ముద్రారాక్షసమ్ – తృతీయాఙ్కః – 6

0
8

[box type=’note’ fontsize=’16’] ‘ముద్రారాక్షసం‘ ఏడంకాల రాజకీయ నాటకం. విశాఖదత్తుడు యీ నాటకాన్ని చతుర రాజకీయ వ్యూహాల అల్లికతో, అద్భుతంగా రూపొందించాడు. సంస్కృత సాహిత్యం మొత్తంలో అరుదైన ఈ నాటకాన్ని ఇంద్రగంటి శ్రీకాంతశర్మ గారు అనువదించి, వ్యాఖ్యతో అందిస్తున్నారు. [/box]

కఞ్చుకీ:

(విలోక్య సభయమ్) అయే త దయ మార్య చాణక్య స్తిష్ఠతి.

శ్లోకం:

యో నన్దమౌర్యనృపయోః, పరిభూయ లోక,

మస్తోదయా వదిశ ద ప్రతిభిన్నకాలమ్,

పర్యాయ పాతిత హిమోష్ణ మసర్పగామి

ధా మ్నాతిశాయయతి ధామ సహస్రధామ్నః (17)

అర్థం:

(స+భయమ్=భయంతో, విలోక్య=చూసి), అయే=ఓహో, తత్+అయం+ఆర్య చాణక్యః=అదిగో, ఈ చాణక్య అయ్యవారు, తిష్ఠతి=కూర్చుని వున్నాడు.

యః=ఎవరైతే, లోకం+పరిభూయ=ప్రపంచాన్ని లెక్క జేయకుండా, నన్ద+మౌర్య+నృపయోః=నందరాజు, మౌర్యరాజులిద్దరికీ, అప్రతిభిన్న+కాలమ్=ఏకకాలంలో, అస్త+ఉదయౌ=అస్తమయాన్నీ, ఉదయాన్నీ (మౌర్యునికి ఉదయం, నందునికి అస్తమయం), ఆదిశత్=సంకల్పించాడో (నిర్దేశించాడో/ఆజ్ఞాపించాడో), (సః+చాణక్యః) ధామ్నా=తేజస్సుతో, పర్యాయ+పాతిత+హిమోష్ణం=ఒకదాని వెంట ఒకటిగా చలువనీ, వేడిని కలిగింపజేస్తూ, అసర్పగామి=అన్ని చోట్లకు ప్రయాణించని, సహస్రధామ్నః=సూర్యుని (యొక్క), ధామ+అతిశాయయతి=తేజస్సును అతిక్రమిస్తున్నాడు.

వ్యాఖ్య:

సూర్యతేజస్సుకు, సామర్థ్యానికి పరిమితులున్నాయేమోగాని, చాణక్యుని మేధాతేజస్సుకు పరిమితులు లేవు. స్యూరుడు అసర్పగామి. చాణక్యుడు (అతని ప్రతిభతో) సర్పగామి. సూర్యుడు – ఉదయాస్తమయాల్ని, వేడిమిని, చలువను ఒకేసారి ఇవ్వజాలడు. చాణక్యుడు నన్ద, చన్ద్రగుప్తులకు ఒకేసారి ఇవ్వగలిగాడు. అయ్యా, అందువల్ల సూర్యతేజస్సును మించినది చాణక్య తేజస్సు – అని తీర్మానం.

వృత్తం:

వసంత తిలక – త – భ – జ – జ – గగ – గణాలు.

అలంకారం:

వ్యతిరేకాలంకారం (వ్యతిరేకో విశేషశ్చేత్ ఉపమానోపమేయయోః – అని కువలయానందం).

ఉపమేయానికి ఉపమానం కన్నా ఆధిక్యం చెప్పడం కారణం.

నన్ద-మౌర్యులు, అస్త-ఉదయాలు, హిమ-ఉష్ణాలు అని క్రమాన్వయాలు చెప్పిన కారణంగా యథాసంఖ్యాలంకారమని కూడా రామదాసయ్యంగారు (యథా సంఖ్యాక్రమేణైవ క్రమికాణాం సమవ్యః – అని కువలయానందం).

కఞ్చుకీ:

(జానుభ్యాం భూమౌ నిపత్య) జయ త్వార్యః.

అర్థం:

(జానుభ్యాం=రెండు మోకాళ్ళతో, భూమౌ+నిపత్య=నేల మీద వాలి), ఆర్యః+జయతు=అయ్యవారికి జయం.

చాణక్యః:

వైహీనరే, కి మాగమన ప్రయోజనమ్?

అర్థం:

వైహీనరా!, ఆగమన+ప్రయోజనమ్+కిమ్= ఏమి ఇలాగ వచ్చావు (ఏమి పని?)

కఞ్చుకీ:

ఆర్య, ప్రణత ససంభ్రమోచ్చలిత భూమిపాల మౌళిమాలా మాణిక్యశకల శిఖా పిశఙ్గీకృత పాదపద్మయుగళః సుగృహీత నామధేయో దేవ శ్చన్ద్రగుప్త ఆర్యం శిరసా ప్రణమ్య విజ్ఞాపయతి – అకృత క్రియాన్తరాయ మార్యం ద్రష్టుమిచ్ఛామి-ఇతి.

అర్థం:

ఆర్య=అయ్యా, ప్రణత+స+సంభ్రమ+ఉచ్చలిత=వంగి నమస్కరించడం వల్ల ఏర్పడిన తడబాటుతో కదలాడే, భూమిపాల+మౌళిమాలా+మాణిక్య+శకల+శిఖా=సామంతరాజుల తలల వరుసలపై గల మణుల తునకల కాంతితో (అట్టి కిరీటాల కాంతితో), పిశఙ్గీకృత=పచ్చబారిన, పాద+పద్మ+యుగళః=పాదాలనే పద్మాల జంట గల – సు+గృహీత+నామధేయః=ప్రఖ్యాతి వహించిన, దేవః+చన్ద్రగుప్త=చంద్రగుప్త ప్రభువు, శిరసా+ప్రణమ్య=తలవంచి నమస్కరిస్తూ, ఆర్యం+విజ్ఞాపయతి=అయ్యవారికి మనవి చేసుకుంటున్నారు – “అకృత+క్రియా+అన్తరాయం+ఆర్యం= (తమ) ఇతర పనులకు అంతరాయం (ఆటంకం) కాకపోతే – (న చేదన్య కార్యాతి పాతః) ద్రష్టుం+ఇచ్ఛామి= చూడాలనుకుంటున్నాను, – ఇతి=అని.

వ్యాఖ్య:

“ప్రణత…… చన్ద్రగుప్తః” అంటూ అంత దీర్ఘ సమాసంలో రాజు సామర్థ్యాన్ని కీర్తించి “శిరసా ప్రణమ్య” అని ముక్తాయించడంలో అంతటివాడు కూడా తమ ముందు మోకరిల్లవలసిందే గదా! అని చాణక్యునికి అతడి ప్రత్యేకతను గుర్తుచేయడం. అంతగా రాజు యీ అయ్యవారికి ఋణపడి ఉన్నాడని స్ఫురణ. “వారికి తీరిక ఉంటే…” అనడంలో వినయ ప్రదర్శన.

చాణక్యః:

వృషలో మాం ద్రష్టు మిచ్ఛతి? వైహీనరే, న ఖలు వృషల శ్రవణ పథం గతోఽయం మత్కృతః కౌముదీ మహోత్సవ ప్రతిషేధః?

అర్థం:

వైహీనరా, వృషలః+మాం+ద్రష్టుం+ఇచ్ఛతి=రాజు (పెద్దకాపు) నన్ను చూడాలనుకుంటున్నాడా?,మత్+కృతః+అయం+కౌముదీ+మహోత్సవ+ప్రతిషేధః=నేను చేసిన ఈ కౌముదీ మహోత్సవ నిషేధం, వృషల+శ్రవణపథంగతః+న+ఖలు=రాజు చెవిని గాని పడలేదు కద!

కఞ్చుకీ:

ఆర్య, అథ కిమ్.

అర్థం:

అథ కిమ్= (అవును) అంతేనండి.

చాణక్యః:

(సక్రోధమ్) ఆః కేన కథితమ్ ?

అర్థం:

(స+క్రోధమ్=కోపంగా), ఆః=ఆఁ, కేన+కథితమ్=ఎవరి వల్ల తెలిసింది?

కఞ్చుకీ:

(సభయమ్) ప్రసీద త్వార్యః , స్వయమేవ సుగాఙ్గ ప్రసాదగతేన దేవే నావలోకితమ్, అపవృత్త కౌముదీమహోత్సవం పురమ్.

అర్థం:

(స+భయమ్=భయంతో) ఆర్యః+ప్రసీదతు= అయ్యవారు మన్నించాలి, సుగాఙ్గ+ప్రాసాద+గతేన+దేవేన=సుగాఙ్గ భవనం మీదకు వెళ్ళిన దేవర వారే (వారి చేతనే), స్వయం+ఏవ+అవలోకితమ్=స్వయంగానే చూశారు (చూడబడింది), అపవృత్త+కౌముదీమహోత్సవం+పురమ్=కౌముదీ మహోత్సవపు జాడలేమీ కనిపించని నగరాన్ని (నగరం), (అవలోకితమ్)=చూశారు (చూడబడింది).

ఎవరూ చెప్పలేదయ్యా – స్వయంగా వారే చూశారు – అని.

చాణక్యః:

ఆఃజ్ఞాతమ్, భవద్భిర న్తరా ప్రోత్సాహ్యకోపితో వృషలః. కి మన్యత్?

అర్థం:

ఆః+జ్ఞాతమ్=ఆఁ! తెలిసింది, భవద్భిః=మీరందరూ (అందరి చేతా), అన్తరా+ప్రోత్సాహ్య=లోపల లోపల ఎగసన ద్రోసి, వృషలః+కోపితః=రాజుకి కోపం వచ్చేలా చేశారు. కిమ్+అన్యత్=మరేముంది?

 (కఞ్చుకీ భయం నాటయం స్తూష్ణీమథోముఖ స్తిష్ఠతి).

అర్థం:

(కఞ్చుకీ+భయం+నాటయన్=కంచుకి వైహీనరుడు భయాన్ని కనబరుస్తూ, తూష్ణీం+అథోముఖః+తిష్ఠతి=ముఖం వంచుకుని నిలుచున్నాడు).

చాణక్యః:

అహో రాజపరిజనస్య చాణక్యోపరి ప్రద్వేష పక్షపాతః! అథ క్వ వృషలః?

అర్థం:

అహో=అయ్యో! (ఆహా – అని వ్యంగ్యం), రాజపరిజనస్య=రాచపరివారానికి, చాణక్య+ఉపరి=చాణక్యుడి మీద, ప్రద్వేష+పక్షపాతః= (ఎంత) శతృత్వంతో కూడిన పక్షపాతమో కద! అథ=సరే, క్వ+వృషలః= ఆ పెద్దకాపు (రాజు) ఎక్కడ (ఉన్నాడు)?

కఞ్చుకీ:

(భయం నాటయన్) ఆర్య, సుగాఙ్గగతేన దేవే నాహ మార్యపాదమూలం ప్రేషితః.

అర్థం:

(భయం+నాటయన్=భయం కనబరుస్తూ) ఆర్య=అయ్యా, సుగాఙ్గ+గతేన+ఆర్యేణ=సుగాఙ్గ ప్రాసాదానికి వెళ్ళిన ప్రభువు (ప్రభువు చేత), అహం+ఆర్యపాదమూలం+ ప్రేషితః=నేను అయ్యవారి పాదాల చెంతకు పంపబడ్డాను (పంపారు).

చాణక్యః:

(ఉత్థాయ) సుగాఙ్గమార్గ మాదేశయ.

అర్థం:

(ఉత్థాయ=లేచి నిలబడి) సుగాఙ్గ+మార్గం+ఆదేశయ=సుగాఙ్గ భవనానికి వెళ్ళే దారి చూపించు.

కఞ్చుకీ:

ఇత ఇత ఆర్యః.

అర్థం:

ఇతః+ఇతః+ఆర్యః=అయ్యా, ఇటు, ఇటు.

(ఉభౌ పరిక్రామతః).

అర్థం:

(ఉభౌ+పరిక్రామతః=ఇద్దరూ ముందుకు నడిచారు).

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here