ముసుగు

0
7

[box type=’note’ fontsize=’16’] హిందీలో శ్రీ అరిగపూడి రమేష్ చౌదరి వ్రాసిన కథని ‘ముసుగు’ పేరిట తెనుగులోకి అనువదించి అందిస్తున్నారు దాసరి శివకుమారి. [/box]

[dropcap]డా[/dropcap]క్టరు ఉపాధ్యాయగారి భార్య ఎవరో మగాడితో లేచిపోయింది. లేపుకెళ్ళిన మగాడు డాక్టరు ఉపాధ్యాయ గారి విధ్యార్థే కావటంతో అందరూ విడ్డూరంగా చెప్పుకున్నారు.

“ఆమెకేం పోయేకాలం వచ్చింది? ఉపాధ్యాయగారికింత ద్రోహం చేయటానికి ఆవిడ మనసు ఎలా ఒప్పింది? పాపం ఉపాధ్యాయి గారి పరువేం కాను” అంటూ అందరూ సానుభూతి చూపించారు.

ఉపాధ్యాయ గారి వయసు 32-35 సంవత్సరాల మధ్య వుంటుంది. అరటిపండు వలచి చేతిలో పెట్టినట్లుగా సబ్జెక్టును బోధిస్తారన్న మంచిపేరు విశ్వవిద్యాలయంలో ఉన్నది. కొంచెం మతిమరుపు ఉన్నట్లుగా కూడా కనపడతారు. బాగా తెలివితేటలూ కొంచెం పరాకు వున్న సార్ అని విద్యార్థులు వారంటే బాగా అభిమానంగానే ఉంటారు. ఆయన చదువేమో, ఆయన బోధించే తరగతులేమో అంతే. మిగతా విషయాలలోనూ పెద్దగా ఆసక్తి ఉన్నట్లు వుండదు. చూడటానికి అమాయకంగా, బాగా నిరాడంబరంగా వుంటూ తన లోకంలో తానుంటారు.

ఉపాధ్యాయగారు చదువుకోవటంలోనూ, ఉద్యోగం చేస్తూనూ ఇప్పటిదాకా కాలం గడిపారు. పెళ్ళీ, పిల్లలూ తన చదువు సంధ్యలకు ఆటంకం కల్గిస్తాయనుకున్నారేమో పెళ్ళిమాటే తలపెట్టలేదు. సాంసారిక విషయాల పట్ల ఆసక్తేమీ లేకుండా వృత్తికే అంకితమైన వ్యక్తిగా ఆయన గౌరవం మరింత పెరిగింది. ఆయన్ను గొప్ప దార్శనికుడని అంతా అనుకుంటున్నారు. దార్శనికతతో పాటు ఏది తోస్తే అది చేసే మనిషి కూడా. ఉపాధ్యాయగారి కనుముక్కు తీరు, మంచి వంటి ఛాయ, పెద్ద పెద్ద కళ్ళు, చిరునవ్వులు చిందించే వైఖరితో చూడటానికి చాలా బాగుంటారు. దార్శనికతతో పాటు ఆయన జీవితంలో యౌవన, వాసంత సమీరాలు కూడా బాగా వీచసాగినట్లున్నాయి. ఎంత సంయమనమున్న మనిషి అయినా యౌవన ప్రాంగణాన్ని ఏలేద్దామన్న కోరికతో కాబోలు ఆలస్యంగా వివాహం చేసుకున్నారు. భార్య వయస్సు 26-30 సంవత్సరాల మధ్య ఉంటుంది.

ఉపాధ్యాయగారు కొత్తగా ఇక్కడ ఉద్యోగంలో చేరిన రోజులు. తరగతి గదిలో చాలామంది యువతులు కూడా ఉన్నారు. వారిలో వాసంతి చాలా అందగత్తె. అందంతో పాటు చలాకీగా, ఆకర్షణీయంగా వుంటుంది. కొంటెతనం కాని యౌవన చాంచల్యం కాని ఆమెలో మచ్చుకైనా కనపడేవి కావు. చాలా హుందాగా మసలుకునేది. చదువుసంధ్యల్లో బాగా మెరుగ్గా వుండేది. అలాంటి వాసంతి పట్ల ఉపాధ్యాయగారు మక్కువపడ్డారు.

వాసంతికి తండ్రి లేడు. తల్లి ఏవో పనిపాటలు చేసి కుటుంబాన్ని గడుపుతున్నది. ఇంకా అదనపు ఆదాయం కావాలంటే చదువుకునే వాసంతి కూడా ఏదైనా పనిచేయటం తప్పితే మరే ఉపాయమూ లేదు. ఏ విధమైన రాబడి లేని కుటుంబమని ఉపాధ్యాయగారికి తెలిసింది. ఉపాధ్యాయగారికి మంచి జీతమే వస్తుంది. ఖర్చేమో చాలా తక్కువ. తలుచుకుంటే ఆయన ఇతరుల కోసం కొంచెం ఎక్కువే ఖర్చుబెట్టే అవకాశం వున్నది. వాసంతి పరిచయానికి ముందు కొంతమంది విద్యార్థినులకు ఆర్థిక సహాయం చేసివున్నారు. ‘విద్యార్థి కళ్యాణ యోజన చెయ్యాలని నా సంకల్పం’ అనేవారు. అలాంటిది ఇపుడు, మరీ తొందరపడి వాసంతికి ఎక్కువగా ఆర్థిక సహాయం చేయదలిస్తే అభిమానవంతురాలైన వాసంతి మనసు గాయపడుతుందేమొనని భయపడ్డారు. తన గురించీ, వాసంతి గురించీ విశ్వవిద్యాలయంలో ఏమైనా, గుసగుసలు మొదలవుతాయేమోనని కూడా భయం కలిగింది. వాసంతి తర్వాత కూడా కొంతమంది విద్యార్థినులకు నిస్సంకోచంగా ఆర్థిక సహాయం అందించారు. అయినా కూడా వాసంతి విషయంలోనే వెనకాముందు ఆలోచిస్తున్నారు. అదృష్టమో ఏమోకాని వాసంతి పేద ఇంటి పిల్ల కావడంతో ఉపాధ్యాయగారికి ఆమెకు సహాయం చేయటానికి మంచి అవకాశమే కలిగింది. అయినా కూడా ఆమెతో స్పష్టంగా మాట్లాడి ఎరగడు. తరగతి గదిలో అడుగుపెట్టి వాసంతి వంక చూడగానే విద్యుత్ ఒళ్ళంతా పాకినట్లుగా ఉలిక్కిపడేవారు. ఎప్పుడైనా ఆమె వరండాలో ఎదురుపడినా ఉపాధ్యాయగారి అడుగులు తడబడేవి. ఆమెవంక సూటిగా చూడలేక కళ్ళు కిందికి వాల్చుకునేవారు. ఉపాధ్యాయగారికి నెమ్మది నెమ్మదిగా అర్థమైనది. తను వాసంతిని కేవలం శిష్యురాలిగా మాత్రమే చూడటం లేదు. ఉపాధ్యాయగారి ఆసక్తి మరింత పెరిగింది. రాను రాను ఉత్సాహంగా వుండసాగారు. ఆమెను చూడాలని, ఆమెతో మాట్లాడాలని తపించిపోయేవారు. వాసంతినీ, ఆమె తోటి విద్యార్థినుల్నీ పిక్నిక్‍కూ, సినిమాలకూ తీసుకెళ్ళటం మొదలుపెట్టారు. ఎప్పుడూ కూడా తనలో కలిగే ఇష్టాన్ని వాసంతితో చెప్పలేకపోయేవారు.

‘తను నోరు విప్పి చెప్పనంత మాత్రాన తన చూపులూ, తన ఇష్టమూ వాసంతికి తెలియకుండా వుంటుందా? తప్పకుండా వాసంతి ఈ పాటికి గ్రహించే వుంటుంది’ అన్న నిర్ణయానికొచ్చేశారు ఉపాధ్యాయగారు.

ఎట్టకేలకు ఉపాధ్యాయ, వాసంతిల పెళ్ళి జరిగింది. ఆమె పట్ల ఎంతో ముగ్ధులారవుతూనే ఉన్నారు. వివాహం అయిన తర్వాత కూడా వాసంతి పట్ల మరింత ప్రేమ కలిగింది. ఎన్నో వివాహాలు ప్రేమ లేకుండానే జరిగిపోతాయి. అయినా ఆ తర్వాత వారి సంసారం బాగానే జరుగుతూ వుంటుంది. అలాగే తమ సంసారం కూడా బాగానే జరిగిపోతుందని భావించింది వాసంతి. ఉపాధ్యాయ గారి మతం, కులం వేరు. తన మతం, కులం వేరు. కాని ఆ ఆలోచన ఇద్దరికీ లేదు. పెద్దదయిన వాసంతి తల్లికి కూడా ఆ విషయంలో పట్టింపు లేదు. “చదువుకుని బాగా సంపాదించే వ్యక్తి అయితే చాలు. కులానిదేముంది” అనుకున్నది.

పెళ్ళినాటికి వాసంతి డిగ్రీ పూర్తయింది. పెళ్ళి కాగానే వేసవి సెలవుల్లో కొండ ప్రాంతాలకు, విహారయాత్రగా వెళ్ళారు. ఇంకా నచ్చిన ప్రదేశాలు కూడా చూసి వచ్చారు. విహారయాత్ర పూర్తికాగానే తిరిగివచ్చి మంచి వీధిలో అన్ని సౌకర్యాలూ వున్న ఇల్లు తీసుకున్నారు. రకరకాల సామాగ్రితో ఇంటిని నింపేశారు. ఆ ఇంట్లో సంపన్నత, విలాసం పోటీపడ్డాయి. వాళ్ళిద్దరూ ఎంతో అన్యోన్యతతో వున్నారని అందరూ పొగిడేవాళ్ళు. వాసంతిని సుఖపెట్టడానికి ఉపాధ్యాయగారు తన శాయశక్తులా ప్రయత్నించారు. ఆమె అడిగినవి కొన్నీ, అడగనివి కొన్నీ బట్టలూ, నగలూ, డబ్బూ సమకూర్చారు. వాళ్ళ కాపురం చూసిన వాళ్ళందరి నోటి మాట ఒకటే అయింది. “ఒకనాటి బీదరాలు వాసంతి ఇప్పుడు ఉపాధ్యాయగారి ఆరాధ్య దేవతయ్యింది” అని.

అలా మూడేళ్ళు గడిచాయి. ఇప్పుడు ఉపాధ్యాయ గారిని వదిలేసి వాసంతి వెళ్ళిపోయింది. అప్పుడు పొగిడిన వాళ్ళే ఇప్పుడు అంటున్నారు “కాని దాన్ని తీసుకొచ్చి అందలమెక్కిస్తే దాన్ని సిద్ధించుకోవటం చేతకాక ‘బెల్‍గామ్’ పారిపోయింది. కృతఘ్నురాలు” అని రకరకాలుగా ఆడిపోసుకున్నారు. ఎవరేమన్నా ఉపాధ్యాయగారు మాత్రం నోరు విప్పలేదు. ఆయన తన గురించి గాని, వాసంతి గురించి గాని ఒక్కమాట మాట్లాడలేదు.

“ఇదంతా విధి ఆడించే విచిత్రమైన ఆట. దీన్ని గురించి ఆలోచించటం, వ్యాఖ్యనించటం నాలాంటి వాడికి ఇష్టం కాదు” అన్న మాటలే మాట్లాడారు. ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఆయన తన మనసుకు లక్ష సమాధానాలు చెప్పుకున్నా ఆయన మనస్సు ముక్కలయ్యిందన్నమాట మాత్రం నిజం. ప్రేమతో ముడిబడిన మనస్సు ప్రేమ దూరంగానే విరిగిపోతుంది కదా. ఉపాధ్యాయగారి జీవితంలో కూడా ఇలాగే జరిగింది.

మనుష్యుడు ఒంటరితనాన్ని భరించలేడు. హృదయానికి దెబ్బ తగిలినప్పుడు దార్శనికులు మరింతగా వ్యాకులపడతారు. తిండి తిప్పల్లో కూడా అసౌకర్యం ఏర్పడి మరింత ఇబ్బందిపడతారు. భార్య వదిలేసి వెళ్ళడంతో మరింత విలవిలా తన్నుకుంటారు.

ఉపాధ్యాయగారు కూడా ఈ ఇబ్బందులతో కొన్ని రోజులుగా ఎలాగో నెట్టుకొచ్చారు. ఆ తర్వాత రోజులు గడవటం చాలా కష్టమైపోయింది. పుస్తక ప్రపంచంలో ఎంతవరకని తనను తాను, మరిచిపోగలరు? సినిమాకెళ్ళినా, నాటకం చూడటానికి వెళ్ళినా మనసుకు మరుపురావటం కన్నా మరింత అశాంతితో వేగిపోసాగారు. ఆ అశాంతిని తట్టుకోలేక దీర్ఘకాలిక శెలవుపెట్టి బెంగుళూరు వెళ్ళారు. అక్కడకూడా మనసంతా చీదరగానే ఉన్నది. తాను బురదలో కూరుకుపోతున్నట్లుగా భావించసాగారు. దేనిమీదా మనస్సు నిలపలేకపోతున్నారు. అంతా గందరగోళంగా తయారయింది. బెంగుళూరులో ఒక ఇల్లు తీసుకున్నారు. ఇంతకుముందులేని కొత్త అలవాట్లను చేసుకోసాగారు. సారాయి తాగి ఆ మత్తులో ఉండిపోవాలని చూస్తున్నారు. ఆ సమయంలోనే కృష్ణవేణి ఉపాధ్యాయగారి దగ్గరికి రాసాగింది. ఎవరో ఆమెనిక్కడకు తీసుకొచ్చారు. ఆమెను ఎన్నిరకాలో పరీక్షించి చూశారు ఉపాధ్యాయగారు. చిన్న వయస్సులోనే ఉన్నది. అమాయకంగా, నిదానంగా ఉన్నది. ఎవరి మోసంలోనో పడిపోయి ఆమె ఆ కాని వీధిలోకెళ్ళి పడింది. అక్కడంతా ఒళ్ళమ్ముకుని బతుకీడ్చేవాళ్ళే.

ఉపాధ్యాయగారికి కృష్ణవేణి పట్ల ప్రేమ పొంగుకొచ్చింది. ప్రేమను మించిన దయ కలిగింది. ఉపాధ్యాయగారిలో సమాజాన్ని ఉద్ధరించాలనే భావం ఉండి ఉంటుంది. ఆయనలో, విద్వత్తుతో పాటు సహృదయత కూడా ఉన్నది. కాముకత కలిగినపుడు ఇలాంటి, గుణాలు కూడా వెలుగులోకి వస్తాయని జనం నానుడి.

ప్రపంచం తనను వెలివేయాలని చూస్తున్నదని కృష్ణవేణి ఏడ్చుకుంటున్నది. ఇప్పటివరకూ తన జీవితంలో జరిగిందంతా ఎంతో అసహ్యాన్ని కల్గించేదే. ఆమె జీవితంలో పరిచయమైన ప్రజలంతా ఆమెను పూర్తిగా అణచివేశారే కాని, విముక్తి కల్గిద్దామన్న ఆలోచన కూడా చేయలేదు. ‘నాలాంటి చెడిపోయిన ఆడదాన్ని ఎవరైనా పెళ్ళి చేసుకోగలరా? పెళ్ళి చేసుకున్నవారు సమాజంలో ఎలా జీవించగలరు?’ ఇవీ కృష్ణవేణి ఆలోచనలు.

ఉపాధ్యాయగారికి అతని సమస్య అతనికున్నదని కృష్ణవేణికి తెలియదు. ఉపాధ్యాయగారిని పెళ్ళిచేసుకుని ఏ స్త్రీ అయినా ఎలా ఉండగలదు? అతని మొదటి భార్య అతణ్ణి వదిలేసి వెళ్ళిపోయిందనీ తెలియదు. అతనిప్పుడు నడి వయసువాడయ్యాడు. తనను విడిపించాలనుకుంటున్నాడని మాత్రమే భావించింది. అతడు స్త్రీ కొరకు ఆరాటపడుతున్నాడని గ్రహించలేకపోయింది.

కృష్ణవేణిని వలలో పట్టి బంధించి వుంచిన వారందరికీ ఉపాధ్యాయ గారు వాళ్లడిగినంత డబ్బు ఇచ్చి ఆమెను విడిపించారు. ఆమెను బెంగుళూరులోనే పెళ్ళి కూడా చేసుకున్నారు. పెట్టిన శలవు అయిపోగానే తిరిగి వచ్చారు. విశ్వవిద్యాలయ ప్రాంగణంలో వున్న తన బంగళాలో పూర్వపు మాదిరిగానే వుండసాగారు.

‘ఉపాధ్యాయగారిలో మరలా యవ్వన కళ తొంగిచూస్తున్నద’ని అందరూ అనుకోసాగారు. ‘కృష్ణవేణి యవ్వనవతి. ఆమెతోపాటే ఉపాధ్యాయగారు యువకులయ్యార’నీ అన్నారు.

“ఇంట్లో దీపం పెట్టేవాళ్ళు ఉండాలి కదా అందుకనీ మళ్ళీ పెళ్ళికొడుకయ్యాడు” అంటూ మరికొంతమంది వేళాకోళం చేశారు. మరికొంతమంది సానుభూతి చూపించారు. కాని ఎవరు ఎలాంటి మాటలు అనుకున్నా ఉపాధ్యాయగారు పట్టించుకునే స్థితిలో లేరు.

కృష్ణవేణి గడుసు మనసు కాదు. షికార్లు చేయాలని, విలాసంగా వుండాలని కోరుకునేది కాదు. మంచి బట్టలు కూడా అడిగేది కాదు. తనకు లభించిన పురుషుని నీడలో జీవితపర్యంతం అతని భార్యగా, భద్రంగా వుంటూ, మరెంతో కృతజ్ఞత ప్రకటిస్తూ, భర్తనే దైవ సమానంగా చూడసాగింది. దైవ సమానుడైన భర్త కాబట్టే అతనిపట్ల శృంగార భావనలు కూడా కలిగివుండేది కాదు. కేవలం మంచి గృహిణిగా మాత్రమే ఉంటున్నది.

ఈ మధ్య తరుచుగా ఉపాధ్యాయగారు బయటి ప్రయాణాలు పెట్టుకుంటున్నారు. అలా వెళ్ళినప్పుడల్లా తన బంగళాలో కృష్ణవేణికి తోడుగా ఎవరో ఒక విధ్యార్థి నుంచి వెళ్ళేవాళ్ళు. ప్రతిసారీ వేరు వేరు విద్యార్థుల నుంచేవాళ్ళు. ఆ విద్యార్థులందరూ కాలేజీలో రౌడీలుగా, ఆకతాయివాళ్ళుగా, పేరుపొందినవాళ్ళను పిలిచి మరీ ఇంట్లో వదిలి వెళ్ళేవారు. ఈ పని చూసి ఉపాధ్యాయగారిని అందరూ విమర్శించసాగారు.

“మొదటి పెళ్ళాం ఒక విద్యార్థితోనే లేచిపోయింది. అయినా ఈయనకు బుద్ధిరాలేదు. ఈవిడ కూడా ఎవరో ఒకరితో వెళ్ళిపోతే ఏం చేస్తాడు?” అని పదే పదే అనసాగారు.

ఉపాధ్యాయగారు మానవత్వం లేని మనిషి కాదు. భార్యపట్లా అతనికి మామూలు కన్నా ఎక్కువగానే సంవేదన ఉన్నది. తాను స్వయంగా ఇవ్వలేని దానినుండి భార్యను వంచించటం ఉచితం కాదని ఆలోచించసాగాడు. ఇదీ ఆయనలోని ఉదారత. గల్లీలో నుంచి వచ్చినదానికైనా సముచిత స్థానం ఇవ్వాలన్నదే ఆయన ఆలోచన.

ఉపాధ్యాయగారికి ఒంటరితనమంటే భయపడుతున్నారు. ఏం చేసి అయినా సరే కృష్ణవేణిని తన నుంచి దూరం కానివ్వదలచుకోలేదు. ఆయన భయమేమిటంటే పాత జీవితం, పాత అలవాట్లు దూరమైతే ఆమె అసంతృప్తిగా వుంటుందేమో? మళ్ళీ వాటికోసమే తననొదిలి వెళ్ళిపోతుందేమోనన్న ఆలోచన ఆయనలో సుళ్ళు తిరుగుతున్నది. తను చేసే పనులవలన చెడ్డపేరు వస్తే రానీ దాన్ని గురించి అతనికేం బాధలేదు. అతను లోలోపల బాగా తెలివిగల వ్యక్తి. ఈ విషయాలన్నింటినీ విడమర్చి చెప్పకుండానే కృష్ణవేణికి అన్నీ అందుబాటులో వుంచాలని చూస్తున్నాడు. తను ఊరినుండి రాగానే ఏం జరిగిందని కృష్ణవేణిని గాని, అటు తన విధ్యార్థులను గాని ఏమి అడిగేవాడు కాదు. తను చేసే ఈ ఏర్పాట్లతో కృష్ణవేణి సంతోషంగా వుంటుందని అతని నమ్మకం. అ నమ్మకంతోనే సంతృప్తిపడ్డాడు. కృష్ణవేణికి సుఖాన్నందిస్తున్నానని తెగ సంతోషపడసాగాడు.

ఇదే విధంగా నాలుగైదేళ్ళు గడిచాయి. కృష్ణవేణి ఇల్లు విడిచి వెళ్ళిపోయింది. వెళ్తూ వెళ్తూ ఒక ఉత్తరం వ్రాసి వెళ్ళింది. “నేను మరలా పాత జీవితాన్నే ఇష్టపడతానని మీరనుకుంటున్నారా? అందుకనే నన్ను వదిలించుకోవాలని చూస్తున్నారా? నా అస్తిత్వంలో మీ పురుషత్వానికి నేనొక గీటురాయిగా ఉంటున్నానని నాకు తెలియలేదు. మీలోని లోపాన్ని నేను భరించలేనని మీరనుకుంటున్నారు. కాని దానికి మీరు చేసే పనిని నేను సహింపలేను. క్షమించమని అడుగుతున్నాను”

ఆ తర్వాత కృష్ణవేణి నన్‌గా మారిపోయి ఓ కాన్వెంట్‍లో వుండసాగింది.

ఈసారి ఎవ్వరూ ఉపాధ్యాయగారి పట్ల సానుభూతి ప్రకటించలేదు. విద్యార్థులు బాహాటంగానే విమర్శించసాగారు “హిజ్రా అయి ఉండి గృహస్థుడుగా ఎంతకాలం ఉండగలడు” అని. ఉపాధ్యాయగారు మాత్రం తన జీవితంలోకి నిరంతరం మరో స్త్రీని ఆహ్వానించటం కోసేం అన్వేషిస్తూనే ఉన్నారు.

***

హిందీమూలం – శ్రీ అరిగపూడి రమేష్ చౌదరి

తెలుగుసేత – దాసరి శివకుమారి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here