ముద్రారాక్షసమ్ – ప్రథమాఙ్కః – నాన్దీ

0
6

[box type=’note’ fontsize=’16’] ‘ముద్రారాక్షసం‘ ఏడంకాల రాజకీయ నాటకం. విశాఖదత్తుడు యీ నాటకాన్ని చతుర రాజకీయ వ్యూహాల అల్లికతో, అద్భుతంగా రూపొందించాడు. సంస్కృత సాహిత్యం మొత్తంలో అరుదైన ఈ నాటకాన్ని ఇంద్రగంటి శ్రీకాంతశర్మ గారు అనువాదించి, వ్యాఖ్యతో అందిస్తున్నారు. [/box]

నాన్దీ

శ్లోకం:

ధన్యా కేయం స్థితా తే శిరసి? – శశికలా,
కిం ను నామైత దస్యాః?
నామై వాస్యాస్త; దేతత్ పరిచిత మపి తే,
విస్మృతం కస్య హేతోః?!
నారీం పృచ్ఛామి నేన్దుం; కథయతు విజయా,
న ప్రమాణం య దీన్దు
ర్దేవ్యా నిహ్నోతు మిచ్ఛోరితి సురసరితం,
శాఠ్యమవ్యా ద్విభోర్వః -1

అర్థం:

ఇయమ్ = ఈ, ధన్యా = సౌభాగ్యవతి, కా = ఎవతె?, తే+శిరసి= నీ తల మీద, స్థితా= ఉన్నది (ప్రశ్న), శశికలా= నెలవంక; (జవాబు) – అస్యాః = ఈమె (యొక్క), నామ=పేరు, కిమ్?=ఏమిటి? (ప్రశ్న), ఏతత్+ను=ఈమె పేరా? (ప్రశ్న), ఏతత్+ఏవ=అదే, అస్యాః+నామ=ఈమె పేరు, తే=ఏతత్+నీకీ సంగతి, పరిచితం+అపి=తెలిసినదే అయినా, కస్య+హేతోః=ఎందువలన, విస్మృతం? =మరపు తగిలింది? (జవాబు) న+ఇన్దుమ్=చంద్రుణ్ణి గురించి కాదు; నారీమ్= ఆ ఆడమనిషిని గురించి, పృచ్ఛామి=అడుగుతున్నాను (ప్రశ్న), ఇన్దుః+యది+న+ప్రమాణమ్=చంద్రుణ్ణి ఉద్దేశించకపోయినట్టైతే, విజయా= (నీ చెలికత్తె) విజయ, కథయతు=చెపుతుందిలే! (జవాబు) ఇతి=అని యీ విధంగా, దేవ్యాః=పార్వతీ దేవి నుంచి (వలన), సుర+సరితమ్=దేవనది గంగను, నిహ్నోతుమ్=దాచిపెట్టాలని, ఇచ్ఛోః=కోరుకుంటున్న, విభోః=భర్త (యొక్క), శాఠ్యమ్=మోసకారిగుణం, వః= మిమ్మల్ని, అవ్యాత్=ప్రోచుగాక!

తాత్పర్యం:

పార్వతి తన భర్త పరమశివుడితో మాట్లాడుతోంది: “స్వామీ! మీ తల మీద ఉన్న ఆమె ఎవరు?” అని అడిగింది. అక్కడ నుంచి వారి సంభాషణ ఇలా కొనసాగింది – “చంద్రలేఖలే” “పేరేమిటో?” – “అదే, నీకు తెలుసు కద! మరిచిపోయావా?” – “నేనడిగేది చంద్రలేఖ గురించి కాదు, ఆ ఆడమనిషి ఎవరని?” – “ఎవరో, నీ చెలికత్తె విజయ చెపుతుందిలే” – అంటూ పరమశివుడు సమాధానం దాటవేశాడు. ఆయన శఠనాయకుడు, అంటే; తనకు వేరే స్త్రీతో గల సంబంధాన్ని దాచబెట్టేవాడు.

ఇదిగో – ఇటువంటి పరమశివుడు ప్రేక్షకులైన మిమ్మల్ని రక్షించుగాక!

వ్యాఖ్య:

‘కపటం’ కాపాడడమేమిటి? ఈ “ముద్రారాక్షసం” నాటకంలో, చంద్రగుప్తుణ్ణి చాణుక్యుడు కపటోపాయాలతో కాపాడడమే కీలకమైన విశేషం. తనకు ప్రత్యర్థి స్థానంలో నందవంశ పక్షపాతిగా ఉన్న రాక్షసమంత్రిని, అతడి వ్యూహాలను, దెబ్బతీయడమే చాణక్యుడి రాజనీతి.

శ్లోకంలో ‘కపటగుణం’ శివుడి శృంగార మనః స్థితిని సూచిస్తోంది గనక, ప్రేక్షకులను కాపాడాలని సూచన.

పార్వతి సూటిదనం నాటకంలో రాక్షసమంత్రి సూటి ప్రవర్తననీ, శివుడి కపటగుణం చాణక్యనీతినీ, సూచిస్తోంది. “ఇందుః” అనే చంద్ర ప్రస్తావన చంద్రగుప్తుడి చాణక్య ఆశ్రయత్వాన్ని కావ్యార్థ సూచనగా గమనించవచ్చు.

‘విజయ’ పదం నాటకంలో మలయకేతుడి ప్రతీహారిని సూచిస్తుంది (“విజయే, శకటదాసం ద్రష్టుమిచ్ఛామి”).

శ్లోకంలో “పృచ్ఛామి” అనే క్రియ, పార్వతి దృష్టిలో “నారీం పృచ్ఛామి” అని కాగా – “ఇన్దుమ్ పృచ్ఛామి” అన్నట్టుగా అర్థం తీసి, శివుడు “నీకు తెలుసు కదా!” అనడంలోనే కపటం దాగి ఉంది. దీనిని పార్వతి “న+ఇన్దుమ్” అని బట్టబయలు చేసింది.

ఇక్కడ అలంకారం వక్రోక్తి. శ్లేష ద్వారా గాని, పలుకు తీరు ద్వారా గాని, ఒక తీరు వాక్యాన్ని మరొక లాగ స్ఫురింప చెయ్యడం వక్రోక్తి. (అన్యథోక్తస్య వాక్యస్య కాక్వాశ్లేషేణ వాభవేత్। అన్యథా యోజనం యత్ర సా వక్రోక్తి ర్ని గద్యతే – ప్రతాపరుద్రీయం).

పార్వతి చెలికత్తె పేరు విజయ అనడానికి ప్రమాణం: కాళిదాసు కుమార సంభవమ్ – 8 స – 49 శ్లో. – “నిర్విభుజ్య దశనచ్ఛదం” అనేది.

“ధన్యా కేయం?” అంటూ శ్లోకం ఎత్తుకోవడంలోనే “ఎవరు మహానుభావా, తమ నెత్తికెక్కిన ధన్యురాలు?” అని ఎత్తిపొడుపు గమనించదగినది.

వృత్తం:

స్రగ్ధర (మ – ర – భ – న -య – య -య గణాలు).

అపి+చ= అంతేకాదు;

శ్లోకం:

పాద స్యావిర్భవన్తీ మవనతి మవనే
రక్షతః స్వైర పాతైః
సంకోచే నైవ దోష్ణాం ముహు రభినయతః
సర్వలోకాతిగానామ్।
దృష్టిం లక్ష్యేషు నోగ్రజ్వలన కణముచం
బధ్నతో దాహభీతే?
రి త్యాధారానురోధాత్ త్రిపుర విజయినః
పాతు వో దుఃఖ నృత్తమ్॥ – (2)

అర్థం:

పాద్యస్య+ఆవిర్భవన్తీమ్=పాదం తాకిడికి కలిగే అవకాశం ఉన్న, అవనేః=నేల (యొక్క), అవనతిమ్=క్రుంగుదలను, రక్షతః=తప్పించేటిన్నీ, సర్వ+లోక+అతిగానాం=పై నుండే అన్ని లోకాలలో కంటా చొచ్చుకుపోగల, దోష్ణాం=చేతులను (యొక్క), ముహుః=మాటిమాటికి, సంకోచేన+ఏవ=క్రిందకు దించుకోవడంద్వారా (తో)నే, అభినయతః=హస్తాభినయం చేస్తున్నట్టిన్నీ, ఉగ్ర+జ్వలన+ముచం=భయావహమైన నిప్పునెరుసులను విడిచే, దృష్టిం=(మూడవ) కంటిచూపును, దాహభీతేః=కాల్చివేయగలవనే భీతితో (వలన) లక్ష్యేషు=దృష్టిపథంలో గోచరించే సామాగ్రిపై (యందు), న+బధ్నతః= కేంద్రీకరించనట్టిన్నీ, ఇతి=ఈ తీరున, ఆధార+అనురోధాత్= (తన నృత్తానికి) అనుసరించదగిన పరిమితి దృష్ట్యా (వలన), త్రిపుర+విజయినః=పరమశివుని (యొక్క), దుఃఖ+నృత్తం=కష్టమైన నృత్తం, వః=మిమ్మల్ని, పాతు= ప్రోచుగాక!

తాత్పర్యం:

పరమశివుడు సంధ్యా తాండవం చేస్తున్నాడు. ఆ దృశ్యం భూమ్యాకాశాల మధ్య కనిపించే ఆనంద తాండవం. అయితే – ఆయనకు తన రంగస్థల పరిమితులు తెలుసు. పూర్తిగా అభినయిస్తూ పైకి చేతులు చాచితే, అవి పై లోకాల లోనికి చొచ్చుకుపోతాయి. తాళానుగుణంగా పాదాలతో భూమిని తట్టితే నేల క్రుంగిపోవచ్చు. కళ్ళను విప్పార్చి, పుష్కలంగా నేత్రాభినయం చేద్దామంటే, మూడవ కంటి మంట నిప్పునెరుసులు కంటి యెదుట వస్తు సామాగ్రిని కాల్చేయవచ్చు.

ఇలా – పాద, హస్త, నేత్రాభినయాలకు గల పరిమితులను దృష్టిలో ఉంచుకొని, నృత్తం చేయడం చాలా క్లిష్టమైన ప్రక్రియ. అయినా – త్రిపుర విజయి అయిన పరమశివుడు శ్రమగా భావించకుండా చేస్తున్నాడు. ముల్లోకాలపట్ల దయతో ఆయన జరిపే ‘దుఃఖనృత్తం’ ప్రేక్షకులైన మిమ్మల్ని రక్షించుగాక!

వ్యాఖ్య:

దుఃఖనృత్తం యీ శ్లోకంలో ప్రధాన విషయం. దుఃఖ పదానికి ఖేదమనే అర్థమే కాక, అసౌకర్యం, కష్టతరం, అసుఖం అనే అర్థాలున్నాయి. ‘పరిమితుల వల్ల కష్టసాధ్య’మని ఇక్కడ అర్థం.

నృత్తం తాళ ప్రధానం. తాళానుగుణంగా అంగన్యాస, కరన్యాసాలు కొనసాగిస్తూ, కంటి చూపు ద్వారా భావం చూపవలసిన కళ.

నాందీ ముఖంగా చెప్పిన రెండు శ్లోకాలూ పరమశివుడి పరంగా చెప్పినవే. రెండూ, రెండు విధాల గోపనాలను చెపుతున్నాయి.

మొదటిది లలితం. చాణక్యుడు చంద్రగుప్తునిపట్ల ప్రేమతో, కేవలం రక్షణకు ద్దేశించిన సాధారణ గోపనం.

రెండవ శ్లోకము, రాజనీతిలో చాణక్యుడు అనుసరించే వ్యూహాత్మక గోపనాలను సూచిస్తుంది.

నందవంశాన్ని ఓడించి రాజ్యం పుచ్చుకున్న ‘విజయి’ చాణక్యుడనుకుంటే – పాద, కర, నేత్ర చలనాల తీరు, వ్యూహాత్మక చర్యలుగా భావించవచ్చు.

అలంకారం:

నృత్తంలో అనుసరించిన పరిమితుల వర్ణన, స్వభావసుభగం కనుక – స్వాభావోక్తి.

(స్వభావోక్తిః స్వభావస్య జాత్యాదిస్థస్య వర్ణనమ్ – కువలయానందం)

భూమి క్రుంగడం, చేతులు ఊర్థ్వలోకాలకు చొచ్చుకుపోవడం, ముడవ కన్ను నిప్పులు చిమ్మడం – వాటి పరస్పర సంబంధాన్ని నృత్తానికి జత చేయడం వల్ల, సంబంధాతిశయోక్తి కూడ.

(విషయస్యానుపానాదానాత్ విషయ్యుపనిబధ్యతే – ప్రతాపరుద్రీయం)

వ్యాఖ్య:

శ్లోకంలో ‘ఆవిర్భవిష్యన్తీమ్’ అనే భవిష్యదర్థంలో ‘ఆవిర్భవన్తీమ్’ అనే వర్తమాన క్రియ కంటే ‘ఆవిర్భవిత్రీమ్’ అనే భవిష్యదర్థకక్రియను పఠించడం మేలని శ్రీ వేదం వేంకటరాయశాస్త్రిగారి సవరణ. అలాగే శ్లోకం తొలిపాదంలోని ‘రక్షతః స్వైర పాతైః’ – అనే చోట ‘అస్వైర పాతైః+రక్షతం’ అనే అర్థంలో రక్షతోఽస్వైరపాతైః (మెల్లని పాదచాలనంతో కాపాడుతూ) అనే సవరణను కూడా వేదంవారు సూచించినట్టు, శ్రీ నేలటూరు రామదాసయ్యంగారి వివరణ.

సారాంశంగా – ఈ శ్లోకం ద్వారా, చాణక్యుడి వ్యూహరచన, రాక్షసమంత్రి వ్యూహరచనలకు ప్రతిగా – తగిన పరిమితులను అనుసరించిందని గ్రహించాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here