ముద్రారాక్షసమ్ – సప్తమాఙ్కః -1

0
11

[box type=’note’ fontsize=’16’] ‘ముద్రారాక్షసం‘ ఏడంకాల రాజకీయ నాటకం. విశాఖదత్తుడు యీ నాటకాన్ని చతుర రాజకీయ వ్యూహాల అల్లికతో, అద్భుతంగా రూపొందించాడు. సంస్కృత సాహిత్యం మొత్తంలో అరుదైన ఈ నాటకాన్ని ఇంద్రగంటి శ్రీకాంతశర్మ గారు అనువదించి, వ్యాఖ్యతో అందిస్తున్నారు. [/box]

(తతః ప్రవిశతి చణ్డాలః)

చణ్డాలః:

ఓసలేహ, ఓసలేహ! అవేహ, అవేహ!

(అపసరత, అపసరత. అపేత, అపేత.)

అర్థం:

అపసరత+అపసరత=తప్పుకోండి, తప్పుకోండి. అపేత+అపేత=తొలగిపొండి.

శ్లోకం:

జఇ ఇచ్ఛహ లక్ఖిదవ్వే ప్పాణే విహవేకు లే కలత్తే అ

తా పలిహలహ విసమం లాఆపత్థం సుదూలేణ. (1)

(యది ఇచ్ఛత రక్షితవ్యాః ప్రాణా విభవః కులం కలత్రం చ

తత్పరిహరత విషమం రాజాపథ్యం సుదూరేణ.)

అర్థం:

ప్రాణా=ప్రాణాలు, విభవః=సంపద, కులం=గృహం, కలత్రం+చ=భార్యనున్నూ, రక్షితవ్యాః+యది+ఇచ్ఛత=వీరందరూ క్షేమంగా ఉండాలని కోరుకునే మాటుంటే, తత్=అందువల్ల, విషమం+రాజాపథ్యం=సంకటకరమైన రాజు పట్ల నచ్చని దానిని, సుదూరేణ+పరిహరత=అట్టి ఆలోచనను దూరంగా తరమండి.

వృత్తం:

ఆర్య.

అలంకారం:

అర్థాంతరన్యాసం. ప్రస్తుత చందనదాస శిక్షను దృష్టిలో ఉంచుని తలవరి చేసిన సాధారణీకరణం కారణం.

అవి అ

(అపి చ) –

అర్థం:

అపి+చ= ఇంకా

శ్లోకం:

హోది పులిసస్స వాహీ మలణం వా సేవిదే అపత్థమ్మి

లాఆపత్థే ఉణ సేవిదే సఅలం వి కులం మలది (2)

(భవతి పురుషస్య వ్యాధిర్మరణం వా సేవితే అపథ్యే

రాజాపథ్యే పునః సేవితే సకల మపి కులం మ్రియతే )

అర్థం:

పురుషస్య+అపథ్యే+సేవితే=ఒకానొక వ్యక్తికి తీసుకొనరాని ఆహారం స్వీకరించడం జరిగితే, వ్యాధిః+మరణం+వా=జబ్బు లేదా మరణం (తథ్యం); రాజాపథ్యే+పునః= (ఇదే) రాజు పట్ల నచ్చని పని చేయడమంటే – సేవితే=చేయడం జరిగితే – సకలం+అపి+కులం+మ్రియతే=మొత్తం వంశానికంతకూ చావు తప్పదు.

వృత్తం:

ఆర్య.

వ్యాఖ్య:

ఆహార విషయంలో ఎవరైనా వ్యక్తి అపథ్యం చేస్తే వాడికొక్కడికే జబ్బో, చావో! – అదే వ్యక్తి రాజు పట్ల అపథ్యంగా ప్రవర్తిస్తే మొత్తం కులం ఆపద పాలుకావడం తథ్యం – అంటూ కథాసందర్భంలోకి తలవరి తీసుకువెడుతున్నాడు.

చణ్డాలః:

తా జది ణ పతిజ్జహ తా ఏహ పేక్ఖహ ఏఅం లాఆపత్థకావిణం సెట్టి చందణదాసం సఉత్తకలత్తం వజ్ఝట్టాణం ణీయమాణం. (ఆకాశే శ్రుత్వా) అజ్జా, కిం భణహ అత్తి సే కోవి మోక్ఖోవాఓత్తి, అజ్జా, అత్థి, అమచ్చరక్ఖసస్స ఝరఅణం జం సమప్పేది. (పున రాకాశే) కిం భణహ ఏపే – సలణాగదవచ్ఛలే అత్తణో జీవిద మేతస్స కాలణే ఇదిసం అకజ్జం ణ కలిస్సదిత్తి, అజ్జా, తేణ హి అవధాలేహ సే సుహాం గదిం. కిం దాణిం తుమ్హాణం ఎత్థ పడిఆరవిఆరేణ.

(తద్యది న ప్రతీథ, తదత్ర పేక్షధ్వ మేనం రాజాపథ్య కారిణం శ్రేష్ఠి చన్దనదాసం సపుత్రకలత్రం వధ్యస్థానం నీయమానమ్. ఆర్యాః, కిం భణథ – అస్త్యస్య కోఽపి మోక్షోపాయ, ఇతి. ఆర్యాః, అస్తి, అమాత్య రాక్షసస్య గృహజనం యది సమర్పయతి… కిం భణథ, ఏష శరణాగతవత్సల ఆత్మనో జీవితమాత్రస్య కారణే ఈదృశ మకార్యం న కరిష్య తీతి? ఆర్యాః, తేన హి అవధారయ తాస్య సుఖాం గతిమ్. కి మిదానీం యుష్మాక మత్ర ప్రతీకార విచారేణ?)

అర్థం:

యది+తత్+న+ప్రతీథ=ఆ విషయం మీరు విశ్వసించనట్లయితే, తత్+అత్ర+పేక్షధ్వం+ఏనం=అప్పుడు ఇటు వైపు వీనిని చూడండి; స+పుత్ర+కలత్రం+వధ్యస్థానం+నీయమానం+రాజాపథ్యకారిణం+శ్రేష్ఠి చన్దనదాసం=భార్యాబిడ్దలతో సహా వధ్యస్థానానికి తీసుకుని పోబడుతున్న, రాజుకు అనిష్టాన్ని ఆచరించిన చందనదాసు అనే శెట్టి (వీడు) – ఆర్యాః+కిం+భణథ=అయ్యలారా! ఏమంటున్నారు? – ‘అస్య+మోక్ష+ఉపాయః+అస్తి?’ +ఇతి=ఏదేని తప్పించుకొను ఉపాయము కలదా అనా!, ఆర్యాః=అయ్యలారా, అస్తి=ఉన్నది; అమాత్యరాక్షసస్య=రాక్షసమంత్రి యొక్క, గృహజనం=కుటుంబాన్ని, యది+సమర్పయతి=(రాజుకు) అప్పగించినట్లయితే (ఉన్నది); కిం+భణథ=ఏమంటున్నారు, ఏష=ఈ (చందనదాసు), శరణాగత+వత్సలః=తన్ను ఆశ్రయించినవారి పట్ల ప్రేమ గలవాడు. ఆత్మనః+జీవితమాత్రస్య+కారణే=తన బ్రతుకును రక్షించుకోవడం కోసం, ఈదృశం=ఇటువంటి, అకార్యం+న+కరిష్యతి+ఇతి=చేయరాని పని చేయడంటారా? ఆర్యాః=అయ్యలారా, తేన (కారణేన)=ఆలాగు అయే మాటుంటే, అస్య+సుఖాంగతిమ్=అతడికి పట్టే సుఖపరిస్థితిని, అవధారయ=పరికించండి. యుష్మాకం=మీకు, ఇదానీం=ఇప్పుడు, కిం+అత్ర+ప్రతీకార+విచారేణ=ఇందుకేమి చేయగలమనే ఆలోచన ఏల?

(తతః ప్రవిశతి ద్వితీయ చణ్డాలానుగతో వధ్య వేశధారీ శూలం స్కన్ధే నాదాయ కుటుమ్బిన్యా పుత్రేణ చానుగమ్యమాన శ్చన్దనదాసః)

అర్థం:

తతః=పిమ్మట, ద్వితీయ+చణ్డాల+అనుగతః=రెండవ తలారి వెంటనంటి రాగా, వధ్యవేశధారీ=మరణశిక్ష అనుభవించేవాడి వేషంతో, శూలం+స్కన్ధేన+ఆదాయ=భుజం మీద శూలాన్ని మోస్తూ, కుటుమ్బిన్యా=భార్య చేత, పుత్రేణ=పుత్రుడి చేత, అనుగమ్యమానః=అనుసరింపబడుతూ, చన్దనదాసః+ప్రవిశతి=చందనదాసు ప్రవేశిస్తున్నాడు.

చన్దన:

(సబాష్పమ్) హద్ధీ హద్ధీ! అహ్మారిసాణాం వి ణిచ్చం చారిత్త భంగ భీరూణం చోరణోచిదం మరణం హోది త్తిణమో కిదంతస్స. అహవా ణిసంసాణం ఉదాసీణేసు ఇదరేసు వా విసేసోత్థి? తహ హి –

(హాధిక్, హాధిక్, అస్మాదృశానా మపి సత్య చారిత్ర భఙ్గ భీరూణాం చోరజనోచితం మరణం భవతీతి నమః కృతాన్తస్య, అథ వా న నృశంసానాం ఉదాసీనేషు వా విశేషోఽస్తి. తథాహి)

అర్థం:

(సబాష్పమ్=కన్నీటితో), హాధిక్+హాధిక్=అయ్యయ్యో, అయ్యయ్యో!; సత్య+చారిత్ర+భఙ్గ+భీరూణాం=సత్యమైన నడవడికి విఘాతం కలుగుతుందనే భయంతో, అస్మాదృశానాం+అపి=మా వంటి బ్రతికినవారికి సైతం – చోరజన+ఉచితం+మరణం+భవతి+ఇతి=దొంగలకు తగిన చావు సంభవిస్తోందే అని! (విచారం); నమః+కృతాన్తస్య=యముడికి నమస్కారం, అథవా=అయినా, నృశంసానాం=క్రూర స్వభావులకు, ఉదాసీనేషు+వా=నిరవరాధులకు (అపరాధులకు), న+విశేషః+అస్తి=భేదం లేదు. తథా+హి=అంతే కదా –

శ్లోకం:

మోత్తూణం ఆమిసాఇం మరణభఏణ తిణేహి జీవన్తం

వాహాణం ముద్ధహరిణం హంతుం కో ణామ ణిబ్బంధో – (3)

(ముక్త్వా ఆమిషాణి మరణభయేన తృణై ర్జీవన్తమ్

వ్యాధానాం ముగ్ధహరిణం హన్తుం కో నామ నిర్భన్ధః)

అర్థం:

ఆమిషాణి=మాంసాలను, మరణభయేన=చావు భయంతో, ముక్త్వా=విడిచి, తృణైః=గడ్దిపరకలతో, జీవన్తమ్=బ్రతుకు సాగించే, ముగ్ధ+హరిణం=ముద్దుల లేడిని, హన్తుం=వధించడానికి, వ్యాధానాం=వేటగాళ్ళకు, కః+నామ+నిర్భన్ధః=బలవంతం ఏమి ఉంటుంది?

వృత్తం:

ఆర్య.

అలంకారం:

అప్రస్తుత ప్రశంస – ప్రస్తుత విషయం చన్దనదాస వధ. ముగ్ధహరిణం – వ్యాధ – ప్రస్తావన అప్రస్తుతుం, ఇక్కడ అప్రస్తుతం చేత ప్రస్తుత సమర్థన గమనించదగినది.

(సమన్తా దవలోక్య) భో! పిఅవఅస్స! విష్ణుదాస! కహం పడివఅణం విణమే పడివజ్జసిఅహ వా దుల్ల హా తేక్ఖు మాణసా జే ఏదస్సిం కాలే దిట్ఠిపథే వి చిట్ఠన్తి, (సబాష్పమ్) ఏదే అహ్మపిఅవఅస్సా అంసుపాదమేత్తకేణ కిదణివావసలిలా విఅ కహం వి పడిణివ్వత్తమాణా సోఅదీణవఅణా వాహగురుఆఏ దిట్ఠీఏ మం అణుగచ్ఛన్ది – (ఇతి పరిక్రామతి)

(భో ప్రియవయస్య విష్ణుదాస, కథం! ప్రతివచనమపి న మే ప్రతిపద్యసే। అథవా దుర్లభాస్తే ఖలు మానుషాయ ఏతస్మిన్ కాలేదృష్టిపథేఽపి తిష్ఠన్తి। ఏతేఽస్మత్ ప్రియవయస్యా అశ్రుపాత మాత్రేణ కృతని వాపసలిలా ఇవ కథ మపి ప్రతివర్తమానాః శోక దీనవదనా బాష్పగుర్వ్యా దృష్ట్యా మానుగచ్ఛన్తి॥)

అర్థం:

భో+ప్రియవయస్య+విష్ణుదాస=ఏమయ్యా, ప్రియమిత్రమా! విష్ణుదాసా!, కథం=ఏమిటి?, మే+ప్రతివచనం+అపి+న+ప్రతిపద్యసే=నాకు సమాధానం కూడా ఎందుకు చెప్పవు? అథ+వా=కాదంటే, ఏతస్మిన్+కాలే=ఈ కాలంలో, తే+ఖలు+మానుషాః=నీ వంటి మనుషులే, దృష్టిపథే+అపి=కనుచూపు మేరలో, దుర్లభాః+తిష్ఠన్తి=కనిపించడం! (ఉండడం). ఏతే+అస్మత్+ప్రియవయస్యా=ఇదిగో నా ప్రియ స్నేహితులు, అశ్రుపాత+మాత్రేణ=కేవలం కన్నీరు విడవడం అనే పనితోనే, కృత+నివాప+సలిలాః+ఇవ=(నాకు) తర్పణాలు విడుస్తున్నట్లుగా, కథమపి=ఏదో విధంగా (అతి కష్టం మీద), ప్రతివర్తమానాః=ఉంటున్నవారై, శోక+దీన+వదనాః=దుఃఖం వల్ల దిగులుగా కనిపించే ముఖాలు కలవారై, బాష్పగుర్వ్యా+దృష్ట్యా=కన్నీటితో బరువెక్కిన చూపుతో, మా+అనుగచ్ఛన్తి=నా వెంట వస్తున్నారు.

చణ్డాలః:

అజ్జ చన్దనదాస, ఆఅదోసి వజ్ఝట్ఠాణం, తా విసజ్జేహి పలిజణం.

(ఆర్య చన్దనదాస, ఆగతోఽసి వధ్యస్థానమ్. త ద్విసర్జయ పరిజనమ్.)

అర్థం:

ఆర్య+చన్దనదాస=అయ్యా, చందనదాస, వధ్యస్థానమ్+ఆగత+అసి=వధించవలసిన చోటుకు చేరుకున్నావు. తత్=అందువల్ల, పరిజనమ్+విసర్జయ=నీ పరివారాన్ని విడిచిపెట్టు.

చన్దన:

కుబుంబిణి, ణివత్తేహి సంపదం సపుత్తా ణ జుత్తం క్ఖు అదోవరం అణుగచ్ఛిదుం।

(కుటుమ్బిని, నివర్తస్వ సాంప్రతం సపుత్రా। నయుక్తం ఖల్వతఃపరం అనుగన్తుమ్।)

అర్థం:

కుటుమ్బిని=ఇల్లాలా!, సాంప్రతం+సపుత్రా+నివర్తస్వ=ఇప్పుడిక మన సంతానంతో కలిసి, వెనుదిరిగిపో. అతః+పరం+అనుగన్తుమ్=ఇంతకు మించి నా వెంట రావడం, న+యుక్తం+ఖలు=తగదు కదా.

కుటుమ్బిని:

(సబాష్పమ్) పరలోఅం పత్థిదో అజ్జో, ణ దేసంతరం।

(పరలోకం ప్రస్థిత ఆర్యో, న దేశాన్తరమ్।)

అర్థం:

(స+బాష్పమ్=కన్నీటితో), ఆర్యః=తమరు, పరలోకం+ప్రస్థిత=లోకాన్తరానికి ప్రయాణమయ్యారు, న+దేశాన్తరమ్=మరొక దేశానికి కాదు.

చన్దన:

అజ్జే, అఅం మిత్తకజ్జేణ మే విణాసో, ణ ఉణ పురిసదోసేణ, తా అలం విసాదేణ॥

(ఆర్యే, అయం మిత్ర కార్యేణ మే వినాశో; న పునః పురుషదోషేణ; త దలంవిషాదేన॥)

అర్థం:

ఆర్యే=ఇల్లాలా, అయం+మిత్రకార్యేణ+మే+వినాశః=ఈ నా అంతానికి కారణం ఒక మిత్రుడి పనికి సంబంధించినది; న+పునః+పురుషదోషేణ= ఇతరత్రా మనిషి తప్పిదం వల్ల కాదు. తత్+అలం+విషాదేన=అందువల్ల విచారించ తగదు.

కుటుమ్బిని:

అజ్జ, జఇ ఏవం; తా దాణిం అకాలో కులజణస్స నివట్టిదుం।

(ఆర్య, యద్యేవమ్; త దిదానీ మకాలః కులజనస్య నిర్వతితుమ్।)

అర్థం:

ఆర్య=పూజ్యుడా, యది+ఏవమ్=అలా అయే మాటుంటే; తత్=అప్పుడు, ఇదానీం=ఇంతలో, కులజనస్య+నిర్వతితుమ్=కుటుంబం మరలిపోవడానికి, అకాలః=వెళ్ళదగిన వేళ కాదు.

చన్దన:

అహం కిం నవసిదం కుటుంబిణీఏ? (అథ, కిం వ్యవసితం కుటుంబిన్యా?)

అర్థం:

అథ=ఇక, కుటుంబిన్యా=ఇల్లాలి చేత, కిం+వ్యవసితం=ఏమి నిశ్చయింపబడినది?

కుటుమ్బిని:

భత్తుణో చలణే అణుగచ్ఛంతీఏ అప్పాణుగ్గహో హోదిత్తి।

(భర్తుశ్చరణా వనుగచ్ఛన్త్యా ఆత్మానుగ్రహో భవతీతి।)

అర్థం:

భర్తుః+చరణా=భర్త పాదాలను, అనుగచ్ఛన్త్యా=అనుసరించడం చేత, ఆత్మానుగ్రహః=నన్ను నేను తరించుకొనే అవకాశం, భవతి+ఇతి=కలుగుతుంది.

చన్దన:

అజ్జే, దువ్వవసిదం ఏదం తుఏ। అఅం పుత్తఓ అసుణిద లోఅ సంవవహారో బాలో అణుగహ్ణిదవ్వో।

(ఆర్యే, దుర్వ్యవసిత మిదం త్వయా। అయం పుత్రకో ఽశ్రుతలోక వ్యవహరో బాలో ఽనుగృహీతవ్యః।)

అర్థం:

ఆర్యే=ఇల్లాలా, త్వయా=నీ చేత, ఇదం+దుర్వ్యవసితం=ఇది తగని పని (చేయకూడబడరాని పని). అశ్రుత+లోకవ్యవహరః+అయం+పుత్రకః=లోకం పోకడ లేమీ ఎరుగనివాడు ఈ మన పుత్రుడు, బాలః+అనుగృహీతవ్యః=ఈ పసివాడు దయ చూపదగినవాడు.

కుటుమ్బిని:

అణుగిహ్ణన్దు ణం ససణ్ణాఓ దేవదాఓ। జాద, పుత్తఅ పత పచ్చిమేసు పిదుణో పాదేసు।

(అనుగృహ్ణన్త్వేనం ప్రసన్నా దేవతాః। జాత, పుత్రక, పత పశ్చిమయోః పితుః పాదయో।)

అర్థం:

ప్రసన్నాః+దేవతాః=దయతలచిన దేవతలు, ఏనం+అనుగృహ్ణన్తు=వీనిని అనుగ్రహింతురు గాక! జాత=నాయనా, పశ్చిమయోః+పితుః+పాదయోః+పత=కడపటివైన (ఈ) తండ్రి పాదాలపై పడు.

పుత్రః:

(పాదయోర్నిపత్య) తాద, కిం దాణిం మఏ తాద విరహిదేణ అనుచిట్ఠిదవ్వం?

(తాత, కిమిదానీం మయా తాత విరహితేన అనుష్ఠాతవ్యమ్?)

అర్థం:

(పాదయోర్నిపత్య=పాదాలపై పడి), తాత=తండ్రీ!, తాత+విరహితేన+మయా=తండ్రిని కోల్పోయిన నా చేత, ఇదానీం=ఇప్పుడు, కిమ్+అనుష్ఠాతవ్యమ్=ఏమి నెరవేర్పబడవలసి ఉంటుందీ?

చన్దన:

పుత్త, చాణక్క విరహిదే దేసే వసిదవ్వం। (పుత్ర, చాణక్యవిరహితే దేశే వస్తవ్యమ్।)

అర్థం:

పుత్ర=అబ్బాయీ, చాణక్య+విరహితే+దేశే=చాణక్యుడు లేని దేశంలో, వస్తవ్యమ్=నువ్వు నివసించాలి.

చణ్డాలః:

అజ్జ చందణదాస, ణిఖాదే శూలే, తా సజ్జో హోహి।

(ఆర్య చన్దనదాస, నిఖాతః శూలః। తత్ సజ్జో భవ।)

అర్థం:

ఆర్య+చన్దనదాస=అయ్యా, చందనదాసా! నిఖాతః+శూలః=శూలాన్ని పాతడమైనది. తత్+సజ్జః+భవ=ఇక సిద్ధం కా.

కుటుమ్బిని:

అజ్జా, పరిత్తాఅధ, పరిత్తాఅధ। (ఆర్యాః, పరిత్రాయధ్వమ్ పరిత్రాయధ్వమ్।)

అర్థం:

ఆర్యాః=అయ్యలారా, పరిత్రాయధ్వమ్+పరిత్రాయధ్వమ్=రక్షించండి, రక్షించండి.

చన్దన:

అజ్జే, అహ కిం ఏత్థ ఆకందసి సగ్గం గదాణం దావ దేవా దుఃఖఅం పరిఅణం అణుకంపంది। అణ్ణం అ। మిత్త కజ్జేణ మేవిణాసో, ణ అజుత్తకజ్జేణ। తా కిం హరిసట్ఠాడే ఏ రోదీఅది?

(ఆర్యే, అథ కి మత్ర ఆక్రన్దసి? స్వర్గం గతానాం తావత్ దేవ దుఃఖితం పరిజన మనుకమ్పన్తే। అన్యచ్చ। మిత్రకార్యేణ మే వినాశో, నాయుక్త కార్యేణ, తత్ కిం హర్ష స్థానేఽపి రుద్యతే?)

అర్థం:

ఆర్యే=ఇల్లాలా!, అథ=ఇప్పుడు, కిమ్+అత్ర+ఆక్రన్దసి=ఇక్కడ ఎందుకు యేడుస్తున్నావు?, స్వర్గం+గతానాం+తావత్=స్వర్గానికి పోయే వారి విషయంలో అయితే, దేవాః=దేవతలు, దుఃఖితం+పరిజనం=దుఃఖపడే పరిజనాన్ని, అనుకమ్పన్తే=దయదలుస్తారు. అన్యత్+చ=మరొకటేమంటే, మిత్రకార్యేణ+మే+వినాశః=స్నేహితుడి కారణంగా నా వినాశం జరుగుతోంది. అయుక్త+కార్యేణ+న=చేయరాని పని కారణంగా కాదు. తత్=అందువల్ల, హర్షస్థానే+అపి=సంతోషించవలసిన సందర్భంలో కూడా, కిం+రుద్యతే=ఎందుకీ ఏడుపు?

ప్రథమశ్చణ్డాలః:

అలే బిల్వపత్త! గేహ్ణ చందనదాసం। సఅం ఎవ్వ పరిఅణా గమిస్సది।

(అరే బిల్వపత్ర! గృహాణ చన్దనదాసమ్। స్వయమేవ పరిజనో గమిష్యతి।)

అర్థం:

అరే+బిల్వపత్ర=ఒరేయ్ బిల్వపత్రా, చన్దనదాసమ్+గృహాణ=చందనదాసును పట్టుకుని ఉండు. పరిజనః=అతడి ఇల్లాలు, స్వయం+ఏవ+గమిష్యతి=తనంతట తానే వెళుతుంది.

ద్వితీయశ్చణ్డాలః:

అలే వజ్జలోమా! ఏస గేహ్ణామి। (అరే వజ్రలోమన్!, ఏష గృహ్ణామి।)

అర్థం:

అరే+వజ్రలోమన్=ఒరే వజ్రలోమా!, ఏషః+గృహ్ణామి=ఇదిగో పట్టుకొని ఉన్నాను.

చన్దన:

భద్ద, మహుత్తం చిట్ఠ। జాన పుత్తఅం సన్తఆమి। (పుత్రం మూర్ధ్ని ఆఘ్రాయ) జాద, అవస్సం భవిదవ్యే విణాసే మిత్తకజ్జం సమువ్వహమాణో విణాసం అణుభవామి।

(భద్ర, ముహూర్తం తిష్ఠ। యావత్ పుత్రకం సాన్వయామి। జాత, అవశ్యం భవితవ్యే వినాశే మిత్రకార్యం సముద్వహమానో వినాశ మనుభవామి।)

అర్థం:

భద్ర=నాయనా, ముహూర్తం+తిష్ఠ=ఒక్క క్షణం ఉండు. యావత్+పుత్రకం+సాన్వయామి=(ఎంతలో) నా కుమారుణ్ణి ఓదారుస్తాను. జాత=చిరంజీవీ, అవశ్యం+భవితవ్యే+వినాశే=వినాశం తప్పని పరిస్థితిలో, మిత్రకార్యం+సముద్వహమానః=స్నేహితుడి పనిని నిర్వహిస్తూ (నెరవేరుస్తూ), వినాశం+అనుభవామి=నాశం పొందుతున్నాను.

పుత్రః:

తాద, కిం ఏదం వి భణిదవ్వం. కులధమ్మో క్ఖు ఏసో అహ్మాణం.

(తాత, కి మిద మపి భణితవ్యమ్. కులధర్మః ఖల్వేషోఽస్మాకమ్.) –

(ఇతి పాదయోః పతతి)

అర్థం:

తాత=నాన్నా, కిమ్+ఇదం+అపి+భణితవ్యమ్=ఇది కూడా ఎందుకనుకోవాలి? ఏషః=ఇది, అస్మాకమ్+కులధర్మః+ఖలు=ఇది మన వంశధర్మం. –

(ఇతి=అని, పాదయోః+పతతి=కాళ్ళపై పడ్డాడు).

చణ్డాలః:

అలే, గేహ్ణా ఏణం. (అరే, గృహా ణైనమ్.)

అర్థం:

అరే=ఒరే, ఏనం+గృహాణ=ఇతడిని పట్టుకొని ఉండు.

కుటుమ్బిని:

(సోరస్తాడమ్) అజ్జ, పరిత్తాహి పరిత్తాహి। (ఆర్య, పరిత్రాయస్వ, పరిత్రాయస్వ।)

అర్థం:

(స+ఉరః+తాడనమ్=గుండెలు బాదుకొంటూ) ఆర్య=అయ్యా, పరిత్రాయస్వ+పరిత్రాయస్వ=రక్షించు, రక్షించు!

(రాక్షసః ప్రవిశ్య పటాక్షేపేణ)

(పటాక్షేపేణ=నేపథ్యపు తెరని తోసివేస్తూ, రాక్షసః+ప్రవిశ్య=రాక్షసమంత్రి ప్రవేశించి)

రాక్షసః:

భవతి, న భేతవ్యమ్। భో భో, శూలాయతనాః, న ఖలు వ్యాపాదయితవ్య శ్చన్దనదాసః।

అర్థం:

భవతి+న+భేతవ్యమ్=భయపడవలసిన పని లేదు. భో+భోః+శూలాయతనాః=ఓరి శూలపాలకులారా!, చన్దనదాసః+న+వ్యాపాదయితవ్యః+ఖలు=చందనదాసు (ఇక) చంపదగినవాడు కాదు గద!

శ్లోకం:

యేన స్వామికులం రిపో రివ కులం

దృష్టం వినశ్యత్పురా,

మిత్రాణాం వ్యసనే మహోత్సవ ఇవ

స్వస్థేన యేవ స్థితమ్,

ఆత్మాయస్య వధాయ వః పరిభవ

క్షేత్రీకృతో ఽపి ప్రియ,

స్తస్యేయం మమ మృత్యులోక పదవీ

వధ్య స్రగాబధ్యతామ్. (4)

అర్థం:

స్వామికులం=ప్రభుని వంశం, యేన=ఎవరి చేత,  రిపోః+కులం+ఇవ=శత్రువు (యొక్క) వంశం మాదిరి, వినశ్యత్=నాశనమవుతుండగా, దృష్టం=చూడబడిందో; మిత్రాణాం+వ్యసనే=స్నేహితుల దుఃఖ సందర్భంలో, యేన=ఎవని చేత, మహోత్సవ+ఇవ=పెద్ద పండుగ సందర్భంలో, స్వస్థేన+స్థితమ్=సుఖంగా ఉన్నట్టుగా భావింపబడిందో (తాను); – ఆత్మాః= స్వవిషయం, యస్య=ఎవడికి, పరిభవక్షేత్రీకృతః+అపి=అవమానానికి పాత్రం చెయ్యబడిందో, (అట్టి నా పరిస్థితి), వః+వధాయప్రియః =మీ వంటి (తలవరులకు) వధించడానికిష్టమైనదో, తస్య+మమ=అట్టి నాకు, ఇయం+మృత్యులోక+పదవీ=ఈ చావు దారి (అయిన), వధ్య+స్రక్=మరణ దండన విధింపబడినవాడు ధరించే దండ, ఆబధ్యతామ్=ధరింపజేయబడుగాక!

వృత్తం:

శార్దూల విక్రీడితం. మ-స-జ-స-త-త-గ గణాలు.

అలంకారం:

కావ్యలిఙ్గం (సమర్థనీయ స్యార్థస్య కావ్యలిఙ్గం సమర్థనమ్ – అని కువలయానందం). ఇక్కడ రాక్షసమంత్రి, తనకు ‘మరణపు దండ’ ధరింపజేయడానికి గల కారణాలను సమర్థిస్తున్నాడు. తన ప్రభువు మరణిస్తుంటే చూస్తూ ఊరుకున్నాడు. స్నేహితులు దుఃఖం అనుభవిస్తుండగా ఏమీ పట్టనట్టు స్తిమితంగా కూర్చున్నాడు. అందువల్ల, అవమానాల పాలైన తన శరీరం ‘మృత్యుమాలాధారణ’కు తగినదే – అని సమర్థించుకుంటున్నాడు.

చన్దన:

(సబాష్పం విలోక్య) అమచ్చ, కిం ఎదం? (అమాత్య, కి మిదమ్?)

అర్థం:

(స+బాష్పం=కన్నీటితో, విలోక్య=చూసి) అమాత్య=మంత్రివర్య, కిమ్+ఇదమ్=ఇదేమిటి?

రాక్షసః:

త్వదీయసుచరి తైక దేశ స్యానుకరణం కి లై తత్.

అర్థం:

త్వదీయ=నీదైన, సుచరిత+ఏకదేశస్య=ప్రశస్తశీలంలోని ఒక చిన్న భాగం (యొక్క), ఏతత్=ఇది, అనుకరణం+కిల=అనుకరించడమే కద!

చన్దన:

అమచ్చ, సవ్వం వి ఇమం పఆసం ణిప్ఫలం కరంతేణ తుఏ కిం అణుచిట్ఠిదం?

(అమాత్య, సర్వ మ పీమం ప్రయాసం నిష్ఫలం కుర్వతా త్వయా కి మనుష్ఠితమ్?)

అర్థం:

అమాత్య=మంత్రివర్యా, ఇమం+ సర్వం+అపి+ప్రయాసం=ఇప్పటి వరకు గడిచిన (నా) శ్రమనంతా, నిష్ఫలం+కుర్వతా=వ్యర్థం చేసేస్తూ, త్వయా+కిమ్+అనుష్ఠితమ్?=నీ చేత ఏమి చేయబడింది? (నువ్వేం చేస్తున్నావో తెలుస్తోందా?)

రాక్షసః:

సఖే, స్వార్థ ఏవానుష్ఠితః।  కృత ముపాలమ్బేన। భద్రముఖ, నివేద్యతాం దురాత్మనే చాణక్యాయ।

అర్థం:

సఖే=మిత్రమా, స్వార్థః+ఏవ+అనుష్ఠితః=నా కోసమే చేయబడింది. కృతం+ఉపాలమ్బేన=నిందించవద్దు. భద్రముఖ=భద్రముఖా, – దురాత్మనే+చాణక్యాయ+నివేద్యతాం=దుర్మార్గుడైన చాణక్యునికి విన్నవించండి.

వజ్రలోమః:

కిం త్తి? (కి మితి?)

అర్థం:

కిమ్+ఇతి=ఏమని?

రాక్షసః:

శ్లోకం:

దుష్కా లేఽపి కలా వసజ్జనరుచౌ

ప్రాణైః పరంరక్షతా

నీతం యేన యశస్వినా ఽతిలఘుతా

మౌశీనరీయం యశః,

బుద్ధానా మపి చేష్ఠితం సుచరితైః

క్లిష్టం విశుద్ధాత్మనా,

పూజార్హోఽపి స యత్కృతే తవ గతః

శత్రుత్వ మేషో ఽస్మి సః. (5)

అర్థం:

అసజ్జన+రుచౌ+దుష్కా లే+కలా+అపి=చెడ్డవాళ్ళకు ప్రీతికరంగా తోచే కలికాలంలో కూడా, ప్రాణై=(తన) ప్రాణాలతో, పరం=వేరొకరిని, రక్షతా=కాపాడే స్వభావం గల, యశస్వినా=కీర్తివంతుడైన, విశుద్ధ+ఆత్మనా=స్వచ్ఛ స్వభావం గల, యేన=ఎవని చేత (వల్ల), ఔశీనరీయం+యశః=శిబిచక్రవర్తికి గల ప్రఖ్యాతి, అతిలఘుతాం+యాతి=మిక్కిలి అల్పమైపోయిందో; – సుచరితైః=(తన) ఉత్తమ నడవడులతో, బుద్ధానం+అపి+చేష్టితమ్=బుద్ధమతస్థుల (యొక్క) వర్తన, క్లిష్టమ్=కష్టపెట్టబడిందో; పూజార్హః+అపి=ఆరాధింపదగినవాడైనా, సః=ఆ చందనదాసు, యత్+కృత్=ఎవడి నిమిత్తం, తవ+శతృత్వమ్+గతః=నీకు శత్రువుగా మారాడో – సః=అట్టివాడను (రాక్షసుడను), ఏషః+అస్మి=ఇదిగో (ఇక్కడ) ఉన్నాను.

వృత్తం:

శార్దూల విక్రీడితం. మ-స-జ-స-త-త-గ గణాలు.

అలంకారం:

కావ్యలిఙ్గం (సమర్థనీయ స్యార్థస్య కావ్యలిఙ్గం సమర్థనమ్ – అని కువలయానందం). ఇక్కడ చాణక్యుడికి రాక్షసమంత్రి సందేశం -“సః పూజార్హః అపి – యత్కృతః తవ శత్రుత్వం గతః – సః ఏషః అస్మి” – అని చందనదాసు త్యాగాన్ని సమర్థిస్తూ తన్ను తాను సమర్పించుకోవడానికి హేతువులు చూపుతున్నాడు రాక్షసుడు.

ప్రథమశ్చణ్డాలః:

అలే బిల్ల పత్తఅ, తుమం దావ చందణదాసం గేహ్ణిఅ ఇహ ఏదస్స మసాణపాదపస్స ఛాఆఏ ముహుత్తం చిట్ఠ. జావ అహం చాణక్కస్స ణివేదేమి, గిహీదో అమచ్చరక్ఖసోత్తి.

(అరే బిల్వపత్రక, త్వం తావ చ్చన్దనదాసం గృహీత్వే హైతస్య శ్మశానపాదపస్య ఛాయాయాం ముహూర్తం తిష్ఠ, యావ దహం చాణక్యస్య నివేద యామి, గృహీతో ఽమాత్య రాక్షస ఇతి.)

అర్థం:

అరే+బిల్వపత్రక=ఒరే బిల్వపత్రక!, గృహీతః+అమాత్యరాక్షసః+ఇతి=రాక్షసమంత్రి చేతికి చిక్కాడు అని – యావత్+అహం+చాణక్యస్య+నివేదయామి=నేను చాణక్యునికి మనవి చేసేవరకు, తావత్=అంతసేపు, త్వం=నువ్వు, చన్దనదాసం+గృహీత్వా=చందనదాసుని తీసుకొని, ఇహ+ఏతస్య+శ్మశానపాదపస్య+ఛాయాయాం=ఈ శ్మశానపు చెట్టు నీడలో, ముహూర్తం+తిష్ఠ=కాసేపు నిలబడు.

ద్వితీయశ్చణ్డాలః:

అలే వజ్జలోమా, గచ్ఛ. (అరే వజ్రలోమన్, గచ్ఛ.)

(ఇతి సపుత్రదారేణ చన్దనదాసేన సహ నిష్క్రాన్తః)

అర్థం:

అరే+వజ్రలోమన్=అలాగేరా – వజ్రలోమన్, గచ్ఛ=వెళ్ళు.

(ఇతి=అని, స+పుత్ర+దారేణ=భార్యాబిడ్డలతో కూడిన, చన్దనదాసేన+సహ=చందనదాసుతో కూడా, నిష్క్రాన్తః=వెళ్ళాడు).

ప్రథమశ్చణ్డాలః:

ఏదు అమచ్చో. (రాక్షసేన సహ పరిక్రమ్య) అత్థి ఎత్థ కోవి ణివేదేహ దావ ణన్దకులణగకులిసస్స మౌలియకులపడి ట్టావకస్స అజ్జ చాణక్కస్స.

(ఏత్వమాత్యః. అస్త్యత్ర కోఽపి? నివేదయత తావ న్నన్దకులనగకులిశస్య మౌర్యకుల ప్రతిష్ఠాపకస్య ఆర్య చాణక్యస్య.)

అర్థం:

ఏతు+అమాత్యః=మంత్రివర్యా రండి – అస్తి+యత్ర+కః+అపి=ఎవరయ్యా ఇక్కడ ఉన్నది? నివేదయత+తావత్=తక్షణం తెలియజేయండి; నన్దకుల+నగ+కులిశస్య=నందవంశం అనే పర్వతానికి వజ్రాయుధం వంటి వాడు, మౌర్యకుల+ప్రతిష్ఠాపకస్య=మౌర్యవంశ స్థాపకుడు అయిన, ఆర్య+చాణక్యస్య=పూజ్య చాణక్యుడికి, నివేదయత=నివేదించండి (విశదం చేయండి).

రాక్షసః:

(స్వగతమ్) ఏత దపి నామ శ్రోతవ్యమ్.

అర్థం:

(స్వగతమ్=తనలో) ఏతత్+అపి+నామ=ఇది కూడా, శ్రోతవ్యమ్=వినవలసి వచ్చింది.

చణ్డాలః:

ఏసో అజ్జణీది సంజమిత బుద్ధిపలిసలే గిహేదే అమచ్చరక్ఖసేత్తి.

(ఏష ఆర్యనీతి సంయమిత బుద్ధిపరిసరో గృహీతో ఽమాత్య రాక్షస ఇతి)

అర్థం:

ఆర్యనీతి+సంయమిత+బుద్ధిపరిసరః=పూజ్య చాణక్యుడి వ్యూహం ద్వారా నిరోధింపబడిన తెలివి సంచారం గల, అమాత్య+రాక్షసః+గృహీతః+ఇతి=రాక్షసమంత్రి లోబరుచుకోబడ్డాడు – అని.

(తతః ప్రవిశతి జవనికావృత శరీరో ముఖమాత్రదృశ్య శ్చాణక్యః)

(తతః=పిమ్మట, జవనిక+ఆవృత+శరీరః=కవచంతో కప్పబడిన శరీరం గలవాడు, ముఖమాత్ర+దృశ్యః=ముఖం మాత్రమే కనబడుతున్నవాడు అయిన, చాణక్య+ప్రవిశతి=చాణక్యుడు వచ్చాడు.)

చాణక్యః:

భద్ర, కథయ కథయ!

అర్థం:

భద్ర=నాయనా!, కథయ+కథయ= (ఏదీ) చెప్పు చెప్పు.

శ్లోకం:

కేనోత్తుఙ్గ శిఖా కలాప కపిలో

బద్ధో పటాన్తే శిఖీ?

పాశైః కేన సదాగతే రగతితా

సద్యః సమాసాదితా?

కే నానేకప దాన వాసిత సటః

సింహో ఽర్పితః పఞ్జరే?

భీమః కేన చ నైకనక్ర మకరో

దోర్భ్యాం ప్రతీర్ణోఽర్ణవః? (6)

అర్థం:

ఉత్తుఙ్గ+శిఖా+కలాప+కపిలః=ఎత్తైన (అగ్ని) జ్వాలలతో ఎఱుపు, పసుపు రంగు కలయిక గల నిప్పు, కేన=ఎవడి చేత, పటాన్తే=కొంగు కొసను, బద్ధః=బంధింపబడింది? పాశైః=తాళ్ళతో, కేన=ఎవని చేత, సదాగతేః+అగతితా=వాయువు కదలజాలని స్థితి, సద్యః=వెనువెంటనే, సమాసాదితా?=సాధింపబడింది?, కేనానేకప+దాన+వాసితసటః=ఏనుగు మదజలపు వాసన నిండిన జూలు గల, సింహః=సింహం, కేన=ఎవని చేత, పఞ్జరే+అర్పితః=పంజరం పాలు చేయబడింది?, నైక+నక్ర+మకరో=అనేక మొసళ్ళు, తిమింగలాలతో నిండిన, భీమః+అర్ణవ=భయంకర సముద్రం, కేన=ఎవరి చేత, దోర్భ్యాం+ప్రతీర్ణః=బాహువుల బలిమితో దాటబడింది?

వృత్తం:

శార్దూల విక్రీడితం. మ-స-జ-స-త-త-గ గణాలు.

అలంకారం:

రూపకాతిశయోక్తి – (రూపకాతిశయోక్తిస్స్యాత్ నిగీర్యాధ్య వసానతః – అని కువలయానందం).

ఇక్కడ – ఎగిసిపడే నిప్పు మంటను కొంగున కట్టడం, గాలిని తాడుతో బంధించడం, మొసళ్ళు, తిమింగలాలు నిండిన మహాసముద్రాన్ని బాహుద్వయంతో ఈదడం అనే పోలికలతో ఉపమేయాన్ని మరుగుపరిచి – చెప్పడం గమనించదగినది.

వ్యాఖ్య:

కంటి మీద కునుకు మాని, చాణక్యుడు వ్యూహం మీద వ్యూహం పన్ని రాక్షసమంత్రిని లొంగదీయడం సామాన్య విషయం కాదని స్థాపించడం, యీ వర్ణనకు సార్థకత.

చణ్డాలః:

ణీది ణఉణ బుద్ధిణా అజ్జేణ. (నీతినిపుణబుద్ధి నార్యేణ.)

అర్థం:

నీతి+నిపుణ+బుద్ధినా+ఆర్యేణ=రాజనీతిలో ఆరితేరిన పూజ్యులైన (మీ చేతనే!)

చాణక్యః:

మా మైవమ్ నన్దకుల విద్వేషిణా దైవే నేతి బ్రూహి।

అర్థం:

మా+మా+ఏవమ్= కాదు, కాదు; అలాగ కాదు. నన్దకుల+విద్వేషిణా=నందకులాన్ని ద్వేషించే, దైవేన+ఇతి=విధి చేత అని – బ్రూహి=చెప్పు.

రాక్షసః:

(స్వగతమ్) అయం దురాత్మా అధవా మహాత్మా కౌటిల్యః?

అర్థం:

(స్వగతమ్=తనలో) అయం+కౌటిల్యః=ఈ కౌటిల్యుడు, దురాత్మా=దుర్మార్గుడా? అధవా=లేకపోతే, మహాత్మా+(వా)=మహాత్ముడా?

శ్లోకం:

ఆకరః సర్వశాస్త్రాణాం రత్నానా మివ సాగరః

గుణైర్న పరితుష్యామో యస్య మత్సరిణో వయమ్. (7)

అర్థం:

సర్వ+శాస్త్రాణాం+ఆకరః=అన్ని శాస్త్రాలకు నివాస స్థానమూ, రత్నానాం+సాగరః+ఇవ=రత్నాలకు సముద్రం వంటి వాడూ అయిన – యస్య =ఎవని విషయంలో, వయం=మేము, మత్సరిణః=శత్రుత్వం వహించినవారమై,  గుణైః+న+పరితుష్యామః=గుణాలకు సంతృప్తి చెందలేదో (అట్టి ఇతడు సన్మార్గుడా? దుర్మార్గుడా? అని అన్వయము.

వృత్తం:

అనుష్టుప్.

అలంకారం:

కావ్యలిఙ్గం (సమర్థనీయ స్యార్థస్య కావ్యలిఙ్గం సమర్థనమ్ – అని కువలయానందం). నేను మత్సరుణ్ణి కనుక, ఇతడి గుణాలకు సంతోషించడం లేదు అని కారణం చూపడం గమనించదగినది.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here