ముద్రారాక్షసమ్ – పఞ్చమాఙ్కః – 1

0
10

[box type=’note’ fontsize=’16’] ‘ముద్రారాక్షసం‘ ఏడంకాల రాజకీయ నాటకం. విశాఖదత్తుడు యీ నాటకాన్ని చతుర రాజకీయ వ్యూహాల అల్లికతో, అద్భుతంగా రూపొందించాడు. సంస్కృత సాహిత్యం మొత్తంలో అరుదైన ఈ నాటకాన్ని ఇంద్రగంటి శ్రీకాంతశర్మ గారు అనువదించి, వ్యాఖ్యతో అందిస్తున్నారు. [/box]

(తతః ప్రవిశతి పురుషే ణానుగమ్యమానో భాగురాయణః)

భాగు:

(ప్రవిశ్య) – (స్వగతమ్) అహో వైచిత్ర మార్య చాణక్యనీతేః!

అర్థం:

(ప్రవిశ్య=ప్రవేశించి) – (స్వగతమ్=తనలో) అహో=ఆహా!, ఆర్యచాణక్య+నీతేః=పూజ్యచాణక్య మంత్రి రాజనీతి (యొక్క), వైచిత్రం=విచిత్ర ప్రవృత్తి (పలు పోకడల తీరు!).

శ్లోకం:

ముహు ర్లక్ష్యోద్భేదా,

ముహు రధిగ మాభావగహనా,

ముహుః సంపూర్ణాంగీ

ముహు రతికృశా కార్యవశతః;

ముహు ర్నశ్యద్బీజా

ముహు రపి బహుప్రాపితఫలే

త్యహో చిత్రాకారా

నియతి రివ నీతి ర్నయవిదః. (3)

అర్థం:

నయవిదః=విషయాలను చాకచక్యంతో నడిపించే వారి (యొక్క), నీతిః=నడక (గమనం), ముహుః=మాటిమాటికి, లక్ష్య+ఉద్భేదా=ఉద్దేశించిన లక్ష్యాన్ని చీల్చేదిగా ఉంటుంది – (అలాగే), ముహుః=మాటిమాటికి, అధిగమ+అభావ+గహనా=ప్రవేశమే గుర్తించలేని విధంగా క్లిష్టంగా ఉంటుంది. (మరిన్నీ) ముహుః=మాటిమాటికీ, సంపూర్ణ+అంగీ=ఉద్దిష్ట అవయవాలన్నీ సమకూడి ఉంటుంది. (అలాగే) ముహుః=మాటిమాటికి, కార్య+వశతః=పనితీరును బట్టి, అతి+కృశా=చాలా కుంచించుకొని కనిపిస్తుంది. ముహుః=మాటిమాటికి, నశ్యత్+బీజా=మూలమే (మొలకగానే) అంతరించిపోతున్నట్టు తోస్తుంది. ముహుః=మాటిమాటికీ, బహు+ప్రాపితా+ఫలా=చాలా ఫలాలను ఇచ్చినట్టు కనిపిస్తుంది. ఇతి=ఈ విధంగా, నియతిః+ఇవ=విధి మాదిరి, చిత్ర+ఆకారా=చిత్రమైన ఆకృతితో ఉంటుంది కదా!, అహో=ఆశ్చర్యం!

వృత్తం:

శిఖరిణి – య – మ – న – స – భ – లగ – గణాలు.

అలంకారం:

‘నియతిః ఇవ’, ‘నయవిదః నీతిః చిత్రకారా’ అని పోల్చడం చేత ఉపమాలంకారం. (ఉపమాయత్ర సాదృశ్య లక్ష్మీరుల్లసతి ద్వయోః అని – కువలయానందం).

అహో! చిత్రాకారా నీతిః – అనడం వల్ల అర్థాంతరన్యాసం కూడా నని – రామదాసయ్యంగారు.

వ్యాఖ్య:

భాగురాయణుడు చాణక్య గూఢచారి కద! అతడు రాక్షసమంత్రి పట్ల ప్రదర్శించే రాజనీతి వ్యూహాలను దగ్గరగా ఎరిగి ఉండడం వల్ల ఆశ్చర్యపోతున్నాడు. విధి నడిచే నడకలు చిత్రవిచిత్రంగా ఉన్నట్లే – నయవిదుల చేతలు కూడా అంతుబట్టకుంటా ఉంటాయని – ఇక్కడ ఎనిమిది తీరులను ఎంచి చూపిస్తున్నాడు.

భాగు:

(ప్రకాశమ్) భద్ర భాసురక, న మాం దూరీభవన్త మిచ్ఛతి కుమారః। అతో ఽస్మిన్నే వాస్థానమణ్డపే న్యస్యతా మాసనమ్॥

అర్థం:

(ప్రకాశమ్=పైకి), భద్ర+భాసురక=నాయనా, భాసురకా!, కుమారః=కుమార మలయకేతువు, మామ్=నన్ను, దూరీభవన్తం+న+ఇచ్ఛతి=నేను దూరంగా ఉండరాదని కోరుకుంటున్నాడు. తతః=అందువల్ల,  అస్మిన్+ఆస్థానమణ్డపే+ఏవ=ఈ కార్యాలయ మండపంలోనే, ఆసనం+న్యస్యతామ్=పీఠం ఉంచబడు గాక (ఇక్కడే పీట వెయ్యి, కూర్చుంటాను).

పురుషః:

ఏదం ఆసణం, ఉవవిశదు అజ్జో. (ఏత దాసనమ్. ఉపవిశ త్వార్యః)

అర్థం:

ఏతత్+ఆసనమ్=ఇదిగో పీఠం. ఆర్యః+ఉపవిశతు=అయ్యగారు కూర్చుందురు.

భాగు:

(ఉపవిశ్య) భద్ర, యః కశ్చిన్ముద్రార్థీ మాం ద్రష్టు మిచ్ఛతి. స త్వయా ప్రవేశయితవ్యః।

అర్థం:

(ఉపవిశ్య=కూర్చొని), భద్ర=నాయనా, యః+కశ్చిత్+ముద్రార్థీ=ఎవరైనా ఆమోద ముద్ర కావాలనుకునేవారుంటే, మాం+ద్రష్టుం+ఇచ్ఛతి=నన్ను చూడాలనుకుంటే, సః=అతడు, త్వయా=నీ చేత, ప్రవేశయితవ్యః=ప్రవేశపెట్టబడవచ్చు (నువ్వు పంపించవచ్చు).

పురుషః:

జం అజ్జో ఆణ వేది. (య దార్య ఆజ్ఞాపయతి.)

(ఇతి నిష్క్రాన్తః)

అర్థం:

ఆర్య+యత్+ఆజ్ఞాపయతి=అయ్యావారు ఆదేశించినట్టే (చేస్తాను).

(ఇతి=అని, నిష్క్రాన్తః=వెళ్ళాడు).

భాగు:

(స్వగతమ్) కష్టం! ఏవ మ ప్యస్మాసు స్నేహవాన్ కుమారో మలయకేతు రతిసన్ధాతవ్య ఇ త్యహో దుష్కరమ్. అథవా…

అర్థం:

(స్వగతమ్=తనలో), అస్మాసు=మాయందు, ఏవం+అపి=ఇంతగా, స్నేహవాన్+కుమారః+మలయకేతుః=మైత్రిని చూపించే మలయకేతువు, అతిసన్ధాతవ్యః=మోసగింపబడవలసిన వాడవుతున్నాడు, ఇతి=అనేది, అహో=ఆహా; దుష్కరమ్=చేయజాలనిది! అథవా=కానైతే…

శ్లోకం:

కులే లజ్జాయాం చ

స్వయశసి చ మానే చ విముఖః

శరీరం విక్రీయ

క్షణిక మపి లోభా ద్ధనవతి

తదాజ్ఞాం కుర్వాణో

హిత మహిత మిత్యేత దధునా

విచారాతి క్రాన్తః

కిమితి పరతన్త్రో విమృశతి? (4)

అర్థం:

కులే=పుట్టిన కులంలో, లజ్జాయాం+చ=బిడియపడడంలోనూ, స్వ+యశసి+చ=తన కీర్తి విషయంలోనూ, మానే+చ=పరువు విషయంలోనూ, విముఖః=ముఖం తప్పించుకున్న వ్యక్తి, క్షణికం+అపి+శరీరం=క్షణభంగురమే అయిన శరీరాన్ని, ధనవతి=డబ్బున్న వాడికి, లోభాత్=ప్రలోభం వల్ల, విక్రీయ=అమ్ముకొని – తత్+ఆజ్ఞాం+కుర్వాణః=అతడి ఆదేశానికి లోబడి ప్రవర్తించే వాడై, – హితం+అహితం+ఇతి+ఏతత్=ఇది తగినది, ఇది తగనిది అనే విచికిత్స ఏది ఉందో (దానిని), అధునా=ఈవేళ, విచార+అతిక్రాన్తః=గమనించుకోవడం దాటేశాడు. పరతన్త్రః=పరాధీనుడు, కిమ్+ఇతి+విమృశతి=తరచి చూసుకొనేది ఏముంటుంది?

వృత్తం:

శిఖరిణి – య – మ – న – స – భ – లగ – గణాలు.

అలంకారం:

విచారాతి క్రాన్తః పరతన్త్రః కిమితి విమృశతీ (తరచి చూసుకొనే అవకాశం లేని పరాధీనుడు ఏమని ఆలోచించుకోగలడు?) – అనడం వల్ల అర్థాంతరన్యాసాలంకారం (ఉక్తిరర్థాంతర న్యాసస్స్యాత్ సామాన్య విశేషయోః – అని కువలయానందం).

వ్యాఖ్య:

ఇందులో భాగురాయణుడి ఆత్మవిచారం – తన్ను నమ్ముకున్న మలయకేతుణ్ణి మోసగించవలసి వస్తున్నదే! – ఒళ్ళమ్ముకున్న మనిషిగా తాను ఇప్పుడు విచారించే పరిస్థితిని కోల్పోయాడని విచారం.

(తతః ప్రవిశతి ప్రతీహా ర్యనుగమ్యమానో మలయకేతుః)

అర్థం:

(తతః=ఆ మీదట – ప్రతీహారి+అనుగమ్యమానః=ప్రతీహారిని వెంటపెట్టుకొని వస్తున్న, మలయకేతుః+ప్రవిశతి=మలయకేతువు ప్రవేశిస్తున్నాడు.)

మలయ:

(స్వగతమ్) అహో రాక్షసం ప్రతి వికల్ప బాహుళ్యా దాకులా మే బుద్ధి, ర్న నిశ్చయ మధిగచ్ఛతి. యతః…

అర్థం:

(స్వగతమ్=తనలో) అహో!=ఆహా!, రాక్షసం+ప్రతి=రాక్షసమంత్రి విషయంలో, వికల్ప+బాహుళ్యాత్=పెక్కు సంశయాల కారణంగా, మే+బుద్ధి+ఆకులా=నాకు ఆలోచన ఆందోళనకరంగా ఉంది, నిశ్చయం+న+అధిగచ్ఛతి=నిర్ణయానికి రాలేకపోతున్నది. యతః=ఎందువల్లనంటే…

శ్లోకం:

భక్త్యా నన్దకులానురాగదృఢయా

నన్దాన్వయాలమ్బినా

కిం చాణక్యనిరాకృతేన కృతినా

మౌర్యేణ సంధాస్యతే?

స్థైర్యం భక్తి గుణస్య వాధిగణయన్

కిమ్ సత్యసన్ధో భవే!

ది త్యారూఢకులాలచక్ర మివ మే

చేత శ్చిరం భ్రామ్యతి॥ (5)

అర్థం:

నన్దకుల+అనురాగ+దృఢయా=నందవంశం మీద ప్రేమ బలంగా ఉండడం చేత, నన్ద+అన్వయ+ఆలమ్బినా=నందవంశాన్ని పట్టుకుని ఉన్న, భక్త్యా=భక్తి కారణంగా – చాణక్య+నిరాకృతేన=చాణక్యుడి చేత తిరస్కారం పొందిన, కృతినా+మౌర్యేణ=తన పని తీరిన చంద్రగుప్తుని చేత, సంధాస్యతే+కిం=సంధి చేసుకుంటాడా ఏమి? (లేదా), భక్తి+గుణస్య+స్థైర్యం+అధిగణయన్=నా పట్ల భక్తిగుణం వల్ల కలిగిన నిలకడపాటును పరిగణిస్తూ, సత్య+సన్ధః+భవేత్+కిమ్= (నా పట్ల) తన ప్రతిజ్ఞ నిలబెట్టుకోగలడా ఏమి?, ఇతి=అని, మే+చేత=నా మనస్సు, ఆరూఢ+కులాలచక్రం+ఇవ=కుమ్మరి సారె మీద ఎక్కిన తీరుగా, చిరం=చిరకాలంగా, భ్రామ్యతి=తిరుగుతున్నది.

వృత్తం:

శార్దూల విక్రీడితం. మ-స-జ-స-త-త-గ గణాలు.

అలంకారం:

ఉత్ప్రేక్ష (సంభావనాస్యాదుత్ప్రేక్షౌ వస్తుహేతు ఫలాత్మనా – అని కువలయానందం).

ఇక్కడ తన మనస్సు నిలకడ లేకపోవడానికి కారణంగా కులాలచక్రం చెప్పడం వల్ల హేతూత్ప్రేక్ష.

(ప్రకాశమ్) విజయే, క్వ భాగురాయణః?

అర్థం:

(ప్రకాశమ్=పైకి), విజయే=విజయా, క్వ+భాగురాయణః=భాగురాయణుడెక్కడ?

ప్రతీ:

కుమార, ఏసో ఖుకడఆదో ణిక్క మిదుకామాణం ముద్దా సంపాదణం అణు చిట్ఠది. (కుమార, ఏష ఖలు కటకాన్నిష్క్రమితుకామానాం ముద్రా సంప్రదాన మనుతిష్ఠతి.)

అర్థం:

కుమార= మలయకేతు కుమారా, కటకాత్+నిష్క్రమితుకామానాం=శిబిర ప్రాంతం నుండి బయటకు వెళ్ళదలచినవారికి, ఏష=ఇతడు, ముద్రాసంప్రదానం=అనుమతి ముద్రను ఇచ్చేపనిని, అనుతిష్ఠతి+ఖలు=ఆచరిస్తున్నాడు కదా.

మలయ:

విజయే, ముహూర్త మసఞ్చారా భవ; యావ దస్య పరాఙ్ముఖ స్యైవ పాణిభ్యాం నయనే పిదధామి।

అర్థం:

విజయే=విజయా, ముహూర్తం+అసఞ్చారా+భవ=కాసేపు కదలకుండా ఉండు; యావత్=ఎంతలో, పరాఙ్ముఖస్య+ఏవ=ఇతడు అటు తిరిగి ఉండగానే, పాణిభ్యాం=నా చేతులతో, నయనే+పిదధామి=(ఇతడి) కళ్ళు మూస్తాను.

ప్రతీ:

జం కుమారో ఆణవేది. (యత్కుమార ఆజ్ఞాపయతి)

అర్థం:

యత్+కుమారః+ఆజ్ఞాపయతి=రాకుమారుడు ఆజ్ఞాపించినట్టే (చేస్తాను).

పురుష:

(ప్రవిశ్య) అజ్జ, ఏసో ఖు ఖవణఓ ముద్దాణిమిత్తం అజ్జం పేక్క్ఖిదు మిచ్ఛది. (ఆర్య, ఏష ఖలు క్షపణకో ముద్రానిమిత్త మార్యం ప్రేక్షతు మిచ్ఛతి.)

అర్థం:

ఆర్య=అయ్యా, ఏష+ఖలు+క్షపణకః=ఈ బౌద్ధసన్న్యాసి, ముద్రానిమిత్తం=ఆమోద ముద్ర కోసం, ఆర్యం=అయ్యగారిని, ప్రేక్షతుం+ఇచ్ఛతి=చూడగోరుతున్నాడు.

భాగు:

ప్రవేశయ.

అర్థం:

ప్రవేశయ= ప్రవేశపెట్టు.

పురుష:

తథా.

(ఇతి నిష్క్రాన్తః)

అర్థం:

తథా=అలాగే.

(ఇతి=అని, నిష్క్రాన్తః=వెళ్ళాడు).

క్షపణక:

(ప్రవిశ్య) – ధమ్మసిద్ధి సావగాణం హోదు. (ధర్మసిద్ధిః శ్రావకాణాం భవతు.)

అర్థం:

(ప్రవిశ్య=ప్రవేశించి), ధర్మసిద్ధిః=బౌద్ధధర్మసిద్ధి, శ్రావకాణాం=శిష్యులకు, భవతు=కలుగుగాక.

భాగు:

(అవలోక్య స్వగతమ్) అయే! రాక్షసస్య మిత్రం జీవసిద్ధిః! (ప్రకాశమ్) న ఖలు రాక్షసస్య ప్రయోజన మేవ కిఞ్చి దుద్దిశ్య గమ్యతే?

అర్థం:

(అవలోక్య=చూసి, స్వగతమ్=తనలో) అయే!=ఓహో, రాక్షసస్య+మిత్రం+జీవసిద్ధిః=రాక్షసమంత్రి స్నేహితుడు జీవసిద్ధి! (ప్రకాశమ్=పైకి), రాక్షసస్య=రాక్షసుని (యొక్క) ప్రయోజనం+ఏవ+కిఞ్చిత్+ఉద్దిశ్య=ఏ కొంతనో ప్రయోజనం కోసం, గమ్యతే+న+ఖలు=వెళ్ళడం సంభవించడం లేదు కద?

క్షపణక:

సన్తం పావం. సస్తం పావం। సావగా, తదిం గమిస్సం జహిం రక్ఖసస్స ణామం వి ణ సుణీ అది. (శాన్తం పాపం శాన్తం పాపమ్. శ్రావక, తత్ర గమిష్యామి యత్ర రాక్షసస్య నా మాపి న శ్రూయతే.)

అర్థం:

శాన్తం+పాపం, శాన్తం+ పాపమ్=పాపం శమించుగాక. శ్రావక=శిష్యా, యత్ర=ఎక్కడైతే, రాక్షసస్య+నామ+అపి=రాక్షసుడి పేరు సైతం, న+శ్రూయతే=వినబడదో, తత్ర+గమిష్యామి=అక్కడకు వెడుతున్నాను (వెడతాను).

భాగు:

బలవాన్ సుహృది ప్రణయకోపః! తత్కి మపరాద్ధం రాక్షసేన భదన్తస్య?

అర్థం:

సుహృది=(తమ) మనస్సులో, ప్రణయ+కోపః+బలవాన్=(రాక్షసునిపై) ప్రేమతో కూడిన కోపం బలంగా ఉన్నట్లుందే!, తత్+కిమ్+భదన్తస్య+రాక్షసేన+అపరాద్ధం=ఐతే, స్వామివారి పట్ల రాక్షసుడు చేసిన (చేయబడిన) అపరాధం ఏమిటో!

క్షపణక:

సావగా, ణ మను కింవి రక్ఖసేణ అవరద్ధం, సఅం జెవ్వ హదాసో మందభాఓ అత్తణో కమ్మేసు లజ్జే. (శ్రావక, న మే కిమపి రాక్షసే నాపరాద్ధమ్, స్వయ మేవ హతాశో మన్దభాగ్య ఆత్మనః కర్మసు లజ్జే.)

అర్థం:

శ్రావక=శిష్యా, మే=నాయందు, రాక్షసేన=రాక్షసుడి చేత, న+కిమ్+అపి+అపరాద్ధమ్=ఏ విధమైన అపరాధం (చేయబడ) లేదు, హతాశః+మన్దభాగ్యః=నిరాశతో, దురదృష్టవంతుడిని కావడం వల్ల, స్వయమ్+ఏవ=నాకు నేనే, ఆత్మనః+కర్మసు=నేను చేసిన పనులయందు, లజ్జే=సిగ్గుపడుతున్నాను.

భాగు:

భదన్త, వర్ధయసి మే కుతూహలమ్। శ్రోతు మిచ్ఛామి।

అర్థం:

భదన్త=స్వామీ, మే+కుతూహలమ్+వర్ధయసి=నా ఉత్సుకతను పెంచుతున్నావు, శ్రోతుం+ఇచ్ఛామి=(అదేమిటో) వినగోరుతున్నాను.

మలయ:

(స్వగతమ్) అహమపి శ్రోతు మిచ్ఛామి.

అర్థం:

(స్వగతమ్=తనలో), అహం+అపి=నేను కూడా, శ్రోతుం+ఇచ్ఛామి=వినాలనుకుంటున్నాను.

క్షపణక:

సావగా, కిం అణేణ అసుణిదవ్వేణ సుదేణ? (శ్రావక, కి మనే నా శ్రోతవ్యేన శ్రుతేన?)

అర్థం:

శ్రావక=శిష్యా, అనేన=ఈ, అశ్రోతవ్యేన=వినరానిదానిని, శ్రుతేన=వినడం చేత, కిం=ప్రయోజనం ఏముంది?

భాగు:

యది రహస్యం తత్తిష్ఠతు.

అర్థం:

యది+రహస్యం=రహస్యం అయే మాటుంటే, తత్+తిష్ఠతు=అలాగే ఉండనియ్యి.

క్షపణక:

ణ రహస్సం; కిం దు అదిణి సంసం. (న రహస్యమ్, కిం త్వతినృశంసమ్.)

అర్థం:

న+రహస్యమ్=రహస్యం ఏమీ లేదు, కింతు=అయితే, అతి+నృశంసమ్=మిక్కిలి క్రూరమైంది.

భాగు:

యది న రహస్యమ్, తత్ కథ్యతామ్.

అర్థం:

యది+న+రహస్యమ్=రహస్యం కాకపోతే, తత్+కథ్యతామ్=అదేమిటో చెప్పవచ్చు.

క్షపణక:

సావగా, ణ రహస్యం ఏదం. తహ విణ కహిస్సం. (శ్రావక, న రహస్య మేతత్. తథాఽపి న కథ యిష్యామి.)

అర్థం:

శ్రావక=శిష్యా,  ఏతత్+న+రహస్యం=ఇది రహస్యం కాదు (నిజమే); తథా+అపి=అయినప్పటికీ, న+కథయిష్యామి=చెప్పను.

భాగు:

అహ మపి ముద్రాం న దాస్యామి.

అర్థం:

అహం+అపి=అయితే నేను కూడా, ముద్రాం+న+దాస్యామి=అనుమతి ముద్రను ఇవ్వను.

క్షపణక:

(స్వగతమ్) యుక్త మిదానీ మర్థీనే కథయి తుమ్. (ప్రకాశమ్) కా గఈ. సుణాదు సావగో. అత్థి దావ అహం మందభగ్గో పుఢమం పాడలిఉత్తే అహిణివసమాణో లక్ఖసేణ మిత్తత్తణం ఉవగదే. తహిం అవసలే లక్ఖసేపు గూఢం విసకణ్ణఆ పఓఅం ఉప్పాదిఅ మాదిదే పవ్వదీసలే.

(కాగతిః? శృణోతు శ్రావకః. అస్తి తావ దహం మన్దభాగ్యః ప్రథమం పాటలిపుత్రే అధినివసన్ రాక్షసేన మిత్రత్వ ముపగతః. తస్మిన్నవసరే రాక్షసేన గూఢం విషకన్యకాప్రయోగ ముత్పాద్య ఘాతితః పర్వతేశ్వరః).

అర్థం:

(స్వగతమ్=తనలో), ఇదానీం=ఇప్పుడు, అర్థీనే=(ఈ సంగతి వినాలని) కోరేవారికి,

కథయితుమ్+యుక్తమ్=చెప్పడం తగినదే. (ప్రకాశమ్=పైకి), కా+గతిః=ఏమిటి దారి? శ్రావకః+శృణోతు=శిష్యుడు వినుగాక. అహం+మన్దభాగ్యః=దురదృష్టవంతుడినైన నేను, అస్తి+తావత్+పాటలిపుత్రే+అధినివసన్=పాటలీపుత్రంలో ఉంటూ, రాక్షసేన=రాక్షసమంత్రితో, మిత్రత్వం+ఉపగతః=స్నేహం సంపాదించాను (మిత్రత్వం పొందాను). తస్మిన్+అవసరే=ఆ సమయంలో, గూఢం+విషకన్యకాప్రయోగం+ఉత్పాద్యం=రహస్యంగా విషకన్యను ప్రయోగించడం చేసి, పర్వతేశ్వరః=పర్వతరాజు, రాక్షసేన+ఘాతితః =రాక్షసుని చేత చంపబడ్డాడు (రాక్షసుడు చంపించాడు).

మలయ:

(సబాష్ప మాత్మగతమ్) కథం! రాక్షసేన ఘాతిత స్తాతో, న చాణక్యేన!

అర్థం:

(స+బాష్పమ్=కన్నీటితో, ఆత్మగతమ్=తనలో) కథం=ఎలాగెలాగ! తాతః+రాక్షసేన+ఘాతితః=నాన్న రాక్షసుడి చేత చంపబడ్డాడా?, న+చాణక్యేన=చాణక్యుడి చేత కాదా!

వ్యాఖ్య:

ఇక్కడ చదువరులు గ్రహించవలసిన విషయం ఒకటున్నది. భాగురాయణుడు, క్షపణకుడు చేసే సంభాషణను మలయకేతువు, ప్రతీహారి విజయను కదలకుండా ఉండమని చెప్పి, చనువుతో, భాగురాయణుడి కళ్ళు వెనుక చాటుగా మూద్దామనుకున్నాడు కాని, వారిద్దరి మధ్య నడిచే సంభాషణ కుతూహలం కలిగించగా – ఇప్పుడు ‘పక్కవాటుగా’ వింటూ స్పందిస్తున్నాడు.

భాగు:

భదన్త, తతస్తతః…

అర్థం:

భదన్త=స్వామీ, తతః+తతః= ఆ తర్వాత? (ఏమైంది?)…

క్షపణక:

తదో హగే లక్ఖసస్స మిత్తం త్తి కదుఅ, చాణక్క హదఏణ సణికాలం ణఅరాదో ణివ్వాసిదో, దాణీం వి లక్ఖసేణ అనేఅలా అకజ్జకుసలేణ కిం పి తాలిసం ఆలహీఅది, జేణ హగే జీఅలోఅదో ణిక్కాసిజ్జేమి.

(తతో ఽహం రాక్షసస్య మిత్రమితి కృత్వా చాణక్యహతకేన సనికారం నగరా ర్నిర్వాసితః. ఇదానీ మపి రాక్షసే నానేక రాజ కార్యకుశలేన కిమపి తాదృశ మారభ్యతే, యే నాహం జీవలోకా న్నిష్కాసిష్యే.)

అర్థం:

తతః+అహం=ఆ మీదట నేను, రాక్షసస్య+మిత్రం+ఇతి+కృత్వా=రాక్షసమంత్రికి స్నేహితుడిగా చేసి (భావించి), చాణక్య+హతకేన=చాణక్య గాడి చేత, స+నికారం=అనాదర పూర్వకంగా, నగరాత్=పాటలీపుత్రం నుంచి, నిర్వాసితః=బయటకు గెంటివేయబడ్డాను. ఇదానీం+అపి=ఇప్పుడు కూడా, రాజకార్యకుశలేన+రాక్షసేన=రాచకార్యాలు నిర్వహించడంలో మెళకువలెరిగిన రాక్షస మంత్రి చే, కిం+అపి+తాదృశమ్+ఆరభ్యతే=అటువంటిదేదో ప్రారంభింపబడుతున్నది, యేన=అది ఎటువంటిదంటే, అహం=నేను, జీవలోకాత్=ఈ ప్రపంచం నుండి, నిష్కాసిష్యే=వెళ్ళగొట్టబడతాను.(నన్ను కూడా రాక్షసమంత్రి ఈ లోకం నుంచి సాగనంపాలనుకుంటున్నాడు).

భాగు:

భదన్త, ప్రతి శ్రుత రాజ్యార్ధ మయచ్చతా చాణక్యహతకే నేద మకార్య మనుష్ఠితమ్, న రాక్షసే నేతి శ్రుత మస్మాభిః।

అర్థం:

భదన్త=స్వామీ, ప్రతిశ్రుత+రాజ్యార్ధం=మాట ఇచ్చిన అర్ధ రాజ్యాన్ని, అయచ్చతా=ఇవ్వదలచని, చాణక్య+హతకేన=చాణక్యగాడి చేత, ఇదం+అకార్యం+అనుష్ఠితమ్= ఈ కాని పని చెయ్యడం జరిగింది, న+రాక్షసేన+ఇతి=రాక్షసుడి చేత కాదు – అని – అస్మాభిః+శ్రుతం=మా చెవిన పడిన విషయం.

క్షపణక:

(కర్ణౌ పిధాయ) సన్తం పావం. చాణక్కేణ విసకణ్ణాఏ ణామంపి ణ సుదం। (శాన్తం పాపమ్, చాణక్యేన విషకన్యాయా నామాపి న శ్రుతమ్.)

అర్థం:

(కర్ణౌ+పిధాయ=చెవులు మూసుకుని), శాన్తం+పాపమ్=పాపం శమించుగాక!, విషకన్యాయా+నామ+అపి=విషకన్య అనే పేరును కూడా, చాణక్యేన+న+శ్రుతమ్=చాణక్యుడు విననుకూడా లేదు.(అతడి చెవికి చేరలేదు).

భాగు:

ముద్రా దీయతే, ఏహి, కుమారం శ్రావయ.

అర్థం:

ముద్రా+దీయతే=అనుమతి ముద్ర ఇవ్వడం జరుగుతుంది, ఏహి=వెళ్ళు, కుమారం+శ్రావయ=కుమార మలయకేతుడికి వినిపించు.

మలయ:

(ఉపసృత్య)

శ్లోకం:

శ్రుతం సఖే శ్రవణ విదారణం వచః

సుహృన్ముఖా ద్రిపుమధికృత్య భాషితమ్,

పిత్రు ర్వధవ్యసన మిదం హి యేన మే

చిరాదపి ద్విగుణ మి వాద్య వర్ధతే. (6)

అర్థం:

(ఉపసృత్య=సమీపించి),  రిపుం+అధికృత్య=శత్రువుకు సంబంధించి, సుహృత్+ముఖాత్=మిత్రుని నోటి నుంచి, భాషితమ్=పలబడిన, యేన=దేని చేత – ఇదం+హి=ఇదిగో ఈ,  పితృః+వధ+వ్యసనం=నాన్నను చంపినారన్న దుఃఖం, మే=నాకు, చిరాత్+అపి=చాలా కాలమైనా, అద్య=ఇప్పుడు, ద్విగుణం+ఇవ=రెట్టింపు మాదిరి, వర్ధతే=పెరుగుతోంది. సఖే=మిత్రమా! శ్రవణ+విదారణం+వచః=చెవులను చీల్చివేసే పలుకు, శ్రుతం=వినడమైనది.

వృత్తం:

రుచిరావృత్తం. – జ – భ – స – జ – గ – గణాలు.

అలంకారం:

ఉత్ప్రేక్ష (సంభావనాస్యాదుత్ప్రేక్షౌ వస్తుహేతు ఫలాత్మనా – అని కువలయానందం).

ఇక్కడ మలయకేతుడి కోపం రెట్టింపు కావడానికి కారణం చెప్పడం వల్ల హేతూత్ప్రేక్ష.

క్షపణక:

(స్వగతమ్) అయే! శ్రుతం మలయ కేతుహతకేన. హన్త, కృతార్థోఽస్మి, (ఇతి నిష్క్రాన్తః)

అర్థం:

(స్వగతమ్=తనలో), అయే=ఆహా!, మలయకేతు+హతకేన+శ్రుతం=మలయకేతుగాడు వినడమైనది. హన్త=భళీ, కృతార్థః+అస్మి=నా పని పూర్తయ్యింది. (ఇతి=అని, నిష్క్రాన్తః=వెళ్ళాడు).

మలయ:

(ప్రత్యక్షవ దాకాశే లక్ష్యం బధ్వా) రాక్షస రాక్షస, యుక్తం యుక్తమ్?

శ్లోకం:

మిత్రం మమేద మితి నిర్వృత్త చిత్త వృత్తిం,

విశ్రమ్భత స్త్వయి నివేశిత సర్వ కార్యమ్

తాతం నిపాత్య సహ బన్ధుజనాశ్రుతోయై

రన్వర్థతో ఽపి నను రాక్షస రాక్షసోఽసి. (7)

అర్థం:

(ప్రత్యక్షవత్=ఎదుట ఉన్నట్టుగా (రాక్షసుని ఉద్దేశించి), ఆకాశే+లక్ష్యం+బధ్వా=ఆకాశంలో దృష్టి నిలిపి), రాక్షస- రాక్షస= ఒయ్యోయి రాక్షసుడా, రాక్షసుడా, యుక్తం+యుక్తమ్=ఇది తగిన పనేనా?

ఇదం+మమ+మిత్రం+ఇతి=ఇతడు నాకు స్నేహితుడు అని (నమ్మి), నిర్వృత్త+చిత్తవృత్తిం=నిశ్చింతగా ఉన్నవాడు, విశ్రమ్భతః=విశ్వాసంతో, త్వయి=నీ యందు, నివేశిత+సర్వకార్యమ్=అన్ని పనులను పెట్టినవాడిని అయిన, తాతం=నా తండ్రిని, బన్ధుజన+అశ్రుతోయైః=చుట్టపక్కాలందరి కన్నీళ్ళతో, సహ+నిపాత్య=పడవేసి, అన్వర్థతః= (నీ) పేరుకి తగినట్టుగానే, రాక్షసః+అసి=రాక్షసుడివే అయినావు.

వృత్తం:

వసంత తిలక – త- భ – జ – జ – గ గ – గణాలు.

అలంకారం:

సహోక్తి. (సహోక్తిః సహభావశ్చేత్ భాసతే జనరఞ్జకః – అని కువలయానందం).

సహ బన్ధుజనాశ్రుతోయై తాతం నిపాత్య – అని చుట్టపక్కాల కన్నీళ్ళతో సహా నా తండ్రిని పడజేశావు కదయ్యా – అని సామ్యం చెప్పడం కారణం. –

‘సమర్థనీయ స్యార్థస్య కావ్యలిఙ్గం సమర్థనమ్’ అనే అలంకార ప్రమాణాన్ని స్వీకరించి – “రాక్షసుడనే పేరును సార్థకం చేసుకోవడం” కారణంగా చూపి కావ్యలిఙ్గం అలంకారమని – శ్రీరామదాసయ్యంగారు.

భాగు:

(స్వగతమ్) రక్షణీయా రాక్షసస్య ప్రాణా ఇ త్యార్యా దేశః। భవత్వేవం తావత్ – (ప్రకాశమ్) కుమార, అల మావేగేన, ఆసనస్థం కుమారం కిఞ్చి ద్విజ్ఞాపయితు మిచ్ఛామి।

అర్థం:

(స్వగతమ్=తనలో), రాక్షసస్య+ప్రాణాః=రాక్షసమంత్రి ప్రాణాలు, రక్షణీయాః=కాపాడవలసి వుంది, ఇతి=అని, ఆర్య+ఆదేశః= ఆర్య (చాణక్యుని) ఆజ్ఞ, తావత్=అందుచేత, ఏవం+భవతు= అలాగే జరుగు గాక! – (ప్రకాశమ్=పైకి), కుమార=రాకుమారా!, ఆవేగేన+అలం=ఆందోళన వద్దు, ఆసనస్థం+కుమారం=రాకుమారుడు పీఠం మీద కూర్చున్నాకా, కిఞ్చిత్+విజ్ఞాపయితుం=కొంచెం మనవి చేయాలని, ఇచ్ఛామి=కోరుకుంటున్నాను.

మలయ:

(ఉపవిశ్య) సఖే, కి మపి వక్తు కామః?

అర్థం:

(ఉపవిశ్య=కూర్చుని), సఖే=మిత్రమా, కిమ్+అపి+వక్తుకామః=ఏమైనా చెప్పాలనుకుంటున్నావా?

భాగు:

కుమార, ఇహ ఖ ల్వర్థ శాస్త్ర వ్యవహారిణా మర్థవశా దరిమిత్రో దాసీనవ్యవస్థా, న లౌకికానా మివ స్వేచ్ఛావశాత్, యత స్తస్మి న్కా లే సర్వార్థసిద్ధిం రాజాన మిచ్ఛతో రాక్షసస్య, చన్ద్రగుప్తా దపి బలీయస్తయా సుగృహీత నామా దేవః పర్వతేశ్వర ఏ వార్థ పరిపన్థీ మహా నరాతి రాసీత్, తస్మింశ్చ రాక్షసే నేద మనుష్ఠిత మితి నాస్తి దోష ఏ వా త్రేతి పశ్యామి। పశ్యతు కుమారః…

అర్థం:

కుమార=రాకుమారా! ఇహ+ఖలు=ఇప్పుడైతే, అర్థశాస్త్ర+వ్యవహారిణాం=రాజనీతిశాస్త్ర సందర్భాన్ని బట్టి, అర్థవశాత్=ఉన్న భావం ప్రకారం, అరి+మిత్ర+ఉదాసీన+వ్యవస్థా=శత్రువు, మిత్రుడు, ఉదాసీనుడు అనే నిబంధన, లౌకికానాం+ఇవ=(ఇతర) ప్రపంచజనం వలె, న+స్వేచ్ఛావశాత్=వారి ఇష్టప్రకారం ఉండదు, యతః=కారణం ఏమంటే, తస్మిన్+కాలే=ఆ వేళకి, సర్వార్థసిద్ధిం=నందరాజైన సర్వార్థసిద్ధిని, రాజానం+ఇచ్ఛతః=రాజుగా కోరుకున్న,  రాక్షసస్య=రాక్షసమంత్రికి, చన్ద్రగుప్తాత్+అపి=చంద్రగుప్తుడి కంటే కూడా, బలీయస్తయా=ప్రబలంగా, సుగృహీతనామా+దేవః+పర్వతేశ్వరః+ఏవ=విఖ్యాతి వహించిన పర్వతేశ్వర ప్రభువే, అర్ధ+పరిపన్థీ=సగపాలు శత్రువై, మహాన్+అరాతిః+ఆసీత్=గొప్ప ప్రతిస్పర్థి అయ్యాడు, తస్మిన్+చ=అట్టివాని యందు కూడా (అంతటి వ్యక్తి విషయంలో కూడా), ఇదం+అనుష్ఠితం=ఇది (విషకన్యా ప్రయోగం) జరిగింది – ఇతి=అనేది, అత్ర+దోష+నాస్తి+ఏవ=ఇక్కడ దోషమేమీ కాదనే (భావం), పశ్యామి=చూడగలుగుతున్నాను. కుమారః+పశ్యతు= రాకుమారుడు (ఇలాగ) చూడాలి.

శ్లోకం:

మిత్రాణి శత్రుత్వ ముపానయన్తీ,

మిత్రత్వ మర్థస్య వశాచ్చ శత్రూన్

నీతి ర్నయ త్యస్మృతపూర్వవృత్తం

జన్మాన్తరం జీవత ఏవ పుంసః. (8)

అర్థం:

అర్థస్య+వశాత్=ఉద్దిష్ట ప్రయోజనాన్ని పురస్కరించుకుని, నీతి=రాజనీతి (వ్యూహం), మిత్రాణి=స్నేహితులను, శత్రుత్వం=వైరము వహించడం, ఉపానయన్తీ=పొందుపడేలాగ చేస్తూ,- శత్రూన్=శత్రువులను, మిత్రత్వం=స్నేహితులు కావడాన్ని (ఉపానయన్తీ=పొందుపడ చేస్తూ), పుంసః=వ్యక్తికి, జీవితః+ఏవ=జీవించి ఉండగానే, అస్మృత+పూర్వవృత్తమ్=జ్ఞప్తికి రాని పూర్వజన్మ విధంగా, జీవతః+ఏవ=ఈ జన్మలోనే, జన్మాంతరమ్=మరొక జన్మను, నయతి=పొందేలాగ చేస్తుంది.

వృత్తం:

ఇంద్రవజ్ర – త – త – జ – గ గ – గణాలు.

అలంకారం:

పర్యాయోక్తి. (పర్యాయోక్తంతు గమ్యస్య వచో భంగ్యన్తరాశ్రయమ్ – అని కువలయానందం). ఇక్కడ ఒకే చోట శత్రుత్వ మిత్రత్వాల ఆశ్రయం గురించి భంగ్యంతరంగా – రాక్షస మంత్రికి అన్వయిస్తూ చెప్పడం కారణం.

వ్యాఖ్య:

ఇక్కడ భాగురాయణుడు యీ లోకంలో రాజనీతికీ, లౌకిక నీతికీ తేడా నిరూపిస్తున్నాడు. సాధారణ అనుభూతులకు, వ్యక్తుల ఉద్రేకాలకు సంబంధం ఉండదు. రాజనీతి, తత్కాల ప్రయోజనాన్ని బట్టి శత్రుత్వ మిత్రత్వాలను నిర్ణయిస్తుంది. కనుక, అక్కడ జరిగే చర్యలను తటస్థంగానే చూడాలని భాగురాయణుడి బోధ.

ఇంకా ఇలాగ అంటున్నాడు.

త దత్ర వస్తుని నోపాలమ్భనీయో రాక్షసః। ఆనన్దరాజ్యలాభా దుప గ్రాహ్యశ్చ। పరతశ్చ పరిగ్రహే వా పరిత్యాగే – కుమారః ప్రమాణమ్।

అర్థం:

తత్+అత్ర+వస్తుని=అందువల్ల ప్రస్తుత విషయంలో, రాక్షసః+న+ఉపాలమ్భనీయో=రాక్షసమంత్రి నిందించదగినవాడు కాదు. ఆ+నన్దరాజ్య+లాభాత్=నందుని రాజ్యం సంపాదించడం కోసం (అంత వరకు), (రాక్షసః) ఉపగ్రాహ్యః+చ=మన మనిషిగానే ఉంచుకోదగినవాడు. పరతః=ఆ తర్వాత, పరిగ్రహే+పరిత్యాగే+వా=స్వీకరించడమా, విడిచిపెట్టడమా అనే విషయంలో – కుమారః+ప్రమాణమ్=రాకుమారుడిదే నిర్ణయం.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here