ఆలోచింపజేసే “ముల్క్”

2
11

[box type=’note’ fontsize=’16’] మనసులోని బూజును దులుపుకోవడానికి చూడాల్సిన చిత్రం “ముల్క్” అంటున్నారు పరేష్ ఎన్. దోషి ఈ సమీక్షలో. [/box]

[dropcap]దే[/dropcap]శభక్తి, పరమత సహనం లేదా అసహనం, పొరుగు దేశాల మధ్య సంబంధాలు ఈ విషయాల మీద చాలా మంది మనసుల్లో స్టీరియోటైప్ భావనలు గూడు కుట్టుకుని వున్నాయి. వాటిని వెలికి తీసి భూతద్దంలో పరీక్షించి, నిగ్గు తేల్చి, సవరించుకోవడానికి అప్పుడప్పుడు ఇలాంటి చిత్రాలు వస్తుంటాయి. ముఖ్యంగా మనసు లోపలికి తొంగి చూడడానికి. ముల్క్ భారత దేశంలో వుంటున్న వొక ముస్లిం కుటుంబం గురించిన కథ. అది వారణాసి. మురాద్ అలీ ముహమ్మద్ (రిషి కపూర్) అక్కడ వో లాయరు. ఆ పరిసరాలలో హిందూ ముస్లింలు సఖ్యతతోనే వుంటారు. చిత్రం మొదటిలోని సన్నివేశాలు ఆ క్షణాలను బాగా పట్టుకున్నాయి. ఇది రోజువారి జీవితం. అయితే రాజకీయ కారణాల వల్లగాని, ఇతర బాహ్య ప్రేరేపణల వల్లగానీ వొక రాయి పడింది, ఆ సరస్సు ప్రశాంతత చెదిరిపోవడం జరిగిపోతుంది.
మురాద్ సమిష్టి కుటుంబంలో ఇంత మంది మధ్య వున్న అతని తమ్ముడు బిలాల్ (మనోజ్ పహ్వా) కొడుకు షాహిద్ టెర్రరిస్టుల వల్ల ఇన్‌ఫ్లుయన్స్ అయ్యి రహస్య కార్యకలాపాలు చేస్తుంటాడు. అతని కారణంగానే వొక బస్సు బాంబు దాడికి గురై అతనితో సహా 19 మంది చనిపోతారు. ఇక అక్కడినుంచీ కథ మారిపోతుంది. కలిసి టీలు తాగి, కబుర్లు చెప్పుకున్న మురాద్ అతని హిందూ మిత్రుల మధ్య నెమ్మదిగా యెడం పెరుగుతుంది. కొంతమంది సానుభూతిపరులు ఉన్నప్పటికీ కొంత మంది దాదాపు బధ్ధ శత్రువులుగా మారుతారు. పోలీసు, క్రైం బ్రాంచ్ అధికారులూ తమ ప్రతాపం వీర లెవెల్లో చూపిస్తారు. బిలాల్ మీద కూడా నింద మోపి, కేసు చేసి అరెస్టు చేస్తారు. తర్వాత నింద మురాద్ మీద కూడా పడుతుంది. ఇవన్నీ యే విధంగా పరిణామాన్ని పొందుతాయి వగైరా చాలా యెక్కువ నిడివి గల కోర్ట్ రూం డ్రామాలో తెలుస్తుంది. అదంతా తెర మీద చూడాల్సిందే. మూల కథకు చిన్న ఉపకథలు కూడా పనిలో పనిగా మనల్ని ఆలోచించమని చెబుతాయి. బిలాల్ కోడలు ఆరతి(తాపసీ పన్ను) హిందువు. ఆమె కూడా లాయరే. ప్రేమ వివాహం. ప్రేమించేటప్పుడు కేవలం మనుషులుగా ఆకర్షితులైనా, పెళ్ళి అయిన తర్వాత పుట్టబోయే బిడ్డ యే మతానికి చెందుతుందో తేల్చుకున్నాకే కనాలి అన్న వివాదం వారిద్దరి మధ్య. కొన్నాళ్ళు తామిద్దరూ యెడంగా వుండాలని చెప్పి ఆమె భారతదేశానికి అత్తవారింటికి వచ్చేస్తుంది. అంటే ఈ మతాల మధ్య రేఖా మాత్రం యెడం వచ్చినా యెలా వుంటుందో చూపించడం. నేతల (ఇక్కడ వో లాయరు) మాటలు తటస్థంగా వున్న సామాన్య జనాల మనసులను కూడా యెలా ప్రేరేపిస్తాయి అన్నది వొక అంశం. అయితే ఆ సామాన్య జనం కూడా తమ మనసుల్లో రూపం కట్టుకుంటున్న భావాలకి బాధ్యత తామే తీసుకోవాలి. ఇలాంటి చిత్రాలు కొంత ఇంట్రాస్పెక్షన్‌కు అవకాశమిస్తాయి. ముస్లింలు అనగానే బహు భార్యత్వం, యెక్కువ సంతానం, నిరక్షరాస్యత లేదా తక్కువ చదువుకోవడం ఇలాంటి రొడ్డకొట్టుడు భావనలు యెంత ప్రబలంగా వున్నాయో, దాని అధారంగా యెలాంటి అమానవీయ పరిణామాలకు దారులు వేస్తున్నామో కదా అనిపిస్తుంది. వొకసారి వొక భావం బలంగా ముద్ర పడినతర్వాత నిజానిజాలు పరీక్షించుకునే వోపిక యెంతమందికి వుంటుంది. మేము-వాళ్ళు అన్న భేదం వచ్చేశాక తటస్థంగా వుండిపోతే గోడమీద పడ్డ ఆ బీటలు యెంతవరకూ పోతాయో ఊహించడం కష్టం కాదు.
నేను ఈ అంశాలు వివరంగా చర్చించాలంటే కథను తడమాలి. కథ మొత్తం స్పృశించడం ఫిలిం రైటింగ్‌కి పర్లేదుగాని, ఫిల్మ్ రెవ్యూకి కూడదు. కాబట్టి యెక్కువ చర్చించను. అనుభవ్ సిన్హా దర్శకత్వం బాగుంది. ముఖ్యంగా చిత్రీకరణ. ఇక్కడ దర్శకుని విజన్, దానికి చాయాచిత్రణలో సపోర్ట్ ఇచ్చిన సినెమాటోగ్రాఫర్ ఇద్దరూ సమానంగా భాగస్తులు. ఆ ట్రాక్ షాట్స్ చాలా ఆలోచించి, వొక వ్యాకరణాన్ని సిధ్ధం చేసుకుని చేసినట్టుంది. వొక ఉదాహరణ. వొక సీన్ చాయ్‌వాలా కుర్రాడు అందరికీ టీలందిస్తూ బయటినుంచి వొక గదికి అక్కడి నుంచి మరో గదికి వెళ్తాడు. అంటే న్యూట్రల్ పర్‌స్పెక్టివ్‌తో ఆ సీన్‌లో వున్న పాత్రలను స్పర్శించడం. ఇలాంటి గుర్తుందిపోయే చిత్రీకరణలెన్నో వున్నాయి. నటన దగ్గరికొస్తే ముందు చెప్పుకోవాల్సింది రిషి కపూర్. యెక్కడా అతి ఆవేశాలకు లోను కాకుండా, తన కేరెక్టర్లోనే వుంటూ చాలా ప్రతిభావంతంగా చేశాడు. అతని చిత్రాలలో యెంత వైవిద్యం! మనోజ్ పహ్వా, తాపసీ పన్నూ, నీనా గుప్తా వీళ్ళు కూడా బాగా చేశారు. ఆసుతోష్ రాణా చాలా మంచి నటుడు. ఇందులో నటన బాగుంది. కాని కాస్త లౌడ్‌గా అనిపించింది. మనసులోని బూజును దులుపుకోవడానికి చూడాలి ఈ చిత్రం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here