మర్డర్

1
10

[శ్రీ వెంపరాల దుర్గాప్రసాద్ రచించిన ‘మర్డర్’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]

[dropcap]ఉ[/dropcap]దయాన్నే పనిమనిషి రంగి అరుపులతో ఆ కారిడార్ అదిరిపోయింది. ఫ్లాట్ నెంబరు 2 లో ఉంటున్న వర్ధనమ్మ గారు దివాను మీద అచేతనంగా పడి వుంది. తలుపులు బార్లా తెరిచి వున్నాయి. వాచ్‌మన్ రాలేదు కానీ, వాడి భార్య, చుట్టుపక్కలవాళ్ళు వచ్చేరు. అందరూ కంగారు పడుతున్నారు. ఎవరో పోలీసులకు ఫోన్ చేసారు.

అది ఓ 8 ఇళ్ల GROUP HOUSE. ఫ్లోర్‌కి 2 ఫ్లాట్స్ ఉంటాయి. వర్ధన్నమ్మ గారి ఫ్లాట్‌కి ఎదురు ఫ్లాట్‌లో రామారావు గారు వుంటారు. అయన భార్య సులోచన వూళ్ళో లేదు. రామారావు ఒక్కడే వున్నాడు.

ఆ GROUP HOUSE కి ప్రత్యేకంగా సెక్యూరిటీ లేడు. వాచ్‌మన్ రాత్రి పూట వాకిట్లో మంచం వేసుకుని పడుకుంటూ ఉంటాడు. వాడి భార్య లక్ష్మి రోజూ దాదాపు రాత్రి 10 గంటలు వరకు మెలకువ గానే ఉంటుంది. కానీ నిన్న రాత్రి జ్వరం, తలనెప్పిగా వుండి 9 గంటలకే మందులు వేసుకుని పడుకుంది. వాచ్‌మన్ పేరుకు వున్నా, రాత్రి 9.30 తర్వాత వాడిని నమ్ముకోవడం అనవసరం. వాడొక తాగుబోతు, మంచం మీద సరిగా ఉండడు. మందు మైకంలో తూలుతూ ఒక్కొక్క సారి మంచం మీద నుండి కిందపడి ఉంటాడు.

నైట్ సెక్యూరిటీ పెట్టుకోవాలంటే అందరికీ మెయిన్‌టెనెన్సు పెరిగిపోతుంది అని అలాగే కాలక్షేపం చేస్తున్నారు. ఇప్పుడు ఈ ముసలావిడ మరణం చూసేసరికి అందరూ ఉలిక్కి పడ్డారు.

పోలీస్ వాళ్ళు వచ్చారు. క్లూస్ ఏమి దొరకలేదు. సీసీ టీవీ ఫుటేజ్ తీయించమన్నారు. ప్రెసిడెంట్ సీసీ టీవీ ఫుటేజ్ తీయించి అప్పజెప్పాడు. కానీ.. ఫ్లాట్స్ దగ్గర, కారిడార్లలో సీసీ టీవీలు పనిచేయట్లేదు, ఫుటేజ్ లేదు. ఒక్క మెయిన్ గేట్ దగ్గర మసక మసకగా ఫుటేజ్ దొరికింది. ఒక బక్క పలుచని వ్యక్తి టోపీ ధరించి రాత్రి 10.00 గంటలకి ఫ్లాట్స్ లోకి వచ్చినట్లు, 10.40 కి తాపీగా వెళ్లి పోయినట్లు వుంది. సిఐ నగేష్ అందర్నీ ప్రశ్నించాడు. ఆ సమయంలో వాళ్ళెవ్వరూ ఆ వ్యక్తిని చూడలేదని, ఎవరికి వాళ్ళు టీవీల్లో ఉన్నామనో, నిద్ర పోయమానో చెపుతున్నారు. వాచ్‌మన్ వాలకం చూస్తే వాడికి రాత్రి వేసిన మందు ఇంకా దిగినట్లు అనిపించలేదు.. వాడిని అడగడం అనవసరం అనిపించింది సిఐకి.

ప్రెసిడెంట్‌ని తదితరులని ప్రశ్నించి, వర్ధనమ్మ గారి ఫ్లాట్‌కి ఎదురు ఫ్లాట్‌లో ఉన్న రామారావుని “ఏమయినా అరుపులు వినిపించాయా?” అని అడిగాడు.

రామారావు ముందు రోజు రాత్రి తన భార్యని హైదరాబాద్ బస్సు ఎక్కించడానికి దగ్గర్లో వున్న బస్సు స్టాండ్‌కి వెళ్లానని, అప్పుడు ఆమె ఎదురు ఫ్లాట్‌లో హాల్‌లో కూర్చుని టీవీ చూస్తున్నట్లు, తన భార్యని బస్సుకి దింపి వచ్చేటప్పటికి 9.40 అయినట్లు, అప్పుడు కూడా ఆవిడ టీవీ చూస్తున్నట్లు కనిపించిందని చెప్పేడు.

రామారావుకి మరునాడు ఆఫీస్ ఇన్‌స్పెక్షన్ ఉండడంతో వచ్చీ రాగానే బెడ్‍రూమ్ లోకి వెళ్లి ఎసి వేసుకుని పడుకున్నానని చెప్పేడు. “అరుపులేవీ వినిపించలేదు” అని చెప్పేడు.

సాధారణంగా ముసలావిడ యెంత వరకూ మెలకువగా వుంటారు అని ప్రశ్నించాడు సిఐ. కానీ, తాను ఎదుటి వాళ్ళ విషయాలు అంత పట్టించుకోనని, సమాధానం ఇచ్చేడు రామారావు.

నిజానికి రామారావు గురించి తెలిసిన వాళ్ళందరూ ఈ విషయం ఒప్పుకుంటారు. వంచిన తల ఎత్తకుండా బైటకు పోయి మళ్ళీ అలాగే ఇంట్లోకి వచ్చే రకం. ఎవరినీ పలకరించడు. ఒక విధంగా reserved person. సిఐ నగేష్‌కి ఎవరి వెర్షన్ లోనూ ఏమి అనుమానం కనపడలేదు.

వర్ధనమ్మ దేహం ఉన్న తీరు గమనించాడు. వర్ధనమ్మ వెల్లకిలా పడి వుంది. ముఖం వద్ద ఆవిడ రోజు పీల్చే ఇన్‌హేలర్ ఎక్కువ మోతాదులో పీల్చినట్లు, ఊపిరాడక ఆమె మరణించినట్లు వుంది.

నగేష్‌కి ముసలావిడ వివరాలు ఇరుగుపొరుగు వారు చెప్పారు. ఆవిడకు ఇద్దరు ఆడపిల్లలు. పెళ్లిళ్లు అయిపోయాయి, ఆవిడకు భర్త పోయి చాలా ఏళ్లయింది. ఒంటరిగా ఈ ఫ్లాట్లో ఉంటుంది. అప్పుడప్పుడు కూతుళ్లు అల్లుళ్లు వచ్చిపోతూ ఉంటారని, ఒక కూతురు భీమవరంలో, రెండవ కూతురు ఖమ్మంలో ఉంటారని తెలుసుకున్నాడు.

ఆయాసానికి ఇన్‌హేలర్ వాడుతూ ఉంటుందని, నిన్న ఉదయం ఆవిడ బాగానే ఉందని రంగి చెప్పింది. పనిమనిషి ఈరోజు ఉదయం వస్తే మళ్లీ మరునాడే వచ్చేది. అందువల్ల రంగికి పూర్తిగా తెలియకపోవచ్చు అనుకున్నాడు.

ముసలావిడకి, ఎవరితో పెద్దగా మాట్లాడడం, పెత్తనాలు చేసే అలవాటు లేదు. పైగా ఆ బిల్డింగ్‌లో ఫ్లోర్‍కి రెండు ఫ్లాట్స్ మాత్రమే ఉంటాయి.

అంతకంటే ఆవిడ గురించి ఎక్కువ వివరాలు తెలియడం లేదు. శవం పక్కన టీపాయ్ మీద ఆయాసానికి, బిపి, షుగర్ మాత్రల కొత్త స్ట్రిప్స్ ఉన్నాయి. అన్నిట్లో ఒక్కొక్క మాత్ర వేసుకున్నట్లు.. సగం తాగిన మంచి నీళ్ల సీసా.. గ్లాసులు దీవాను పక్కనే ఉన్నాయి.

మధ్యాహ్నానికి కూతుళ్లు అల్లుళ్లు వచ్చారు. వారిని కూడా అనేక విధాలుగా నగేష్ ప్రశ్నించాడు. హత్య జరిగిన రోజు వాళ్ళు ఎవరు ఆమెతో ఫోన్లో మాట్లాడలేదు అన్నారు. అయితే ఒక విషయం కన్ఫర్మ్ అయింది ఆమె వంటి మీద ఒక్క నగ కూడా లేదు. అలాగే బీరువాకి తాళాలు తగిలించి ఉన్నాయి. ఆమె పిల్లలు చెప్పిన దాని ప్రకారం బీరువాలో 50 తులాల నగలు ఉండాలని, అవి కూడా లేవని తెలిసింది.

హత్య తెలుస్తోంది అని అనుకుని.. అయినా హత్య జరిగిందా లేక ఆయాసం ఎక్కువయ్యి.. హార్ట్ ఎటాక్‌తో ముసలావిడ చనిపోయాక ఎవరైనా నగలు కాజేసి ఉండొచ్చు కదా అనుకున్నాడు నగేష్.

విచిత్రంగా ఫింగర్ ప్రింట్స్ కూడా దొరకలేదు. స్నిఫ్ఫర్ డాగ్స్ వీధి చివరి వరకు వెళ్లి వచ్చేసాయి.

క్లూ లేదు.. ఇంక పోస్టుమార్టం రిపోర్టు వచ్చేదాకా ఆగక తప్పదని అనుకున్నాడు నగేష్.

నాలుగు రోజుల తర్వాత పోస్టుమార్టం రిపోర్ట్ వచ్చింది. ఆమెను ఊపిరాడకుండా చేసి మర్డర్ చేసినట్లు రిపోర్టులో అర్థం అయింది. ఇది నగల కోసం చేసిన హత్య అని తెలుస్తోంది కానీ.. హంతకుడని పట్టుకోవడం ఎలా.. ఆలోచిస్తున్నాడు నగేష్.

ఆవిడ మొబైల్ కాల్ లాగ్ పరిశీలించాడు. ఆరోజు ఆవిడ మూడు కాల్స్ మాత్రమే చేశారు. మొదటి రెండు కాల్స్ చూస్తే ఒక నెంబరు మిల్క్ బూత్ అని ఉంది, రెండవ నంబరు.. పనిమనిషి రంగిది.

మూడవ నెంబరు ఎవరిదా అని చూశాడు. అది దగ్గరలోని మెడికల్ షాప్‌ది.

ముసలావిడ వారానికి ఒకసారి రామకృష్ణ మెడికల్ షాప్‌లో మందులు తెచ్చుకుంటూ ఉంటుంది.

ఆవిడ శవం దగ్గర టేబుల్ మీద బిల్ కూడా ఉంది. మెడికల్ షాప్‌కి వెళ్లి వాకబు చేశాడు. మెడికల్ షాప్ ఓనర్ లావుగా, నల్లగా ఉన్నాడు.

విషయం చెప్పి వివరాలు అడిగాడు. అతని పేరు కృష్ణారావు అని.. ముసలావిడ తన దగ్గర రెగ్యులర్‌గా మందులు తీసుకుంటూ ఉంటారని, తన షాపులో డిస్కౌంట్‌లో మందులు ఇస్తూ ఉంటానని చెప్పేడు.

హత్య జరిగిన రోజు రాత్రి 8.30 కి ఆవిడ స్వయంగా వచ్చి మందులు తీసుకెళ్లినట్లు చెప్పాడు. అప్పుడే నగేష్ మరో ప్రశ్న వేశాడు. రాత్రి 9:15 నిమిషాలకు మీరు ఆవిడకి ఎందుకు కాల్ చేశారు అని..

“ఏం లేదు సార్, ఆవిడ వెళ్లేటప్పుడు 50 రూపాయల చిల్లర తీసుకోకుండా వెళ్లిపోయారు. అది కౌంటర్ దగ్గరే ఉండిపోయింది. తర్వాత గమనించి ఆవిడ తెలిసిన ఆమె కదా అని ఫోన్ చేసి చెప్పాను.. రేపు గాని ఎల్లుండి కానీ ఇటువైపు వచ్చేటప్పుడు తీసుకోమని చెప్పానండి” అన్నాడు.

మందుల బిల్లు, మందుల చీటీ చూసిన నగేష్‌కి అతని మాటల్లో ఏమీ తేడా కనపడలేదు.. అన్ని సరిగానే ఉన్నాయి.

స్టాఫ్ ఇద్దరు ఉంటే.. వారిని కూడా ప్రశ్నించాడు.

వాళ్లు చెప్పిన దాని ప్రకారం షాపు ఓనర్ చాలా మంచివాడు. రాత్రి 9 గంటలకు వాళ్లు వెళ్లిపోతే ఇంకో గంట ఏమైనా సేల్స్ ఉంటే చూసుకుని పది తర్వాత ఓనర్ గారు షాపు కట్టేసి వెళ్లిపోతారని చెప్పారు.

అపార్ట్‌మెంట్ ఎంట్రన్స్ దగ్గర సీసీటీవీలో కనపడిన వ్యక్తికి, షాపు ఓనర్, అక్కడ వున్న వాళ్ళేవరికీ ఏ విధమైన పోలిక లేదు.

మరో వారం గడిచింది.. నగేష్‌కి అంతుచిక్కడం లేదు.

సడెన్‌గా ఒక ఆలోచన వచ్చింది.. మెడికల్ షాప్‌కి వెళ్ళాడు.

సీసీటీవీ ఫుటేజీ చూపించమన్నాడు. సీసీటీవీ ఫుటేజీ చూపించాడు. ఆ రోజు రాత్రి 8.30 టైం కి వర్ధనమ్మ గారు మందులు తీసుకెళ్లడం కనపడింది.

రోజూ నైట్ 9 గంటల వరకే రికార్డింగ్ ఉంటున్నట్లు గమనించాడు.. అదే ప్రశ్న షాప్ అతన్ని అడిగాడు.

“మీరు 10 గంటల వరకు ఉంటారు కదా.. సీసీటీవీ ఫుటేజీ 9 గంటల వరకే ఉంటుంది ఏమిటి?” అని ప్రశ్నించాడు..

“సార్.. నా స్టాఫ్ ఉన్నది.. ఇద్దరు, వాళ్ళు 9 గంటలకి వెళ్ళిపోతారు. ఆ తర్వాత నేనొక్కడినే షాపులో ఉంటాను. ఒక గంట మొబైల్ చూసుకుంటూ గడిపేస్తాను. కస్టమర్లు ఆ సమయంలో పెద్దగా రారు. అందుకని మా స్టాప్‌ని వెళ్లేటప్పుడు కెమెరా కంట్రోల్, మరియు టీవీ స్విచెస్ కట్టెయ్యమంటాను. ఒక తలుపు కూడా వేసి ఉంచుతాను సార్” అన్నాడు. అతని సమాధానంలో నిజాయితీ ధ్వనిస్తోంది. ముఖంలో తొందరపాటు లేదు. అతను స్థిరంగా చెబుతున్నాడు.

నగేష్‌కి ఈ కేసు ఒక ఛాలెంజ్ అనిపించింది.

ఎటూ పాలు పోవట్లేదు.. ఎందుకైనా మంచిది అని.. ఇంకొక్కసారి ఫ్లాట్స్ దగ్గరికి వెళ్ళాడు. అప్పుడు సాయంత్రం నాలుగు గంటలు అయింది. వర్ధనమ్మ గారి ఫ్లాట్ తాళం వేసి ఉంది. ఎదురింటి రామారావు భార్య సువర్చల పనిమనిషి రంగితో మాట్లాడుతోంది.. ఆమె ముందు రోజు నైట్ హైదరాబాదు నుండి తిరిగి వచ్చింది. రామారావుని అడిగిన ప్రశ్న సువర్చలని కూడా అడిగాడు.

సరిగ్గా రామారావు చెప్పినట్లే చెప్పింది.. ఇంక వెనుకకు తిరుగుతూ.. ఇలా అడిగాడు – “ముసలావిడ ఎప్పుడూ రాత్రి ఎన్నింటికి పడుకుంటారు..?”

“ఆవిడ రోజూ నైట్ 8:30కే పడుకుంటారు కానీ నేను హైదరాబాద్ వెళ్లే రోజు మాత్రమే 9:15 అయినా టీవీ చూస్తూ, హాల్లో ఉన్నారు” అన్నది.

“మీరు వెళ్తూ ఆవిడతో మాట్లాడారా” అని అడిగాడు.

“హడావిడిగా మావారు బండి తీయడానికి కిందకి వెళ్ళిపోయారు.. అప్పుడు నేను వెళ్తూ వెళ్తూ గుమ్మం దగ్గరికి వచ్చి.. వెళ్ళొస్తాను పిన్నిగారు.. ఇంకా పడుకోలేదేమి?” అన్నాను.

“ఒక టాబ్లెట్ వేసుకోవాలి.. నేను కొనుకున్న మందుల్లో ఒకటి మర్చిపోయానుట, కృష్ణారావు చెప్పేడు, ఎవరయినా వచ్చే వాళ్ళుంటే పంపుతాడుట, ఆ టాబ్లెట్ కూడా పడుకునే ముందు వేసుకోవాలి అన్నారు..” అంది సువర్చల.

అంటే రామారావు సువర్చలని దింపి వచ్చేవరకు మెలకువగా ఉంది ముసలావిడ. ఆ మందు తెచ్చినవాడు ఎవడో అఘాయిత్యం చేసి ఉండాలి.

మరి కృష్ణారావు చిల్లర మరిచిపోయింది ఆవిడ అన్నాడు కదా టాబ్లెట్ గురించి చెప్పలేదు.. అనుకున్నాడు

“సరే సరేనమ్మా..” అని తిరిగి వచ్చేసాడు నగేష్. ఈవిడని ఫోన్లోనే అడిగి ఉండాల్సిందే అని మనసులో అనుకున్నాడు.

అప్పుడు కృష్ణారావు షాపుపై మఫ్టీలో నిఘా పెట్టాడు..

ఒక వారానికి క్లూ దొరికింది.. ఒక బక్కపల్చని వ్యక్తి ఆ రాత్రి 10 గంటల సమయంలో షాపులో ప్రవేశించడం గమనించాడు మఫ్టీలో ఉన్న కానిస్టేబుల్. అతను టోపీ ధరించి ఉన్నాడు.

కానిస్టేబుల్ కామ్‌గా షాప్ లోకి ప్రవేశించేసరికి ఆ వ్యక్తితో మాటలు ఆపేసాడు కృష్ణారావు.

అతన్ని ఉద్దేశించి.. “మొన్న మీరు ఇచ్చిన మందులు ఒక్కటి పనిచేయలేదు.. మా అబ్బాయికి జ్వరం తగ్గలేదు” అని దబాయింపుగా అన్నాడు మఫ్టీలో ఉన్న కానిస్టేబుల్.

కృష్ణారావుకి విసుగు వచ్చింది.. “మందులు తెచ్చారా, చూసి చెబుతాను..” అన్నాడు.

“మా తమ్ముడిని రమ్మన్నాను.. వస్తుంటాడు, 10 నిమిషాల్లో వచ్చేస్తాడు” అన్నాడు కానిస్టేబుల్.

“అయినా మరో పది నిమిషాల్లో షాపు కట్టేస్తాను” అన్నాడు కృష్ణారావు.

అది ఊహించిందే.. కానిస్టేబుల్‌కి అవకాశం దొరికింది. కొద్దిగా రేష్‌గా మాట్లాడాడు ఎందుకంటే.. అది తగాదాకి దారి తీయాలి.

కృష్ణారావుకి సపోర్ట్‌గా ఆ టోపీ వ్యక్తి కూడా అరుస్తున్నాడు.. పది నిమిషాలు గొడవ పెంచాడు కానిస్టేబుల్.

సరిగ్గా 10 నిమిషాల్లో నగేష్ జీపు అక్కడ ఆగింది, బయట కాపలా కాస్తున్న ఇంకొక కానిస్టేబుల్ కూడా లోపలికి వచ్చాడు.

జీపు ఆగడంతో టోపీ వ్యక్తి జారుకోబోయాడు కానీ, కానిస్టేబుల్ అవకాశం ఇవ్వలేదు..

నగేష్ తనదైన శైలిలో విచారించాడు.. ఆశ్చర్యపోయే నిజాలు తెలిసాయి.

కృష్ణారావుకి ఒక సైడ్ బిజినెస్ ఉంది. ఆ టోపీ వాడు కూలికి దొంగతనాలు, హత్యలు చేసేవాడు. కృష్ణారావు షాపులో ఫ్రిజ్ ప్రక్కన కప్‍బోర్డ్‌కి ఉన్న అద్దం వెనుక ఒక సీక్రెట్ అర వుంది. అందులో ఒక డైరీ దొరికింది.. ఆ డైరీలో విషయాలు ఆశ్చర్యాన్ని కలిగించాయి నగేష్‌కి. ఆ ఏరియాలో ఒంటరిగా ఉండే వయసై పోయిన మహిళల అడ్రస్లు, ఫోన్ నెంబర్స్ ఉన్నాయి.. ఆ డైరీలో. అదను చూసి వారితో మంచిగా ప్రవర్తిస్తూ, వారికి ఫోన్ చేసి ఏదో మందు మరిచిపోయారని చెప్పి ఇంటికి ఈ టోపీ వాడిని పంపిస్తాడు.

ఒంటరి మహిళల మెడలో నగలు, బీరువాలో నగదు, నగలు కొట్టుకుని రావడం వాడి పని.

కొట్టుకొచ్చిన నగలు నెమ్మదిగా తనకు తెలిసిన బంగారు నగలు చేసే పని వాళ్ళకి అమ్మడం, సొమ్ము చేసుకోవడం కృష్ణారావు యొక్క నీచ వ్యాపారం. అందుకే స్టాఫ్‌ని పంపాక ఈ చీకటి లావాదేవీలు రహస్యంగా జరుపుతున్నాడు అన్నమాట.

ఇప్పుడు కృష్ణారావు, వాడి తోడు దొంగ ఇద్దరిని కస్టడీలోకి తీసుకున్నాడు.

మర్డర్ మిస్టరీ వీడినందుకు నగేష్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here