ముగింపు ఎలా??

6
5

[dropcap]ఆ [/dropcap]రోజు ఇల్ల౦తా హడావిడిగా సర్డుతూంది సంధ్య.

బయటనుండీ కొన్ని స్నాక్స్ కూడా తెప్పించింది. అవన్నీ అమ్మ శారద చేతికి ఇస్తూ “నా ఫ్రెండ్స్ వచ్చినప్పుడు ప్లేట్స్‌లో సర్ది ఇవ్వలమ్మా. ఒక స్వీట్, ఒక సమోసా పెట్టు. సరేనా??” సరేనంటూ తల ఊపినా శారదమ్మకు మనసులో ఎన్నో ప్రశ్నలు.

ఎలిమెంటరీ స్కూల్ టీచర్‌గా రిటైర్ అయ్యాక కొద్దిరొజూలు తన దగ్గర గడపమని కూతురు సంధ్య కోరితే వచ్చింది శారదమ్మ. నాలుగురోజులు బాగానే గడచినా నిన్నటి నుండీ ఆ వూర్లో జరిగిన సంఘటన మనసును కలచివేసింది… కళ్ళ ముందు తను చదువులు చెప్పిన పిల్లలే గుర్తుకువస్తున్నారు.

“అమ్మా, స్నాక్స్ అయ్యాక కమలకు టీ పెట్టమని చెప్పు…” అంటూన్న సంధ్యను చూస్తూ

“చాలామంది వస్తారా?” అని అడిగింది శారదమ్మ.

“ఇక్కడివారు కొంతమంది వస్తారు. కానీ మా అభిప్రాయాల కోసం టి.వి. వాళ్ళు, విలేఖరులు రావచ్చు… అందుకని.”

“మొన్న జరిగిన సంఘటన గురించేనా?”

“అవునమ్మా… మన వూరిలో ఇంత దారుణం జరిగితే ఎలా ఊరుకుంటాము?” అంది సంధ్య ఆవేశంగా.

‘దారుణం’ అన్న మాట మరింతగా గుచ్చుకుంది. నిజమే! ఆ వూరి పొలిమేర్లలో వున్నఒక మ్యారేజ్ హాలులో పెళ్ళికి వచ్చిన ఒక 7 ఏళ్ల చిన్నారిని రేప్ చేసి చంపేసి బయట తుప్పల్లో పడేసారు. మొదట మిస్సింగ్ అని తరువాత సి.సి. కెమెరాలో ఫుటేజ్ చూసి ఒకడు ఆ చిన్నిఅమ్మాయిని హాలు బయట వరకూ తీసుకెళ్ళిన సి.సి. కెమెరా రికార్డు టి.వి. లలో చూపించాక మనసు ఇంకా గాయపడింది. పాలుగారే పసిపాప ఎలా చేస్తారు ఇలా… అంత వయసు పిల్లలతో రోజూ గడిపిన తనకు ఈ విషయం తెలిసినప్పటి నుండీ నిద్ర కూడా పట్టడం లేదు. నిన్నటి నుండీ వూరిలో ధర్నాలు, ర్యాలీలు జరుగుతున్నాయి. ప్రతి తల్లీ స్పందిస్తూంది…

శారదమ్మ ఆలోచనలకూ అడ్డుకట్ట పడుతూ కొంతమంది గెస్ట్‌లు వచ్చారు. సంధ్య వారిని కూర్చోబెట్టి మాట్లాడుతూ వుంది. వారు మాట్లాడే మాటలు వంటింట్లోకి వినబడుతూ వున్నాయి.

 “హంతకుడిని పట్టుకుని అదే స్థలంలో కాల్చి చంపాలి” అంటూంది ఒకామె.

 “మరీ ఆడపిల్ల అంటే ఎందుకంత అలుసు? పసిపిల్లల నుండీ ముదుసలి వరకూ అత్యాచారాలు ఎందుకు జరుగుతున్నాయి? పురుషాధిక్యత వలననే….”

“ఎక్కడా స్త్రీలపై హింస మానసికంగా, శారీరకంగా జరుగుతూనే వుంది…”

“నిర్భయ చట్టం వున్నా ఇంకా ఇలాటి దారుణాలు ఎలా జరుగుతున్నాయి?? ప్రభుత్వం ఏమి చేస్తూంది? చట్టాలు తెస్తే సరేనా? దాని అమలు ఎంతవరకూ జరుగుతో౦ది??”

“స్త్రీల పై వివక్షత కడుపులో వున్నప్పటి నుండే ప్రారంభం అవుతుంది. ఆడపిల్ల అని తెలిస్తే అబార్షన్ అంటారు… పుట్టిన పిల్లలను అమ్మకానికి పెడతారు. ఎదుగుతున్న కొద్దీ వివిధరకాలుగా వేదనకు గురి అవుతున్నారు. ప్రతి ఇంట్లో చదువు కోవడానికి మగపిల్లడికే ముందు ప్రిఫెరెన్స్, ఉద్యోగ౦ లోనూ అంతే, ఆపై పెళ్ళైతే భర్తను అనుసరించాలి… ఇలా అన్నిటికీ అణిగి వుండాల్సినదేనా?? ఎందుకీ నరక౦ ఆడవాళ్ళకి?”

ఇలా ప్రతి ఒక్కరూ స్పందిస్తూ ఆవేశంగా తమ లోని భావాల్ని వ్యక్తపరుస్తున్నారు.

స్నాక్స్ పంపించేసి కమలను టీ సిద్దం చెయ్యమని చెప్పి శారదమ్మ బయటకు వచ్చింది.

“అందరికీ నమస్కారం” అంది. అందరూ ఒక్కసారి వెనక్కి తిరిగి చూసారు.

అప్పటివరకూ అమ్మను పరిచయం చెయ్యలేదని జ్ఞాపకం వచ్చి సిగ్గుపడుతూ సంధ్య అమ్మదగ్గరకు నడిచి “మా అమ్మగారు శారదమ్మ. మావూళ్లో ఎలిమెంటరీ టీచర్‌గా పని చేసి రిటైర్ అయ్యి వచ్చారు… సారీ ముందే పరిచయం చెయ్యలేదు” అంటూ వారి పక్కన వున్న ఒక కుర్చీలో కూర్చోబెట్టింది. అందరూ నమస్కారం పెట్టారు శారదమ్మకు. అందరినీ పరిచయం చేసింది సంధ్య.

“సారీ అమ్మా.. మీరందరూ మీ అభిప్రాయాలు చెబుతూ ఉంటే వింటూ వున్నాను. నేను ఒక టీచర్‌గా పని చేశాను కాబట్టి మీకు నా అభిప్రాయం కూడా చెప్పాలని పించింది…”

“తప్పకుండా ఆంటీ, ఇక్కడ ఇంత ఘోరం జరిగిందని అందరూ ఆందోళన చెందుతూ ఉన్నాము. ఆడపిల్లకు భద్రత లేకుండా పోయింది. దోషిని పట్టుకోవడమే కాదు దారుణంగా శిక్ష పడాలి. అదే చోట కాల్చి చంపితే తప్ప జనాల్లో భయం కలగదు…” అని ఆపింది సరళ అనే ఆవిడ.

“అమ్మా, మన అందరి ఉద్దేశమూ దోషి దొరకాలని, అతనికి త్వరితంగా శిక్ష పడాలనే… ఇలా కోరుకోవడంలో తప్పు లేదు. కానీ ఇక్కడితో ఇలాటివి మళ్ళీ జరగకుండా ఆగుతాయా?? మరో మనిషికి ఇంకా దారుణమైన ఆలోచనలు రావచ్చు… సామూహిక అత్యాచారాలు జరగవచ్చు. ఇలాటివి వింటూనే ఉన్నాము…. ఇది ఎక్కడ ఆగుతుంది ఎలా ఆగుతుంది?? ఎంతమందిని శిక్షిస్తాము. ఎంతమందిలో భయం సృష్టించగలము??? ఏమి చేస్తే ఇది ఆగుతుంది?? ఒక్కసారి ఆలోచిద్దామా??” అందరూ ఆసక్తిగా చూశారు శారదమ్మ వైపు.

“అసలు సమాజం బాగుపడాలంటే మనుషుల మనసులు బాగుపడాలి. అంటే మొదట కుటుంబ వ్యవస్థ తో మొదలు కావాలి.. ఇంట గెలిచి రచ్చ గెలవాలి కదా. మొదట ఇంట్లో ఆడ మగ అన్న తేడా తగ్గాలి . ఆడపిల్లల్లో చెడును ఎదుర్కోవడానికి పెంచాల్సిన కాన్ఫిడెన్స్ ఇవ్వాలి. స్పర్శలో బాడ్ టచ్ , గుడ్ టచ్ లాగా, ఏది మంచి? ఏది చెడు అని చెప్పే బాధ్యత తల్లిదండ్రులపైనా, గురువు పైనా, చుట్టూ వున్న సమాజం పైనా వుంది, మగపిల్లల్లో పెంచాల్సిన నైతిక విలువలు, విద్యా వ్యవస్థలో మార్పులు. సినిమాల్లోనూ,.. సోషల్ మీడియాలో చెడును చూపించే విధానాలు మార్వడం,… అలా అని నేను టెక్నాలజీ వద్దు అనటం లేదు ప్రతిదాని లోనూ మంచీ, చెడూ రెండూ వుంటాయి. ఒక సంఘటనలో ఒక చెడును చంపితే, కసితో ఇంకంత చెడు తయారవుతుంది. అసలు అంతటా మంచినే పెంచగలుగుతే చెడు ఎందుకు వస్తుంది? ఆలోచిస్తే ఏదైనా మన మీదే ఆధారపడివుంది. సమాజం లో అందరూ బాధ్యత తీసుకోవాలి గానీ ఈ విధంగా ఒక సంఘటనకి ప్రతిఘటించి…కొద్దిరోజులకి మరచిపోతే ఎలా బాగుపడుతుంది?? ఆలోచించండి.

ఇది నా పరిధిలో నేను ఆలోచించిన ఒక విధానం. మీరందరూ చదువుకున్నవారు బాధ్యత గల పౌరులు. మంచి కోసం అందరం ఉద్యమిస్తే మార్పు రాదంటారా…??” శారదమ్మ మాటలకి అందరూ అవాక్కయ్యారు ఆవిడ చెప్పినదాన్లో నిజం వుంది.

 “ఇది ఇంతటితో ఆగకూడదు. చెడు మీద ఉద్యమ౦ చెయ్యాలి సమాజంలో ఆడపిల్లకు రక్షణ, మగ వాడికి మంచి ఆలోచనలు కలుగ చెయ్యాలి…” అంది సరళ ఆవేశంగా.

“ఇంకొక్కటి మీతో చెప్పాలి…” ఆగింది శారదమ్మ.

“చెప్పండి ఆంటీ…” అందరూ ఒక్క మాటగా అన్నారు.

“ఇప్పటి జీవితాలలో ఆడవారు కూడా ఉద్యోగాలు చెయ్యకపోతే కుదరదు…”

“అవును ఆంటీ… అప్పుడే మెరుగైన జీవితం వుంటుంది. పిల్లలకు ఒక మంచి లైఫ్ ఇవ్వగలము.”

“నిజమే. అవసరానికి ఉద్యోగాలు తప్పదు అన్నది నేను కూడా అంగీకరిస్తాను. కానీ ముందు తరం మనిషిగా నాకు కొన్ని ఆలోచనలు ఉన్నాయి….”

“చెప్పండి ఆంటీ, మీ తరంలో ఇలా అత్యాచారాలు జరిగేవి కావు కదా…”

“అవును, జరిగేవి కావు. ఎప్పుడో తప్ప జరిగినా బయటకు వచ్చేవికాదు. అప్పుడు కుటుంబ౦లో నాన్నమ్మలూ లేదా అమ్మమ్మలూ తాతలూ వుండేవారు. వారి సహాయం ఇంట్లోనే కాదు, అన్ని విషయాలకూ వుండేది. ఒక సమస్య వస్తే అందరూ కూర్చుని చర్చించుకునేవారు. పెద్దవారి అనుభవంతో చేప్పే విషయాలను త్రోసిపుచ్చకుండా వినేవారు. ఆచరించేవారు. పిల్లలకు తోడుగా, వారికి లోక రీతిని గురించి ఎన్నోవిషయాలు కథలుగా చెప్పేవారు. అందువలన వారి నడవడిలో అపశ్రుతులు ఉండేవికాదు. ఆడపిల్లలు చదువుకుని ఉద్యోగాలకు వచ్చాక ఆర్ధిక పరిస్థితులు మెరుగైనాయి. ఇక్కడ ఇంకో మార్పు నేను గమనించాను. పెళ్లి సంబంధాలు చూస్తున్నప్పుడు “అమ్మాయి ఉద్యోగం చెయ్యక్కర లేదు” అన్న మగ పెళ్ళివారి మాటకు “మా అమ్మాయి ఉద్యోగం చెయ్యాలని” సంబంధం వదులుకున్న వారూ వున్నారు. అంటే ఒకవేళ అబ్బాయి సంవత్సరానికి 20 లక్షలు సంపాదించినా, భార్య 40 వేల ఉద్యోగానికి వెళ్ళడానికి సిద్దపడుతూంది? ఎందుకు? టైం పాస్… లేదా ఉద్యోగం చేస్తే గౌరవం అన్న ఫీలింగ్. కానీ డబ్బు అవసరం లేని ఆమె ఈ ఉద్యోగం వదలుకుంటే మరో నిరుద్యోగికి ఉద్యోగం వస్తుంది కదా… మరి మీరు ఉద్యోగం చేసారు కదా అని అనొచ్చు. నేను బాధ్యతలు తీరాక కాంట్రాక్టు టీచర్‌గా చేశాను.

ఒక సామెత వుంది ఆడదానికి సిగ్గు, మగవాడికి హద్దూ వుండాలని. ఆడది సిగ్గు వదిలినా, మగవాడు హద్దు దాటినా అనర్థమే అవుతుంది. సమాజంలో మార్పుకి స్త్రీకి ముఖ్యమైన పాత్రవుంది. ఉద్యోగినిగా, చెల్లిగా, భార్యగా, తల్లిగా, అమ్మమ్మ, నాన్నమ్మలుగా అన్ని దశలలో మగవాడి జీవితంలో ఉన్న స్త్రీ వివిధ దశల్లో మగవారి సహకారంతో ఒక మార్పుకి నాంది పలకలేదంటారా?

స్త్రీ ఎప్పుడూ ఒక శక్తి స్వరూపిణి అని నమ్మే భారతదేశంలో ప్రతి స్త్రీ తన పాత్ర బాధ్యతగా పోషిస్తే మగపిల్లల మనస్సులో ఇలాటి అవాంచనీయమైన ఆలోచనలకు బ్రేక్ వేసి మంచిని తీసుకు రాలేమా ఆలోచించండి. ఇలాటి విషయం ప్రతి చోటా ప్రచారం చేద్దాం… సమస్యలను విందాం. ఒక్క రాత్రిలో ఏ మార్పూ సాధ్యం కాదు. అయినా ప్రయత్నం తోనే కదా ఏదైనా సాధించ గలిగేది? ఈ కోణం లో చూస్తే ఎలా వుంటుంది??…”

ఒక్కసారిగా అందరిలో చలనం వచ్చి తాము ఈ సంఘటనపై ఎలా స్పందించాలో, ఈ స్పందన ఒక సంఘటతో ఆగిపోకూడదన్న అవగాహన అక్కడ వున్న తల్లులందరికీ కలిగింది. ఆమె మాటలతో మేము సైతం అనాలని వారిలోని శక్తికి ఒక చైతన్యం వచ్చింది.

ఒక్క సంఘటనతో ఆవేశాలు వచ్చి వెలువడే స్పందనలతో ఏదో మార్పు అమాంతం వచ్చేస్తుందని కాదు, అందరి మనసులలో మార్పు రావాలని సంకల్పం చెయ్యాలి. ముగింపు ఎలా? అని ప్రశించుకుని ‘ఇలా’ అని అనేలా ప్రయత్నం చేద్దాం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here