ముద్రారాక్షసమ్ – ప్రథమాఙ్కః – 4

0
10

[box type=’note’ fontsize=’16’] ‘ముద్రారాక్షసం‘ ఏడంకాల రాజకీయ నాటకం. విశాఖదత్తుడు యీ నాటకాన్ని చతుర రాజకీయ వ్యూహాల అల్లికతో, అద్భుతంగా రూపొందించాడు. సంస్కృత సాహిత్యం మొత్తంలో అరుదైన ఈ నాటకాన్ని ఇంద్రగంటి శ్రీకాంతశర్మ గారు అనువదించి, వ్యాఖ్యతో అందిస్తున్నారు. [/box]

శ్లోకం:

స్వయ మాహృత్య భుఞ్జనాః బలినోఽపి స్వభావతః।

గజేన్ద్రా శ్చ నరేన్ద్రాశ్చ ప్రాయః సీదన్తి దుఃఖితాః॥ -16

(తతః ప్రవిశతి యమపటేన చరః)

అర్థం:

గజేంద్రాః+చ=శ్రేష్ఠమైన ఏనుగులు, నరేంద్రాః+చ=రాజశ్రేష్ఠులూ, బలినః+అపి=బలవంతులైనప్పటికి (సమర్థులైనప్పటికి), స్వయం+ఆహృత్య= తమకు తామై సంపాదించుకొని, భుంజనాః=అనుభవించే వారై, దుఃఖితాః (సన్తః)=దుఃఖపడేవారవుతూ, స్వభావతః= వారి స్వభావం చేతనే, సీదన్తి= అంతమైపోతుంటారు.

అలంకారం:

తుల్యయోగితాలంకారం. (ప్రస్తుతానం తథాన్యేషాం కేవలం తుల్యధర్మతః ఔపమ్యం గమ్యతే యత్ర సా మతా తుల్యయోగితా – ప్రతాపరుద్రీయం).

ఈ శ్లోకంలో రాజేంద్రులకీ, గజేంద్రులకీ ఉన్న సామాన్య లక్షణాన్ని చెప్పడం చేత ఇక్కడ తుల్యయోగిత. అప్రస్తుత ప్రశంసాలంకారం కూడా చెప్పవచ్చు. చంద్రుగుప్తుడి స్థితిని సమీక్షిస్తూ అప్రస్తుతమైన గజేంద్ర ప్రస్తావన తీసుకువచ్చిన కారణం చేత ఆ అలంకారం కూడ.

(అప్రస్తుత ప్రశంసా స్యాత్ సాయత్రప్రస్తుతాశ్రయా – అని కువలయానందం).

వృత్తం:

అనుష్టుప్ – పాదానికి పదహారు అక్షరాల లెక్కన రెండు పాదాలు – ఇది అయిదు రకాలుగా వుంటుంది. 5,6,7, సంఖ్యలు గల అక్షరాలకే గురు, లఘువుల నియమం నియతంగా కనిపిస్తుంది. ఖచ్చితమైన నియమం 13, 14, 15 అక్షరాలు ర గణంగా ఉండాలి. ఇదే ప్రధానం.

వ్యాఖ్య:

స్పష్టమ్.

(తతః=పిమ్మట, చరః=గూఢచారి, యమ+పటేన=యమపటంతో (జోస్యాలు చెప్పే ఒకానొక చిత్రపటం) ప్రవిశంతి=ప్రవేశిస్తున్నాడు).

శ్లోకం:

పణమహ జమస్స చలణే కిం కజ్జం దేవఏహి అణ్ణేహిం।

ఏసో ఖు అణ్ణభత్తాణ హరణ జీఅం చడపడ స్తం॥  -17

[ప్రణమత యమస్య చరణౌ, కిం కార్యం దేవకై రన్యైః।

ఏష ఖ ల్వన్యభక్తానాం హరతి జీవం పరిస్ఫురన్తమ్॥]

అర్థం:

యమస్య+చరణౌః=యముడి పాదాలకి, ప్రణమతం=మొక్కు, అన్యైః+దైవతైః+కిమ్+కార్యం=ఇతర దేవతలకు మ్రొక్కడం వల్ల (చేత) ఏమి ప్రయోజనం? అన్య+భక్తానాం=ఇతర (దైవాల) భక్తుల (యొక్క), హరిస్ఫురన్తం+జీవం=కొట్టుకునే ప్రాణాన్ని, ఏషః+హరతి+ఖలు=ఇతడు తీసుకుపోతాడు కద!

వృత్తం:

ప్రాకృతం – గాథాచ్ఛందం;  సంస్కృతచ్ఛాయ ఆర్యావృత్తం (వివరణనకు చూ-9వ శ్లోకం)

శ్లోకం:

పురిసస్య జీవిదవ్వం విసమాదో హోఇ భత్తి గహిఆదో।

మా రేఇ సవ్వలోఅం జో తేణ జ మేణ జీఆమో॥ -18

(పురుషస్య జీవితవ్యం విషమా ద్భవతి భక్తి గృహీతాత్।

మారయతి సర్వలోకం యస్తేన యమేన జీవామః ॥]

అర్థం:

పురుషస్య=మనిషి (యొక్క) జీవితవ్యం= బ్రతుకు, భక్తి గృహీతాత్=భక్తికి (విధేయతకు) పరాధీనుడైన, విషమాత్ (యమాత్)=నిర్దయుడైన యముడి వలన, భవతి=సంభవిస్తోంది, యః=ఎవడైతే, సర్వలోకం+మారయతి=యీ ప్రపంచాన్నంతా చావజేస్తున్నాడో, తేన+యమేవ=ఆ యముడి వలన (తో), జీవామః=బ్రతుకుతున్నాం. (బ్రతుకుదాం – అని కూడ).

అలంకారం:

“అందరినీ చావజేసే యముణ్ణి సేవించుకుంటూ బ్రతుకుదాం” – అనే అర్థంలో ఈ శ్లోకంలో వ్యాఘాతమనే అలంకారం ఉందని, అర్థాంతరాన్యాసం కూడా అన్వయించవచ్చుననీ – నేలటూరి రామదాసయ్యంగారు. అయితే – అప్పయ దీక్షిత కృతికి గల బుధరంజనీ వ్యాఖ్య విషమాలంకారానికి వివరణ ఇస్తూ, “విరోధ మూలత్వాత్ అసంగత్యా సంగతిః” అనడం కూడా ఇక్కడ నప్పుతుంది. “ప్రాణాలు తీసే యముణ్ణి నమ్ముకొని బ్రతుకుదాం” అని కోరుకోవడంలో అసంగతత్వం కారణంగా విషమాలంకారం.

(విషమం వర్ణ్యతే యత్ర ఘటనా ననురూపయోః – అని కువలయానందం).

బ్రతుకు నిలుపుకోవడానికి హేతువుగా యముడి పట్ల భక్తిని నిర్దేశించడం కారణంగా కావ్యలింగం కూడా. (సమర్థనీయ స్యార్థస్య కావ్యలింగం సమర్థనమ్ – కువలయానందం)

వ్యాఖ్య:

ఈ రెండు శ్లోకాల ద్వారా, గూఢచారి తన అంతరంగాన్ని, చాణక్యుని పట్ల విధేయతా కారణాన్ని గూఢంగా ప్రకటిస్తున్నాడు. చాణక్యుడు యముడి మాదిరిగా ప్రాణాలు తీయించగల సమర్థుడు. అటువంటి వాడిని మెలకువ కలిగి సేవించాలని తన్ను తాను హెచ్చరించుకుంటున్నాడు. ఈ యమపట ప్రస్తావన, ఆ గూఢచారి చేసుకువచ్చిన చర్య ఫలించిందనడానికి సూచన – ఉపోద్ఘాతం. ఇతడు అందించబోయే సాధనం భావి చాణక్య వ్యూహానికి కీలకంగా నిలిచింది.

వృత్తం:

ప్రాకృతం – గాథాచ్ఛందం;  సంస్కృతచ్ఛాయ ఆర్యావృత్తం

చరః

జావ ఏదం గేహం పవిసిఅ జమపడం దంసన్తో గీఆఇం గా ఆమి,

[యావ దిదం గృహం ప్రవిశ్య యమపటం దర్శయన్ గీతాని గాయామి]

 – (ఇతి పరిక్రామతి)

అర్థం:

ఇదం+యావత్=ఇప్పుడే (ఇంతలోనే), గృహం+ప్రవిశ్య=(ఈ) ఇంటిలోకి ప్రవేశించి (వెళ్ళి) యమపటం+దర్శయన్=(ఈ) యమపటాన్ని చూపిస్తూ, గీతాని+గాయమి=పాటలు పాడుతాను. (ఇతి=అని, పరిత్రామతి=ముందుకు వెడుతున్నాడు).

వ్యాఖ్య:

“కాశీపట్నం చూడర బాబూ” అంటూ అన్నపూర్ణ కావిళ్ళ వాళ్ళు చూపించే బొమ్మల వస్త్రం మాదిరి ఈ యమపటం (పటం అంటే వస్త్రం) పాపుల పట్ల యముడి క్రూర దండనలు చిత్రించబడిన – చుట్టబడిన వస్త్రం. దాన్ని చూపించి పాట ద్వారా వివరించడం ఒక తరహా జోస్యం.

శిష్యః

(విలోక్య) భద్ర, న ప్రవేష్టవ్యం.

అర్థం:

భద్ర=నాయన! న+ప్రవేష్టవ్యం= (లోనికి) రారాదు.

చరః

హంహో బహ్మణ, కస్స పదం గేహమ్? (అహో బ్రాహ్మణ, క స్యేదం గృహమ్?)

అర్థం:

అహో+బ్రాహ్మణ= ఒయ్యోయి బాపనయ్యా! ఇదం+కస్య+గృహం=ఈ ఇల్లెవరిది?

శిష్యః

అస్మాక ముపాధ్యాయస్య సుగృహీతనామ్నః ఆర్య చాణక్యస్య.

అర్థం:

అస్మాకం+ఉపాధ్యాయః=మా గురువుగారైన, సు+గృహీతనామ్న=పేరుపొందిన, ఆర్యచాణక్యస్య=పూజ్య చాణక్యునిది.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here