నా బాల్యం కతలు-1

5
9

[box type=’note’ fontsize=’16’] ‘నా బాల్యం కతలు’ అంటూ తన చిన్ననాటి ముచ్చట్లను అందిస్తున్నారు జిల్లేళ్ళ బాలాజీ. [/box]

1.శుక్రారం పూట – సేపల ఏట

[dropcap]మా[/dropcap] నాయినకు సిత్తూరు కలెట్రాపీసులో ఉజ్జోగం. అందుకని ఆపీసుకు దెగ్గిరిగా ఉండే గిరింపేటలో కాపరం పెట్టినాడు. మా ఇంట్లో… మా పిన్ని(నా సిన్నప్పుడే మా అమ్మ సచ్చిపోతే, మా నాయిన రొండో పెండ్లి జేసుకున్నాడు. ఆమే ఈ పిన్ని.) నేను, మా పెద్దక్క, మా సిన్నక్క (మా అమ్మకు పుట్టినోళ్లు) తమ్ముడూ, సెల్లెలు (మా పిన్నికి పుట్టినోళ్లు) మొత్తం ఏడు మందిమి ఉండేటోళ్లం.

మా నాయిన నన్నూ, మా సిన్నక్కనూ గిరింపేట గవురుమెంటు ఇస్కూల్లో సేర్పించె. మా సిన్నక్కను ఏడులో, నన్ను ఆరులో సేర్పించె. అప్పిటికి తమ్ముడూ, సెల్లెలు సానా సిన్నపిల్లోళ్లు. మా పెద్దక్క మాత్రం మా తాత (మా అమ్మకు నాయిన) దగ్గిర తిర్తనిలో ఉండి సదువుకుంటా ఉండె. కాబట్టి… ఇప్పుడు మా ఇంటికంతా మొగలాయిని నేనే!

సాయింత్రం ఇస్కూలు ఇడిసి పెట్టిందే, బుక్కుల సంచీని మూలన పడేసి ఒగటే ఆటలు. వొళ్లు తెలీకుండా ఆడేటోణ్ణి. యాణ్ణిండో ఒగ సైకిలు టైరును సంపాయించి రోడ్డుమింద ఒగటే తోలాటం. మా పిన్ని ఏదైనా పని జెప్పినా సెవిన ఏసుకునేటోణ్ణి కాను.

ఇట్టా నేను ఆటల్లో మునిగిపోతే… నా సదువు సంకనాకి పోతుందనీ(?) సెడిపోతాననీ(??) మా నాయిన దిగులుపడె. అందుకని మా నాయిన నన్ను ప్రవేటులో జేర్పించాలని తీర్మానం జేసినాడు.

మా ఇంటికి ఎదురుగుండానే ‘సైదా అయ్యోరు’ సెప్పే ప్రవేటు బడి ఉండె. (ఆయన అసలు పేరు – సయ్యద్ హమీద్) సందేళ అయితే ఆడికి పిలకాయలు సదూకునేదానికి వొచ్చేటోళ్లు.

ఒగరోజు మా నాయిన నన్ను తీసకపోయి ఆడ సేర్పించినాడు.

మేము సదూకునే ప్రవేటు బడి రొండు గుడిసెల్లో జరిగేవి. ముందు ఒగ పెద్ద గుడిసె. దాని తలుపు తీసుకుని ఎల్లగానే ఒక కుర్సీ, టేబులు ఉండేవి. అదే సైదా అయ్యోరు పెద్దోళ్లతో మాట్లాడే రూము.

అది దాటినాంక ఇసాలమైన ఆలు. ఆ ఆల్లో ఇనాయకుడు, సరస్వతీ, లచ్చిందేవి, ఏడుకొండలసామి, ఇట్టాంటి ముక్కెమైన దేముళ్ల ఫోటోలన్నీ ఉండేవి. అది ప్రేయర్ ఆలు. దాన్ని దాటుకుంటే ఎడమ పక్కన తొమ్మిదీ, పదీ సదూకునేటోళ్ల క్లాసులుండేవి. కుడి పక్కన ఎనిమిది, ఏడు, ఆరు క్లాసుల పిలకాయలు…. అందురూ క్లాసుల వారీగా కూసునేటోళ్లు. ఆ తర్వాత కొంచెం ఖాళీ జాగా ఉంది. దాని ఎనక ఇంకో సిన్న గుడిసె. అందులో సిన్నపిలకాయలు ఒగటి నుండి ఐదో తరగతి పిలకాయలు సదూకునేటోళ్లు. క్లాసు క్లాసుకూ మద్దెలో ఎదురు తడికలు అడ్డంగా ఉండేటివి.

సాయింత్రం అయిదున్నరకు ప్రవేటు మొదలైతే రేత్రి ఎనిమిదీ, ఎనిమిదిన్నర వరకూ జరిగేది. సిన్నపిల్లోళ్లని అర్ధగంట ముందుగానే పంపించేసేటోళ్లు. ఆదివోరం కూడా పెద్ద తరగతులకు మద్దేనం దాకా ప్రవేటు ఉండేది.

సైదా అయ్యోరు పుటకతో సాయిబే అయినా, ఆయనకు హిందూ మతమన్నా, హిందూ దేవుళ్లన్నా ఆపారమైన నమ్మకమూ, భక్తి, ఇశ్వాసాలుండేవి. అంతేకాదు పిలకాయలమైన మాకు సదువుతోపాటు, భక్తి గూడా ఉండాలని ఆశించినాడు.

అందుకని ప్రెతి శుక్రారం మాచేత సాయింత్రం పూట ‘పూజ’ సెయ్యించేటోడు.

శుక్రారం సాయంత్రం ఐదు గెంటలకు “శుక్లాం బరదరం… విష్ణుం… శెశివొర్ణం… సెతుర్ బుజం…” అంటా వినాయకుని మంత్రంతో పూజ మొదలు పెట్టి… సరస్వతి శ్లోకం, గాయిత్రీ మంత్రం, ఆంజినేయ దండకం, అన్నపూర్ణాష్టకం, అంటా సాగి.. సివరకు ఎంకటేశరసామి సుప్రబాతం “కమలా కుచ సూచుక కుంకమతో…” ముగిసేది.

పూజయినాంక టెంకాయి కొట్టి, దేవుళ్లకు ఆరతిచ్చినాంక, వరసల్లో కూసోనున్న పిల్లకాయిల దగ్గిరికి దాన్ని తీసకపోయేటోళ్లు. పిలకాయలంతా అరసేతుల్ని ఆరతికి జూపించి కండ్లకద్దుకునేటోళ్లు. ఆ తర్వాత టెంకాయినీ, అంటిపొండునీ సిన్నసిన్న ముక్కలుగా కోసి అందరికీ ప్రెసాదంగా పంచేటోళ్లు. ఇదంతా పూర్తయ్యేసరికి ఆరూ ఆరున్నర అయ్యేది.

దాంతో శుక్రారం అయితే మాకందరికీ కుశాలగా, ఆట ఇడుపుగా ఉండేది. పెద్దక్లాసు పిలకాయలు ప్రార్థన సేస్తా మంత్రాలు, శ్లోకాలు సదవతా ఉంటే… మిగతా పిలకాయలంతా ఫాలోయింగ్ అయ్యేటోళ్లు. పిలకాయలంతా ప్రార్థనకని ఒక నోటుబుక్కు పెట్టి సుబ్బరంగా ఆటినంతా గుండ్రటి అచ్చరాల్తో రాసి పెట్టుకునేటోళ్లు.

ఇట్టా శుక్రారం పూట పూజ జరిగే సమయాల్లో… కొందరు పిలకాయలు ప్రవేటు ఎగ్గొట్టి ఊరు తిరిగొచ్చేటోళ్లు. సరిగ్గా పూజ ముగిసే సమయానికి… పిల్లుల్లాగా అడుగులో అడుగులేస్తా… సందులో నుండి నైసుగా జొరబడి గుంపు సివర్లో సేరిపోయి పూజజేసేటోళ్ళలాగా సేతులు జోడించి కూసునేటోళ్లు.

రాన్రానూ శుక్రారం పూట జరిగే పూజకు చానామంది పిలకాయలు డుప్కీ గొట్టేందుకు మళ్లినారు.

ఒకసారి వానలు బాగా కురిసి, దుర్గమ్మ గుడి ఎనకనుండే కాలవలో నిండుగా నీళ్లు పార్తా ఉండాది. ఆ కాలవలోకి దిగి నాలుగు వొంపులు తిరిగి, ఎగవకు పోతే ముండ్లపొదలు, తుప్పలు బాగా పెరిగిపోయి కనిపిస్తాది. దాని కాడికిపోతే కాలవ బాగా సాగి వొంక కనిపిస్తాది. ఆ వొంకలో సేపలు పట్టేటోళ్లు ఎక్కువైపోయినారు ఈ మద్దెన.

ఒక శుక్రారం… పూజ ఎగ్గొట్టే ఆలోసనతో వేనుగోపాల్ (నా దోస్త్) నాకాడికొచ్చి… “ఒరే బాలా, ఈ దినిం దుర్గమ్మగుడి కాడుండే వొంకలో మనం సేపలు పడదామా రా…” అన్నాడు.

“అమ్మో, నేను రాన్రా నాయినా. నాకు బయ్యిం. ఈ విషయంగానీ సైదా అయ్యోరికి తెలిసిందంటే ఇంక అంతే! ఈపు సాపు అయిపోతింది తెలుసుకో. నేను రాన్రా…” అన్నాను బయపడతా.

“పోరా అదురు నా కొడకా, నీకెప్పుడూ బయిమే. సైదా అయ్యోరికి తెలీకుండా సేపలు పడదాం రా. ప్రవేట్‌లో పూజ అయిపోయే లోపల మళ్లి తిరిగొచ్చేస్తాం. ఏమీ తెలియనట్టుగా మిగతా పిలకాయల్తో పాటు నైసుగా సేరిపోయి కూసునేస్తాం, ఏమంటావ్?…” అన్నాడు వాడు నన్ను ఊరిస్తా.

“అయినా నేను రాన్రా… నాకు బయ్యిం …” అన్నాను మళ్లీ.

“నాతోపాటు సెంద్ర, కిష్ణమూర్తి, మణి కూడా వొస్తామనుండారు. నువ్వూ వొస్తే నాతో కలుపుకుని ఐదుమందిమి అయితాము. మస్తుగా సేపలు పట్టొచ్చు.” నాలో ఆశలు కలిగించినాడు వేనుగోపాల్.

“నిజ్జింగా వాళ్లుగూడా వొస్తామన్నారా రా….”

“ఔన్రా, నిజ్జింగా వొస్తామన్నారు. సాయంత్రం నాలుగున్నరకు గుడికాడుండే రాగిమాను కాడ కలుసుకుంటామన్నారు.”

అయినా నాకు బయంగానే ఉండాది. ఈ విషయంగానీ సైదా అయ్యోరికి తెలిసిందంటే… తోలు తీసేస్తాడు.

కానీ నేనెప్పుడూ ఏట్లోగానీ, సెరువులోగానీ సేపలు పట్టింది లేదు. అందుకనీ నా మణుసు కూడా సేపలు పట్టేందుకే మొగ్గు జూపిస్తా ఉండాది.

అనుకున్నట్టే ఆ సాయంత్రం ప్రవేటులో పూజ మొదలయ్యే సమయానికి మేము రాగిమాను కాడ కలుసుకుంటిమి.

అటు ఇటు సూసుకుంటా… కాలవలోకి దిగి వొంక కాడికి పోతిమి. వొంక నిండా నీళ్లు కనిపించే కొందికి మాకు బలే ఉశారొచ్చేసింది. నీళ్లల్లోకి దిగి ఒకరిమిందఒకరు నీళ్లు సల్లుకున్నాము.

అక్కడ మస్తుగా సేపలు దొరుకుతాయని ఆశ పడితిమి.

పాదాలకాడికి పారే నీళ్లల్లో నిలబడి… తెచ్చుకున్న పంచెను నేనూ సెంద్ర సెరొక పక్కా పట్టుకొని నీళ్లల్లో ముంచి అలాగా పైకెత్తితిమి. ఆ పంచిలో రొండు సేప పిల్లలు గిలగిల కొట్టుకుంటా కనిపించె. మణిగాడు ఆ సేపల్ని పట్టుకుని ఒక బాటిల్లో ఏసుకునే. వేనుగోపాల్, కిష్ణమూర్తీ కొంచెం దూరంలో మాకన్నా ఎగవన సేపలు పట్టేదానికి మళ్లిరి. సేపలు దొరికే కొద్దీ మాకు చానాకుశాలగా ఉండే. అప్పుడప్పుడూ మమ్మల్నెవురైనా సూస్తాండరేమోనని ఎచ్చరికలు సెప్పుకుంటా ఉండాము.

మేమొచ్చి ఒక గంట అయ్యింటుంది. ఉన్నట్టుండి మణిగాడు… “వొరేయ్ అయ్యోర్రా…” అని గెట్టిగా అరిసె.

గబుక్కున తల తిప్పి జూస్తి. సైదా అయ్యోరు మాకల్లా వొస్తా ఉండాడు. అంతే, గబుక్కున అయిదుమందిమీ కాలవలోనే వొంకోని కూసింటిమి. ఎగవనున్న వేనుగోపాల్‌నూ, కిష్ణమూర్తిని పైకి లెయ్యకుండా దగ్గరికి రమ్మని సైగ చేసిమి. వాళ్లు నీళ్లలోనే దోగాడతా మా కాడికొచ్చిరి.

“వొరేయ్, అయ్యోరు ఈడికి వొచ్చుండాడంటే, మనకోసమేనంటావా?” అన్నాను నేను అదురుకుంటా.

“నీ యబ్బా, అదురు నాయాలా, మనకోసం ఎందుకొస్తాడ్రా. బయిటికి (దొడ్డికి)పొయ్యేదానికి అయ్యోరు ఈడికే గదా రోజూ వొచ్చేది. ఆ పనిమిందే వొచ్చుంటాడు. అయిదు నిమిషాలు ఎవురూ పైకి లెయ్యమాకండి. అయ్యోరు వొచ్చిన పని పూర్తిజేసుకుని ఎల్లిపోతాడు. ఆ తర్వాత మనం ఎల్లచ్చు…” అన్నాడు వేనుగోపాల్.

“కంత్రీ నాయాలు. ఇదంతా వీడి వొల్లే వొచ్చింది. వొద్దురా అంటే నన్ను బలింతంగా ఈడికి పిల్చకొచ్చినాడు.” అని వేనుగోపాల్‌ను చూసి గొణుక్కోసాగినాను.

కొంచేపయినాంక మణిగాడు తల పైకెత్తి జూసి… “వొరే, అయ్యోరు కనిపించటం లేదురా… ప్రవేటు కాడికి పూడ్సినట్టుండాడు…” అన్నాడు ఆనందపడిపోతా. ,

“అయినా మనం ఇప్పుడే పైకి లెయ్యగూడదు. అయ్యోరు యాడో దూరంగా ఉండి మనల్ని జూస్తా ఉంటాడు. అందుకని ఈ కాలవలోనే ఇంకొంచెం దూరం దోగాడతా ముందుకుపోయి, ఆడ పైకిలేసి పారిపోదాం. ఏమంటార్రా…” అని సలహా ఇచ్చినాడు వేనుగోపాల్. సరేనంటిమి మేం నలుగురుమూ.

ముందు వేనుగోపాల్, తర్వాత కిష్ణమూర్తీ, వాడెనక నేనూ, నా ఎనక సెంద్ర, సివర్న మణీ… ఇట్టా మేమందరం వరసగా నీళ్లల్లోనే అరిసేతులూ, మోకాళ్ల మీదనే దోగాడతా కాలవలోనే కొంచిం దూరం ముందుకు పోతిమి. మొదటి వొంపు వరకూ జాగర్తగా ముందుకు పోతిమి. ఎడమవైపు వొంపు తిరిగినాంక ఉన్నెట్టుండి లైను నిల్సిపోయింది. ముందుకు కదల్లేదు.

‘పోరా ముందుకు…’ అన్నట్టు ముందున్నవాడి ముడ్డిని తలతో పొడిస్తిని. వాడు వాడి ముందున్నవాడి ముడ్డిని పొడిసినాడు. ఇట్టా అందురూ పొడుసుకున్నాక అందరికన్నా ముందున్న వేనుగోపాలుకు కాలవకు అడ్డంగా ఎవురివో రెండు కాళ్లు కనిపించినాయి. ఎవురబ్బా ఈ మసిసి? అని తల పైకెత్తి జూసినాడు. నడుమ్మీద సేతులు పెట్టుకోని యమధరమరాజు లాగా నిలబడుండాడు సైదా అయ్యోరు.

“వన్…” అంటా వాడికేసి వేలు చూపిస్తా పైకిలెయ్యమన్నాడు. వాడు పైకిలెయ్యగానే, వెళ్లి వాణ్ణి గట్టుమీది నిలబడమన్నాడు. వాడు అట్టే వెళ్లి నిలబడినాడు.

ఎనకున్న కిష్ణమూర్తి ఈసారి తల పైకెత్తి చూసినాడు. “టూ…” అంటా అయ్యోరు వాణ్ణి పైకిలేసి పక్కన నిలబడమన్నానాడు.

ఈసారి నా ఎనకున్నోడు ముందుకు పదమని తలతో పొడిసినాడు. అప్పుడు నేను తల పైకెత్తితిని.

నేను “త్రీ…” నా ఎనక “ఫోర్” సివరిగా ‘ఫైవ్…” అట్టా అందరమూ దొరికిపోయి గట్టుమీద తలలొంచుకోని నిలబడితిమి.

“ఇంకా ఎంతమంది ఉన్నార్రా…” అంటా గెట్టిగా అడిగినాడు సైదా అయ్యోరు.

“ఇంకెవురూ లేరు సార్, మేము ఐదుమందిమే!…” ధైర్నంగా అన్నాడు వేనుగోపాల్.

“మీ అయిదుగురూ నేరుగా ప్రవేటుకాడికి పదండి. ఎనకనే వస్తా…” అని చెప్పి అయ్యోరు మరుగుకు పాయె.

నాకు కాళ్లూ సేతులూ అదురెత్తుకునే. ఏడుపెత్తుకుంటిని.

“ఏడుపాపు రా బెదురు నా కొడకా. ముందు ఈడ నుండి ప్రవేటుకాడికి పొదాం పదండి…” అన్నాడు కిష్ణమూర్తి.

“ఈ దినం మన టైమ్ బాగాలేదు, పాండి!” అని ముందు కదిలినాడు వేనుగోపాలు.

ఏడస్తానే బయలుదేరితిని నేను. ప్రవేటు కాడికి పొయ్యి పూజలో కలుసుకుంటిమి.

పదినిమిసాల్లోనే అయ్యోరొచ్చె. పూజంతా ముగిసి, ప్రాసాదం పంచినాంక హాలు మద్దెలో కుర్చీ ఏసుకుని అయ్యోరు కూసున్నాడు. ఎవురో అయ్యోరు సేతికి కానగ బెత్తం తెచ్చిచ్చినారు. దాన్ని సూసే కొందికి నాకు కండ్లు గిర్రున తిరిగె.

“శుక్రారం అయితే పూజకు పిలకాయలు తగ్గిపోతా ఉండారేందబ్బా? ఏమైపోతా ఉండారు? యాడికి పోతా ఉండారు? అని ఆలోసించి, ఈ రోజు అనుమానమొచ్చి వొంక కాడికి పోతిని. చూద్దును కదా! మన పిలకాయలు ఉషారుగా సేపలు పడతా ఉండారు. ఆడ వునింది ఎవురనుకున్నారు?…” అని మాటలాపి అందరి కల్లా జూసినాడు అయ్యోరు.

మేము అయిదుగురమూ ఒగరు మొకాలు ఒగరు జూసుకున్నాము.

“పంచ పాండవులు. వాళ్లెవురో లెయ్యండ్రా …” అన్నాడు. మేము లేసేదానికి పాలుమారితిమి. పైకి లెయ్యలేదు.

“నాకు తెల్సురా వాళ్లెవురో?… మీరుగా లేస్తే సరేసరి, లేకపోతే మీకు డబుల్ కోటా…” అంటా “వన్…” అన్నాడు. వేనుగోపాల్ టకామని లేసి నిలబడినాడు. “టూ…” అనగానే కిష్ణమూర్తీ… త్రీ అనగానే నేనూ అట్టా అందరమూ లేసి నిలబడితిమి. మమ్మల్ని ఒకొకర్నిగా దగ్గరికి రమ్మని పిలిసి ఈపు ఇమానం మోగించినాడు అయ్యోరు.

“సార్… నేను వేనుగోపాల్ రమ్మంటే పొయ్‌నాను సార్… నేనుగా పోలేదు సార్…” అంటి నేను అదురుకుంటా.

“వాడు రమ్మంటే పొయ్‌నావా? నీకు బుద్ధిలేదా… వాడు గడ్డి తినమంటే తింటావా, ఏమి?” అని ఇంగ రెండు దెబ్బలు పీకె. దాంతో నేను కుయ్యో మొర్రో అంటి. అదే… నేను సైదా అయ్యోరు దగ్గర తిన్న తొలీ దెబ్బలు.

ఆ దెబ్బలకు నాకు ఆ రేత్రి జొరమే వొచ్చేసే! దాంతో ప్రవేటుకు నేను నాలుగు దినాలు నామం ఏస్తిని!!

(మళ్ళీ కలుద్దాం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here