ముగ్గురాళ్ల మిట్ట – పుస్తక పరిచయం

0
7

[dropcap]సు[/dropcap]ప్రసిద్ధ రచయిత శ్రీ. ఆర్. సి. కృష్ణస్వామిరాజు రచించిన 16 కథల సంపుటి ఇది.

ముగ్గురాళ్ళ మిట్ట, ఊరి ఉప్పు, అడవి పంది, మరాఠీ గేటు, రెడ్డోళ్ళ బావి, కొక్కిరాళ్ల కొండ, గురుదేవోభవ, బామ్మ – బొచ్చు కుక్క, నమస్కారం, కొరమీను గుంట, బడి బియ్యం, రామక్కవ్వ, గంప కింద కోళ్లు, వీధి పొరికి, గొర్రెదాటు, కనుమలో కుంటోడు – ఇవీ ఈ సంపుటిలోని కథలు.

***

“ఇతనికి కథ రాసే టెక్నిక్ తెలుసు. ఏ విషయాన్నైనా అవలీలగా కథగా మలచగలడు. పల్లెటూరి దైనందిన జీవితంలో మనం నిత్యం చూసే చిన్న చిన్న విషయాలే ఇందులో కథలుగా మారి పెద్ద పెద్ద ఆలోచనలను రేకెత్తిస్తాయి. మానవ స్పందనల చుట్టూ బిగించి పడేసి తమ వెంట తీసుకెళ్తాయి.

కథల నిండా పొడుపు కథలు ఉంటాయి. అడుగడుగునా పొడుపు కథలు విప్పే పాత్రలు కనబడతాయి. కథల్లో లీనమవుతూనే మనమూ ఆ పొడుపు కథల్ని విప్పడానికి ప్రయత్నిస్తాం.

గొప్ప సామాజిక ప్రయోజనం సాధించే దిశగా ఇతని కథలు ప్రయాణిస్తున్నాయి. మనుషులంతా కలిసిమెలసి ఉండాలని, ఒకరి  బాధను ఒకరు సహానుభూతితో అర్థం చేసుకోవాలని రచయిత తపిస్తాడు.

పల్లెల్లోని పేదరికాన్ని, అందులోని దైన్యాన్ని కూడా మూడు ముక్కల్లోనే చెప్పి కదిలిస్తాడు రచయిత. ఇతను చాలా పొదుపరి. అవసరముంటే కానీ ఒక్క ముక్కా ఎక్కువ మాట్లాడ్డు. చెప్పాల్సిన విషయం నుంచి దూరంగా పారిపోడు. అన్ని కథలూ సింగిల్ పాయింట్‍లోనే కొనసాగి ఏకబిగిన చదివిస్తాయి.

కథల నిండా పర్చుకున్న రచయిత పసి హృదయం ఎప్పుడూ మంచే తలుస్తుంది.” – అని వ్యాఖ్యానించారు తన ముందుమాట ‘జనపద కళాకారుడు’లో ప్రముఖ రచయిత వేంపల్లె షరీఫ్.

~

“ఉప్పు కారం, తీపి చేదుల సమ్మిళతం నా బాల్యం. ఈ కథల ముడిసరుకు పూర్తిగా నా బాల్యం, నా ఊరు, మరియు నా కుటుంబ నేపథ్యం. ఈ పదహారు కథలూ నా జీవితంలో వివిధ సందర్భాలలో జరిగిన సంఘటనలే. ప్రత్యక్షంగానో పరోక్షంగానో జరిగిన వాస్తవ సంఘటనలకు అక్షర రూపం ఇచ్చాను. చదివి ఆస్వాదిస్తారని ఆశిస్తున్నాను” అన్నారు రచయిత ‘నా మాట’లో.

***

సంపుటికి మకుటమైన ‘ముగ్గురాళ్ళ మిట్ట’ కథ నుంచి కొన్ని వాక్యాలు:

~

ఈ విషయం ఆ నోటా ఈ నోటా ప్రాకి ప్రాకి ప్రెజెంట్ ప్రెసిడెంట్ సిబ్యాల సుధక్క చెవిన పడింది. మిద్దెపైన వడియాలు పెడ్తావున్న సుధక్క ఎక్కడివక్కడ ఆడబిడ్డకు అప్పగించి ఇంట్లోకి పరుగులెత్తింది. నిద్దరోతున్న మొగుడు మునస్వామిని తట్టి లేపింది. తమ పాతిక లక్షల ఇన్నోవా కారులో ముగ్గురాళ్ల మిట్టకాడికి మొగుడు పెళ్లాలిద్దరూ చేరినారు.

రయ్‌మని వచ్చి కారు ఆగడం చూసిన చెట్లమీద పక్షులు వేడుకని చూడసాగాయి. ‘ఏమారితే అప్పోజిషనోళ్లు ఇలాంటి చిన్న విషయాల్ని పెద్ద విషయాలు చేసి లబ్ధి పొందితే… అమ్మో! ఎలక్షన్లు ఎప్పుడు అనౌన్స్ చేస్తారో, ఏంపాడో!’ అనుకుంటూ పట్టుచీర సర్దుకొంటూ పడవలాంటి కారు నుంచి దిగింది.

“ఓలమ్మో! ఓలమ్మో! మన ఊరి పిల్ల పది పరీక్ష మిస్సయితే ఊరుకుంటామా! ఏంది! మేమంతా లేమా! ఏంది! మమ్మల్ని ఎట్ల మరిసినారు నాయనా! రా అమ్మీ! కారెక్కు” అని అంటూ చీర చెంగు నడుముకి చుట్టింది.

నాలుగేండ్ల రాజకీయ ప్రస్థానంలో పంచాయితీ ప్రెసిడెంట్ సిబ్యాల సుక్క పాలిటి(ట్రి)క్స్‌లో ఇంత గొప్పగా ఎదగడం చూసి మొగుడు మునస్వామికి ముచ్చటేసింది. చిలకమర్తి పద్యపాదం ‘ముదితల్ నేర్వగరాని విద్యగలదే ముద్దార నేర్పించినన్’ గుర్తొచ్చి ముసిముసిగా నవ్వుకున్నాడు. మెత్తగా మీసాలు దువ్వుకుంటూ కారు స్టార్టు చేసినాడు.

***

ముగ్గురాళ్ల మిట్ట (కథా సంపుటి)

రచన: ఆర్‌.సి. కృష్ణస్వామి రాజు

పేజీలు: 112; వెల రూ.100/-

ప్రతులకు: రచయిత, ఫోన్‌: 9393662821

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here