నా బాల్యం కతలు-14

0
9

[box type=’note’ fontsize=’16’] ‘నా బాల్యం కతలు’ అంటూ తన చిన్ననాటి ముచ్చట్లను అందిస్తున్నారు జిల్లేళ్ళ బాలాజీ. [/box]

14. ముత్తెమంత ముద్దు

[dropcap]ఆ[/dropcap] సమ్మచ్చరం వొయ్యాసి నెలకంటే ముందుగాల్నే ద్రౌపతమ్మ తిరణాల జరిగే తేదీల్ని నిర్ణయించిరి. మా ఊళ్లో ద్రౌపతమ్మ తిరణాల పద్దెనిమిది దినాలు జరగతాది. తిరణాల బలే బెమ్మాండంగా జరిగితింది. మొదటిదినం కొడి ఎక్కినకాడి నిండి, కడాదినం అగ్గి తొక్కేటంత దాకా తిరణాల మా జోరుగా సాగితింది. పలానా దినాన అగ్గి తొక్కతారనీ, మిగతా దినాల్లో అమ్మోరికి ఏయే ఏసకాలు ఏస్తారో అయ్యన్నీ విలావరిగా ఉండే వాల్‌పోస్టర్లను ఊరంతా గోడలకు అంటించేసినారు.

మా తిర్తనే కాదు, ఆ సుట్టుపక్కలుండే నాసికుప్పం, కుమారకుప్పం, పందికుప్పం, వేలంజేరి, వినాయకపురం, కాతికాపురం, కన్నికాపురం, ఎగవపేట మొదలైన ఊళ్లల్లో ఉండే జనాలు కూడా ఈ ద్రౌపతమ్మ తిరణాలను బలే ఏడుకగా జరుపుకుంటారు. ఆయా ఊళ్లల్లో ఉండేటోళ్లంతా తిరణాల్లో అమ్మోరికి బత్తితో కాపు(కంకణం) కట్టుకుంటారు.

తిరణాల జరిగినన్ని దినాలూ ద్రౌపతమ్మ గుడికాడ పొగులు పూట కత(భారతం) చెబతారు. రేత్రికి కూత్తు(ఈదినాటకం) ఆడతారు. రేత్రి పదింటికాడ కూత్తు మొదలయ్యిందంటే తెల్లారేంత వొరకూ అది కొనసాగితింది. పొగులు బారతంలో ఏదైతే కత జెప్తారో, దానికి సంబందించిన ఏసకాలతోటే రేత్రిళ్లు కూత్తు జరగతాది. భీముడు, అరుజునుడు, ద్రౌపతి, కరునుడు, దుర్యోదనుడు, బకాసురుడు ఇట్టాంటి ఏసకాలతో జనాలకు బారతం అర్ధమయ్యేటట్టుగా నాటకమాడతారు. దాన్ని సూసేటందుకు సుట్టుపక్కలుండే గ్రామాల్లో నుండి తండోపతండాలుగా జనాలు ద్రౌపతమ్మ గుడికాడికి జేరుకుంటారు. దాన్ని ఆసక్తిగా తిలకిస్తారు.

ఒగపక్కన ఈదినాటకం జెరగతా ఉంటే, ఇంగోపక్కన అమ్మోరు ఊరేగింపుగా ఈదల్లోకి వొస్తింది. అమ్మోరు గుడికాడ రేత్రి ఏ పదిన్నరకో బయిలుదేరితే, మేముండే పెద్దీదికి వొచ్చేకొందికి ఏ అద్దరాత్రో అపరాత్రో అయిపోతింది. ఒగోసూరి తెల్లారిగూడా అయిపోతింది. అయినా అమ్మోరు ఈదిలోకి అడుగు పెడతా ఉందంటే, ఆండోళ్లు వోళ్లవోళ్ల ఇంటి ముందల నీళ్లు జల్లి ముగ్గేసి, ఆరతి తట్టతో తయారుగా ఉంటారు. తమ ఇంటి ముందుకొచ్చిన అమ్మోరిని ఆనందంగా దర్శనం జేసుకుంటారు.

ప్రెతి సమచ్చరం మా పెదనాయిన, మా సుందర మామ, గణేశన్న, మూర్తన్న ఇంగా మా ఈదిలో ఉండే చానామంది అమ్మోరికి కాపు కడతారు. తిరణాల జరిగినన్ని దినాలు యాడ జూసినా పసుపు గుడ్డలు కట్టుకోని కాపు కట్టినోళ్లే కనిపిస్తారు.

గుళ్లో అమ్మోరి ముందు అలుగు(కుండలో కత్తిని నిలబెట్టటం) నిలబెట్టినాంకే బక్తులకు కాపు కట్టటం మొదలుపెడతారు. కాపు కట్టుకోవాలంటే తెల్లార్లో లేసి తలంటి నీళ్లుబోసుకోని, ఏమీ తినకుండా, ఒక తట్టలో పసుపు నీళ్లలో ముంచి ఆరబెట్టిన పంచి, తువ్వాలు(ఆండోళ్లయితే చీరా, రైక) టెంకాయి, అంటిపండు, కర్పూరం, ఊదొత్తులు బెట్టుకోని గుడికాడికి బోతే, అయ్యోరు మంత్రాలు జెప్పి, పసుపు గుడ్డలు కట్టుకోని రమ్మనిజెప్పి సేతికి కాపు(కంకణం) కడతాడు. ఆనక టెంకాయ కొట్టి, అమ్మోరికి కర్పూరం ఆరతిస్తాడు. దాంతో ఆ బక్తుడు కాపు కట్టుకున్నట్టు లెక్క.

తిరణాల జరిగినన్ని దినాలూ పసుపు గుడ్డలు ఏసుకోటం మాత్రం మరిసిపోకూడదు. రోజూ తెల్లార్లో సన్నీళ్లు బోసుకోని, ఆ గుడ్డల్నే నీళ్లల్లో తడిపి ఆరబెట్టి మళ్లా కట్టుకోవాల. తెల్లారీ, సాయింత్రం రొండు పూటలా గుడికి పోవాల. ఇంట్లోపలికి పోగూడదు. ఇంటి బయటే నిద్ర. నేలమిందే పండుకోవాల. నీసు గీసు ముట్టగూడదు. పొగ, సారాయిలాంటివి తాగకూడదు. తప్పు జరిగితే అమ్మోరికి కోపమొచ్చి నిప్పుతొక్కే దినాన ఏదైనా జరగరానిది జరుగుతుందని ఒగ గెట్టి నమ్మకం.

శుక్రోరం దినం బాగుండాదని మాతాత ఆ సమ్మచ్చరం నాకు కూడా కాపు కట్టించినాడు. కాపు గట్టుకోని ఇంటికాడికి వొచ్చినాము. పసుపు గుడ్డల్లో ఉండే నన్ను జూసి మా తాత సేతులు జోడించి బక్తితో అమ్మోరికి మొక్కుకుండే.

అప్పిటినిండి నన్ను బక్తితో సూడబట్టిరి. కాపు గట్టిన నాకు ఏ పనీ సెప్పకపోయేకొందికి బలే మజాగా అనిపించె.

ఆ దినమే అగ్గి తిరణాల! బారతంలో… బీముడు, దుశ్శాసనుణ్ణి సంపి ఆడి రత్తాన్ని ద్రౌపతి తలకు పూసినాకే ఆమె తన తలెంటికల్ని ముడేసింది. అది ఆమె సాదించిన ఇజియం. తన ప్రెతిజ్ఞను నిలబెట్టుకునింది. తాను ఇసిరిన సవాలులో గెలిసింది. ఆ ఇజియానికి గుర్తుగా కడా దినం కాపు కట్టినోళ్లంతా అగ్గి తొక్కతారు.

ఆ దినం తెల్లారినిండే గుడి ముందుండే అగ్నిగుండాన్ని రెడీ జేస్తారు. లావులావు కట్టెల్ని తెచ్చి గుండంలో ఏసి, నిప్పు రాజేస్తారు. అవి కణకణమని కాలి నిప్పుకణాల మింద బూడిద కమ్ముకోనుంటాది. సాయంత్రానికల్లా రెడీ అయితాది.

మద్దేనంపైన రొండుగంటలకాడ… “ఇదో మునిలచ్చిమీ… ఈడికి నీల్లుబోసి ఒంటికట్టా సందనం పుయ్యీ! ఇప్పుడే వొస్తా. పూలు దొరికేటట్టులేదు. ఇడిపూలన్నా తెచ్చి మాల గడితే కదా ఈడి మెళ్లో ఏసేదానికి. లేపోతే బిసిరోమని ఏంబాగుంటిది బిడ్డకు!” అని మా పెద్దమ్మ మా అత్తతో జెప్పి సక్కా పోయింది.

అంతే! నా గుండె జల్లుమనింది. నాకు దినామూ మా పెద్దమ్మే నీల్లు బోసింది. ఇప్పుడు మా అత్త దెగ్గిర నీల్లు బోసుకోవాలంటే సిగ్గుగా ఉండాది.

ఈదిలోకి నీల్ల బకిట్టు తెచ్చిపెట్టి, పీటమీద కూసోని నన్ను రమ్మని పిలిసింది మా యత్త.

నేను నిక్కరుతోటే పొయ్ మా యత్త ముందు నిలబడితిని. నన్ను ఎగాదిగా జూసి “గుడ్డలిప్పరా…” అనింది. “ఊహూ… అట్నే పొయ్యి…” అంటిని. “నిక్కరుతో నీళ్లు పోసుకునేది ఎప్పటినుండిరా! ముందిదిప్పూ…” అంటా నేను వొద్దంటున్నా ఇనకుండా బలింతంగా నా నిక్కరు ఇప్పేసింది. నేను ఠకీమని ముందర సేతులు అడ్డం పెట్టుకుంటి. “ఓయబ్బో… పేద్ద మొగోడయిపోయినట్టు! మూతిమింద మీసాలొస్తే అప్పుడు మూసుకుందువులేగానీ తియ్యి…” అంటా నా సేతుల్ని ఇసురుగా పక్కలకు తీసి ఒళ్లంతా రుద్ది సుబ్బరంగా తానం జేయించింది. నేను గాన మల్లా మా అత్తముందు తలెత్తింటే ఒట్టు!

నాలాగానే కాపుకట్టినోల్లు ఇండ్లకాడ, బావల్లో, గుంటల్లో తానంజేసి, ఒళ్లంతా సందనం పూసుకుంటారు. మెళ్లో పూలమాల ఏసుకుంటారు. మణికట్లకు పూలు సుట్టుకుంటారు. పెద్దాళ్లకన్నా పిలకాయిలకే బాగా అందంగా అలంకరణ జేస్తారు. తలకు కొప్పులేసి కొప్పు సుట్టూ పూలు సుడతారు. ముందు భాగంలో ఇంటూ ఆకారంలో రొండు పూలమాలల్ని ఏసుకుంటారు. అది సూసేదానికి ఎంతో అందంగా ఉంటింది. ఇట్టా ఒక్కొక్కరు ఒక్కో రకంగా అలంకరించుకుంటారు.

అలంకరణ పూర్తయిన తర్వాత కాపు గట్టినోళ్లంతా ఏటికాడికి సేరుకుంటారు. ఆడ గెరిగ కోసం ఎదురుసూడాలన్నమాట. కాపు కట్టినోళ్లంతా రకరకాలుగా అలంకరించుకోని ఏటి కాడికి పోతా ఉంటే సూసేదానికి రొండు కండ్లూ సాలవనుకో.

ద్రౌపతమ్మ గుడికాడ గెరిగ బయలుదేరిందని తెలిపేటందుకు ఆకాశంలోకి రాకెట్లు వొదలతారు. మందుగుండు పేలస్తారు. దాంతో గుడికాడ నుండి పోతురాజు, గెరిగ, గొడుగు కింద అమ్మోరు బయలుదేరి ఏటికాడికి వొస్తారు. అప్పటికే తయారుగా ఉన్న బక్తుల్ని ఎంటబెట్టుకుని అమ్మోరు గుడికాడికి బయలుదేరుతుంది. అప్పుడు మళ్లా ఆకాశంలోకి రాకెట్లు వొదలతారు. అది బక్తులు బయలుదేరారనటానికి సూచన. అమ్మోరు ముందూ, ఎనకనే బక్తులూ బయలుదేరుతారు. మా సుందరమామ, గణేశన్న, మూర్తన్న సెయ్యి బట్టుకోని నేను పెద్దీది ఇనాయకుడి గుడి కాడుండి సివర్న గుంపులో కలుసుకున్నాం.

అమ్మోరు అగ్నిగుండం ఎదురుగా పొయ్ నిలబడుతుంది. అప్పుడు అమ్మోరుకు ఒడి(కొంగున నిప్పులుపోసి ముడేస్తారు) గడ్తారు. అప్పటినిండి మొదలైతుంది అగ్గితొక్కటం. మగోళ్లు గుండంలోకి దిగి పరిగెత్తతారు. కొందరు నిదానంగా నడస్తారు. కొందరు బిడ్డల్ని ఎత్తుకోని పరుగులు తీస్తారు. గుడి మనుసులు గుండం సుట్టూ నిలబడుకోనుంటారు. ఎవురైనా కాలు జారి గుండంలో పడిపోతే, ఎంటనే ఈళ్లు వాళ్లను పక్కకు తీస్కొచ్చేస్తారు. ఒక అరగంట మగోళ్లు నిప్పు తొక్కినాంక ఆండోళ్లను పంపిస్తారు. వోళల్లో కొందురు అగ్గి తొక్కితే, ఇంకొందురు అగ్ని గుండం సుట్టూ తిరగతారు. కొంచేపు అయినాంక మళ్లా మొగోళ్లను పంపిస్తారు. ఇట్టా గంటా గంటన్నర సమయం పడుతుంది అందరూ అగ్గి తొక్కటం పూర్తిచేసేటందుకు.

ఎవరైతే అగ్గి తొక్కేస్తారో వాళ్లు నేరుగా గుళ్లోకి పొయ్యి అమ్మోరిని దర్సనం జేసుకుంటారు. వాళ్లు గుడినిండి బయిటికి రాగానే వాల్ల బందుగులు చెంబుల్లో మజ్జిగ, టెంకాయినీల్లు ఇట్టాంటియన్నీ తయారుగా పెట్టుకోనుంటారు. బక్తులు గుళ్లోనుండి బయటికి రాగానే వాళ్లకు దాన్ని అందిస్తారు. వాల్లు దాన్ని సల్లగా తాగుతారు. ఆనక కంకణాన్ని ఇప్పేయవొచ్చు.

ఆ దినం ఎంతో జాగర్తగా మేము అగ్గి తొక్కి ఇల్లు జేరుకున్నాము. అలుపుతో నేను ఎంటనే నిద్దరలోకి జారుకుంటిని. అట్టా ఎంచేసు గడిసిందో నాకు తెలీదు.

“వొరేయ్ లే లే లే… దేవుడొస్తా ఉండాడు సూడూ…” అని మా పెద్దనాయిన నా నిద్దర్ని సెడగొట్టినాడు. ఊ… అని అన్నానే గానీ, లెయ్యలేదు. తిన్నెమింద పండుకోని మంచి నిద్దరలో ఉండా. మేళం సబ్దం యాడ్నో దూరంగా ఇనిపిస్తా ఉండాది. ముందుగా టపాసులు కాలస్తా వొచ్చినారు. ఆ సబ్దాలకు చానామంది లేసి కూసున్నారు. “లెయ్యిరా, లేసి కూసో….” అంటా మా పెద్దమ్మ నన్ను లేపి కూసోబెట్టింది. పదిమంది పెట్రమాస్ లైట్లు తలమింద పెట్టుకోని మా ఈదిలోకొచ్చినారు.

వోళ్ల ఎనకనే బుట్టబొమ్మలు వొచ్చినాయి. ఒక ఆడా, ఒక మొగా. అమ్మో… ఎంతెంత పెద్దగా ఉండాయో? ఆడబొమ్మకు మోకాటిదాకా పావడా, మోజేతి దాకా సిలుకు రైకా, మూతి నిండా పొగడ్రూ, కంటికి కాటికా పెట్టుకొని, వొంటినిండా జిగేల్ జిగేల్మనే నగలతో సింగారించుకోని, రొండు సేతుల్నీ నడుమ్మీద పెట్టుకోని… బలే బాగుండాది ఆడబొమ్మ.

ఆ బొమ్మలు కొండూ అట్టా ఇట్టా ఊగతా, గిరగిరా తిరగతా, జనాల్ని ఉసారెక్కిస్తా ఉండాయి. తిన్నెమింద కూసోని నేను కునికిపాట్లు పడతా ఉండాను. తూగతా తూగతా పక్కనుండే వోళ్లమింద వాలిపోతా ఉండాను.

దూరంనిండి నన్నూ, నా తూగునూ, నిద్దరనీ గెమనించి అడుగులో అడుగేస్తా దగ్గరికొచ్చింది ఆ ఆడబొమ్మ.

నా దెగ్గిరిగా నిలబడి… బాగా ముందుకు వొంగి… నా ముకంలోకి ముకం పెట్టి నా పెదాల్ని ముద్దాడింది ఆ ఆడబొమ్మ. దాంతో నేను కండ్లు తెరిసి జూసి కెవ్వుమంటా అరిసి ఎనక్కు ఇసరక పడిపోయినాను.

అది జూసి చానామంది పకపకామని నవ్వినారు. పిల్లకాయిలు బలేబటే మంటా సప్పట్లు కొట్టినారు.

“అయ్య, బాలడికి ఆ ఆండది ముద్దు పెట్టింది, ముద్దు పెట్టింది.” అంటా అందురూ నవ్వుకోసాగినారు. మా పెద్దమ్మ పరుగు పరుగున వొచ్చి నన్ను లేపి ఇంట్లోకి తీసకపోయింది. ఆ రేత్రి నాకు జొరం పట్టుకునేసింది.

మర్నాడు “ఎట్టుండాది సాయిత్రీ బిడ్డికి?” అని మా పెద్దమ్మను అడగతా ఇంట్లో పలికొచ్చింది మా అత్త.

“ఏంది మునిలచ్చిమి, అంత పెద్ద ఆడది ఉన్నట్టుండి అట్టా బిడ్డికి ముద్దు పెడితే, ఎట్టా తట్టుకుంటాడమ్మా, అయినా ఆ ఆడదానికి నలుగురి ముందూ ముద్దు పెట్టేందుకు సిగ్గూ సెరమూ ఉండఖ్ఖర్లే…” అంటా యాష్టకు బొయ్యింది మా పెద్దమ్మ.

“అవును సాయిత్రీ, ఈ నా బట్ట నాముందర గుడ్డలిప్పేదానికే సిగ్గుపడ్నాడే, ఇంగ ఆ నా సవితి ముద్దు పెట్టేకొందికి కండ్లు తేలేసి జొరం తెచ్చుకోకుండా ఇంగేం జేస్తాడూ అని! సూసేదానికే మొగపిల్లోడు, దేనికీ? వొగలేని పిల్లోడు! సాయింత్రానికి తగ్గిపోతిందిలే!” అని జెప్పి సక్కా పోయింది మా అత్త.

(మళ్ళీ కలుద్దాం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here