ముద్రారాక్షసమ్ – ప్రథమాఙ్కః – 15

0
6

[box type=’note’ fontsize=’16’] ‘ముద్రారాక్షసం‘ ఏడంకాల రాజకీయ నాటకం. విశాఖదత్తుడు యీ నాటకాన్ని చతుర రాజకీయ వ్యూహాల అల్లికతో, అద్భుతంగా రూపొందించాడు. సంస్కృత సాహిత్యం మొత్తంలో అరుదైన ఈ నాటకాన్ని ఇంద్రగంటి శ్రీకాంతశర్మ గారు అనువదించి, వ్యాఖ్యతో అందిస్తున్నారు. [/box]

చాణక్యః:

(స్వగతమ్) సాధు!  

శ్లోకం:

సులభే ష్వర్థలా భేషు పరసం వేదనే జనః

క ఇదం దుష్కరం కుర్యా దిదానీం శిబినా వినా॥ 24 .

(ప్రకాశమ్) ఏష తే నిశ్చయః!

అర్థం:

(స్వగతమ్=తనలో) సాధు!=బాగుందయ్యా! పర+సంవేదనే=ఇతరుల ఆచూకీ తెలియజేయడం ద్వారా, అర్థలాభేషు+సులభేషు(సన్తి)=సులువుగా ధనం సంపాదించుకునే అవకాశాలు ఉండగా, శిబినా+వినా=శిబి చక్రవర్తి తప్ప, కః+జనః=ఎవడు, ఇదానీం=ఇప్పుడు, ఇదం+దుష్కరం+కుర్యాత్=ఈ కఠిన నిర్ణయం చేయగలడు? (ప్రకాశమ్=పైకి) ఏషః+తే+నిశ్చయః= ఇదే నీ నిర్ణయం!

వ్యాఖ్య:

చన్దనదాసు దృఢ నిశ్చయం చాణక్యుడికి ఆశ్చర్యం కలిగించింది. చిన్న చిన్న ధన ప్రలోభాలుంటేనే ఇతరుల ఆచూకీ పరులకు అందించే మనుషులుండే కాలంలో, చందనదాసు తీసుకున్నటువంటి కఠిన నిర్ణయం ఏ శిబి చక్రవర్తికో తప్ప సాధ్యం కానిది అని సంతోషించాడు.

అలంకారం:

అప్రస్తుత ప్రశంస – చందనదాసు నిర్ణయాన్ని అభినందించడానికి శిబి దాతృత్వ ప్రశంస చేయడం కారణం.

(అప్రస్తుత ప్రశంసా స్యాత్ సాయత్ర ప్రస్తుతాశ్రయా – అని కువలయానందం)

వృత్తం:

అనుష్టుప్.

చన్దన దాసః:

బాఢమ్

అర్థం:

అంతే.

చాణక్యః:

(సక్రోధమ్) దురాత్మన్. తిష్ఠ దుష్ట వణిక్ అనుభూయతాం తర్హి నరపతి క్రోధః

అర్థం:

(సక్రోధమ్=కోపంతో), దురాత్మన్! దుష్ట వణిక్!+తిష్ఠ=దుర్మార్గుడా! దుర్బుద్ధి శెట్టీ! ఉండు (నీ పని చెబుతా), తర్హి=అలా అయే మాటుంటే, నరపతి+క్రోధః=రాజాగ్రహం, అనుభూయతాం=అనుభవించు (అనుభవించబడుగాక).

చన్దన దాసః:

సజ్జోహ్మి। అను చిట్ఠదు అజ్జో అత్తణో అహి ఆరసరిసమ్ (సజ్జోస్మి అనుతిష్ఠతు ఆర్యః ఆత్మనోధికార సదృశమ్)

అర్థం:

సజ్జః+అస్మి=సిద్ధంగా ఉన్నాను, ఆత్మనః+అధికారసదృశమ్+ఆర్యః+అనుతిష్ఠతు=తమ అధికారానికి తగిన విధంగా, అయ్యవారు చేసుకోవచ్చును.

చాణక్యః:

శార్ఙ్గరవ! ఉచ్యతా మస్మద్వచనాత్ కాలపాశికో దణ్డపాశికశ్చ – ‘శ్రీఘ్ర మయం దుష్టవణిక్ నిగృహ్యతామ్! అథవా-తిష్ఠతు. ఉచ్యతాం దుర్గపాలకో విజయపాలకః, గృహీత గృహసార మేనం సపుత్రకళత్రం సంయమ్య తావ ద్రక్ష, యావన్మయా వృషలాయ కథ్యతే, వృషల ఏ వాస్య ప్రాణహరం దణ్డ మాజ్ఞాపయిష్యతి.

అర్థం:

శార్ఙ్గరవ! అస్మద్+వచనాత్=నా మాటగా, కాలపాశికః+దణ్డపాశికః+చ+ఉచ్యతామ్= కాలపాశిక, దండపాశికులకు చెప్పు, – (ఏమంటే) –  అయం+దుష్టవణిక్=ఈ దుష్టబుద్ధి శెట్టిని, శ్రీఘ్రం=వెంటనే, నిగృహ్యతామ్=వశపరుచుకోవడం జరగాలని (వశపరుచుకోబడాలని)… అథవా=పోనీ, తిష్ఠః=ఉండనియ్యి, దుర్గపాలకః+విజయపాలకః=దుర్గపాలకుడైన విజయపాలకుడు (విజయపాలకునితో), ఉచ్యతాం=చెప్పు (చెప్పబడుగాక) -సపుత్ర+కళత్రం=భార్యాబిడ్డలతో సహా, ఏనం+గృహసారం=వీడి ఇంటిలో ఉన్న సర్వస్వాన్ని, సంయమ్య=వశపరుచుకుని,  యావత్+మయా+వృషలాయ+కథ్యతే=నేను చంద్రగుప్తునికి నివేదించే, తావత్=అంతవరకు, రక్ష=కాపలాలో ఉంచు, వృషలః+ఏవ=చంద్రగుప్తుడే, అస్య+ప్రాణహరం+దణ్డమ్=వీనికి ప్రాణాంతకమైన శిక్ష(ను), అజ్ఞాపయిష్యతి=ఆదేశించగలడు.

శిష్యః:

య దాజ్ఞాపయ త్యుపాధ్యాయః, శ్రేష్ఠిన్, ఇత ఇతః॥

అర్థం:

ఉపాధ్యాయః+యత్+ఆజ్ఞాపయతి= గురుదేవుల ఆజ్ఞ; శ్రేష్ఠిన్=శెట్టిగారూ, ఇతః+ఇతః=ఇటు రండి, ఇటు.

చన్దన దాసః:

అజ్జ, అఆ మాఅచ్ఛామి. (స్వగతమ్) దిట్టిఅ మిత్తకణ్జేణ మే విణాసో ణ పురిసదోసేణ [ఆర్య, అయ మా గచ్ఛామి. (స్వగతమ్) దిష్ట్యా మిత్ర కార్యేణ మే వినాశో న పురుషదోషేణ॥]

(పరిక్రమ్య శిష్యేణ సహ నిష్క్రాన్తః)

అర్థం:

ఆర్య=అయ్యా, అయం+ఆగచ్ఛామి=ఇదిగో వస్తున్నాను. (స్వగతమ్=తనలో),

దిష్ట్యా=అదృష్టవశాత్తు, మిత్రకార్యేణ=స్నేహితునికి సంబంధించిన పని కారణంగా, మే=నా (యొక్క), వినాశః+(సంభవతి)=నా అంతం జరుగుతోంది, న+పురుషదోషేణ= నా తప్పు వల్ల కాదు, (పరిక్రమ్య=ముందుకు నడిచి, శిష్యేణ+సహ=శార్ఙ్గరవుడితో కలిసి, నిష్క్రాన్తః=వెళ్ళాడు).

చాణక్యః:

(సహర్షమ్) హన్త లబ్ధ ఇదానీం రాక్షసః కుతః

శ్లోకం:

త్యజ త్య ప్రియవ త్ప్రాణాన్ యథా త స్యాయ మాపది

త థై వా స్యాపది ప్రాణా నూనం తస్యాపి న ప్రియాః 25

(నేపథ్యే కలకలః)

అర్థం:

(సహర్షమ్=సంతోషంగా), ఇదానీం=ఇప్పుడు, రాక్షసః+లబ్ధః=రాక్షసమంత్రి దొరికాడు (చిక్కాడు), కుతః=ఎందుకంటే – తస్య+ఆపది=అతడి విపత్కరకాలంలో, యథా=ఎలాగైతే, అయం=ఈ చందనదాసు, ప్రాణాన్=ప్రాణాలను, అప్రియవత్=మమకారం లేకుండా, త్యజతి=(ఎలాగ) విడుస్తాడో, తథా+ఏవ=అదే విధంగా, అస్య+ఆపది=ఈ చందనదాసు విపత్కాలంలో (కూడా), తస్య+అపి=ఆ రాక్షస మంత్రి, ప్రాణః=ప్రాణాలు కూడా, నూనం+న+ప్రియాః=బహుశః ఇష్టమైనవి కాకపోవచ్చు.

వ్యాఖ్య:

మిత్ర స్వభావాన్ని చాణక్యుడు బాగా ఎరిగినవాడు కావడం వల్ల – చందనదాసును ఆపదలో పడవేసి (ఎరవేసి), రాక్షసమంత్రిని ఆకర్షించాలని చూస్తున్నాడు. సంస్కృత భాషలోని ప్రాణ పదాన్ని బహువచనంలో వాడుతుంటారు (ఉదా: ప్రాణాన్, ప్రాణాః ఇత్యాది). కారణం ప్రాణాలు – ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమానాలుగా అయిదు (ప్రాణాధారకుడు ఒకడైనా).

అలంకారం:

అర్థాంతర న్యాసం. – చందనదాస, రాక్షసమంత్రుల్ని శ్లోకంలో ప్రత్యక్షంగా పేర్కోకపోయినా, అన్యాపదేశంగా సూచిస్తున్నాడు. ఇక్కడ అప్రస్తుత స్నేహ ప్రశంస – ఒకరి కోసం ఒకరు ప్రాణాలు విడుస్తారు అనే విషయాన్ని వారిద్దరి పరంగా అన్వయించదగ విధంగా ఉంది (ఉత్తరర్ధాంతన్యాసఃస్యాత్ సామాన్య విశేషయోః – సామాన్యాన్ని విశేషంతో సమర్థించడం ఇక్కడ విశేషం – కువలయానందం).

వృత్తం:

అనుష్టుప్.

(నేపథ్యే=తెరలో, కలకలః=కలకలం)

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here