నా బాల్యం కతలు-8

2
10

[box type=’note’ fontsize=’16’] ‘నా బాల్యం కతలు’ అంటూ తన చిన్ననాటి ముచ్చట్లను అందిస్తున్నారు జిల్లేళ్ళ బాలాజీ. [/box]

8. మొక్కుతో తిప్పలు – అయ్యోరు ముందు గొప్పలు

[dropcap]సో[/dropcap]లింగపురంలో సెల్లించిన నా మొక్కు పలితంగా ఇప్పుడు నా సేవలకు బంగారుప్పోగులు ఏలాడతా ఉండాయి.

మొగోడినైన నా సెవల్లో ఆడపిల్లలకుండే మాదిరిగా రింగులు ఏలాడతా ఉంటే నాకు అదో మాదిరిగా ఉండాది.

రెండోరోజు మా పిన్ని ముందుకుపోయి నిలబడి… “పినా, సెవలకు కుట్టిన పోగుల్ని తీసెయ్యి పినా…” అంటిని.

“ఇప్పుడేడ తీసేది. అది సెవల్లో కనీసం నెల దినాలైనా ఉండాల. ఒక మంచిరోజు జూసుకుని ఆచ్చారి దగ్గరికి పొయ్ తీయించుకొస్తాం లే.” అనింది మా పిన్ని నిమ్మళంగా.

నాకు గుండెకాయ జారిపోయినంత పనైంది.

నున్నటి గుండుతో, సెవల్లో పోగులతో నేనెట్టా ఇస్కూలుకు పోయేది రా సామీ? ఆడపిలకాయల ముందర నేనెట్టా తల ఎత్తుకోని తిరగేదిరా దేవుడో? నాకెందుకు ఇంత పెద్ద సిచ్చ ఏసినావు నరసిమ్మ సామీ… అని మనసులో గింజుకుంటిని.

సెవలకు పోగులు పెట్టుకుని ఇస్కూలుకు పోతే ఆడపిలకాయిలు నన్ను సూసి ఎగతాలి సెయ్యరా? మగపిలకాయిలు నన్ను సూసి పకపకామంటా నవ్వరా? అట్టా అందరూ నన్ను సూసి నవ్వతా ఉంటే నా మానం కొండెక్కదా?

“అయితే, నేను ఇస్కూలుకు పోను పో…” అంటిని మా పిన్నిని బెదిరిస్తా.

“ఈమాట మీ నాయిన దగ్గరికి పొయ్ సెప్పు…” అనింది మా పిన్ని.

మా నాయినకు చెపితే ఇంకేమన్నా ఉండాదా, తోలు తీస్తాడు. దీన్నుండి ఎట్టా తప్పించుకోవాల్రా దేవుడా? అని ఆలోసనల్లో పడితిని. ఆలోసించి ఆలోసించి ఒగ నిర్నయానికి వొస్తిని.

గబగబా పెళ్లోకి (పెరట్లోకి) పరిగెత్తి దండెంమీద ఏలాడతా ఉన్న ఒక సవకాన్ని(తువ్వాలును) తీసుకుని సెవులు కనబడకుండా తల సుట్టూ సుట్టుకున్నాను. సుట్టి… కొసను ఒక తావన గెట్టిగా ముడేసినాను. ఇంట్లోపలికి పొయ్యి అద్దం తీసుకొని ఒకసారి అటు ఇటు సూసుకొని కరట్టుగా ఉందనిపించినాక సంచీ తీసుకొని ఇస్కూలుకు ఎలబారితిని.

ఇంతలో మా అత్త నాకెదురైంది. నన్ను ఎగాదిగా జూసి…. “ఏందిరా నా బట్టా, ఈ ఏసకం?” అనింది.

“ఏందీ లేదు, బూందీ లేదు. నువ్వు పక్కకు పో…” అని మా అత్తను తోసుకోని నేను ఈదిలోకి పరిగెత్తితిని.

“ఓర్నీ… ఈ అదురు నాబట్ట ఏందో ఏసకాలు ఏసేదేనికి మళ్లినాడ్రో నాయినో…” అని ఇంకేదో అంటా ఉన్నా దాన్ని పట్టించుకోకండా ఇస్కూలుకాడికి పోతిని.

నన్నూ, నా తలమీంద కట్టునూ పిలకాయలందరూ ఇసిత్రంగా సూడ్డం మొదలు పెట్టినారు. నేను ఆటినేమీ పట్టించుకోలేదు. నా పాటికి నేను నడవసాగినాను.

“బాలా, ఏమైందిరా నీకు తలకెందుకు గుడ్డ సుట్టుకోనుండావు?” అని అడగనే అడిగింది నా క్లాస్‌మేట్ కాంచన.

‘ఈళ్ల కోసమే కదా ఈ అవస్థ అంతా’ అనుకుని, మూతి నల్లంగా పెట్టి, “తలకు దెబ్బ తగిలింది మే…” అంటిని.

“ఏదీ… యాడా… నన్ను సూడనీ..” అంటా నా తలమీంద సెయ్యేసి సూసేదానికి మళ్లింది.

“తలమీంద దెబ్బను ఏంది మే సూసేది నువ్వు? అదేమన్నా సినిమానా?” అని ఆడ్డించి తప్పించుకోని దౌడు తీస్తిని.

నా క్లాసులోకి స్టయిలుగా అడుగు పెడితిని. మా క్లాసులోని పిలకాయలందురూ నన్నుజూసి ఏందో సెవల్లో గుసగుసలు మాట్లాడతా ఉండారు. శివుని తలమింద పామును సూసినట్టుగా అందురూ నాకల్లా ఇంతగా సూస్తా ఉండారు. కానీ నేను మాత్రం వాళ్లను సూసీ సూడనట్టు నటించసాగినాను.

ఇంతలో లెక్కలయ్యోరు ఎండీఎన్ సార్ వొచ్చినాడు మా క్లాసులోకి. ఆయన క్లాసులోకి అడుగుపెట్టేకొందికే అందరి సేతల్లోనూ ఒక చిన్న నోటుపుస్తకం పట్టుకొని నిలబడుండాల. ఆయన క్లాసులో వరసల్లో తిరగతా పది నోటిలెక్కలు జెప్పతాడు. దానికి టకటకా ఆన్సర్లు రాసేయాల. సివర్లో ఒకరికొకరు పుస్తకాలు మార్చుకున్నాక, అయ్యోరు పదిలెక్కలకూ ఆన్సర్లు జెప్పతాడు. మేము వాటికి మార్కులెయ్యాల. పదికి పదీ వొచ్చినోళ్లను ఏమనకుండా ఆపాట్నే కూసోమని జెప్పేస్తాడు. తొమ్మిదీ, ఎనిమిదీ వొచ్చినోళ్లకు వార్నింగులిచ్చి కూసోని బెట్టేస్తాడు. ఇంక అంతకన్నా తక్కువొచ్చినోళ్లకు పక్కనుండే వోళ్ల చేత మొట్టిక్కాయలు ఏపిస్తాడు. అదీ ఎట్టా ఉంటిందంటే… మొట్టిక్కాయ ఏస్తే దిమ్మ తిరగాల! అట్టా ఉంటుంది మొట్టిక్కాయలు. సిన్నగా ఏస్తే ఇంకొకడి సేత ఏపిస్తాడు. వాడెట్టా ఏస్తాడో, ఏమో? అందుకని పక్కనుండే వోడి సేతిలో మొట్టిక్కాయలు ఏయించుకుంటేనే మంచిది మనకు. కానీ వాడుకూడా మనమింద కసి తీర్చుకునేందుకే సూస్తాడు. ఎందుకంటే ఎప్పుడో వాడి తలమింద మనం కొంచం గెట్టిగా మొట్టిక్కాయలు ఏసుంటాం. దాన్ని గుర్తుపెట్టుకుని ఇప్పుడు మన తలమింద బొప్పిలు కట్టేంతగా మొట్టిక్కాయలేసి కసి తీర్చుకుంటాడు.

ఆ దినం నేను కరెట్టుగా రాసింది రొండే రొండు. అది కూడా పక్కనోడి దాంట్లో సూసి కాపీ కొట్టిందే!

అంటే! ఈ దినం నా తల దిమ్మ తిరగబోతుందన్నమాట. ఏం జెయ్యాల? ఎట్టా తప్పించుకోవాల?

ఒకసారి నా తలను తడిమి సూసుకున్నాను. తలకు సుట్టుకున్న సవకం సేతికి తగిలింది.

ఆ… ఒక్కసారిగా నాకొక అవిడియా తట్టింది. మణుసులోనే కుశాలైపోయినాను.

మొట్టిక్కాయల వాయింపుడు మొదలయింది.

మొట్టిక్కాయలు తిన్నోళ్లు… కండ్లల్లో నీళ్లు పెట్టుకోని ఎక్కిళ్లు పెట్టి ఏడస్తా ఉండారు. ఆడపిలకాయలు నొప్పికి తాళలేక తల పట్టుకోని అయ్యోరిని మణుసులోనే తిట్టుకుంటా శాపాలు పెడతా ఉండారు.

నా వొంతు రానే వచ్చింది. నా పక్కనుండేవోడు నాకు మొట్టిక్కాయ ఏసేందుకు సెయ్యి పైకెత్తినాడు. అంతే!…

“అయ్యయ్యో… నొప్పీ నొప్పీ…” అంటా గెట్టిగెట్టిగా అరుపులు ఎత్తుకుంటిని.

నా పక్కనుండేవోడు బిత్తరకపోయి సెయ్యి ఎనక్కు తీసేసికున్నాడు.

“ఏందిరా బాలా… కొట్టకనే డ్రామాలాడతా ఉండావు? ఏంది కత?” అన్నాడు మా లెక్కలయ్యోరు.

“లేదు సార్… తలమింద పెద్ద దెబ్బ తగిలింది సార్. అది ఆరేంతవరకూ సిన్న దెబ్బకూడా తగలకుండా సూసుకోమన్నాడు సార్, డాకట్రు.” అన్నాను ఇనయంగా.

“అసలు దెబ్బ ఎట్టా తగిలిందిరా నీకు? ఏదీ సూద్దాం రా?” అన్నాడు లెక్కలయ్యోరు.

“వొద్దు సార్. కట్టు ఇప్పితే రక్తం కారిపోతాది సార్.” అన్నాను తెలివిగా.

“కట్టిప్పితే రక్తం కారిపోతుందా? ఇదేం వింతరా… ఎక్కడా విన్లేదే?” అన్నాడు అనుమానంగానే.

“మొక్కు తీర్చుకుందామని మొన్న మా ఇంట్లో వాళ్లంతా సోలింగపురానికి పోతే, ఆడ తగిలింది సార్ దెబ్బ తలకు! మా నాయిన డాట్టర్ కాడికి తీసకపోతే సూదేసి, నన్ను బెడ్డుమింద పండుకోబెట్టినాడు సార్. కొంచేపటికంతా నాకు మైకం కమ్మేసింది సార్. ఆనక కండ్లు తెరిసి సూస్తే, తలకు పెద్ద బ్యాండేజీ కట్టు ఏసుండాది సార్. ఆయన మా నాయినతో… పెద్ద దెబ్బే. అది ఆరేదానికి చానా టైం పడతాది. కట్టు ఇప్పకండి. కాదు కూడదని ఇప్పితే మొత్తం రత్తం కారిపోతుంది. ఆ పైన మీ ఇష్టం. పిలగోడు నిద్దట్లో సెయ్యి గియ్యి ఏస్తాడేమో, సెయ్యి తగలకుండా జాగర్తగా సూసుకోండి.” అన్నాడు సార్.

“అప్పిటికీ నేను… పొరబాట్న ఇస్కూల్లో ఎవురైనా నా సావాసగాళ్ల సెయ్యి తగిలితే ఎట్టసార్ అని అడిగితిని… అందుకు డాకట్రు కావాలంటే బ్యాండేజీ కట్టు సుట్టూ నువ్వు ఇంకో తువ్వాలును సుట్టుకోని పోరా…” అన్నాడు సార్.

“ఓర్నీ… ఈ డాక్టరు ఎవరో కొత్తగా ఉండాడే… ఎవురా నీకు వైద్యం చేసిన డాక్టరూ?” లెక్కలయ్యోరు వొదిలి పెట్టకుండా నన్ను అడిగినాడు.

“ఆయన్ది ఈ ఊరు కాదు సార్, చానా దూరం…తమిల్‌నాడు.” అన్నాను అయ్యోరుకు సిక్కకుండా.

“ఏం దెబ్బో… ఏం వైద్యమో… పో…” అన్నాడు ఇసుగ్గా.

అట్టా నేను ఆ రోజు మొట్టిక్కాయలు తినకుండా తప్పించుకుంటిని. దాన్నిండి నన్ను కాపాడింది ఆ సోలింగపురం నరసిమ్మ సామే. నేను సెవులు కుట్టుకోకపోయుంటే ఈ దినం నా తలకాయ పుచ్చ రేగిపోయి ఉండేది.

నాలుగు రోజులు గడిసింది.

సెప్పిన అబద్దమే మళ్లామర్లో సెప్పలేక ఇసుగొచ్చి, వారందినాలు అయినాంక నేను ఇస్కూలుకు పోనంటే పోనని మొండికేస్తే నన్ను తీసకెళ్లి ఆచ్చారి ముందు కూసోబెట్టి సెవల్లో ఉన్న పోగుల్ని కత్తిరింపచేయించింది మా పిన్ని.

అమ్మయ్య మా ఇస్కూలు ఆడపిలకాయిలతో ఇంక ఏ తంటా లేదు అనుకుంటిని.

మర్నాడు సవకం సుట్టుకోకుండా ఇస్కూలుకొచ్చిన నన్ను మునుపటికన్నా దీచ్చగా సూడ్డం మొదలు పెట్టినారు పిలకాయలు. ఎందుకంటారా? నిజంగా తలమీంద దెబ్బ తగిలిందా లేదా అని తెలుసుకునేటందుకే?

కానీ…. లేని దెబ్బకోసం ఎతికితే ఏం కనిపిస్తాది వాళ్లకు, తలమిందుండే నా ఎంటికలు తప్ప!

(మళ్ళీ కలుద్దాం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here