నా అస్తిత్వం!

0
2

[అమృతా ప్రీతం రచించిన ‘పహెచాన్’ కవితని అనే అనువదించి అందిస్తున్నారు శ్రీమతి గీతాంజలి. Telugu Translation of Amrita Pritam’s poem ‘Pehchaan’ by Mrs. Geetanjali.]

~

[dropcap]ను[/dropcap]వ్వు నాకు దొరికాక
ఎన్నో జన్మలు
నా హృదయ నాడుల్లో కొట్టుకుంటూనే ఉన్నావు!
నా శ్వాస.. నీ ఊపిరిలోని మాధుర్యాన్ని
గుటకలు.. గుటకలుగా తాగింది!
చూస్తుండగానే నా నొసటి రాతల్లో..
ఎన్నో కాలాలు అలా గిర్రున తిరిగి పోయాయి!
ఇటురా., నీకో మధురమైన రహస్యం చెప్తా విను..
ఒకప్పుడో గుహ ఉండేది.. ఏం?
అక్కడ నేనూ.. ఒక యోగీ ఉండేవాళ్ళం!
ఆ యోగి నన్ను తన బాహువుల్లోకి తీసుకుని..
నా శ్వా సను సుతారంగా స్పర్శించాడా..
ఒహ్హ్ అల్లా మీదొట్టు.. ఏం చెప్పను?
ఇదే.. అవునిదే పరిమళం
అతగాడి పెదవుల నుంచి వచ్చింది!
ఏమో.. నువ్వే ఒకప్పటి ఆ యోగివేమో..
ఎవరికి తెలుసు?
నీ రూపంలో నా దగ్గరికి వచ్చాడేమో..
ఇక.. ఆమెనే.. అతగాడి ప్రియురాలినే నేనేమో..
ఇంకా., అదే పరిమళం నన్నావహిస్తూ!
నిజం.. నువ్వు దొరికాక..!

~

మూలం: అమృతా ప్రీతం

అనుసృజన: గీతాంజలి


అమృతా ప్రీతం ప్రసిద్ధ రచయిత్రి. పంజాబీ, హిందీ భాషలలో రచనలు వెలువరించారు. 20వ శతాబ్దపు ప్రముఖ కవయిత్రిగా పేరుగాంచారు. భారత-పాకిస్తాన్‍లలో సమానంగా అభిమానులున్న అమృతా ప్రీతం సుమారుగా 100 పుస్తకాలు ప్రచురించారు. వీటిలో కొన్ని ఇతర భారతీయ భాషలలోకి, విదేశీ భాషలలోకి అనువాదమయ్యాయి. ‘పింజర్’ ఆమెకు ఎంతో పేరు తెచ్చిన నవల. సాహిత్య అకాడమీ పురస్కారం పొందిన మొదటి మహిళ అమృతా ప్రీతం. 1982లో భారతీయ జ్ఞానపీఠ్ పురస్కారాన్ని పొందారు. 1969లో పద్మశ్రీ, 2004లో పద్మ విభూషణ్ పురస్కారాలు అందుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here