నా బాల్యం కతలు-6

1
10

[box type=’note’ fontsize=’16’] ‘నా బాల్యం కతలు’ అంటూ తన చిన్ననాటి ముచ్చట్లను అందిస్తున్నారు జిల్లేళ్ళ బాలాజీ. [/box]

6. స్టీలు గిన్నె దెబ్బ – తల పగిలిందబ్బ

[dropcap]ఎ[/dropcap]నిమిదో తరగతిలో నేనూ, మా సిన్నక్కా ఒకే తరగతిలోకి వొచ్చినాం.

మా సిన్నక్కకూ నాకూ మద్దెన ఒక సమ్మచ్చరమే తేడా. నిజ్జింగా ఇప్పుడు మా సిన్నక్క తొమ్మిదిలో ఉండాల. ఎందుకో మా నాయిన మా సిన్నక్కను కూడా నా క్లాసులోనే ఏసే.

ఎప్పుడూ మా సిన్నక్క నామింద అధికారం సెలాయించాలని జూసేది. కానీ నేను ఇనేటోణ్ణి కాను.

నేను మా సిన్నక్కను ఏనాడూ ‘అక్కా’ అని పిలిసింది లేదు. మా పెద్దక్కను మాత్రమే అందరమూ అక్కా అని పిలిసేటోళ్లం. సిన్నక్కను నేను అక్కా అని కాక పేరు పెట్టే పిలిసేటోణ్ణి. దాంతో దానికి ఒళ్లు మండిపోయేది. అలా పిలవొద్దని చానాసార్లు నాతో జెప్పింది. మనమింటే గదా! ఇనం కాక ఇనం. దాంతో మా ఇద్దరికీ ఎప్పుడూ జగడమే. బాగా తిట్టుకునేటోళ్లం. కొట్టుకునేటోళ్లం. ఏమైనాసరే నాతో అక్కా అని పిలిపించుకోవాలని దాని పంతం. కానీ నా దగ్గర ఆ పప్పులేం ఉడికేవు కావు.

ఒకసారి మా పిన్ని ఏదో పనిమీంద ఊరికి పాయె. వారం దినాలు వరకూ రాలే. అప్పుడు ఇంటిపనీ, వొంటపనీ అన్నీ మా సిన్నక్కే సేసేది. ఆ సమయంలో దానికి ఎక్కడలేని ఉశారూ వొచ్చేసేది. ఎందుకంటే మా మింద (ముక్కెంగా నా మింద) దానికి పెత్తనం సెలాయించేదానికి అదే సరైన సమయం కనక. అది జెప్పినట్టు ఇనాల. ఇనకపోతే కూడు బెట్టదు.

ఒక రోజు మా సిన్నక్క… మా చెల్లెలికీ, తమ్మునికీ తినేదానికి ఏదో అప్పాలు ఇచ్చింది. నాకు మాత్రం ఇయ్యలేదు.

“నలినీ నలినీ నాకూ ఇయ్యి…” అని అడిగితిని.

“నన్ను అక్కా అని పిలువు ఇస్తా…” అనింది జంబంగా.

“ఏం అక్కా అనే పిలవాల్నా. పేరు పెట్టి పిలిస్తే తప్పేముందీ?..” అంటిని.

“అవును తప్పే! నన్ను పేరు పెట్టి కాక అక్కా అనే పిలవాల.” అనింది.

“అయితే నువ్వూ నన్ను అన్నా అని పిలువ్, అప్పుడు నేను నిన్ను అక్కా అని పిలస్తా..” అన్నాను మొండిగా.

“నేను నీ కన్నా పెద్దదాన్ని, నువ్వు కాకన్నా చిన్నోడివి. కాబట్టి నువ్వే నన్ను అక్కా అని పిలవాల.”

“నేనేం చిన్నోణ్ణి కాను. పెద్దోణ్ణే. కావాలంటే చూడూ నీకంటే పెద్దోడిగా ఉండాను.” అన్నాను నిటారుగా నిలబడి.

“అయిట్‌లో కాదొరే. వొయిసులో…” అనింది ఎగతాలిగా.

“వొయసులో నువ్వు పెద్దయితే, నువ్వు నాకన్నా పై క్లాసులో కదా ఉండాల. మరైతే నువ్వూ నేనూ ఒకే క్లాసులో ఎందుకుండాము?” అని లాజిక్కు లాగితిని.

దాంతో దానికి యాడలేని కోపమూ పొడుసుకొచ్చె.

“పోరా, కోతి నాయాలా. ఎదవ లాజిక్కూ నువ్వూనూ. నేను నీకు తినేదానికి ఏమీ ఇయ్యను. ఎవురితో చెప్పుకుంటావో చెప్పుకో పో.” అని అప్పాలు మళ్లా డబ్బాలో పెట్టి, మూత గెట్టిగా మూసి నాకు అందకుండా అటక పైన పెట్టేసింది.

నేను దాన్ని లెక్క సేయకుండా “ఏం నువ్వు ఇస్తేనేనా. నేను తీసుకోని తినలేనా ఏమి?” అని పైనుండే డబ్బాను తీసి మూతను తియ్యబోయినాను.

అది ఉరుక్కుంటా వచ్చి నా చేతిలోని డబ్బాను లాక్కోబోయింది. నేను డబ్బాను వొదిలిపెట్టకుండా గెట్టిగా పట్టుకున్నాను.

ఇద్దరమూ పెనుగులాణ్ణాం. నేను గెట్టిగా ఉడుం పట్టు పట్టినాను. అది దాని చేతికి చిక్కలేదు. డబ్బాను వొదిలి పెట్టేసింది.

నేను దాని మూతను తీసేదానికి ప్రెయత్నం చేసినాను. మూత ఎట్టో వచ్చేసింది. లోపల్నుండి ఒక అప్పం తీసుకున్నాను.

దాంతో మా సిన్నక్క కోపంతో ఉడికిపోయి, అక్కడున్న స్టీలుగిన్నెను తీసుకుని నా తలమీంద గెట్టిగా ఒక్కటిచ్చింది.

ఆ దెబ్బతో నా తలకు బొక్క పడింది. స్టీలుగిన్నె అంచు కత్తిలాగా పదునుగా ఉండటంతో నా తల అంగుళం చీలింది.

అంతే! నా తల్లో నుండి బొళబొళమని రత్తం కారటం మొదలైంది. మూతి అంతా రత్తం చిందింది.

నా ఒంటిమీది రత్తాన్ని సూసి నాకేదో అయ్యిందన్న బయ్యింతో… మా సిన్నక్క ఏడుపెత్తుకునింది. అది ఓహోమని ఏడస్తా ఉంటే తమ్ముడూ, చెల్లెలూ కూడా ఏడు పెత్తుకొనిరి.

మా ఏడుపులు ఇని పక్కింటామె మాకేమో అయ్యిందని పరుగెత్తుకొచ్చె.

నా ముఖమంతా రత్తం చూసి ఆమె బిత్తరకపోయింది. ఏమైందని అడిగితే గెట్టిగా ఏడస్తాంది కానీ ఏం జరిగిందో మాత్రం చెప్పలేదు మా సిన్నక్క,

విషయాన్ని గ్రహించి గబగబా ఒక గుడ్డముక్కను కాల్చి, దాని పొడిని తలమీంద బొక్కకు అడ్డంగా పెట్టి కొంచేపు అదిమి పట్టింది.

దాంతో కొంచేపటికి రత్తం ఆగింది!

మగ్గులో నీళ్లు తెమ్మని చెప్పింది మా సిన్నక్కను. ఆ నీళ్లల్లో తువ్వాలు గుడ్డను ముంచి ఆ తడిగుడ్డతో నా ముఖమంతా సుబ్రంగా తుడిసింది.

“ఎంత పని జేస్తివి మే నువ్వు! ఎంత రచ్చలేసుకున్నా ఇట్టేనా మే కొట్టేది. తలకు బొక్కపెట్టేసినావు కదే. ఇప్పటికి రత్తం ఆగింది. మీ నాయినకు గానీ ఈ విషయం తెల్సిందంటే అప్పుడు నీ కత ఉండాది.” అని కోప్పడింది మా పక్కింటామె.

“అక్కా అక్కా మా నాయినకు ఈ విషయం సెప్పొద్దక్కా. సెప్పితే నన్ను సంపేత్తాడక్కా.” అని ఏడస్తానే పక్కింటామెను బతిమిలాడింది మా సిన్నక్క “నేను జెప్పను లేమే. కానీ మీ నాయినకు తెలవకుండానా పోతింది.” అని ఆ మాట ఈమాటా మాట్లాడి ఎచ్చరికలు చేసి ఎల్లిపోయింది.

“వారే బాలా నువ్వూ నాయినకు చెప్పొద్దురా… చెప్పితే నన్ను ఎమికలు ఇరిగేటట్టు దంచేస్తాడురా…” అని నన్నూ బతిమిలాడి రొండు అప్పాలు నా చేతిలో పెట్టింది.

అట్టాగేనని దాన్ని తింటా కూసింటిని. తమ్ముణ్ణి, చెల్లెల్నికూడా చెప్పొద్దంది. ఆ సాయంత్రం మా నాయిన ఆపీసు నుండి ఇంటికొచ్చె. మేము ఏమీ జరగనట్టు ఉండిపోతిమి.

ఆ మరునాడు… రోజూ లాగానే ఒంటికి నీళ్లు బోసుకుని పెళ్లో నుండి వొస్తిని.

నాకు రోజూ… మా నాయినే కదా తల దువ్వేది. అందుకని చేతిలో దువ్వెన పట్టుకోని తయారుగా ఉండాడు.

గుడ్డలేసుకున్నాక మా నాయిన నన్ను దగ్గరికి పిలిచె.

దగ్గరికి పోతి. తల్లో దువ్వెన పెట్టి పాపిటి తీసి…

అంతే! అప్పిటి దాకా బొక్కకు అడ్డంగా ఉన్న కాల్చిన గుడ్డ పక్కకు జారె.

అంతే! మళ్లా బొటబొటమని రత్తం పెరుక్కునే. రత్తాన్ని జూడగానే మా నాయిన బిత్తరపోతా…. “ఏందిరా, ఏమైంది?” అని అడిగినాడు కంగారుపడతా. మా నాయిన బిత్తరను జూసి మా అక్క తలుపెనక దాంకునే.

ఇంతలో మా పక్కింటామె వొచ్చి విషయమంతా జెప్పె. మా నాయిన ఒక గుడ్డను తీసుకుని రక్తం కారకుండా అదిమిపట్నాడు. ఈలోగా మా పక్కింటామె మళ్లా ఇంకో గుడ్డను కాల్చి ఆ నుసిని తీసకొచ్చి బొక్కకు అడ్డం పెట్టె.

“అన్నా, ఇది అయ్యే పని కాదు కానీ, ఏదో ఒక డాక్టరు దగ్గరకు తీసుకు పో అన్నా. ఇప్పిటికే చానా రత్తం పోయింది. బిడ్డ సోలిపోయి ఉండాడు.” అని ఎచ్చరించింది.

“ఇంత తెల్లార్తో ఏ డాక్టరుంటారబ్బా?” అని ఆలోసించి గబగబ ఎలబారి నన్ను ఎంకటేశ్వరా డాక్టరు దగ్గరికి తీసకపాయె. ఆయన నా తలను సూసి, గాయాన్ని శుభ్రం సేసి కుట్లు ఏసె. అప్పిటికి గానీ నాకు రక్తం తగ్గలేదు.

ఇంటికి తిరిగొస్తిమి. మా సిన్నక్కను నానా తిట్లు తిడతా ఉండాడు మా నాయిన. దాని కోసం ఇల్లంతా ఎతికితే తలుపు ఎనకాల దాంకోని ఎక్కిళ్లు పెట్టి ఏడస్తా ఉండాది.

దాని జుట్టు పట్టుకుని వంగబెట్టి నాలుగు దంచినాడు. అది మరింత గెట్టిగా ఏడు పెత్తుకునింది. ఆ ఏడుపు విని మళ్లా మా పక్కింటామె పరుగు పరుగున వొచ్చింది.

“అన్నా, వొదిలి పెట్టన్నా, అది కూడా తెలియకుండానే చేసింది. కొట్టొదన్నా…” అని అడ్డంపడి దాన్ని పక్కకు లాగింది. ఆ రోజంతా మా నాయిన సిన్నక్కను నానా తిట్లు తిడతానే ఉండాడు.

ఆ దెబ్బతో మా సిన్నక్క మళ్లా ఎప్పుడూ తనను ‘అక్కా’ అని పిలవమని నన్ను అడగలే.

ఇప్పటికీ నేను మా సిన్నక్కను పేరు పెట్టే పిలస్తా ఉండా.

ఎందుకంటే మా సిన్నక్కకన్నా నేనే కదా అయి‍ట్‍లో పెద్దోణ్ణి. ఏమంటారు?

(మళ్ళీ కలుద్దాం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here