ముద్రారాక్షసమ్ – షష్ఠాఙ్కః – 2

0
9

[box type=’note’ fontsize=’16’] ‘ముద్రారాక్షసం‘ ఏడంకాల రాజకీయ నాటకం. విశాఖదత్తుడు యీ నాటకాన్ని చతుర రాజకీయ వ్యూహాల అల్లికతో, అద్భుతంగా రూపొందించాడు. సంస్కృత సాహిత్యం మొత్తంలో అరుదైన ఈ నాటకాన్ని ఇంద్రగంటి శ్రీకాంతశర్మ గారు అనువదించి, వ్యాఖ్యతో అందిస్తున్నారు. [/box]

పురుషః:

సో సంపదం దిణ్ణాభరణాదివిహవో జలణం పవే సిదుకామో ణఅరాదో ణిక్కన్తో. అహం వి జావ తస్స ఆసుణిదవ్వం ణ సుణోమి। తావ అత్తాణం ఉబ్బంధిఅ వావాఇదుం ఇమం జిణ్ణు జ్జాణం ఆఅదో॥

(స సంప్రతి దత్తాభరణాది విభవో జ్వలనం ప్రవేష్టు కామో నగరా నిష్క్రాన్తః। అహ మపి యావత్తస్య అశ్రోతవ్యం న శృణోమి తావదాత్మాన ముద్బధ్య వ్యాపాదయితు మిమం జీర్ణోద్యాన మాగతః)

అర్థం:

సః=అతడు, సంప్రతి=ఇప్పుడు, దత్త+అభరణ+ఆది+విభవః=తన ఆభరణాలు మొదలైన సంపదనంతా దానం చేసేసిన అనంతరం, జ్వలనం+ప్రవేష్టు+కామః=అగ్నికి ఆహుతి అయే ప్రయత్నంలో, నగరా+నిష్క్రాన్తః=నగరం విడిచివెళ్ళాడు. అహం+అపి=నేను సైతం, తస్య+అశ్రోతవ్యం+యావత్+న+శృణోమి=అతడికి సంబంధించిన వినకూడనిది వినేలోపున, తావత్+ఆత్మానం+ఉద్బధ్య=అంతలో నన్ను నేను ఉరి బిగించుకుకొని, వ్యాపాదయితుం=చంపుకోవడానికి, ఇమం+జీర్ణోద్యానం+ఆగతః=ఈ పాడుపడిన తోటలోకి వచ్చాను.

రాక్షసః:

భద్ర, అగ్ని ప్రవేశే సుహృదస్తే కో హేతుః?

అర్థం:

భద్ర=నాయనా, అగ్నిప్రవేశే=అగ్ని ప్రవేశించాలని అనుకోవడంలో, తే+సుహృదః=నీ స్నేహితునికి, హేతుః+కః=కారణం ఏమిటి?

శ్లోకం:

కి మౌషధ పధాతిగై రుపహతో మహావ్యాధిభిః?

అర్థం:

ఔషధ+పధాతిగైః=మందులతో దారికి రాని, మహా+వ్యాధిభిః=గొప్ప రోగాలతో, ఉపహతః+కిమ్=దెబ్బతిన్నాడా ఏమి?

పురుషః:

ణహి ణహి. (నహి నహి.)

అర్థం:

న+హి+న+హి=లేదు, లేదు.

రాక్షసః:

కిమగ్ని విషకల్పయా నరపతే ర్నిరస్తః క్రుధా?

అర్థం:

అగ్ని+విషయకల్పయా=నిప్పు, విషంతో సమానమైన, నరపతి+క్రుధా=రాజుగారి కోప కారణంగా (చేత), నిరస్తః+కిమ్=తిరస్కరించబడ్డాడా ఏమి?

పురుషః:

అజ్జ. సంతం పావం సంతం పావం! చందఉత్తస్స జణపదే న నృశంసాప్రతివత్తి.

(ఆర్య, శాన్తం పాపమ్ శాన్తం పాపమ్! చన్ద్రగుప్తస్య జనపదే న నృశంసాప్రతిపత్తిః)

అర్థం:

ఆర్య=అయ్యా, శాన్తం+పాపమ్+శాన్తం+పాపమ్=పాపం శమించుగాక!, పాపం శమించుకుగాక!, చన్ద్రగుప్తస్య+జనపదే=చంద్రగుప్తుడి రాజ్యంలో, నృశంసా+ప్రతిపత్తిః+న=పాపానికి తావులేదు.

రాక్షసః:

అలభ్య మనురక్తవాన్ కథయ కింను నారీజనమ్?

అర్థం:

అలభ్యం+నారీజనమ్=పొందశక్యం కాని స్త్రీని, అనురక్తవాన్+కిం=ప్రేమించాడా ఏమి?

పురుషః:

(కర్ణౌపిధాయ) సన్తం పాపమ్! అభూమి క్ఖు ఏసో అవిణఅస్స.

(శాన్తం పాపమ్! అభూమిః ఖలు ఏష అవినయస్య.)

అర్థం:

(కర్ణౌపిధాయ=చెవులు మూసుకుని), శాన్తం+పాపమ్=పాపం శమించుగాక! ఏష+అవినయస్య+అభూమిః+ఖలు=ఇటువంటి దుడుకుపనికి ఇది చోటు కాదు కదా.

రాక్షసః:

కి మస్య భవతో యథా సుహృద ఏవ నాశో ఽవశః?

అర్థం:

అస్య=అతడికి (విష్ణుదాసుకి), భవతః+ఇవ=నీ మాదిరి, అవశః+సుహృదః+నాశః+ఏవ+కిమ్=మాన్పజాలని మిత్రనాశం గాని కారణమా ఏమి?

పురుషః:

అజ్జ అహ కిం. (ఆర్య, అథ కిమ్.)

అర్థం:

ఆర్య=అయ్యా, అథ+కిమ్=అవును.

రాక్షసః:

(సా వేగ మాత్మగతమ్) చన్దనదాసస్య ప్రియ సుహృదితి, త ద్వినాశో హుతభుజి ప్రవేశ హేతురితి, యత్సత్యం చలిత మేవాస్తే యుక్త స్నేహ పక్షపాతా ద్ధృదయమ్. (ప్రకాశమ్) తద్వినాశం చ ప్రియ సుహృద్వత్సలతయా మర్తవ్యే వ్యవసితస్య సుచరితం చ విస్తరేణ శ్రోతుమిచ్ఛామి.

అర్థం:

(స+ఆవేగం=ఆందోళనతో, ఆత్మగతమ్=తనలో) చన్దనదాసస్య+ప్రియసుహృత్+ఇతి=చందనదాసుకు ఇష్టమిత్రుడని, తత్+వినాశః=అతడి నాశమే, హుతభుజి=అగ్నిలో, ప్రవేశ+హేతుః+ఇతి=ప్రవేశించడానికి కారణమని, యత్+సత్యం=ఏ సత్యమైతే ఉన్నదో (అది), యుక్త+స్నేహ+పక్షపాతాత్=తగిన పక్షపాతం వల్లనే, (మే)+హృదయమ్=నా మనస్సు, చలితం+ఏవ+అస్తే=కదిలిపోయే ఉన్నది. (ప్రకాశమ్=పైకి) తత్+వినాశం+చ=ఆ వ్యక్తి నాశాన్ని, ప్రియ+సుహృత్+వత్సలతయా=ప్రియమిత్రుని పట్ల ప్రేమ చేత, మర్తవ్యే=చావు విషయంలో, వ్యవసితస్య=సిద్ధపడిన వాని (యొక్క), సుచరితం=ఉత్తమ చరిత్రను, విస్తరేణ=విపులంగా, శ్రోతుం+ఇచ్ఛామి=వినగోరుతున్నాను.

పురుషః:

అదో అవరం ణ సక్కొమి మందభగ్గో మరణస్స విఘ్ఘ ముత్పాదేదుం

(అతః పరం న శక్నోమి మన్దభాగ్యో మరణస్య విఘ్న ముత్పాదయితుమ్)

అర్థం:

అతః+పరం=అంతకు మించి, మన్దభాగ్యః=దురదృష్టవంతుడనైన నేను, మరణస్య=చావునకు, విఘ్నం+ఉత్పాదయితుమ్=ఆటంకం కలిగించే విషయంలో, న+శక్నోమి=సమర్థుడను కాను.

రాక్షసః:

భద్ర, శ్రవణీయాం కధాం కథయ.

అర్థం:

భద్ర=నాయనా, శ్రవణీయాం+కధాం=చెప్పదగిన (వినదగిన) కథను, కథయ=చెప్పు.

పురుషః:

కా గఈ? కిం కాదవ్వం? ఏసో క్టు ణివేదేమి. సుణోదు అజ్జో.

(కాగతిః? కిం కర్తవ్యమ్? ఏష ఖలు నివేదయామి. శృణత్వార్యః.)

అర్థం:

కా+గతిః=ఏమి దారి? కిం+కర్తవ్యమ్=ఏమి చేయాలి? ఏషః+ఖలు+నివేదయామి=ఈ విషయం చెప్పేస్తాను. ఆర్యః+శృణతు=అయ్యా, వినండి.

రాక్షసః:

భద్ర, అవహితో ఽస్మి.

అర్థం:

భద్ర=నాయనా,  అవహితః+అస్మి=శ్రద్ధగా వింటున్నాను (సిద్ధంగా ఉన్నాను).

పురుషః:

అత్థి ఏత్థ ణఅరే పుష్పచత్తరవాసీ మణిఆర సెట్టీ చందణదాసో ణామ.

(అస్తి ఇహ నగరే పుష్పచత్వరవాసీ మణికారశ్రేష్ఠీ చందనదాసో నామ.)

అర్థం:

ఇహ+నగరే=ఈ నగరంలో, పుష్ప+చత్వర+వాసీ=పువ్వుల కూడలిలో నివసించే, చందనదాసః+నామ+మణికారశ్రేష్ఠీ=చందనదాసు అనే మణుల వర్తకుడు, అస్తి=ఉన్నాడు.

రాక్షసః:

(ఆత్మగతమ్) ఏతత్త దపావృత మస్మ చ్ఛోక దీక్షాద్వారం దైవేన. హృదయ, స్థిరీ భవ. కిమపితే కష్టతర మాకర్ణనీయమస్తి. (ప్రకాశమ్) భద్ర, శ్రూయతే మిత్రవత్సలః సాధుః. కిం తస్య?

అర్థం:

(ఆత్మగతమ్=తనలో) ఏతత్+తత్+అస్మత్+శోకదీక్షా+ద్వారం=ఈ నా దుఃఖమనే దీక్షాద్వారం, దైవేన=విధి చేత, అపావృతం=తెరవబడింది. హృదయ=ఓ నా మనసా!, స్థిరీ+భవ=స్తిమితపడు! తే+కిం+అపి+కష్టతరం+అకర్ణనీయం+అస్తి=నీకు ఏ అత్యంత కష్టతరమైన విషయం వినవలసి వచ్చినా (స్థిరీ+భవ=స్తిమితపడు). (ప్రకాశమ్=పైకి) భద్ర=నాయనా!, మిత్రవత్సలః+సాధుః+శ్రూయతే=(అతడు) స్నేహశీలి, మంచివ్యక్తి (అని) తెలుస్తుంది (వినడమైనది). కిం+తస్య=అతడికేమయింది?

పురుషః:

సో ఏదస్స విహ్ణుదాసస్స పిఅవఅస్సో హోది

(స ఏతస్య విష్ణుదాసస్య ప్రియవయస్యో భవతి)

అర్థం:

సః=అతడు, ఏతస్య+విష్ణుదాసస్య=ఈ విష్ణుదాసునికి, ప్రియవయస్యః+భవతి=ఆప్తమిత్రుడయ్యాడు.

రాక్షసః:

(స్వగతమ్) సోఽయ మభ్యర్ణః శోకవజ్రపాతో హృదయస్య.

అర్థం:

(స్వగతమ్=తనలో) సః+అయం=ఆ యీ వార్త, హృదయస్య=మనస్సుకి, అభ్యర్ణః+శోక+వజ్రపాతః=దుఃఖమనే పిడుగుపాటు దగ్గర పడింది.

పురుషః:

తదో విహ్ణురాసేణ వఅస్ససి ణేసరిసం అజ్జ విణ్ణవితో చందఉత్తో.

(తతో విష్ణుదాసేన వయస్య స్నేహ సదృశ మద్య విజ్ఞప్త శ్చన్ద్రగుప్తః.)

అర్థం:

తతః=తరువాత, విష్ణుదాసేన=విష్ణుదాసుని చేత, వయస్య+స్నేహ+సదృశం=మిత్రునితో స్నేహానికి తగిన విధంగా, అద్య+చన్ద్రగుప్తః+విజ్ఞప్తః=ఇవేళ చంద్రగుప్తుడు విన్నవింపబడ్డాడు (చంద్రగుప్తునికి మనవి చేసుకున్నాడు).

రాక్షసః:

కథయ, కి మితి?

అర్థం:

కథయ=చెప్పు, కిం+ఇతి=ఏమని?

పురుషః:

దేవ, మహ గేహే కుటుంబభరణపజ్జత్తా అత్థ వత్తా అత్థి. తా ఏదస్స విణిమఏణ ముంచిజ్జదు పిఅవఅస్సో చందణదాసోత్తి.

(దేవ, మమ గేహే కుటుమ్బభరణ పర్యాప్తార్థవ త్తాస్తి. త దేతస్య వినిమయేన ముచ్యతాం ప్రియవయస్య శ్చన్దనదాస ఇతి.)

అర్థం:

దేవ=ప్రభూ, మమ+గేహే=నా యింటిలో, కుటుమ్బ+భర+పర్యాప్తా=కుటుంబాన్ని భరించగలపాటి, అర్థవత్తా+అస్తి=ధనం కలిమి ఉన్నది. తత్=అది, ఏతస్య+వినిమయేన=ఇతడికి మారుగా స్వీకరించి, ప్రియవయస్యః+చన్దనదాసః=ఆప్తమిత్రుడు చందనదాసు, ముచ్యతాం+ఇతి=విడువబడుగాక – అని.

రాక్షసః:

(స్వగతమ్) సాధు భో విష్ణుదాస, సాధు, అహో దర్శితో మిత్ర స్నేహః – కుతః…

అర్థం:

(స్వగతమ్=తనలో) సాధుః+భో+విష్ణుదాస+సాధు=చాలా బాగుందయ్యా విష్ణుదాసా, చాలా బాగుంది, అహో=ఆహా!, మిత్రస్నేహః=స్నేహితుని పట్ల ఆదరం,  దర్శితః=చూపించడమైంది (కద!), కుతః=ఎలాగంటే…. (ఎందుకంటే)

శ్లోకం:

పితౄన్ పుత్రాః, పుత్రాన్ పరవ దభిహింసన్తి పితరో,

యదర్థం సౌహార్దం సుహృది చ విముఞ్చన్తి సుహృదః,

ప్రియం మోక్తుం తద్యో వ్యసన మివ సద్యో వ్యవసితః

కృతార్థోఽయం సోర్థ ఽస్తవ సతి వణిక్త్వేఽ పివణిజః  (18)

అర్థం:

పితౄన్=తండ్రులనూ, పుత్రాః=కొడుకులూ, పుత్రాన్=కొడుకులను, పితరః=తండ్రులూ, యదర్థం=ఎందుకైతే, పరవత్=పరాయివాళ్ళ మాదిరి, అభిహింసన్తి=బాధిస్తుంటారో, సుహృదః+చ=మిత్రులు సహితం, సుహృది=స్నేహితుడి విషయంలో, సౌహార్దం=స్నేహభావాన్ని, విముఞ్చన్తి=విడిటిపెడుతుంటారో, తత్+ప్రియం=అట్టి ఇష్టాన్ని, వ్యసనం+ఇవ=చెడ్ద అలవాటు లాగున, మోక్తుం=విడిచివేయడానికి, యః=ఏది, వ్యవసితః=ఉద్దేశించబడినదో (అది),వణిక్త్వే+సతి+అపి=షావుకారుతనంలో ఉన్నప్పటికీ, వణిజః+తవ=నీ షావుకారుతనం, సః+అయం+అర్థం=ఆ యీ భావం, కృతార్థః=ధన్యమైనది.

వృత్తం:

శిఖరిణి – య – మ – న – స – భ – లగ – గణాలు.

అలంకారం:

కావ్యలిఙ్గం (సమర్థనీయ స్యార్థస్య కావ్యలిఙ్గం సమర్థనమ్ – అని కువలయానందం).

ఇక్కడ – “వణిజుడవయ్యు మిత్రధర్మాన్ని ఉదారంగా నెరవేర్చావు” అనే సమర్థన గమనించదగినది.

(ప్రకాశమ్) భద్ర, తత స్త థాభిహితేన కిం ప్రతిపన్నం మౌర్యేణ?

అర్థం:

(ప్రకాశమ్=పైకి), భద్ర=నాయనా, తతః=ఆ విధంగా, అభిహితేన=ప్రార్థింపబడిన, మౌర్యేణ=చంద్రగుప్తుని చేత, కిం+ప్రతిపన్నం=ఏమి చేయబడినది (ఏమి ప్రతిపాదింపబడినది?)

పురుషః:

అజ్జ, తదో ఏవం భణిదేణ చందఉత్తేణ పడి భణిదో సెట్ఠీ వింణుదాసో- ణ మఏ అత్థస్స కారణేణ చందణదాసో సంజమిదో। కిందు పచ్ఛాదిదో అణేణ అమచ్చరక్ఖసస్స ఘరఅణో త్తి బహుసో జాణిదం, తేణ వి బహుసో జాచిదేణ ణ సమప్పిదో తా జదితం సమప్పేది తదో అత్థి సే మొక్ఖో। అణ్ణహా పాణహరో సే దండోత్తి భణిఅ వజ్జట్ఠాణం ఆణవిదో చందణదాసో. తదో జావ వఅస్స చందణదాసస్స అసుణిదవ్వం ణ సుణోమి, తావ జలణం పవిసా మిత్తి సెట్ఠీ విహ్ణుదాసో ణఅరాదో ణిక్కన్దో। అహంవి విహ్ణుదాసస్స అసుణిదవ్వం జావణ సుణోమి, తావ ఉబ్బంధిఅ అత్తాణం వావాదేమిత్తి ఇదం జిణుజాణం ఆఅదో॥

(ఆర్య, తత ఏవం భణితేన చన్ద్రగుప్తేన ప్రతిభణితః శ్రేష్ఠీ  విష్ణుదాసః న మ యార్థస్య కారణేన చన్దనదాసః సంయమితః। కిం తు ప్రచ్ఛాదితో ఽనే నామాత్య రాక్షసస్య గృహజన ఇతి బహుశో జ్ఞాతమ్। తేనాపి బహుశో యాచితే నాపి న సమర్పితః। త ద్యది తం సమర్పయతి తదస్తి అస్య మోక్షః। అన్యథా ప్రాణ హరో ఽస్యదణ్డః‘ – ఇతి భణిత్వా, వధ్యస్థాన మానయిత శ్చన్దనదాసః। తతో యావ దస్య చన్దనదాసస్య అశ్రోతవ్యం న శృణోమి, తావ జ్జ్వలనం ప్రవిశా మీతి శ్రేష్ఠీ, విష్ణుదాసో నగరా న్నిష్క్రాన్తః। అహ మపి విష్ణుదాస స్యాశ్రోతవ్యం యావన్న శృణోమి, తావ దుద్బ న్ద్యాత్మానం వ్యాపాదయా మీతీమం జీర్ణోద్యాన మాగతః॥)

అర్థం:

ఆర్య=అయ్యా, తతః=పిమ్మట, ఏవం+భణితేన+చన్ద్రగుప్తేన=ఇలా చెప్పబడిన చంద్రగుప్తుని చేత, శ్రేష్ఠీ+విష్ణుదాసః+ప్రతిభణితః=విష్ణుదాస శ్రేష్ఠి బదులు చెప్పబడ్డాడు – ‘చన్దనదాసః=చందనదాసు, అర్థస్య+కారణేన=ధనం నిమిత్తమై, న+మయా+సంయమితః=నా చేత నిర్బంధించబడలేదు. కిం+తు=మరెందుకు అంటే: అనేన=వీని చేత, అమాత్య+రాక్షసస్య+గృహజన=రాక్షసమంత్రి కుటుంబం, ప్రచ్ఛాదిత+ఇతి=దాచబడింది. బహుశః=అన్ని విధాలా, జ్ఞాతమ్=తెలిసినది. తేన+అపి=వాని చేత కూడా, బహుశః+యాచితేన+అపి=అనేక విధాలుగా అడుగబడినప్పటికీ, న+సమర్పితః=అప్పగించబడలేదు. యది+తం+సమర్పయతి=ఆ కుటుంబాన్ని అప్పగించడం జరిగితే, తత్+అస్య+మోక్షః+అస్తి=అప్పడతనికి విడుదల సంభవిస్తుంది. అన్యథా=కాని పక్షంలో, అస్య+దణ్డః+ప్రాణహరః=ప్రాణంతకంగానే అతడి శిక్ష (ఉంటుంది)’ – ఇతి+భణిత్వా= అని చెప్పి, చన్దనదాసః=చందనదాసు, వధ్యస్థానం+ఆనయితః=వధ జరిగే చోటకి తీసుకుపోబోయాడు. తతః=పిమ్మట, యావత్+అస్య+చన్దనదాసస్య+అశ్రోతవ్యం+న+శృణోమి=ఈ చందనదాసు గురించి వినరానిది వినేలోగా, తావత్+జ్వలనం=ప్రవిశామి=అంతలో మంటలోకి ప్రవేశిస్తాను, ఇతి=అని, శ్రేష్ఠీ+విష్ణుదాసః=విష్ణుదాస శెట్టి, నగరాత్+నిష్క్రాన్తః=నగరం విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. అహం+అపి=నేను కూడా, విష్ణుదాసస్య+అశ్రోతవ్యం+యావత్+న+శృణోమి=విష్ణుదాసుని గురించి వినరానిది వినేలోగా, తావత్=అంతలో, ఆత్మానం+ఉద్బంధ్య=నాకు నేను ఉరి బిగించుకొని, వ్యాపాదయామి+ఇతి=చంపుకుంటాను అని, ఇమం+జీర్ణోద్యానం+ఆగతః=ఈ పాడుపడిన తోటకు వచ్చాను.

రాక్షసః:

భద్ర, న ఖలు వ్యాపాదిత శ్చన్దనదాసః?

అర్థం:

భద్ర=నాయనా, చన్దనదాసః+న+ఖలు+వ్యాపాదితః=చందనదాసు చంపబడలేదు కద!

పురుషః:

అజ్జ దావ వావాదీ అది। సో ఖు సంపదం పుణో పుణో అమచ్చరక్ఖస్స ఘరఅణం జాచీ అది। ణ ఖు సో మిత్తవత్సల దాఏ సమప్పేది, తా ఏదిణా కాలణేణ ణ కరేమి మరణస్స కాల హరణం।

(అద్య తావ ద్వ్యాపాద్యతే। స ఖలు సామ్ప్రతం పునః పున రమాత్య రాక్షసస్య గృహజనం యాచ్యతే। న ఖలు స మిత్ర వత్సలతయా సమర్పయతి। త దేతేన కారణేన న కరోమి మరణస్య కాలహరణమ్॥)

అర్థం:

అద్య+తావత్=ఇవాళైతే, వ్యాపాద్యతే=చంపబడతాడు. సః+ఖలు=అతడైతే, సామ్ప్రతం=ఇప్పుడు, పునః+పునః=మళ్ళీ మళ్ళీ, అమాత్య+రాక్షసస్య+గృహజనం=రాక్షసమంత్రి కుటుంబం గురించి, యాచ్యతే=కోరబడుతున్నాడు. సః=అతడు, మిత్రవత్సలతయా=స్నేహితుడిపై ప్రేమ కొద్దీ, న+సమర్పయతి+ఖలు= అతడు అప్పగించడం లేదాయె! తత్+ఏతేనకారణేన= ఆ యీ కారణం చేతనే – మరణస్యకాలహరణమ్+న+కరోమి=(నా) చావు కోసం కాలహరణం (జాప్యం) చేయజాలను.

రాక్షసః:

(సహర్ష మాత్మగతమ్) సాధు వయస్య చన్దనదాస, సాధు.

అర్థం:

(స+హర్షం=సంతోషంతో, ఆత్మగతమ్=తనలో) సాధు=బాగున్నదయ్యా, వయస్య+చన్దనదాస=మిత్రమా చందనదాసా, సాధు=బాగుందయ్యా.

శ్లోకం:

శిబే రివ సముద్భూతం శరణాగతరక్షయా

నిచీయతే త్వయా సాధో యశో ఽపి సుహృదా వినా॥ (19)

అర్థం:

సాధో=ఓ మంచి మిత్రుడా!, శిబేః+ఇవ=శిబి చక్రవర్తి మాదిరి, శరణ+ఆగత+రక్షయా=శరణు కోరి వచ్చిన వారిని రక్షించడం చేత, సముద్భూతం=జనించిన, యశః=ప్రఖ్యాతి, త్వయా=నీ చేత, సుహృదా+వినా+అపి=స్నేహితుడు దగ్గర లేకపోయినప్పటికీ, నిచీయతే=ప్రోగు చేసుకోబడుతోంది.

వృత్తం:

అనుష్టుప్.

అలంకారం:

ఉపమ. – ‘శిబిరేవ యశః నిచీయతే’ అని మిత్రుడికి పోలిక చెప్పడం కారణం.

వ్యాఖ్య:

శిబి చక్రవర్తి గొప్ప దానశీలి. ఒకసారి ఇంద్రాగ్నులు అతని పరీక్షించడానికి పావురం, డేగ రూపంలో రాగా – శిబి తన శరీరాన్ని పణంగా పెట్టి, పావురాన్ని రక్షించిన కథను ఇక్కడ అనుసంధించుకోవాలి.

గచ్ఛ గచ్ఛ – జ్వలన ప్రవేశాన్నివారయ। అహ మపి చన్దనదాసం మరణా న్మోచయామి।

అర్థం:

గచ్ఛ+గచ్ఛ=పద, పద; – జ్వలన+ప్రవేశాత్=అగ్నిప్రవేశాన్ని, నివారయ=ఆపు చెయ్యి. అహం+అపి=నేను కూడా, చన్దనదాసం=చందనదాసును, మరణాత్+మోచయామి=చావు నుంచి తప్పిస్తాను.

పురుషః:

అహ ఉణ కేణ ఉవాఏణ తుమం చందనదాసం మరణాదో మోచేసి.

(అథ పునః కే నోపాయేన త్వం చన్దనదాసం మరణా న్మోచయసి?)

అర్థం:

అథ+పునః=అలాగయే మాటుంటే, కేన+ఉపాయేన=ఏ ఉపాయంతో, త్వం=నువ్వు, చన్దనదాసం=చందనదాసును, మరణాత్+మోచయసి=చావు నుంచి తప్పిస్తావు?

రాక్షసః:

(ఖడ్గ మాకృష్య) నన్వనేన వ్యవసాయ సుహృదా నిస్త్రింశేన, పశ్య –

అర్థం:

(ఖడ్గం+ఆకృష్య=కత్తి దూసి) అనేన+వ్యవసాయ+సుహృదా+నిస్త్రింశేన+నను=ఈ ప్రయత్నంలో నాకు మిత్రమైన ఆయుధంతోనే కద (కత్తి సాయంతోనే కద), పశ్య=చూడు –

శ్లోకం:

నిస్త్రింశో ఽయం సజలజలద

వ్యోమ సఙ్కాశమూర్తి

ర్యుద్ధ శ్రద్ధా పులకిత ఇవ

ప్రాప్తసఖ్యః కరేణ

సత్త్వోత్కర్షాత్ సమరనికషే

దృష్ట సారః పరై ర్మే

మిత్ర స్నేహా ద్వివశ మధునా

సాహసే మాం నియుఙ్త్కే (20)

అర్థం:

అయం+నిస్త్రింశః=ఈ ఖడ్గం, సజల+జలద+వ్యోమసఙ్కాశ+మూర్తిః=నీటి మబ్బుతో నిండిన ఆకాశాన్ని పోలినది; యుద్ధ+శ్రద్ధా+పులకిత+ఇవ=యుద్ధం పట్ల శ్రద్ధతో మెరుస్తున్న (పులకిస్తున్న)ట్లున్నది; కరేణ+ప్రాప్తసఖ్యః= (నా) చేతితో మైత్రి నెరపింది;

సత్త్వ+ఉత్కర్షాత్=అతిశయించిన బలం కారణంగా, సమర+నికషే=యుద్ధం అనే ఒరపడి రాయి యందు, మే+పరై=నా శత్రువుల చేత, దృష్టసారః=సారవంతమైన శక్తి దర్శింపబడినదై, మాం=నన్ను, మిత్ర+స్నేహాత్=మిత్ర పక్షపాతం వల్ల, వివశం=ఒడలు మరిచినవానినిగా, సాహసే=తెగువ చూపడంలో, అధునా =ఇప్పుడు, నియుఙ్త్కే=నియమింపబడినది.

వృత్తం:

మందాక్రాన్తం. మ – భ – న – త – త – గ గ – గణాలు.

అలంకారం:

రూపక, ఉత్ప్రేక్షల సంకరం.  – “యుద్ధశ్రద్ధాపులకిత ఇవ” – అనడం వల్ల – ఉత్ప్రేక్ష; “సమర నికషే దృష్టసారః” అనడం వల్ల రూపకం.

పురుషః:

అజ్జ, ఏవం సెట్ఠి చందణదాస జీవిద ప్పదాణ పిసుణిదం విసమ దసా విసాక నిపడితం సాధు ణ సక్ణోమి తుమం ణిణ్ణీఅ పడివత్తుం, కిం సుగిహీదణామ హేయా అమచ్చరక్ఖసపాదా తుహ్మే! దిట్ఠియా దిట్ఠా! (ఇతి పాదయోః పతతి)

(ఆర్య, ఏవం శ్రేష్ఠి చన్దనదాస జీవిత ప్రదాన పిశునితం విషమ దశా విపాక నిపతితం సాధు న శక్నోమి త్వాం నిర్ణీయ ప్రతిపత్తుం. కిం సుగృహీతనామధేయా అమాత్య రాక్షసపాదా యూయం! దిష్ట్యా దృష్టాః!)

అర్థం:

ఆర్య=అయ్యా, శ్రేష్ఠి+చన్దనదాస+జీవితప్రదాన=శెట్టి చందనదాసుకు జీవితాన్ని ప్రదానం చేయడం విషయంలో, పిశునితం=సూచన చేయబడిన, విషమ+దశా+విపాక+నిపతితం=ప్రతికూలమైన విధి విధించిన దుర్గతి పాలయిన, త్వాం=నిన్ను, నిర్ణీయ=ఫలానా అని నిర్ణయించి, ప్రతిపత్తుం=ప్రతిపాదించడానికి, సాధు+న+శక్నోమి=సరిగా సిద్ధంగా లేను (నా వల్ల కాదు). సుగృహీత+నామధేయాః+అమాత్యరాక్షసపాదాః+యూయం+కిమ్=ప్రఖ్యాతి వహించిన రాక్షసమంత్రి వర్యులా తమరు? ఏమి?, దిష్ట్యా+దృష్టాః=అదృష్టవశాత్తు చూడడమైనది. (ఇతి=అని, పాదయోః+పతతి=పాదాలపై పడ్డాడు).

రాక్షసః:

ఉత్తిష్ఠోత్తిష్ఠ! అలమిదానీం కాలహరణేన। నివేద్యతాం విష్ణుదాసాయ ఏష రాక్షస శ్చన్దనదాసం మరణాన్మో చయతిఇతి. [నిస్త్రింశోయం ( 6 – 20 శ్లో) ఇతి పఠన్ ఆకృష్య ఖడ్గం పరిక్రామతి]

అర్థం:

ఉత్తిష్ఠ+ఉత్తిష్ఠ= (నాయనా) లే, లే! ఇదానీం=ఇప్పుడు, కాలహరణేన+అలం=కాలం వృథా చేయకు. నివేద్యతాం+విష్ణుదాసాయ=విష్ణుదాసుకు (ఇలాగు) చెప్పుదువు గాక! – ‘ఏష+రాక్షసః=ఈ రాక్షసుడు, చన్దనదాసం=చందనదాసును, మరణాత్+మోచయతి=చావు నుంచి తప్పిస్తాడు’ ఇతి=అని. [నిస్త్రింశోయం (6 – 20 శ్లో)+ఇతి+పఠన్=నిస్త్రింశోయం అనే శ్లోకాన్ని చదువుతూ, ఖడ్గం+ఆకృష్య=కత్తి దూసి, పరిక్రామతి=ముందుకు నడిచాడు].

పురుషః:

తా క రేహి మే పసాదం సందేహణ్ణిఏణ. (తత్కురుమే ప్రసాదం సందేహ నిర్ణయేన)

అర్థం:

తత్=అయితే, మే=నాకు, సందేహ+నిర్ణయేన=నా సందేహాన్ని నివారించడంతో, ప్రసాదం+కురు=అనుగ్రహించు.

రాక్షసః:

సో ఽహ మనుభూతభర్తృవినాశః సుహృద్వి పత్తి హేతు రనార్యో దుర్గృహీత నామధేయో యథార్థో రాక్షసః!

అర్థం:

అనుభూత+భర్తృవినాశః=ప్రభువు అంతం అయిన విషయాన్ని అనుభవించినవాడు, సుహృత్+విపత్తి+హేతు=మిత్రుల ఆపద కారణాన్ని, అవార్యః=నిలువరించలేకపోయినవాడు, అనార్యః=మన్నింపదగనివాడు, దుర్గృహీత+నామధేయః=అపఖ్యాతికి తగినవాడు, సః+అహం=అట్టి నేను, యథార్థః+రాక్షసః=నిజమైన రాక్షసుడినే!

పురుషః:

(సహర్షం పాదయోః పునః పతిత్వా) హీ హీమాణ హే? దిట్ఠిఆ దిట్ఠోసి। పసీదంతు అమచ్చపాదాః। అత్థి దాప ఎత్థ పఢమం చందఉత్తహదఏణ అజ్జసఅడదాసో వజ్జట్ఠాణం ఆణత్తో। సో అ వజ్ఝట్ఠాణదో కేణ వి అవహరిఆ దేశంతరం ణీదో। తదో చందఉత్తహదపణ కీస ఏసో ప్పమాదో కిదోత్తి అజ్జసఅడదాసే సముజ్జలిదో కోవవహ్ణీ ఘాదఆజణ జిహణేణ నివ్వావిదో। తదో వహుది ఘాదఆజం కం వి గిహిదసత్థం అపువ్వం పురుసం పిట్ఠదో వా అగ్గదో వా పేక్ఖంతి, తదో అత్తణో జీవిదం పరిక్ఖంతో అప్పమత్తా వజ్ఝట్ఠాణే వజ్ఝంవావాదేంతి। ఏవం చ దిహిదత్థేహిం గచ్ఛం తేహిం సెట్ఠి చిందణదాసస్స వహో తువరిదో హోది॥ (నిష్క్రానః)

(ఆశ్చర్యమ్, దిష్ట్యా దృష్టో ఽసి। ప్రసీద న్త్వమాత్య పాదాః। అస్తి తావ దత్ర ప్రథమం చన్ద్రగుప్త హతకేన ఆర్య శకటదాసో వధ్యస్థాన మాజ్ఞప్తః। స చ వధ్యస్థానాత్ కే నా ప్యపహృత్య దేశాన్తరం నీతః। తత శ్చన్ద్రగుప్త హతకేన కస్మా దేష ప్రమాదః కృత ఇతి ఆర్యశకటదాసే సముజ్జ్వలితః కోపవహ్నిర్ఘాతక జననిధనేన నిర్వాపితః। తతః ప్రభృతి ఘాతకా యం క మపి గృహీతశస్త్ర మపూర్వం పురుషం పృష్ఠతో వా అగ్రతో వా పేక్షన్తే, తదాత్మనో జీవితం పరిరక్షన్తో ఽప్రమత్తా వధ్యస్థానే వధ్యం వ్యాపాదయన్తి। ఏవం చ గృహీతశస్త్రై రమాత్యపాదై ర్గచ్ఛద్భిః శ్రేష్ఠి చందనదాసస్య వధ స్త్వరాయితో భవతి॥)

అర్థం:

ఆశ్చర్యమ్=వింతగా ఉన్నది, దిష్ట్యా+దృష్టః+అసి=అదృష్టవశాన నువ్వు కంటబడ్డావు. అమాత్య పాదాః+ప్రసీదన్తు=మంత్రివర్యులు అనుగ్రహించాలి. అస్తితావత్+అత్ర+ప్రథమం=అప్పట్లో తొలిసారిగా, ఆర్య+శకటదాసః=పూజ్య శకటదాసు,  చన్ద్రగుప్త+హతకేన=చంద్రగుప్తుడి గాడి చేత, వధ్యస్థానం+ఆజ్ఞప్తః=వధించే చోటుకు తీసుకుపొమ్మని ఆదేశించబడి, స+చ+కేన+అపి=వాడేమో ఎవడి మూలననో, వధ్యస్థానాత్=ఆ వధించే చోటు నుంచి, అపహృత్య=తప్పించబడి, దేశాన్తరం+నీతః=వేరే దేశం చేర్చబడ్డాడు. తతః=ఆ మీదట, చన్ద్రగుప్త+హతకేన=చంద్రగుప్తుడి గాడి చేత, కస్మాత్+ఏషః+ప్రమాదః+కృత+ఇతి=ఎవని వలనో యీ తప్పిదం జరిగిందని, ఆర్య+శకటదాసే=పూజ్య శకటదాసు విషయంలో, సముజ్జ్వలితః+కోపవహ్నిః=చెలరేగిన కోపాన్ని, ఘాతక+జన+నిధనేన=వధ నిర్వహించవలసిన తలారిని చంపడం ద్వారా, నిర్వాపితః=చల్లార్చబడింది. తతః+ప్రభృతి=అప్పటి నుంచి, ఘాతకాః=తలవరులు, యం+కం+అపి=ఎవరో ఒక, గృహీత+శస్త్రం+అపూర్వం+పురుషం=ఆయుధం ధరించిన ఒక అపరిచిత వ్యక్తి, పృష్ఠతః+వా; అగ్రతః+వా=తమకు వెనుక గాని, ముందుగాని చూస్తే, తత్+ఆత్మనః+జీవితం+పరిరక్షన్తః=అప్పుడు తమ బతుకు కాపాడుకొనే ఉద్దేశంతో, అప్రమత్తా= జాగరూకులై, వధ్యస్థానే=వధాస్థానంలో, వధ్యం=చంపదగినవాడిని, వ్యాపాదయన్తి=చంపుతున్నారు. ఏవం+చ=ఇంకా చెప్పాలంటే (ఇంతకీ), గృహీత+శస్త్రైః=ఆయుధం ధరించిన, అమాత్యపాదైః=మంత్రువర్యులు, గచ్ఛద్భిః=వెళ్ళుతూండడం చేత, శ్రేష్ఠి+చందనదాసస్య+వధః= చందనదాసుశెట్టిని చంపే ప్రక్రియ, త్వరాయితః+భవతి=తొందర చేసినట్టు కాగలదు. (నిష్క్రానః=వెళ్ళాడు.)

రాక్షసః:

(స్వగతమ్) అహో దుర్బోధ శ్చాణక్యవటో ర్నీతిమార్గః। కుతః –

అర్థం:

(స్వగతమ్=తనలో) అహో=అయ్యో, చాణక్యవటోః=ఈ చాణక్య కుర్రగాడి,నీతిమార్గః=వ్యూహం, దుర్బోధః=అర్థం కాకుండా ఉంది. కుతః=ఎందుకంటే –

శ్లోకం:

యది చ శకటో నీతః శత్రో ర్మతేన మ మాన్తికమ్

కి మితి నిహతః క్రోధావేశా ద్వధాధికృతో జనః?

అథ న కృతకం తాదృక్కష్టం కథం ను విభావయేద్?

ఇతి మమ మతిస్త ర్కా రూఢా న పశ్యతి నిశ్చయమ్ (21)

(విచిన్త్య…)

అర్థం:

శకటః+చ=శకటదాసైతే, మమ+అన్తికమ్=నా వద్దకు, శత్రో+మతేన=శత్రువైన చంద్రగుప్తుడి ఉద్దేశం ప్రకారం, నీతః+యది=తీసుకురావడమే జరిగివుంటే – వధాధికృతః+జనః=తలవరి మనిషి, క్రోధావేశాత్=కోప కారణంగా కలిగిన ఆవేశం వల్ల, కిమ్+ఇతి+నిహతః=ఎందుకు చంపబడ్డాడు? అథ+న=అలాగు కానట్లయితే, తాదృక్=అట్టి, కృతకం+కష్టం=దొంగ కష్టాన్ని, కథం+ను+విభావయేత్=ఏమని తలపోయాలి? – ఇతి =ఈ తీరున, మమ+మతిః=నా ఆలోచన, తర్క+ఆరూఢా=ఔగాముల విచారణకు చిక్కినదై, నిశ్చయం+న+పశ్యతి=నిర్ధారణకు రాలేకపోతున్నది.

వృత్తం:

హరిణి – న – స – మ -ర – స – లగ – గణాలు.

అలంకారం:

అసంగతి అలంకారం (కార్యకారణయోర్భిన్నదేశత్వే సత్యసంగతిః అని ప్రతాపరుద్రీయం).

ఇక్కడ శకటదాసు విషయంలో – తలవరిని వధించడంలో అసంగతత్వం గమనించదగినదని – రాక్షస భావం.

(విచిన్త్య=ఆలోచించి…)

శ్లోకం:

నాయం నిస్త్రింశకాలః ప్రథమ మిహ కృతే

ఘాతకానాం విఘాతే;

నీతిః కాలాన్తరేణ ప్రకటయతి ఫలం,

కిం తయా కార్యమత్ర?

ఔదాసీన్యం న యుక్తం ప్రియసుహృది గతే

మత్కృతా మేవ ఘోరాం

వ్యాపత్తిం, జ్ఞాత, మస్య స్వతను మహ మిమాం

నిష్క్రయం కల్పయామి (22)

అర్థం:

ఇహ=ఇక్కడ, ప్రథమం=ముందుగానే, ఘాతకానాం+విఘాతే=తలవరులు చంపడమనే పని, కృతే=ఏర్పడవచ్చును కనుక, అయం+నిస్త్రింశకాలః+న=ఇది కత్తికి పని చెప్పే వేళ కాదు; నీతిః (చేత్)= పోనీ రాజనీతి ప్రయోగిద్దామంటే, కాలాన్తరేణ+ఫలం+ప్రకటయతి=కొంతకాలం గడిచాక ఫలితం కనబరిచేదవుతుంది, తయా+అత్ర+కిం+కార్యమ్=అటువంటి దానితో ఇప్పుడేమి ప్రయోజనం? – ఔదాసీన్యం=పట్టించుకోకుండా ఉందామంటే, న+యుక్తం=తగినపని కాదు; ప్రియసుహృది=ఆప్తస్నేహితుడు, మత్+కృతాం+ఏవ+ఘోరాం+వ్యాపత్తిం=నా మూలంగా ఏర్పడిన భయంకరమైన చావును, గతే (సతి)=పొందబోతుండగా, జ్ఞాతం=తెలిసింది, అస్య=వీనికి (చందనదాసుకి), అహం=నేను, ఇమాం+స్వతనుం=ఈ నా శరీరాన్ని, నిష్క్రయం+కల్పయామి=బాకీగా చేస్తాను (నా శరీరం పణం పెడతాను).

వృత్తం:

స్రగ్ధర – మ – ర – భ – న – య – య – య – గణాలు.

అలంకారం:

కావ్యలిఙ్గం (సమర్థనీయ స్యార్థస్య కావ్యలిఙ్గం సమర్థనమ్ – అని కువలయానందం).

ఇక్కడ – ‘స్వత్నుం అహం నిష్క్రయం కల్పయామి’ అనే ప్రతిజ్ఞకు సమర్థకాలైన అంశాలను రాక్షసుడు ప్రస్తావిస్తున్నాడు.

(ఇతి నిష్క్రాన్తాః సర్వే)

(ఇతి=అని, సర్వే= అందరూ, నిష్క్రాన్తాః= వెళ్ళారు).

ముద్రా రాక్షస నాటకే కపటపాశోనామ

షష్ఠాఙ్కః

ముద్రారాక్షసమనే నాటకంలో, ‘కపటపాశః’ అనే పేరుగల – ఆరవ అంకం ముగిసినది.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here