ముద్రారాక్షసమ్ – తృతీయాఙ్కః – 7

0
6

[box type=’note’ fontsize=’16’] ‘ముద్రారాక్షసం‘ ఏడంకాల రాజకీయ నాటకం. విశాఖదత్తుడు యీ నాటకాన్ని చతుర రాజకీయ వ్యూహాల అల్లికతో, అద్భుతంగా రూపొందించాడు. సంస్కృత సాహిత్యం మొత్తంలో అరుదైన ఈ నాటకాన్ని ఇంద్రగంటి శ్రీకాంతశర్మ గారు అనువదించి, వ్యాఖ్యతో అందిస్తున్నారు. [/box]

కఞ్చుకీ: 

ఏష సుగాఙ్గ ప్రాసాదః; శనై రారోహ త్వార్యః.

అర్థం:

ఏషః+సుగాఙ్గ+ప్రాసాదః=ఇదే సుగాఙ్గభవనం, ఆర్యః+శనైః+ఆరోహతు=అయ్యవారు నెమ్మదిగా ఎక్కండి.

చాణక్యః: 

(నాట్యే నారు హ్యావలోక్యచ) అయే, సింహాసన మధ్యాస్తే వృషలః సాధు సాధు

అర్థం:

(నాట్యేన+ఆరుహ్యా+అవలోక్య+చ=పైకెక్కడాన్ని నాటకీయంగా చేసి – చూసి -) అయే=ఆహా!, వృషలః+సింహాసనం+అధ్యాస్తే=రాజు (పెద్ద కాపు) సింహాసనం ఎక్కి కూర్చున్నాడే, సాధు+సాధు=బాగుంది, బాగుంది.

శ్లోకం: 

నన్దైర్వియుక్త మన పేక్షిత రాజరాజై,

రధ్యాసితం చ వృష లేన వృషేణ రాజ్ఞామ్.

సింహాసనం సదృశపార్థివసఙ్గతం చ

ప్రీతిం పరాం ప్రగుణయన్తి గుణా మమైతే – (18)

అర్థం:

న+అపేక్షిత+రాజరాజైః+నన్దైః=మహా ధనికుడైన కుబేరుని సైతం లెక్కజేయని (ధనమదాంధులైన) నందవంశీయుల చేత, వియుక్తం=విడువబడినది; రాజ్ఞామ్+వృషేణ+వృషలేన=రాజులలో (పాలకులలో) శ్రేష్ఠుడైన (వృష పదం శ్రేష్ఠతా వాచకం) చంద్రగుప్తుని చేత (పెద్ద కాపు చేత), అధ్యాసితం=అధిష్ఠింపబడింది (ఎక్కబడింది). సింహాసనం=ఈ సింహ పీఠం, సదృశ+పార్థివ+సఙ్గతం+చ=తగిన పాలకుడి చేతికి చిక్కింది. ఏతే+గుణా= (సింహాసనానికి – అధికారానికి సంబంధించి) ఈ మంచి గుణాలు, మమ=నాకు,  పరాం+ప్రీతిం=మిక్కుటమైన సంతోషాన్ని, ప్రగుణయన్తి=పెంచుతున్నాయి.

వ్యాఖ్య:

ధనమదాంధులు నందవంశీయులు సింహాసనం దిగిపోయారు. సద్గుణ పాలకుడు చంద్రగుప్తుడా గద్దెనెక్కాడు. అంతే కాదు; గద్దెకు తగిన వ్యక్తి సంక్రమించాడు. ఈ గుణ పరంపర చాణక్యుడి ఆనందాన్ని ఇనుమడింపజేస్తోంది.

వృత్తం:

వసంత తిలకం – త – భ – జ – జ – గగ – గణాలు.

అలంకారం:

సముచ్చయాలంకారం (బహూనాం యుగపద్భావ భాజాం గుమ్భః – సముచ్చయః – అని కువలయానందం).

(గుణక్రియాయౌగపద్యం సముచ్చయ ఉదాహృతః – అని ప్రతాపరుద్రీయం).

గుణాలకు గాని, క్రియలకు గాని ఒక చోట కూర్పు జరిగితే – ఈ అలంకారం.

ఇక్కడ మౌర్య సింహాసన గుణత్రయాన్ని కూర్చడమైనది కనుక – సముచ్చయాలంకారం.

చాణక్యః: 

(ఉపసృత్య) విజయతాం వృషలః

అర్థం:

(ఉపసృత్య=సమీపించి) వృషలః+విజయతాం=వృషలుడికి (రాజుకి) జయమగుగాక!

రాజా: 

(ఆసనా దుత్థాయ) ఆర్య, చన్ద్రగుప్తః ప్రణమతి

(ఇతి – పాదయోః పతతి)

అర్థం:

(ఆసనాత్+ఉత్థాయ=పీఠం మీద నుంచి లేచి) ఆర్య=అయ్యా, చన్ద్రగుప్తః+ప్రణమతి=చంద్రగుప్తుడు నమస్కరిస్తున్నాడు.

[ఇతి – అని, పాదయోః+పతతి=(చాణక్యుని) పాదాలపై పడ్డాడు].

చాణక్యః: 

(పాణౌ గృహీత్వా) ఉత్తిష్ఠోత్తిష్ఠ, వత్స.

అర్థం:

(పాణౌ+గృహీత్వా=రెండు చేతులు పట్టుకొని), వత్స=నాయనా, ఉత్తిష్ఠ+ఉత్తిష్ఠ=లే, లే!.

శ్లోకం: 

ఆశై లేన్ద్రా చ్ఛిలాన్తః స్ఖలిత సురనదీ

శీకరాసార శీతాత్

తీరాన్తాన్నైక రాగ స్ఫురిత మణిరుచో

దక్షిణ స్యార్ణవస్య

ఆగ త్యాగత్య భీతి ప్రణత నృపశతైః

శశ్వ దేవక్రియనామ్

చూడారత్నాంశుగర్భా స్తవ చరణయుగ

స్యాఙ్గుళీ రన్ధ్రభాగాః – (19)

అర్థం:

శిలాన్తః=రాతిబండల మధ్య గూడా, ఆశైలేంద్రాత్=హిమాలయం నుంచి, స్ఖలిత+సురనదీ+శీకర+ఆసార+శీతాత్=జారిపడి ప్రవహించే గంగానది నీటి తుంపరల చల్లదనం గల (ప్రాంతం నుంచి) ప్రారంభించి – న+ఏక+రాగ+స్ఫురిత+రుచః=పలురంగుల రత్నాల కాంతి గల, దక్షిణస్య+అర్ణవస్య=దక్షిణపు సముద్రం (యొక్క), తీర+అన్తాత్= ఒడ్డుల చివరివరకు, ఆగత్య+ఆగత్య= వచ్చి, వచ్చి, ప్రణత+నృప+శతైః=నమస్కరించే వందలాది రాజులతో, శశ్వత్+ఏవ=ఎల్లప్పుడూ కూడా, తవ+చరణయుగస్య=నీ పాదాల జంట (యొక్క), అఙ్గుళీ+రన్ధ్ర+భాగాః=వ్రేళ్ళ సందులు, చూడారత్న+అంశు+గర్భాః=కిరీటాల లోని రత్నాల కాంతులు ఏర్పడినవిగా, క్రియన్తాం=అగుగాక! (చేయబడుగాక).

వ్యాఖ్య:

అవతల – ఉత్తరాన హిమాలయంలో గంగానదీ తరంగాల తుంపరుల చల్లదనంతో ప్రారంభించి ఇవతల దక్షిణ సముద్రంలోని రత్నకాంతులతో మిలమిలలాడే ప్రాంతం వరకు సామంత రాజులు నీ దగ్గరకి వచ్చి, తమ తలలు వంచగా – వారి కిరీట రత్నాల కాంతులు నీ కాళ్ళ వ్రేళ్ళ నడుమ భాగాల్ని కాంతిమంతములు చేయుగాక – అని చాణక్యుడు చంద్రగుప్తుణ్ణి ఆశీర్వదిస్తున్నాడు. ఆసేతు శీత నగం నీ చక్రవర్తిత్వం ప్రకాశించాలని – ఇక్కడ ఆశీస్సు సారాంశం.

వృత్తం:

స్రగ్ధర – మ – ర – భ – న – య – య – య – గణాలు.

రాజా:  

ఆర్యప్రసాదా దనుభూయత ఏవ సర్వమ్। త దుప విశ త్వార్యః।

అర్థం:

ఆర్య+ప్రసాదాత్=అయ్యవారి అనుగ్రహం వల్ల, సర్వమ్+అనుభూయత్+ఏవ=అంతా అనుభవంలోకి వచ్చినదే! – తత్+ఆర్యః+ఉపవిశతు=ఇక అయ్యవారు కూర్చుందురు గాక!

(ఉభౌ యథోచిత ముపవిష్టౌ)

(ఉభౌ=ఇరువురు, యథా+ఉచితమ్=తమకు (పదవులకు) తగిన విధంగా, ఉపవిష్టౌ=కూర్చున్నారు.)

చాణక్యః: 

వృషల, కి మర్థం వయ మాహూతాః?

అర్థం:

వృషలా! వయం+కిమ్+అర్థం+ఆహూతాః=మమ్మల్ని ఎందుకు పిలిచినట్టు?

రాజా:   

ఆర్యస్య దర్శనేన ఆత్మాన మనుగ్రాహయితుమ్.

అర్థం:

ఆర్యస్య+దర్శనేన=అయ్యవారి దర్శనంతో, ఆత్మానం+అనుగ్రాహయితుమ్=నన్ను నేను అనుగ్రహించుకొనేందుకు (పిలిపించాను).

చాణక్యః: 

(సస్మితమ్) అల మనేన ప్రశ్రయేణ। న నిష్ప్రయోజన మధికారవన్తః ప్రభుభి రాహూయన్తే॥

అర్థం:

(సస్మితమ్=చిరునవ్వుతో), అనేన+ప్రశ్రయేణ+అలం=ఈ వినయం చాలించు, ప్రభుభిః=పాలకులు (వారి చేత), అధికారవన్తః=ప్రభుత్వాధికారులను (అధికారులు), నిష్ప్రయోజనం=ఏ ప్రయోజనం లేకుండా, న+ఆహూయన్తే=పిలవరు (పిలవబడరు).

రాజా:  

ఆర్య, కౌముదీ మహోత్సవ ప్రతిషేధస్య కిం ఫల మార్యః పశ్యతి?

అర్థం:

ఆర్య=అయ్యా, కౌముదీ+మహోత్సవ+ప్రతిషేధస్య=వెన్నెల పండుగను నిషేధించడంలో (నిషేధానికి), కిం+ఫలమ్+ఆర్యః+పశ్యతి= ఏ ప్రయోజనాన్ని చూడగలుగుతున్నారు (ఏ ప్రయోజనం కనబడుతోంది)?

చాణక్యః:

(స్మితం కృత్వా) ఉపాలభ్ధుం తర్హి వయ మాహూతాః?

అర్థం:

(స్మితం+కృత్వా=చిరునవ్వు నవ్వి), తర్హి=అలాగు అయ్యే మాటైతే, వయం+ఉపాలభ్ధుం+ఆహూతాః+(కిమ్)=మమ్మల్ని తప్పు పట్టి నిందించడం కోసం పిలిచారు (పిలిచారా?)-).

రాజా:   

శాన్తం పాపం, శాన్తం పాపమ్; నహి నహి। విజ్ఞాపయితుమ్।

అర్థం:

శాన్తం పాపం+శాన్తం పాపమ్=పాపం శమించుగాక, పాపం శమించుగాక; నహి+నహి=కాదు, కాదు. విజ్ఞాపయితుమ్=నివేదించడం కోసం.

చాణక్యః: 

య ద్యేవం తర్హి విజ్ఞాపనీయానా మవశ్యం శిష్యేణ స్వైరరుచయో న నిరోద్ధవ్యాః।

అర్థం:

యది+ఏవం+తర్హి=అలాగే అయే మాటైతే, అవశ్యం=తప్పనిసరిగా, విజ్ఞాపనీయానాం (గురూణాం)=నివేదించడానికి తగిన గురువులకు, స్వైర+రుచయః=యథేష్ట విషయాలను (విషయాలు), శిష్యేణ=శిష్యుడు (శిష్యుని చేత), న+నిరోద్ధవ్యాః=ఆటంకపరచకూడదు (ఆటంకపరుపకూడదు) – (పెద్దల ఇష్టాలకు అడ్డు చెప్పరాదు).

ఇక్కడ – నువ్వు నన్ను ఈ విషయంలో ప్రశ్నించరాదు – అని చాణక్య మతం.

రాజా: 

ఏవ మేతత్. కః సన్దేహః? కింతు న కదాచి దార్యస్య నిష్ప్రయోజనా ప్రవృత్తి రి త్యస్తి నః ప్రశ్నావకాశః।

అర్థం:

ఏవం+ఏతత్=అది నిజమే (అది అంతే లెండి), సన్దేహః+కః=సంశయం ఏముంది? కింతు=అయితే, కదాచిత్=ఎప్పుడు కూడా, ఆర్యస్య+నిష్ప్రయోజనా+ప్రవృత్తి+న+అస్తి+ఇతి=అయ్యవారికి ప్రయోజనం లేని పని చేయడమంటూ ఉండదని – నః=మాకు, ప్రశ్నావకాశః=ప్రశ్నించే అవకాశం కలిగింది.

చాణక్యః: 

వృషల, సమ్య గ్గృహీతవా నసి న ప్రయోజన మన్తరా చాణక్యః స్వప్నేఽపి చేష్టత ఇతి!

అర్థం:

వృషలా!, సమ్యక్+ గృహీతవాన్+అసి=బాగా తెలుసుకున్నావు, చాణక్యః+స్వప్నే+అపి=చాణక్యుడు కలలో కూడా, న+ప్రయోజనం+అన్తరా=ఏ ప్రయోజనమూ లేకుండా, న+చేష్టత=ప్రవర్తించడు, ఇతి-అని (సమ్యక్+ గృహీతవాన్=బాగా గ్రహించావు).

వ్యాఖ్య:

“న ప్రయోజన మంతరా” అనే వాక్యంలో అంతరా – వినా! – “అన్తరాన్తరేణ యుక్తే ఇతి – ద్వితీయా” అనే నియమం చేత ప్రయోజనం అనే పదం ద్వితీయా విభక్తిలో వుంటుంది.

రాజా:

ఆర్య, అత ఏవ శుశ్రూషా మాం ముఖరయతి!

అర్థం:

ఆర్య=అయ్యా, అతః+ఏవ=ఆ కారణం చేతనే, శుశ్రూషా=వినాలనే కోరిక (శ్రోతుం ఇచ్ఛాం) మాం= నన్ను, ముఖరయతి=పలికిస్తోంది!

చాణక్యః:

వృషల, శ్రూయతామ్. ఇహ ఖల్వర్థ శాస్త్రకారా స్త్రివిధాం సిద్ధి ముపవర్ణయన్తి-రాజాయత్తాం సచివాయత్తా ముభయాయత్తం చేతి తతః సచివాయత్త సిద్ధే స్తవ కిం ప్రయోజనాన్వేషణేన, యతః వయమే వాత్ర నియుక్తా వేత్స్యామః।

(రాజా సకోపం ముఖం పరావర్తయతి)

(నేపథ్యే వైతాళికౌ పఠతః)

అర్థం:

వృషలా! శ్రూయతామ్=విను (విందువు గాక). ఇహ+ఖలు+అర్థశాస్త్రకారాః=అర్థశాస్త్రాన్ని రచించిన పండితులున్నారు కదా! త్రివిధాం+సిద్థిం=మూడు విధాలుగా రాజ్య నిర్వహణ రీతిని (నిర్వహణను), ఉపవర్ణయన్తి=వివరంగా చెబుతున్నారు – రాజాయత్తాం+సచివాయత్తాం+ఉభయాయత్తం+చ+ఇతి=రాజు చేతిలో ఉండేది, మంత్రి చేతిలో ఉండేది, ఇద్దరి చేతుల్లోనూ ఉందేదీ – అని. తతః=అందువల్ల, సచివాయత్త+సిద్ధే=(నీ విషయంలో) మంత్రి చేతిలో పాలన అనేది నడుస్తున్న, తవ=నీకు, ప్రయోజన+అన్వేషణేన+కిం?=కౌముదీమహోత్సవ నిషేధ కారణం వెతకడం ఎందుకు?అతః+అత్ర+నియుక్తాం+వయం+ఏవ=ఆ కారణం చేత, ఇక్కడ (మంత్రిగా) నియమింపబడిన మేమే, వేత్స్యామః=తెలుసుకుంటాము (ఎరుగుదుము).

(రాజా=రాజు, స+కోపం=కోపంతో, ముఖం+పరావర్తయతి=ముఖం తిప్పేసుకున్నాడు)

(నేపథ్యే=తెర వెనుక, వైతాళికౌ=స్తుతిపాఠకులు, పఠతః=చదువుతున్నారు)

ఏకః (వైతాళిక):   

ఆకాశం కాశపుష్ప చ్ఛవి మభిభవతా

భస్మనా శుక్లయన్తీ,

శీతాంశో రంశుజాలై ర్జలధర మలినాం

క్లిశ్నతీ కృత్తి మై భీమ్,

కాపాలీ ముద్వహన్తీ స్రజ మివ ధవళాం

కౌముదీ మి త్యపూర్వా

హాస్య శ్రీరాజహంసా హరతు శర దివ

క్లేశ మైశీ తను ర్వః – (20)

అర్థం:

కాశపుష్ప+ ఛవిం+మభిభవతా=రెల్లుపూల కాంతిని తిరస్కరిస్తూ, భస్మనా =బూడిదతో, ఆకాశం=సర్వదిక్కులను (వ్యోమమునంతనూ), శుక్లయన్తీ=తెల్లబరుస్తూ, శీతాంశో=చంద్రుని (యొక్క), అంశు+జాలై=కిరణ సముదాయంతో, జలధర+మలినాం+ఐభీమ్=మేఘం వలె  నల్లనైన (నీటి మేఘాల వలె) ఏనుగు సంబంధమైన, కృత్తిమ్+క్లిశ్నతీ=చర్మాన్ని కించపరిచే విధంగా (తిరస్కరిస్తూ), ధవళాం+కౌముదీం+ఇతి=తెల్లని వెన్నెలను వలె, కాపాలీం+స్రజం=తెల్లని పుఱ్ఱెల మాలను, ఉద్వహన్తీ =తాలుస్తూన్న, అపూర్వా=అపురూపమైన, హాస్యశ్రీ+రాజహంసా= రాజహంస ధ్వనిని పోలిన నవ్వుగల (అట్టి ధావళ్యంతో కూడిన), ఐశీ+తనుః=పరమేశ్వరమూర్తి,శరత్+ఇవ=శరత్కాలం మాదిరిగా, వః-మీ (యొక్క), క్లేశం=కష్టదశను, హరతు=ఉపశమింపజేయుగాక.

వ్యాఖ్య:

పరమశివుడి శరీరంలాగా ఈ శరదృతువు ఉన్నది. ఇట్లా చల్లదనంతో, ప్రశాంతమైన తెల్లదనంతో ఆహ్లాదం కలిగించే శరదృతువు లాగే పరమేశ్వరుడు కూడా మీ తాపాన్ని (కష్టాన్ని) పోజేయుగాక – అని సారాంశం. శివ శరీరం తెలుపు. శరత్కౌముది తెలుపు. శివుడి తనువుపై బూది పూత – శరత్కాల ధావళ్యం రెల్లుపూల తెలుపును మించింది. కడకు – పరమశివుడి ఏనుగు తోలు పుట్టాన్ని, కపాల మాలికను కూడా తెల్లని కాంతితో అతిశయింపజేస్తోంది శరత్తు.

తెల్లని వస్తు పరంపరతో పరమశివ మూర్తిని పోల్చడం – “శరదివ ఐశీతనుః” అని చెప్పడం శ్రీహర్షుని నాటకం ‘నాగానందం’లో కూడా వేరే రీతిగా – కనిపిస్తుంది.

“…. వినాయకా హిత ప్రీతి శశి ధవలాస్థి కపాలం, వపురివ ‘రౌద్రం’ శ్మశానమిదం”.

అలంకారం:

ఉపమాలంకారం (ఉపమాయత్ర సాదృశ్య లక్ష్మీరుల్లసతి ద్వయోః అని కువలయానందం).

“ఐశీతనుః శరదివ క్లేశం హరతు” అంటూ శరత్తులో పరమశివుని శరీరానికి పూర్తిగా పోలిక కల్పించడం వల్ల – పూర్ణోపమ.

వృత్తం:

స్రగ్ధర – మ – ర – భ – న – య – య – య – గణాలు.

శ్లోకం: 

అపి చ –

ప్రత్యగ్రోన్మేషజిహ్మా క్షణ మనభిముఖీ

రత్న దీప ప్రభాణా,

మాత్మవ్యాపారగుర్వీ, జనిత జలలవా

జృమ్భితైః సాఙ్గభఙ్గైః,

నాగాఙ్కం మోక్తు మిచ్ఛోః శయన మురు ఫణా

చక్రవా ళోపధానమ్

నిద్రాచ్ఛేదాభితామ్రా చిర మవతు హరే

ర్దృష్టి రా కేక రా వః॥ – (21)

అర్థం:

అపి+చ=ఇంకా…

స+అఙ్గ+భఙ్గైః=ఒడలు విరుపుల అవయవాలతోనూ, జృమ్భితైః=ఆవులింతలతోనూ, ఉరు+చక్రవాళ+ఉపధానమ్=గొప్ప పడగల సముదాయమే దిండుగా ఉన్న, నాగ+అఙ్కం=పాము రూపు గల, శయనం=పడక మంచాన్ని, మోక్తుం+ఇచ్ఛోః=విడిచి పెట్టాలనుకుంటున్న, హరేః+ఆకేకరా+దృష్టిః=విష్ణువు (యొక్క) అరమోడ్పు చూపు (అప్పుడే సగం సగం విడుతున్న రెప్పల చాటు చూపు), ప్రత్యగ్ర+ఉన్మేష+జిహ్మా=అప్పుడప్పుడే తెరవడం వల్ల ఇంకా అరమోడ్పుగా, మసకగా ఉన్న; రత్నదీప+ప్రభాణాం= (ఆదిశేషుని పడగలపై) మణులనే దీపాల కాంతులకు, క్షణం+న+అభిముఖీ=ఒక్క క్షణం సేపు ఎదుట నిలువజాలక, ఆత్మ+వ్యాపార+గుర్వీం=తన చూపు బరువెక్కినదీ, జనిత+జల+లవా=కొద్దిపాటి (కంటి) నీటి తడి పుట్టినదీ, నిద్రా+ఛేదా+అభితామ్రా=నిద్రాభంగంతో కొద్దిగా ఎరుపెక్కినదీ (అయిన – ఆ దేవుని చూపు), వః=మిమ్మల్ని, చిరం=చాలా కాలం పాటు, అవతు=కాపాడుగాక!

వ్యాఖ్య:

అప్పుడప్పుడే దీర్ఘ (గాఢ) నిద్ర నుంచి మేల్కొనే వ్యక్తి కంటి చూపు ఏ విధంగా ఉంటుందో – చాలా వివరంగా చెప్పిన శ్లోకం ఇది. శయనైకాదశి నాడు యోగనిద్రకు ఉపక్రమించే శ్రీమహావిష్ణువు, కార్తీక శుద్ధ ఏకాదశినాదు ఉత్థానైకాదశి నాడు – మేల్కొనే వర్ణన ఇది.

అలంకారం:

స్వభావోక్తి. (స్వభావోక్తిస్స్వభావస్య జాత్యాదిస్థస్య వర్ణనమ్- అని కువలయానందం).

(స్వభావోక్తి రసౌ చారు యధావస్తువర్ణనమ్ – అని ప్రతాపరుద్రీయం).

ఈ శ్లోకంలో నిద్ర వీడిన స్థితిని సహజంగా వర్ణించడం గమనించవచ్చును.

వృత్తం:

స్రగ్ధర – మ – ర – భ – న – య – య – య – గణాలు.

ద్వితీయః (వైతాళిక): 

శ్లోకం:

సత్త్వోత్కర్ష స్య ధాత్రా నిధయ ఇవ కృతాః

కేఽపి క స్యాపి హేతో

ర్జేతారః స్వేన ధామ్నా మదసలిలముచాం

నాగయూ థేశ్వరాణాం

దంష్ట్రాభఙ్గం మృగాణా మధిపతయ ఇవ

వ్యక్త మానావ లేపా

నాజ్ఞా భఙ్గం సహన్తే నృవర నృపతయ

స్త్వాదృశాః సార్వభౌమాః – (22)

అర్థం:

నృవర= ఓ రాజా! కే+అపి+నృపతయః= ఏ కొద్ది మంది రాజులో, త్వాదృశాః=నిన్ను పోలినవారు, సార్వభౌమాః=చక్రవర్తులు, కస్య+అపి+హేతోః=ఏదో ఒక కారణం నెపంగా, ధాత్రా=సృష్టికర్త చేత, సత్త్వ+ఉత్కర్షస్య+నిధయః+ఇవ=గొప్ప బలానికి ఆకరాలుగా  (పెన్నిధుల వలె) కృతాః=చేయబడుతూ ఉంటారు. స్వేన ధామ్నా=తమ పరాక్రమ తేజస్సుతో, జేతారః=జయస్వభావంతో ఉంటూంటారు.

మదసలిల+ముచాం+గజాయూధ+ఈశ్వరాణాం=మదజలం విడిచే ఏనుగు గుంపుల అధినాయకులకు (ను), జేతారః=జయించే, మృగాణాం+అధిపతయ=మృగరాజులైన సింహాలు, దంష్ట్రాభఙ్గం+ఇవ=తమ కోరలు విరగడం (సహించని) మాదిరి, వ్యక్త+మాన+అవలేపాః+త్వాదృశాః=నీ వంటి పరువు, పౌరుషం గల వారు, ఆజ్ఞా+భఙ్గం+న+సహన్తే=తమ ఆదేశాలను ఉల్లంఘించడం సహించరు.

వ్యాఖ్య:

ఇక్కడ, ప్రస్తుతం చాణక్యుడు తన కౌముదీమహోత్స నిర్వహణాదేశాన్ని రద్దు చేయడం సహించనంతటి పౌరుషం గలవాడు చంద్రగుప్తుడనే విషయాన్ని వైతాళికుడు సూచిస్తున్నాడు. గజరాజు ఎంతటి బలవంతుడైనా, వానిని ఎదిరించి నిలువగల సింహం, తన కోర (వాని కారణంగా) విరిగితే సహించజాలని మాదిరి – చంద్రగుప్తుడి వంటి రాజులు తమ ఆదేశాలకు భంగం కలిగితే సహించరు – అని పోలిక.

వృత్తం:

స్రగ్ధర – మ – ర – భ – న – య – య – య – గణాలు.

అలంకారం:

ఉపమ  –  మృగానం అధిపతయః ఇవ, త్వాదృశాః నృపతయః ఆజ్ఞాభఙ్గం న సహన్తే – అని పోలిక చెప్పడం వల్ల ఇక్కడ యీ అలంకరం.

శ్లోకం:   

అపి చ –

భూషణా ద్యుపభో గేన ప్రభుర్భవతి న ప్రభుః

పరై రపరి భూతాజ్ఞ, స్త్వ మివ ప్రభు రుచ్యతే – (23)

అర్థం:

అపి+చ= ఇంకా (చెప్పాలంటే)

భూషణ+ఆది+ఉపభోగేన=మంచి ఆభరణాలు, వస్త్రాదులు వాడుకుని అనుభవించడం చేత, ప్రభుః=రాజు, న+ప్రభుః+భవతి=రాజెన్నటికీ కాలేడు. – త్వం+ఇవ=నీ మాదిరి, పరైః=ఇతరుల చేత, న+పరిభూతః+ఆజ్ఞః=ఆదేశాలను తిరస్కరింపబడనివాడే (నీ ఆజ్ఞలకు విలువ ఉన్నప్పుడే), ప్రభుః+ఉచ్యతే=రాజు అనిపించుకుంటాడు.

వృత్తం:

అనుష్టుప్.

అలంకారం:

ప్రతీపాలంకారం (ప్రతీపముపమాన స్యోపమేయత్వ ప్రకల్పనం – అని కువలయానందం సాధారణ నిర్వచనం). ఇక్కడ చిన్న భేదం:- వర్ణ్యోపమేయలాభేన తథాఽన్యస్యాప్యనాదరః – అనే తీరు ప్రతీపం అన్వయిస్తుంది.

రాజనిపించుకోడానికి వస్త్రభూషణాదులు కారణం కారాదు; తన ఆదేశాలు చెల్లడం కావాలి – అని విశేషం.

చాణక్యః:

(స్వగతమ్) ప్రథమం తావ ద్విశిష్ట దేవతాస్తుతి రూ పేణ ప్రవృత్త శరద్గుణ ప్రఖ్యాపన మాశీర్వచనమ్. ఇద మపరం కి మితి నావధారయామి. (విచిన్త్య) ఆః జ్ఞాతమ్. రాక్షస స్యాయం ప్రయోగః, దురాత్మన్ రాక్షస! దృశ్యసే భోః! జాగర్తి ఖలు కౌటిల్యః!

అర్థం:

(స్వగతమ్=తనలో) ప్రథమం+తావత్=మొదటిదైతే, విశిష్ట+దేవతా+స్తుతి+రూపేణ+ ప్రవృత్తః=గొప్ప దేవతా ప్రశంసా రూపంతో నడచిన, శరత్+గుణ+ప్రఖ్యాపనం+ఆశీర్వచనమ్=శరదృతువు గుణాలను ప్రకటించడం ద్వారా చేసిన ఆశీర్వచనం (దీవెన). ఇదం+అపరం+కిం+ఇతి+న+అవధారయామి=ఈ రెండవ (శ్లోక) భావం ఏమిటనేది బోధ పడలేదు నాకు. (విచిన్త్య=ఆలోచించి), ఆః+జ్ఞాతమ్=ఆఁ, తెలిసింది. రాక్షసస్య+అయం+ప్రయోగః=ఈ ఏర్పాటు రాక్షసుడిది, దురాత్మన్+రాక్షస=దుర్మార్గుడా, రాక్షసా!, భోః+దృశ్యసే=ఓరయ్యా, చూస్తున్నానులే (నువ్వు కనబడతూనే వున్నావు నాకు!), కౌటిల్యః+జాగర్తి+ఖలు=కౌటిల్యుడు మేలుకొనే వున్నాడు లేవయ్యా!

రాజా:

ఆర్య, వైహీనరే, ఆభ్యాం వైతాళికాభ్యాం సువర్ణ శతసహస్రం బాపయ।

అర్థం:

ఆర్య=అయ్యా, వైహీనరే=వైహీనరా!, ఆభ్యాం+వైతాళికాభ్యాం=ఆ వైతాళికులిద్దరికీ, సువర్ణశత+సహస్రం=లక్ష సువర్ణాలు, బాపయ=ఇప్పించు.

కఞ్చుకీ: 

యదాజ్ఞాపయతి దేవః. (ఇతి పరిక్రామతి)

అర్థం:

యత్+దేవః+ఆజ్ఞాపయతి=దేవరవారు ఆదేశించినట్లే (చేస్తాను). (ఇతి=అని, పరిక్రామతి=ముందుకు నడుస్తాడు).

చాణక్యః:

(సక్రోధమ్) వైహీనరే, తిష్ఠ, న గన్తవ్యమ్, వృషల, కి మయ మస్థానే మహా నర్థోత్సర్గః?

అర్థం:

(స+క్రోధమ్=కోపంతో) వైహీనరే+తిష్ఠ=వైహీనరా ఆగు (నిలబడు), న+గన్తవ్యమ్=వెళ్ళక్కరలేదు, వృషలా!, అస్థానే=అకారణంగా (సమయం, సందర్భం లేకుండా), అయం+కిమ్+మహాన్+అర్థ+ఉత్సర్గః=ఇలా ధనాన్ని విడిచిపెట్టడం ఏమిటి (ఈ దుబారా ఏమిటి?).

రాజా:   

(సకోపమ్) ఆర్యే ణైవం సర్వత్ర నిరుద్ధ చేష్టా ప్రసరస్య మే బన్ధన మివ రాజ్యం, న రాజ్య మివ।

అర్థం:

(స+కోపమ్=కోపంతో), ఏవం=ఈ విధంగా, ఆర్యేణ=అయ్యవారు (వారి చేత), సర్వత్ర=అంతటా, నిరుద్ధ+చేష్టా ప్రసరస్య=ప్రతి పనిని అడ్డగించే సందర్భంలో, మే=నాకు, రాజ్యం=ఈ రాజ్యం, బన్ధనం+ఇవ=సంకెల వేసినట్టు ఉంది, రాజ్యం+ఇవ+న=రాజ్యం లాగా లేదు.

చాణక్యః: 

వృషల, స్వయ మనభియుక్తానాం రాజ్ఞా మేతే దోషాః సంభవన్తి। త ద్యది న సహసే తతః స్వయ మభియుజ్యస్వ।

అర్థం:

వృషలా!, స్వయం+అనభియుక్తానాం+రాజ్ఞాం=తమంత తాముగా పనులు నిర్వహించుకోజాలని పాలకులకు, ఏతే+దోషాః+సంభవన్తి=ఇదిగో, ఇటువంటి తప్పులు తటస్థిస్తాయి. తత్=అందువల్ల, న+సహసే+యది=నీకు సహించరాకుండా వుంటే, తతః=ఇక, స్వయం+అభియుజ్యస్వ=నీ అంతట నువ్వే నిర్వహించుకో!

రాజా:  

ఏతే స్వకర్మణ్యభియుజ్యామహే।

అర్థం:

ఏతే=అలాగైతే, స్వకర్మణి=ఈ పనుల విషయంలో స్వయంగా, అభియుజ్యామహే=చేసుకుంటాము (పూనుకుంటాము).

చాణక్యః:

ప్రియం నః. వయ మపి స్వకర్మ ణ్యభియుజ్యామహే।

అర్థం:

నః+ప్రియం=మాకూ ఇష్టమే. వయం+అపి=మేము కూడా, స్వకర్మణి=మా పనులలో, అభియుజ్యామహే=నిమగ్నమవుతాము.

రాజా:  

య ద్యేవం, తర్హి కౌముదీమహోత్సవ ప్రతిషేధస్య తావత్ ప్రయోజనం శ్రోతు మిచ్ఛామి

అర్థం:

ఏవం+యది=అలాగైతే, – తర్హి=ఆ పక్షంలో, కౌముదీమహోత్సవ+ప్రతిషేధస్య=కౌముదీ మహోత్సవాన్ని రద్దు చేయడంలో, తావత్+ప్రయోజనం=ఆ లాభం ఏమిటో, శ్రోతుం+ఇచ్ఛామి=వినాలనుకుంటున్నాను.

చాణక్యః: 

వృషల, కౌముదీ మహోత్సవానుష్ఠానస్య కిం ప్రయోజన మి త్యహ మపి శ్రోతు మిచ్ఛామి।

అర్థం:

వృషలా!, కౌముదీమహోత్సవ+అనుష్ఠానస్య=కౌముదీ మహోత్సవం నిర్వహించడం వల్ల, ప్రయోజనం+కిం+ఇతి=ఏమి లాభం ఉంది అని, అహం+అపి=నేను కూడా, శ్రోతుం+ఇచ్ఛామి=వినాలనుకుంటున్నాను.

రాజా:  

ప్రథమం తావత్ మమాజ్ఞా ఽవ్యాఘాతః।

అర్థం:

ప్రథమం+తావత్=మొదటి కారణమైతే… మమ+ఆజ్ఞా+అవ్యాఘాతః=నా ఆదేశాలకు ఆటంకం ఉండరాదు (తిరస్కారం పనికిరాదు).

చాణక్యః: 

వృషల, మ మాపి త వాజ్ఞా వ్యాఘాత ఏవ కౌముదీ మహోత్సవ ప్రతిషేధస్య ప్రథమం ప్రయోజనమ్। కుతః-

అర్థం:

వృషలా, మమ+అపి=నాకు కూడా, తవ+ఆజ్ఞా+వ్యాఘాతః+ఏవ=నీ ఆదేశానికి భంగం కలిగించడమే, కౌముదీమహోత్సవ+ప్రతిషేధస్య=కౌముదీ మహోత్సవాన్ని రద్దు చేయడానికి, ప్రథమం+ప్రయోజనమ్-మొదటి ప్రయోజనం. కుతః=కారణం ఏంటంటే –

శ్లోకం:

అమ్బోధీనాం తమాల ప్రభవ కిసలయ

శ్యామ వేలావనానా

మా పారేభ్య శ్చతుర్ణాం చటుల తిమికుల

క్షోభి తాన్తర్జలానామ్

మా లే వామ్లాన పుష్పా తవ నృపతిశ తై

రుహ్యతే యా శిరోభిః

సా మ య్యేవ స్ఖలన్తీ కథయతి వినయా

లఙ్కృతం తే ప్రభుత్వమ్ – (24)

అర్థం:

తమాలప్రభవ+కిసలయ+శ్యామ+వేలా+వనానాం=చీకటి (కానుగ) చెట్ల పూలు, చివుళ్ళ నల్ల వివర్ణంతో నలుపెక్కిన తీరాలతోనూ, చటుల+తిమికుల+క్షోభిత+అన్తర్+జలానామ్=త్రుళ్ళిపడే తిమింగలాల గుంపులతో కలచి వేయబడిన లోపలి నీళ్ళతోనూ (నిండి వున్న), చతుర్ణాం+అమ్బోధీనాం=నాలుగు సముద్రాల (యొక్క), అపారేభ్యః=తీరాల వరకూ, ఆమ్లాన+పుష్పమాలా+ఇవ=వాడిపోని పూలదండ మాదిరి, యా=ఏదైతే, నృపతి+శతైః=వందల రాజుల చేత, శిరోభిః+ఉహ్యతే=తలల దాల్చబడుతున్నదో, సా=అది (నీ రాచరికం), తే+ప్రభుత్వమ్+మయి+ఏవ=నా విషయంలో మాత్రమే, స్ఖలన్తీ=మెట్టుదిగి, వినయ+అలఙ్కృతం=లొంగి ఉన్నట్టుగా, కథయతి=(చెప్పకనే) చెపుతున్నది.

వ్యాఖ్య:

చంద్రగుప్తుడి రాజ్య వైభవం నాలుగు సముద్రాల వరకు వ్యాపించగా – అతడి ప్రభుత్వాధికారాన్ని ఎక్కడెక్కడి రాజులు తలలపై పూలదండలాగా అలంకరించుకున్నారు నిజమే. అయితే ఆ రాచరిక అధికారం చాణక్యుడి ఒక్కడి ఎదుట మాత్రం మెట్టు దిగి – వినయంగా లొంగివున్నట్టు చెప్పుకొంటున్నది.

వృత్తం:

స్రగ్ధర – మ – ర – భ – న – య – య – య – గణాలు.

అలంకారం:

ఉపమ. అమ్లాన పుష్పమాలా ఇవతే ప్రభుత్వమ్ ఉహ్యతే – అని పోలిక చెప్పడం వల్ల ఉపమాలంకారం.

చాణక్యః: 

అథ త్వ మపర మపి ప్రయోజనం శ్రోతు మిచ్ఛసి? త ద పి కథయామి।

అర్థం:

అథ=ఇంకా, అపరం+అపి+ప్రయోజనం=మరొక ప్రయోజనం కూడా, త్వం+శ్రోతుం+ఇచ్ఛసి=నువ్వు వినాలనుకుంటున్నావా? తత్+అపి+కథయామి=అది కూడా చెబుతాను.

రాజా:  

కథ్యతామ్

అర్థం:

కథ్యతామ్=చెప్పబడవచ్చును (చెప్పండి).

చాణక్యః: 

శోణోత్తరే, మద్వచనాత్ కాయస్థ మచలం బ్రూహి – య త్త ద్భద్రథట ప్రభృతీనా మితో ఽపరాగా దప క్రమ్య మలయకేతు మాశ్రితానాం లేఖ్యపత్రం దీయతామ్ఇతి.

అర్థం:

శోణోత్తరా!, కాయస్థం+అచలం=అచలుడనే కాయస్థునితో (గుమాస్తాతో), మత్+వచనాత్+బ్రూహి= నా మాటగా చెప్పు. యత్=ఏమనంటే; ‘ఇతః=ఇక్కడి నుంచి, అపరాగాత్=శత్రుత్వం కారణంగా, అపక్రమ్య=తొలగిపోయి (తప్పుకొని), – మలయకేతు+ఆశ్రితానాం=మలయకేతుణ్ణి ఆశ్రయించుకొని వున్న, భద్రథట+ప్రభృతీనాం=భద్రభటుడు మొదలైనవారి (యొక్క), లేఖ్యపత్రం=ఉత్తరపు కాగితాన్ని (కాగితం), దీయతామ్=ఇవ్వబడుగాక (ఇయ్యి)’ – ఇతి=అని.

ప్రతీహారీ:  

జం అజ్జో ఆణవేది (యదార్య ఆజ్ఞాపయతి…)

(ఇతి నిష్క్రమ్య పునః ప్రవిశ్య) అజ్జ ఇమం పత్తఅమ్ (ఆర్య, ఇదం పత్రకమ్).

అర్థం:

యత్+ఆర్య+ఆజ్ఞాపయతి=ఆయ్యవారు ఆదేశించినట్టే (చేస్తాను) – (ఇతి=అని, నిష్క్రమ్య=వెళ్ళి, పునః+ప్రవిశ్య=తిరిగి వచ్చి), ఆర్య=అయ్యా, ఇదం+పత్రకమ్=ఇదిగో కాగితం…

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here