ముద్రారాక్షసమ్ – ప్రథమాఙ్కః – ప్రస్తావనా

0
8

[box type=’note’ fontsize=’16’] ‘ముద్రారాక్షసం‘ ఏడంకాల రాజకీయ నాటకం. విశాఖదత్తుడు యీ నాటకాన్ని చతుర రాజకీయ వ్యూహాల అల్లికతో, అద్భుతంగా రూపొందించాడు. సంస్కృత సాహిత్యం మొత్తంలో అరుదైన ఈ నాటకాన్ని ఇంద్రగంటి శ్రీకాంతశర్మ గారు అనువాదించి, వ్యాఖ్యతో అందిస్తున్నారు. [/box]

(నాంద్యంతే సూత్రధారః)

అలమతి ప్రసంగేన. ఆజ్ఞాపితోఽస్మి
పరిషదా – యథా, అద్య త్వయా సామన్త
వటేశ్వర దత్త పౌత్రస్య మహారాజ భాస్కరదత్త
సూనోః కవే ర్విశాఖదత్తస్య కృతి రభినవం
ముద్రారాక్షసమ్ నామ నాటకం నాటయితవ్య
మితి। యత్సత్యం కావ్య విశేషవేదిన్యాం
పరిషది ప్రయుఞ్జానస్య మమాపి సుహహాన్
పరితోషః ప్రాదుర్భవిష్యతి. కుతః –

అర్థం:

(నాంది+అంతే=నాంది ముగిసిన అనంతరం, సూత్రధారః= నాటక ప్రయోక్త…) అతి ప్రసంగేన+అలమ్= ఇంతవరకు మాట్లాడింది చాలు, అద్య=ఇవేళ, త్వయా=నీవు (నీ చేత), సామంత+వటేశ్వరదత్త+పౌత్రస్య=సామంతరాజ పదవినందిన వటేశ్వరదత్తుని మనుమడు, మహారాజ+భాస్కరసూనోః=భాస్కరదత్త మహారాజు కుమారుడు (అయిన), విశాఖదత్తకవేః=విశాఖదత్తుడనే కవి (యొక్క), ముద్రారాక్షసమ్‌నామ+నాటకం= ముద్రారాక్షసమనే పేరు గల నాటకాన్ని, నాటయితవ్యం=నటింపజెయ్యాలి (ప్రదర్శించాలి), ఇతి=అని, పరిషదా= ఈ సభవారు (వారి చేత) ఆజ్ఞాపితః+అస్మి= నన్ను ఆజ్ఞాపించారు (ఆజ్ఞాపించబడ్డాను), తత్+సత్యం= అందులో ఒక నిజం లేకపోలేదు; కావ్యవిశేష+వేదిన్యాం+పరిషది=కావ్యాల విశేషాలు బాగా తెలిసినవాళ్ళున్న సభలో మమ+అపి=నాకు కూడా, సుమహాన్=గొప్పదైన, పరితోషః=తృప్తి (ఆనందం), ప్రాదుర్భవతి=కలుగుతోంది, కుతం=ఎందుకంటే…

శ్లోకం:

చీయతే బాలిశ స్యాపి సత్‌క్షేత్ర పతితా కృషిః
న శాలేః స్తమ్బకరితా వప్తు ర్గుణ మపేక్షతే॥ – (3)

అర్థం:

బాలిశస్య+అపి= (సేద్యం గురించి) ఏమీ తెలియని వాడి, కృషిః+అపి=వ్యవసాయం కూడా, సత్‌‍క్షేత్ర+పతితా (యది)= మంచి నేలలో పడినట్లయితే, చీయతే=వృద్ధి పొందుతుంది, శాలేః=వరి (యొక్క) స్తంబ+కరితా=మొక్క (మాను) కట్టడం, వప్తుః=నాటినవాడి (యొక్క) గుణం=నేర్పరితనాన్ని, న+అపేక్షతే (ఖలు)=కోరదు కద!

తాత్పర్యం:

వ్యవసాయమంటే ఏమీ తెలియనివాడు సేద్యం చేయడానికి సిద్ధపడినా, వేసిన విత్తు మంచి నేలలో పడితే దానంతటదే చక్కగా మొక్క కడుతుంది. ఇందుకు నాటినవాడి తెలివితో ఏమీ సంబంధం లేదు. విత్తనం మేలైనది కావాలి; నేల మంచిది కావాలి.

వ్యాఖ్య:

నాటక ప్రయోక్త అయిన సూత్రధారుడు తన వినయాన్నీ, సభవారి విశిష్టతనీ, అన్యాపదేశంగా, దృష్టాంతపూర్వకంగా తెలియపరిచాడు.

సభ (నేల) చాలా మంచిది, నాటకం (విత్తనం) చాలా మంచిది, నాటేవాడు (తాను) తెలివైనవాడు కాకపోయినా, లోపం లేకుండా మంచి ఫలితం ఇస్తుందని భావం.

అలంకారం:

అప్రస్తుతప్రశంస (అప్రస్తుత ప్రశంసా స్యాత్, సా యత్ర ప్రస్తుతాశ్రయా – కువలయానందం).

శ్లోకంలో ప్రస్తుత, అప్రస్తుతాలు రెండు స్పష్టం.

త ద్యావది దానీం గృహం గత్వా గృహిణీ మాహూయ
గృహజనేన సహ సఙ్గీతక మనుతిష్ఠామి। (పరిక్రమ్య
అవలోక్య చ) ఇమే నో గృహాః. త ద్యావత్ప్రవిశామి।
(నాట్యేన ప్రవిశ్య, అవలోక్యచ) అయే, త త్కిమిద
మస్మద్గృహేషు మహోత్సవ ఇవ దృశ్యతే। స్వస్వకర్మ
ణ్యధికతర మభియుక్తః పరిజనః –
తథాహి –

శ్లోకం:

వహతి జలమియం, పినష్టిగన్ధా –
నియ, మియ ముగ్ధ్రథతే స్రజో విచిత్రాః।
ముసల మిద మియం చ పాతకాలే
ముహు రనుయాతి కలేన హుంకృతేన – (4)

అర్థం:

తత్+యావత్= అందువల్ల, ఇదానీం=ఇప్పుడు, గృహం+గత్వా=ఇంటికి వెళ్ళి (విభక్తి- ద్వితీయ), గృహిణీం+ఆహూయ=ఇల్లాలిని పిలిచి, గృహ+జనేన+సహ=ఇంటి మనిషితో కలిసి, సంగీతకం=గీత, వాద్య, నృత్యాలతో కలిసిన ప్రదర్శనను (సంగీతకాన్ని), అనుతిష్ఠామి=నెరవేరుస్తాను (పరిక్రమ్య=ముందుకు నడిచి, అవలోక్య+చ=చూసి), ఇమే+నః+గృహాః= ఇదే మా యిల్లు (ఈ ప్రయోగం ఇంట్లో ఉండే పరిజనుల పట్ల కూడా వర్తిస్తుంది)(ఇక్కడ గృహశబ్దం పుంలింగం, బహువచనంగా వ్యవహారం), తత్+యావత్+ప్రవిశామి=ఇదిగో లోపలకు వెడతాను, (నాట్యేన=నటన కనబరుస్తూ, ప్రవిశ్య=ప్రవేశించి), అవలోక్య చ=చూసి –

అయే=అరే! మత్+గృహేషు=నా ఇంట్లో, మహోత్సవః+ఇవ+దృశ్యతే=పెద్ద పండుగ వ్యవహారంలాగ కనిపిస్తోంది; తత్+కిమ్+ఇదం=అదేమిటో మరి, పరిజనః=ఇంటి పనివాళ్ళు, స్వ+స్వ+కర్మణి=తమ తమ పనుల్లో, అధికతరం=మిక్కిలిగా, అభియుక్తః= మునిగిఉన్నారు, తథా హి= సరే కానియ్యి! (అంటే: ఒక్కొక పనిమనిషి ఒక్కొక్క పని చెయ్యడం జరుగుతోందని -పరిజనః అభియుక్తః అని అన్వయం).

శ్లోకార్థం:

ఇయం=ఈమె, జలం+వహతి=నీళ్ళు మోస్తోంది, ఇయం+గంధాన్+పినష్టి=ఈమేమో గంధాలు నూరుతోంది, విచిత్రాః+స్రజః= విచిత్రమైన మాలల్ని, ఇయం=ఈమె ఉద్గ్రథతే=అల్లుతోంది, ఇయం=ఈమైతే, ఇదం+ముసలం=ఈ రోకలిని, పాత+కాలే=పోటు వేసే వేళ, కలేన+హుంకృతేన=సొగసైన హుంకారంతో, ముహుః+అనుయాతి=మాటిమాటికీ వంత పాడుతోంది.

భవతు। కుటుంబినీం ఆహూయ పృచ్ఛామి॥

అర్థం:

భవతు= కానియ్యి, కుటుంబినీం+ఆహుయ=ఇల్లాలిని పిలిచి, పృచ్ఛామి=అడుగుతాను,

(నేపథ్య+అభిముఖం+అవలోక్య=[రంగస్థలం] వెనుక తెరవైపు చూసి)

శ్లోకం:

గుణ వత్యుపాయ నిలయే స్థితిహేతోః సాధికే త్రివర్గస్య।
మద్భవన నీతి విద్యే కార్యాచార్యే ద్రుత ముపేహి – (5)

అర్థం:

గుణవతి=మంచిదానివి (కదా!), ఉపాయ+నిలయే=పుట్టెడు ఉపాయాలు ఎరిగినదానివి (కదా!), స్థితి+హేతోః=మన సంసారం స్థిరంగా ఉండడానికి కారణమైన, త్రివర్గస్య=ధర్మ, అర్థ, కామ పురుషార్థాల(కు) సాధకురాలివి, మత్+భవన నీతి+విదే=నా యింటిని నిర్వహించడంలో నేర్పరురాలివి, కార్య+ఆచార్యే= కర్తవ్యాకర్తవ్యాలు బోధించడంలో సమర్థురాలివి, ద్రుతం+ఉపేహి= తొందరగా ఇటు రా!

తాత్పర్యం:

సూత్రధారుడికి తన భార్య సుగుణాలన్నీ తెలుసు. ఆమె చురుకైనది, తెలివైనది, నిర్వాహకురాలు, కర్తవ్యాకర్తవ్యాలు బోధించలగలది. అందుకే, ఇంట్లో సందడి చూసి చికాకుపడి విసుక్కోకుండా సందర్భం ఏమిటో తెలుసుకోదలిచాడు (ఉప+ఏహి=ఉప-సమీపే; ఏహి=రా -)

నటీ:

(ప్రవిశ్య) అజ్జ, ఇఅహ్మి, అణ్ణానిఓఏణ మం అజ్జో అణుగేహ్ణదు

(ఆర్య, ఇయమస్మి, ఆజ్ఞానియోగేన మా మార్యో అనుగృహ్ణాతు)

అర్థం:

ఆర్య = స్వామీ, ఇయం+అస్మి=ఇదిగో ఉన్నాను, ఆజ్ఞా+నియోగేన=చెయ్యవలసిన పనులేమిటో ఆజ్ఞాపించి, ఆర్య=తమరు, మామ్=నన్ను, అనుగృహ్ణాతు=అనుగ్రహించండి.

సూత్రధారుడు:

ఆర్యే, తిష్ఠతు తావ దాజ్ఞానియోగః। కథయ,
కి మద్య భవత్యా తత్రభవతాం బ్రాహ్మణానాం
ఉపనిమంత్రణేన కుటుంబక మనుగృహీతం।
అభిమతా వా భవన మతిధయః సంప్రాప్తా।
యత ఏష పాక విశేషారమ్భః?

అర్థం:

ఆర్యే=(పూజ్యురాలైన) ఇల్లాలా! ఆజ్ఞానియోగః+తిష్ఠతు+తావత్=ఆజ్ఞాపించడం మాట అలా ఉంచు, కథయ=(ఈసంగతి)చెప్పు, అద్య=ఇవేళ, తత్రభవతాం+బ్రాహ్మణానాం=పూజ్యులైన బ్రాహ్మణుల్ని, ఉపనిమంత్రణే=ఆహ్వానించడం ద్వారా (చేత) భవత్యా=నువ్వు (నీ చేత), కుటుమ్బకం= (మన) కుటుంబాన్ని, అనుగృహీతం+కిమ్=అనుగ్రహించావా ఏమి? (అనుగ్రహింపబడిందా?), వా=కానట్టయితే, అభిమతాః+అతిథయః=ప్రియమైనఅతిథులు, సంప్రాప్తాః=వచ్చారా?, యతః=ఎందుకడుతున్నానంటే, ఏషః+పాకవిశేష+ఆరమ్భః=ఈ ప్రత్యేకమైన వంట అవుతున్నది కద!

నటీ:

అజ్జ, ఆమస్తిదా మఏ భఅవన్తో బ్రహ్మణా।

(ఆర్య, ఆమన్త్రితా మయా భగవన్తో బ్రాహ్మణాః)

అర్థం:

ఆర్య=అయ్యా, భగవన్తః+బ్రాహ్మణాః=పూజ్య బ్రాహ్మణుల్ని, మయా+ఆమంత్రితాః=నేనే పిలిచాను (వారు నాచే పిలువబడ్డారు)

సూత్రధారుడు:

కథయ, కస్మిన్ నిమిత్తే।

అర్థం:

కస్మిన్+నిమిత్తే = ఏ కారణం వల్లనో, కథయ=చెప్పు.

నటీ:

ఉ వరజ్జతి కిల చన్దో, త్తి। (ఉపరజ్యతే కిల చన్ద్ర ఇతి)

అర్థం:

చన్ద్రః+ఉపరజ్యతే+కిల+ఇతి= చంద్రగ్రహణం కదా అని!

సూత్రధారుడు:

ఆర్యే, క ఏవ మాహ।

అర్థం:

ఆర్యే=అమ్మీ, ఏవమ్=ఇలాగని, కః+ఆహ=ఎవరు చెప్పారు?

నటీ:

ఏవం ఖు ణఅరవాసీ జణో మన్తేది (ఏవం ఖలు నగరవాసీ జనో మంత్రయతే)

అర్థం:

ఏవం=ఇలాగని, నగరవాసీ+జనః=మన ఊరి జనం, మన్త్రయతే+ఖలు=చెప్పుకుంటున్నారు కద!

సూత్రధారుడు:

ఆర్యే, కృతశ్రమోఽస్మి చతుఃషష్ట్యంగే జ్యోతిఃశాస్త్రే।
తత్ ప్రవర్త్యతాం భగవతో బ్రాహ్మణానుద్దిశ్య
పాకః। చన్ద్రోపరాగం ప్రతి తు కే నాపి విప్రలబ్ధాసి।

పశ్య –

శ్లోకం:

క్రూరగ్రహః సకేతు శ్చంద్రమ సంపూర్ణమణ్డలమి దానీమ్

అభిభవతు మిచ్ఛతి బలాత్…

అర్థం:

ఆర్యే=అమ్మీ, చతుఃషష్టి+అంగే+జ్యోతిఃశాస్త్రే=అరవై నాలుగు ప్రకరణాల జ్యోతిఃశాస్త్రంలో, కృతః+శ్రమ+అస్మి=కృషి చేసిన వాడిని, భగవతః+బ్రాహ్మణాన్+ఉద్దిశ్య+తత్+పాకః=పూజ్యులైన బ్రాహ్మణుల కోసం చేసే ఆ వంట, ప్రవర్త్యతామ్=జరగనియ్యి, చన్ద్ర+ఉపరాగం+ప్రతి+తు=చంద్ర గ్రహణం విషయంలో అయితే, కేన+అపి=ఎవడో (ఎవడి చేతనో), విప్రలబ్ధా+అసి=తప్పుదోవ పట్టించాడు నిన్ను (పట్టించబడ్డావు),

పశ్య=చూడు.

శ్లోకార్థం:

సకేతుః+క్రూరగ్రహః=కేతువుతో కూడిన క్రూరగ్రహమైన రాహువు (రెండు గ్రహాలకీ శరీరం ఒకటే కనుక అభేదవ్యపదేశం), ఇదానీం=ఇప్పుడు, పూర్ణమన్డలం=పూర్తి మండలాకారంలో ఉన్న, చంద్రమసం=చంద్రుణ్ణి, బలాత్=బలవంతంగా, అభిభవితుం=కబళించడానికి, ఇచ్ఛతి=కోరుకుంటున్నాడు…

(నేపథ్యే=తెరలో)

ఆః। క ఏష మయి స్థితే

అర్థం:

ఆః=ఆహా! మయి+స్థితే (సతి) నేనిక్కడ ఉండగా, కః+ఏషః=ఎవడు అంతపని చేయగలడు?

శ్లోక భాగం:

రక్షత్యేనంతు బుధ యోగః – (6)

అర్థం:

… ఏనం=వీనిని, బుధయోగః= బుధునితో కలయిక, రక్షతి=కాపాడుతుంది.

[పూర్తి శ్లోకం: క్రూరగ్రహః సకేతు శ్చంద్రమ సంపూర్ణమణ్డలమి దానీమ్
అభిభవతు మిచ్ఛతి బలాత్
రక్షత్యేనంతు బుధ యోగః ]

తాత్పర్యం:

“కేతువుతో కూడిన రాహువు ఇప్పుడు పూర్ణ చంద్రుణ్ణి బలవంతంగా కబళించాలని కోరుతున్నాడు.” (ఈ శ్లోకభాగం వినిపించగానే, నేపథ్యంలోంచి ఇలా వినిపించింది – “నేనిక్కడుండగా, ఇతడిని బుధునితో కలయిక రక్షిస్తుండగా, ఎవడు కబళించగలడు?” అనే మాట జవాబుగా వినిపించింది).

వ్యాఖ్య:

నేపథ్యంలోంచి “నేనుండగానా?” అనే హుంకరింపు వినపడగానే సూత్రధారుడు చంద్రగ్రహణం అనే అభిప్రాయాన్ని కొట్టిపారేశాడు. ఎందుకు? బుధగ్రహ యోగం ఉంటే చంద్రగ్రహణం ఏర్పడే అవకాశం లేదని -. ఇతడు తాను జ్యోతిఃశాస్త్ర పండితుడనన్నాడు కద!

ఈ నాటక వ్యాఖ్యాత డుంఢిరాజు ఒక ప్రమాణాన్ని ఇందుకు చూపించాడు.

“గ్రహ పంచక సంయోగం ఉన్నంత మాత్రాన గ్రహణం చెప్పరాదు. బుధుడు కనుక లేకపోతే, గ్రసనాన్ని గమనించి గ్రహణం చెప్పాలి.”

ప్రమాణ శ్లోకం:

గ్రహ పంచక సంయోగం దృష్ట్వా న గ్రహణం వదేత్
యది న స్యాద్బుధస్తత్ర బుధం దృష్ట్వా గ్రహం వదేత్

అని – జ్యోతిశ్శాస్త్రంలోని వ్యాస సంహితలో గర్గ వచనం –

అయితే ఈ బుధగ్రహ సంబంధం విషయంలో ఈ నాటకానికి తెలుగు వ్యాఖ్య వ్రాసిన శ్రీ నేలటూరు రామదాసయ్యంగారు మరొక విధమైన వివరణ చెప్పారు. “బుధయోగమంటే అక్షరాలా బుధుడని అర్థం కాదు, బుధ దేవతాకమైన కన్యాలగ్నం. అంటే పగటివేళ, చంద్రుడికి గ్రహణం లేదు” అని.

నేపథ్యం లోంచి వినిపించిన హుంకారం చాణక్యుడిది కనుక – ‘చంద్ర’, ‘బుధ’ పదాలు శ్లేషకు తావిచ్చాయి. బుధుడనే మాటకు పండితుడని అర్థం. అంటే చాణక్యుడు. చంద్రుడంటే చంద్రగుప్తుడు. “నేనుండగా చంద్రగుప్తుణ్ణి ఎవడు పట్టగలడు?” అని చాణక్యుడి హుంకరింపు.

ఈ శ్లోకంలో ఇంకొక విశేషం కూడా వుంది. “చంద్రమసం పూర్ణమండలమ్” అనే వాక్యాన్ని చంద్రగ్రహపరంగా – “చంద్రమసం+పూర్ణమణ్డలమ్” అనీ; చంద్రగుప్తపరంగా – “చంద్రం+అసంపూర్ణ మణ్డలమ్ (పూర్తిగా ఇంకా సామ్రాజ్యం వశం కాని) అనీ రెండు విధాల అన్వయించుకోవాలి. అలాగే – సకేతుః+క్రూరగ్రహః అనే చోట “మలయకేతు”వనే వాడితో కలసి ప్రత్యర్థిగా పరిణమించిన రాక్షసమంత్రి, క్రూరగ్రహమనీ – అర్థం చేసుకోవాలి (బుధయోగం అంటే: చంద్రగుప్తుడితో, చాణక్య సహవాసం).

నటీ:

అజ్జ, కో ఉణ ఏసో ధరణిగోఅరో భవిఅ చన్దం

గ్గహాభిజోయాదో రఖ్కిదుం ఇచ్ఛతి? (ఆర్య,

కః పున రేష ధరణీ గోచరో భూత్వా చన్ద్రం

గ్రహాభియోగాత్ రక్షితు మిచ్ఛతి?)

అర్థం:

ఆర్య=అయ్యా, ధరణీగోచరః+భూత్వా=నేలమీద కనిపిస్తూ, చన్ద్రం=చంద్రుణ్ణి, గ్రహ+అభియోగాత్=గ్రహంబారినుంచి, రక్షితుం=రక్షించడానికి, కః+పునః+ఏషః= ఇతడెవరు, ఇచ్ఛతి=కోరుకుంటున్నాడు?

సూత్రధారుడు:

ఆర్యే, యత్సత్యం మయాపి నోపలక్షితః।
భవతు; భూయోఽభియుక్తః స్వర వ్యక్తి
ముపలప్స్యే
(‘క్రూర గ్రహ’ ఇత్యాది పున స్తదేవ పఠతి)

అర్థం:

ఆర్యే=అమ్మీ, మయా+అపి=నాకు కూడా (నా చేత) యత్+సత్యం= నిజమేదో, న+ఉపలక్షితః=అంతుబట్టడంలేదు (తెలియబడలేదు), భవతు=కానియ్యి, భూయః=మళ్ళీ, అభియుక్తః=శ్రద్ధగా, స్వర+వ్యక్తి=గొంతుపోలిక, ఉపలప్స్యే=తెలుసుకుంటాను.

(క్రూరగ్రహ+ఇత్యాది=’క్రూరగ్రహ’ అంటూ ప్రారంభమయే శ్లోకాన్ని, పునః+తదేవ+పఠతి=మళ్ళీ అదే విధంగా చదివాడు).

(నేపథ్యే)

ఆ:! క ఏష మయి స్థితే చన్ద్ర గుప్త మభిభవితు మిచ్ఛతి?

అర్థం:

ఆః=ఆహా! మయి+స్థితే=నేనిక్కడుండగా, చన్ద్రగుప్తం+అభిభవతుం=చంద్రగుప్తుణ్ణి అవమానించాలని, ఏషః+కః+ఇచ్ఛతి= వీడెవడు కోరుకుంటున్నాడు?

సూత్రధారుడు:

(ఆకర్ణ్య) ఆర్యే, జ్ఞాతమ్, కౌటిల్యః

(నటీ భయం నాటయతి.)

అర్థం:

(ఆకర్ణ్య=విని), ఆర్యే=అమ్మీ, జ్ఞాతం=తెలిసింది, కౌటిల్యః=కౌటిల్యుడు.

(నటీ= నటి, భయం+నాటయతి= భయం ప్రదర్శిస్తుంది).

సూత్రధారుడు శ్లోకం:

కౌటిల్యః కుటిలమతిః స ఏష, యేన
క్రోధాగ్నౌ ప్రసభ మదాహి నన్దవంశః।
చన్ద్రస్య గ్రహణ మితి శ్రుతేః స నామ్నో
మౌర్యేన్దో ర్ద్విషదభియోగ ఇత్యవైతి॥ – (7)
త దిత ఆవాం గచ్ఛావః (ఇతి నిష్క్రాన్తౌ)

అర్థం:

(సః+ఏషః= [ఆఁ!], అతడే ఇతడు, యేన=ఎవడంటే (ఎవని చేత), కోప+అగ్నౌ=తన కోపమనే నిప్పు చేత (నిప్పుతో) – (నిప్పులో), ప్రసభం=బలవంతంగా, నంద+వంశః=నందరాజులనే వెదురు (వంశ పదానికి వెదురు మరొక అర్థం), అదాహి=కాల్చివేశాడు (కాల్చబడింది), చన్ద్రస్య+గ్రహణం=చంద్రుని పట్టుకోవడం, ఇతి+శ్రుతేః=అనే మాట చెవిన పడగా, స +నామ్నః= పేరులో పోలికను బట్టి (పేరు ఒకటే కావడం వల్ల), మౌర్య+ఇన్దో=మౌర్య వంశ చంద్రుడైన చంద్రగుప్తుని (యొక్క), ద్విషత్+అభియొగః+ఇతి=శత్రువుల దాడి అని (అనుకొని) – దగ్గరగా వస్తున్నాడు.

(‘అవైతి’ అనే క్రియకు బదులుగా ఉపైతి అని పాఠాంతరం).

తత్=ఆ కారణంగా, ఇతః=ఇక్కడ నుంచి, అవాం=మనమిద్దరం, గచ్ఛావః=వెళ్ళిపోదాం.

(ఇతి=అని, నిష్క్రాన్తౌ=వెళ్ళిపోయారు).

(ఇతి ప్రస్తావనా)

ఇతి=అని – ఇది, ప్రస్తవనా.నాటక పరిభాషలో ప్రస్తావన అంటే ప్రారంభదృశ్యం.

వ్యాఖ్య:

నటికి కలిగిన సందేహం నివారించే ప్రయత్నంలో నాటకంలో చంద్రగుప్త పరిరక్షణ, శత్రునిర్మూలన, రాక్షసమన్త్రిని ఆకట్టుకోవడం అనే లక్ష్యాలతో చాణక్య పాత్రను సూత్రధారుడు రంగస్థలం మీదకు ప్రవేశపెడుతున్నాడు. ఇక్కడ చేసిన ప్రస్తావనను ‘ఆముఖం’ అని కుడా అంటారు. ఇందులో అంతర్బాగంగా ‘చూళిగా’ లక్షణం కూడా చూపడమైంది. (అంతర్యవని కాంతస్థైః చూళికార్థస్య సూచనా) అంటే ఇక్కడ చాణక్యుని పాత్ర ద్వారా నాటకీయమైన అర్థాన్ని తెర వెనుక నుండి సూచించడం.

వృత్తం:

ప్రహర్షణి. మ-న-జ-ర-గ – గణాలు.

అలంకారం:

రూపకం. (క్రోధమనే అగ్ని నందరాజులనే వెదురును కాల్చడం).

(విష య్యభేదతాద్రూప్యరఞ్జనం  విషయస్య  యత్  రూపకం అని కువలయానందం).

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here