ముహూర్త బలము

0
10

[శ్రీమతి నారుమంచి వాణీ ప్రభాకరి రచించిన ‘ముహూర్త బలము’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]

[dropcap]ఆ[/dropcap]కాశంలో తారకలను మించి మిరుమిట్లు గొలిపే కాంతి. విద్యుద్దీప అలంకారాలు ముచ్చటగా ఉన్నాయి. ఇది మరో ఆకాశమా అన్నట్లు అలంకరించి ఉంది. పెద్ద పిల్ల పెళ్ళి ఘనంగా చేశారు. ఊరంతా భోజనాలు కళాకారుల కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఐదు రోజులు రంగ రంగ వైభవంగా ఆ ఊరు ఆనందంగా ఉంది. రెండవ పిల్ల పెళ్ళి అత్త కొడుకు అమర్‍తో అనుకుంటున్నారు. మంచివి వేరే సంబంధాలొచ్చినా చూద్దామని ఆలోచిస్తున్నారు. పిల్ల బెంగుళూరులో మల్టీ మీడియా చదివి జాబ్ చేస్తోంది. పిల్లాడు మద్రాసులో ఎమ్.టెక్ చదివి ఉద్యోగం చేస్తున్నాడు. ఇప్పటికి ఐదుగురు అన్నదమ్ములు, నలుగురు అక్కచెల్లెళ్ళు అందరూ కలిసే ఉన్నారు. ఒకరి పిల్లల్ని ఇంకొకరు కలుపుకున్నారు.

నిత్యం ఇంట్లో పాతిక కంచాలు లేస్తాయి. పండుగ వస్తే 50 కంచాలు లేస్తాయి. వేసవి కాలం తప్పనిసరిగా 1000 మామిడికాయలు ఆవకాయ, 2000 మామిడికాయలు తోటమెంతికాయ పెడతారు. ఇంక త్రొక్కడు పచ్చడి, మాగాయ, బెల్లం ఆవకాయ, మునగ ఆవకాయ, పెసర, శనగ, వెల్లుల్ని, పచ్చ ఆవకాయ 500 చొప్పున కాయలు విడదీసి, ఆవకాయలు పెడతారు. అంతే కాకుండా తెలుసున్న వారికి డబ్బాల్లో గిన్నెల్లో పెట్టి పంచుతారు.

ఇంట్లో సరిపడా జాడీలు, గిన్నెలు, పళ్ళాలు, పాత్రలు అన్నీ రెడీగా ఉన్నాయి. వేసవి కాలం అంటేనే పండుగ, ఇంక దీనిలో పెళ్ళి సందడి కలిస్తే ఇంకా నిండుగా ఉంటుంది. సిటీస్ నుంచి వచ్చిన మనుమలు మనుమరాళ్ళ రకరకాల డ్రస్సులతో పాటు ఇల్లంతా కలివిడిగా తిరుగుతూ ఉంటారు.

మనుమల పెళ్ళి జరగాలన్నా పల్లెకు వచ్చి చేస్తారు. పాలేళ్ళు, పనివాళ్ళు, వంటవాళ్ళు అంతా రెడీగా ఉంటారు. మూర్తికి ఇద్దరు ఆడపిల్లలే. ఇంగ్లీషు మందులకొట్టు ఉంది. అన్నగారికి, తెలుగు మందుల కొట్టు ఉంది. పెద్దాయన వ్యవసాయం చేస్తాడు, జ్యోతిష్యము చెపుతాడు కూడా.

“అన్నయ్యా, ఈ ఏడు నా రెండవ పిల్ల పెళ్ళి చెయ్యాలనుకుంటున్నాను” అన్నాడు మూర్తి.

“సంబంధం చూసుకున్నావా మరి?”

“వేరే సంబంధం ఎందుకు? మన సుబ్బులు కొడుకుకే చేస్తాను.”

“అది బెంగుళూరు, వీడు మద్రాసు. పైగా ట్రాన్సఫర్స్ కాకపోతే కష్టం. ఉద్యోగాల ట్రాన్సఫర్స్ విషయం తెలుసుకుని అప్పుడు కుదుర్చుదాము” అన్నాడు అన్నయ్య.

“అసలే సుబ్బులు చిన్నప్పటినుంచి అర్భకురాలు. ఒక పిల్లాడితో సరిపెట్టింది. కోడలు పనిమంతురాలయితే మంచిది. అది వాళ్ళకి ఏమి సరిగ్గా చేసి పెట్టలేదు. కోడలు అయినా పనిమంతురాలయితే మంచిది” మళ్ళీ అన్నాడు అన్నయ్య.

“అలాగనుకుంటే ఎలా? ఇంట్లో పిల్లాడు, మన పిల్లనే ట్రాన్స్ఫర్ చేయించుకోమనడమే. లేదా ఇంకో కంపెనీకి వెళ్ళడమే, చూద్దాము” అన్నాడు మూర్తి.

సుబ్బులు మద్రాసులో ఉంది. అక్కడినుండి రావడము కష్టము. అందుకని ముందు ముహూర్తాలు పెట్టారు.

అయితే పెళ్ళికి వస్తాము కదా అని, సుబ్బులు కొడుకుని ముందు పంపిది. కావల్సిన పనులు మొదలయ్యాయి. సహాయం చెయ్యడానికని పెళ్ళికొడుకు మావయ్య ఇంటికి వచ్చాడు. వడుగు టైముకి అన్ని అవాంతరాలు వచ్చి పడ్డాయి. సుబ్బులు భర్త టాటానగర్ నుంచి రాలేక పోయారు. ఆ ఊరిలో తెలుసున్న ఫ్రెండ్స్ వారికి ఆత్మీయులు, అతనికి మగపిల్లలు లేరు. నల్గురు కూతుళ్ళు, కొడుకు ఉండుంటే తన కూతురికి చేసుకోవాలని ఆశపడ్డాడు మూర్తి. గతంలో ఎన్నో సార్లు అనుకున్నాడు. మూర్తి ఇప్పుడు ఆలోచించాడు. ముహూర్తం దాచిపెట్టడం ఎందుకు అంటూ మూర్తి 23న పెళ్ళి జరిపించదలచారు. అన్ని ఏర్పాట్లు చేసుకున్నాము. మానడమెందుకు? వడుగుకి కూతురు బెంగుళూరు నుంచి వచ్చింది. ఇంక కాలసర్పవేగం ప్రపంచానికి పట్టింది. ఇది ఒక్కరి జాతకం కాదు. దేశం అంతా అల్లకల్లోలమే అయినా విధిరాత ముందు ఇవన్నీ సామాన్యము. ఎవరి గ్రహస్థితి, గృహస్థితి వారిది. తెల్లారి లేస్తే తేలిగా యాభై, అరవై కంచాలు లేచే ఇల్లు. పెద్ద పెరడు. ఇంట్లో వాళ్ళు ఇంతమంది ఉన్నారు. ఇంక బయటి వాళ్ళు ఎందుకు అంటూ అంతా కల్సి వడుగు చేశారు. సుబ్బులు భర్త స్వైప్‌లో వడుగు చూశారు. సరే పెళ్ళిటైముకి చేరదామనుకుంటే ప్రతిబంధకాలు ఇంకా ఎక్కువయ్యాయి.

‘పెట్టిన ముహూర్తం మానవద్దు. మెడికల్ షాపు వారికి ఏటైమైనా మందులమ్మే పర్మిషన్ ఉంది. పెళ్ళి కూడా చెయ్యడానికి పర్మిషన్ తెద్దాము. నిత్యం ఇంట్లో ఉన్న మనుషులమే కదా’ అని ప్రభుత్వం నుంచి పర్మిషన్ తెచ్చుకున్నారు.

మండువా లోగిలి, అందులో గోడలకి పువ్వుల దండలు, కర్టెన్స్ కట్టారు. చిన్న చిన్న బల్బుల దండలతో అలంకరించారు. సామానులన్నీ ఇంటిలో ఎప్పటిలా రెడీగా ఉంటాయి. ఇంక మంగళసూత్రం కంసాలికి పురమాయించి, మేనత్త, మేనమామ నాన్న తరపువారు స్నాతకం చేశారు. తల్లి తండ్రి పిల్లలకి కన్నెదార పోశారు. పిల్ల అక్కబావ హైదరాబాదు నుంచి రాలేదు. పెద్దమ్మలు, పిన్నమ్మలు, మేనమామలు ఆ పిల్లాడి తరపు ఎవరు రాలేదు.

పిల్ల తరపు మాత్రం పెద్దనాన్నలు, ఊళ్ళో ఉన్న అత్తలు మావలు వచ్చారు.

కుర్చీలు కూడా ఎడం ఎడంగా వేసారు. భోజనాలు బఫే సిస్టమ్‌లో పెట్టారు. ఇంట్లో ఉన్న వంటవాడికి తోడుగా ఇంకో ఇద్దరు వంటవాళ్ళు వచ్చారు. ఇంత గడ్డు రోజుల్లో కూడా పెళ్ళి చాలా బాగా జరిగిపోయింది. పెళ్ళి ముహూర్తం చాలా గొప్పది. అందుకే అన్నీ సజావుగా జరిగిపోయాయి.

విధాత రాత ముందు మన లెక్కలు సరిపోవు. తల్లి తండ్రి రాకపోయినా వారి పెళ్ళి జరిగిపోయింది. ఫోన్ లోంచి దీవెనలు అందించారు. ‘పిడికిట తలంబ్రాల పెండ్లికూతురు’ పాట వినిపిస్తోంది. ముందునుంచి అన్నీ జాగ్రత్త పడటం వల్ల సింపుల్‍గా పెళ్ళి చేసారు. ఇది ఒక చరిత్రను సృష్టించిందని అందరు ఆనంద పడ్డారు. అయితే బంధువులు, స్నేహితులు ఎవరూ లేరు. కేవలం ఆ ఇంటి కుటుంబం వారే ఉన్నారు.

తెల్లవారి 3.30 గంటలకి ఎటువంటి ఆర్భాటం లేకుండా చాలా నిరాడంబరంగా పెళ్ళి జరిగింది. పెళ్ళి భోజనాలు మాత్రం ఘనంగానే ఉన్నాయి. ఆ ఊళ్ళో పిల్చిన బాగా తెలుసున్నవాళ్ళు ఒక్కొరే వచ్చి మాట్లాడి వెళ్ళారు. ఇది కలా నిజమా అనుకుని ముహూర్త బలం అన్నారు.

విధిరాతను బట్టే మన జీవితాలు ఉంటాయి ఇంత గడ్డురోజుల్లో కూడా పెళ్ళి చెయ్యడం మాటలా? అంటే అందరూ ముహూర్త బలం చాలా గొప్పదని, విధిరాత ముందు అన్నీ వంగి సలాం చెయ్యాలన్నది నిజమే కదా!

అందరూ విన్నవాళ్ళు ఆశ్చర్యపోయి బుగ్గలు కొరుక్కున్నారు. ఫొటోలు చూసిన వాళ్ళు సంబర పడ్డారు. మొత్తం కావల్సిన బంధువులందరికి లైవ్ ఇచ్చారు. కొందరికి ఫేస్‍బుక్‌లో అప్‍లోడ్ చేశారు. ఇదంతా చాలా చిత్రంగా ఉంది. కాని ఫోటోలు చూసాక నమ్మక తప్పలేదు.

ఇదండీ ముహూర్త బలం అంటే అని ఆనందించి పెద్దలంతా ఎంతో ఆనందించి దీవించారు. శుభమ్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here