాక! సాధయామ్+ అహమ్=నేను వెళ్ళెదను.

రాక్షస:

ఆర్య, అభివాదయే.

(కఞ్చుకీ నిష్క్రాన్తః)

అర్థం:

ఆర్య+అభివాదయే=అయ్యా నమస్కారం (నమస్కరిస్తున్నాను).

(కఞ్చుకీ+నిష్క్రాన్తః=కఞ్చుకి వెళ్ళాడు).

రాక్షస:

ప్రియంవదక, జ్ఞాయతాం కోఽస్మద్దర్శనార్థీ ద్వారి తిష్ఠ తీతి॥  

అర్థం:

ప్రియంవదక!, అస్మత్+దర్శనార్థీ=మా దర్శనం కోరుతూ, ద్వారి+కః+తిష్ఠతి=గుమ్మంలో ఎవరున్నారో, జ్ఞాయతాం=తెలుసుకో; (తెలుసుకోబడుగాక).

పురుషః:         

జం అమచ్చో ఆణ వేది త్తి. (య దమాత్య ఆజ్ఞాపయ తీతి.) – పరిక్రమ్య – (ఆహితుణ్ణికం దృష్ట్వా) ఆజ్ఞ, కో తుమమ్? (ఆర్య, కస్త్వమ్?)

అర్థం:

అమాత్య+యత్+ఆజ్ఞాపయతి+ఇతి=అమాత్యుల వారి ఆజ్ఞ!. (పరిక్రమ్య=ముందుకు నడిచి), ఆహితుణ్ణికం+దృష్ట్వా=పాములవాడిని చూసి, ఆర్య=అయ్యా, కః+త్వమ్?=ఎవరు నీవు?

ఆహితుండికః:

భద్ద, అహం ఖు ఆహితుండిఓ జిణ్ణవిసోనామ. ఇచ్ఛామి అమచ్చస్స పురదో సప్పేహిం ఖెలిదుమ్. (భద్ర, అహం ఖలు ఆహితుణ్ణికో జీర్ణవిషోనామ; సర్పైః ఇచ్ఛామి అమాత్యస్య పురతః ఖేలితుమ్.)

అర్థం:

భద్ర=నాయనా, అహం+ఖలు+జీర్ణవిషః+నామ+ఆహితుణ్ణికః=నేనైతే – జీర్ణవిషుడనే పేరిటి పాములవాడిని; అమాత్యస్య+పురతః=మంత్రిగారి ఎదుట, సర్పైః+ఖేలితుమ్+ఇచ్ఛామి=పాముల్ని ఆడిద్దామనుకుంటున్నాను (పాములతో ఆడదామనుకుంటున్నాను).

పురుషః:

చిట్ఠ, జావ అమచ్చస్స ణివేదేమి. (రాక్షస ముపసృత్య) అమచ్చ, ఏసో ఖు సప్పజీవి ఇచ్ఛతి సప్పం దం సేదుం. (తిష్ఠ యావ దమాత్యస్య నివేదయామి. అమాత్య, ఏష ఖలు సర్పజీవీ ఇచ్ఛతి సర్పం దర్శయితుమ్.)

అర్థం:

యావత్+అమాత్యస్య+నివేదయామి+(తావత్)+తిష్ఠ=అమాత్యుల వారికి తెలియజేసేవరకు ఇక్కడే ఉండు. (రాక్షసం+ఉపసృత్య=రాక్షసమంత్రిని సమీపించి) – అమాత్య=మహామంత్రీ!, ఏష+సర్పజీవీఖలు+సర్పం+దర్శయితుం+ఇచ్ఛతి=ఈ పాములవాడేమో, మీకు పామును చూపించాలని కోరుతున్నాడు.

రాక్షస:

(వామాక్షి స్పన్దనం సూచయిత్వా, ఆత్మగతమ్!) కథం! ప్రథమ మేవ సర్పదర్శనమ్! (ప్రకాశమ్) ప్రియంవదక, న నః కౌతూహలం సర్పేషు. తత్పరితోష్య విసర్జ యైనమ్.

అర్థం:

(వామ+అక్షి+స్పన్దనమ్+సూచయిత్వా=ఎడమకన్ను అదరడాన్ని సూచించి, ఆత్మగతమ్=తనలో), కథం=ఏమీ, ప్రథమం+ఏవ+సర్పదర్శనమ్=తెల్లవారుతూనే పాము దర్శనమా? (ఆదిలోనే పాము ఎదురా?), (ప్రకాశమ్=పైకి) ప్రియంవదక!, నః+న+కౌతూహలం+సర్పేషు=మాకు పాముల మీద ఆసక్తి లేదు. తత్+ఏనం+పరితోష్య+విసర్జయ=అందువల్ల వీడిని ఎంతో కొంత కానుక చేసి, పంపించివెయ్యి.

ప్రియంవదకః (పురుషః):    

తథా, (ఇ త్యుపసృత్య) అజ్జ, ఏసో ఖు దే దంసణకజ్జేణ అమచ్చో ప్రసాదం కరేది, ణఉణ సప్ప దంసణేణ. (ఆర్య ఏష ఖలు తే దర్శనకార్యేణా మాత్యః ప్రసాదం కరోతి, న పునః సర్పదర్శనేన.)

అర్థం:

తథా=అలాగేనయ్యా, (ఇతి+ఉపసృత్య=అని, పాములవాడిని సమీపించి), ఆర్య=అయ్యా, ఏష+అమాత్యః=ఈ (మా) మంత్రిగారు, తే+దర్శనకార్యేణా=నిన్ను చూసి, ప్రసాదం+కరోతి=అనుగ్రహిస్తున్నారు, పునః+సర్పదర్శనేన+న=ఇక పాముల్ని చూడదలచడం లేదు. (నిన్ను అనుగ్రహిస్తున్నారు గాని, పాముల్ని చూడడం చేత కాదు).

ఆహితుండికః:

భద్దముహ, విణ్ణవేహి అమచ్చం ణ కేవలం అహం సప్పజీవీ, పాఉడకవీ క్ఖు అహం. తాజఇ మే దంసణేణ అమచ్చో పసాదం ణక రేది, తా ఏదం పత్తఅం వాచేదుత్తి‘. (భద్ర ముఖ, విజ్ఞాప యామాత్యం న కేవల మహం సర్పజీవీ, ప్రాకృత కవిః ఖ ల్వహమ్. తస్మాద్యది మే దర్శనే నామాత్య ప్రసాదం న కరోతి, తదా ఏత త్పత్రకం వాచయత్వితి)  

అర్థం:

భద్రముఖ=మంగళప్రదమైన ముఖం కలవాడా!, అమాత్యం+విజ్ఞాపయ=మంత్రిగారికి చెప్పు; ‘అహం+న+కేవలం+సర్పజీవీ=నేను కేవలం పాములాడించి బతికేవాడిని మాత్రమే కాదు, అహం+ఖలు+ప్రాకృత+కవిః=నేను ప్రాకృతభాషా కవిని (లేదా జానపద కవిని) కూడా. తస్మాత్ (కారణాత్)=అందువల్ల, మే+యది+అమాత్యం+దర్శనేన+ప్రసాదం+న+కరోతి=మంత్రిగారు దర్శనం ఇచ్చి అనుగ్రహించదలచకపోతే, తదా+ఏతత్పత్రకం+వాచయ=ఈ పత్రాన్ని చదవమను (చదివించు)’ ఇతి= అని.

ప్రియంవదకః (పురుషః): 

(పత్రం గృహీత్వా – రాక్షసం ఉపసృత్య)

పాములవాడు చెప్పిన మాటలనే మళ్ళీ ఇక్కడ పునరుక్తం చేశాడు (అర్థం పైన చెప్పినదే – వ్యాఖ్యాత).

అర్థం:

పత్రం+గృహీత్వా=పత్రం తీసుకుని, రాక్షసం+ఉపసృత్య= రాక్షసమంత్రిని చేరి (ఇచ్చాడు).

రాక్షస:

(పత్ర గృహీత్వా వాచయతి)

శ్లోకం:

పాఉణ నిరవసేసం కుసుమరసం అత్తణో కుసలదాఏ

జం ఉగ్గి రేఇ భమరో అణ్ణాణం కుణఇ తం కజ్జం॥ -11

(పీత్వా నిరవశేషం కుసుమరస మాత్మనః కుశలతయా

య దుద్గిరతి భ్రమరః అన్యేషాం కరోతి తత్ కార్యమ్॥)

అర్థం:

ఆత్మనః+కుశలతయా=తన నేర్పరితనంతో, కుసుమ+రసం=మకరందాన్ని, పీత్వా=తాగి, భ్రమరః=తుమ్మెద, యత్+ఉద్గిరతి=దేనిని వెలిగ్రక్కుతుందో, తత్=ఆ మకరందం, అన్యేషాం=పరులకు, కార్యం+కరోతి=పని జరిపిస్తుంది.

అలంకారం:

ప్రస్తుత విషయమైన గూఢచర్యను ఆశ్రయించి, అప్రస్తుత మకరందపానం ద్వారా ఒక సూచన జరుగుతున్నది కనుక – అప్రస్తుత ప్రశంస (అప్రస్తుత ప్రశంసా సాత్ సా యత్ర ప్రస్తుతాశ్రయా – అని కువలయానందం).

వృత్తం:

ఆర్యావృత్తం.

వ్యాఖ్య:

వచ్చినవాడు పాటలీపుత్ర (కుసుమపుర) గూఢచారి. ఆ విశేషాలు చెప్పడానికి వచ్చాను సుమా! అని అన్యాపదేశంగా చెప్పాడు పాములవాడు. రాక్షసమంత్రి దానిని గ్రహించుకున్నాడు. సంకేతాల ద్వారా సందేశాలు చెప్పుకోవడం, పంపుకోవడం గూఢచర్యంలో ఒక భాగం.

రాక్షస:

(విచిన్త్య స్వగతమ్) అయే, కుసుమపురవృత్తాన్తజ్ఞో భవత్ప్రణిధి రితి గాథార్థః। కార్య వ్యగ్రతయా మనసః, ప్రభూతత్వాచ్చ ప్రణిధీనాం విస్మృతమ్। ఇదానీం స్మృతి డుపలద్దా। వ్యక్త మహితుణ్ణిక చ్ఛ ద్మనా విరాధగుప్తే నా నే న భవితవ్యమ్। (ప్రకాశమ్) ప్రియంవదక, ప్రవేశ యైనమ్। సుకవి రేషః. శ్రోతవ్య మస్మాత్ సుభాషితమ్॥

అర్థం:

(విచిన్త్య=ఆలోచించి, స్వగతమ్=తనలో) అయే=ఓహో!, కుసుమపుర+వృత్తాన్తజ్ఞః+భవత్+ప్రణిధి+ఇతి=కుసుమపుర సమాచారం తెలిసిన మీ గూఢచారి – అని, గాథార్థః=యీ గాథ అర్థం. కార్యవ్యగ్రతయా+మనసః=మనస్సుకు కార్యభారం చేతనూ, ప్రణిధీనాం+ప్రభూతత్వాత్+చ=చాలామంది గూఢచారులుండడం చేతనూ, (మయా) విస్మృతమ్=మరిచాను (మరువబడింది). ఇదానీమ్+స్మృతిః+ఉపలద్దా=ఇప్పుడు జ్ఞాపకం వచ్చింది, ఆహితుణ్ణిక+ఛద్మనా=పాములాడించే వేషంలో, విరాధగుప్తేన+ అనేన+భవితవ్యమ్=విరాధగుప్తుడయి ఉండాలి, వ్యక్తమ్=తెలిసింది. (ప్రకాశమ్=పైకి) ప్రియంవదక!, ఏనం+ప్రవేశయ=ఇతడిని రానీ (ప్రవేశపెట్టు), ఏషః+సుకవి=ఇతడు మంచి కవి. అస్మాత్+సుభాషితమ్+శ్రోతవ్యమ్=ఇతడి నుంచి మంచి పలుకు వినదగినది.

ప్రియంవదకః: 

తథా – (ఇత్యాహితుణ్ణిక ముపసృత్య) ఉప సప్పదు అజ్జో- (ఆర్య, ఉపసర్పతు.)

అర్థం:

తథా=అలాగే, (ఇతి=అని, ఆహితుణ్ణికం+ఉపసృత్య=పాములవాడిని సమీపించి) ఆర్య=అయ్యా, ఉపసర్పతు=(లోపలకు) రావచ్చును.

ఆహితుండికః:

(నాట్యేన ఉపసృత్య, విలోక్య చ, స్వగతమ్, సంస్కృత మాశ్రిత్య) అయ మమాత్య రాక్షసః స ఏషః…  

శ్లోకం:

వామాం బాహులతాం ని వేశ్య శిథిలం

కణ్ఠే, నివృత్తాననా,

స్కన్ధే దక్షిణయా బలాన్నిహితయా

ప్య ఙ్కే, పతన్త్యాముహుః।

గాఢాలిఙ్గన సఙ్గపీడితముఖం

య స్యోద్యమాశఙ్కినీ

మౌర్య స్యోరసి నాధు నాపి కురుతే

వామేతరం శ్రీః స్తనమ్॥

(ప్రకాశమ్) జేదు అమచ్చో (జయతు అమాత్యః)

అర్థం:

(నాట్యేన+ఉపసృత్య=నాటకీయంగా సమీపించి, విలోక్య+చ=(మంత్రిగారిని) చూసి, స్వగతమ్=తనలో – సంస్కృతమ్+ఆశ్రిత్య= సంస్కృత భాషకు మారి),

వామాం+బాహులతామ్= (తన) ఎడమచేతిని, శిథిలం= అంటీ ముట్టనట్టు, కంఠే=మెడలో (మెడపై), నివేశ్య=ఉండేటట్టు చేసి, నివృత్త+ఆననా=ముఖం ప్రక్కకు తిప్పుకుని – స్కంధే=మూపు  మీద, బలాత్+నిహితాయ+అపి=దృఢంగా నిలిపినదైన దప్పటికీ, అంకే+ముహుః+పతంత్యా+దక్షిణయా (బాహులతయా)=మాటిమాటికి ఒడిలోకి జారిపోయే కుడిభుజంతో, గాఢాలిఙ్గన+సంగపీడిత+ముఖం=బిగి కౌగిలి ఒత్తిడికి నలిగిన ముఖాన్ని, వామ+ఇతరం+స్తనమ్=కుడిచన్నును, శ్రీః=(మౌర్య రాజ్య) లక్ష్మి, మౌర్యస్య+ఉరసి=చంద్రగుప్తుడి వక్షస్థలం మీద – యస్య+ఉద్యమ+ఆశఙ్కినీ=ఎవరి ప్రయత్నాలను అనుమానించినదై – అద్య+అపి=ఇప్పటికి కూడా, న+కురుతే=(పూర్తిగా) ఆనుకోవివ్వడం లేదో, సః+ఏష=అటువంటి ఇతడే, అమాత్య+రాక్షసః=రాక్షసమంత్రి.

(ప్రకాశమ్=పైకి) అమాత్య+జయతు= మంత్రిగారికి జయం!

అలంకారం:

కావ్యలింగం. (మేతోర్వాక్య పదార్థత్వే కావ్యలిఙ్గా ముదాహృతమ్ – అని ప్రతాపరుద్రీయమ్).

(సమర్థనీయ స్యార్థస్య కావ్యలిఙ్గం సమర్థనమ్’ అని – కువలయానందం).

ఒకానొక కారణం వాక్యం ద్వారా గాని, పదం ద్వారా గాని నిర్దేశించడం కావ్యలిఙ్గం – అనీ, సమర్థించదగిన ఒక అర్థాన్ని సమర్థించడమనీ ఇక్కడ గ్రహించాలి.

మౌర్యరాజ్యలక్ష్మి (ఎవరికైతే) బెదిరిపోయి, చంద్రగుప్తుణ్ణి పరిపూర్ణంగా వరించ జాలక – వదులు కౌగిలిలో ఉండిపోయే సందర్భం ఏర్పడిందో – ఆ (ఆటంకం ఏర్పరిచిన) వ్యక్తి ఇతడే (రాక్షసమంత్రి) – అని సమర్థన.

వృత్తం:

శార్దూల విక్రీడతం – మ – స – జ -స – త – త – గ – గణాలు.

వ్యాఖ్య:

ఇక్కడ చంద్రుగుప్తుడి ‘కెడ కౌగిలిలో’ ఇబ్బందిగా ఉండిపోయిన మౌర్య రాజ్యలక్ష్మి బొమ్మను చిత్రకారుడి మాదిరిగా కవి అద్భుతంగా చిత్రించడం గమనించదగినది. విరాధగుప్తుడి మనస్సులో – రాక్షసమంత్రి దర్శనం – అటువంటి ఊహ కలిగే విధంగా చేసింది.

ఎడమ చెయ్యి చంద్రగుప్తుడి మెడమీద – కుడి చెయ్యి మాత్రం అతడి మెడపై నిలవజాలక అతడి ఒడిలోకి జారి – చుంబనానికి అందకుండా ప్రక్కకి తిప్పివేసిన ముఖం – అయితే, మౌర్యుడి వక్షస్థలానికి కుడిచన్ను ఒత్తుకుని –

ఇది వదులు కౌగిలి.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here