[box type=’note’ fontsize=’16’]యథార్థ సంఘటనను కథలా మలుస్తూ రాయలసీమ రాజకీయాలు సామాన్యుల జీవితాలను అల్లకల్లోలం చేస్తున్న చిత్రాన్ని ప్రదర్శిస్తుంది డా. శాంతినారాయణ కథ “ముళ్ళ పొదలు”.[/box]
అపస్మారకస్థితిలో వున్న ఆమెను ప్రభుత్వ ఆస్పత్రికి చేర్చి, ప్రత్యేకమయిన గదిలో పోలీసులు చికిత్స చేయిస్తున్నారన్న విషయం వొక పత్రికా కార్యాలయానికి తెలిసింది. వెంటనే అలర్టయిన ఆ పత్రికా విలేఖరి, తమ ఫోటోగ్రాఫర్‌ను, తమ టీవీ ఛానల్‌కు చెందిన మరో ఇద్దరు మీడియా ప్రతినిధులను వెంటబెట్టుకొని, విషయం బయటికి పొక్కనీయకుండా పది నిమిషాల్లో ఆస్పత్రి దగ్గరికి చేరుకున్నాడు. సెన్షేషనల్ వార్తల్ని అందించడంతో వార్తాపత్రికల మధ్య పెరుగుతున్న పోటీతత్వం, ఆ మీడియా ప్రతినిధుల్ని ఆగమేఘాల మీద అక్కడికి చేర్చినట్లుంది.
మీడియా ప్రతినిధులను ఎలా పసిగట్టారో యేమో, వాళ్లు గదిలోపలికి చేరుకునే లోపలే, మఫ్టీ డ్రెస్సులో వున్న పోలీసులు మెల్లగా జారుకున్నారు. మూడు రోజుల కిందట, కొన్ని రాజకీయ శక్తుల ప్రేరేపరణతో ఆమెను పోలీసులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లిన విషయం మీడియాప్రతినిధులందరికీ తెలుసు. తర్వాత ఏమి జరిగిందో మాత్రం ఎవరికీ తెలీదు. ఇప్పుడామె ఆస్పత్రి గదిలో మూలుగుతూ, జరిగిన దుర్మార్గాన్ని తెలియజేయడానికి బతికినట్లు కనిపిస్తూ కొంచెం బిడియపడుతూ మీడియా వాళ్లవైపు చూడసాగింది. ఫోటోగ్రాఫర్లకు ఆమె చూపులు అర్థమయ్యాయేమో, మంచానికి అడ్డంగా కర్టెన్ లాగారు.
ఫోటోగ్రాఫర్లు కెమెరాలను సిద్ధం చేసుకున్నారు. కానీ అవి కళ్లెత్తి చూడ్డానికి సిగ్గుపడుతున్నాయి. అవి ‘ఆడ’ కెమెరాలు అయ్యుంటే అంతగా సిగ్గుపడేవి కాదేమో! మగ కెమెరాలు కావడం వల్ల, సభ్యతా సంస్కారాలు వుండడం వల్ల దాదాపు ఆమె నగ్న శరీరాన్ని సిగ్గువిడిచి చూడ్డానికి ఇబ్బంది పడుతున్నాయి. అయితే వృత్తిధర్మం తొందరపెడుతూ వుంది. పైనుంచీ యాజమాన్యం, సీరియస్‌గా డైరెక్షన్స్ ఇస్తూ వుంది. ఆ సంచలనాత్మకమైన ఫోటోవార్తలను ఇతర పత్రికలేవీ తాకకముందే తమ మీడియాద్వారా ప్రజలకు అందించి యాజమాన్యం చేత ప్రశంసలు పొందాలన్న తపన వాళ్లను ఆత్రపెడుతూవుంది. అన్నిటికన్నా ముఖ్యంగా, ఆమె నగ్న శరీరమ్మీద కనిపిస్తున్న అత్యాచార పైశాచిక హింసాదృశ్యాలు మనసుల్ని కలచివేస్తున్నాయి. అందుకే సిగ్గునూ బాధనూ పక్కకు నెట్టేస్తూ తప్పని పరిస్థితుల్లో కెమెరాలు, ఆమె క్షతగాత్ర నగ్నశరీరాన్ని క్షుణ్ణంగా చూశాయి. ఆ తర్వాత విలేఖరులు వందల ప్రశ్నలు గుప్పించారు. ఇంతకన్నా తనను ఇంకేం చేయగలరన్న మొండి ధైర్యంతో, శరీరమూ మనస్సూ పచ్చిపుండ్లయి సలుపుతున్నా, తన కోడల్ని కాపాడుకున్నానన్న తృప్తితో, తనకు జరిగిన అన్యాయాన్ని పౌరసమాజం దృష్టికి మీడియా తీసుకుపోతుందన్న నమ్మకంతో ఆమె నోరువిప్పి మొత్తం జరిగినదంతా పూసగుచ్చినట్లు చెప్పింది. ఆమె పేరు నూర్జహాన్!
తెల్లవారింది. ఒక దినపత్రిక మెయిన్‌పేజీలో తాటికాయంత అక్షరాలతో వచ్చిన వార్తను చూసి తెలుగు సమాజమంతా ఉలిక్కిపడింది. ముఖాన్నీ మర్మాంగాలనూ చిన్న చిన్న ‘మబ్బుబిల్లల’తో కప్పి తీసిన వొక స్త్రీ నగ్న శరీర చిత్రాలు, ఆ శరీరంపైన కనిపించే అత్యాచార పైశాచిక గాయాలు, చూపరులను తలదించుకునేలా చేశాయి.
బురఖా ముసుగు తీసి ముఖాన్ని బయటికి చూపడానికే సిగ్గుపడే వొక ముస్లిం గృహిణి, ఏకంగా తన దేహాన్నంతా నిర్భయంగా కెమెరా ముందుంచడం, ఆ ఫోటో చిత్రాలు లక్షలాది మంది కళ్లముందు నిస్సిగ్గుగా కనిపించడం ఎంత విషాదం! అంతకన్నా విషాదభరితమయిన వార్తలోని విషయం ఎంత అమానుషం!
ఆ రోజు ఆ దినపత్రికను చదివిన ప్రతిమనిషీ చలించి పోయాడు. జిల్లా సామాజిక చరిత్రలో ఆ వార్త కొన్ని పేజీలుగా, సాహిత్య చరిత్రలో అదొక కథగా మారిపోయింది. ఆ కథే ఇది….
కరువు కాటకాలకు శాశ్వత చిరునామాగా మారిన రాయలసీమలో మరింత వెనుకబడిన గడ్డ, కదిరి ప్రాంతం. దాదాపు నాలుగు దశాబ్దాలుగా వరుస కరువులతో అతలాకుతలమయిన ఆ ప్రాంత గ్రామీణ జీవితం, గాలికి ఎగిరిపోయే వొగుడులా ఎటుపడితే అటు కొట్టుకొనిపోయింది. వేలాది కుటుంబాలు బెంగుళూరు, చెన్నై, హైదరాబాద్, తిరుపతి వంటి నగరాలకు వెళ్లి రకరకాల వృత్తుల వేషాలు వేసుకున్నాయి. మరికొన్ని వందల కుటుంబాల వాళ్లు, బొంబాయి నగరంలోని రెడ్‌లైట్ ఏరియాల్లో తప్పని పరిస్థితుల్లో నచ్చని వృత్తిలో నలిగిపోతున్నారు. ఎటు పోవడానికీ మనసురాక పుట్టిన ప్రాంతంపైన నెర్లు వొదులుకోలేక మరికొన్ని కుటుంబాలు కదిరి పట్టణం చేరుకొని, అందిన అనుకూలమైన జీవన మార్గాలలో, కింద పడుతూ లేస్తూ బతుకులీడుస్తున్నారు. ఆ మార్గంలో తురకపట్నం నుంచీ కదిరికి చేరుకుంది అన్వర్ కుటుంబం. అతని భార్యే నూర్జహాన్!
వేరుశనగ పంట అనగానే వెంటనే గుర్తుకొచ్చేది అనంతపురం జిల్లాలోని కదిరి. ఒక సంవత్సరం వేరుశెనగ సంతృప్తిగా పండితే చాలు, రెండుమూడేళ్లు కరువొచ్చినా నిలదొక్కుకునే జవసత్వాలున్న సహనశీలురు ఆ ప్రాంత ప్రజలు. వర్షాకాలంలో నాలుగు వర్షాలు పడితే చాలు, తన బిడ్డల జీవితాల్లో వెలుగులు నింపడం ఆ నేల స్వభావం. ఎన్నిరాజకీయ విపత్తులొచ్చినా సహనం కోల్పోని జీవన విధానం ఆ ప్రాంత ప్రజలకున్న ప్రత్యేక లక్షణం. ఏ కారణం చేతనో అక్కడ ముస్లిం జనాభా ఎక్కువున్నా మత సంఘర్షణకు చోటివ్వని సోదర సహజీవన సౌందర్యం ఆ పట్టణ ప్రజల తాత్విక చింతన.
పట్టణం నడిబొడ్డులో నూరడుగుల విశాలమైన రోడ్డు తూర్పు దిక్కుగా మదనపల్లికి పోతుంది. రోడ్డుకు ఇరువైపులా అక్కడక్కడ క్రాస్ రోడ్లున్నాయి. ఆరవ క్రాస్ రోడ్డు, కుడివైపుగా దక్షిణ ముఖంగా ఉంది. ఆ రోడ్డు చివర ఎదురుగా కనిపించేదే ఆ వూరి దర్గా! ఆ దర్గా కారణంగా ఆ రోడ్డును దర్గాబజార్ అని పిలుస్తారు. ఎదురెదురు షాపులతో దర్గాబజార్ రద్దీగా వుంది. రద్దీని దాటుకుని కొంచెం ముందుకు పోయి ఎడమవైపు తిరిగితే వొక గల్లీ కనిపిస్తుంది. ఇరవై అడుగుల వెడల్పుతో సిమెంటు రోడ్డు వేసిన నబీసాబ్ గల్లీ అది. గల్లీ చివర వున్న ఇల్లే నూర్జహాన్ నివాసం!
మొన్నటి వరకూ అది అన్వరన్న అడ్రస్సుగా ఇప్పుడు నూర్జహానక్క ఇల్లుగా అందరికీ పరిచయం. అంత పాతదీ అంత కొత్తదీ గాని ఇరవైయేళ్ల వయసున్న ఇల్లు అది. ఇంటి ముందు డోర్‌కర్టెన్ మాదిరి వేలాడుతున్న పాతదుప్పటి తెర, అదొక పేద ముస్లింల ఇల్లని తెలుపుతూ వుంది. నిన్నటి వరకూ కళకళలాడి ఇప్పుడు నిట్టూర్పులతో పొగచూరిన ఆ ఇల్లు, ఎన్నో ఆటుపోట్లను ధైర్యంగా ఎదుర్కొని రాటుదేలి, దృఢంగానే నిలబడి, జరిగిన ఎన్నో సంఘటనలను గుర్తు చేస్తూ వుంది.
లోపల రెండో గదిలో మంచమ్మీద మెల్లగా కాళ్లు ఆరజాపుకొని కూర్చుంది నూర్జహాన్. శరీరంపైన పోలీసులు చేసిన గాయాలు మానుతున్నా మానని మనసులోని గాయం సలుపుతూ వుందేమో బాధపడుతూ, ఎన్నో ఆటుపోట్ల అనుభవంతో బాధను దిగమింగుకుంది. అంతటికీ కారణం పేదరాలైన తన రూపమేనేమో అని తర్కించుకుంటూ ఎదురుగా గోడమీదున్న ఫోటో వైపు చూడసాగింది.
ఇరవై రెండేళ్ల కిందట, ఆమె పెళ్లినాటి ఫోటోను చూసి, ఆమె స్నేహితురాలు ఫాతిమా వేసి ఇచ్చిన తైలవర్ణ చిత్రం అది. ఆ చిత్రంలో ఆమె అపురూప సౌందర్యం ఇప్పటికీ మిసమిసలాడుతూ వుంది. ఆ మాటకొస్తే ఆమె భర్త అన్వర్ కూడా అందంలో ఆమె కంటే తక్కువేం కాదు. అటువంటి అందాల జంట, ఆ రోజుల్లో ఆ ప్రాంతంలోని ముస్లిం కుటుంబాలలో మరొక్కటి ఎక్కడా లేదని ఆమె స్నేహితురాలు ఫాతిమా తెగమెచ్చుకుంటూ ఎంతో ఇష్టంగా వేసి ఆమెకు పెళ్లికానుకగా ఇచ్చిన తైలవర్ణ చిత్రం అది.
నూర్జహాన్ కన్నార్పకుండా ఆ వర్ణచిత్రం వైపు చూస్తూ వుంది. అది కొంచెం అతిశయోక్తిగా కనిపించవచ్చుగానీ నిజంగా ఆమె ఆరోజుల్లో గొప్ప అందగత్తే! ఆమె అందాన్ని చూసే, చాలా మంది ముస్లిం యువకులు కట్నకానుకలు ఏవీ లేకుండా ఆమెను పెళ్లిచేసుకోడానికి ‘క్యూ’గట్టారు. ఆమె అందచందాలను గురించి విని హైదరాబాదు నుంచీ నలుగురైదుగురు పెద్దకోటీశ్వరులే ఆమెను అడగడానికి వచ్చి ఆమె తల్లిదండ్రులకు ఎంతో ఆశ చూపారు. ఆమెతోపాటు ఇంటర్ వరకూ చదివిన, ముదిగుబ్బ భూస్వామి సుబ్బారెడ్డి కొడుకు రంగారెడ్డి, తనకల్లు షావుకారి కుప్పన్న శెట్టి కొడుకు సతీష్, అవసరమైతే ఆమె కోసం వాళ్ల హిందూమతాన్ని వొదులుకోడానికి కూడా సిద్ధపడ్డారు. కానీ ఎవరూ ఆమె తండ్రిని వొప్పించలేకపోయారు.
ఫోటోను చూస్తూ తండ్రి గుర్తుకొచ్చాడేమో, దీర్ఘంగా ఆలోచన చేస్తూ వుంది నూర్జహాన్…
అప్పుడు తన తండ్రి సయ్యద్ తమ తురకపట్నంలో, దాని చుట్టుపక్కలున్న ఏడెనిమిది గ్రామాల్లో ఎంతో పరపతి వున్న పెద్ద మనిషి. మోతుబరి భూస్వామి కాకపోయినా అచ్చమయిన రైతుగా తమ కుటుంబంలో పచ్చనికాంతులు పండించిన గొప్ప వ్యక్తి. తన తండ్రి మల్బరీ సాగు చేస్తూ పట్టుపురుగుల పెంపకంలో పట్టుగూళ్ల ఉత్పత్తిలో హిందూపురం పట్టుమార్కెట్టును ఆకర్షించడంలో ఆయనకు మించిన రైతు ఆ దరిదాపుల్లో వుండేవాడు కాదు. ఇంటికొచ్చే రైతుల్ని బంధువులుగా భావించి ఆత్మీయంగా పలకరించి, మల్బరీ పంట విషయంలోని మెలకువలన్నీ తెలిపి, సంతోషంగా ఆతిథ్యమిచ్చి మరీ పంపేవాడు. అమ్మ షహనాజ్, తమ ముస్లిం వంట రుచులతో ఇంటికొచ్చిన రైతుల్ని సంతృప్తిపరచి పంపేది.
అమ్మానాన్నలు బక్రీద్ రంజాన్ వంటి పండగలప్పుడు తప్ప మిగతా దినాల్లో ముస్లిం వేషాలతో ఎప్పుడూ కనిపించేవాళ్లు కాదు. పేరుకు ముస్లిములేకానీ జీవితమూ జీవితవ్యవహారమూ అంతా హిందువుల మాదిరే! తురకపట్నంలో అమ్మానాన్నలు, అన్ని కులాలవాళ్లకూ రక్తసంబంధంలేని బంధువులే! ఆ గ్రామ ప్రజలతో వాళ్లు పెంచుకున్న అనుబంధం రక్తసంబంధం కన్నా మించినదేమో! అయినదానికీ కానిదానికీ అన్నిటికీ పెద్దదిక్కు నాన్నే! ఎవరికి కష్టమొచ్చినా నష్టమొచ్చినా తమకుటుంబానికి వొచ్చినట్లు తల్లడిల్లేవాడు నాన్న! వరుసలు పెట్టి అమ్మానాన్నా ఆ గ్రామ ప్రజలూ పిలుచుకునే పిలుపుల్లో మలినం లేని ప్రేమానురాగాలు, పంటపొలాల్లో పూచిన రకరకాల పైరుపచ్చల కమ్మని వాసనల్ని గుర్తుకు తెచ్చేవి.
ఆ రోజుల్లో నాన్న మాటే వూరందరి మాట. వూరందరిమాటే నాన్న మాట. ఏ ఎన్నికలొచ్చినా అందరూ రాత్రిపూట భోజనాలయ్యాక చావిట్లో కూర్చొని సుదీర్ఘంగా ఆలోచనచేసి వొక నిర్ణయానికి వొచ్చేవారు. అక్కడ నిర్ణయమయ్యాక దానికి మార్పుండేది కాదు. స్థానిక ఎన్నికలయితే అన్నీ ఏకగ్రీవమే! అసెంబ్లీ ఎన్నికలయితే, తమ తురకపట్నం, ఏ రాజకీయ పార్టీకి ఓటెయ్యాలో, సుదీర్ఘ చర్చల తర్వాత నిర్ణయం జరిగేది. అందుకే పార్టీల జెండాలు రాముల గుడి దగ్గర, చావిడి దగ్గర మాత్రమే రెపరెపలాడేవి. పార్టీల నాయకులొచ్చి నాయనను మాత్రమే కలిసి పోయేవాళ్లు. వచ్చినవాళ్లకు నాయన చాలా గంభీరంగా చెప్పిపంపేవాడు.
అంత పరపతి వుండడం వల్లనే తన పెళ్లి విషయంలో తమ ఇంటి బంధుత్వం కోసం ఎంతో మంది తాపత్రయపడేవాళ్లు. నాయనకు తానొక్కతే బిడ్డ. ఆయన ప్రాణంలో ప్రాణమై పెరిగిన తను, పెళ్లి చేసుకొని మొగునింటికి వెళ్లిపోతుందన్న ఆలోచన, అమ్మానాన్నలకే కాదు తనకు కూడా కొంచెం కష్టంగా తోచేది. మనసును తొలుస్తున్న ఆ విషయాన్ని ఎవరూ బయట పెట్టేవాళ్లు కాదు. పెట్టకపోయినా పెళ్లి పంబంధాలొచ్చిన ప్రతిసారీ ఆ విషయం ఏదో వొక రూపంలో తెలిసేది.
నాయన ముస్లిం సాంప్రదాయాలను పెద్దగా అనుసరించకపోయినా ముస్లింకాని వ్యక్తిని అల్లునిగా చేసుకోవాలని అనుకోలేదు. తమ కదిరి ప్రాంతంలో దూదేకుల వాళ్లు ముస్లింలు కాకపోయినా ముస్లిం సాంప్రదాయాలన్నీ పాటిస్తూ అస్తిత్వ బలం కోసం ‘మేమూ మీలో భాగమే’ అన్నట్లు వ్యవహరించే కుటుంబాలు చాలానే వున్నాయి. అటువంటి వాళ్లలో అక్బర్ మామయ్య కుటుంబం కూడా వొకటి.
తాను పుట్టక ముందునుంచే అక్బర్ మామయ్య, నాన్నకు ఎంతో ఇష్టమైన దోస్తు. తమ వూరి పక్కనే వున్న తనకల్లులో ఆయన కూడా మల్బరీ సేద్యగాడే. దానికి తోడు మామయ్య పట్టుగూళ్ల వ్యాపారం కూడా చేసేవాడు. రైతూ వ్యాపారీ ఇద్దరూ పొత్తుకుదరని వృత్తుల వాళ్లయినా వాళ్ల స్నేహబంధం, మెత్తని పట్టువస్త్రంలో కాంతి తగ్గని జరీ అంచుమాదిరి అల్లుకుపోయింది. ఆ అల్లికకు వాళ్ల మనస్సులూ అభిరుచులూ తెగని పోగులయ్యాయి.
ఎంత స్నేహితులయినా ఈ దేశంలో మనుషులు పరస్పరం మతాలతో తమను తాము చూసుకుంటారేమో! అక్బర్ మామయ్య కూడా మతం కారణంగానే ఆయన మనసులోని అభిప్రాయాన్ని నాయనతో, పంచుకోలేక పోయాడేమో! అయితే నాయనకు మతం అడ్డు రాకపోయినా ఇల్లరికం అనే సామాజికాంశం, ఆయన మనసులోని అభిప్రాయం బయటపడకుండా అడ్డుపడింది. ఇద్దరి అంతర్మథనాల్ని పసిగట్టిన అమ్మ వొక రోజు ఇద్దరికీ భోజనం వడ్డిస్తూ చాలా నేర్పుగా వాళ్ల మనసుల్లో నలుగుతున్న చిరకాల కాంక్షల్ని చదివి వినిపించి, జరీ అంచు పట్టు వస్త్రంలోకి కొత్త బుట్టా పోగులను సూచించింది. అంతే, ఆ రోజు తమ అందరి మనసుల్లో రంజాన్ పండగ సంబరాలు!
అక్బర్ మామయ్య రెండో కొడుకు అన్వర్‌తో తన పెళ్లి నిశ్చయమయింది. అన్వర్ తమ ఇంటి ఇల్లరికానికి రెండు కుటుంబాలూ ఆనందంగా అంగీకరించాయి. దాన్ని ఇల్లరికం అని అనుకోవడం కంటే ఒకే అవిభక్త కుటుంబంలోని మేనరికాల కలయిక అని అనిపించింది తనకు.
నాన్నా మామయ్యా ఇద్దరూ కదిరి ప్రాంతంలోని ముస్లిం కుటుంబాలలో ప్రముఖమయిన వ్యక్తులు కావడంతో అన్వర్‌తో తన పెళ్లి గొప్పగా జరిగింది. పెద్దలిద్దరూ చేతులు చేతులు కలిపి ఆనందంగా చేసిన ఆ పెళ్లికి హిందూ ముస్లిములు దాదాపు ఐదువేల మంది వచ్చి అన్నదమ్ముల మాదిరి మురిసిపోతూ, కదిరి ట్రేడ్ మార్క్‌గా స్పెషల్‌గా చేయించిన బిరియాని తిని ఆనందంగా వెళ్లిపోయారు. ఏడెనిమిది మంది మాజీ తాజా ఎమ్మెల్యేలు హాజరై, వచ్చిన జనాన్ని చూసి నివ్వెరపోతూ తమను ఆశీర్వదించి, నాన్నా మామయ్యలను ఎంతో వినయంగా అభినందించి వెళ్లిన దృశ్యం తనకు ఇంకా గుర్తుకుంది.
అన్వర్ రాకతో తమ ఇంటికి కొత్త కళ వచ్చింది. తన మనసులో ఎక్కడో ఎప్పుడో గూడు కట్టుకున్న కల, సాకారమయింది. అత్తా మామయ్యలు మేనత్తా మేనమామల మాదిరి ఆత్మీయులయ్యారు. అన్వరయితే, తన చిరకాల ప్రేమికుడయిన ముద్దుల బావగా తనను లాలించి, నునువెచ్చని స్వర్గసుఖాలను చూపించాడు.
ఎంత మధురమయిన కాలమది! కర్పూరం మాదిరి ఎంత తొందరగా కరిగిపోయింది! తన జీవితంలో ఆ మధురమయిన క్షణాలు గాలి బుడగల్లాగా ఎందుకు అంత తొందరగా ఆరిపోయాయి? కాలం, మనుషుల ఆనందాన్ని చూసి సహించలేదా? కలలో కూడా ఎవరికీ ఏ హానీ తలపెట్టకుండా ముస్లిం మతధర్మం ప్రకారం ప్రతి యేటా వచ్చిన ఆదాయంలో పది శాతం పేదలకు సహాయంగా అందించిన గొప్ప మనుషులు నాన్నా మామయ్యలు! నీతికీ నిజాయితికీ నిలువెత్తు రూపాలు! ముస్లిం మౌలిక మతసారం గుండెలనిండా నింపుకొని మానవీయ పరిమళాలతో గుబాళించే మనుషులు వాళ్లు! అటువంటి మంచి మనుషుల్ని నలుగుర్నీ వొకేసారి కాలం అంత దారుణంగా కబలించుకొని పోవాల్నా? ఎవరి మంచితనం ధర్మం, వాళ్లను రక్షిస్తాయంటారే, అవి ఆ సత్పురుషులను రక్షించలేకపోయాయా?
ఆ ప్రశ్నలతో ఆమె గుండెల్లోని వేదన పెల్లుబుకసాగింది. తమ రెండు కుటుంబాల కలల పంటయిన తన కొడుకు సలీం ‘ఖత్న’ (సుంతి) కార్యక్రమం జరిగిన కడప దర్గా ఆమెకు గుర్తుకొచ్చింది. ఉత్సవం ముగించుకుని కడప నుంచీ కార్లో తిరిగొస్తున్నప్పుడు పులివెందుల ఘాట్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం కళ్లముందు కనిపించింది. ప్రమాదంలో విగతజీవులయిన తన తల్లిదండ్రులూ అత్తామామలూ కళ్లల్లో మెదిలారు. అంతే, వొక్కసారిగా దుఃఖం కట్టలు తెంచుకుంది. కళ్లు నీటి కుంటలై పొంగి పొర్లసాగాయి.
ధారగా స్రవిస్తున్న కన్నీళ్లను పైట కొంగుతో తుడుచుకుంటూ గత జ్ఞాపకాల్లో నుంచీ బయట పడలేక అలాగే పండుకుని ఆలోచిస్తూ వుంది నూర్జహాన్.
ఆ దారుణం జరగకుంటే, ఆ పెద్దోళ్లందరూ మరో పదేండ్లయినా బతికుంటే అన్వర్ అలా మారిపోయేవాడా? తనను అనాథనుచేసిపోయే వాడా? తన బతుకు ఇలా కుక్కలు చించిన విస్తర మాదిరి అయిపొయ్యేదా? ఆ యాక్సిడెంటుతో పెద్దోళ్లతో పాటు తననూ అల్లా యెందుకు తీసుకొని పోలేదో?
అనుకునేకొద్దీ గుండె బరువెక్కడంతో గట్టిగా నిట్టూరుస్తూ మెల్లగా నడుము పైకెత్తి, వెనక్కి జరిగి, గోడకు ఆనుకొని,దొడ్లోకి చూసింది నూర్జహాన్. అక్కడ కొడుకు సలీం ఎడమ చంక కింద ‘క్యాలిపర్ స్టిక్’ సపోర్టుగా పెట్టుకొని, పావురాల పెట్టె దగ్గర కుంటుతూ పారాడుతున్నాడు. కోడలు షకీల, బయట నుంచీ లోపలికి వచ్చి, నల్లని బురఖా తీసివేసి, ఎండలో నడిచి వొచ్చిందేమో, చెమట పట్టిన ముఖం కడుక్కొని చీర మార్చుకొని అత్త నూర్జహాన్ దగ్గరికొచ్చి గోడకు ఆనుకొని నిల్చుకుంది.
వార్డు కౌన్సిలర్ షాజహాన్ దగ్గరికి ఆమె వెళ్లి వచ్చిన సంగతిని గురించి అడిగింది నూర్జహాన్. మెల్లగా అసంతృప్తిగా చెప్పి కంటతడి పెట్టింది షకీల. ఆమెను దగ్గరికి పిల్చి కన్నీళ్లు తుడుస్తూ వోదార్చసాగింది నూర్జహాన్. మంచం దగ్గరే, కింద కూర్చున్న షకీల, అత్త ఆత్మీయ స్పర్శతో మరింత కరిగిపోయింది. తన మానాన్ని కాపాడ్డం కోసం అత్త పొందిన నరకయాతన గుర్తుకొచ్చిందేమో, పెల్లుబికిన గౌరవానురాగంతో మాటలు రానిదై అత్త భుజమ్మీద తలవాల్చి, పొగిలి పోసాగింది. నూర్జహాన్, కోడలి తలను యెదమీదికి చేర్చుకొని వీపు నిమురుతూ ‘రోమత్ బేటీ, మై దేఖుంగీ, చుప్ రహో బేటీ, నేనుండాను గదా’ అని ప్రేమగా వోదారుస్తూ’ సలీమూ నువ్వూ మళ్లీ రొన్నాల్లు మీ అమ్మోల్ల వూరికి పోండి బేటీ’ అని సూచించింది.
‘హమ్ నయ్ జాతేమా, నిన్ను వొంటరిదాన్ని చేసి మేము యాటికీ పోము మా’ అంటూ తల అడ్డం తిప్పింది షకీల. నూర్జహాన్, ఆమెకు నచ్చజెప్పి, కొంచెం చాయ్ చేసీయమని లోనికి పంపింది.
పది నిమిషాల్లో చాయ్ చేసుకొని వచ్చి అత్తకు ఇచ్చింది. మరొక కప్పు దొడ్లో వున్న సలీంకు అందించి వచ్చి, తాను గోడకు ఆనుకొని టీ తాగుతూ వుంది షకీల. నూర్జహాన్ టీ తాగుతూ మధ్యమధ్యలో కోడలు వైపు కాన్నర్పకుండా చూస్తూ ఆలోచిస్తోంది. ఆ ఆలోచనలతో ఆమె, తన పరిస్థితిని గురించి మరిచిపోతూవుంది.
‘ఇంత అందమయిన పిల్లను ఈ పరిస్థితుల్లో ఎలా కాపాడుకోవాలో! అల్లా ఎంత అందంగా సృష్టించాడో ఈ పిల్లను! తమ పల్లెకాడ ఏపుగా పెరిగిన మల్బరీ, వేరుశెనగ పైర్లమీదున్న పచ్చదనంలో, మేలిమి బంగారు రసం కలిపి ముద్దజేసి, అల్లా ఈ పిల్ల రూపాన్ని పోతబోశాడేమో! పండిన నిమ్మపండులాంటి వొంటి మీద కట్టుకున్న నల్లని వాయిల్‌చీరలో ఎంతముద్దుగా వుందో!
తానొకసారి తన ఇంటర్ క్లాస్‌మీట్స్‌తో కలిసి లేపాక్షికెళ్లి అక్కడ, అందమయిన స్త్రీ వాస్తు శిల్పాన్ని చూసి ముగ్ధురాలయింది. ఆ సౌందర్య శిల్పం ప్రాణం పోసుకొని ఈ పిల్ల రూపంలో తనింటికొచ్చిందేమో! ఏ అవయవం ఎలా వుంటే ఆడది అపురూపమైన అందగత్తె అవుతుందో ఈ పిల్లను చూశాకే అనుకోవాలేమో!
అన్వర్, ఎందుకింత అందగత్తెను ఈ ఇంటి కోడలుగా తెచ్చుకున్నాడో! బహుశా అత్తనయిన తన అందానికి తగినట్లే కోడలు వుండాలని ఆలోచించాడేమో! అందమయిన కోడలినయితే ఇంటికి తెచ్చుకున్నాడు గానీ కొడుకూ కోడలూ పిల్లాపాపలతో ఏ ఆనందాన్నీ చూడకుండానే బరువంతా తనమీదేసి అతడేమో వెళ్లిపోయి యెక్కడో సుఖంగా వున్నాడు. ఇప్పుడు తనకు దిక్కెవరు? దీని అందమేమో తన పేదరికానికి పరీక్షగా మారుతూవుంది. కొడుకేమో ఎందుకూ చేతగాని వాడయిపోయాడు.’
సలీం లోపల్నుంచీ సంకలోని స్టిక్‌తో ‘టక్… టక్’ అని శబ్దం చేస్తూ రావడంతో నూర్జహాన్ మంచమ్మీద లేచి కూర్చుంది. షకీల అక్కన్నుంచీ వంటగదిలోకి వెళ్లిపోయింది.
‘మా మై బాహర్ జాకాతూమా’ అంటూబయటికెళ్లాడు సలీం. ఎవరితోనూ గొడవ పడద్దని చెప్పి, కుంటుకుంటూపోతున్న కొడుకు సలీంవైపు చూస్తూ వుంది నూర్జహాన్. ఆ చూపుల్లో, మళ్లీ గతం మెదులుతూ వుంది…
ప్రమాదం నుంచి తన భర్తా కొడుకులతో నూర్జహాన్ బతికి బయటపడిందేకానీ తల్లిదండ్రులూ అత్తామామలూ శాశ్వతంగా దూరమై, మనసుకు తగిలిన గాయం నుంచీ చాలా కాలం కోలుకోలేకపోయింది, తాను భర్తా కొడుకులిద్దరూ ప్రాణాపాయస్థితి నుంచీ బయటపడడానికి డబ్బు చాలా ఖర్చుపెట్టింది. దానికోసం పల్లె దగ్గరున్న పొలాన్ని చాలా భాగం అమ్మేసింది.
అప్పటికి తన వయసు ఇరవైఐదు దాటుతూ వుంది. అనుకోని విధంగా జీవితం అగమ్యమయిన మార్గం వైపు మలుపు తిరిగే వరకూ తనకు కష్టమంటే కన్నీళ్లంటే ఏమిటో తెలియదు. ఒక్కసారిగా చీకట్లు కమ్ముకునేసరికి పెనుతుఫాను గాలికి నారవేపచెట్టు మాదిరి వూగిపోయి కళావిహీనమయింది తాను. కొన్ని కొమ్మలను రెమ్మలను మిగిల్చికొని, తెగిపోని వేర్ల సహాయంతో నిలదొక్కుకొని, మనోధైర్యమే వూపిరిగా చేసుకొని భర్తనూ కొడుకునూ మళ్లీ మామూలు మనుషుల్ని చేసుకుంది. ఆ సాహస ప్రయాణంలో వొంటరిదై నడుస్తున్న తనకు, వొక భారతీయ మహిళకు ఆసరాగా ఏ చేయీ ముందుకు రాకపోవడం తన గుండెను తొలిచే వొక విషాదప్రశ్న. అందుకు సమాధానంగా సమాజం ఎన్నో కారణాలను చూపుతుంది.
ఆ కారణాలేవీ తన ప్రశ్నలకు సమాధానాలు కావని తనకు తెలుసు. దాదాపు ఇరవై సంవత్సరాలు తాను పడిన నరకయాతన, సంఘర్షణ, ఈ సమాజానికి అర్థమయిందా? ఎన్ని సంఘటనలు! ఎన్ని సమాజ రక్కసి వికటాట్టహాసాలు! తాను దేనిని మరిచిపోగలదు?
మరిచిపోలేనివన్నీ ఆమె మనసులో మెదలసాగాయేమో, వొక్కొక్కటిగా అన్నీ ఆమె కళ్ల ముందు దృశ్యమానం కాసాగాయి.
***
నూర్జహాన్ తండ్రి సయ్యద్ బతికున్నంతవరకు, ఎప్పుడు ఎన్నికలొచ్చినా ఆయన కాంగ్రెస్ పార్టీ వెంటే నడిచాడు. తురకపల్లీ దాని పరిసర గ్రామాలన్నీ అతని దారిలోనే నడిచాయి. ఆమె మామయ్య అక్బర్ కూడా తన దోస్తునే అనుసరించాడు.
అది 1994వ సంవత్సరం. ఎన్టీరామారావు మహానాయకుడుగా గొప్ప రాజకీయవేత్తగా దేశ రాజకీయాలను ప్రభావితం చేస్తున్న కాలమది. ఆంధ్రరాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ గాలులు బలంగా వీస్తున్న రోజులవి. అటువంటి కాలంలో, దేశాన్ని లౌకికపంథాలో నడపగలిగేది కాంగ్రెస్ పార్టీ వొక్కటేనని బలంగా నమ్మి, ఆ సంవత్సరం జరిగే ఎన్నికల్లో స్థానిక కాంగ్రెస్ అభ్యర్థినే బలపరిచాడు సయ్యద్. టీడీపీ పార్టీ నాయకుల నుంచీ ఎంత వొత్తిడి వచ్చినా అతడు తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. దానికి తోడు ఆ దఫా కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వ్యక్తి ముస్లిం కావడంతో అతన్ని ఎలాగయినా గెలిపించుకుంటామని బహిరంగంగా ప్రకటించాడు. అది టీడీపీ స్థానిక నాయకులకు భరించరాని విషయంగా మారింది.
ఆ ఎన్నికల్లో మూడోసారి గొప్ప మెజార్టీతో టీడీపీ పార్టీ అధికారం దక్కించుకుంది. రాష్ట్రంలో ప్రతి చోటా భారీ మెజార్టీతో ఆ పార్టీ అభ్యర్థులు నెగ్గారు. కదిరిలో మాత్రం అతి స్వల్ప మెజార్టీతో టీడీపీ అభ్యర్థి గట్టెక్కాడు. అయితే ఆ గెలుపు గెలుపుకాదని, అందుకు కారణం సయ్యద్ అక్బర్ కుటుంబాలేనని భావించి స్థానిక ఆ పార్టీ నాయకులు వాళ్లిద్దరి కుటుంబాల మీద కక్షసాధింపు చర్యలకు పూనుకున్నారు. అప్పటి నుంచీ నూర్జహాన్ జీవితంలో కష్టాలు మొదలయ్యాయి.
అక్బర్ ముస్లింకాదు. నూర్‌బాషా తెగకు చెందినవాడు. అటువంటి వ్యక్తితో సయ్యద్ వియ్యమందడం టీడీపీ పార్టీలోని కొంతమంది ముస్లిం మతపెద్దలకు నచ్చలేదు. అంతేగాకుండా సయ్యద్ కుటుంబీకులు ముస్లిం పద్ధతులేవీ పాటించరని, రెగ్యులర్‌గా నమాజ్ చేయరని అన్నీ హిందూ సాంప్రదాయాలనే పాటిస్తారని అటువంటి వ్యక్తులు ముస్లిం మతస్థులుగా చెలామణి కావడానికి అనర్హులని కొంతమంది మతపెద్దల్లో వాళ్లపైన కొంత కాలం నుంచి దురభిప్రాయం పెరగసాగింది. అది పసిగట్టిన టీడీపీ పార్టీ నాయకులు ఆ మత పెద్దల్ని వాడుకున్నారు. ఆ పరిణామాలతో ఆ రెండు కుటుంబాలు ఆ ప్రాంత ముస్లిం సమాజంలో కొంత అవమానానికి గురి అయ్యాయి. ఇంట్లో కూర్చొని అన్నీ దిగమింగుకుంటూ మౌనంగా కుంగిపోయింది నూర్జహాన్.
హిందూ కులాల్లో ఎంత గౌరవమున్నా స్వజాతి తిరస్కరణ, సయ్యద్ సహించలేకపోయాడు. సున్నితమైన మత విషయం కావడంతో సమస్యనుంచీ ఎలా బయటపడాలో తీవ్రంగా ఘర్షణ చెందాడు. అయినా వెనకంజవేయకుండా, టీడీపీ పార్టీలో చేరిపొమ్మని ఎన్ని యెరలు చూపినా తిరస్కరిస్తూ ఆ వియ్యంకులిద్దరూ తమ దారిలో గట్టిగా నిలబడ్డారు. దేనికీ చలించని వాళ్ల వ్యవహారశైలి, అప్పటి స్థానిక అధికార పార్టీ నాయకుల్లో మరింత పట్టుదలను పెంచింది. చలించని వాళ్ల ధైర్యం, తగ్గని వీళ్ల పట్టుదల, సమాంతరంగా నడిచిపోయాయి.
సరిగ్గా అప్పుడే రాష్ట్రంలో రెండు సంఘటనలు జరిగాయి. మహాప్రజా నాయకుడు ఎన్టీరామారావు ముఖ్యమంత్రి పదవిని కోల్పోయాడు. ఆ తర్వాత కొన్నాళ్లకే దయనీయంగా మరణించాడు. ఈ అసహజ అప్రజాస్వామిక పరిణామాలు నాగరిక సమాజాన్ని విపరీతంగా కలవరపెట్టడంతో సయ్యద్, అక్బర్ రాజకీయాలను అసహ్యించుకొని వాటికి కొంచెం దూరంగా జరిగి, తమ వ్యవసాయ, వ్యాపారాల్లో నిమగ్నమయ్యారు. ఇద్దరూ పట్టుగూళ్ల పెంపకంతో పాటు స్థానిక రైతులతో పట్టుగూళ్లను కొని హిందూపురం మార్కెట్టుకు తరలిస్తూ రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తూ వ్యాపారం కూడా చేయసాగారు. రైతులనుంచీ వచ్చిన పట్టుగూళ్లను వొకటి రెండు రోజులు స్టాకుపెట్టుకోడానికి, స్టాకును హిందూపురం మార్కెట్టుకు తరలించుకొనిపోవడానికి చల్లని వాతావరణం, రోడ్డు సౌకర్యం అన్నీ అనుకూలంగా వుంటాయని తురకపల్లి దగ్గర సయ్యద్ తోటలోనే పది లక్షలు ఖర్చుపెట్టి రెండు పెద్ద షెడ్లు వేసుకున్నారు.
ఆ సంవత్సరం పట్టుగూళ్లకు గిట్టుబాటు ధర మార్కెట్లో ఆశాజనకంగా కనిపించడంతో అక్బర్, రైతుల దగ్గర నుంచీ పట్టుగూళ్లను భారీ ఎత్తున కొనడానికి సయ్యద్‌ను వొప్పించాడు. తండ్రీమామల దగ్గర తర్ఫీదుపొందిన అన్వర్, పట్టుగూళ్ల నాణ్యతను పరిశీలించి, రైతుల దగ్గర నుంచీ పట్టుగూళ్లను ఎంపిక చేసి షెడ్లలోకి చేర్చి అన్ని జాగ్రత్తలూ తీసుకుంటున్నాడు. సయ్యద్ పైపై వ్యవహారాలన్నీ చూసుకుంటున్నాడు. అక్బర్, పట్టుగూళ్ల రైతులకు డబ్బులు సమకూర్చే బాధ్యతను మీదేసుకున్నాడు. మార్కెట్టు సానుకూలంగా వుంటుందని ముందే పసిగట్టిన సయ్యద్, ఆ సంవత్సరం పట్టుగుడ్లను అధిక మోతాదులో తెచ్చాడు. వాటికి ఆహారంగా తగినంత మల్బరీ ఆకును కోయించి రేరింగ్ స్టాండ్స్ మీద విస్తారంగా వేయించాడు. పట్టుపురుగులు ‘వామ్’ దశకు రాగానే చంద్రికల్లో వేయించి, పసుపు తెలుపురంగుల్లో ఏర్పడిన బీవీ, సీబీ పట్టుగూళ్లను చూసి పది క్వింటాళ్ల దిగుబడి వూహించాడు సయ్యద్. మార్కెట్ రేటు అవగాహనతో ఐదు లక్షల వరకు రావచ్చుననుకున్నాడు.
రెండ్రోజుల్లో రైతుల దగ్గర నుంచీ కొనుగోలు చేసిన దాదాపు నూరు క్వింటాళ్ల పట్టుగూళ్లను నాణ్యతవారీగా రెండు రకాలుగా షెడ్లలో సంచుల్లో సిద్ధం చేసిపెట్టాడు అన్వర్. పట్టు రైతులకు చెల్లించవలసిన డబ్బుల్ని సమకూర్చుకోడానికి హిందూపురం వెళ్లి వచ్చాడు అక్బర్. పట్టుగూళ్లను సప్లై చేసిన రైతులను, డబ్బులు తీసుకెళ్లడానికి రేపు ఉదయమే తోటదగ్గరికి రమ్మని అందరికీ వర్తమానం పంపాడు సయ్యద్.
తెల్లారింది. రైతులందరూ సయ్యద్ తోట దగ్గర కాలి బూడిదయిన షెడ్ల చుట్టూ నిలబడి లబోదిబోమంటూ శాపనార్థాలు పెడుతున్నారు. మంటలారిన పొగల్లోనుంచీ, మొత్తం కాలిపోయిన పట్టుగూళ్ల కుప్పల్లో నుంచీ వొస్తున్న అసహ్యమైన కమురువాసన, తురకపల్లె నిండా కమ్ముకుంది. భరించరాని దుఃఖం ఆ ప్రాంత ప్రజల్లో, పొలాలంతటా ముసురుకుంది.
కర్మసాక్షి సూర్యుడు, జరిగిన ఘోరానికి సాక్షిగా నిలుచుకునే ధైర్యంలేక మబ్బుల మాటున ముఖం చాటేసుకున్నాడు. సయ్యద్, కొండంత నిబ్బరంతో రైతులందర్నీ వోదార్చాడు. తమను ఎదుర్కొనేందుకు చేతగాని పిరికి పందలెవరో చేసిన నీచమయిన పని వల్ల రైతులెవరూ నష్టపోకూడదని, అది తమకు జరిగిన నష్టమని, ఆ నష్టంలో అమాయక రైతులెవరూ పాలుపంచుకోగూడదని గట్టిగా చెప్పాడు. తండ్రి మాట ప్రకారం వాళ్లందరికీ, రాసుకున్న లెక్కల ప్రకారం, అన్వర్ డబ్బులు పంపిణీ చేశాడు. ఆ డబ్బంతా హిందూపురంలోని పట్టుగూళ్ల కొనుగోలుదారులకు బాకీపడి సయ్యద్, అక్బర్ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దాంతో ఆ రెండు కుటుంబాల కంటిదీపమయిన నూర్జహాన్ చెక్కుటద్దాలు మసకబారాయి.
జీవితంలో వూహించని సంఘటనలు! లెక్కలేనన్ని వొడిదుడుకులు! ఎన్నో ఆలోచనల తర్వాత, పెద్దల కోరిక ప్రకారం నూర్జహాన్, భర్తా పిల్లలతో కదిరి చేరుకుంది. అయిష్టంగానే, తన చిన్నారి కొడుకు భవిష్యత్తు కోసం భర్తను అనుసరించింది.
కదిరి దర్గా బజార్, నబీసాబ్ గల్లీలోని ఇంట్లో బతుకు చాలా ఇరుకనిపించింది నూర్జహాన్‌కు. అయితే అది, తండ్రి కొన్న ఇల్లు కావడంతో, పట్టణంలో ‘సొంత ఇల్లు’ అన్న ఫీలింగులో ఇరుకు అనే అభిప్రాయం మెల్లగా మాయమయి పోయింది. పైగా అవసరమని తోచింది. అన్ని విధాలా అనుకూలం అనిపించింది. దగ్గర్లోనే వున్న ఇంగ్లీష్ మీడియమ్ స్కూల్లో కొడుకు సలీంను చేర్చి కొంచెం వూరట చెందింది.
జీవితం వొక్కసారిగా పట్టణానికి మారేసరికి అన్వర్ కొన్నాళ్లు సంఘర్షణకు గురయ్యాడు. రాజకీయంగా ఎదగడానికి అకారణంగా తమ జీవితాలను ఛిద్రం చేసినోళ్లను గుర్తించడానికి కసిగా ప్రయత్నిస్తూ, మంచి సంపాదన మార్గాన్ని తొందరగా ఎంచుకొని కదిరిలో బలపడాలని అనుకున్నాడు అన్వర్. స్నేహితులతో కలిసి ఆలోచించి వొక కాంగ్రెస్ నాయకుని బ్రాందీషాపులో పావలా భాగం షేర్ తీసుకోడానికి సిద్ధమై, ఆ విషయాన్ని తండ్రీమామయ్యల దృష్టికి తీసుకెళ్లాడు. వాళ్లు ససేమిరా అన్నారు. తమ ముస్లిం ధర్మాలకు విరుద్ధమన్నారు.
మనుషుల్ని మతం దృష్టితో మాత్రమే చూసే మతమూ మత ధర్మమూ తనకు అక్కర లేదని బలంగా వాదించి, గతంలో ముస్లిం పెద్దలవల్ల జరిగిన అవమానాలను గుర్తుచేసి, వాళ్ల నోళ్లు మూయించాడు అన్వర్. సంకట పరిస్థితుల్లో వున్న పెద్దలు అన్వర్ నిర్ణయాన్ని నిర్ద్వంద్వంగా ఖండించలేకపోయారు. నూర్జన్‌హాన్ కూడా ఏమీ మాట్లాడలేకపోయింది.
అన్వర్ దంపతులు కదిరిలో కొత్త జీవితాన్ని ప్రారంభించి ఐదేళ్ల కాలంలో చిన్న చిన్న సవాళ్లను ఎదుర్కొంటూ మానసికంగా గట్టిపడసాగారు. క్రమంగా ఆర్థికమయిన ఇబ్బందుల నుంచీ బయటపడుతున్నారు. అంతలోనే కాలం మళ్లీ ఎన్నికల్ని మోసుకొని వచ్చింది. ఈసారి ఎన్నికల పొత్తులో టీడీపీ పార్టీ అభ్యర్థి కాకుండా బీజేపీ అభ్యర్థి, బరిలో ఉండడంతో సయ్యద్ బాగా నిరుత్సాహపడ్డాడు. రాజకీయ పొత్తులు అలా జరక్కుండా వుంటే, చాలా గట్టిగా కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రచారం చేసి, తమ జీవితాలను గాయపరిచిన పార్టీ ప్రబుద్ధులకు తగిన గుణపాఠం చెప్పాలనుకున్నాడు. కానీ కాలం అనుకూలించనప్పుడు ఏదీ కలిసిరాదనుకొని ఆ ఎన్నికల్లో ఏ పార్టీనీ బలపరచకుండా మౌనంగా వుండిపోయాడు. అలాగే అక్బర్ కూడా.
మతవాద పార్టీ వచ్చి వొక్కసారి కూర్చుంటే తమ ఉనికికే ప్రమాదమని భావించిన అధిక శాతం ముస్లిం వర్గీయులు కాంగ్రెస్ పార్టీవైపు బలంగా మొగ్గారు. వాళ్లలో మొన్నటి వరకు టీడీపీ పార్టీలో వున్న వాళ్లూ వున్నారు. రెండు పార్టీల వాళ్లూ సయ్యద్ సహాయాన్ని కోరి నిరాశతో వెనుదిరిగారు. ఎన్నికల్లో స్వల్ప మెజార్టీతో టీడీపీ మిత్రపక్షం నెగ్గింది. సయ్యద్ వర్గం బలపరిచుంటే తప్పకుండా కాంగ్రెస్ ముస్లిం అభ్యర్థి గెలిచేవాడని ఇటు కాంగ్రెస్ ముస్లిం కార్యకర్తలూ, వాళ్లిద్దరి కారణంగానే తనకు తక్కువ మెజార్టీ వచ్చిందని బీజేపీ కూటమీ. సయ్యద్ వర్గీయుల మీద ద్వేషం పెంచుకున్నారు. ఫలితంగా బ్రాందీ షాపులోనుంచి అన్వర్ బయటికి వెళ్లిపోవాల్సి వచ్చింది. దానితో నూర్జహాన్ సంసారం అడకత్తెరలో పోకచెక్కల లాగా మారిపోయింది. సరిగ్గా అటువంటి పరిస్థితిలోనే రోడ్డు ప్రమాదంలో తల్లిదండ్రులూ అత్తామామలూ వొకేసారి కన్నుమూయడంతో నూర్జహాన్ సంసారంలో పూర్తిగా చీకటి కమ్ముకుంది.
అనుకోని ఉపద్రవంతో అన్వర్ కుప్పకూలిపోయాడు. కొండంత ఆసరాలు రాలిపోవడంతో చేతనా రహితుడయిపోయాడు. అతని వాలకాన్ని చూసి నూర్జహాన్ రెన్నాళ్లు దిగులుపడి చివరికి ధైర్యం తెచ్చుకుంది. అన్వర్‌కు ధైర్యం నూరిపోసింది. ఎలాగయినా సంసారాన్ని నిలబెట్టుకోవాలనుకుంది. ప్రశాంతంగా అతనితో కూర్చొని ఆలోచించింది. ఇద్దరూ వొక నిర్ణయానికొచ్చారు.
నూర్జహాన్ మెల్లగా ఇంట్లోనే వ్యాపారం మొదలుపెట్టింది. తురకపల్లి దగ్గరున్న తాండాజనంతో గట్టి పరిచయాలున్న అన్వర్, వాళ్లతో మంచి సరుకు చేయించి రాత్రి సమయాల్లో ఇంటికి తెప్పించుకోవడం, వచ్చిన సరుకును జాగ్రత్తగా పదిచోట్లకు చేర్చడం మొదలుపెట్టాడు. మూడు నాలుగు నెలలకంతా ఆ సరుకు, మంచి కిక్కు ఇచ్చే ‘ఇప్పసారాయి’గా పేరుతెచ్చుకుంది. డిమాండ్ పెరిగింది.
ఇంకేముంది, అన్వర్ చేతిలో డబ్బులు బాగా మెదలసాగాయి. స్నేహాలు పెరిగాయి. చాలా మందితో చేతులు కలిశాయి. పోలీసుల చేతులను తడిపాయి. తడుస్తున్న చేతులతో పోలీసులే వాళ్ల వ్యాపారానికి అభయమివ్వసాగారు. వాళ్ల సలహామేరకు, కేవలం పోలీసు స్టేషన్ రికార్డు కోసం ఉల్లెక్కి నేరారోపణ మీద నూర్జహాన్ రెండుసార్లు పోలీసుల వెంటవెళ్లి కోర్టులో హాజరయి ఫైన్ వేయించుకొని బయటికొచ్చి కొత్త అనుభవాన్నీ ధైర్యాన్నీ మూటగట్టుకొని ఇల్లు చేరుకుంది. మరొకసారి జడ్జి గట్టిగా మందలించినప్పుడు ‘బ్రాందీషాపు లైసెన్సుతో దొంగసారాయి అమ్మితే నేరం కానప్పుడు, పొట్టుకూటికోసం, ఎవరో తెచ్చివేసిన నాలుగు సారాయి ప్యాకెట్లు నా వంటి పేదరాలు అమ్మితే నేరమవుతుందా దొరా?’ అని జడ్జినే ప్రశ్నించింది నూర్జహాన్. దానితో కొంచెం ఎక్కువగానే ఫైను కట్టి, రాటుదేలిన తనంతో బయటికొచ్చింది.
పోలీసులు, నేరస్థుల దొంగాటలో ఎవరి ప్రయోజనాలు వాళ్లకు నెరవేరుతుంటాయేమో, వీలయినంతవరకూ ఇద్దరూ వాళ్లవాళ్ల హద్దులు దాటకుండా వ్యవహారం నడుపుతుంటారు. ఆ విధంగానే అన్వర్, పోలీసుల దొంగాట బంధుత్వం చెడిపోకుండా కొంతకాలం బాగానే కొనసాగింది. పెరుగుత్ను ఈ బంధుత్వ సమయాల్లో, పోలీసుల కంటబడకుండా తన అందాన్ని బురఖాతో దాచుకోలేకపోయింది నూర్జహాన్. ఆమె సౌందర్యం, కొత్తగా వచ్చిన పోలీసు పెద్దసారు కంటిపాపల మీద చెరిగిపోని ముద్రవేసింది. అంతే, ఆసారు కళ్లు, కలల్లోకి వెళ్లిపోయాయి. కలలు సాకారం కావడం అంత సులభం కాదు గదా! పైగా అది ముస్లిం పరిమళమాయె! కదిరిలో అది ఐకమత్యబలమున్న సామాజికవర్గమాయె! ఏమిటో, ఈ పరిమళాలు మనసుల్ని గిలిగింతలు పెడతాయేమో?
కాలం కొత్తకాంతులతో మళ్లీ ఎన్నికల సమయాన్ని తెలుగునేలమీదికి విసిరింది. కొత్త ఆశలతో ఎన్నికలొచ్చాయి. అధికార పార్టీ మీద పెరిగిన వ్యతిరేకతతో రాష్ట్రంలో కాంగ్రెస్ వైపు గాలి వీచసాగింది. అది గమనించిన అన్వర్, కాంగ్రెస్ వైపున గట్టిగా నిలబడ్డాడు. ఎన్నికలు జరిగాయి. అతని కల సాకారమయ్యింది. చాలాకాలం తరువాత కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని చేజిక్కించుకుంది. స్థానికంగా అన్వర్‌కు పట్టుదొరికింది. నూర్జహాన్ వూపిరిపీల్చుకుంది. ఆమె ముఖమ్మీద మబ్బులు తొలగి వెన్నెల విరబూయసాగింది.
కలిసొచ్చిన కాలంతో ప్రశాంతమయిన జీవన మార్గాన్ని ఏర్పాటు చేసుకోవాలనుకుంది నూర్జహాన్. కొడుకు సలీంను చక్కగా చదివించుకొని వాన్నొక ఉన్నతమయిన స్థానంలో చూడాలని కలలు కనింది. కానీ అన్వర్, ఆమె సూచించిన మార్గంలో ముందుకెళ్లడానికి ఇష్టపడలేదు. ఎమ్మెల్యే సహాయసహకారాలతో వొక బ్రాందీ షాపును ప్రారంభించాడు. అధికార పార్టీ నాయకుల అండదండలుంటే ఎక్కువ శ్రమ లేకుండా తక్కువ కాలంలో సునాయాసంగా ఆర్థికంగా ఎదగడానికి అనువయిన మార్గం ‘లిక్కర్ బిజినెస్’ అనేది అన్వర్‌కు తెలిసినంతగా మరెవరికీ తెలీదేమో! అందుకే పట్టుబట్టి సరైన ఏరియాలో బ్రాందీషాపును సాధించుకున్నాడు. అతని పట్టుదలకు అంతర్లీనంగా మరొక బలమైన కారణముంది. రాజకీయ కక్షతో తమ జీవితాలను ఆర్థికంగా నాశనం చేసిన వ్యక్తుల ఆచూకీ అతన్ని నిద్రబోనీయలేదు. ప్రతీకారం కోసం ఎదురుచూసిన సమయం రావడంతో, మిత్రుడయిన శాసనసభ్యుని తోడ్పాటుతో చాలా తెలివిగా ప్రతీకారం తీచ్చుకున్నాడు. అవతలి వ్యక్తులకు చెందిన బ్రాందీషాపును ధ్వంసం చేయించాడు.
ఆర్థికంగా బలపడటానికి ఉపయోగించుకోవల్సిన విలువైన సమయాన్ని మరొక రకంగా వాడుకొని లోపల రగులుతున్న అగ్నిని చల్లార్చుకున్న అన్వర్ ఏమతస్థుడయినా, రాయలసీమ పౌరుషానికి ప్రతీకగా చాలామందికి కనిపించసాగాడు. ఈ పరిణామాలను నూర్జహాన్, ఆమోదించనూ లేక వ్యతిరేకించనూ లేక భవిష్యత్తును గురించి రకరకాలుగా ఆలోచిస్తూ కాలం గడపసాగింది.
రోజులు గంభీరంగా సాగిపోతున్నాయి. కుటుంబ భవిష్యత్తును గురించి గురించి ఎప్పుడూ సీరియస్‌గా ఆలోచించని అన్వర్, విచ్చలవిడిగా ఖర్చు చేస్తూ దర్జాగా బతకసాగాడు. మళ్లీ దగ్గరికి రావేమోనని విలాసాలనూ వినోదాలనూ వెంటబెట్టుకొని తిరిగాడు. దర్గాబజార్ ప్రాంతంలో ఎవరికి ఏ అవసరమొచ్చినా ఆదుకొని అందరికీ ఆత్మబంధువయిపోయాడు.
నిరంతరం తీరికలేని వ్యవహారాలతో అన్వర్ ఇంటిని గురించి పెద్దగా పట్టించుకోలేదు గానీ, అతనికి భార్యంటే వల్లమాలినంత ప్రేమ. కొడుకు సలీం అంటే అమితమైన నెర్లు. భర్తగా తన ప్రేమను పంచితే చాలు, ఆమె ఇంటి ఇల్లాలిగా ఏ సమస్యనయినా ఎదుర్కోగల సమర్థురాలని అతని నమ్మకం. అందుకే ఇంటి వ్యవహారమంతా ఆమెకే వొదిలేశాడు అన్వర్. అతని ప్రేమముందు మిగతా కుటుంబ వ్యవహారాలన్నీ తనకు లెక్కలోనివి కాదనుకొని నూర్జహాన్ కూడా అన్వర్‌ను ఇబ్బంది పెట్టేది కాదు. చివరికి కొడుకు చదువు మానేసి తండ్రి సలహామేరకు బ్రాందీషాపు వ్యవహారాల్లోకి దిగినా ఎక్కువగా బాధపడలేదు.
కాలం వేగంగా పరువెత్తసాగింది. చూస్తుండగానే మరొక ఎన్నికల రుతువు సమీపించింది. నూర్జహాన్ రాజకీయంగా లౌకికంగా కూడా చాలా దూరదృష్టి కలిగిన వ్యక్తి. దీపం వుండగానే ఇల్లు చక్కబెట్టుకోవడం మంచిదనుకుందోయేమో కొడుకు సలీం పెళ్లి విషయం అన్వర్‌తో చెప్పి త్వరగా ఇంటికి కోడల్ని చూడమని కోరింది. తన చిన్నాన్న మనవరాలు పేదరాలయినా చాలా బాగుంటుందని సూచించింది. అంతే, పదిరోజులలోపలే పెళ్లి నిశ్చయమయింది. నెలలోపలే ఆర్భాటాలేమీ లేకుండా నూర్జహాన్ కోరిన విధంగానే, స్థాయికి తగిన రీతిలో సలీం నిఖా జరిగింది. పెళ్లికి అధికార పార్టీ రాజకీయ నాయకులు బాగానే వచ్చారు. రిసిప్షన్‌లో కూర్చున్న వధూవరుల అందమయిన జంటను వచ్చినవాళ్లందరూ నయనానందకరంగా చూసి కొందరు మురిసిపోతే కొందరు కుళ్లుకున్నారు. చాలా రోజుల తర్వాత అందంగా ముస్తాబై, కోడలు షకీల పక్కన నిల్చున్న నూర్జహాన్, పెళ్లికూతురికి అత్తగారంటే ఎవరూనమ్మలేదు. అత్తాకోడళ్లిద్దరూ అక్కాచెల్లెళ్ల మాదిరి, ఆ రిసిప్షన్‌లో అట్రాక్షన్‌గా కనిపించారు.
రిసిప్షన్ హుందాగా నిరాడంబరంగా సాగుతూవుంది.
ఈ మధ్యకాలంలో బురఖాముసుగులో తప్ప బయట ఎక్కడా కనిపించని నూర్జహాన్, ఆ రోజు పెళ్లికూతురు మాదిరి కనిపించడంతో అన్వర్ స్నేహితులు వొకరిద్దరు కన్నార్పకుండా చూశారు. వాళ్లలో కొత్తగా వచ్చిన పోలీస్ ఇన్స్పెక్టర్ కూడా వున్నాడు. అతడయితే, జోబులో వున్న సెల్‌ఫోన్ రింగవుతున్నా పట్టించుకోకుండా అన్వర్ని పలకరించే నెపంతో దగ్గరికొచ్చాడు. అన్వర్ పరిచయం చేయడంతో నూర్జహాన్ చేతులెత్తి నమస్కరించింది. అతడు చిరునవ్వులు చిందిస్తూ ఆమెముఖంలోకి చూస్తూ ప్రతి నమస్కారం చేశాడు. ఆ చూపుల్లో తేడాను గమనించిన ఆమె, కొంచెం ముఖంలో రంగులు మార్చుకొని తలొంచుకుంది. పెళ్లి రిసిప్షన్ ముగిసింది. విభిన్నమైన అనుభూతుల్ని వెదజల్లి వెళ్లిపోయింది.
నూర్జహాన్ కోడలు షకీలాతో అక్కమాదిరి అన్యోన్యంగా వుంటూ, అత్తముచ్చట్లు తీర్చుకుంటూ సంతోషంగా కాలం గడుపుతూ వుంది. సరిగ్గా ఆసమయంలోనే లోకల్‌బాడీ ఎన్నికలు జరగాలని ప్రభుత్వం నిర్ణయించింది. అధికార పార్టీ అన్వర్‌ను జెడ్పీటీసీ అభ్యర్థిగా బలవంతంగా ఎన్నికల బరిలోకి దించింది. అన్వర్ సుముఖత వ్యక్తం చేశాడు. నూర్జహాన్, అన్వర్ నిర్ణయాన్ని వ్యతిరేకించింది. ఆర్థికంగా అంతంత మాత్రంగా వున్న తమకు, ఈ దిగజారుడు రాజకీయాలు వద్దని నెత్తిన నోరుపెట్టుకొని చెప్పింది. అయితే, తండ్రి నిర్ణయాన్ని కొడుకు సలీం కూడా సమర్థించడంతో ఆమె మొదటిసారిగా వొంటరిదైపోయింది. కొత్తగా అత్తగారింటికొచ్చిన షకీల నోరులేనిదైపోయింది.
ఎన్నికలు జరిగాయి. అన్వర్ వోడిపోయాడు. అంతవరకు తాను జాగ్రత్తపడి వెనకేసుకున్న నాలుగురాళ్లూ జారిపోయాయి. దానికి తోడు ఐదు లక్షలు అప్పు మిగిలింది. నూర్జహాన్ కష్టపడి ముడివేసుకున్నవన్నీ కారిపోగా, వేదన ముడివేసుకొని, చివరికి ధైర్యంతో సమస్యల్ని ఎదుర్కోడానికే నిలబడింది. ఈలోగా శాసనసభ ఎన్నికలొచ్చాయి. వైఎస్సార్ బొమ్మవుంటే చాలు, కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని అనుకునే సమయంలో అక్కడ లోకల్‌బాడీ ఎన్నికల ఫలితాలు తారుమారవడంతో అధికార పార్టీ జాగ్రత్తగానే ఎన్నికల బరిలోకి దిగింది. అయినా, స్థానిక టీడీపీ అభ్యర్థి గెలిచాడు. కానీ రాష్ట్ర అధికార పీఠాన్ని మాత్రం రెండోసారి కూడా కాంగ్రెస్సే కైవశం చేసుకుంది. దాంతో కదిరిలో రాజకీయ వాతావరణం చిక్కుల్లోపడింది. ప్రభుత్వం తమదేనన్న ధీమాతో అధికార పార్టీ కార్యకర్తలు, ఎన్నికయిన ఎమ్మెల్యే వర్గీయులతో నిరంతరం ఘర్షణ పెట్టుకోసాగారు. ఆ ఘర్షణల్లో అమాయకంగా అన్నీ పోగొట్టుకొని చివరికి ప్రాణాలు కూడా పోగొట్టుకున్నాడు అన్వర్. అతని కొడుకు సలీం అవిటివాడయ్యాడు.
ఏదో వొకరోజు జరగరానిది జరుగుతుందేమోనని శంకిస్తున్న నూర్జహాన్, అదే జరగడంతో నిశ్చేష్టురాలయింది. తుఫానులో చిక్కుకున్న వొంటరి పక్షిలాగా దైన్యంగా విలపించింది. అన్ని ఆలంబనలూ పుటుక్కున తెగిపోయి అనాథగా మారిపోయింది. బతకడం వ్యర్థమనుకుంది. అయితే ఏ ఆధారమూ లేని మరో రెండు ప్రాణులకు తాను ఆధారంగా మారడం ఆమెను ఇరుకున పడేసింది. ఏదో వొక పద్ధతిలో జీవించక తప్పదన్న స్థితికి తెచ్చింది. ఎందరివో కడుపుకోతల్ని గుర్తుకుతెచ్చుకొని, మరెన్నో సంఘటనలను బద్దలయిన అగ్నిపర్వతాలను తలచుకొని జీవితలక్షణ విలక్షణాలను తర్కించుకొని మనసును రాయి చేసుకొని బతకడానికే పూనుకుంది నూర్జహాన్.
దాదాపు ఇరవయ్యేళ్ల తన సంసార జీవితంలో ఎన్నో ఆటుపోట్లను మూటగట్టుకున్న అనుభవం ఆమెది. అందుకే మొండిగా వొక నిర్ణయానికి వచ్చింది. కొడుకు సహాయంతో ఇంట్లోనే నాటుసారా పాకెట్ల అమ్మకం మొదలుపెట్టింది. అందుకు అన్వర్ మిత్రులు నరసింహులు, వెంకట్ అభయహస్తాలను ఆసరాగా తీసుకుంది. ఆ ఆసరాలో ఏదో వొక రకంగా కాలం గడపవచ్చునని ఆశపడింది నూర్జహాన్. అయితే ఆ ఆశ తన బతుకును ఛిద్రం చేస్తుందని ఆమె వూహించలేకపోయింది.
నరసింహులు, వెంకట్ అన్వర్‌కు సమవయస్కులయిన సన్నిహిత మిత్రులు. అన్వర్ బ్రాందీషాపు పెట్టినప్పటి నుంచి వాళ్ల స్నేహబంధం పెరుగుతూ వచ్చింది. ఎన్నోసార్లు అన్వర్ ఇంటికి ఆ మిత్రులిద్దరూ వొచ్చి వెళ్లేవాళ్లు. అయితే ఆ ఇంట్లో నూర్జహాన్ ఎప్పుడూ హాల్లోకి వచ్చేది కాదు. కాఫీ టీలు అన్నీ పనిపిల్లే అందించేది. సలీం షకీలల పెళ్లి సమయంలో మొదటిసారిగా అన్వర్ మిత్రులు బురఖాలేని నూర్జహాన్ సౌందర్యాన్ని చూసి ముగ్ధులైనప్పటి నుంచి వాళ్ల హృదయాల్లో ఆమె అందమయిన రూపం మెదులుతూనే వుంది. అన్వర్ చనిపోయయినప్పుడు రెండోసారి, ఆమె శోకమూర్తిని వూరడిస్తూ చూశారు. ఆ వూరడింపుల్లో వాళ్ల ఆర్ద్రతవెనక ఏది తొంగిచూసిందో ఆమె గమనించలేకపోయింది. అన్వర్ చనిపోయినప్పటి నుంచీ వాళ్లు ఆమె విషయంలో చాలా దీర్ఘంగానే ఆలోచించసాగారు. అది ముస్లింలు ఎక్కువగా నివసిస్తున్న ప్రాంతమయినందున వాళ్ల ఆలోచనలు మరో మార్గంలో నడిచాయి.
ఒకరోజు మధ్యాహ్నం అకస్మాత్తుగా ఇద్దరు పోలీసులు నూర్జహాన్ ఇంటిమీద పడ్డారు. సారాయి ప్యాకెట్లు అమ్ముతున్న నూర్జహాన్, రెడ్‌హ్యాండెడ్‌గా పోలీసుల చేతికి దొరికింది. సారాయి ప్యాకెట్లున్న పెట్టెల్ని సీజ్ చేసి, బ్రతిమాలుతున్నా, సలీం షకీలా కాళ్లావేళ్లా పడినా వినకుండా ఆమెను పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. షకీల భయంతో వొణికిపోతూ కన్నీళ్లు కారుస్తూ కూలబడింది. సలీం గాబరా పడుతూ కుంటుకుంటూ నరసింహులు ఇంటిదగ్గరికి పరువెత్తాడు. వెంకట్‌తో ఏదో మాట్లాడుతున్న నరసింహులు, ఆందోళన చెందుతూ వచ్చిన సలీంను, తాపత్రయం నటిస్తూ అడిగాడు, ఏమి జరిగిందని. సలీం విషయం చెప్పాడు. ‘కోట్లకొద్దీ దొంగ వ్యాపారాలు చేసే ఘరానా పెద్దలు దర్జాగా తిరుగుతుంటే నాలుగు సారాయి ప్యాకెట్లు అమ్ముకొని బతికే ఆడమనిషే కనిపించిందా ఈ పోలీసోళ్లకు?… సరే సరే, మేము ఆ సీఐతో మాట్లాడి మీ అమ్మను పిలుచుకొని వస్తాము, నువ్వింటికి పద… ఆ పాప ఇంటిదగ్గర గాబరాపడతావుంటాది’ అని వోదార్చి సలీంను ఇంటికి పంపి స్టేషన్‌వైపు వెళ్లారు వాళ్లిద్దరూ.
సీఐ రూము బయట బెంచీ మీద దిగులుగా కూర్చొని వున్న నూర్జహాన్, వాళ్లిద్దరినీ చూసి పైకిలేచి కొంగు సర్దుకుంటూ కన్నీళ్లు పెట్టింది. ఆమెను వోదార్చి నరసింహులూ వెంకట్ సీఐ రూములోకెళ్లారు. లోపల ఏమి మాట్లాడారోయేమో, వొక కానిస్టేబుల్ బయటికొచ్చి, సార్ పిలుస్తున్నారని చెప్పి ఆమెను లోపలికి రమ్మన్నాడు. ఆమె లోపలికెళ్లి వొకవైపు నిల్చుకుంది.
బురఖాలేదు కానీ చీరకొంగు కొప్పుమీదవేసుకొని మెడచుట్టూ కప్పుకుంది. ముఖంలో దిగులు గూడుకట్టుకుందే తప్ప కొడుకు పెళ్లినాడు కనిపించిన రూపం చెక్కుచెదరలేదు. మనసుకు కనిపిస్తున్న పేదరికపు ముసుగును తొలగించి పెళ్లినాటి దుస్తులతో నగలతో ఆమెను వొక క్షణకాలం వూహించుకొని కళ్లార్పకుండా చూడసాగాడు ఇన్స్పెక్టర్. నరసింహులు గట్టిగా దగ్గడంతో అంతరదృష్టిని కళ్లల్లోకి లాక్కొని, ‘స్నేహితులొచ్చి గట్టిగా చెప్పినారు కాబట్టి విడిచిపెడుతున్నాను. నీ మీద ఇప్పటికే రెండు కేసులున్నాయి. మూడోసారి నేను కోర్టుకు హాజరుపరిస్తే మూడు నాలుగేండ్లు నీకు జైలు శిక్ష తప్పదు. వయసులో వున్న ఆడదానివి, దొంగసారాయి అమ్ముకొని బతకడమేమిటి? ఈవృత్తే బాగుందనుకుంటే వీళ్ల సహాయంతో లైసెన్స్ తెచ్చుకొని గవర్నమెంటు సారాయి అమ్ముకో, అవసరమయితే నేనూ వొక చెయ్యేసి సహాయపడతాను. ఒక విషయం, అందమయిన ఆడది ఇట్ల పోలీస్‌స్టేషనుకు రావడం బాగుంటుందా?’ అంటూ సానుభూతి స్వరాన్ని వినిపించి ఆమెను పంపించివేశాడు. ఆమెను ఆదుకునే ఆప్తులిద్దరూ ఇన్స్పెక్టరుకు మరీ దగ్గరిగా జరిగి ఏదో గుసగుసలాడి బయటికొచ్చి ఆమె వెంటనడుస్తూ కేసు విషయం ప్రస్తావించి భయపెడుతూనే ధైర్యం చెప్పుతూ ఆమెను ఇంటి వద్ద వదిలి వెళ్లిపోయారు.
చీకటి పడుతూవుంది. కొడుకూ కోడలుకు జరిగినదంతా చెప్పి గదిలోకెళ్లి పండుకొని ఆలోచించసాగింది నూర్జహాన్.
ఒకవేళ కేసు రిజిష్టర్ చేసి కోర్టుకు పంపితే ఈసారి తాను శిక్షనుంచి తప్పించుకోలేదు. ఇన్స్పెక్టర్ చెప్పింది అక్షరాలా నిజమే కావచ్చు. అన్వర్ మిత్రులయిన వీళ్లిద్దరి సహాయం వల్ల ఈరోజు తను బయటపడింది. వీల్లే అండగా రాకుంటే ఈరోజు రాత్రి తాను పోలీస్ స్టేషన్లోనే వుండాల్సి వచ్చేదేమో!
అనుకోగానే ఆమె వొళ్లు కాసేపు కంపించింది. నిదానంగా తేరుకొని బరువుగా నిట్టూర్చింది. నరసింహులుకు వెంకట్‌కు ఎంతోకొంత చేతిలో పెట్టి కేసు లేకుండా చేసుకోవడం మంచిదనుకుంది. ధైర్యంగా వొక నిర్ణయానికొచ్చింది.
కొన్ని పరిణామాలకు చోటిస్తూ కాలం ముందుకు సాగిపోతూవుంది. ఒకరోజు పోలీసులు కర్కశంగా నూర్జహాన్ ఇంటిమీదపడ్డారు. ఆమె దొంగసారాతో పాటు వేరే వ్యాపారం చేస్తూవుందని నేరారోపణ మోపి ఆమెను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తీసుకుపోయారు. ఇన్స్పెక్టర్, మనిషి తనమంతా మరిచిపోయి పోలీస్ పరిభాషలో కాసేపు దుర్భాషలాడి, ‘నీతో ఎలా నిజం రాబట్టాలో నాకు బాగా తెలుసు’ అంటూ పోలీసులను కంటిసైగలతో హుకుం జారీ చేశాడు. సెల్లులో కూర్చొని మొండి ధైర్యం తెచ్చుకొని ఆలోచిస్తూ వుంది నూర్జహాన్…
‘ఈరోజు ఈ కంత్రీ నాకొడుకులు తనను చితగ్గొడతారేమో! కొట్టనీ! అంతకన్నా ఇంకేం చేయగలరు? ఇంక తాను చచ్చినా పర్వాలేదు. కోడలు షకీలను వీళ్లకంటపడకుండా తాను తప్పించింది.
ఖాకీ బట్టలు వేసుకున్నంత మాత్రాన మనుషులు పశువుల మాదిరి మారిపోతారా? ఈ ఇన్స్పెక్టర్ గానికి అక్కచెల్లెండ్రు వుండరా? బయట యెర్రగా బుర్రగా వయసులో వుండే ప్రతి ఆడదీ వీనికి అనుభవించే వొస్తువేనా?
ఏడెనిమిది నెలలనుంచీ ఎప్పుడు ఆకలయితే అప్పుడు తనను పిలపించుకొని వీని ‘కుతి’ తీర్చుకున్నాడే! ఇంకా వీని నస తీరలేదా? తీరకుంటే, డబ్బులు ఎగజల్లి ఎంతమంది దగ్గరికయినా వెళ్లి ఎంత నసయినా తీర్చుకోవచ్చుగదా! ఖాకీ బట్టలోనికి నవబెడితే, దాన్ని తీర్చడానికి కూడా ఆడది ఉద్దరగా రావలసిందేనా? పొట్టకూటికోసం చిన్న చిన్న నేరాలు చేసిన తనవంటి దౌర్భాగ్యురాళ్లు, తమ నేరం నుంచీ బయట పడడానికి ఇటువంటి పోలీసు ఆంబోతులకు లంచంగా తమ మానాన్ని ముట్టజెప్పాల్సిందేనా? ముట్టజెప్పినా ఈ పశువుకు కనికరం కలగలేదా? తనను కలుసుకున్న ప్రతిసారీ వీనిని కరిగించడానికి తానెంతగానో సహకరించిందే, తనను అందమయిన ప్రియురాలిగా పొగడిపొగడి తనను ఎంతో ఇష్టంగా అనుభవించాడే, అది వీనికి గుర్తుకు రాలేదా? పశువులయినా తమకు సుఖాన్నిచ్చిన పెంటి పశువులను ఇంత దయారహితంగా చూడవేమో!
తనకు పడక సుఖాన్నిచ్చిన వొక ఆడదాని కూతుర్నీ కోడల్నీ కోరుకునే ఈ లుచ్ఛాగాడు పశువుకంటే హీనమయినోడు కాదా?
మురుగునీటి పందికంటే నీచుడు కాబట్టే ఈ ఇన్స్ప్‌క్టర్‌గాడు, తన కోడలు మీద కన్నేశాడు. చివరికి ఆ పిల్లను ఏర్పాటు చేస్తే, తాను హాయిగా బతకడానికి వొక మంచి ‘లేడీస్ కార్నర్ షాపు’ పెట్టిస్తాడంట! షాపు కాదుగదా, వొక పెద్దబంగ్లా తన పేర కొనిస్తే మాత్రం ఆ దుర్మార్గానికి తాను వొడిగడుతుందా?
అవిటి వాడయిపోయి, తండ్రిని కూడా పోగొట్టుకొని ఏ దిక్కూలేక అవిటి జీవితాన్ని వెల్లగక్కుతున్నాడు తన కన్నకొడుకు. ఆడపిల్లలు లేని తన ఇంటికి కంటిదీపమై వచ్చిన కోడలుపిల్ల, ఎంతపాపం చేసుకుందో, ఏ సుఖానికీ నోచుకోకపోయినా కట్టుకున్నవాన్నీ తననూ ఎంతో ప్రేమగా చూసుకుంటూవుంది. ఇప్పుడు వాళ్లకు తానే పెద్దదిక్కు. అటువంటి తాను, తన సుఖం కోసం, ఈ కసాయి పోలీసోనికి, కూతురుతో సమానమయిన కోడలు షకీలను తాకట్టుపెట్టగలదా? తన ప్రాణమున్నంత వరకూ అది జరగని పని. అందుకే తాను ఏమయిపోయినా పరవాలేదనుకొని షకీలను వీని గద్ద చూపులకు అందనంత దూరం పంపించింది.
అన్వర్ శాశ్వతంగా తమకు దూరమైపోయిన వెంటనే కొడుకూ కోడల్ని తీసుకొని తానెక్కడికయినా దూరప్రాంతాలకు వెళ్లుంటే బాగుండేది! కానీ ఎందుకో వెళ్లలేకపోయింది. ఈ గాలీ ఈ నీరూ ఈ ప్రాంతం తననెందుకో కట్టిపడేశాయి. అర్థరహితమయిన ఈ బంధాలు చివరికి తనకు ఏమి మిగిల్చాయి? ఏనాడూ తమను ఆదుకోలేని ఈ ప్రాంతీయ బంధాలను నమ్ముకొని తానే తన జీవితాన్ని చిందరవందర చేసుకుందేమో!
బతికి చెడిన చోట ఎవరూ బతగ్గూడదని అంటారు. బతికితే అది గడ్డిపోచకన్నా హీనమనడానికి తన బతుకే వొక రుజువు.
ఆ నమ్మకద్రోహులిద్దరూ అన్వర్‌కు మంచి దోస్తులుగా వుండి తన జీవితాన్ని ఇలా నాశనం చేస్తారని తాను వూహించలేకపోయింది. ఎంత నీతిదప్పిన మనుషులు కాపోతే వాళ్లు నన్ను కోరుకుంటారు? వాళ్లేమో నీతిదప్పిన వాళ్లయి తన దయనీయ స్థితిని వాళ్లకు అనుకూలంగా మార్చుకొని తనను లొంగదీసుకొని దాహం తీర్చుకున్నారు. అప్పుడే తాను జాగ్రత్తపడి కొడుకూ కోడలుతో కలిసి ఎక్కడికయినా వెళ్లిపోయుంటే ఈ రోజు ఈ పరిస్థితి దాపురించేది కాదు. కానీ వెళ్లలేకపోయింది. ఇల్లూ పల్లె దగ్గర మిగిలున్న పొలమూ ఇంకా ఏవేవో కాళ్లకు బంధాలు వేశాయి. అయితే వాళ్లు నీతితప్పినా తాను స్త్రీ సహజమయిన నీతిమీద గట్టిగా నిలబడి వుంటే ఏ బంధాలూ తనను ఆపగలిగేవి కావేమో! కానీ మహా సుడిగుండంలో చిక్కుకున్న తనకు ఆ సమయంలో జీవన నీతికన్నా జీవిత ధర్మమే ప్రధానమనిపించింది. తన ధర్మ నిర్వర్తనకు వాళ్ల చేయూత అవసరమనిపించింది. వాళ్లు కోరుకున్నది అందించి వాళ్ల చేయూతను పొందడం ఆ సమయంలో తనకు తప్పనిపించలేదు. అయితే ఆ వొక్కసారి చేసిన తప్పువల్ల తానింతగా దిగజారి పోతుందని వూహించలేదు.
ఆ దుర్మార్గులిద్దరూ చివరికి వాళ్ల పబ్బం గడుపుకోడానికి ఈ పోలీసు మృగానికి తనను ఎరవేశారు. అయినా తాను సహించింది. ఇది తన దిగజారుడు తనమేనా? కావచ్చు! కాదని తనను తాను ఏనాడూ సమర్థించుకోలేదు. అసహ్యించుకుంటూనే వీళ్ల పశుచేష్టలను తానింతవరకూ సహించింది. వీళ్ల పశుప్రవృత్తి తన జీవితాన్ని నాశనం చేసింది చాలక ఇప్పుడు సుకుమారమయిన తన కోడలి జీవితాన్ని కూడా చిదిమివేయడానికి పూనుకుంటే తాను ఎలా భరిస్తుంది? అందుకే నిన్న తన ఇంటికి వచ్చిన ఈ కుక్కలమీద తాను రెచ్చిపోయింది. దాని ఫలితమే, అసత్య నేరారోపణతో ఈ అరెస్టు! కానీ, చూద్దాం ఏమవుతుందో..!
సెల్లులో కూర్చొని ఆలోచిస్తూ గుండెను రాయిచేసుకుంది నూర్జహాన్.
చీకటి పడింది. భయంకరమయిన చీకటితో అది కాళరాత్రిగా మారింది. ఆ రాత్రి చీకటిలో, కఠినమయిన పోలీసుల విధి నిర్వహణ క్రీడా వినోదంలో, ఎవరూ దిక్కులేని వొక భారతీయ మహిళ చేసిన ఆర్తనాదాల పల్లవి రాగాలు, ఎవరికీ వినిపించకుండా సొమ్మసిల్లి పోయాయి.
తెల్లవారింది. అపస్మారక స్థితిలో వున్న నూర్జహాన్, అత్యవసర చికిత్స కోసం పోలీసు జీపులో ప్రభుత్వ ఆసుపత్రికి చేర్చబడింది.
***
ఇరవై ఐదు సంవత్సరాల వెలుగు చీకటుల వెంట కొట్టుకుపోయిన నూర్జహాన్, ఆ జ్ఞాపకాల నుంచి బయటపడింది. అవి ఎంతగా వేదించాయేమో ముఖమంతా జేవురించి ఉబ్బుకుంది. గట్టిగా నిట్టూరుస్తూ మంచం దిగి బాత్‌రూమ్ వైపు వెళ్లింది నూర్జహాన్.
సాయంకాలమవుతూ వుంది. నాలుగైదు మహిళా, ప్రజా సంఘాల నాయకులు ఆమెను పరామర్శించడానికి వచ్చి, వారం రోజులుగా పట్టణంలో జరిగిన పరిణామాలను ఆమెతో చెప్పారు. ఇన్స్పెక్టర్‌తో పాటు ముగ్గురు కానిస్టేబుల్స్ సస్పెండయిన విషయాన్ని, మహిళా సంఘాల విజయగర్వంగా పేర్కొన్నారు. పోలీస్ బ్రోకర్లుగా మారిన నరసింహులు, వెంకట్ పరారీలో వున్నట్లు తెలిపారు. పోలీస్ స్టేషన్లో ఆమె మీద జరిగిన పాశవిక అత్యాచార విషయంలో జుడీషియరీ ఎంక్వయిరీ చేయాలని డిమాండు చేస్తూ ఆమె ఎల్లుండి చేయబోయే నిరాహరాదీక్షకు తమ సంపూర్ణ మద్దత్తును ప్రకటించి ధైర్యం చెప్పారు. వాళ్ల అభయ హస్తాలతో కొండంత బలం వచ్చినట్లు వూరట చెందుతూ నిండుగా తల పైకెత్తింది నూర్జహాన్. వికసించిన అందమయిన ముఖంతో ఆమె ఎటో చూడసాగింది.
సర్వీస్ నుండి డిస్‌మిస్ అయి, నూర్జహాన్ అందమయిన సరికొత్త రూపం ముందు సిగ్గుతో తలొంచుకొని దిగులుగా ఇంటిముఖం పట్టిన పోలీస్ అధికారుల రూపాలు ఆమె కంటిపాపల మీద మెదులుతున్నాయి.
డా॥ శాంతి నారాయణ
సెల్: 8074974547
email : vimalasanthi9@gmail.com