ముద్రారాక్షసమ్ – పఞ్చమాఙ్కః – 4

0
9

[box type=’note’ fontsize=’16’] ‘ముద్రారాక్షసం‘ ఏడంకాల రాజకీయ నాటకం. విశాఖదత్తుడు యీ నాటకాన్ని చతుర రాజకీయ వ్యూహాల అల్లికతో, అద్భుతంగా రూపొందించాడు. సంస్కృత సాహిత్యం మొత్తంలో అరుదైన ఈ నాటకాన్ని ఇంద్రగంటి శ్రీకాంతశర్మ గారు అనువదించి, వ్యాఖ్యతో అందిస్తున్నారు. [/box]

ప్రతీ:

(పరిక్రమ్య) అమచ్చ, అఅం కుమారో, ఉపసప్పదు ణం అమచ్చో. (అమాత్య, అయం కుమారః. ఉపసర్ప త్వేన మమాత్యః.)

అర్థం:

(పరిక్రమ్య=ముందుకు నడిచి), అమాత్య=మంత్రివర్యా, అయం+కుమారః=ఇడుగో మలయకేతు రాకుమారుడు. అమాత్యః+ఏనం+ఉపసర్పతు=మంత్రివారు వీనిని సమీపించగలరు.

రాక్షసః:

(విలోక్య) అయం కుమార స్తిష్ఠతి. య ఏష…  

అర్థం:

(విలోక్య=చూసి) యః+ఏషః+అయం+కుమారః+తిష్ఠతి=ఇక్కడ కూర్చున్న రాకుమారుడు ఎలాగున ఉన్నాడంటే…

శ్లోకం:

పాదాగ్రే దృశ మవధాయ నిశ్చలాఙ్గీం

శూన్యత్వా దపరిగృహీత తద్వి శేషామ్

వక్రేన్దుం వహతి కరేణ దుర్వహాణాం

కార్యాణాం కృత మివ గౌరవేణ నమ్రమ్. (13)

అర్థం:

నిశ్చలాఙ్గీం+దృశమ్=కదలిక లేని చూపును, శూన్యత్వాత్=శూన్యం కావడం వల్ల, అపరిగృహీతత్+తత్+విశేషామ్=పట్టించుకోని ఏ విశేషాలూ కలదానిని, పాదాగ్రే+అవధాయ=పాదం కొనపై కేంద్రీకరించి ఉంచి, – దుర్వహాణాం+కార్యాణాం=మోయలేని కార్యభారం (యొక్క), గౌరవేణ=బరువుతో, వక్రేన్దుం=చంద్రునితో పోలిన ముఖాన్ని, నమ్రమ్+ కృతం+ఇవ=వంచడం జరిగిందో అన్నట్టుగా, కరేణ= చేతితో, వహతి=పట్టుకొని ఉన్నాడు.

వృత్తం:

ప్రహర్షిణి. మ – న – జ – ర – గ గణాలు.

అలంకారం:

వక్రేన్దుం కరేణ వహతి – అనే చోట రూపకం. దుర్వహాణాం కార్యణం కృతమివ గౌరవేణ నమ్రమ్- అనే చోట ఉత్ప్రేక్ష. రూపక, ఉత్ప్రేక్షల కలయిక.

రాక్షసః:

(ఉపసృత్య) విజయతాం కుమారః  

అర్థం:

(ఉపసృత్య=సమీపించి) విజయతాం+కుమారః=రాకుమారుడికి జయం!

మలయ:

ఆర్య, అభివాదయే, ఇద మాసన మాస్యతామ్. (రాక్షస స్తథా కరోతి.)   

అర్థం:

ఆర్య=అయ్యా, అభివాదయే=నమస్కరిస్తున్నాను, ఇదం+ఆసనం=ఇదిగో పీఠం, ఆస్యతామ్=కూర్చుందురు. (రాక్షసః=రాక్షసుడు, తథా+కరోతి=అలాగే చేస్తాడు.)

మలయ:

ఆర్య, చిరదర్శనే నార్యస్య వయముద్విగ్నాః   

అర్థం:

ఆర్యస్య+చిరదర్శనేన=అయ్యవారిని చాలా కాలం తరువాత చూడడం చేత, వయం+ఉద్విగ్నాః=మేము ఆందోళనకు గురయ్యాం.

రాక్షసః:

కుమార, ప్రయాణే ప్రతివిధాన మనుతిష్ఠతా మయా కుమారాదయ ముపాలమ్భో ఽధిగతః  

అర్థం:

కుమార=రాకుమారా, ప్రయాణే=దండయాత్రల విషయమైన, ప్రతివిధానం+అనుతిష్ఠతా=వ్యూహనిర్మాణం పనిలో ఉండి, కుమారాత్=రాకుమారుని నుంచి (తమ నుంచి), అయం+ఉపాలమ్భః=యీ వెటకారపు ఎత్తిపొడుపు, అధిగతః=పడవలసివచ్చింది (పొందడం సంభవించింది).

మలయ:

ఆర్య, ప్రయాణే కథం ప్రతివిహితమితి శ్రోతుమిచ్ఛామి।   

అర్థం:

ఆర్య=అయ్యవారూ, ప్రయాణే=దండయాత్రలో, ప్రతివిహితం+కథం+ఇతి=వ్యూహరచన ఎలాగ వుందో, శ్రోతుం+ఇచ్ఛామి=వినగోరుతున్నాను.

 రాక్షసః:

కుమార, ఏవ మాదిష్టా అనుయాయినో రాజానః [ప్రస్థాతవ్యం… (5వ అంకం 11వ శ్లోకం)- ఇతి పూర్వోక్తం పఠతి.]  

అర్థం:

కుమార=రాకుమారా, అనుయాయినః+రాజానః=మనలని అనుసరించి వచ్చే రాజులు, ఏవం+ఆదిష్టాః=ఈ విధంగా ఆదేశించబడ్డారు.  [‘ప్రస్థాతవ్యం… (5వ అంకం 11వ శ్లోకం)- ఇతి=అని, పూర్వ+ఉక్తం=పూర్వం చెప్పబడినదానిని, పఠతి=చదువుతాడు’.]

మలయ:

(స్వగతమ్) కథం! య ఏవ మద్వినా శేన చన్ద్రగుప్త మారాధయితు ముద్యతాస్త ఏవ మాం పరివృణ్వన్తి. (ప్రకాశమ్) ఆర్య, అస్తి కశ్చిద్యః కుసుమపురం ప్రతిగచ్ఛతి. తత ఆగచ్ఛతి వా॥   

అర్థం:

(స్వగతమ్=తనలో) కథం=ఎలాగ! యః+మత్+వినాశేన+ఏవ=ఎవరైతే నేను నాశనం కావడం ద్వారానే, చన్ద్రగుప్తం+ఆరాధయితుం+ఉద్యతాః=చంద్రగుప్తుణ్ణి సేవించడానికి సిద్ధంగా ఉన్నారో, తే+ఏవ=వారే (కౌలూతకాది అయిదుగురు రాజులే), మాం+పరివృణ్వన్తి=నన్ను చుట్టుకుని ఉంటున్నారు. (ప్రకాశమ్=పైకి), ఆర్య=అయ్యవారూ, అస్తి+కశ్చిత్+యః+కుసుమపురం+ప్రతిగచ్ఛతి=ఎవరైనా పాటలీపుత్రానికి వెళ్ళేవారు గాని, తతః=అక్కడి నుంచి, ఆగచ్ఛతి+వా=వచ్చేవారు గాని ఉన్నారా?

రాక్షసః:

అవసిత మిదానీం గతాగత ప్రయోజనమ్. అల్పై రహోభి ర్వయ మేవ తత్ర గన్తారః.  

అర్థం:

ఇదానీం=ప్రస్తుతం, గతాగత+ప్రయోజనమ్=రాకపోకల అవసరం, అవసితం=తీరిపోయింది. అల్పైః+అహోభిః=కొన్నినాళ్ళలో, వయం+ఏవ=మనమే, తత్ర+గన్తారః=అక్కడకు వెళ్ళగలం.

మలయ:

(స్వగతమ్) విజ్ఞాయతే, (ప్రకాశమ్) య ద్యేవం, తతః కి మార్యే ణాయం సలేఖః పురుషః ప్రేషితః?   

అర్థం:

(స్వగతమ్=తనలో) విజ్ఞాయతే=తెలుస్తోందిలే, (ప్రకాశమ్=పైకి) యది+ఏవం=అలా అయే మాటుంటే, తతః+కిమ్+ఆర్యేణ+అయం+సలేఖః+పురుషః+ప్రేషితః=మరి యీ లేఖతో సహా యీ వ్యక్తి ఎందుకు పంపబడినట్టో?

రాక్షసః:

(విలోక్య) అయే సిద్ధార్థకః! భద్ర కి మిదమ్?  

అర్థం:

(విలోక్య=చూసి), అయే=అరే, సిద్ధార్థకః=సిద్ధార్థకుడు! భద్ర=నాయనా, కిమ్+ఇదమ్=ఇదేమిటి?

సిద్ధార్థ:

(సబాష్పం లజ్జాం నాటయన్) ప్రసీదతు అమచ్చో తాడీఅంతణ మఏ ణ పారిదం రహస్యం ధారిదుం. (ప్రసీద త్వమాత్యః. తాడ్యమానేన మయా న పారితం రహస్యం ధారయితుమ్.)  

అర్థం:

(సబాష్పం=కన్నీటితో, లజ్జాం+నాటయన్=సిగ్గును అభినయిస్తూ), అమాత్య+ప్రసీదతు=మంత్రివారు మన్నించాలి. తాడ్యమానేన+మయా=దెబ్బలు తింటున్న నేను (నా చేత), రహస్యం+ధారయితుమ్=రహస్యాన్ని దాచడానికి, న+పారితం=నిలుపలేకపోయాను (ఆపుకొనబడలేదు) (సాధ్యం కాలేదు).

రాక్షసః:

భద్ర, కీదృశం రహస్య మితి? నఖల్వవగచ్ఛామి.  

అర్థం:

భద్ర=నాయనా, రహస్యం+ఇతి+కీదృశం=రహస్యం ఏమిటది? న+అవగచ్ఛామి+ఖలు=నాకేమీ అర్థం కావడం లేదు.

సిద్ధార్థ:

ణం విణ్ణవేమి తాడీఅం తేణ మఏ…‘ (ఇత్యర్థోకే సభయ మధోముఖ స్తిష్ఠతి) [నను విజ్ఞాపయామి. తాడ్యమానేన మయా]  

అర్థం:

(నను+విజ్ఞాపయామి=నేను మనవి చేశాను). తాడ్యమానేన+మయా=దెబ్బలు తింటున్న నా చేత… (ఇతి+అర్థోకే+సభయం=అంటూ సగం వాక్యం పలికి భయంతో, అధోముఖః+తిష్ఠతి=తల వంచుకు నిలిచాడు).

మలయ:

భాగురాయణ, స్వామినః పురస్తా ద్భీతో లజ్జితో వా నైష కథయిష్యతి. స్వయ మేవ ఆర్యస్య కథయ.   

అర్థం:

భాగురాయణా, స్వామినః+పురస్తాత్=అయ్యవారి ఎదుట, భీతో+లజ్జితః+వా=భయంతోనో, సిగ్గుతోనో, ఏషః=వీడు, న+కథయిష్యతి=చెప్పబోడు. ఆర్యస్య=అయ్యవారికి, స్వయం+ఏవ+కథయ=నువ్వే చెప్పు.

భాగు:

యదాజ్ఞాపయతి కుమారః। అమాత్య, ఏష కథయతి యథా- అహ మమా త్యేన లేఖం దత్వా వాచికం సన్దిశ్య చన్ద్రగుప్తసకాశం ప్రేషితః – ఇతి.  

అర్థం:

కుమారః+యత్+ఆజ్ఞాపయతి=రాకుమారుడు ఆదేశించినట్లే (చేస్తాను). అమాత్య=మంత్రివర్యా, ఏషః+యథా+కథయతి=ఇతడు చెప్పేదేమంటే – అహం=నేను, అమాత్యేన=మంత్రివారి చేత, లేఖం+దత్వా=ఉత్తరం ఇవ్వబడి, వాచికం+సన్దిశ్య=నోటిమాటగా సందేశం చెప్పి, చన్ద్రగుప్త+సకాశం+ప్రేషితః=చంద్రగుప్తుడి సన్నిధికి పంపబడ్డాను – ఇతి=అని.

రాక్షసః:

భద్ర సిద్ధార్థక. అపి సత్యమ్?  

అర్థం:

భద్ర=నాయనా, సిద్ధార్థకా. అపి+సత్యమ్=నిజమేనా?

సిద్ధార్థ:

(లజ్జాం నాటయన్) ఏవం అతితాడిఅం తేన మఏ ణి వేదిదం. (ఏవం అతితాడ్యమా నేన మయా నివేదితమ్.)  

అర్థం:

(లజ్జాం+నాటయన్=సిగ్గునభినయిస్తూ), అతితాడ్యమానేన+మయా=బాగా కొట్టబడుతున్న నా చేత (నేను), ఏవం+నివేదితమ్=అలాగ విన్నవించాను (విన్నవించబడింది).

రాక్షసః:

అనృత మేతత్. తాడ్యమానః పురుషః కిమివ న బ్రూయాత్?  

అర్థం:

ఏతత్+అనృతం=ఇది అబద్ధం. తాడ్యమానః+పురుషః=తన్నులు తినే మనిషి, కిమ్+ఇవ+న+బ్రూయాత్=ఏమని చెప్పడూ?

మలయ:

సఖే, భాగురాయణ, దర్శయ లేఖమ్ వాచిక మేష భృత్యః కథయిష్యతి.   

అర్థం:

సఖే=మిత్రమా, భాగురాయణా, లేఖమ్+దర్శయ=ఉత్తరం చూపించు, వాచికం=నోటిమాటా సందేశాన్ని, ఏషః+భృత్యః=ఈ సేవకుడు, కథయిష్యతి=చెప్పగలడు.

భాగు:

అమాత్య, అయం లేఖః.  

అర్థం:

అమాత్య=మంత్రివర్యా, అయం+లేఖః=ఇదిగో ఉత్తరం.

రాక్షసః:

(వాచయిత్వా) కుమార, శత్రో ప్రయోగ ఏషః.  

అర్థం:

(వాచయిత్వా=చదివి) కుమార=రాకుమారా, ఏషః=ఇది, శత్రోః+ప్రయోగ=మన విరోధి చేసిన ప్రయోగం.

మలయ:

లేఖ స్యాశూన్యార్థ మార్యేణేద మప్యాభరణ మను ప్రేషితమ్. తత్కథం శత్రోః ప్రయోగ ఏషః?   

అర్థం:

లేఖస్య+అశూన్యార్థం=ఉత్తరంతో పాటు కానుకగా ఇవ్వడం కోసం, ఆర్యేణ=అయ్యవారి చేత, ఇదం+అభరణం+అపి=ఈ నగ కూడా, అనుప్రేషితమ్=తోడుగా పంపడమైంది. తత్+ఏషః+శత్రోః+ప్రయోగః+కథం=అటువంటప్పుడు ఇది శత్రువు ప్రయోగం ఎలాగ అవుతుంది?

రాక్షసః:

(ఆభరణం నిర్వర్ణ్య) కుమారే ణైత న్మహ్య మనుప్రేషితమ్. మయా ప్యేతత్ కస్మింశ్చి త్పరితోషస్థానే సిద్ధార్థకాయ దత్తమ్.  

అర్థం:

(ఆభరణం+నిర్వర్ణ్య=నగను పరీక్షగా చూసి) కుమారేణ=రాకుమారుని చేత, ఏతత్=ఇది, మహ్యం+అనుప్రేషితమ్=నా కోసం పంపబడింది. ఏతత్=ఇది, కస్మింశ్చిత్+పరితోషస్థానే=ఒకానొక సంతోష సందర్భంలో, సిద్ధార్థకాయ+దత్తమ్=సిద్ధార్థకునికి ఇచ్చాను (ఇవ్వబడింది).

భాగు:

ఈదృశస్య విశేషతః కుమారేణాత్మగాత్రా దవతార్య ప్రసాదీకృత స్యేయం పరిత్యాగభూమిః!  

అర్థం:

విశేషతః=విశేషించి (ప్రత్యేకించి), కుమారేణ+ఆత్మగాత్రాత్+అవతార్య=రాకుమారుడు (ని చేత) తన శరీరం మీద నుంచి తీసి, ప్రసాదీకృతస్య=అనుగ్రహించిన (అనుగ్రహింపబడిన), ఇయం=ఈ నగ, పరిత్యాగభూమిః!=ఇచ్చివేయదగినదా (పాత్రమైనదా?)

మలయ:

వాచికమ ప్యార్యే ణాస్మా చ్ఛ్రోతవ్యమితి లిఖితమ్.   

అర్థం:

వాచికం+అపి=నోటిమాటగా కూడా, అస్మాత్=వీని నుంచి, శ్రోతవ్యం+ఇతి+లిఖితమ్=వినవలసినదని (ఉత్తరములో) ఉన్నది (వ్రాయబడినది).

రాక్షసః:

కుతో వాచికమ్? కస్య వాచికమ్? లేఖ ఏవ అస్మదీయో న భవతి.  

అర్థం:

కుతః+వాచికమ్=నోటిమాట ఎక్కడ? కస్య+వాచికమ్=ఎవరికి నోటిమాట? లేఖ+ఏవ=ఈ ఉత్తరమే, అస్మదీయః+న+భవతి=మాది కాదు.

మలయ:

ఇయం తర్హి కస్య ముద్రా?   

అర్థం:

తర్హి=అయే మాటుంటే, ఇయం+ముద్రా+కస్య=ఈ (లేఖపై) ముద్ర ఎవరిది?

రాక్షసః:

కపటముద్రా ముత్పాదయితుం శక్నువన్తి ధూర్తాః.  

అర్థం:

కపటముద్రాం+ఉత్పాదయితుం=దొంగ ముద్రను పుట్టించడంలో, ధూర్తాః=మోసకారులు,  శక్నువన్తి=సమర్థులు.

భాగు:

కుమార, సమ్య గమాత్యో విజ్ఞాపయతి. భద్ర సిద్ధార్థక. కే నాయం లిఖితో లేఖః?

అర్థం:

కుమార=రాకుమరా!, అమాత్యః=మంత్రివర్యుడు, సమ్యక్+విజ్ఞాపయతి=చక్కగా మనవి చేశాడు. భద్ర=నాయనా, (సిద్ధార్థక). అయం+లేఖః=ఈ ఉత్తరం, కేన+లిఖితః=ఎవడు వ్రాసాడు? (ఎవని చేత వ్రాయబడింది?)

(సిద్ధార్థకో రాక్షసముఖ మవలోక్య తూష్ణీం అధోముఖ స్తిష్ఠతి.)   

(సిద్ధార్థకః సిద్ధార్థకుడు, రాక్షసముఖం+అవలోక్య=రాక్షసుడి వైపు చూసి (అతడి ముఖంలోకి చూసి) తూష్ణీం=మాట్లాడకుండా (మౌనంగా), అధోముఖః+తిష్ఠతి=తలవంచుకుని ఉన్నాడు).

భాగు:

భద్ర, అలం పునరాత్మానం తాడయితుమ్। కథయ.

అర్థం:

భద్ర=నాయనా, పునః+ఆత్మానం+తాడయితుమ్+అలం=మళ్ళీ నువ్వు (నిన్ను) తన్నులు తినడం చాలు (తన్నడం చాలు). కథయ=చెప్పు.

సిద్ధార్థ:

అజ్జ, సఅడదా సేణ. (ఆర్య, శకటదాసేన).  

అర్థం:

ఆర్య=అయ్యా, శకటదాసేన(లిఖితమ్)=శకటదాసు వ్రాశాడు (వ్రాయబడింది).

రాక్షసః:

కుమార, యది శకటదాసేన లిఖిత స్తతో మయైవ  

అర్థం:

కుమార=రాకుమారా, యది+శకటదాసేన+లిఖితః=శకటదాసే గనక వ్రాసినదైతే, మయా+ఏవ=నేను వ్రాసినట్టే.

మలయ:

విజయే, శకటదాసం ద్రష్టు మిచ్ఛామి!   

అర్థం:

విజయే=విజయా (ప్రతీహారీ), శకటదాసం+ద్రష్టుం+ఇచ్ఛామి=శకటదాసును చూడగోరుతున్నాను.

ప్రతీ:

జం కుమారో ఆణవేది. (యత్కుమార ఆజ్ఞాపయతి.)   

అర్థం:

యత్+కుమారః+ఆజ్ఞాపయతి=రాకుమారుడు ఆదేశించినట్టే (చేస్తాను).

భాగు:

(స్వగతమ్) న ఖల్వ నిశ్చితార్థ మార్య చాణక్యప్రణిధయో ఽభిధాస్యన్తి.

*[ఆగత్య శకటదాసో వా సోఽయం లేఖ ఇతి ప్రత్యభిజ్ఞాయ

పూర్వవృత్తం ప్రకాశయేత్। ఏవం సతి సన్దిహానో మలయకేతు

రస్మిన్ ప్రయోగేశ్లధాదరోభవేత్। భవేత్వేవమ్॥]

(ప్రకాశమ్) కుమార, న క దాచి దపి శకటదాసో ఽమాత్య స్యాగ్రతో మయా లిఖితమితి ప్రతిపత్స్యతే. అతః ప్రతిలిఖిత మప్యానీయతామ్, వర్ణ సంవాద ఏ వైతం విభావయిష్యతి.

అర్థం:

(స్వగతమ్=తనలో), ఆర్య+చాణక్య+ప్రణిధయః=పూజ్య చాణక్యుడి గూఢచారులు, అనిశ్చితార్థ=నిర్ధారించుకోలేని విషయాన్ని, న+అభిధాస్యన్తి+ఖలు=చెప్పరు కదా!

[ఆగత్య శకటదాసః+వా=శకటదాసు వచ్చినప్పటికీ, సం+అయం+లేఖః+ఇతి=అదే యీ ఉత్తరం అని, ప్రత్యభిజ్ఞాయ=గుర్తించి, పూర్వవృత్తం=పాతకథను, ప్రకాశయేత్=బయటపెట్టవచ్చు. ఏవం+సతి=అలాగ జరిగితే, సన్దిహానో+మలయకేతుః=సంశయంలో పడిన మలయకేతువు, అస్మిన్+ప్రయోగే=యీ పన్నకం విషయంలో, శ్లధ+ఆదరః+భవేత్=ఆదరణ తగ్గినవాడు కావచ్చు. ఏవమ్+భవతు=ఇలాగ కానీ].

* ఎన్. సి. చక్రవర్తి వ్యాఖ్య అదనపు పాఠం.

(ప్రకాశమ్=పైకి) కుమార=రాకుమారా, శకటదాసః=శకటదాసు, న+కదాచిత్+అపి=ఎప్పటికీ కూడా, అమాత్యస్య+అగ్రతః=మంత్రివారి ఎదుట, ‘మయా+లిఖితమ్+ఇతి’=’నేను వ్రాశాను’ అని (ఆ ఉత్తరం నేను వ్రాసినదేనని), న+ప్రతిపత్స్యతే=ఒప్పుకోడు. అతః=ఆ కారణం చేత, ప్రతిలిఖితం+అపి= (ఈ ఉత్తరానికి) నకలు మాత్రం, ఆనీయతామ్=తీసుకురావాలి (తెప్పించండి), వర్ణసంవాదః+ఏవ=అక్షరాలను పోలిన మాత్రమే, ఏతం+విభావయిష్యతి=దీనిని నిర్ధారించగలదు.

మలయ:

విజయే, ఏవం క్రియతామ్।   

అర్థం:

విజయే=విజయా, ఏవం+క్రియతామ్=అలాగ చెయ్యి (చేయబడుగాక).

ప్రతీ:

జం కుమారో ఆణవేది. (ఇతి నిష్క్రమ్య, పునః ప్రవిశ్య) కుమార, ఇదం తం సఅడదాసేణ సహత్తలిహిదం పత్తఅం, మద్దావి. [యత్కుమార ఆజ్ఞాపయతి… కుమార, ఇదం త చ్ఛకటదాసేన స్వహస్తలిఖితం పత్రం ముద్రాపి.]   

అర్థం:

యత్+కుమారః+ఆజ్ఞాపయతి=రాకుమారుడు ఆదేశించినట్టే (చేస్తాను) – (ఇతి=అని, నిష్క్రమ్య=వెళ్ళి, పునః+ప్రవిశ్య=తిరిగి వచ్చి), కుమార=రాకుమారా, ఇదం+తత్+శకటదాసేన+స్వహస్తలిఖితం=ఇదిగో శకటదాసు తన చేత్తో వ్రాసిన, పత్రం+ముద్ర+అపి=కాగితమూ, ముద్రా కూడా.

మలయ:

(ఉభయమపి నాట్యేన విలోక్య) ఆర్య, సంవదం త్యనక్షరాణి.   

అర్థం:

(ఉభయం+అపి=రెండిటిని (ఉత్తరాలను) కూడా, నాట్యేన+విలోక్య=నాటకీయంగా చూసి) ఆర్య=అయ్యా, అక్షరాణి+సంవదన్తి=అక్షరాలు పోలి ఉన్నాయి.

రాక్షసః:

(స్వగతమ్) సంవద న్త్యక్షరాణి! శకటదాసస్తు మిత్ర మితి చ న (పా) సంవద న్త్యక్షరాణి. కింను శకటదాసేన, –   

అర్థం:

(స్వగతమ్=తనలో), అక్షరాణి+సంవదన్తి!=అక్షరాలు పోలికా! శకటదాసః+తు=అయితే శకటదాసు, మిత్రం+ఇతి+చ+న=స్నేహితుడు కాదన్న మాట! (పాఠాంతరం…. అక్షరాల పోలికా!  – ఏమిటీ శకటదాసు (చేత) –

శ్లోకం:

స్మృతం స్యా త్పుత్ర దారస్య విస్మృతస్వామిభక్తినా

చలే ష్వర్థేషు లుబ్ధేన న యశః స్వనపాయిషు? (14)

అర్థం:

విస్మృత+స్వామిభక్తినా=స్వామిభక్తి మరిచిపోయినవాడు (చేత), అనపాయిషు+యశఃసు+న=నాశనం లేని కీర్తుల విషయమై కాక, చలేషు+అర్థేషు=చంచలమైన సంపదల విషయంలో, లుబ్ధేన=అత్యాశ కలవాని, పుత్ర+దారస్య+స్మృతం+స్యాత్=పెళ్ళాం పిల్లల్ని తలచుకోవడం జరిగి ఉంటుందా?

వృత్తం:

అనుష్టుప్.

అలంకారం:

అర్థాంతరన్యాసము (ఉక్తిరర్థాంతర న్యాసస్స్యాత్ సామాన్య విశేషయోః – అని కువలయానందం).

ఇక్కడ శకటదాసు ప్రవర్తనకు కారణాన్ని సాధారణీకరిస్తూ వ్యాఖ్యానించడం కారణం.

అథవా కః సన్దేహః.

అథ+వా=కాదంటే, సన్దేహః+కః =సంశయించేందు కేముంది?

శ్లోకం:

ముద్రా తస్య కరాఙ్గుళి ప్రణయినీ

సిద్ధార్థక స్తత్సుహృత్,

తస్యై వాపర లేఖ్య సూచిత మిదం

లేఖ్యం ప్రయోగాశ్రయమ్,

సువ్యక్తం శకటేన భేదపటుభిః

సన్ధాయ సార్థం పరై

ర్భర్తృ స్నేహ పరాఙ్ముఖేన కృపణం

ప్రాణార్థినా చేష్టితమ్. (15)

అర్థం:

తస్య+ముద్రా=అతడి ఉంగరం (ముద్ర),  కర+అఙ్గుళి+ప్రణయినీ=చేతివ్రేలికి చేరి ఉంటుంది. సిద్ధార్థకః=సిద్ధార్థకుడు, తత్+సుహృత్=ఆతడి ఆ మిత్రుడు, ఇదం+లేఖ్యం=ఈ వ్రాయబడినది, తస్య+ఏవ=వాడిదే (శకటదాసుదే). అపర+లేఖ్య+సూచితమ్=మరొక వ్రాత ద్వారా కనిపిస్తున్నదని (అదే చేతి వ్రాత), సువ్యక్తం=స్పష్టం; భేద+పటుభిః=చీలగొట్టడంలో సమర్థులైన, పరై+సార్థం=వైరులతో కలిసి, శకటేన+సన్ధాయ=శకటదాసు చేత సంధి చేసుకోబడి, భర్తృస్నేహ+పరాఙ్ముఖేన=ప్రభువుతో సాంగత్యం పట్ల పెడముఖం కలవాడై, ప్రాణార్థినా=ప్రాణం మీద తీపి కొద్దీ, కృపణం+యథా+చేష్టితమ్=బుద్ధిహీనంగా చేయబడిన పని.

వృత్తం:

శార్దూల విక్రీడితం. మ-స-జ-స-త-త-గ గణాలు.

వ్యాఖ్య:

రాక్షసుడిని నేరస్తుడిగా నిలబెట్టడానికి మూడు కారణాలు. 1). లేఖను పట్టుకువెళ్ళే సిద్ధార్థకుడు అతడి మిత్రుడు 2). ఉంగరం రాక్షసుడి చేతి వ్రేలిదే 3). ఉత్తరం వ్రాసినవారు శకటదాసు అని – చేతి వ్రాత నిరూపించింది. – ఇక్కడ రాక్షసుడి తీర్మానం ఏమంటే శకటదాసు తన ప్రాణాలపై తీపి కొద్దీ శత్రువుతో సంధి చేసుకుని – ప్రభుభక్తిని మరచి ప్రవర్తించాడని -.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here