నా గురించి నేను ఆలోచించుకున్నప్పుడు

1
10

[మాయా ఏంజిలో రచించిన ‘When I think about myself’ అనే కవితని అనువదించి సంచిక పాఠకులకు అందిస్తున్నారు కవయిత్రి హిమజ గారు.]

(ఆఫ్రికన్ అమెరికన్లను, నల్లజాతి ప్రజలను ఆనాటి సమాజం అణగదొక్కిన తీరు, వారి ఘర్షణ, జీవన ప్రమాణాలను చూపించే కవిత!!)

~

[dropcap]నా[/dropcap] గురించి నేను ఆలోచించుకున్నప్పుడు
చచ్చేంత నవ్వొస్తుంది నాకు
నా జీవితమొక పెద్ద నవ్వులాటయి పోయింది
ఒక నాట్యం నడిచినట్టో
ఒక పాట మాట్లాడినట్టో
నా గురించి నేనాలోచించుకున్నప్పుడు
ఉక్కిరిబిక్కిరి అయ్యేంత గట్టిగా
నవ్వొస్తుంటుంది నాకు –

ఈ ప్రపంచం లోని మనుషుల్తో
అరవై యేళ్ళ జీవితం నాది
నే పనిచేసే చోట ఓ చిన్నారి
నన్ను పిల్లా అని పిలుస్తుంది
పని చేస్తున్నాను కదా
అలాగే అమ్మగారు అని జవాబిస్తాను
అలాగని
ఎవరికీ వంగి లొంగి ఉండను
దేనికి వణికే బేలనూ కాను
అవన్నీ తలచుకుంటేనే
కడుపు నొప్పి పెట్టేంతగా నవ్వొస్తుంది నాకు

నా చుట్టూ ఉన్న జనాలు చెప్పే
కాకమ్మ కథలన్నీ
పచ్చి అబద్ధాలుగా వినబడి
చక్కిలిగిలి పెట్టి, చచ్చేంతగా నవ్విస్తాయి నన్ను

వాళ్ళు పండ్లు ఫలాలని పండిస్తారేమో
తినేవి మాత్రం తొక్కలేనని తెలుసు నాకు
నా చుట్టూ ఉన్న ఈ జనాల్ని తలచుకున్నప్పుడల్లా
నవ్వీ నవ్వీ ఏడుపొచ్చేంతగా నవ్వుతాన్నేను!!

~

మూలం: మాయా ఏంజిలో

అనువాదం: హిమజ


మాయా ఏంజిలో ఒక గాయనిగా, నర్తకిగా, నటిగా, కంపోజర్‌గా మాయా ఏంజిలోది విస్తృతమైన కెరీర్. హాలీవుడ్‍లో నల్లజాతికి చెందిన మొట్టమొదటి మహిళా దర్శకురాలైనప్పటికీ, మాయా రచయిత్రిగా, కవయిత్రిగా, వ్యాసకర్తగా, ఎడిటర్‌గా, నాటకకర్తగా ప్రఖ్యాతి గాంచారు.

పౌరహక్కుల ఉద్యమ కార్యకర్తగా జూనియర్ మార్టిన్ లూథర్ కింగ్‌తో కలిసి పని చేసారు.

అమెరికన్స్ అమితంగా అభిమానించే రచయిత్రిగా రూపుదిద్దుకోక ముందు మాయా వంటమనిషిగా, స్ట్రీట్ కార్ కండక్టర్‌గా, వెయిట్రెస్‌గా, ఉపాధ్యాయినిగా అనేకానేక పనులు చేసారని తెలుస్తుంది.

జులై మొదటివారం నుంచి మాయా ఏంజిలో జీవిత విశేషాలు కొంచెం కొంచెంగా చెప్పుకుందాం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here