నా జవాబు నో

0
8

[dropcap]అ[/dropcap]టుగా వెళుతున్న అప్పారావ్, ఓ సారి పక్కకు తిరిగి చూసి, “ఆ.. ఆ.. ఆపు. ఈ బడ్డీ కొట్టే” అనడంతో డ్రైవరు కారుని స్లో చేసి, “సరిగ్గా చూడండి సార్, ఇలా అనే ఇప్పటికీ మూడు బడ్డీ కొట్టుల దగ్గర కారు ఆపించారు. అసలే ఇది అమ్మగారి కారు. మీ కారు సర్వీసింగ్‌కి ఇచ్చారని అమ్మగారి కార్ తీయమన్నారు. అసలే అమ్మగారిని గుడికి తీసుకు వెళ్ళే సమయం అవుతోంది. లేటయితే మీతో పాటు నన్ను కూడా తిడతారండీ” చెప్పాడు భయంతో వణికిపోతూ.

“ఏం కాదులే, నేను నచ్చచెప్తాలే” అని కిందకి దిగాడు. దిగి నెమ్మదిగా ఆ బడ్డీ కొట్టు దగ్గరకి వెళ్ళి, “రెండు ఫిల్టర్ సిగరెట్లు ఇవ్వు” అన్నాడు జేబులోంచి డబ్బులు తీసి ఇస్తూ. తర్వాత ఓ సిగరెట్టుని బడ్డీకి ఇవతల పక్క వేలాడుతున్న తాడుతో అంటించుకుని బలంగా పొగ పీల్చి ముక్కులోంచి వదిలాడు. తర్వాత ఆ బడ్డీ కొట్టు నడుపుతున్నతని వంక సూటిగా చూస్తూ “చూడు సుబ్బారావ్, నిన్ను ఇలా చూస్తుంటే నా మనసు తెగిన గాలిపటంలా తెగ బాధ పడిపోతోంది. ఆ మధ్య ఎలా ఉండేవాడివి, తెల్ల చొక్కా వేసుకుని, కడుపులో చల్ల కదలకుండా, పార్టీ ఆఫీసుల్లో కాలు మీద కాలేసుకు కూర్చునేవాడివి. ఇప్పుడు చూడు, ఎండకి ఎండి వానకి తడిచిన తడిక బద్దలా తయారయ్యావ్. నాకైతే నువ్ తీసుకున్న ఈ నిర్ణయం ముమ్మాటికీ సరైనది కాదనిపిస్తోంది. ఇదే మాట ఇది వరకు కొందరు చెబితే నువ్ వినలేదనీ, నీ మంచి కోరేవాడిగా మరో సారి నిన్ను ఆలోచించమని చెప్పడానికి గాను, నేనే స్వయంగా నిన్ను వెతుక్కుంటూ వచ్చాను మరి” చెప్పాడు మరో సారి సిగరెట్ తాగుతూ.

“అప్పుడు ఎలా ఉన్నా, ఇప్పుడు ఉన్న మనశ్శాంతి మాత్రం అప్పుడు లేదు. ఎప్పుడూ ఏదో గోల, అలజడి, జీవితం ఎప్పుడూ సుడిగుండంలో పడవలా గొడవగా ఉండేది. ఇపుడు అలా కాదు. హాయిగా ప్రశాంతంగా సాగుతోంది. దాన్నిపుడు మళ్ళీ వాగులో పడేయలేను. ఇక నువ్వు బయల్దేరితే బావుంటుంది అప్పారావ్” చెప్పాడు తమలపాకులు తీసి నీటిలో కడుగుతూ.

 “అయితే, ఇక రాజకీయ సభలకి జనాల్ని తరలించే పని పూర్తిగా మానేసినట్టేనంటావ్” అడిగాడు సిగరెట్ మరో దమ్ము లాగి, సుబ్బారావ్ వంక సూటిగా చూస్తూ.

“ఔను, నా జవాబు అదే” అన్నాడు తమలపాకు మీద సున్నం రాస్తూ.

“హఠాత్తుగా ఏమైంది నీకు. ఇది వరకు అధికార పక్షం అడిగినా, ప్రతిపక్ష పార్టీ అడిగినా వెంటనే వేల మందిని పోగేసి, లారీలకెక్కించి, కొన్నిసారులు కుక్కించి మరీ గొర్రెలని తోలినట్టు రాజకీయ సభలకు జనాల్ని తరలించి డబ్బుకి డబ్బు, మందుకి మందు కొట్టేసేవాడివి. నువ్ వెళితే,అధికార పార్టీ మంత్రి అయినా, ప్రతిపక్ష పార్టీ ఎం.ఎల్.ఏ అయినా, ఎంత బిజీగా ఉన్నా, నువ్వెళ్ళిన వెంటనే నిన్ను కలిసేవారు. అదంతా వదిలి, నువ్వు ఇలా” అంటూ ఆ బడ్డీ కొట్టు వంక చిరాగ్గా చూసి మరో దమ్ము లాగాడు.

“అదంతా మనతో అవసరం ఉన్నంత వరకే. నీకు తెలుసుగా, కొందరు రాజకీయ నాయకులు పదవుల కోసం ఏమైనా చేస్తారు అప్పారావ్. వాళ్ళు నా లాంటి వాళ్ళని మెట్లగా మార్చుకుని అధికార కుర్చీ ఎక్కాలని ఎత్తుగడలు. వాళ్ళూ మనుషులే అని మనం అనుకుంటాం కానీ, వారు వేరే. వాళ్ళ కంటే యానిమల్సు నయం” అన్నాడు అసహనంగా తమలపాకు మీద వక్కలు వేస్తూ.

“అయినా నిన్ను అంతగా బాధ పెట్టిన విషయం ఏంటి. ఇంత హఠాత్తుగా, అదీ సరిగ్గా ఇలా ఎన్నికల ముందు ఈ పని వదిలేసావ్. ఇపుడు మన చుట్టు పక్కల ఎక్కడ ఏ సభ జరిగినా, ఉప్పులేని పప్పులా చప్పగా సాగుతోంది. జనం లేని సభలు అని మీడియా కోడై కూస్తోంది. బిర్యానీ పొట్లం, బీర్ బాటిల్ ఇస్తాం రండి అన్నా సరే, మన ఊరు నుండి పట్టుమని వందమంది రావడం లేదు. అంతా అయోమయంగా ఉంది” అని బుర్ర గోక్కుని, సిగరెట్ పై చూపుడు వేలితో తట్టడంతో, సిగరెట్ యాష్ కిందపడింది.

“మానేయడానికి కారణం అంటే, మొన్న వారం ఓ రాజకీయ పార్టీ రోడ్ షోలో కరెంట్ తీగలు తగిలి ఇద్దరు టపా కట్టారు. నిన్న వారం తొక్కిసలాటలో ఏడుగురు పోయారు. దాంతో వాళ్ళ బంధువులు నన్ను బంతాడబోయారు. కొందరు అడ్డుకోవడంతో, బతికి బట్టకట్టాను. కానీ వాళ్ళు తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టారు,ఆ తిట్లకే సగం చచ్చిపోయాను. పైగా వాళ్ళ ఉసురు నేను, నా కుటుంబం పోసుకోదలుచుకోలేదు. ఇలాగే ఇంకో కారణం కూడా ఉందిలే. అయినా నాయకుల తెలివి తెల్లారింది, రాజకీయ మీటింగ్ అంటే ఏ ఖాళీ స్థలమో చూసుకుని, మంచి పోలీసు బందోబస్తుతో చేసుకోవాలి కానీ, ఒకడు రోడ్డు మీద, మరొకడు ఇరుకు వీధుల్లో, ఇంకోడు సందుగొందుల్లోకి వచ్చి మైకు పట్టుకుని, మైకాసురుల్లా నోటికొచ్చింది పేలడం, జనాల్ని ఇబ్బంది పెట్టడం. అందుకే ఆ పనికిమాలిన పని వదిలేయాల్సి వచ్చింది” చెప్పాడు తమలపాకు మీద కొంచెం మీటా రాస్తూ

“అయినా అంతమందిలో కొందరు పోతే పోతారు. ఇది వరకు జరగలేదా, రేపు జరగబోదా. ప్రజల్లో మార్పు రావాలి కానీ నువ్వూ నేను మారితే ప్రయోజనం ఏం లేదు. అయినా ముక్కు,మొహం తెలియని వాళ్ళు పోతే నీకేంటట అంత నొప్పి” అడిగాడు అప్పారావ్ సిగరెట్‌ని చివరి దమ్ము బలంగా లాగుతూ.

“ఎందుకా, ఆ పోయిన వాళ్ళలో మా బావమరిది కూడా ఉన్నాడు. ఇదే ముఖ్య కారణం. ఇదంతా నా వల్లే జరిగిందని మా ఆవిడ చీపురుతో నా వీపు చీరేసింది.నేను కోలుకోవడానికి వారం పట్టింది. పైగా, నేను ఈ పని వదలకపోతే తన దారి తాను చూసుకుంటానని కరాకండిగా చెప్పేసింది. అసలు నాకు పెళ్లవడమే గొప్ప విషయం. ఏదో అది జరిగింది. ఇప్పుడు కానీ అది పోతే, నాకు పరువూ పోతుందీ, పెళ్లి కాదు. అయినా, నేను మానేస్తే మధ్యలో నీకు వచ్చిన బాధ ఏంటి” అడిగాడు సుబ్బారావ్ ఆ కిళ్ళీ చుట్టి నోట్లో పెట్టుకుంటూ

బుర్ర గోక్కుని, “ఏం లేదు ఈసారి రంపం పార్టీలో ఎం.ఎల్.ఏ. టిక్కెట్టు మా బావగారికి వచ్చేలా ఉంది. ఉన్నట్టుండి నీలాంటి వాడు మన చుట్టు పక్క గ్రామాల్లో లేడు. కనుక నువ్వు మంకీలా మంకు పట్టకుండా, మాతో కలిసి వచ్చి, జన సమీకరణలో నీ సహకారం ఈ ఒక్క సారికి అందిస్తే” అంటూ చేతిలోని సిగరెట్ కింద పడేసి, జేబులోంచి పర్సు తీశాడు.

అప్పటి వరకు నవులుతున్న కిళ్లీని థూ అంటూ పక్కన ఊసేసాడు సుబ్బారావ్.

అప్పారావ్ మారు మాట్లాడకుండా, చేతిలోని సిగరెట్‌ని బూటు కాలితో తొక్కి, కారెక్కి అక్కడినుండి వెళ్లిపోయాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here