ముందడుగు

0
8

[dropcap]ఆ[/dropcap]ట మైదానంలో పిల్లలు కేరింతలు కొడ్తూ సంతోషంగా అంతులేని ఆనందంతో ఆడుకుంటున్నారు. వారి వయస్సు తీరుతెన్నులే అంత. ఏ చీకూ చింత లేని నిష్కపటమైన నిర్మలమైన మనస్సు వాళ్ళ సొంతం. వారి వయస్సు ప్రభావం. కల్లా కపటం ఎంటో తెలియని వయస్సు కూడా బాల్యానిదే. కల్మషం లేని మనస్సు ఈ పిల్లలది. అందుకే మనిషి జీవితంలో తిరిగిరాని మధుర దశ బాల్యదశ.

అది భావ కాలుష్యం లేని స్వచ్ఛమైన అనుభూతులతో నిండి ఉంటుంది. అప్పటి స్మృతులు గుర్తుకు వచ్చినప్పుడు మనస్సంతా అంతులేని ఆనందంతో నిండిపోతుంది. స్వచ్ఛమైన అనుభూతులతో లీనమవుతుంది.

అలా అని అందరి బాల్యాలూ ఆనందకరంగా ఉండవు. కొంత మంది జీవితాలు వడ్డించిన విస్తరాకులు కావు, వెంటనే ఆకలి తీర్చుకోడానికి. అందరికీ కాకపోయినా కొంతమందికి జీవితాల్లో బాధలు, కష్టాలు వారి నేస్తాలు. కొందరు వెట్టిచాకిరీ చేసేవాళ్ళు, చెత్తకాగితాలు ఏరుకునేవారు, యాచన చేసేవారు. తల్లుల చేత చెత్తకుప్పల్లో, ముళ్ళ పొదల్లో వదిలివేయబడేవారు, వ్యభిచార గృహాల్లోకి బలవంతంగా నెట్టివేయబడేవారు, ఇలా ఎందరివో బాల్యాలు అనే మొగ్గలు వికసించకుండానే… అదే బాగా విచ్చుకోకముందే వాడిపోతున్నాయి.

అదంతా ఎందుకు? ఎదురుగా అంత సంతోషంతో ఆదుకునే పిల్లల్లో ఎంతమందో పై చెప్పిన చేదు అనుభవాలకి గురి అయినవారే. అయితే వారి చేదు అనుభవాల్ని మరిపించి వారికి ఆశ్రయం లభించింది ఈ ప్రశాంత నిలయంలో. అందుకే వాళ్ళు తమ చేదు అనుభవాల్ని మరచిపోయి ఇంత ప్రశాంతంగా ఆనందంగా ఆడుకుంటున్నారు.

“శారదా! నీవు ఇక్కడికి వచ్చి అయిదు సంవత్సరాలు గడిచిపోయింది. ఇంత వరకూ నీవు ఇంత మూడీగా ఉండటం నేను చూడలేదు. గతం గతః. గతం తాలూకా చేదు అనుభవాల్ని తలచుకుంటూ కూర్చుంటే భవిష్యత్తు గురించి ఆలోచించే అవకాశం ఉండదు. గతాన్ని తలుచుకుని బాధపడితే భవిష్యత్తు శూన్యమనిపిస్తుంది. గతం తాలూకా నీలినీడల్ని మరిచిపోయి, వర్తమానంలో జీవిస్తూ ఉజ్వలమైన భవిష్యత్తు కోసం బాట వేసుకోవాలి మనం.”

“వర్తమానంలో బ్రతకడం గొప్ప అనుభవాన్ని పొందడం, అంత సులువు కాదు అది. దీనికి కొంత సాధన చేయాలి. అయితే ఒక్కొక్క సమయంలో గతాన్ని గురించి ఆలోచించడం అవసరమే. అలాగే భవిష్యత్తు గురించి కూడా ఆలోచించడం అవసరమే. వాటి గురించి ఆలోచిస్తూ వర్తమానాన్ని పట్టించుకోకపోతే జీవితం వృథా అయిపోతుంది. అందుకే గతాన్ని, భవిష్యత్తుని పరిశీలిస్తూ ఉండాలి. వర్తమానంలో బ్రతకాలి. అలా అని గతాన్ని విస్మరించమని కాదు. గతం నుండి పాఠాలు నేర్చుకోవాలి. భవిష్యత్తు గురించి ప్రణాళికలు రచించాలి. వర్తమానంలో జీవించాలి” అన్నపూర్ణమ్మగారు అన్నారు.

ఆవిడ శిశువిహార్‌ని స్థాపించారు. ఆవిడ ఆ శిశువిహార్ ఆశ్రమానికి మేనేజరు, సర్వస్వం కూడా. ఆ అశ్రమంలో అనాథ పిల్లలకు ఆశ్రయం ఇచ్చి వారిని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలనే సంకల్పంతోనే ఈ ఆశ్రమాన్ని స్థాపించింది ఆవిడ. చెప్పాలంటే ఆవిడ స్వతహాగా మంచి మనిషి. పేరుకు తగ్గట్టు అన్నపూర్ణే.

తను ఈనాడు ఇలా ఉందనుకుంటే అదంతా ఆవిడ చలవే. ఆవిడే తనని ఈ ఆశ్రమంలో ఉండటానికి అనుమతించకపోతే తన జీవితం ఎలా ఉండేదో?  ఆవిడ ఆపద కాలంలో తనకి ఆశ్రమంలో ఉద్యోగమిచ్చి ఆదుకున్నారు. ఇలా సాగిపోతున్నాయి నా ఆలోచన్లు.

“శారదా! నేను అంటున్నది వినిపిస్తోందా?”

“విన్నానమ్మా! నాలో ఏవోవో భావోద్వేగంతో కూడాన ఆలోచన్లు, భావాలు” అన్నాను.

“అలాంటి ఆలోచన్లు వచ్చినప్పుడు మనస్సును మరోవేపు మళ్ళించుకో!” అంటూ నా భుజం తట్టి ఆవిడ ఆఫీసు రూమ్ వేపు అడుగులు వేసారు.

ఆవిడ చెప్పింది బాగానే ఉంది కాని ఆ పాత జ్ఞాపకాలు, చేదు అనుభవాల్ని మరిచిపోవడం నాకు సాధ్యం కావటం లేదు. గతం తాలూకా నీలినీడలు నన్ను వెంటాడుతూనే ఉన్నాయి. తన కుటుంబ సభ్యులు తనని చిన్నప్పుడు ఎంత అభిమానించేవారు? ఎంత ప్రేమగా, అపురూపంగా చూసుకునేవారు? అలాంటిది ఇప్పుడు తనని తన వాళ్ళు అసహ్యించుకుంటున్నారు. ఛీత్కరించుకుంటున్నారు. తన జీవితం అలా అవడానికి బాధ్యురాలు తనా? అది తన తప్పా? విధి చేతిలో చిత్తుగా ఓడిపోయింది తను.

తన వాళ్ళ నిరాదరణ తనని మనస్తాపానికి గురి చేసింది. తను చాలా బాధపడింది. తన వాళ్ళు తనని తిరస్కరించినా, వారిని తను తిరస్కరించలేదు. తనకి కష్ట సమయంలో లాయరు బాబు అండగా నిలబడ్డాడు. విపత్కర పరిస్థితిలో లాయరు బాబు తనకి నేర్పిన ధైర్యపాఠాలు, వచనాలే గుర్తుకు వచ్చేవి.

ఒక్కొక్క పర్యాయం లాయరు బాబు తనతో “ఏ పనేనా మనం చేయలేమని ప్రయత్నం చేయక ముందే నిర్ణయించుకోకూడదు. ఇది అత్యంత దారుణమైన విషయం. అంతేకాదు ప్రయత్నం చేయకముందే తిరస్కరణకి గురవుతామని అనుకోవడం మానుకోవాలి” అని అనేవారు. అతను చెప్పింది నిజమే అనిపిస్తోంది. ఎందుకంటే కేవలం విజయాల గురించి ఆలోచించకుండా వైఫల్యాల గురించే ఆలోచిస్తారు. ఇది ఒక విధంగా పిరికితనమే. అయితే అపజయాల గురించి ఆలోచించడానికి ఎవ్వరూ ఇష్టపడరు – ఇలా సాగతున్నాయి నా ఆలోచన్లు.

నా వాళ్ళు నన్ను తిరస్కరించడానికి ముఖ్యకారణం ప్రస్తుత ఛిద్రమైన తన జీవితం. నా జీవితం అలా తయారవడానికి జరిగిన సంఘటన జ్ఞప్తికి రాగానే నా శరీరం జలదరించింది. భయంతో వణికిపోయింది. స్కూలు నుండి వస్తున్న తనని ఎవరో కారులోకి లాగి మత్తు మందు ఇచ్చి కిడ్నాపుకి గురిచేసారు.

తనకి తెలివి వచ్చి చూసేప్పటికి తను ఓ ఇంట్లో బందీగా పడి ఉంది. తనలాగే కిడ్నాపుకి గురయిన ఆడపిల్లలు తన వయస్సువాళ్ళు, తనకంటే చిన్నవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళు ఏడుస్తున్నారు. గింజుకుంటున్నారు. తను అంతకు పూర్వం విన్నదాన్ని బట్టి అది ఒక వ్యభిచార గృహమని ఇట్టే తెలిసిపోయింది.

‘హే భగవాన్! నాకు ఎటువంటి పరిస్థితి వచ్చింది? నేను ఈ సాలెగూడులో చిక్కుకున్నాను’ అని కుమిలిపోయాను. ఇందులో చిక్కుకున్న వారికి విముక్తి అనేది ఉండదు. వాళ్ళు చెప్పినట్లు ఇష్టం లేకపోయినా నడుచుకోవాలి. లేకపోతే నానాయాతనలకి గురి చేస్తారు. తిండి పెట్టరు. వాతలు పెడ్తారు. కొడ్తారు. తిడతారు. నయాన్నో భయాన్నో వాళ్ళ దారికి తెచ్చుకుని వ్యభిచార వృత్తిలోకి దింపుతారు కిడ్నాపు చేసిన ఆడ పిల్లల్ని.

యాదగిరిగుట్టలో కిడ్నాపుకి గురయిన ఆడపిల్లల్ని వెతకడానికి – కిడ్నాపుకి గురయిన ఆడపిల్లల తల్లిదండ్రులు పోలీసుల సహాయంతో వచ్చి తమ పిల్లలున్నారేమో అని వాకబు చేసి వెళ్ళారు అని విన్నాను. నేను కూడా కిడ్నాపుకి గురయినప్పుడు ఇలాగే మా తల్లిదండ్రులు వచ్చి ఉంటే నా జీవితం మరోలా ఉండేది. పతనమయ్యేది కాదు. ఇదంతా నా తలరాత.

ఆ వ్యభిచార గృహంలో రైడింగ్ అయితే కోర్టులో వ్యభిచార గృహ నిర్వాహకుల తరుపున అండగా ఉంటాడు లాయర్ సుధాకర్. అతను చాలా మంచివాడు. ఆ మధ్యనే అతని భార్య చనిపోయింది. అలా తను సహాయం చేస్తున్నానని అతను ఆ వ్యభిచార గృహంలో తన శారీరక వాంఛలు తీర్చుకోలేదు. అయితే నన్ను, నా అమాయకత్వాన్ని చూసిన తరువాత అతనిలో ఏదో మార్పు. అది నాలో ఉన్న ఆకర్షణ కావచ్చు లేకపోతే నా అమాయకత్వం కావచ్చు.

అక్కడ నా పేరు శారదల్లా మోహినిగా మారింది. “మోహినీ! నీవు చాలా అదృష్టవంతురాలివి. లాయరు బాబు నిన్ను ఇష్టపడుతున్నాడు. ఇక్కడ ఇంతమంది ఆడవాళ్ళున్నా ఏనాడూ ఎవ్వరినీ ఇష్టపడని అతను నిన్ను ఇష్టపడుతున్నాడంటే అది నీ అదృష్టం” అంది వ్యభిచార గృహ నిర్వాహకురాలు నాంచారమ్మ.

అది నా అదృష్టమో లేక దురదృష్టమో తెలియని అయోమయ పరిస్థితి. ఎంత సంస్కారవంతమైన, సంప్రదాయమైన కుటుంబం నాది? అలాంటి కుటుంబంలో పుట్టిన నేను ఈ రోజు ఈ వ్యభిచార గృహంలో చరిత్రహీనురాలిగా, పతితగా మిగిలిపోయాను.

నాంచారమ్మ అన్నట్టు నాదీ అదృష్టమే అని అనుకోవాలి. ఎందుకంటే ఇక్కడ గంటకో విటుడు అడదాని శరీరంతో అటలాడుకుంటాడు. అయితే నాది వేరే పరిస్థితి. లాయరు బాబు ఎవర్ని ఇష్టపడతాడో ఆ ఆడది అతనితోనే ఉండాలి. నాంచారమ్మ అతను ఇష్టపడిన వాళ్ళని వేరే వారికి అప్పగించదు. నా జీవితం కుక్కలు పీకిన విస్తరిలా కాకుండా ఉంటుంది. ఇదీ ఒకందుకు మంచిదే అనుకున్నాను, విధి లేని పరిస్థితిలో.

జీవితంలో మన ప్రమేయం లేకుండా ఇష్టం లేకపోయినా కొన్ని సంఘటనలు జరుగుతూనే ఉంటాయి. వాటికి మనం ఎంత కుమిలిపోయినా, పోగొట్టుకున్న జీవితం తిరిగిరాదు. పవిత్రమైన ‘శారద’ అన్న నా పేరు ఇలా ‘మోహిని’గా మారటం ఏంటి? పతనమైన జీవితం అలాగే ఉంటుంది. అలాంటి జీవితం అనుభవిస్తున్నందుకు బాధవేస్తుంది, దుఃఖం వస్తుంది. మనస్సుకి కష్టం కలుగుతుంది. ఏదో తెలియని నిస్సహాయత. ఇప్పుడు ఎంత కన్నీరు కార్చినా, వేదనే తప్ప చేజారిన జీవితం తిరిగిరాదు.

ముఖ్యంగా చెప్పాలంటే సమాజంలో ఆడదానికి భద్రత కరువయి పోయింది. అభద్రతాభావం వెంటాడుతోంది. ఆడదాన్ని నైతికంగా దిగజార్చడానికి ఎన్నో మార్గాలు నేడు. ఆ మార్గాల్లో ఒక భాగమే ఆడపిల్లల్ని కిడ్నాపు చేసి వ్యభిచార గృహాలకి చేర్చడం.

చేదు జ్ఞాపకాల్ని మరచిపోలేము కాని మరిచిపోతేనే జీవితం. నేటి పరిస్థితి నాకు ఆందోళన కలిగిస్తోంది. సమాజంలో మనిషిలో మానవత్వం, మంచితనం మరుగున పడిపోతున్నాయి. జీవం లేని డబ్బు కోసం, జీవం ఉన్న ఆడదాన్ని శరీరం, జీవితం ఛిద్రమయిపోతున్నాయి. ఇలాంటి రకరకాల ఆలోచన్లు నన్ను చుట్టుముడ్తున్నాయి.

జీవితం ఎప్పుడూ ఒకే విధంగా ఉండదు. అలా సాగితే ఏ సమస్యా ఉండదు. అలా జరగనప్పుడే జీవితంలో అనేక సమస్యలు. లాయరు బాబుకి అతని వాళ్ళు ఓ సంబంధం తీసుకువచ్చారు. అతనికి ఇష్టం లేకపోయినా బలవంతానా అతడ్ని ఒప్పించారు. అప్పుడు లాయరు బాబు నాతో అన్న మాటలు గుర్తుకు వస్తున్నాయి.

“మోహినీ! ఎంతయినా మన మధ్య ఉన్న సంబంధం అక్రమ సంబంధం. దాన్ని సక్రమంగా చేసుకోవాలంటే ఎన్నో అవరోధాలు, ముఖ్యంగా మా వాళ్ళు అంగీకరించరు. వాళ్ళ మాట కాదనలేను. అది నా బలహీనత. నన్ను ఓ స్వార్థపరుడు అని నీవు అనుకోవచ్చు. సమాజం కూడా మన సంబంధాన్ని హర్షించదు. ఇన్నాళ్ళు నన్ను నమ్ముకుని నాకు ఆనందాన్ని ఇచ్చిన నీకు మంచి చేయాలి. నిన్ను ఈ సాలెగూటి నుండి విడిపిస్తాను” అన్నారు.

‘ఈ నరకం నుండి బయట పడటమే నాకు పదివేలు. నన్ను పెళ్ళి చేసుకోపోయినా పరవాలేదు’ అని అనుకున్నాను. అలా అన్నా అతను నాకు స్వార్థపరుడిగా అగుపించలేదు. దేవుడిలా అగుపడ్డాడు.

నాకు ఆ సాలెగూడు నుంచి విముక్తి కలిగించిన తరువాత రైలు ఎక్కించారు లాయరు బాబు. ఆ సమయంలో అతను నాతో “మోహినీ! నీకు నేను ఋణపడి ఉన్నాను. నాకు జీవితంలో ఆనందాన్ని పంచి ఇచ్చావు. నేను స్వార్థపరుడిలా మా వాళ్ళకి, సమాజానికి భయపడి నిన్ను నాదానిగా చేసుకోలేకపోతున్నాను” అని అన్నారు. ఇలా అంటున్న సమయంలో అతని ముఖంలో ఒకింత బాధ. ఆ మాటలకే నేను ఎంతో పొంగిపోయాను.

ఆ తరువాత ఏం జరిగింది. నా వాళ్ళు  నన్ను చూసి ఛీత్కరించుకున్నారు. ఆదరించలేదు. నన్ను ఓ పురుగును చూసినట్లు చూశారు. ఏ రక్త సంబంధం లేని లాయరు బాబు ఇచ్చిన సాంత్వన కూడా నా వాళ్ళ దగ్గర నాకు లభించలేదు.

ఒక్కొక్కసారి మనకి మన ఆత్మీయులనుకున్నవారే మన మీద బురద జల్లుతారు. మనం ఏం కారు అని అనుకున్నవారే మన మీద అభిమానం చూపుతారు. నా వాళ్ళ దగ్గర నాకు లభించిన చేదు అనుభవంతో చచ్చిపోవాలనిపించింది. ఎన్ని ఆటంకాలు ఎదురయినా మన గమ్యం చావు కాదు. ధైర్యంగా ముందుకు సాగాలన్న సంకల్పం. ఆ దృఢ సంకల్పానికి కారకుడు లాయరు బాబు.

“నీకు కష్ట పరిస్థితి వస్తే నాకు తెలియ చెయ్యి!” అని లాయరు బాబు అన్నారు కాని, అయితే అతని జీవితం బాగుండాలంటే అతని జీవితంలోకి తొంగి చూడకూడదు. ఎవరేనా సంతోషంగా ఉన్నారంటే అది మన వల్లే అనాలి. అంతే కానీ మనల్ని చూసి నవ్వే పరిస్థితి రాకూడదు. మనల్ని అందరూ అవహేళన చేసే పరిస్థితి రాకూడదు. ఎవరేనా ఏడుస్తే మన కోసం ఏడవాలి. మన కష్టాల్ని చూసి ఏడవాలి.. ఇలా ఏవేవో ఆలోచన్లు.

అసలే రెండు రోజుల నుండి సరియైన తిండిలేదు. నడుస్తూ నడుస్తూ సొమ్మసిల్లి పడిపోయాను. అలాంటి పరిస్థితిలో అన్నపూర్ణమ్మగారు నన్ను చేరదీసారు. ఆశ్రయం కలిపించారు. జీవితంలో ధైర్యంతో ముందుడుగు వేయాలని నాలో ఆత్మస్థైర్యాన్ని కలిగించారు ఆవిడ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here