ముహూర్తం

4
12

[dropcap]ల[/dropcap]తకు రెండేళ్ల క్రితమే పెళ్ళయ్యింది. పెళ్లికి ఏడెనిమిది నెలల ముందు ఇంటికి దగ్గరగా వున్న స్కూలులో టీచరుగా చేరింది. తనకు సంపాదించాలన్న కోరిక కన్నా చిన్న చిన్న ఖర్చులకు చేయి చాచే అవసరం రాకుండా వుండాలని అన్ని విధాలా ఆలోచించి పదివేల రూపాయల జీతానికి ప్రైవేటు స్కూల్లో చేరిపోయింది. నీకు తెలివితేటలుండీ ఎందుకు ఈ చిన్న ఉద్యోగంలో చేరుతున్నావని స్నేహితురాళ్ళు అన్నా తను పట్టించుకోలేదు.

అదృష్టం కొద్దీ తనకు కాబోయే భర్త సొంత యిల్లు కూడా రెండు వీధులకి అవతల వుండడంతో తల్లిదండ్రులకు దగ్గరగా వుంటూనే ఉద్యోగమూ కొనసాగించుకోవచ్చని లత మనసులో సంబరపడింది. కానీ కాబోయే అత్తామామలు పెళ్ళి తరువాత ఉద్యోగం మానేయాలని ప్రస్తావన చేయగానే లతకి కోపం వచ్చింది కానీ ఎదురుగా ఏమీ అనలేదు. తండ్రి మాత్రం విషయం గ్రహించి కాబోయే సంబంధీకుడితో “మా యింటికీ దగ్గరే కదా అమ్మాయి పనిచేస్తున్న స్కూలు. ఉద్యోగం చేస్తోంది కానీ ఇంట్లో వున్నట్టే వుంటుంది. మీ యింటికీ స్కూలు నుంచి అంతే దూరం కదా ! మా అమ్మాయికి సంపాదనే ప్రధానం కాదన్న ఉద్ధేశం వుండడం వల్లనే యింటికి దగ్గరున్న కారణం మూలాన ఈ ఉద్యోగంలో జాయనయ్యింది. మీకు అత్యంత అవసరమనింపించినప్పుడే మాన్పించవచ్చుకదా?” అనడంతో ఆ సమస్యకు తాత్కాలికంగానైనా తెర పడ్డంతో లత ఊపిరి పీల్చుకుంది.

లత భర్త రవి మంచివాడైనా తల్లి తండ్రులకి ఎదురు చెప్పే స్వభావం లేనివాడు. ఆ మాటకొస్తే అత్తామామలు మంచివాళ్ళే కానీ ఛాందసులు. ప్రతీ విషయానికీ శకునాలూ ముహుర్తాలూ చూసే అలవాటు వుంది. ఇక పూజా పునస్కారాలైతే చెప్పనక్కరలేదు. లతకు దేవుడంటే భక్తి వుంది కానీ తల్లి తండ్రులు తనను కాస్త వయసువచ్చాక ఏదీ బలవంత పెట్టకపోవడంతో రోజూ స్నానం ముగించి తయారయ్యాక దేవుడి ముందు ఓ ఐదు నిమిషాలు మౌనంగా ప్రార్థన చేసి తన లోకంలో పడిపోవడం అలవాటైపోయింది. తన భర్త ఆఫీసుకి వెళ్ళే ముందు సుప్రభాతం, ఏవేవో శ్లోకాలు చదువుతూ ఒక అరగంటైనా ప్రార్థన చేయడం చూసింది. అత్తగారైతే యిప్పటికీ నోములూ వ్రతాలూ శ్రద్ధగా చేస్తూనే వుంది. పెళ్ళవ్వగానే ఆ సంవత్సరమే శ్రావణ మాసంలో శుక్రవారం నోము పట్టమని ఆర్డరు జారీ చేసింది. లతకు ఆ నోము ఎలా చేయాలో తెలియదని చెప్తే ఏమవుతుందో అని ఆలోచించి గూగుల్ని ఆశ్రయించి గండం గట్టెక్కేలా జాగ్రత్త పడింది.

***

లత నెల తప్పిందని తెలియగానే అత్తయ్య గారికైతే కాలు నిలవటం లేదు. జాగ్రత్తగా వుండమని చెబుతూనే ముందు ఉద్యోగం మానేయాలని ఆర్డరు జారీ చేసేసింది. అందులోనూ నెల తప్పిన ఎనిమిది వారాల తరువాత లతకు వాంతులు కాస్త ఎక్కువగానే అవ్వడంతో అత్తగారు ఉద్యోగం వెంటనే మానిపించమని కొడుక్కి చెప్పింది. లతకైతే స్కూలు సెలవు రోజుల్లో వేరే ధ్యాస మళ్ళే అవకాశంలేక వాంతి ఫీలింగ్ ఎక్కువగానే వుందనిపించడంతో భర్తతో ఆ విషయమే చెప్పింది. ఏ కళనున్నాడో భర్త తల్లికి ఆ విషయమే చెప్పి ఒప్పించాడు. అయిష్టంగానే అత్తగారు సరే అంది. లేడీ డాక్టరు కూడా కొందరు ఆడవాళ్ళకి నెల తప్పిన యిరవై వారాల వరకూ కూడా వాంతుల సమస్య వుండవచ్చు దానికి మందులు వాడటం కన్నా ధ్యాస మళ్ళించే పని చేయడమే మంచిదని అనడంతో అత్తగారు చేసేది లేక వూరుకుంది.

***

ఎనిమిదవ నెలలో మాత్రం ఎవరి ప్రమేయమూ లేకుండానే లత ఉద్యోగం రాజీనామా చేసినా స్కూలు మేనేజ్మెంట్ లతను డెలివరీ అయిన మూడు నెలల తరువాతైనా ఫర్వాలేదు వచ్చి జాయిన్ కావొచ్చనడంతో భలే సంతోషం వేసినా భర్తకు మాత్రమే ఆ విషయం చెప్పి అత్తామామలకు అప్పుడే చెప్పొద్దని వేడుకుంది.

లతకు లేడీ డాక్టరు చెకప్ చేసినప్పుడల్లా కేవలం వాంతులు వలన తనకు సాధారణ సుఖం ప్రసవం జరగదని విన్నది నిజం కాదనీ వాంతులకీ సిజేరియన్ ఆపరేషన్‌కీ ఏ సంబంధం లేదనీ అలాగే వాంతుల మూలాన బిడ్డ బలహీనంగా పుట్టడం జరగదనీ వివరించి చెప్పింది. ఆపరేషన్ అవసరమా కాదా అన్నది ఎన్నో సార్లు అప్పటికప్పుడు డాక్టర్లు పరిస్థితి బట్టీ నిర్ణయిస్తారని వివరించింది. అయితే అత్తగారు మాత్రం ఆపరేషన్ తప్పనిసరైతే తనకు ముందుగానే చెప్పమని డాక్టరుతో రెండు మూడు సార్లు ఎందుకు అడిగిందో లతకు అర్ధం కాలేదు. డాక్టర్ మాత్రం జవాబు యివ్వలేదు.

ఇంటికి వచ్చాక ఉండబట్టలేక లత అత్తగారితో ఆపరేషన్ విషయం ఎందుకు అన్ని సార్లు డాక్టరుని అడిగారని ప్రశ్నిస్తే “ఏం లేదమ్మా! ఆపరేషన్ తప్పనిసరైతే మనం మంచి ముహూర్తం నిర్ణయించుకుని ఆ సమయానికే బిడ్డ పుట్టేలా చూసుకోవచ్చు కదా!” అంది. అదెలా కుదురుతుందని లత అడిగితే తమ బంధువుల్లో ఈ మధ్య చాలా మంది ప్రైవేటు ఆసుపత్రిల్లో అలాగే చేయించుకున్నారని చెప్పింది. లత తల్లి తండ్రులు కూడా ఇలాంటి విషయాల్లో అల్లుడి తల్లి చాదస్తం తెలిసిన వారవ్వరడం వలన ఎక్కువ మాట్లాడలేదు.

***

తోమ్మిదవ నెల నిండుతూండగానే డాక్టర్ ఉజ్జాయింపుగా చెప్పిన డెలివరీ తారీఖుకి రెండు రోజుల ముందు సాయంత్రం లత సోఫాలో కూర్చుని టీవీ చూస్తూండగానే ఒక్కసారిగా ఉమ్మ నీరు బయటకు వచ్చేయడంతో లత భయపడిపోయింది. భర్త వెంటనే ఆసుపత్రికి ఫోన్ చేస్తే లతను డాక్టర్ తీసుకుని వచ్చి జాయిన్ చేయించమని చెప్పింది. అత్తగారు పంచాంగంతో సహా ఆసుపత్రికి బయలుదేరుతుంటే కొడుకు “నువ్వెందుకమ్మా? ఆపరేషన్ అయ్యాక అవసరం పడితే వద్దువుగాన్లే” అని వారించబోయాడు. ఆమె మాత్రం

“కుదరదు, ఆపరేషనైతే డాక్టరుకి పంచాంగం చూసి మంచి ముహుర్తమేదో చెప్పి ఆ సమయానికే బిడ్డ పుట్టేలా చూడాలంటే నేను నీతో రావాలి” అని మొండికేయడంతో ఆమెనూ తీసుకెళ్ళక తప్పలేదు.

హాస్పిటల్ చేరాక అందరికంటే ముందు ఆమె రిసెప్షన్ వైపు పరిగెత్తి డాక్టర్ని కలుసుకుందామని ప్రయత్నంలో పడింది. లతను చెకప్ చేసిన తర్వాత డాక్టర్ రవిని పిలిచి ఉమ్మ నీరు పోవడం వలన సుమారు నలభై ఎనిమిది గంటలు సాధారణ ప్రసవం కోసం ఆగవచ్చు కానీ ఈ లోగా అవసరమైతే యిరవై నాలుగు గంటల్లోపు పేషెంట్ పరిస్థితి దృష్ట్యా ఆపరేషన్ చేయాల్సి వచ్చినా రావచ్చు అని చెప్పింది.

రవి తల్లి వెంటనే పంచాంగం తీసి మరునాటి తిథి వార నక్షత్రాలు ఏమిటా అని చూడసాగింది. రవికి యిబ్బందిగా వున్నా ఏమీ మాట్లాడలేకపోయాడు.

ఆమె డాక్టర్ని కలిసి “డాక్టర్ గారూ! మీరు నలభై ఎనిమిది గంటలు ఆగొచ్చని అన్నారు కదా ! రేపు తిథి షష్ఠి, రోహిణీ నక్షత్రం పైగా మంగళవారం అది ఎవరికీ మంచిది కాదు ఎల్లుండి మృగశిరా నక్షత్రం, సప్తమి బుధవారం అన్ని విధాలా మంచిది, ఆపరేషన్ ఆ రోజు సాయంత్రంలోగా చేయండి డాక్టర్ గారూ” అని అడిగింది. లేడీ డాక్టరు రవి వైపు ప్రశ్నార్థకంగా చూసి అతనేమీ మాట్లాడక పోవడంతో “అలా కుదరదమ్మా! పేషెంట్ కండిషన్ చూసి మేం ఆపరేషన్ చేయాలి తప్ప తిథి వార నక్షత్రాలు చూసి కాదమ్మా” అని జవాబు యిచ్చింది. రవి తల్లి ఏదో రెట్టించి మాట్లాడబోతుంటే లేడీ డాక్టర్ “మా హాస్పిటల్లో యిలాంటి వాటికి ఒప్పుకోను. మీకు నచ్చకపోతే మీరు కోడల్ని మీ రిస్కు మీదే డిశ్చార్జ్ చేయించి తీసుకువెళ్ళి పోవచ్చు. మేము లామా డిశ్చార్జ్ అని రాసి యిచ్చేస్తాం” అని ఖచ్చితంగా చెప్పేసింది. రవి “లామా” అంటే ఏమిటి ? డాక్టర్ అని అడగ్గానే “లీవ్ అగైనెష్ట్ మెడికల్ ఎడ్వైజ్” (LAMA) అని మా మెడికల్ భాషలో అంటే మీ బలవంతం మీద అని అర్థం మిష్టర్ రవీ” అని వివరించింది.

తల్లి మాత్రం “రవీ ఈ వీధి చివర మరో ఆసుపత్రి వుంది కదా! వాళ్ళు ఒప్పుకుంటే అక్కడే చేర్పిద్దాంరా! రేపు ఆపరేషన్ చేసి బిడ్డపుడితే ఎవరికీ మంచిది కాదు నాయినా. నా మాట విని తొందరగా వెళ్లి కనుక్కురా” అంది. ఎప్పుడూ తల్లితండ్రులకి ఎదురు చెప్పని రవి సరే అని బయలుదేరుతూ వుండగా “మీ అత్త మామలకు ఈ విషయం అప్పుడే తెలియనీయకు జాగ్రత్త” అని కూడా చెప్పింది.

ఆ మరునాడు లతని ఆ వీధి చివర హాస్పిటల్లో చేర్పించారు. లతకి ఏ విషయమూ చెప్పలేదు. ఆమె హఠాత్తుగా హాస్పిటల్ ఎందుకు మారుస్తున్నారని అడిగినా ఎవరూ ఏం చెప్పలేదు. ఆమెకు ఏమీ చెప్పకపోవడంతో గాభరాతో పాటు రక్తపు పోటు పెరగనారంభించింది.

కొత్త హాస్పటల్లో లత తనకు ఇంట్రా వీనస్ ఎక్కించడానికి వచ్చిన నర్సుని అడిగితే అటూ యిటూ చూసి ఎవరూ లేరని నిర్ధారించుకుని అసలు విషయం చెప్పేసింది. తమ హాస్పటల్కు ఈ మధ్య కాలంలో యిలాంటి కేసులు చాలా వస్తున్నాయని కూడా చెప్పింది. లతకు అత్తగారి మీద, ఆమె మాటకు ఎదురు చెప్పలేని భర్తమీద చాలా కోపం వచ్చింది. పల్సూ బీపీ చూస్తున్న నర్సు లతకి బీపీ పెరగడం చూసి డాక్టరుకు చెప్పాలని పరిగెత్తింది. డాక్టర్ వచ్చి ప్రశాంతంగా వుండమని చెప్పి బీపీ మాత్ర వేయమని నర్సుకి చెప్పి వెళ్ళిపోయాడు.

లతకు రాత్రంతా ఆలోచనలతో సరిగ్గా నిద్ర పట్టలేదు. ఉదయం డ్యూటీ నర్సు లత బీపీ చెక్ చేస్తే యింకా ఎక్కువగా వుండడంతో డాక్టర్‌కు చెప్పింది. ఆ రోజు సాయంత్రంలోగా ఆపరేషన్ చెయ్యాలి కాబట్టి డాక్టర్ వెంటనే లతకి నిద్రపట్టే యింజక్షన్ యివ్వమని చెప్పాడు.

మధ్యాహ్నం మూడు గంటలకు లతను ఆపరేషన్ కోసం తీసుకెళ్ళారు. రవి తల్లి ఫర్వాలేదు అనుకున్న మంచి ముహూర్తంలోనే బిడ్డ పుడుతుందని సంతోషంగా వుంది. ఒక గంటన్నర తరువాత నర్సు వచ్చి ఆడపిల్ల కానీ ఆపరేషన్ చేసి తీయకముందే బిడ్డ గర్భంలో చనిపోయిందని చెప్పగానే “మరి నా భార్య ఎలా వుంది?” అని గాభరా పడుతూనే అడిగాడు.

నర్సు “ఆమె బాగానే వుంది కానీ తెలివి వచ్చాక మీకు చెబుతాను. ఆ తర్వాత చూడొచ్చు” అని వెళ్ళిపోయింది.

రవి తల్లి కేసి చూస్తూ ఏమీ అనలేక నిర్వికారంగా వుండిపోయాడు. కొంతసేపటికి తేరుకొని డాక్టర్ను కలిసి బిడ్డ చనిపోవడానికి కారణం తెలుసుకుందామని బయలుదేరాడు.

ముందు డాక్టర్ తటపటాయించినా యింకా పేమెంట్ రావాల్సి వుండడంతో “మిష్టర్ రవీ! మా హాస్పిటల్ తప్పేమీ లేదు. ఆపరేషన్ కూడా బాగానే జరిగింది. బిడ్డ సంచీలోంచి ఉమ్మ నీరు పోవడం వలన పైగా మీ భార్యకు బీపీ పెరిగిపోవడం వలన గర్భంలో బిడ్డకు ఊపిరి అందక ఆపరేషన్ జరక్కముందే చనిపోయి వుండొచ్చు” అన్నాడు.

“ఈ ముహూర్తం పిచ్చి ఒక జీవిని పుట్టక ముందే బలి తీసుకుంది. ఇకనైనా యిలాంటి మూఢ నమ్మకాల్ని వదిలేయమని అమ్మకు వివరించాలి” అనుకుంటూ డాక్టరు రూములోంచి బయటపడ్డాడు రవి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here